#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #AmmaPrasninchindi, #అమ్మప్రశ్నించింది, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Amma Prasninchindi - New Telugu Story Written By BVD Prasada Rao
Published In manatelugukathalu.com On 13/01/2025
అమ్మ ప్రశ్నించింది - తెలుగు కథ
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సుమతి తొందర చేపట్టడంతో.. ఈ మారు సంక్రాంతికి పదిహేను రోజులుందనగానే.. మా ఊరు బయలుదేరేసాను. నిజానికి ప్రతి యేడు సంక్రాంతికి రెండు మూడు రోజుల ముందు ఊరికి బయలుదేరేవాడ్ని.
బస్సు సాఫీగా పోతోంది. విండో సీట్ దొరికింది. బస్సులో రద్దీ పెద్దగా లేదు.
ఊరిలో అమ్మ ఉంటుంది. నాన్న ఎప్పుడో చనిపోయాడు.
వాళ్లకి నేనొక్కడ్నే సంతానం.
నేను వ్యవసాయం వైపు పోక.. ఊరిలో ఉన్న స్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాను. చదువు పూర్తయ్యిన మూడేళ్లకి ఓ ప్రయివేట్ కంపెనీలో జాబ్ సంపాదించుకోగలిగాను. దాంతో ఊరొదిలి పట్నం వచ్చేసాను. నేను పట్నం చేరి పదేళ్లు అవుతోంది. ఆ లోపునే నాకు సుమతితో పెళ్లయ్యింది.. రెండేళ్ల అమర్ కి.. ఏడాదిన్నర అంజుకి తండ్రినయ్యాను.
అమ్మ వ్యవసాయం చూసుకుంటుంది. మాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. అది నాన్న కూడేసింది కాదు. కన్నవారింటి నుండి ఎకరం పొలం అమ్మ తెచ్చుకుంది. తాత.. అమ్మమ్మ పోయేక ఏకైక కూతురు కావడంతో వాళ్ల ఎకరంనర పొలం కూడా అమ్మకే ముట్టింది.
అమ్మ కూలీలను తిప్పుతూ పంటలు పండిస్తోంది. ఊరిలో చిన్న ఇల్లు ఉంది. అందులో అమ్మ ఒంటరిగా ఉంటుంది. పైగా ఊరిలో అందరికి అమ్మ ఇష్టురాలు. దాంతో ఆమెకు ఒంటరితనం తెలియడం లేదు.
నేనప్పుడప్పుడు ఊరొచ్చి వెళ్తున్నా.. పెళ్లయ్యిన లగాయతు ప్రతి సంక్రాంతి పండుగకు ముందొచ్చి.. ఆ సంవత్సరం పంటలోంచి అమ్మ నుండి కొంత మొత్తం మరీ వసూలు చేసుకుంటున్నాను.
"ఏంట్రా అబ్బీ. పెళ్లి తర్వాత నువ్వు ఇవ్వడం మానేసి నా నుండి గుంజుకుంటున్నావు." అమ్మ గుణిసేది.
"అమ్మా.. నాకు పనితో అందేదే అంతంత. పైగా పెళ్లితో నా ఖర్చులు మరీ పెరిగాయి. నీకు తెలియందా. అందుకే సంవత్సరం పంటలో కొంత కోరేది." చెప్పేవాడ్ని.
"పంటల ఖర్చులూ పెరిగిపోతున్నాయిరా. వచ్చేది రాబోయే పంటలకి దాచవలసి వస్తోంది. వ్యవసాయం లాభసాటి కాకుంటోంది." అమ్మ ఏకరువు పెట్టేది.
నేను పెడ చెవిన పెట్టేవాడ్ని. ఎంతో కొంత గుంజుకునే వెళ్లేవాడ్ని.
పిల్లలు పుట్టేక నాకూ ఖర్చులు సర్దడం కష్టమవుతుండేది.
"మీ పొలాలలో కొంత అమ్మేసి.. ఆ డబ్బు తెస్తే.. నేనూ ఇంట్లో ఉండి ఏదో వృత్తి చేపడతాను." సుమతి పోరుతుండేది.
"నువ్వేం చేస్తేవే." నేను అడిగేవాడ్ని.
"నాకు టైలరింగ్ వచ్చు. కుట్టు మిషన్లు కొనుగోలు చేసుకొని ఆసరా అవుతాను. మరో ఇద్దరు ముగ్గురుకు ఊతం కూడా అవుతాను." చెప్పేది.
"బాగుంది. తాదూర సందు లేదు.. అనే నానుడిని గుర్తు తెస్తోంది నీ తీరు. చాల్లే." తేల్చేసే వాడ్ని.
సుమతి సొద ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉంది. ఈ మధ్య మరీ జోరయ్యింది.
గత సంక్రాంతికి అమ్మ మునుపటిలాగ అంద చేయక.. తను తీర్థ యాత్రలకు పంట డబ్బును వాడుకుంది.
