top of page

అమ్మమ్మ దవడ వాచిపోయింది నాయనోయ్

Writer's picture: Nallabati Raghavendra RaoNallabati Raghavendra Rao

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #AmmammaDavadaVachipoyindiNayanoy, #అమ్మమ్మదవడవాచిపోయిందినాయనోయ్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Ammamma Davada Vachipoyindi Nayanoy - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao 

Published In manatelugukathalu.com On 10/02/2025

అమ్మమ్మ దవడ వాచిపోయింది నాయనోయ్ - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



వరాలమ్మకు 90 ఏళ్ళు. బుగ్గలు ఏమాత్రం ఒడిలి పోలేదు. శరీరం ముడతలు పడలేదు. తలలో వెంట్రుకలు కూడా అక్కడక్కడ మాత్రమే తెల్లగా ఉన్నాయి. నడుము నొప్పి అసలే తెలియదు ఆవిడకు. కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చెప్పాలంటే జాంపండులాగా ఉంది. 


వాళ్ళ ఆయన రంగనాథం అయితే దబ్బపండు లాగే ఉంటాడు. వాళ్లది చాలా పెద్ద కుటుంబం. వరాలమ్మ కు చెల్లెళ్ళు ముగ్గురు. వాళ్లు ఒక్కొక్కళ్ళకి ఇద్దరేసి కూతుళ్ళు. ఆ కూతుర్లకు కూడా పెళ్లిళ్లు అయి పోయాయి. అంతా పనసపండులా బంగిడిపల్లి మామిడి పండ్లు లా ఉంటారు. 


వరాలమ్మకు కూతుర్లు నలుగురు. వీళ్ళందరికీ కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్ల పిల్లలు అంటే వరాలమ్మ మనవరాళ్ళు పదిమంది. ఆ ఆడపిల్లలకు అందరకు కూడా పెళ్లిళ్లు అయిపోయాయి కానీ చివరి నాలుగో కూతురు కూతురు ఒక్కతే మిగిలిపోయింది పెళ్లికి.. వరాలమ్మ రంగనాథం దంపతుల ఆ మండుగా లోగిలి ఇంట్లో. 


ఆ పెళ్ళికాని ఆ పిల్ల పేరు ఝాన్సీరాణి. ఆ పేరు ఇదేదో అదేదో లాగా ఉంది వద్దు అనుకున్నారు కానీ అదేదో ఇదేదో గొప్పగా ఉంది అన్నట్టు చివరికి ఆపేరే పెట్టేశారు. ఆ అమ్మాయికి ఈరోజు ఉదయమే పెళ్లి సంబంధం వస్తుంది. జొన్నాడ ఉంగరాల వారు సంబంధం అది. బాగా డబ్బున్న వాళ్ళు. అబ్బాయి రావులపాలెం అరటి పళ్ళ గెలల హోల్సేల్ బిజినెస్. 


సరే.. రెండు గంటలకు రెండు కార్ల మీద వచ్చారు వాళ్ళందరూ. వచ్చిన వెంటనే వాళ్లకు స్వాగతం పలికి మండువా లోగిలి లోపలకి తీసుకువచ్చి కుర్చీల మీద కూర్చోబెట్టి మంచి చెడ్డలు అన్ని మాట్లాడుతూ ఫలహారాలు కూడా పెట్టారు. వాళ్లు కోరిన మీదట తన గది లో పెళ్లికూతురు అలంకరణ చేసుకుని కూర్చుని ఉన్న ఝాన్సీరాణిని తీసుకొచ్చి పాతకాలం నాటి ఓ నగిషి వర్కు టేకుచెక్క కుర్చీ మీద కూర్చో బెట్టారు. అందుకు కారణం లేకపోలేదు ఆ మండువా లోగిలిలో ఆకుర్చీ మీద పెళ్లి చూపులకు కూర్చున్న ప్రతి అమ్మాయికి మొదటి పెళ్లి చూపుల సంబంధమే కుదిరిపోయేది. అదిగదన్నమాట అసలు విషయం. 


ఝాన్సీ రాణి తలదించుకుని ఉంది సిగ్గుపడుతూ.. ఆ అమ్మాయికి తన వాళ్ళందరూ నిన్న ఇచ్చిన ట్రైనింగ్ గుర్తుకు వస్తుంది.. అలాఅలా. 


