అమ్మ మనసు
- Parupalli Ajay Kumar
- Sep 6, 2023
- 5 min read

'Amma Manasu' - New Telugu Story Written By Parupalli Ajay Kumar
'అమ్మ మనసు' తెలుగు కథ
రచన: పారుపల్లి అజయ్ కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అమ్మతనం చచ్చిపోయింది :
'ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
కానీ.. ఓ తల్లి మాత్రం అందుకు భిన్నంగా పైశాచికంగా ప్రవర్తించింది.
తన వివాహేతర సంబంధానికి అడ్డుగాఉన్నదని.. తన ప్రియుడితో కలిసి సొంత కూతురినే ఓతల్లి హత్య చేయబోయింది.
నెహ్రు కాలనీకి చెందిన యశోద అనే మహిళ పదేళ్లువున్న తన కూతురు స్వప్నను దారుణంగా కత్తితో పొడిచింది.
భర్తను వదిలేసిన యశోద, యాదగిరి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నదని కూతురుని అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలసి కుట్రపన్ని నిదురిస్తున్న కూతురిని కత్తితో దారుణంగా పొడిచింది.
స్వప్నకేకలు విని పక్కింటివాళ్ళు పరుగెట్టుకురాగా యాదగిరి పారిపోయాడు. పోలీసులు యశోదను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. యాదగిరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొనఊపిరితో కొట్టుకులాడుతున్న స్వప్నను హాస్పిటల్ కు తరలించారు.
సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. కామంతో కళ్ళు మూసుకుపోయి కన్నకూతురినే దారుణంగా చంపబోయిన యశోదను చూస్తూ ఇలాంటి వారివల్లే స్త్రీలందరికీ చెడ్డపేరు వస్తున్నదని, ఆడవారిలో అమ్మతనం చచ్చిపోతున్నది అని చుట్టుప్రక్కల అందరూ మావిలేఖరితో అన్నారు.'
పేపర్ లో పడిన ఆ వార్తను చదివి నిట్టూర్చింది ప్రవల్లిక.
చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి లోనై, విచక్షణ కోల్పోతున్న వ్యక్తులు దారుణ నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని రోజూ పేపర్లలో కనిపించే వార్తలతో ఆందోళనకు గురిఅయింది ప్రవల్లిక.
తల్లిని దేవుడి ప్రతిరూపంగా చెప్పుకుంటుంటారు. ఎందుకంటే.. తొమ్మిది నెలలు మోసి, ఆపై తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆలనాపాలనా చూసుకుంటుంది తల్లి. తాను పస్తులుండి, పిల్లల కడుపు నింపుతుంది. అసలు తల్లి ప్రేమని మాటల్లో వర్ణించలేం. అటువంటి తల్లి ఇలా చేస్తుందా? ఆ వార్తలో నిజానిజాలు తెలుసుకోవాలని అనిపించింది.
పోలీస్ స్టేషనుకు వెళ్ళియశోదను కలసి మాట్లాడాలి అనుకొన్నది ప్రవల్లిక. ప్రవల్లిక జిల్లా కోర్టులో అడ్వకేట్ గా
పనిచేస్తున్నది.
భర్తలో ఉన్న అవలక్షణాలు, అతని వేధింపులు భరించలేక అతనితో కలసి వుండలేక విడాకులు తీసుకున్నది. రెండు సంవత్సరాలక్రితం తల్లీ, తండ్రీ బంధువుల పెళ్ళికి వెళ్ళివస్తూ కారుప్రమాదంలో చనిపోయారు. అప్పటినుండి ప్రవల్లిక ఒంటరిజీవితాన్ని గడుపుతున్నది.
పదిగంటలకు కారులో కోర్టుకు బయలుదేరి దారిమధ్యలో వున్న పోలీస్ స్టేషను దగ్గర ఆగింది. ఇనస్పెక్టర్ అనుమతి తీసుకుని లాకప్ లో వున్న యశోద దగ్గరకు వెళ్ళింది.
