#GSSKalyani, #GSSకళ్యాణి, #AmmaPrema, #అమ్మప్రేమ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Amma Prema - New Telugu Story Written By - G. S. S. Kalyani
Published In manatelugukathalu.com On 17/03/2025
అమ్మ ప్రేమ - తెలుగు కథ
రచన: G. S. S. కళ్యాణి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రాత్రి ఎనిమిదిగంటల సమయంలో హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇన్నోవా కారులో బయలుదేరింది కాంతి. దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైటు పడటంతో బ్రేక్ వేసి కారును ఆపాడు కారు నడుపుతున్న కాంతి తమ్ముడు నృసింహ. కారు ఆగడంతోటే ఒక బిచ్చగత్తె చంటిపిల్లవాడితో కారు దగ్గరకు వచ్చి తన బిడ్డకు ఆకలేస్తోందని చెప్పి ఏదైనా ఇవ్వమంటూ నృసింహను బతిమలాడింది.
ఆ బిచ్చగత్తె చంకలో ఉన్న పిల్లాడివంక చూసింది కాంతి. వాడి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. చింపిరి జుట్టు, మురికిపట్టిన బట్టలూ, బక్క చిక్కిన శరీరంతో అందవిహీనంగా ఉన్న పిల్లవాడిని చూసి ముఖం చిట్లించుకుని మరో వైపుకు తిరిగి కూర్చుంది కాంతి. కారులో ఉన్న ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసి ఆ పిల్లవాడి చేతిలో పెట్టాడు నృసింహ. పిల్లాడు తన రెండు బుజ్జి చేతులతో ఆ ప్యాకెట్ అందుకుని బిచ్చగత్తెవంక నవ్వుతూ చూశాడు. చిమ్మచీకట్లో ఆ పిల్లవాడి నవ్వు మట్టిలో మాణిక్యంలా తళుక్కున మెరిసింది.
బిచ్చగత్తె కృతజ్ఞతతో నృసింహకి దణ్ణం పెట్టి, చిరుగులున్న తన చీర కొంగుతో పిల్లవాడి ముఖం తుడుస్తూ, "తిను నాన్నా!", అంటూ కన్నీళ్ళతో తడిసిపోయిన ఆ పిల్లవాడి బుగ్గపై ముద్దు పెట్టింది. అమ్మ ప్రేమకు అందం అడ్డు కాదు కదా!
"ఇది నీకూ!", అంటూ నృసింహ చిరునవ్వుతో ఆ బిచ్చగత్తె చేతిలో ఒక పది రూపాయల నోటు పెట్టాడు. బిచ్చగత్తె నోటు అందుకోగానే గ్రీన్ సిగ్నల్ పడింది. నృసింహ కారును ముందుకుపోనిచ్చాడు.
"ఒరేయ్ తమ్ముడూ! డోంట్ ఎంకరేజ్ దీస్ బెగ్గర్స్! ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మన చుట్టూ మూగిపోతారు. ఛ!", బిచ్చగత్తెను అసహ్యించుకుంటూ నృసింహతో అంది కాంతి.
"అలా అనకు అక్కా! పాపం వాళ్ళు బీదరికంలో ఉన్నారు. మనకున్నది లేనివాళ్ళకు ఇస్తేనే కదా మనకు నిజమైన ఆనందం కలుగుతుందీ? మనిషిగా పుట్టినందుకు మానవత్వం చూపడం మన ధర్మం!", అన్నాడు నృసింహ.
"ఏమో అదంతా నాకు తెలియదు. అయినా అదేవిటోగానీ ఒకే తల్లి కడుపున పుట్టినా మన అభిప్రాయాలు ఎప్పుడూ కలవవు!", అంది కాంతి చిరాకుపడుతూ.
ఎయిర్పోర్ట్ రాగానే కారు దిగింది కాంతి. లగేజీని కాంతికి అందిస్తూ, "అక్కా! నేను అడిగిన విషయం ఒక్కసారి ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నీ మాట కోసం ఎదురుచూస్తూ ఉంటా", అన్నాడు నృసింహ.
"అది కుదరదని చెప్పానుగా తమ్ముడూ! లేనిపోని ఆశలు పెట్టుకోకు. వెళ్ళొస్తా!", అంటూ నృసింహ చేతిలో ఉన్న లగేజీ తీసుకుని ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిపోయింది కాంతి.
