#పెనుమాకవసంత, #PenumakaVasantha, #AmmaDaPodam, #అమ్మాదాపోదాం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Amma Da Podam - New Telugu Story Written By - Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 17/12/2024
అమ్మా! దా పోదాం - తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
సీరియస్ గా ఆఫీసు వర్క్ చూసుకుంటున్న దివ్య, "మేడం! లోపలికి రావచ్చా..?" అన్న పిలుపుతో గుమ్మం బయటికి దృష్టి సారించింది.
"ఆ రండి.. !" అంటూ తనెదురుగా వున్న కుర్చీలు ఆఫర్ చేసింది. వచ్చిన వ్యక్తికి యాభై ఏళ్లకు లోపే
వుండవచ్చు. బక్క పలచగా బట్టతలతో వున్నాడు. అతని వెనుక ఒక ఇరవై ఏళ్ల అబ్బాయి, ఒక పదిహేనేళ్ల అమ్మాయి నిల్చుని వున్నారు.
"ఇక్కడా.. !" అని ఆ వచ్చిన వ్యక్తి చెప్పే లోపే.. "ఇక్కడ ఖాళీ లేదండీ.. ! ప్రస్తుతానికి ఎవరిని
చేర్చుకోము. "
"అబ్బే.. చేర్చటానికి కాదండీ.. ! ఒక నెల క్రితం ఇక్కడికి ఎవరన్నా వచ్చి జాయిన్ అయ్యారా?" అని అడిగాడు ఆ బట్ట తల వ్యక్తి. ఆ అడగటంలో ఆదుర్దాతో కూడిన ఆశ కనపడింది.
వెంటనే రిజిస్టర్ తీసి చూసింది దివ్య. "ఆ శైలజా.. ! అనే ఆవిడ చేరారు”.
"శైలజనా?” ముగ్గురూ.. మొహల్లోకి ఒకసారి చూసుకుని "శైలజ కాదు, శారద అనే ఆవిడ వచ్చారా?"
"శారద కాదు, శైలజ అనే ఆవిడ హైదరాబాద్ నుండి వచ్చారు."
అయినా వాళ్లకు ఆశ చావక "ఈవిడేనా ఆవిడ.. !"అంటూ ఆ అమ్మాయి ఫోన్లో ఫోటో చూపించింది.
దివ్య ఆ ఫోటో చూసి "ఆ శైలజ గారే.. ! ఈవిడ" అంది.
"ఇక్కడ వుందా?" అని ముగ్గురు ఒకేసారి అన్నారు.
"ఆ వున్నారు, నాకెవరూ లేరు అన్నారు. మీరెవరు?" అంటూ ముగ్గురి మొహల్లోకి డౌట్ గా చూసింది.
"నేను ఆవిడ భర్తను, మా అమ్మాయి, అబ్బాయి. ఒకసారి పిలుస్తారా?" అని ఆశగా అడిగాడు బట్టతలతను.
అపుడే ఒక ముసలావిడకు బాగా లేకపోతే.. దివ్యకి, చెప్దామని వచ్చిన శైలజ, వెనుక నుండి వీళ్ళను చూసి మళ్ళీ లోపలికి వెళ్ళింది.
బెల్ కొడితే ఒకతను వచ్చాడు. "సాంబ..! కొత్తగా వచ్చిన శైలజమ్మను ఒకసారి పిలుచు. అలాగే మన ఫౌండర్ లక్ష్మిగారిని కూడా పిలుచు" అంది.
శైలజ తన భర్త పిల్లలు ఎందుకొచ్చారో కనుక్కుని తన గదిలో వుండకుండా తోటలోకి వెళ్ళింది.
సాంబ వచ్చి “శైలజమ్మ గదిలో లేదు. మన ఫౌండర్ గారు సిటి పోయినారు" అన్నాడు.
"ఆ తోటలోకి పోయి వుంటాది పిలుచుకురా పో..! వాళ్ళ వాళ్ళు వచ్చినారని చెప్పు. "
సాంబు వెళ్ళగానే ఫౌండర్ కు ఫోన్ చేసింది.
"ఆ.. మేడం! శైలజ గారి తాలూకు అని ముగ్గురు మనుషులు వచ్చినారు. ఏమి చెయ్యమంటారు? అదే మేడం.. ఆమె నాకెవరూ లేరు చెప్పినారు. వీళ్లు ఫోటో చూపించి శైలజమ్మ మా మనిషి అంటున్నారు. "
ఈ ఫోన్ సంభాషణ అంతా.. వచ్చిన ముగ్గురు శ్రద్ధగా ఆతృతతో వింటున్నారు. "ఆ మేడం సరే
సరే.. !" అంటూ ఫోన్ పేట్టేసింది దివ్య.