దాంతో నాకు చిర్రెక్కినా.. సుమతి అగ్గి మీది గుగ్గిలం మాదిరయ్యింది.
అందుకే ఈ మారు సంక్రాంతికి చాలా ముందుగానే ఊరు బయలుదేరవలసి వచ్చింది.
బస్సు దిగి అమ్మ ఇంటిని చేరాను.
అమ్మ గడపలో సూర్యం మామతో బాతాఖానీ పెట్టుంది.
"ఏంట్రా అల్లుడు.. ఈ మారు ముందే వచ్చేసావు." సూర్యం మామ పలికరించి అడిగాడు.
అమ్మ నవ్వేసి ఊరుకుంది.
నేను నేరుగా ఇంటిలోకి పోయాను. భుజాన ఉన్న బేగ్ ని పక్కన పెట్టాను. పెరటిలోని నూతి వైపు నడిచాను.
ముఖం కడుక్కున్నాను.
అప్పటికే అమ్మ అక్కడికి వచ్చి ఉంది. తువ్వాలు అందించింది.
"వేళ మించి పోయింది. నా తిండయ్యిపోయింది. నీకై వండుతా. ఈ లోగ కాఫీ చేసి ఇస్తా." అమ్మ చెప్పింది.
"దార్లో టిఫిన్ చేసేసానులే. ఆకలి లేదు. మంచి నీళ్లు ఇవ్వు చాలు." అన్నాను.
అమ్మ గ్లాస్ తో నీళ్లు ఇచ్చింది.
సూర్యం మామ వెళ్లిపోయినట్టుంది.
గడపలోకి వచ్చాం. అమ్మ నాకు స్టూల్ వేసింది. తను నేలనే చతికిల పడింది.
"కోడలు.. పిల్లలు ఎలా ఉన్నారు." అమ్మ అడిగింది.
"బాగున్నారు." చెప్పాను.
"ఏ పండక్కి వాళ్లని తెచ్చేది లేదు. నేను వాళ్లని చూసి చాన్నాళ్లయ్యింది.." అమ్మ అంటోంది.
నేను అడ్డై.. "ఏం తిప్పుతానులే. ఛార్జీలు బారెడు. నా వల్ల కాదు." పుసుక్కున అన్నాను.
"ఎప్పుడూ లేదనేరా నీ గోల. నీ గోలే నిన్ను బెంబేలు పెడుతోంది. ఎన్ని మార్లు చెప్పినా ఆ ఏడుపు ఆపవు." అమ్మ కసురుకుంటుంది.
"మరి నువ్వు పట్టించుకుంటున్నావా. నా మొరే మిగులు." నొచ్చుకుంటున్నట్టు అన్నాను.
అమ్మ ఏమీ అనలేదు.
"గతేడాది మొండి చెయ్యి చూపావు. తీర్థ యాత్రలకు పోయావు. ఈ మారు బాగా ఇవ్వాలి. లేదంటే నేను కష్టాలపాలు కాక తప్పదు." చెప్పాను.
ఆ వెంబడే..
"కొంత పొలం అమ్మి డబ్బు ఇమ్మంటే ఇవ్వవు. నీ కోడలు కుట్టు మిషన్లు పెట్టుకుంటుంది. మాకు సర్దుబాటు అవుతోంది." చెప్పాను.
"నేను చెప్పేసానుగా. పొలాలు అమ్మేదే లేదు. వాటి పంటలే మనం తిందాం. అంతే." అమ్మ మొండిగా మళ్లీ చెప్పేసింది.
నాలో మంట రేగింది.
అంతలోనే అమ్మ అంది.. "నీకు అక్కడ కుదరకపోతే ఇక్కడికి కుటుంబంతో వచ్చేయ్. వ్యవసాయం చూసుకో. నా వల్ల కావడం లేదు. ఇది వరకటిలా ఇప్పుడు లేదిక్కడ. కూలీల వెంట పరుగులు పెట్టలేను. నువ్వు వచ్చి చూసుకో."
"నువ్వే అన్నావుగా.. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని. మరి నేనొచ్చి కూరుకు పోవాలా." అనేసాను.
"లేదు లేదు. నేను తిరగలేక అలా అన్నాను. తిరిగే మనిషి ఉంటే పంటలు బాగానే దక్కుతాయి. మిగులు చక్కగా ఉంటుంది." అమ్మ చెప్పింది.
"మరి నాకు వ్యవసాయం ఏం తెలుసు. నేనొచ్చేసి ఏం చెయ్యగలను." చెప్పాను.
"నేను ఉంటానుగా. ఎప్పుడేం చేయాలో చెప్పగలను. నువ్వు చదువు ఉన్నవాడివి. సులభంగా నీకు వ్యవసాయం అబ్బేస్తోంది." అమ్మ వత్తాసులా అంది.
