అమ్మ చెప్పిన సత్యాలు
- Gadwala Somanna
- 3 days ago
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaCheppinaSathyalu, #అమ్మచెప్పినసత్యాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 66
Amma Cheppina Sathyalu - Somanna Gari Kavithalu Part 66 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 25/04/2025
అమ్మ చెప్పిన సత్యాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 66 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అమ్మ చెప్పిన సత్యాలు
----------------------------------------
ఈ లోకం పోకడ
ఆ వర్షం రాకడ
వింతగా ఉంటుంది
వినోదం పంచుతుంది
చిత్రమైన లోకము
పాఠాలు చెపుతుంది
గమనించుము అనిశము
అవగతం అవుతుంది
రంగు రంగుల లోకము
భ్రమింపజేస్తుందోయ్!
జాగ్రత్త అవసరము
లేక పతనమేనోయ్!
అత్యాశ ప్రమాదము
తగినంత ప్రమోదము
ఇది సొంతం కాదోయ్!
తదుపరి వీడాలోయ్!

జర జాగ్రత్త!
----------------------------------------
జాగ్రత్త! తలపులతో
మాట్లాడే మాటలతో
అవి గనుక గతి తప్పితే!
జీవితాలు అధోగతే!
నోరు జారితే ముప్పు
నిర్లక్ష్యం బహు తప్పు
చేయాలి నోటిని అదుపు
ఉండదు బ్రతుకున కుదుపు
మాటలతో యుద్ధాలు
కూలునోయ్! కుటుంబాలు
జగడాలకు కారణము
నాలుక కదా! సాధనము
అతి వాగుడు కడు కీడు
చేయు బ్రతుకు వల్లకాడు
అగ్గిపుల్ల ఈ నాలుక
మనం అదుపు చేయాలిక

చెడ్డతనం చెరుపు
----------------------------------------
పనికిరాని తలపులు
ఖాళీ చేసుకొనుము
పవిత్రతతో మనసులు
నిండుగా నింపుకొనుము
చెడు తలంపులు చెరుపు
బాధ పెట్టే కురుపు
వదిలిపెడితే గెలుపు
తిరుగుతుందోయ్! మలుపు
వీడితే చెడ్డతనము
అదే కదా గొప్పతనము
బాగుపడు జీవితము
గౌరవించు సమాజము
ప్రగతికి అవరోధము
జగతికి బహు నష్టము
ఆదిలో త్రుంచితే
అబ్బును ఆనందము

పచ్చని చెట్టు ప్రబోధం
----------------------------------------
మనోధైర్యం మనిషికి
అసలసిసలు భద్రత
పరిసరాల శుభ్రత
మన అందరి బాధ్యత
కన్నోళ్లకు సేవలు
జీవితాన ధన్యత
వారి రుణం తీర్చుటకు
ఉండాలోయ్! అర్హత
చిరునవ్వులు ముఖమున
తెచ్చిపెట్టు నవ్యత
మంచి పని చేయుటలో
కూడదు ఉదాసీనత
ఆశ్రయించిన వారికి
ఇవ్వాలి చేయూత
క్షమాగుణం గొప్పది
చూపించుము సుముఖత

అవలోకనం
----------------------------------------
చెక్కిన శిల్పంలో
ఎన్నెన్నో సొగసులు
పరచిన తల్పంలో
హాయినొందు తనువులు
మువ్వల నాదంలో
మదిని దోచు మధురిమలు
పంచమ వేదంలో
బ్రతుకు దిద్దు పాఠములు
వెన్నెల రాత్రుల్లో
సంతసించు మనసులు
వేకువ వెలుగుల్లో
మాయమగును మబ్బులు
ఆనాటి రోజుల్లో
పుష్కలమే మమతలు
ఈనాటి ప్రేమల్లో
అడుగడుగునా భ్రమలు
-గద్వాల సోమన్న
Comments