''ఇదిగో తల ఎత్తి చూసి ఎవరిని తల తిక్కగా ప్రశ్నలు వేయమాకు. మగవాళ్లు కనక వాళ్లు సవాలక్ష ప్రశ్నలు వేయవచ్చు. నువ్వు తలవంచుకునే సమాధానం చెప్పాలి. అప్పుడు నిన్ను సాంప్రదాయానికి చెందిన అమ్మాయి అంటారు. లేదంటే నీ మొఖాన మా అందరి ముఖాన ఇంత ఉమ్మి వేసి వెళ్ళి పోతారు. మేము మళ్లీ ఇంకొక సంబంధం చూడాలి అది కాకపోతే ఇంకొకటి.. ఇంకొకటి. అన్ని బాధలు పడలేము. 


మన ఇంట్లో మొత్తం 25 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు ఈ మండువా లోగిలిలోనే ఆ టేకు చెక్క కుర్చీ తోనే పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేసి దిగ్విజయంగా చేశాము. అందరికీ కూడా మొదటి సంబంధం మొదటి సిట్టింగ్ లోనే కుదిరిపోయింది. నీకు కూడా తెలుసు కదా. ఆ విధానం మనకు వార్షికంగా వస్తూ ఉంది. 


ఏదో కాస్తంత చదువుకున్నావని ఎక్కువ చేసావ్ అనుకో నీకు ఈ జన్మకు పెళ్లి అవ్వదు.. మేము మరో సంబంధం చూసి వాళ్లు వచ్చినప్పుడు వాళ్ళను గౌరవించడం మళ్ళీ అక్కడికి వెళ్లి వాళ్ళ స్థితిగతులు చూడడం ఇలా రకరకాల సంబంధాల కోసం ప్రయత్నిస్తూ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఈరోజుల్లో అసలే కష్టం. వయసు పైబడి ఉన్నామేమో మాకు ఓపికలు ఏమీ లేవు. ''


అంటూ నిన్న ఉదయం నుండి ఆ ఇంట్లో ఉన్న మధ్య తలకాయలు చిన్న తలకాయలు బుల్లి తల తల కాయలు ఝాన్సీరాణి కి ఈరోజు మగ పెళ్లివారు వచ్చే వరకు నూరి పోస్తూనే ఉన్నారు.. అదంతా నోటితో కాకుండా బుర్రతో నెమరు వేసుకుంటూ అలా కూర్చునే ఉంది తలవంచుకొని ఝాన్సీరాణి మగపెళ్లి వారి ముందు. 


మాటలు అన్నీ గుర్తుకు వచ్చి తల పైకి ఎత్తితే ఏం జరుగుతుందో అని భయపడి తల పైకి ఎత్తకుండా అలాగే ఉండిపోయింది. 


వచ్చిన మగపెళ్లి వాళ్లు అందరూ స్వీట్లు హాట్లు శుభ్రం గా తిని అమ్మాయిని మాట వరసకు నీ పేరు ఏమిట మ్మా అని ఒక ప్రశ్న అడిగి సంబంధం నచ్చిందని చెప్పే శారు. 


పెద్ద తలకాయ అతను శుభస్య శీఘ్రం అన్నాడు. 


ఇంకేముంది వెంటనే ఝాన్సీరాణి ని లోపలకు వెళ్ళి పోమన్నారు. ఆ పక్షంవాళ్ళు ఈ పక్షం వాళ్లు చాలాసేపు విషయాలు అన్నీ మాట్లాడేసుకుని పంతులు గారిని రప్పించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. 


కార్తీక మాసం మూడో సోమవారం పెళ్లి ముహూర్తం అని వచ్చిన ఆ ఎర్రయ్య సిద్ధాంతి గారి అబ్బాయి చెప్పి చక్క తన తాంబూలం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. 


విరగకాసిన మామిడి పూతలా అంతా బాగానే ఉంది కానీ అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది.. టర్నింగ్ పాయింట్ ఇక్కడే ఉంది. 


మగ పెళ్లివాళ్ళు అందరూ వెళ్ళిపోయాక ఆ రాత్రి వరాలమ్మ నగిషి వర్కు టేకుచెక్క కుర్చీ మీద కూర్చుని తన చెల్లెలు వాళ్ళ ఆడపిల్లలు తన కూతుళ్లు వాళ్ళ వాళ్ళ ఆడపిల్లలు అందరూ చుట్టూ ఉంటుండగా తన గదిలో వ్రాసుకుంటున్న ఝాన్సీరాణి ని పిలిచింది. 