"లేదు లేదు. సుమతికి ఇటు రావడమంటే ఇష్టం లేదు. అందుకేగా తాను ఇటు వచ్చేది లేదు. పైగా పిల్లలకి పట్నం చదువులు అందించాలి." చెప్పాను.
"అవ్వా కావాలి.. బువ్వా కావాలి.. అంటే నాతో కుదరని పని. నా మట్టుకు నేను శ్రమిస్తున్నాను. నా తాహతుకు మించి నేను పని చేయలేను. అలాగని వ్యవసాయం వదలను." చెప్పింది అమ్మ.
"నిన్ను కాదనేది లేదుగా. వ్యవసాయం చేసుకో. కానీ కొంత పొలం అమ్మేసి డబ్బు సర్దమంటున్నాను. మిగతా పొలం పండించుకో." విసురుగానే అనేసాను.
"కుదరదు. నేను ఉన్నంత వరకు పొలాలు ముక్కలు చేయడం నాకు ఇష్టం లేదు." అమ్మ అంది.
"నీ తర్వాత నీ పొలాలు నాకేగా.." చెప్పుతున్నాను.
అడ్డై.. "కాదనడం లేదుగా. అంత వరకు ఆగు." అమ్మ అనేసింది.
"అంత వరకు అంటే.. ఆ సరికి నేను కుదేలు పడి.. నేనే ముందు పోయేలా ఉన్నాను." అనేసాను.
అమ్మ ఏమీ అనలేదు. నన్నే చూస్తోంది.
నేను మరింత రెచ్చాను.
"ఒరే. గోలెందుకు. నీ నాన్న గోల చేసాడు. పొలాలు అమ్మేసి పట్నం పోయి వ్యాపారం చేసుకుందామన్నాడు. నీ తాత కూడా నీ నాన్నకే వత్తాస పలికాడు. నేను అప్పుడు కాదన్నాను. ఇప్పుడూ కాదంటున్నాను. ఒరే.. నికరమైనది భూమిరా. డబ్బు నోట్లు విచ్చలవిడివిరా. చేతులు మారతాయి. అవస్తలు పడాలిరా. ఉన్నది కాల తన్నుకోవడం మంచిది కాదురా." చెప్పింది అమ్మ.
నాకు పిచ్చిగా ఉంది. అమ్మను ఒప్పించలేననిపిస్తోంది.
"నీకో దండం. నిన్ను ఒప్పించుకోలేను. ఈ ఏడాది పంట డబ్బులైనా ఎక్కువగా ముట్ట చెప్పు. నేను అప్పులుపాలు అయ్యాను." చెప్పాను.
అమ్మ లేచింది. లోనికి వెళ్లింది.
ఓ పుస్తకంతో తిరిగి వచ్చింది.
ఆ పుస్తకంని నాకు ఇచ్చింది.
నేను పేజీలు తిప్పుతూ చూసాను. అవి లెక్కల చిట్టా.
"నీ సూర్యం మామచే ఎప్పటివప్పుడు రాయించాను. రాబడులు.. ఖర్చులు చూడు. ఎంతేసి మిగులుతోందో చూడు." అమ్మ చెప్పింది.
వాటిని పరిశీలించేక నేను నిజంగా అవస్త అవుతున్నాను.
"మరి ఇంతేసి తేడాలప్పుడు.. వ్యవసాయం ఎందుకు. పొలాలు అమ్మేసి. ఆ డబ్బుతో పట్నం పోదాంరా. ఏదైనా చేసుకుందాం." అనేసాను.
అమ్మ సర్రున లేచింది.
"నేను చెప్పేది నీ చెవికి ఎక్కలేదు. చెప్పేసానుగా. నాకు పొలాలు అమ్మే ఇష్టం లేదు." అమ్మ యాగీలా అనేసింది.
నేను జడిసిపోయాను.
అమ్మని ఇలా ఎన్నడూ చూడలేదు.
మా మధ్య మాటలు ఆగిపోయాయి.
చాలా సేపుటికి అమ్మ ఇంట్లోకి నడిచింది.
ఒక గుడ్డ మూటతో వచ్చింది.
"ఇదిగో ఈ ఏటి ఖర్చులు పోగా మిగిలిన డబ్బు. నువ్వు పూర్తిగా పట్టుకుపో. నా తంటాలు నేను పడతాను." అమ్మ అంటోంది.
అమ్మ మాటలు నా చెవుల్లో గింగిర్లు పెడుతున్నాయి.
అమ్మనే చూస్తూ ఉండి పోయాను.
"ఆ నాడు నీ నాన్నకే నేను తల ఒగ్గేసి ఉంటే.. ఈ నాడు నువ్విలా విర్రవీగేవాడివా." అమ్మ ప్రశ్నించింది.
అమ్మ యోచనలోని యోగ్యతకై వెంపర్లాడుతున్నాను.
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments