అమ్మమ్మ గారి ఇల్లు
- Veluri Sarada

- Apr 18
- 6 min read
#Ammamma Gari Illu, #అమ్మమ్మ గారి ఇల్లు, #Mayukha, #మయూఖ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Ammamma Gari Illu - New Telugu Story Written By Mayukha
Published In manatelugukathalu.com On 18/04/2025
అమ్మమ్మ గారి ఇల్లు - తెలుగు కథ
రచన: మయూఖ
నేను ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి అమ్మ చెప్పింది మావయ్య ఫోన్ చేశాడని, అమ్మమ్మగారిల్లు అమ్మేస్తున్నట్టు చెప్పాడని.. నేను ఒక్క క్షణం షాక్ తిన్నాను. ఆ ఇంటితో తన అనుబంధం ఆ జ్ఞాపకాలు ఏమీ లేకుండా చేసేస్తాడా?
‘అమ్మమ్మతో, తాతయ్యతో తను గడిపిన ఆ మధుర క్షణాలు ఇప్పటికీ తన దగ్గర పదిలంగా ఉన్నాయి’ అనుకుంటూ ఆలోచనల నుంచి బయటపడి,
"ఎందుకు అమ్ముతున్నాడు? ఆ ఇల్లు అమ్మకపోతే మావయ్యకి గడవదా! ఎప్పుడు ఫోన్ చేశాడమ్మా?" అంటూ కోపంగా అన్నాను.
"మీనా! స్థిమితపడు. నీకు ఆ ఇంటితో ఉన్న అనుబంధం నాకు తెలుసు. అయినా మావయ్య అక్కడ ఉండటం లేదు కదా! అందుకని అమ్మేస్తున్నాడేమో" అంది అమ్మ నాకు నచ్చచెప్పుతున్నట్లుగా.
నా ఆలోచనలు అమ్మమ్మ గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి.
***
మేము హైదరాబాదులో ఉండేవాళ్లం. నాన్న ఎ.జి. ఆఫీసులో పనిచేసేవారు. ఎప్పుడూ క్యాంపులకి ఎక్కువ వెళ్లేవారు. నేను, అమ్మ, చెల్లి ఉండేవాళ్ళం. వేసవికాలం వచ్చిందంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది. ఎప్పుడెప్పుడు అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోదామా అని ఉండేది. అప్పుడు నేను ఐదో క్లాసు చదువుతున్నాను. చెల్లి రాధా మూడో క్లాసు చదువుతోంది. మాకు పరీక్షలు అయిపోయిన వెంటనే అమ్మ, చెల్లితో కలిసి అమ్మమ్మగారి ఊరు బయలుదేరే వాళ్ళం.
హైదరాబాద్ నుంచి రాత్రి 9 గంటలకి బస్సు ఎక్కితే మర్నాడు తెల్లవారుజామున రావులపాలెంలో దిగేవాళ్ళం. కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉండేది మా అమ్మమ్మ గారి ఊరు. చాలా పల్లెటూరు.
తాతయ్య సైకిల్ మీద మా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. నాకు ఇష్టమని గుర్రబ్బండి తీసుకువచ్చేవారు. రావులపాలెంలో రిక్షాలు ఉన్నా ఎక్కే వాళ్ళం కాదు.
ఎందుకంటే గుర్రపు బండి అంటే నాకు ఇష్టమని తాతయ్య ముందు రోజే గుర్రపు బండి తాతతో చెప్పేవారు.
"రేపు మా మనవరాలు హైదరాబాద్ నుంచి వస్తోంది బండి కట్టాలి" అని.
ఆ రోజుల్లో హైదరాబాద్ అంటే అంత గొప్ప. నాకు గుర్రాన్ని అదిలించడం అంటే ఇష్టంగా ఉండేది. చెర్నాకోల్ నేనే తీసుకునేదాన్ని.
ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ, పిన్నులు మాకు ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించేవారు. నేను గలగల లాడుతూ మాట్లాడేదాన్ని.