''మనవరాలు ఝాన్సీ తల్లి.. నా ముద్దుల మనవరాల.. అమ్మ.. తల్లి.. మన ఈ పెద్ద కుటుంబంలో నువ్వే ఆఖరి పెళ్లికూతురు. నేను ఒక మాట అడుగుతాను మొత్తం 50 మంది ఆడవాళ్లు చుట్టూరు ఉన్నారు కదా మన కుటుంబంలోని వాళ్ళు.. వీళ్ళందరూ ఎదురుగా ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పాలి.. అదేరా.. అదే నీకు పెళ్ళికొడుకు నచ్చాడా.. '' అంటూ అడిగింది. 


ఆ అమ్మాయి ఏం సమాధానం చెబుతుందో అని అందరూ చుట్టూ చేరి ఆత్రుతగా వింటుండగా ఝాన్సీ రాణి అమ్మమ్మకు బాగా దగ్గరకు వెళ్లి సమాధానం చెప్పకుండా చెయ్యి పైకి ఎత్తి బాగా లాగి ఒక చెంప కాయ కొట్టింది. 


''చంపేస్తుంది బాబోయ్ నా మనవరాలు చంపేస్తుంది రండి బాబోయ్ '' అంటూ గట్టిగా కేకలు పెట్టింది వరాలమ్మ. 


ఆకాశంలో సడన్గా కారు మేఘాలు కమ్ముకున్నట్టు ఆ ఆడవాళ్లు తాలూకా మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లోంచి వర్షాకాలంలో కప్పల వలె బిలబిల మంటూ వచ్చేసి ఝాన్సీరాణి చేసిన పనిని గ్రహించి వాళ్ళ వాళ్ళ పెళ్ళాం ఎక్కడ ఉన్నారో చూసుకుని వాళ్ళ వెనకాతలే వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి మరి నిలబడ్డారు.. అప్పుడు ఆ మండువా లోగిలి లో అక్కడ పెద్ద తిరునాళ్లు జరుగుతున్నట్టుగా ఉంది వాతావరణo. 


''నిండా 20 ఏళ్లు లేవు ఎంత పని చేసింది''


''వయసులో పెద్దది.. అమ్మమ్మ అని ఆలోచించాలి కదా. ఆ ముసలావిడ దవడ మీద లాగిపెట్టి లెంప కాయ కొడుతుందా?''


''అలా కొట్టడానికి ఈ కుర్ర పిల్లకు ఎన్ని గుండెలు?''


''ఇప్పుడు పోనీలే కదా అని ఊరుకున్నాం అనుకో రేపొద్దున మన ఆడవాళ్ళను కూడా ఇలాగే కొడు తుంది'''


''అందుకనే దీనిని ఆ మూల గదిలో పెట్టి మనందరం కలిసి చితగ్గొట్టేద్దాం''


''ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు ఎలాంటి వాళ్ళని బట్టే'''


ఇలా.. కన్న తండ్రి, బాబాయిలు, మావయ్యలు, పెద నాన్నలు సహా అక్కడ వచ్చి చేరిన మగరాయుళ్లందరూ ఎవరికి తోచిన కసిని వాళ్ళు వెళ్ళగక్కేస్తున్నారు. 


''ఏమ్మా, అమ్మమ్మను అసలు అలా దవడ మీద లెంపకాయ ఎందుకు కొట్టావు చెప్పు. అందరూ కోప పడుతున్నారు కదా ఎందుకు కొట్టాలనిపించింది నీకు చెప్పు'' అంటూ ముందుకు వచ్చి కూతుర్ని నిలదీసింది ఝాన్సీరాణి తల్లి. 


ఝాన్సీరాణి తలదించుకోకుండా తలపైకెత్తి వీరనారిలా ఇలా చెప్పింది.. 


''ఊరుకుంటానా.. చెప్తా వివరంగా.. చెప్తా వినండి. నా మీద కేకలు పెట్టిన ఇక్కడ ఉన్న మగాళ్ళ అందరి నోళ్లు మూయిస్తా. ఆడవాళ్ళ నోళ్లు కూడా మూయిస్తా.. ఇక్కడ పెళ్లయిన నాకు పిన్ని వరస అమ్మలు, వాళ్ల కూతుర్లు, పెళ్లి అయిన పెద్దమ్మలు పెద్దమ్మ కూతుళ్లు 25 మంది వరకు ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కరైనా వాళ్ల పెళ్లి చూపుల సమయంలో కాబోయే మొగుడిని తల పైకెత్తి ముందుగా చూశారా లేదా చెప్పండి. 


