'Amma Nanna Oka Teenage Ammayi' - New Telugu Story Written By Ch. Pratap
Published In manatelugukathalu.com On 15/08/2024
'అమ్మా.. నాన్నా.. ఒక టీనేజ్ అమ్మాయి' తెలుగు కథ
రచన: Ch. ప్రతాప్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ రోజు తొమ్మిదవ తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షా ఫలితాలు తరగతి హెడ్ ప్రకటించాడు. అందరికీ మంచి మార్కులే వచ్చాయి కానీ ఎవరూ ఊహించనట్లు లాలిత్య ఆరింటిలో నాలుగు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యింది. మిగితా రెండు సబ్జెక్టులలో అత్తెసరు మార్కులతో పాసయ్యింది. క్లాసులో అందరూ తననే చూస్తూ ఎగతాళిగా నవ్వుతుంటే తలెత్తుకోలేక పోయింది లాలిత్య.
క్లాస్ హెడ్ కూడా రిపోర్ట్ కార్డ్ లాలిత్య చేతికి అందిస్తున్నప్పుడు, ఇటువంటి వానాకాలం చదువులు చదవకపోతే, హాయిగా చదువు మానేసి ఇంట్లో అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుకుతుంటూ కూర్చోరాదా ? ఎందుకిలాంటి పరమ చండాలమైన మార్కులు తెచ్చుకొని మా క్లాస్ మరియు స్కూలు పరువు తీస్తావు అని ఈసడించుకుంటుంటే లాలిత్య తలెత్తుకోలేకపోయింది. కళ్ళలో నీళ్ళు చిప్పిల్లుతుండగా గబ గబా ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంట్లో లాలిత్యకు ఊహించని వ్యతిరేకత ఎదురయ్యింది. ముందుగా తల్లి రమణి మార్కుల షీట్ చూసి అవాకయ్యింది. తర్వాత లాలిత్య వైపు ఈసడింపుగా ఒక చూపు చూసి ఛీ నా కడుపున చెడబుట్టడమే కాక నా పరువు కూడా తీసావు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మ యొక్క చర్యకు హతాశురాలైన లాలిత్య నిస్త్రాణగా సోఫాలో కూలబడిపోయింది.
అనునిత్యం తననెంతగానో ప్రేమించే తన తల్లి నుండి ఈ విధమైన ప్రతిచర్యను తాను కలలో కూడా ఊహించలేదు. తనను అక్కున చేర్చుకొని, తన సమస్యను సహృదయంతో అర్ధం చేసుకొని, దానికి ఒక పరిష్కారం చూపిస్తుందనుకున్న తన తల్లి, తన జీవితంలో ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించే తన ఆరాధ్య దైవం ఈ విధంగా ప్రవర్తించడం తనకేమాత్రం మింగుడు పడలేదు. రాత్రి వచ్చిన తండ్రికి తల్లి ఈ విషయం గబ గబ చెప్పేసింది. దానితో తండ్రి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ముందు వెనుక చూడకుండా బెల్టు తీసుకొని లాలిత్యను చావబాదాడు.
'లక్షల్లో నీకు ఫీజులు కడుతుంటే ఇదా నువ్వు చేసే నిర్వాకం. బుద్ధిగా చదువుకుంటుంటావని నీవు అడిగినవన్నీ సమకూరుస్తుంటే కళ్ళు నెత్తికి ఎక్కినట్లుంది. నిన్ను చంపినా పాపం లేదు' అంటూ ఒళ్ళు వాతలు తేలేలా చావబాది ఆవేశం చల్లారాక తన గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మందు కార్యక్రమం ప్రారంభించాడు. తమ గారాలపట్టి, తమ ముద్దుల కూతురిని భర్త అంతగా చావబాదుతుంటే లాలిత్య తల్లి కనీసం భర్తను వారించకపోవడం లాలిత్యను తండ్రి కొట్టిన దెబ్బల కంటే ఎక్కువ బాధించింది.
ఒళ్ళు సలుపుతుంటే సోఫా. లోనే వెక్కి వెక్కి ఏడుస్తూ సొమ్మసిల్లిపడిపోయింది లాలిత్య.
ఆ ఘటన తర్వాత దాదాపుగా నాలుగు రోజుల పాటు లాలిత్య తల్లిదండ్రులు లాలిత్యతో మాట్లాడడం మానేసారు. ఇంట్లో కూడా సౌకర్యాల విషయంలో కట్టడి చేసారు. ఆ నాలుగు రోజులు కూడా ఒంట్లో బాగుండకపోవడం వలన స్కూలుకు వెళ్ళలేదు. అయిదవ రోజున స్కూలుకు లాలిత్య భయం భయంగా వెళ్ళింది. క్లాసులో అందరి చూపు తనపైనే వున్నాయి. కొందరు ఎగతాళిగా నవ్వడం, కొందరు ఏం జరిగింది, ఇంట్లో బాగా బడిత పూజ అయ్యిందా అని సైగలు చెయ్యడం చెస్తున్నారు. మరికొందరు నీకు తగిన శాస్తే జరిగిందని వెటకారం చెయ్యడం చేసారు. దానితో లాలిత్యకు ఎంతో అవమానంగా అనిపించింది. భూమి చీలిపోయి తాను అందులోకి దిగబడిపోతే బాగుండునని పించింది.
మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇంగ్లీషు క్లాస్ అయ్యింది. క్లాస్ పూర్తయ్యాక ఇంగ్లీష్ మిస్ సునీత తనతో రమ్మని లాలిత్యకు సైగ చేసింది. సునీత మేడం కు ఫేవరేట్ స్టూడెంట్ లాలిత్య. తన ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం, సృజనాత్మకత అంటే సునీతకు ఎంతో ఇష్టం. సునీత లాలిత్య స్కూలుకు రాని నాలుగు రోజుల్లో తన నెట్ వర్క్ ద్వారా మొత్తం సమాచారం సేకరించింది. తనను ఎలాగైనా కౌన్సలింగ్ చేయాలని నిశ్చయించుకుంది.
తన గదిలోకి వచ్చాక, కూర్చోబెట్టి, చల్లని కూల్డ్రింక్ ఇచ్చి, లాలిత్య రిలాక్స్ అయ్యాక అసలు సంగతి మృదువుగా, నెమ్మదిగా అడిగింది సునీత. తల్లిదండ్రుల రియాక్షన్, స్నేహితుల వైపరీత్యం, తన సమస్య ఏమిటని అక్కున చేర్చుకొని అడిగేవారు లేకపోవడం చూసి ఒకలాంటి నిర్వేదానికి లోనైన లాలిత్యకు సునీత మేడం తల్లిగా, ఒక పెద్ద దిక్కుగా తన సమస్య అడిగేసరికి దుఖం సముద్రపు తరంగాల్లా పొంగుకు వచ్చింది. ఒక పది నిమిషాల పాటు ఏకధాటిగా ఏడ్చి తర్వాత అసలు సంగతి చెప్పడం ప్రారంభించింది.
నేను స్కూల్ నుండి రాగానే ట్యూషన్‌కి పరిగెత్తాలి. తిరిగి వచ్చాక నా హోమ్‌వర్క్ చేస్తాను. నేను నా హోమ్‌వర్క్ పూర్తి చేసిన వెంటనే నేను డ్యాన్స్ క్లాస్‌లకు సిద్ధం కావాలి. వచ్చే సంవత్సరం, నేను పదో తరగతికి బోర్డ్ పరీక్షలు రాస్తాను.. టీచర్లు మరియు తల్లిదండ్రులు ఇద్దరూ- నేను అనూహ్యంగా రాణించాలని తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ మధ్య నా ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి. ఎప్పుడూ చికాకుగా, నీరసంగా, అలసటగా వుంటోంది. అందరిపై అకారణంగా కోపం వస్తోంది.
చదువుదామని పుస్తకం తెరిస్తే అస్సలు ఏకాగ్రత కుదరడం లేదు. గత్యంతరం లేక ఏదో చదువు అయ్యిందని పిస్తున్నాను. ఈ విషయాలు మా పేరెంట్స్ కు చెబితే అస్సలు వినడం లేదు. ఆరోగ్యం కోసం విటమిన్ బిళ్ళలు బలవంతంగా తినిపిస్తున్నారు. అయితే ఇది తిండి తింటేనో లేక మందులు వేసుకుంటేనో తగ్గే చికాకు కాదు. ఏదో శారీరకమైన మార్పు. ఏదో కావాలి, ఏం కావాలో తెలియడం లేదు.
అంతే కాకుండా తమ ఎదురింటి ఇంటర్ చదివే అబ్బాయి ఈ మధ్య తనను ప్రేమగా పలకరించడం, సైగలు చెయ్యడం, గాలిలో ఫ్లయింగ్ కిస్ లు పంపించడం చేస్తున్నాడు. తన నెంబరు సంపాదించి ఐ లవ్ యు వంటి మెస్సేజిలు పంపిస్తున్నాడు. ఆ ప్రేమను ఏక్సప్ట్ చెయ్యాలా లేక రిజెక్ట్ చెయ్యాలో నాకు అర్ధం కావడం లేదు, అందుకే సరిగ్గా చదవక పరీక్ష తప్పాను" అని వివరంగా చెప్పింది లాలిత్య.
