top of page

అమ్మా! నిద్ర లే అమ్మా !..

Writer's picture: Neeraja PrabhalaNeeraja Prabhala

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #అమ్మానిద్రలేఅమ్మా, #AmmaNidraLeAmma, #TeluguKathalu, #తెలుగుకథలు



Amma Nidra Le Amma - New Telugu Story Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 09/02/2025

అమ్మా! నిద్ర లే అమ్మా !.. - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



హేమ, ప్రకాష్ లది ప్రేమ పెళ్ళి. చాలా అన్యోన్యమైన దాంపత్యం. వాళ్ళ దాంపత్యానికి గుర్తుగా రత్నాల లాంటి ఇద్దరు బిడ్డలు. పాప దివ్య. బాబు కిరణ్. సంసారం మూడు పువ్వులు-ఆరు కాయలుగా సజావుగా సాగిపోతోంది. 


ప్రతిరోజూ లాగానే వేకువనే లేచి ఇంటి పనులు ప్రారంభించి భర్త ప్రకాష్ ను నిద్ర లేపటానికి వెళ్ళింది హేమ. "ప్రకాష్ ! ఆఫీసుకు టైమవుతోంది. లే" అన్న హేమ పిలుపుకు దుప్పటి లోంచే 'ఊ' అని బద్దకంగా కళ్ళు తెరిచి "అబ్బ, చలికాలం. అప్పుడే తెల్లారిందా! ఏదీ బెడ్ కాఫీ" అని చిలిపిగా హేమ బుగ్గ మీద చిటిక వేసి తన దుప్పటి లోకి లాక్కున్నాడు. 


ఇది ప్రతి రోజూ అలవాటే అయినా హేమ తెచ్చి పెట్టుకున్న చిరుకోపంతో "ఇప్పుడా మీ సరసాలు. ఆఫీసుకు టైమవుతోంది. పైగా పిల్లలు కూడా లేచే టైమవుతోంది" అన్న హేమ పెదవులను తన పెదవులతో మూసేశాడు ప్రకాష్. 


అరగంట తర్వాత భర్త కౌగిలిని వీడి సిగ్గుతో హేమ రివ్వున పిల్లల గదిలోకి వెళ్ళి పిల్లలిద్దరికీ తియ్యని ముద్దిచ్చి లేపి వాళ్ళకు స్నానాది కాలక్రృత్యాది పనులు పూర్తి చేయించి స్కూలు డ్రస్ వేసి డైనింగ్ రూమ్ లోకి తీసుకొచ్చింది. 

అప్పటికే ప్రకాష్ ఆఫీసుకు రెడీ అయి డైనింగ్ టేబుల్ మీద వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు.. 

"అయ్యో! ఎంత సేపటి నుండి ఎదురు చూస్తున్నావు? ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ తెస్తానుండు" అని కిచెన్ లో అంతకు ముందే రెడీ చేసి ఉంచిన పూరీలు, ఆలూ కూర తెచ్చి టేబుల్ మీద భర్త కు, పిల్లలకు ప్లేట్లలో వడ్డించి తను కూడా పెట్టుకుంది. సరదా కబుర్లతో బ్రేక్ ఫాస్ట్ ముగించారు. 


ప్రకాష్ ‘బై డియర్' అని భార్య కు‌, ' బై దివ్యా, బై కిరణ్’ అని పిల్లలకు ముద్దిచ్చి ఆఫీసుకు తన స్కూటర్ మీద వెళ్ళి పోయాడు. హేమ పిల్లలకు కా రేజీలు సర్ది, స్కూలు బాగ్ లు తీసుకుని, ఇంటికి తాళం వేసి, హెల్మెట్ పెట్టుకుని తన టూవీలర్ మీద స్కూలుకు తీసుకుని వెళ్లి దించింది. తిరిగి వస్తూ తన చిన్ననాటి ఫ్రెండ్ ఇంట్లో కాసేపు సరదాగా గడిపి అక్కడే తనతో లంచ్ చేసి తనకు బై చెప్పి తిరిగి పిల్లలను పికప్ చేసుకునేందుకు స్కూలుకు బయలుదేరింది హేమ. 