లాకప్ గదిలో యశోద మోకాళ్ళ మీద తలపెట్టుకుని కూర్చొని వుంది. మహిళా కానిస్టేబుల్ ఒక కుర్చీ తెచ్చి లాకప్ గదిలో వేసింది.
ప్రవల్లిక ఆకుర్చీలో కూర్చొని "యశోదా" అని పిలిచింది.
యశోద తలఎత్తి చూసింది.
ఆమెకళ్ళల్లో అంతులేని విషాదం గూడుకట్టుకొనివుంది.
చెంపలపై కన్నీటి చారికలు గుండెలోని బాధకు అవశేషాలుగా కనపడుతున్నాయి.
చెరిగిపోయిన జుట్టు, ఏడ్చిఏడ్చి ఎర్రబడ్డ కళ్ళు, ముఖంలో దైన్యం కొట్టొచ్చినట్లుగా కనపడుతున్న యశోదను చూస్తూ ఖచ్చితంగా ఈమె కూతురిని పొడిచి ఉండదని అనుకుంది ప్రవల్లిక మనసులో.
ప్రవల్లిక సూటిగా యశోద కళ్ళల్లోకి చూస్తూ "నా పేరు ప్రవల్లిక.
నేను జిల్లాకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. నీతో మాట్లాడాలని వచ్చాను.
నిన్ను చూస్తుంటే నా ఇన్నేళ్ల అనుభవం నువ్వు నేరం చేయలేదని చెపుతుంది. అసలు ఏంజరిగిందో చెప్పు?
నీతప్పు ఏంలేదంటే నీతరుఫున నేను నిలబడతా.
నీకేసు నేను వాదించి నిన్ను గెలిపిస్తా. నువ్వు మాత్రం పూర్తిగా నిజాలే చెప్పాలి " అంది.
ముందు యశోద ప్రవల్లికతో మాట్లాడటానికి సుముఖత వ్యక్తం చేయలేదు.
మహిళా కానిస్టేబుల్, "వీరు చాలా పేరున్న లాయరుగారు. నువ్వు నిస్సంకోచంగా ఆమెతో జరిగింది చెప్పు. వారు నీకు న్యాయంచేస్తారు. చెప్పు మరి" అని బలవంతం చేసింది.
ఒకనిమిషం మౌనంతరువాత నోరువిప్పింది యశోద.
"అమ్మా మీరు పెద్ద లాయరు గారంటున్నారు కదా. నా బిడ్డ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుకులాడుతున్నదంట. నా బిడ్డను కాపాడండి తల్లీ. మీకు పుణ్యం వుంటుంది.
నేను జైలు కెళితే నా బిడ్డ బతుకుతెరువుకు దానికేదో ఒక దారి చూపించండి. యాదగిరితో వచ్చానని మా అమ్మా, నాన్నకి కోపం. నా బిడ్డ కోసం వాళ్ళు రారు. ఈ ప్రపంచంలో ఒంటరి ఆడపిల్ల బతకలేదు. దాని గురించే నా బాధ"
యశోద మాటలకు "నేను కోర్టు పని కాగానే హాస్పిటల్ కెళ్ళి నీకూతురును చూస్తా. అక్కడ నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు. వారితో మాట్లాడుతా నీ కూతురి ఆరోగ్యం గురించి.
నువ్వేం బెంగపడకు. ముందు జరిగిన సంగతి మొత్తం చెప్పు" అన్నది ప్రవల్లిక అనునయంగా.
యశోద చెప్పటం మొదలుపెట్టింది.
"నా అమ్మా, నాన్న వ్యవసాయకూలీలు. నాకు ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు వున్నారు. ఊర్లోనే ఉన్న స్కూల్లో పదోతరగతి దాకా చదివాను. తరువాత చదివించటానికి స్తోమతలేదు.
నేనూ పొలంపనులకు కూలీగా వెళ్ళటం మొదలుపెట్టాను.
