top of page

అమ్మ చేతి వంటనే తినాలి!

Writer's picture: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaChethiVantaneTinali, #అమ్మచేతివంటనేతినాలి, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 9

Amma Chethi Vantane Tinali - Somanna Gari Kavithalu Part 9 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 29/01/2025

అమ్మ చేతి వంటనే తినాలి - సోమన్న గారి కవితలు పార్ట్ 9 - New Telugu Poems Written By - Gadwala Somannaతెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అమ్మ చేయు వంటలో

అమృతమే దాగుండును

ఆమె కలుపు ముద్దలో

అనురాగము కలసుండును


శుచిగా, రుచిగా ఉండును

ఆరోగ్యమే పంచును

బయట తిండి వద్దు వద్దు

అమ్మ చేతి వంట ముద్దు


ఇష్టమైనవి వండును

ప్రేమతో వడ్డించును

కొసిరి కొసిరి వడ్డించి

ఆకలిని తరిమి కొట్టును


అమ్మ వంట రుచికరము

అత్యంత క్షేమకరము

భుజిస్తే తృప్తికరము

కుటుంబానికదే వరము


పిల్లలూ ఇంటిలోని

అమ్మ వంటనే తినాలి

బయట తిండి మానేసి

అనారోగ్యం తరమాలి
















మేటి సూక్తులు

----------------------------------------

సత్యమే పలకాలి

న్యాయమే గెలవాలి

నాలుగు పాదాల

ధర్మమే నడవాలి


పట్టుదల ఉండాలి

చిత్తశుద్ధి పండాలి

నిరంతర సాధనతో

విజయం సాధించాలి


దేశభక్తి చూపాలి

దేశకీర్తి నిలపాలి

అభివృద్ధి పథంలో

ముందడుగు వేయాలి


నిరాశను అణచాలి

భరోసా నివ్వాలి

చేయూతనందించి

ఆదర్శమవ్వాలి


దైవాన్ని వేడాలి

దైన్యాన్ని వీడాలి

సంకల్ప బలంతో

మున్ముందుకెళ్ళాలి


నీతిగా బ్రతకాలి

ఖ్యాతినే తేవాలి

దైనందిన బ్రతుకున

జ్యోతిలా వెలగాలి


తరువులను పెంచాలి

కరువులను తరమాలి

అజ్ఞానం తొలగించు

గురువులను కొలవాలి


గొప్పగా చదవాలి

మేటిగా నిలవాలి

కన్నవారికి పేరు

సాధించి పెట్టాలి















అమ్మ ఇంట ఉగాది

----------------------------------------

అమ్మ ఒడియే వెచ్చన

పూల రీతి మెత్తన

విరిసిన మల్లెల్లా

ఆమె మనసు తెల్లన


ఆమె ప్రేమ వంతెన

ఆమె మాట దీవెన

పెడచెవిని పెడితే

బ్రతుకంతా వేదన


ఇంటలోన వేడుక

ఖరీదైన కానుక

అమ్మ కుటుంబంలో

పరమౌషధ మూలిక


కాంతినిచ్చు దీపిక

పరిమళించు మాలిక

అమ్మ ఇంటి పునాది

ఆమె ఉన్న ఉగాది











శతకోటి వందనాలు

----------------------------------------

అమ్మ జోలపాటకు

ఆమె గోరు ముద్దకు

శతకోటి వందనాలు

స్వచ్ఛమైన ప్రేమకు


చల్లనైన మనసుకు

వెలలేని సేవలకు

శతకోటి వందనాలు

అమ్మ చూపు శ్రద్ధకు


ఘనమైన బాధ్యతకు

పిల్లలపై ప్రేమకు

శతకోటి వందనాలు

కన్నతల్లి త్యాగముకు


రుచికరమైన వంటకు

ప్రేమగల వడ్డనకు

శతకోటి వందనాలు

కడుపునింపు అమ్మకు


ఆమెకున్న తపనకు

అమ్మ అనురాగానికి

శతకోటి వందనాలు

ఘన ప్రేగు బంధానికి












మహాత్ముల మాటలు

----------------------------------------

కవీంద్రుల బలము కలము

రైతన్నల ఆస్తి పొలము

నైతిక విలువలు మనిషికి

ఉంటేనే ఘనము ఘనము


విలువైన బహుమతి చెలిమి