"మేడం గారు సాయంత్రం గానీ రారు. అప్పటి వరకు ఇక్కడనే వుంటారా?" అని అడిగితే, "లేదండీ, ఇక్కడకి దగ్గర్లో మా బంధువులు వున్నారు. సాయంత్రం వస్తాం" అని వెళ్లారు.
సాయంత్రం ఫోన్ చేస్తే ఆశ్రమం ఫౌండర్ వచ్చింది అని తెలిసి మళ్ళీ ముగ్గురూ వచ్చారు.
లక్ష్మిమేడం, దివ్య అక్కడ కూర్చుని ఉన్నారు.
"నమస్తే.. ! అండి నా పేరు వీర శంకరరావు. మా ఆవిడ శైలజని పిలుస్తారా?" అన్నాడు వినయంగా.
"సరే పిలుస్తాం గానీ ఆవిడ వచ్చినపుడు నాకెవరూ లేరు అని చెప్పినాది. ఇపుడు కూడా ‘నాకెవరూ లేరు’ అంటాంది. సాంబ! ఆ శైలజమ్మని పిల్చకరా.. !" వాళ్ళని అనుమానంగా చూస్తూ అంది లక్ష్మి మేడం.
వెళ్ళి శైలజను వెంట పెట్టుకు వచ్చాడు సాంబ.
"ఏమి శైలజమ్మా.. ? నా కెవరూ లేరు అని చెప్పినావు. మరి వీళ్ళేవరు?” వచ్చిన వాళ్ల వైపు చూపిస్తూ.. అడిగింది.
"వీళ్ళెవరో.. ! నాకు తెలియదు మేడం.. !"అంది శైలజ.
"శారద..! నేను నీకు తాళి కట్టిన భర్తను, నన్ను మర్చిపోయినావా?" అవమానంగా అన్నాడు.
"అమ్మా.. ! ఏంటమ్మా.. ? ఇది. మేము నీ కన్న పిల్లలం" అన్నారు పిల్లలు.
"మేడం1 నాకు పెళ్లయి భర్త ఉన్నమాట నిజమే.. వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు. వీళ్ళేవరో.. ! నాకు తెలీదు" అని ముగ్గురి వైపు చూడకుండా అంది.
"చూసారా.. ? మీ అమ్మ మొండితనం ఇంకా మారలేదు. మనం చనిపోయామని చెప్పిన మనిషి మనకు వద్దురా.. ? కన్నపిల్లల్ని వదిలేసే తల్లి ఎక్కడన్నా వుంటుందా?
అది మనం వెళ్ళినా తిరిగి రాదు అంటే.. కాదు వస్తుందన్నారు. నేను వెళ్తున్నా.. ! మీరు వస్తె
రండి లేకపోతే.. లేదు" అంటూ చిటపట లాడుతూ శంకరరావు వెళ్ళాడు.
అబ్బాయి చూస్తూ వున్నాడు.
"అమ్మ రా ప్లీజ్.. ! ఇంటికి వెళ్దాం" అంది అమ్మాయి.
"మేడం వీళ్లెవరో.. !" నాకు తెలియదు అంది.
లక్ష్మి మేడం కు, ఆ పిల్లకు ఈ శైలజమ్మకు పోలికలు కనిపించాయి. శైలజ ఏమి చెప్పదని..
"ఏమీ? మీ అమ్మ నా ఈవిడ.. !" శైలజను చూపిస్తూ ఆ అమ్మాయిని అడిగింది.
"అవును మేడం మా అమ్మే.. ! ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఇలా వచ్చింది. మీరన్నా చెప్పి పంపండి మా అమ్మను ఇంటికి. "
"ఏమి శైలజమ్మ.. ఎక్కడ వైజాగ్ ఎక్కడ తిరుపతి? ఇక్కడ దాకా వచ్చినావు. నీది హైదరాబాద్ అని చెప్పినావు. నాతో కూడా చెప్పవా నీ బాధ?"
"మేడం ఆ ఇంట్లో వాళ్లకు నా అవసరం తీరిపోయింది. ఎవరికి నేను పట్టను. కేవలం పని మనిషిని మాత్రమే. మా ఆయన గారికి అన్నీ సమయానికి అందించకపోతే గోల చేస్తాడు. అప్పటికి ఆయన చేసే ప్రైవేటు ఉద్యోగానికి నేను పనికి రాను అంటూ నా మీద చిన్న చూపు. మనుష్యులకు
మించిన అహంకారాలు.