అన్నీ విన్నాక సునీత ఇది లాలిత్యకు టినేజిలో సాధారణంగా వచ్చే సమస్య అని గుర్తించింది. టీనేజిలో అమ్మాయిల సమస్యలు పలు రకాలుగా వుంటాయి. టీనేజ్ ను తెలుగులో కౌమారం అంటారు. థర్టీన్ నుంచి నైన్ టీన్ వరకు వున్న వయసునే టీనేజ్ అని వ్యవహరిస్తారు. ఇది మానవ జీవితంలో అతి ముఖ్యమైన సమయం. బాగుపడాలన్నా, పోవాలన్నా టీనేజ్ లోనే సంభవం. ఓ రకంగా చెప్పాలంటే ఇది తెలిసీ తెలియని వయసు. ఎన్నో భావాలు, ఆశలు, ఉద్రేకాలు చుట్టుముట్టే వయసిది. తమను అందరూ గుర్తించాలని, తమ మాటకు విలువ ఇవ్వాలని ఆ వయసులో అనిపిస్తుంది. ఆనందం, కోపం మిళితమైన ప్రవర్తన వారిది.
ఆకర్షణలకు సులభంగా లొంగిపోయే వయసు. చాలా మంది తల్లిదండ్రులు టీనేజ్ లో ఉన్న పిల్లలు' ఆరిందా' లని భావిస్తారు. తెలిసీ తెలియని వయసు అని గుర్తించరు. ఫలితంగా ఆ పిల్లలు అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. టీనేజిలో అమ్మాయి తల్లిదండ్రులు స్నేహితుల్లా ప్రవర్తించాలి. మితిమీరిన క్రమశిక్షణకు గురి చేస్తే అసలు మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం వుంది. అసలు సమస్య అర్ధం చేసుకున్న సునీత తర్వాత లాలిత్య తల్లిదండ్రులను కౌన్సిలింగ్ కు పిలిపించింది.
లాలిత్య సమస్యను వివరించింది. "పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. వారికి మంచి చెడులను చెప్పండి. మంచి స్నేహాలకి చెడు స్నేహాలకి మధ్య ఉన్న తేడాలను వారికి వివరించండి. ఎల్లప్పుడూ నీ బాగు కోసం తపన పడే వాడే మంచి స్నేహితుడు, అలాకాక నీకు చెడు వ్యసనాలను అలవాటు చేస్తూ నువ్వు చెడు దారి లోకి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటే అది చెడు స్నేహం అని వివరంగా చెప్పండి. వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. అలా అని వెంబడించకండి. అలా చేస్తే వారి మనసు నొచ్చుకునే ప్రమాదం ఉంది.
వారి స్నేహితుల విషయాలను, సంగతులను సరదాగా పంచుకోమని చెప్పండి. తద్వారా మీకు కూడా వారు చేసే స్నేహాల పట్ల కొంత అవగాహన వస్తుంది. టెన్త్, ఇంటర్ చదివే పిల్లల్ని పెద్దలు పలకరించే తీరు మారాలి. పుస్తకం చేతిలో లేకుండా కనిపిస్తేనో, టీవీ ముందు ఉంటేనో వెంటనే ‘పరీక్షలు పెట్టుకుని ఇదేమిటి.. భయం లేదా?’ అని తీవ్ర స్వరంతో అరుస్తారు. మందలించడం, హెచ్చరించడం అని పెద్దలు అనుకుంటారు. కానీ అది పరీక్షల మీద పిల్లల్లో భయాన్ని పెంచుతుంది. వారికి చదువు ప్రాముఖ్యత, దాని వలన వచ్చే ప్రయోజనాలను వివరిస్తే చాలు వారే చదువుపై శ్రద్ధ పెడతారు. ఇందుకు ఓపికగా వ్యవహరించాలి తల్లిదండ్రులు.
పరీక్షలపై ఉన్న భయాన్ని మొదట వారిలో పోగొట్టాలి. ఒత్తిడి లేనపుడే చదివినదాన్ని అర్థం చేసుకోగలుగుతారు. "ఆ మాటలతో లాలిత్య తల్లిదండ్రులకు తమ తప్పు ఏమిటీ తెలిసివచ్చింది. తమ ముద్దుల కూతురు లాలిత్యను మరింత లాలిత్యంగా చూసుకుంటామని సునీత మేడం కు మాట ఇచ్చి స్కూలు నుండి బయటకు నడిచారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా విద్యార్ధులను చదువు పేరిట రాచి రంపాన పెట్టి, తర్వాత వారికి మంచి మార్కులు వస్తే అది తమ క్రెడిట్ కింద భావించే ఉపాధ్యాయులే ఎక్కువగా కనిపిస్తున్నారు.
అయితే విద్యార్ధులను తమ సొంత బిడ్డలుగా భావించి, వారిని అక్కున చేర్చుకొని, వారి సమస్యలకు చక్కని పరిష్కారం చూపించే సునీత మేడం వంటి ఉపాధ్యాయులు ఈ సమాజంలో చాలా అరుదు. అటువంటి ఒక అరుదైన రత్నం వంటి సునీత మేడం కు శత సహస్ర కృతజ్ఞాతాభివందనములు అర్పించుకున్నారు లాలిత్య తల్లిదండ్రులు.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
Comments