ముందుగా పెళ్లి అయిపోయినవాళ్ళు తర్వాత పెళ్లి కావలసిన వాళ్లను ఈ నగిషి వర్కు టేకుచెక్క కుర్చీ మీద కూర్చోపెడుతూ ఏమనేవారు.. వచ్చిన సంబంధం బాగానే ఉంది.. బాగానే ఉంది పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు.. బాగానే ఉన్నాడు.. అని మీలో మీరే అనేసుకుంటూ నిర్ణయాలు మీరే తీసేసుకుంటూ పెళ్లికా బోతున్న ఆడపిల్ల మనసును ఏమాత్రం తెలుసుకో కుండా పెళ్లిళ్లు చేసి పడేశారు. 


మన ఖర్మ కాలి మన మొగుళ్ళు ఇలాంటి వాళ్ళు దొరికారు అని మీలో మీరే అప్పుడప్పుడు అనుకుంటుంటే నేను చాటుకుంటా చాలాసార్లు విన్నాను. అలా మీరు మొగుళ్లను పెళ్లి చూపుల్లో చూడకపోయినా పెద్దలను ఎదిరించలేక ఈ ముసలావిడకు భయపడి, సిగ్గుపడుతూ తిరిగి మాట చెప్పలేక ఎలాగోలా పెళ్లిళ్లు చేసుకుని తగలడ్డారు. మీకు నిజంగా పెళ్లి అయిన వాడు నచ్చకపోయినా కొన్నాళ్లు బాధలు పడి కర్మలు అనుభవించి అయి ష్టంగా ఎలాగో మొగుళ్ళతో సెట్ అయిపోతున్నారు. పైగా ఈ వెధవ బోడి ఈ నగిషి వర్కు టేకుచెక్క కుర్చీ అచ్చొచ్చిందట. 


ఇన్నాళ్లు అలా జరిగాక.. ఆ పిచ్చి సాంప్రదాయం అలాగే నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను పెళ్లి చూపుల్లో నాకు కాబోయే మొగుడుని తల పైకెత్తి చూస్తానని ఈ ముసలిది ఎలా అనుకుంది. నీకు మొగుడు నచ్చాడా.. అని.. ఎలా ప్రశ్నించిందీ అంట. అందుకే ఒళ్ళు మండి కోపం వచ్చి అమ్మమ్మ అని చూడకుండా దాని దవడ మీద లాగి లెంపకాయ కొట్టాను.. తప్పా. మా అమ్మమ్మ కదా నా ఇష్టం. '' అంది ఝాన్సీరాణి వీరనారిలాగున. 


ధనాధన్ అంతే.. ఇంచుమించు అక్కడ ఉన్న ఆడం గులు అంతా అదే బాధకు లోనయి తమ తమ మొగు ళ్ళ అష్ట వంకరలని మననం చేసుకుంటూ.. తమతమ మొగుళ్ళ వంక చిరాకుగా, అసహ్యంగా చూస్తూ.. 


''అవును.. మన ఝాన్సీ రాణి చెప్పింది నిజమే. ఈ మొగుళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నామురా బాబు'' అని తమలో తమ గొనుక్కుంటూ.. సరైన మొగుళ్ళని సెలెక్ట్ చేసుకోలేకపోయామే అని నెత్తి బాదుకుంటూ గతం గుర్తుకు తెచ్చుకుంటున్నారు.. పాపం.. 


''లాగి పెట్టి కొడితే కొట్టింది కానీ మన ఆడజాతి హృదయ బాధను విప్పి చెప్పింది మన చిట్టి ఝాన్సీరాణి అనుకుంటూ మిగిలిన ఆడంగులు అంతా ఝాన్సీరాణి ని మనసారా అభినందించి ముద్దు పెట్టుకున్నారు. 


ఎరక్కపోయి ఇరుక్కుపోయాం అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మగరాయుళ్లంతా తోక ముడుచుకుంటూ జారుకున్నారు. 


*****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






29 views0 comments

Comments


bottom of page