పిల్లలు అన్నా.. కోపం వద్దురా అని చెప్తే వీళ్లు వినరు. కనీసం నాకు బాగా లేకపోయినా వాళ్ళకు టైం కు అమర్చాలి. బాబుకు చెప్పాను ‘అరే.. ! టాబ్లెట్ తెచ్చి పెట్టరా’ అంటే.. మా ఆయన ‘పిల్లలకి ఎగ్జామ్స్. కాసేపాగి జ్వరం తగ్గితే.. నువ్వే వెళ్ళి తెచ్చుకో.. ! ఎపుడు పడుకునే ఉంటావుగా? కాస్త బయటికి వెళితే.. కాళ్లు సాగుతాయి’ అని డబ్బులు ఇచ్చి వెళ్ళాడు.
పిల్లకు చెపితే “అన్నయ్యకు చెప్పమ్మా.. నాకు ట్యూషన్ వుంది అంది. నాకు లోపల ‘ఇపుడే నా అవసరం ఇంకా వున్న వీళ్లు ఇలా ఉంటే తర్వాత నన్నేమీ చూస్తారు? మా అమ్మను అన్నలు చూడకపోతే.. నేనే చూసాను. మా అమ్మ పోయి, నన్ను మా అన్నయ్యలు పట్టించుకోకపోతే..
మా మేనమామ ఈయనకు ఇచ్చి చేసారు.
చేసిన దగ్గర నుండి మా ఆయన్ని ఒక్క పని కూడా చేసుకోకుండా చూసాను. మొన్నటిదాకా వాళ్ల అమ్మా, నాన్నను చూసాను. ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగాలేకపోతే.. మా వాళ్ల అందరి బుద్ధి బయట పడింది. అసలు అంతా తప్పు నాది. అన్నీ చేతికి అందించి తప్పు చేసాను.
అందుకే జీవితం మీద విరక్తి పుట్టింది. నేను లేకుంటే అన్నీ పనులు చక్కగా చేసుకుంటారనిపించింది. మీ ఆశ్రమం వీడియోలు యూ ట్యూబ్ లో చూసి అడ్రస్ నోట్ చేసుకుని ఇక్కడకు వచ్చాను.
మీ దగ్గరికి వచ్చిన రోజు నేనెలా వున్నాను.. మీరు ఈ ఆశ్రమ డాక్టర్ కు చూపించి మందులిపిస్తే.. కోలుకున్నా.. ! ప్లీజ్ మేడం.. ! మీకు ఆశ్రమంలో ఏదోకటి చేసి పెడతా. నాకు ఇక్కడ హాయిగా వుంది. నేను వెళ్ళను" అని లోపలికి వెళ్ళింది.
శైలజ లోపలికి వెళ్ళగానే.. ! "చూడు పాప.. మీ అమ్మను కొన్నాళ్ళు ఇక్కడే వుండనీయండి. నేను మెల్లిగా చెప్పి పంపుతానులే. అమ్మను మీరు బాగా చూసుకోవాలి కదా? ఇంకా మీరు ఆమెను చానా బాధ పెట్టినారు. అది ఆమె చెప్పుకోవటానికి బిడియ పడుతున్నాదని తెలుస్తున్నాది.
ఒక చెట్టు లాంటింది అమ్మ. ఆమె నుంచి మీరు వచ్చారు. ఒక ఆడది ప్రాణాలకు తెగించి మీకు జన్మనిస్తే.. మీరు ఆమెను ఎట్లా చూడాలి. ఇంకా మీ నాయనలో కోపం పోనట్లుగా వుండాది.
నేను మీకెట్లా చెప్పినానో అట్లాగే మీ నాయనకు చెప్పండి. ఇంకా కొన్నాళ్ళకి ఆయనలో మార్పు వచ్చిననాడు మీ అమ్మ వస్తాదిలే.. ! అప్పటి వరకు పెద్దపిల్లకాయలు మీరు చదువుకుంటూ వుండండి" అని నచ్చ చెప్పింది లక్ష్మి మేడం.
చేసేది లేక పిల్లలు వెళ్లారు. బయట వీళ్ల కోసం వెయిట్ చేస్తున్న శంకరరావు "వచ్చిందా మీ అమ్మ..!" అని వ్యంగ్యంగా అన్నాడు.
"నాన్న! మన ఈ వైఖరి వల్లే అమ్మ.. మనల్ని వదిలి వెళ్ళింది" అంది అమ్మాయి అనూష.