మాఅన్నకు చదువబ్బలేదు. పనీపాటా చేసేవాడు కాడు.
జులాయిగా తిరిగేవాడు. వాడి స్నేహితులలో మల్లేశం ఒకడు.
పట్నంలో ఆటో తోలుతుండేవాడు. తనకు ఎవరూ లేరని చెప్పేవాడు. నన్ను చూసి పెళ్లిచేసుకుంటానని అన్నాడు. అన్న బలవంతంతో అమ్మ, నాన్నలు అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నన్ను అతనికిచ్చి పెళ్ళిచేసారు.
పట్నంలో కాపురంపెట్టాక తెలిసింది అతనికి అంతకుముందే ఒక పెళ్ళి జరిగిందని. నన్ను వేరే ఒక పూరిపాకలో వుంచి రెండు రోజులకోసారి వస్తుండేవాడు. అదేమని అడిగితే దెబ్బలు, తన్నులు. సంవత్సరానికి స్వప్న పుట్టింది. మల్లేశం ఇచ్చే డబ్బులు చాలక నాలుగిళ్ళల్లో పనికి కుదిరాను.
క్రమక్రమంగా మల్లేశం రాకపోకలు తగ్గిపోయాయి. అప్పుడే పరిచయం అయ్యాడు యాదగిరి. సాంఘీక సంక్షేమ స్కూళ్ళో అటెండర్ గా పనిచేసేవాడు. యాదగిరి సాయంతో స్వప్నను ఆ స్కూళ్ళో చేర్పించాను.
మల్లేశం మొదటి భార్యా పిల్లలతో ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్లాడో తెలియదు. ముసలి వాళ్ళయిన అమ్మా, నాన్న నన్ను ఆదుకుంటారన్న ఆశలేదు. మంచో చెడో పెళ్ళి చేసి పంపించారు. అంతటితో వాళ్ళ బాధ్యత అయిపోయింది. నన్నూ, నాబిడ్డనూ నేనే పోషించుకోవాలి.
ఒంటరి ఆడదంటే అందరికీ లోకువే. మగతోడు లేకుండా మానవ మృగాల నుండి నన్ను నేను రక్షించుకోవటం కష్టమైనపని కొద్దిరోజులలోనే అర్ధమయ్యింది.
ఒంటరిగా ఉన్న నాకు యాదగిరి తోడయ్యాడు. రెండు సంవత్సరాల తరువాత యాదగిరికి ఈ ఊరికి బదిలీ అయింది. యాదగిరితో పాటు నేనూ, స్వప్న కూడా ఈ వూరొచ్చాము. స్వప్నను ఇక్కడి స్కూళ్ళో చేర్పించాము. కొద్దికాలం బాగానే ఉన్నాము.
తరువాత యాదగిరి కూడా మల్లేశం లాగానే తయారయ్యాడు.
తాగిరావటం, గొడవచేయటం, దెబ్బలు, తన్నులు నాజీవితంలో మామూలైపోయాయి.
సెలవులలో స్వప్న ఇంటికొచ్చిన దగ్గరనుండి యాదగిరి చూపులో తేడా వచ్చింది. స్వప్న వయసు పదిసంవత్సరాలే అయినా వయసుకు మించిన ఎదుగుదల దాని పాలిట శాపమైంది. మొన్నరాత్రి యాదగిరి బాగా
తాగివచ్చాడు.
అర్ధరాత్రి నేను నిద్రపోతున్నానని అనుకొని స్వప్న పక్కకు చేరాడు. దానిమీద చేతులు వేయబోయాడు.
నేను ఒక్క ఉదుటున లేచి కూరగాయలుకోసే చాకు అందుకున్నాను. నేను లేవటం చూసి యాదగిరి నా మీద కలబడ్డాడు. ఈ అలికిడికి స్వప్న లేచి కంగారుగా కేకలు వేస్తూ యాదగిరిని పట్టుకొని పక్కకు తోయబోయింది.