అమ్మమ్మ ఇల్లు చాలా పెద్దది. అటు 3 గదులు, ఇటు మూడు గదులు మధ్యలో పెద్ద పెద్ద హాళ్లు ఉండేవి. వంటిల్లు వెనకవైపు ఉండేది. ముందు పెద్ద ఖాళీ స్థలం ఉండేది, దానిలో పువ్వుల మొక్కలు అందంగా గాలికి ఊగుతూ స్వాగతం పలుకుతున్నట్టు ఉండేవి.
మా అమ్మ పెద్దది. అమ్మ తర్వాత ఇద్దరు పిన్నులు, ఒక మావయ్య ఉన్నారు. అందరూ మమ్మల్ని గారంగా చూసేవారు.
తాతయ్యకి పొలం ఉండేది రెండు ఆవులు కూడా ఉండేవి. ఈ సంవత్సరమే వాటికి చిన్న తువ్వాయి పుట్టిందట. తెల్లగా ఎంత ముద్దుగా ఉండేదో. దాంతో ఆడుకునేదాన్ని.
తాతయ్య మేము ఊరికి వచ్చామంటే ముంజి కాయలు, పనస పళ్ళు తోట నుంచి తెప్పించేవారు. ముంజి కాయలు తాతయ్యే స్వయంగా కొట్టి మాకు స్పూన్ తో తీసి ఇచ్చేవారు. ముంజులని ఒళ్ళు పేలకుండా ఒళ్ళంతా రాసుకొని స్నానం చేసేవాళ్ళం.
పనస పళ్ళు కోసి తొనలు తీసి ఇచ్చేవారు. తోట నుంచి మల్లెపూలు తెప్పించేది అమ్మమ్మ. పెద్ద పిన్ని లక్ష్మి నాకు, చెల్లికి పువ్వుల జడలు కుట్టేది. అమ్మమ్మ ఇంటికి దగ్గరలో కాలువ ప్రవహించేది. సాయంత్రాలు రోజు చిన్న పిన్ని రాజీ మమ్మల్ని కాలువకి తీసుకు వెళ్ళేది.
అమ్మమ్మ "రాజి! పిల్లలు జాగ్రత్త! చెంబు తీసుకువెళ్ళు. గట్టుమీదనే స్నానం చేయించు" అని జాగ్రత్తలు చెప్పేది.
అమ్మమ్మ పొద్దుటే మడి కట్టుకుని దేవుడికి పూజ చేసి, హారతి ఇచ్చేది. గంట శబ్దానికి నేను లేచే దాన్ని. గబగబా హారతి అందుకుంటుంటే అమ్మ కోప్పడేది."పాచి మొహంతో ఏమిటి” అని. కానీ అమ్మమ్మ "పోనీలే చిన్నపిల్ల" అనేది. రాత్రుళ్లు నేను, చెల్లి అమ్మమ్మ దగ్గరే పడుకునే వాళ్ళం. రామాయణం, భారతం కథలు కథలుగా చెప్పేది. వింటూ పడుకునే వాళ్ళం.
రావులపాలెం లో టూరింగ్ టాకీస్ ఉండేది. తాతయ్య గుర్రం బండి తెప్పిస్తే మేము అందరం సినిమాకు వెళ్లేవాళ్ళం. మధ్యలో తినడానికి జంతికలు, చేగోడీలు అమ్మమ్మ పొట్లం కట్టి ఇచ్చేది. తాతయ్యతో కలిసి పొలానికి వెళ్లేవాళ్ళం. అక్కడ బోరింగ్ దగ్గర స్నానాలు చేసేవాళ్ళం.
తాతయ్య మామిడికాయలు కోస్తే అమ్మమ్మ ఆవకాయ పెట్టేది. ఎన్నని చెప్పను? ఎన్నో జ్ఞాపకాలు. రాత్రి నులక మంచం మీద తెల్లటి దుప్పటి పరిచి పడుకునే వాళ్ళ౦. ఆరుబయట చల్లగాలికి ఏ ఎయిర్ కూలర్లు అవసరం ఉండేవి కావు. మేము హైదరాబాద్ వచ్చేస్తుంటే మాకు బట్టలు, తినుబండారాలు, కూరగాయలు, బస్తా బియ్యం పంపేది. నేను వచ్చేటప్పుడు అమ్మమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని.
"ఏడవకు మీనా! మళ్లీ వద్దు గానిలే, దసరా సెలవులకు రండి" అనేది.