స్థిమితంగా చెక్-ఇన్ అయ్యి, సెక్యూరిటీ చెక్ వగైరాలు పూర్తిచేసుకుని, విమానంలో తనకు కేటాయించిన సీట్లో కూర్చుంది కాంతి. విమానం బయలుదేరింది. టేకాఫ్ కోసం రన్-వే మీద పరిగెడుతున్న విమానం చక్రాలు గిర్రున తిరుగుతూ వేగాన్ని పుంజుకుంటున్నాయి. కాంతి మనసులో ఆలోచనలు సైతం గతస్మృతుల పొరల్లోకి చొచ్చుకుని అంతే వేగంగా వెళ్ళిపోతున్నాయి.
***
కాంతి తండ్రి జానకీపతి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆమె తల్లి కౌసల్య ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. జానకీపతి సంపాదన కౌసల్య వైద్యానికయ్యే ఖర్చులకు సరిపోయేది. దాంతో కాంతీ, నృసింహల బాల్యం పేదరికంలో గడిచింది.
కౌసల్య కాంతికీ, నృసింహకీ, "పిల్లలూ! మీరు బాగా చదువుకోవాలి. చదువుంటే డబ్బు సంపాదించి సుఖపడచ్చు", అని ఎప్పుడూ చెబుతూ వారిని ప్రోత్సహించేది.
కౌసల్య ప్రోత్సాహంతో కాంతి, నృసింహలు బాగా చదివి స్కాలర్ షిప్పులు తెచ్చుకుని కాలేజీలకి కూడా వెళ్ళగలిగారు. చదువు పూర్తికాగానే కాంతికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగమొచ్చింది. ఉద్యోగంలో చేరిన కొద్దినెలల తర్వాత కాంతి తను భాస్కరం అనే అబ్బాయిని ప్రేమించానని చెప్పి, పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానని కచ్చితంగా చెప్పేసింది. కానీ అందుకు జానకీపతి ఎంతమాత్రం ఒప్పుకోలేదు.
భాస్కరం అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడనీ, చక్కటి వ్యక్తిత్వం కలవాడనీ, జీవితాంతం తనను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాడని కాంతి చెప్పడంతో, "అమ్మా కాంతీ! అమ్మకు అసలే ఒంట్లో బాగుండదు. నువ్వు అమెరికా వెళ్ళిపోతే అమ్మ నీమీద బెంగ పెట్టుకుంటుంది! మరోసారి ఆలోచించు", అన్నాడు జానకీపతి.
"నాన్నా! అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు మరో మూడు నెలల్లో రిటైరవుతావు. తమ్ముడు నాకన్నా ఏడాది చిన్నవాడు. వాడి చదువు పూర్తయ్యేసరికి మరో సంవత్సరం పడుతుంది. నేను పెళ్ళి చేసుకుని అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తే అవకాశాన్నిబట్టి మీకు ఆర్థికంగా కొంత సహాయం చెయ్యచ్చు. అప్పుడు అమ్మకు మరింత మంచి వైద్యం ఇప్పించచ్చు", అంటూ జానకీపతిని తన పెళ్ళికి ఒప్పించింది కాంతి.
పెళ్లైన తర్వాత కాంతిని అత్తవారింటికి పంపుతూ, "నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి! ఈ అమ్మ మనసు ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది", అంటూ కాంతిని గట్టిగా హత్తుకుని కన్నీటిపర్యంతమైంది కౌసల్య.
అనుకున్నట్లే కాంతి అమెరికాలో ఉద్యోగంలో చేరి, తన సంపాదనలో కొంతభాగం జానకీపతికి పంపుతూ ఉండేది. మూడేళ్ళు గడిచేసరికి కాంతికి ఇద్దరు మగపిల్లలు జన్మించారు. పుట్టగానే పిల్లలను డే కేర్ సెంటర్లో చేర్పించేసి తన ఉద్యోగంలో తను చేరిపోయింది కాంతి. కాంతి తన ఉద్యోగానికి ప్రాధాన్యతను ఇస్తూ పిల్లలను పట్టించుకోకపోవడం భాస్కరానికి బాధకలిగిస్తూ ఉండేది.