ఇంకొంచెం సేపట్లో స్కూలుకు చేరుతుంది ఆనుకునే లోగానే వెనుక నుండి కారు బలంగా ఢికొనగా హేమ వెహికిల్ మీద నుండి క్రింద పడింది. ఆ కారు హేమ మీద గుండా దూసుకు పోయింది. రక్తపు మడుగులో హేమ నిర్జీవిగా మారి ఈ లోకానికి బై చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయింది. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి హేమను చూసి, చనిపోయింది అని నిర్థారించుకుని, ఆ కారును అటకాయించి పోలీసులకు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి ఆ కారులోని వాళ్ళ ను అరెస్టు చేసి అందులోని మద్యం సీసాలను, ఆ కారును స్వాథీనం చేసుకుని హేమ బాగ్ లోని ఫోన్ నెంబర్ల ఆథారంగా ఆవిడ భర్త కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 

ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న ప్రకాష్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయి షాక్ కు గురయ్యి కాసేపటికి తెప్పరిల్లి తన ఫ్రెండ్ సురేష్ కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి పిల్లలను స్కూల్ నుండి పికప్ చేసుకురమ్మని కోరాడు. 


సురేష్ స్కూలుకు వెళ్ళగానే అప్పటికే పిల్లలు అమ్మ కోసం ఎదురుచూస్తున్నారు. "అంకుల్! ఆమ్మ ఏదీ? రోజూ వచ్చేది, ఇవాళ రాలేదేమి? " అన్న పిల్లల మాటలకు గుండె తరుక్కుపోయి "అమ్మ ఇంట్లో ఉంది. మిమ్మల్ని తీసుకుని రమ్మని నన్ను పంపింది. మీ కోసమే ఎదురుచూస్తోంది" అని పిల్లలను ఇంటికి తీసుకెళ్ళాడు సురేష్. 


ఇంటికి వెళ్ళగానే పడుకొని నిద్రపోతున్నట్లున్న హేమ ను చూసి పిల్లలు " అమ్మా! లే, అమ్మా! అని తన చిట్టి చిట్టి చేతులతో కుదిపి లేపుతూ "ఆకలవుతోందమ్మా! ఏదన్నా స్నాక్స్ పెట్టమ్మా! లే అమ్మా! కళ్ళు తెరు, అమ్మా! " అన్న పిల్లల అమాయక మాటలకు బంధువులకు గుండె తరుక్కుపోయింది. 


ప్రకాష్ పిల్లలిద్దరినీ గుండెలకు హత్తుకొని "అమ్మ నిద్ర లేస్తుంది. మీరు అన్నం తిని పడుకొని నిద్రపోతే తెల్లారేటప్పటికి అమ్మ లేచి మీకు ముద్దిస్తుంది" అన్న తండ్రి మాటలకు ఆ చిన్నారుల మొహాలలో కొండంత వెలుగు వచ్చి "అలాగే డాడీ! " అని బంధువులెవరో అన్నం పెడితే తిని హాయిగా నిద్రపోయారు ఆ చిన్నారులు. 

ఆ పసి మనసులు 'ఇంకా అమ్మ నిద్రపోతోంది. తెల్లారేసరికి అమ్మ నిద్ర లేచి రోజూ లాగానే తియ్యని ముద్దిచ్చి మమ్మల్ని నిద్ర లేపుతుంది ' అన్న భావన తోనే ఉన్నాయి. 


పడుకొని ఉన్న ఆ అమ్మ శాశ్వత నిద్ర నుండి లేచి కళ్ళుతెరిచి ఆ పసి మనసుల కోరిక తీరిస్తే ఎంత బాగుండునో కదా!


.. సమాప్తం .. 


-నీరజ హరి ప్రభల

Profile Link


Youtube Playlist Link









32 views0 comments

Comments


bottom of page