"ఏమి కాదు. బాగా తిన్నది అరగక పొగరెక్కి ఇక్కడకు వచ్చింది. ఇక్కడ ఏమి పని చేయకపోతే ఏమి పెట్టరు? రెండురోజులాగి అదే వస్తుంది లె.. !"
"నాన్న, నాకు అమ్మ రాదనే నమ్మకంగా వుంది. "
"పోనీ ఏంటి మనం వండుకోలేమా? తినలేమా. "
"అమ్మో.. దీని వంట తినలేక పోతున్నా నాన్న. అమ్మను నువ్వు పిలువు వస్తుంది" అన్నాడు అబ్బాయి రాజేష్.
నేను పిలవను. పస్తులైనా వుంటా కాని పోయేప్పుడు నాకు చెప్పిందా? ఇపుడు బొట్టు పెట్టీ
రా తల్లీ.. ! నీ కొంపకు అని పిలవడానికి. పదండి ట్రెయిన్ పోతుం”దంటూ.. పిల్లలను
తొందరపెట్టాడు.
పక్కింట్లో వుండే మేనత్త ఈశ్వరి వచ్చి "అన్నయ్యా.. శారద వచ్చిందా?" అంటూ ఆసక్తిగా అడిగింది.
"దానికి పొగరు పట్టి కొట్టుకుంటుంది రాదుటా. అసలు మేము ఎవరో నాకు తెలియదు పొమ్మంది" అన్నాడు కోపంగా శంకరరావు.
"అయ్యో.. ! అలా అందా? నువ్వంటే లెక్క లేదు సరే, పిల్లల్ని చూసైనా రావాలిగా. పాపం అనూష చెయ్యలేక పోతుంది అన్నీ పనులు" అనూష వైపు చూస్తూ అంది.
అలిసి పోయి మరుసటి రోజు శంకరరావుకు, జ్వరం వచ్చింది. పిల్లలు కాలేజిలకు వెళ్లారు. ఈశ్వరితో కొంచం జావ పెట్టించుకుని తాగాడు. మళ్ళీ ఎక్కడ అడుగుతాడేమోనని, "నాకు వంట్లో బాగోటం లేదు అన్నయ్య. అనూష చేత పెట్టించుకో.. !" అంది.
సాయంత్రం రాజేష్ ను కాస్త టాబ్లెట్స్ తెచ్చి పెట్టరా అంటే.. "డాడి.. పక్కనే గా మెడికల్ షాప్. నాకు అర్జంట్ ప్రాజెక్టు వర్క్ వుంది నాన్న.. !" అంటూ లాప్టాప్ లో తల దూర్చాడు.
అనూష వెళ్ళి తెచ్చి ఇచ్చింది. జ్వరం నాల్గురోజులైనా.. తగ్గకపోవడంతో హాస్పిటల్ కెళ్ళి చూపించుకుంటే.. వైరల్ ఫీవర్ అన్నారు.
శంకరానికి తగ్గగానే, రాజేష్ కు అనూషకుకూడా వచ్చాయి జ్వరాలు.
అపుడు తెలిసి వచ్చింది శంకరానికి శారద విలువ. కానీ అహం ఒప్పుకోలేదు.
పిల్లలిద్దరూ.. "నాన్న.. అమ్మను తెద్దాము" అన్నారు.
“నేను, వెళ్ళి కాళ్లు పట్టుకోను. ఉంటే.. వుండండి లేకపోతే, మీరు ఆ ఆశ్రమంలోనే చేరండి. నేను కాశిలో ఏదో ఆశ్రమం వుందిటా. అక్కడకు వెళ్తాను. పీడా విరగడవుతుంది. అసలు ఆ శనిదాన్ని నాకు కట్టినందుకు మా అమ్మానాన్నను అనాలి. "
“అన్నయ్యా.. ! మనిద్దరం వెళ్ళి అమ్మను ఎలాగోలా కన్విన్స్ చేసి తెద్దాము. నిజంగా అమ్మను మనం సరిగా పట్టించుకోలేదు. మనకు జ్వరం వస్తె మనకు తగ్గే వరకు
తను మనతో పాటు ఉండి రాత్రుళ్లు కూడా మందులేసి మనకి తగ్గేదాక నిద్ర పోయేది కాదు”.
“అవును అనూష, మనిద్దరికీ ట్రెయిన్ టిక్కెట్లు బుక్ చేస్తాను. వెళ్ళి అమ్మను తెద్దాము. రానంటే మనం అక్కడే వుందాము."