ఎప్పుడైనా భాస్కరం కాంతితో పిల్లల గురించి ప్రస్తావిస్తే, "చాదస్తంగా మాట్లాడకండి! ఒకప్పుడు లేని ఆధునిక వసతులు ఇప్పుడు చాలా వచ్చాయి. పిల్లలను చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటే డబ్బులెలా వస్తాయ్? అసలు నేను ఈ అమెరికాకు వచ్చిందే డబ్బులు సంపాదించటానికి కదా! పిల్లలను ఊరికే వదిలెయ్యలేదు. వాళ్ళను మంచి డే కేర్ లో పెట్టాను. అక్కడ వాళ్ళు బాగానే పెరుగుతారులెండి", అని సమాధానం ఇచ్చేది కాంతి.
కాంతితో గొడవపడటం ఇష్టంలేక మౌనంగా ఉండిపోయేవాడు భాస్కరం. ఒకరోజు నృసింహ కాంతికి ఫోను చేసి మాటల సందర్భంలో కౌసల్యకు కొన్ని కొత్త ఆరోగ్యసమస్యలొచ్చాయని చెప్పాడు.
"నేను అమ్మతో కొన్నాళ్ళు గడిపివస్తాను", అని భాస్కరంతో చెప్పి భారతదేశానికి వచ్చింది కాంతి.
ఎయిర్ పోర్టులో కాంతిని చూస్తూనే, "ఇంత శ్రమపడి నువ్వెందుకొచ్చావక్కా? అమ్మను జాగ్రత్తగా చూసుకోవడానికి నేనున్నాను కదా! అసలు అమ్మానాన్నల కోసమే నేను ఇండియాలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను", అన్నాడు నృసింహ.
ఆ మాటలకు కాంతి మనసు చివుక్కుమంది.
కౌసల్య ఆరోగ్యం నిలకడగా ఉండటంతో, "అమ్మా కాంతీ! అమ్మను నేను చూసుకుంటాను. అక్కడ అల్లుడూ, పిల్లలూ కష్టపడుతున్నారు. మాకన్నా అమెరికాలోనే నీ అవసరం ఎక్కువ. నువ్వు అమెరికాకు త్వరగా వెడితే బాగుంటుంది", అన్నాడు జానకీపతి.
"సరే! ఏదో అమ్మతో ఒక నాలుగు రోజులు గడిపి వెడదామనుకున్నా. నేనిక్కడుండటం మీకంత కష్టంగా ఉంటే వెళ్ళిపోతాలే", అంది కాంతి బాధతో కలిగిన కోపంతో.
"నా ఉద్దేశం అదికాదమ్మా!", అని వివరించబోయాడు జానకీపతి.
జానకీపతి మాటలు పట్టించుకోకుండా టికెట్ కొనుక్కుని తిరుగు ప్రయాణమై అమెరికాకు వెళ్ళిపోయింది కాంతి. అదే సంవత్సరం నృసింహకు తన ఆఫీసులో సహోద్యోగి అయిన అపర్ణతో పెళ్లి కుదిరింది. కాంతికి ముఖ్యమైన ప్రాజక్ట్ కారణంగా ఆఫీసులో సెలవు దొరకలేదు. దాంతో నృసింహ పెళ్ళికి రాలేకపోయింది కాంతి.
ఒక ఏడాది గడిచింది. నృసింహకు కూతురు పుట్టింది. కానీ అపర్ణ ప్రసవవేదనను తట్టుకోలేక కన్నుమూసింది. అంతలో జానకీపతికి తీవ్ర అనారోగ్యం చేసి ఆసుపత్రిలో చేరవలసి వచింది.
"అక్కా! నీ అవసరం ఇక్కడ చాలా ఉంది. ఒక్కసారి ఇండియా రాగలవా?", అంటూ కాంతికి ఫోన్ చేశాడు నృసింహ.
"అవునవును! అవసరం ఉంటేనే నేను మీకు గుర్తుకువస్తాను", అని కటువుగా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేసింది కాంతి.
నృసింహ భాస్కరానికి ఫోను చేసి పరిస్థితులు వివరించి తన అక్కను ఒప్పించమని బతిమలాడాడు.