ఇల వాడబారని కలిమి

చేయకూడదోయ్! ద్రోహము

చేస్తే గనుక దారుణము


ఈర్ష్య కాల కూట విషము

కాకూడదోయ్! దాని వశము

ఇది జగమెరిగిన సత్యము

అనిశము గుర్తించుకొనుము


హానిచేయును కల్లలు

కాల్చివేసే మంటలు

క్రుంగజేయును మనసులు

అగును పతనం బ్రతుకులు












చిన్నారులు-చిరు దివ్వెలు

---------------------------------------

లోకము తెలియని పిల్లలు

నాకము పంచే వేల్పులు

విరిసివిరియని మల్లెలు

ఆకసాన హరివిల్లులు


పవిత్రమైనవి మనసులు

అందమైనవి నగవులు

బుడిబుడి నడకల బాలలు

గృహమున వెలిగే ప్రమిదలు


ఆడేపాడే పిల్లలు

రేపటి భారత పౌరులు

భారతమ్మ ప్రియ పుత్రులు

అందరికీ నిజ మిత్రులు


పిల్లల మాటలు గలగల

ఇంటిలో ఉన్న కళకళ

వారే తొలకరి చినుకులు

తేనెలూరే పలుకులు















చిరు నవ్వుల చిన్నారులు

---------------------------------------

అలతి అలతి పదాలతో

చిట్టి చిట్టి పెదాలతో

అలరించే చిన్నారులు

అందరికీ బహు ఇష్టులు


అందాల నవ్వులతో

మందార మోములతో

చిందులేసే బాలలు

చంద్రోదయ కిరణాలు


తేనెలూరు పలుకులతో

రాజహంస నడకలతో

ముద్దులొలుకు పసి పిల్లలు

విరబూసిన సిరిమల్లెలు


శుద్ధమైన మనసులతో

ముద్దబంతి సొగసులతో

బుద్ధిలోన కడు శ్రేష్టులు

వృద్ధికి రాచ బాటలు














హితోపదేశం

---------------------------------------

విలువైనది సమయము

బలమైనది బంధము

వెలకట్టలేనివి

కోల్పోతే కష్టము


సుతిమెత్తని హృదయము

చేసుకొనుము పదిలము

హేళన మాటలతో

చేయరాదు గాయము


సృష్టిలోన స్నేహము

ఖరీదైన హేమము

జీవితాన భాగ్యము

తలపెట్టకు ద్రోహము


నిజ మిత్రుడు పొత్తము

సరి చేయును చిత్తము

చేతితో పట్టుకో!

నోటితో చదువుకో!












జనహితం కోరేవి!

---------------------------------------

తోటలోని పూవులు

ఊటలోని జలములు

జనహితం కోరేవి!

పాటలోని పదములు


ప్రవహించే యేరులు

విహరించే పక్షులు

జనహితం కోరేవి!

ప్రేమించే మనసులు


చిందించే నగవులు

ప్రకాశించే ప్రమిదలు

జనహితం కోరేవి!

సాయపడే కరములు


పుడమిలోని తరువులు

పొలంలోని పైరులు

జనహితం కోరేవి!

కవీంద్రుల కలములు


మహనీయుల వాక్కులు

గురుదేవుల బోధలు

జనహితం కోరేవి!

శుద్ధమైన తలపులు
















మన ఘన సంపద అడవులు

---------------------------------------

జీవకోటికి అమ్మ ఒడి

పాఠాలు నేర్పే బడి

మన జాతీయ వనరులు

చూడ చక్కని అడవులు


సకల ప్రాణులకు నెలవులు

ఇచ్చును ఔషధ మూలికలు

అడవులుంటే బ్రతుకులు

అభివృద్ధికవే త్రోవలు


పచ్చదనపు పాన్పు వేసి

వర్షాలను కురిపించి

సిరులునిచ్చి సేద దీర్చు

ప్రాణవాయువు మనకు పంచి


పెంచునోయి! భూసారము

అవే జీవనాధారము

అమూల్యమైనవి అడవులు

నరికివేస్తే ఇడుములు


అడవులే లేకుంటే

భువిని కరువు కాటకాలు

భూసారం కోల్పోయి

పంట దిగుబడి తగ్గును


మన ఘన సంపద అడవులు

కాపాడుట మన బాధ్యత

లేక మానవ మనుగడకు

పెను ప్రమాదం జీవులకు

***

-గద్వాల సోమన్న


19 views0 comments

Comments


bottom of page