"మరి నాన్న అమ్మను ఇంటికి తెస్తే.. వూరుకోడుగా? ఇదివరకు ఒకసారి కోపమొచ్చి అమ్మను ఇంట్లోనుండి నెడితే.. పక్కన అత్త వాళ్ళింట్లో వుండి ఆయన కోపం తగ్గిన తర్వాత వచ్చింది. ఇపుడు మనల్ని వదిలేసి వెళ్లిందని మన ముగ్గురిని ఇంట్లోకి రానివ్వడు. "
"ఏమి పర్లేదు. నాకు పార్ట్ టైం జాబ్ దొరికింది. ఆయన నెడితే మా ఫ్రెండ్ రూంలో ఉందాం. "
పొద్దునే ఇద్దరూ బాగ్ లు తీసుకుని వెళ్తుంటే.. "ఎక్కడికి మీ అమ్మ దగ్గరికేనా? మీ అమ్మను
తెస్తే.. మీరు నా కొంపకు రావద్దు. " అంటూ తలుపేసుకున్నాడు శంకరం.
తిరుపతి వచ్చి ఆశ్రమానికి వెళ్లారు ఇద్దరూ. దివ్యతో "మా అమ్మ కావాలి. అదే శారదగారు" అన్నారు.
శైలజను పిలిచింది, అలాగే లక్ష్మి మేడంను పిలిచింది. "ఏమి అమ్మ కోసం వస్తిరా.. !" అంది లక్ష్మి మేడం.
శైలజకు పిల్లలను చూడగానే ఎంతో బాధ వేసింది. ఇద్దరూ చిక్కిపోయి వున్నారు.
"మీ నాయన రాలేదే” అంటే.. ! నాన్నకు ఆఫీసు వర్క్ వుంది" అన్నారు.
"ఇప్పటికైనా అమ్మ విలువ తెలిసినాదా?"
ఇద్దరూ.. తలలు వూపారు.
ఇద్దరూ వెళ్ళి అమ్మ పక్కన కూర్చుని “సారి అమ్మా.. ! దా ఇంటికి పోదాం" అన్నారు.
"నేను అక్కడకు రావాలంటే.. కొన్ని కండిషన్స్ మీదే వస్తాను. ఇప్పటి నుండైనా మీరు ఎదుటి వాళ్ళ వైపు ఆలోచించటం. కోపాన్ని తగ్గించుకుంటే.. వస్తా. అక్కడికోస్తే.. మళ్ళీ మీరు నన్ను పట్టించుకోరు. ఈసారి ఇక్కడకు.. వస్తె.. వీళ్ళకు ఎగతాళిగా వుంటుంది. వెళ్ళగానే నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేయి రాజేష్. ఆ ఫోన్ చూడటం ఇద్దరూ.. , మానేస్తేనే అక్కడికి వస్తాను. అలా చేస్తానని ఇక్కడున్న వేంకటేశ్వర స్వామిపై ఒట్టు వేయండి.. !" అంటే ఇద్దరూ వేసారు.
"మేడం వస్తాను. ఇన్నిరోజులు నన్ను మంచిగా చూసినందుకు మీకు ఎప్పటికీ ఋణపడి వుంటాను. "
"అదేమీ లేదు శైలజమ్మ, నువ్వు మాతో చక్కగా కలిసి పోయావు. ఎప్పటికీ నువ్వు ఇక్కడికి రాకుండా మీ పిల్లలు నిన్ను చూసుకోవాలని ఆ దేవుణ్ణి.. ! కోరతాన్నాను. పిల్లలు మీ అమ్మ కంటనీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే.. !" అన్నది లక్ష్మి మేడం.
అలాగే అని తలూపారు. వాళ్ల కళ్ళల్లో శారద ఇంటికి రావటానికి ఒప్పుకున్నందుకు ఆనందంగా వుంది. ఇంటికి వెళ్ళాలంటే.. భయంగా వుంది నాన్న ఇంటికి రానిస్తాడా.. !? లేదా అని ఒకటే డౌట్ గా వుంది ఇద్దరికీ. ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసి వుంది.
వీళ్ల గేట్ చప్పుడు అవటం చూసి పక్కింట్లో వుండే మేనత్త ఈశ్వరి వచ్చింది.
"ఏం వదినా బావున్నావా? అన్నయ్య తాళం ఇచ్చి వెళ్ళాడు. ఇదిగో మీరొస్తే కూర చేసిమ్మని నిన్న కూరలు ఇచ్చాడు. స్నానం చేయండి. కూరలు తెచ్చి ఇస్తాను" అంటూ వెళ్ళింది.
పెద్ద తుఫాను, వెలిసినట్లుగా ‘హమ్మయ్య’ అని వూపిరి పీల్చుకున్నారు ముగ్గురు.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comments