భాస్కరం కాంతికి కూతురి బాధ్యతను గుర్తుచేస్తూ, "అవసరంలో చేసే సహాయమే గొప్పది. అది నీ మనసుకు కూడా నిజమైన తృప్తిని ఇస్తుంది. మీ బంధువులంతా భారతదేశంలోనే ఉన్నా నృసింహ నీకు మాత్రమే ఎందుకు ఫోను చేశాడో ఒక్కసారి ఆలోచించు. కష్టంలో ఉన్నప్పుడు మీవాళ్ళను పరామర్శించేందుకు ఎంతమంది వచ్చినా, నిన్ను కన్నవాళ్లకి వాళ్ళు నీతో సమానం కాదు!", అన్నాడు.
"సరే! మీరింతగా చెప్తున్నారు కాబట్టి కేవలం మీకోసం ఇండియా వెళ్ళొస్తా!", అంది కాంతి.
భాస్కరం కాంతి ప్రయాణానికి ఏర్పాట్లన్నీ పూర్తిచేశాడు. కాంతి భారతదేశం చేరుకుని ముభావంగా ఉంటూ నృసింహకు అన్ని పనులలో తనకు తోచిన సహాయం చేసి అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యింది.
బట్టలు సద్దుకుంటున్న కాంతి దగ్గరకు నృసింహ తన ఎనిమిది నెలల కూతురు కృష్ణ ప్రియతో వచ్చి, "అక్కా! ఒక్క చిన్న మాట నీతో చెప్పాలని అనుకుంటున్నాను", అన్నాడు.
"ఏమిటది?", అడిగింది కాంతి.
"కృష్ణను నువ్వు పెంచగలవా?", అడిగాడు నృసింహ తన చేతిలో ఉన్న పాపను చూపుతూ.
"నేనా?", ఊహించని ప్రశ్నకు ఏ సమాధానం ఇవ్వాలో తెలియక ఆశ్చర్యంగా నృసింహవంక చూసింది కాంతి.
"అవునక్కా! ఆడపిల్లను పెంచడం నాకు చేతకాదు. అమ్మ ఆరోగ్యం గురించి నీకు తెలుసు. ఇప్పుడు నాన్నకు కూడా ఆరోగ్య సమస్యలొచ్చాయ్. పెద్దవాళ్ళనూ, పసిదాన్నీ చూసుకుంటూ ఉద్యోగం చెయ్యడమంటే నావల్ల కాదని అనిపిస్తోంది. నువ్వు పాపను కొన్నాళ్ళు పెంచి పెద్దచేసి నా దగ్గరకు పంపితే నీకు జీవితాంతం ఋణపడి ఉంటాను", అన్నాడు నృసింహ కళ్ళనీళ్ళతో.
కాంతి కృష్ణప్రియవంక చూసింది. వెన్నెలలాంటి నవ్వు నవ్వింది కృష్ణప్రియ.
"నీ పరిస్థితి నాకు అర్థమయ్యింది. కానీ, నేను నువ్వనుకుంటున్న సహాయం చెయ్యలేను తమ్ముడూ. నాక్కూడా అమెరికాలో ఉద్యోగం ఉంది. ఇద్దరు పిల్లలున్నారు కూడా. అయినా, మీ పెళ్ళయ్యాక అపర్ణ నాతో ఒక్కసారైనా మాట్లాడిందా? ఆమె దృష్టిలో నేనసలు ఈ భూమ్మీదే లేను! అటువంటి పిల్ల కన్న కూతురిని నేనెలా పెంచనూ? నువ్వు ఒక పని చెయ్. ఇంకో అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకో. నీకు అన్నిటికీ ఆ అమ్మాయి తోడుంటుంది", అంది కాంతి.
"అక్కా! నీకు అపర్ణ గురించి పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావ్. అపర్ణకు చిన్నప్పుడు వచ్చిన నరాల బలహీనతవల్ల ఆమె రెండు చేతులూ చచ్చుబడిపోయాయి. అయినా కృంగిపోకుండా పట్టుదలతో బాగా చదువుకుంది. చక్కటి తెలివితేటలు భగవంతుడు ఆమెకిచ్చిన వరం. శారీరక వైకల్యమే తప్ప అపర్ణ మనసు చాలా మంచిది. అమెను నేను మనసారా ప్రేమించాను. అపర్ణను మర్చిపోయి నేను మరో పెళ్ళి చేసుకోలేను!", అంటూ ఆ గదిలోనుంచీ వెళ్ళిపోయాడు నృసింహ.