నేను నా చేతినున్న చాకుతో యాదగిరిని బలంగా పొడవబోయే సమయానికి స్వప్నను నా ముందుకు తోసి యాదగిరి పక్కకు తప్పుకున్నాడు.
నా చేతిలో కత్తి స్వప్న కడుపులో బలంగా దిగింది.
నేను నిర్ఘాంతపోతూ కంగారుగా కత్తిని బయటకులాగే సమయానికి ఇరుగుపొరుగువారు వచ్చి నన్ను పట్టుకొని పోలీసుల కప్పచెప్పారు.
యాదగిరి ఎప్పుడు జారుకున్నాడో కూడా నేను గమనించలేదు. అందరూ నన్ను నా సుఖం కోసం కూతురుని చంపానని అంటున్నారు. నా కూతురు నా ప్రాణం. నా బాధ ఎవరికి అర్థం అవుతుంది?
నేను చెడిపోయిన దానినే. అయినా నేను ఒక అమ్మను. అమ్మ ఎప్పుడూ అమ్మే. నా తల్లి మనసు మీకెవ్వరికీ అర్ధంకాదు.
నా కూతురిని నా రెక్కల మాటున కాపాడుకుంటూ వస్తున్నాను. దాన్ని పాడుచేయాలని చూసిన వాడిని నరికెయ్యాలనుకున్నాను. కానీ.. అనుకోకుండా జరగరానిది జరిగింది.
నా జీవితం నాశనమైనా నేను బ్రతికున్నదే నా కూతురి కోసం. నా కూతురిని పాడు చేద్దామనుకున్న వాడిని చంపాలనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు.
నా చేతులతో నా బిడ్డను పొడిచిన పాపిని నేను..నా స్వప్న..నా స్వప్న.." అంటూ యశోద ఒక్కసారిగా బోరుమని ఏడ్చింది.
అరచేతితో గుండెను పట్టుకొని ఏడుస్తూనే ప్రక్కకు ఒరిగిపోయింది. మహిళా కానిస్టేబుల్ ఆమెను లేపబోయింది. యశోద శరీరం చల్లగా తగిలింది మహిళా కానిస్టేబులుకు. యశోద ముక్కు దగ్గర వేలు ఉంచి చూసింది. అప్పటికే యశోద ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అది చూసిన ప్రవల్లిక కళ్ళ నుండి కన్నీటి చుక్కలు జారాయి. యశోద అరెస్టు అయినప్పుడు చాలా చాలా రాసిన పేపర్లు, ఆమె చనిపోయినప్పుడు పెద్దగా స్పందించలేదు.
ఒకటి, రెండు పేపర్లలో ఒక మూలగా 'కన్నకూతురికోసం ప్రియుడిని చంపబోయి పొరపాటున కూతురిని పొడిచిన యశోద ఈరోజు గుండెఆగి చనిపోయింది’ అని రాసి చేతులు దులుపుకున్నాయి.
********************************
హాస్పిటల్ లో స్పృహలో కొచ్చిన స్వప్న వాగ్మూలంతో నిజాలన్నీ బయటకు వచ్చాయి. నాలుగు రోజుల తరువాత వేరే వూరిలో పట్టుబడిన యాదగిరికి పోలీసుదెబ్బ
రుచి చూపించేసరికి అన్నీ ఒప్పుకున్నాడు.
యాదగిరిని అరెస్ట్ చేసి రిమాండు కు పంపించారు. వారం రోజుల తరువాత హాస్పిటల్ లో కోలుకున్న స్వప్నను తన ఇంటికి తీసుకొచ్చింది ప్రవల్లిక.
లీగల్ గా స్వప్నను కూతురుగా దత్తత తీసుకోవటానికి కావలసిన కాగితాలను సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA) కు సబ్మిట్ చేసింది ప్రవల్లిక.
------------------------------------------------------
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
కథ బాగున్నది అభినందనలు