***
ఫ్లైట్ లో కళ్ళు మూసుకుని కూర్చున్న కాంతికి అంతవరకూ జరిగిన సంఘటనలన్నీ ఒకదానివెంట ఒకటిగా గుర్తుకొచ్చాయి. 'కృష్ణప్రియ విషయంలో నా నిర్ణయం సరైనదే! నేను వీళ్ళకి అక్కర్లేదుకానీ నా సేవలు మాత్రం కావాల్సొచ్చాయ్!', అనుకుంది కాంతి.
ప్రయాణం పూర్తి చేసుకుని కాంతి ఇల్లు చేరుకుంది. అప్పటికి కాంతి పిల్లలు ఒక చిన్న ఉడత పిల్లను చేరదీసి దానికి పాలూ, పళ్ళూ పెట్టి పెంచుతున్నారు.
కాంతికి ఉడతపిల్లను చూపిస్తూ, "అమ్మా! మేము దీన్ని పెంచుకుంటున్నాము. ఇది మన బ్యాక్ యార్డ్ లో దొరికింది. దీని పేరు రింకీ", అన్నారు పిల్లలు ఉత్సాహంగా.
"ఛ! ఛ! దాన్ని బయట వదిలెయ్యండి. దానికే రోగాలున్నాయో ఏమో! అవన్నీ మనకంటుకుంటే కష్టం", ఉడతపిల్లను చీదరించుకుంటూ అంది కాంతి.
పిల్లల హుషారంతా ఆవిరైపోయింది. వాళ్ళు బిక్క ముఖాలు పెట్టుకుని భాస్కరం దగ్గరకు వెళ్ళారు.
అప్పుడు భాస్కరం, "పాపం ఆ ఉడతపిల్ల తల్లిని మేము చూస్తూండగానే గద్ద ఎత్తుకుని పోయింది. చెట్టు మీదనుంచీ కింద పడిన పిల్లను పిల్లలు కాపాడారు. మేము దాన్ని వెట్ దగ్గరకు కూడా తీసుకెళ్ళి అవసరమైన ఇంజక్షన్లు చేయించాము. పిల్లలను పెంచుకోనీ", అన్నాడు భాస్కరం.
కాంతి ఏదో చెప్పబోయేలోపు, "అమ్మా! ఈ ఉడతకి అమ్మలేదు. నాన్న ఎక్కడున్నారో తెలియదు. అది ఇంట్లో అల్లరి చెయ్యకుండా మేము చూసుకుంటాం. ప్లీజ్ అమ్మా! దాన్ని మాతో ఉండనీ", అన్నాడు నాలుగేళ్ళ రాఘవ.
రాఘవ మాటే తన మాట అన్నట్లు కాంతివంక అమాయకంగా చూశాడు మూడేళ్ళ కేశవ. రాఘవ అడిగిన తీరు కాంతికి ఆశ్చర్యం కలిగించింది. ఉడతపిల్లను పెంచుకోవడానికి పిల్లలకు తన అనుమతిని ఇవ్వక తప్పలేదు కాంతికి. పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు.
ఆ మరుసటి రోజునుంచీ పిల్లలు ఉడతను ఎంత శ్రద్ధగా పెంచుతున్నారో గమనించింది కాంతి. పిల్లలిద్దరూ ఉడతను తెగ ముద్దు చేస్తూ, దాని అవసరాలను గమనిస్తూ, చిన్న చిన్న ఆటలు దానికి నేర్పుతూ, అప్పుడప్పుడూ దానికి స్నానం చేయిస్తూ ఉడతకి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారు. ఒకరోజు రాఘవతో ఉడత ఆడుతూ ఆడుతూ ఎత్తుగా ఉన్న కుర్చీ మీదనుండీ హఠాత్తుగా కింద పడింది. రాఘవ చటుక్కున ఉడతను చేతిలోకి తీసుకుని దాన్ని ప్రేమగా నిమురుతూ దానికేమైపోయిందోనని తెగ కంగారు పడిపోయాడు.
అది చూసిన కాంతి, "అబ్బ! ఆ ఉడత గురించి ఎందుకంత కంగారు పడతావ్? దానికేదైనా సమస్య వస్తే దాన్ని బయట చెట్టు మీద వదిలెయ్", అంది.
"అమ్మా! పాపం! ఈ ఉడతకు అమ్మ లేదని చెప్పానుగా. వాళ్ళ అమ్మ ఉంటే దీని గురించి ఎంత కంగారు పడేదో కదా", అన్నాడు రాఘవ.
"పిల్లల గురించి వాళ్ళమ్మ కంగారు పడుతుందన్న విషయం నీకెవరు చెప్పారు?", రాఘవను నవ్వుతూ అడిగింది కాంతి.
"నువ్వెప్పుడూ మా గురించే ఆలోచిస్తావని నాన్న చెప్తూ ఉంటారమ్మా!", అన్నాడు రాఘవ. రాఘవ అన్న ఆ మాటలు కాంతి మనసుకు తగిలాయి.
‘ఎంతసేపూ నా ఉద్యోగమేదో చేసుకుంటూ నా పనుల్లో నేనున్నానే తప్ప పిల్లలకోసం నా ప్రణాలికలో సమయమేదీ?', అని అలోచనలో పడింది కాంతి.
అంతలో కాంతికి తనతోపాటూ ఆఫీసులో పనిచేసే రెమీ ఫోను చేసింది. రెమీ కాంతికి మంచి స్నేహితురాలు కూడా. ఎందుకంటే రెమీ అమెరికన్ అయినప్పటికీ ఆమెకు భారతీయ సంస్కృతి అంటే విపరీతమైన గౌరవమూ, అభిమానమూ ఉన్నాయి. అదే ఇష్టంతో రెమీ తెలుగు భాషను కూడా నేర్చుకుంది.
"హలో రెమీ! ఏమిటి విషయం?", మూడ్ మార్చుకుని గొంతులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తూ అడిగింది కాంతి.
"కాంతీ! ఒక పెద్ద విశేషమే ఉంది! నేనూ, మావారూ గతవారం ఇండియాకు వెళ్ళొచ్చాం. అందరికీ రేపు సాయంత్రం ఒక సర్ ప్రైస్ పార్టీ ఏర్పాటు చేశాం. నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా పార్టీకి రావాలి. వస్తావు కదూ?", ఆప్యాయంగా అడిగింది రెమీ.
"అలాగే! అందరం తప్పకుండా వస్తాం", రెమీకి మాట ఇచ్చింది కాంతి.
మర్నాడు సాయంత్రం రెమీ చెప్పిన పార్టీ వెన్యూకి వెళ్ళింది కాంతి కుటుంబం. రెమీ, ఆమె భర్త థామస్ అందరినీ సాదరంగా అహ్వానించి కూర్చోబెట్టి ఫలహారాలూ, పానీయాలూ అందించారు.
కాసేపటి తర్వాత థామస్ మైక్ అందుకుని, "కైండ్ అటెన్షన్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్.. " అంటూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. అందరూ కబుర్లు ఆపి థామస్ వైపు ఆసక్తిగా చూశారు.
అప్పుడు థామస్, "ఈ పార్టీని మేము మీకొక ముఖ్యమైన విషయం వెల్లడించడానికి అరేంజ్ చేశాము. నేనూ, రెమీ గత వారం ఇండియా వెళ్ళొచ్చాం. గ్రేట్ కంట్రీ అండ్ గ్రేట్ కల్చర్ అర్థమేమిటో తెలుసుకున్నాం. మేము ఇక్కడికి బయలుదేరేరోజు అక్కడి అనాథ పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవాలని మాకు అనిపించింది. అనుకున్న వెంటనే మాకు ఒక చక్కటి బిడ్డ దొరికాడు. వాడే గోపాల్! ఇండియాలో పుట్టిన గోపాల్ ను మేము ఫార్మల్ గా దత్తత తీసుకున్నాం. ఇకనుంచీ గోపాల్ మా ఫ్యామిలీ మెంబర్", అంటూ రెమీ ఎత్తుకుని వచ్చిన చిన్న పిల్లవాడిని అందరికీ పరిచయం చేశాడు.
సుమారు ఏదాదిన్నర వయసున్న గోపాల్, చిన్ని చిన్ని బుగ్గలతో, చిట్టి చిరునవ్వుతో, చక్కగా దువ్విన ఒత్తైన జుట్టుతో ఎంతో ముద్దుగా ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూండగా గోపాల్ లేత బుగ్గమీద ముద్దులు పెట్టుకున్నారు రెమీ, థామస్ లు. రెమీ, థామస్లకు అప్పటికే ఉన్న ముగ్గురు పిల్లలూ గోపాల్ చేతిలో బొమ్మలూ, చాక్లెట్లూ పెడుతూ వాడిని తెగ గారాబం చేశారు.
"ప్లీజ్ ఎంజాయ్ డిన్నర్!", అన్నాడు థామస్.
అందరూ ఒకరి తర్వాత ఒకరు రెమీ, థామస్ లకు అభినందనలు తెలిపి డిన్నెర్ కు వెళ్ళడం ప్రారంభించారు. కాంతి కూడా రెమీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వారి వద్దకు వచ్చింది. కాంతిని చూస్తూనే గోపాల్ కిలకిలా నవ్వాడు. అది చూసిన కాంతి అనుకోకుండా తన రెండు చేతులూ చాచి గోపాల్ ని తన దగ్గరకు రమ్మంది. గోపాల్ ఠక్కున ముఖం తిప్పేసి రెమీని గట్టిగా తన రెండు బుజ్జి చేతుల్తో వాటేసుకున్నాడు.
"కొత్త పడుతున్నాడు!", అంది కాంతి.
"వాడు అమ్మ కూచి!", అంది రెమీ గోపాల్ కు ముద్దు పెడుతూ.
"ఎంత అమ్మ కూచైనా రేపు నువ్వు ఆఫీసుకొచ్చాక ఎవరి దగ్గరో ఉండాల్సిందేగా!", అంటూ నవ్వింది కాంతి.
"ఓ! కాంతీ! నీకు అసలు విషయం చెప్పలేదు కదూ? నేను గోపాల్ కోసం జాబ్ కు రిజైన్ చేసేశాను. గోపాల్ కొంచెం పెద్దవాడయ్యేదాకా వీడే నా లోకం", అంది రెమీ.
అవాక్కైపోయింది కాంతి.
భోజనం చేసి ఇంటికి వెడుతూ కార్లో భాస్కరంతో, " ఉద్యోగ విషయంలో రెమీ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదు. కొత్తగా దత్తత తెచ్చుకున్న బిడ్డను తన సొంత బిడ్డలా చూసుకుంటోంది రెమీ. తన సొంత తోబుట్టువుగా భావించి, గోపాల్ ను లాలించి, ఆడిస్తున్నారు రెమీ పిల్లలు. గోపాల్ తనకు పుట్టిన బిడ్డే అన్నట్లు వాడికి ప్రేమానురాగాలు పంచుతున్నాడు థామస్. నాకదంతా చాలా చిత్రంగా ఉంది!", అంది కాంతి.
"కాంతీ! అక్కడ గోపాల్ పట్ల రెమీ కుటుంబసభ్యులందరిలో ఉన్నదీ మామూలు ప్రేమ కాదు. అమ్మ ప్రేమ! జీవులందరిలో అమ్మగా ఉన్నది ఆ జగన్మాతే కదా! ఒక తల్లి మనసుతో ఆలోచిస్తే రెమీ తీసుకున్నది మంచి నిర్ణయమని నీకే తెలుస్తుంది", అన్నాడు భాస్కరం.
అంతలో, "నాన్నా! నాకు నిద్దరొస్తోంది. ఐ వాంట్ టు హగ్ యూ!", అన్నాడు కేశవ కళ్ళు నలుపుకుంటూ.
"ఇంటికి వెళ్ళగానే హగ్ ఇస్తాను. సరేనా? అంతవరకూ నీ కార్ సీట్లో పడుకో", అన్నాడు భాస్కరం. వెంటనే నిద్రపోయాడు కేశవ.
కేశవను చూడగానే కాంతికి గోపాల్ గుర్తుకువచ్చాడు. ఎందుకంటే పార్టీలో కాంతి భోజనం చేస్తున్నప్పుడు పలకరించడానికి వచ్చింది రెమీ. అంతలో ఎక్కడినుంచో గోపాల్ "అమ్మా!" అంటూ రెమీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి 'ఐ ఆం స్లీపీ', అంటూ రెమీ చంక ఎక్కి ఆమె భుజంపై తల వాల్చాడు. రెమీ గోపాల్ ను ఎంతో ప్రేమగా జో కొడుతూ నిద్రపుచ్చింది.
దీర్ఘాలోచనలో పడిన కాంతి, 'గోపాల్ కు నిద్ర వస్తే తన పెంపుడు తల్లి కోసం వెతుక్కుంటూ వచ్చాడు! అదే కేశవకు నిద్ర వస్తే కనీసం నావైపు కూడా చూడలేదు. అయినా ఇంతకాలం ఒక అమ్మగా వాడికి నేను ఏమిచ్చానని వాడు నాకేసి చూడాలీ? నేనసలు పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకున్నదే లేదు! ఇకనైనా నేను ఒక అమ్మగా నా బాధ్యతను సవ్యంగా చెయ్యకపోతే నేను నా పిల్లలకు అన్యాయం చేసినట్లే!', అని అనుకుంది.
వెంటనే కాంతి భాస్కరంతో, "నేను కూడా నా ఉద్యోగం వదిలెయ్యదల్చుకున్నాను. ఇంటినుండీ పనిచేసే రిమోట్ వర్కింగ్ జాబ్ ఏదైనా చూసుకుని పిల్లలను జాగ్రత్తగా పెంచుతాను. అమ్మ ఉన్నా లేనట్లు వాళ్ళు పెరగకూడదు!”, అంది.
కాంతి నిర్ణయం భాస్కరాన్ని ఆనందాశ్చర్యాలకు గురిచేసింది. అనుకున్నట్లే కాంతి తన ఉద్యోగాన్ని వదిలి తన పిల్లలకు కావలసినవి సమకూరుస్తూ అమ్మదనాన్ని ఆస్వాదించసాగింది. ఏడాది గడిచింది. కాంతి పిల్లలను భాస్కరానికి అప్పజెప్పి తన తల్లిదండ్రులను చూసిరావడానికి భారతదేశం వెళ్ళింది. ఒక రెండు వారాల తర్వాత తిరుగు ప్రయాణమవుతూ నృసింహను రమ్మని పిలిచింది.
"ఏంటక్కా?", అంటూ వచ్చాడు నృసింహ.
"ఒరేయ్ తమ్ముడూ! నీ చిట్టితల్లిని నాతో తీసుకెళ్ళి నా పిల్లలతోపాటూ చక్కగా పెంచుతా. ఇస్తావా?", అడిగింది కాంతి.
"అక్కా! ఎంత మంచి మాట చెప్పావూ?! కృష్ణ నీ దగ్గరుంటే దాని గురించి నాకు ఏ బెంగా ఉండదు! దానికి అయిదేళ్ళు రాగానే ఇక్కడికి తెచ్చేసుకుంటా. మధ్యమధ్యల్లో నేను అమెరికాకు వచ్చి చూసి వెడతా", అన్నాడు నృసింహ సంతోషంగా.
"ఏం బంగారు తల్లీ! ఈ అత్తతో వస్తావా?", కృష్ణప్రియను అడిగింది కాంతి.
"చాకీలు ఇస్తే వస్తా!", అంది కృష్ణప్రియ ముద్దుమాటలతో.
కాంతి కృష్ణప్రియను ఎత్తుకుంది. కృష్ణప్రియ తన రెండు బుజ్జి చేతులతో కాంతి మెడను చుట్టేసింది.
"అబ్బ! నా కన్న బిడ్డలను హత్తుకున్నంత అద్భుతంగా ఉంది!", కళ్ళు మూసుకుని పసిపాప లేతస్పర్శకు పరవశిస్తూ అంది కాంతి.
"మనం కన్నా కనకపోయినా అందరిమీదా అమ్మ ప్రేమను కురిపించగలగడం ఒక వరం కాంతీ! ‘యా దేవీ సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా.. ' అన్నట్లు ఆ పరమేశ్వరి నీద్వారా కృష్ణకు అమ్మలేని లోటును తీర్చాలి! అదే నా కోరిక", అంది కౌసల్య భావోద్వేగంతో ఉబికివస్తున్న కన్నీటిని తన చీర కొంగుతో తుడుచుకుంటూ.
"అమ్మా! ఇకపై కృష్ణ నాకు కూతురితో సమానం!", అంటూ కృష్ణప్రియతో అమెరికాకు వెళ్ళిపోయింది కాంతి.
*****
G. S. S. కళ్యాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం' కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను.
@GSSKalyani05
• 2 hours ago
కథను ఎంతో చక్కగా చదివి వినిపించిన శ్రీ మల్లవరపు సీతారాంకుమార్ గారికి ధన్యవాదాలు!