కానీ నాన్న వేసవికాలం లోనే పంపించేవారు. సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. అమ్మమ్మతో నా బంధం ఇంకా బలపడిపోయింది. పిన్నులు ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మామయ్య కు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఆఫీసులో పనిచేసే తన కొలిగ్నే పెళ్లి చేసుకున్నాడు.
***
అమ్మమ్మకి పెరాలసిస్ వచ్చిందని తాతయ్య ఫోన్ చేస్తే నేను, అమ్మ వెళ్ళాం. అమ్మమ్మ పరిస్థితి చూసి చాలా బాధపడ్డాం. లేవలేని పరిస్థితిలో ఉంది. మనిషిని పెట్టారు. పెద్ద డాక్టర్లకి చూపిస్తే వయస్సు రీత్యా రికవరీ కావడం కష్టం అన్నారు.
అమ్మమ్మ చివరి మజిలీ వరకు నేను, అమ్మ అక్కడే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అమ్మ వద్దని తాతయ్య దగ్గర మాట తీసుకుంది అమ్మమ్మ.
అమ్మమ్మ లేని ఇంటిలో తాతయ్య ఒక్కరిని ఉంచడం ఇష్టం లేక మాతో పాటే హైదరాబాద్ తీసుకు వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ తాతయ్య ఒప్పుకోలేదు. ‘అమ్మమ్మ భౌతికంగా లేకపోయినా ఆ జ్ఞాపకాలన్నీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి. నేను రాను’ అన్నారు తాతయ్య.
అమ్మ, పిన్నులు వంతులు వేసుకుని ఒకరి తర్వాత ఒకరు తాతయ్య దగ్గర ఉంటున్నారు. మధ్య మధ్యలో నేను కూడా వెళ్లే దాన్ని. అమ్మమ్మ పోయిన రెండు మూడు సంవత్సరాలకే తాతయ్య కూడా అమ్మమ్మ దగ్గరకు వెళ్ళిపోయారు.
తాతయ్య మాట ప్రకారం మామయ్య ఇల్లు అమ్మకుండా ఉంచేసాడు. ఇల్లు శుభ్రం చేయడం అంతా మా పాలేరు చూసుకునేవాడు. వాడే పొలాలు కూడా చూసేవాడు. ప్రతి సంవత్సరం అమ్మ, పిన్నులు అక్కడికి వెళ్లేవారు. అమ్మతో నేను, చెల్లి కూడా వెళ్లేవాళ్ళం. అందుకే ఆ ఇంటితో నా అనుబంధం పెనవేసుకుపోయింది.
******
సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా పెళ్లి, పిల్లలు, నాన్నగారు పోవడం అన్ని ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. అమ్మని నా దగ్గరే ఉంచేసుకున్నాను. ఇన్ని జరుగుతున్నా, అమ్మమ్మ గారి ఊరు వెళ్లడం మాత్రం మానలేదు. నా పిల్లలకి కూడా అలవాటు చేశాను నా అమ్మమ్మగారిల్లు.
అటువంటిది ఇప్పుడు ఇల్లు అమ్మకం విషయం చెప్పేటప్పటికి తట్టుకోలేకపోయాను. మావయ్యకి ఫోన్ చేశాను. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చాను నాకు కోపం వచ్చిందని, అర్థమైంది.
"లేదు మీనా! ఇల్లు అమ్మడానికి కారణం ఇల్లు పాతబడిపోయింది. చుట్టుపక్కల పెద్ద పెద్ద భవంతులు లేచాయి. దాని మధ్యలో మన ఇల్లు చిన్నగా ఉంది. అది కాక ఆ పక్క బిల్డింగ్ వాళ్లు ఈ ఇల్లు కావాలని ఎంతైనా ఇస్తామని నాకు ఫోన్ చేశారు" అన్నాడు మావయ్య.
"ఓహో! అందుకేనా! డబ్బుకు ఆశపడి ఇల్లు అమ్మేస్తానంటున్నావ్ మావయ్యా ! పాడి గేదె వట్టిపోయిందని కసాయి వాడికి అమ్ముతామా! ఇది అంతే! పాత పడిపోయిన, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు మమ్మల్ని ఆ ఇంటి నుంచి దూరం చేయలేవు. నీకు డబ్బు కావాలంటే ఆ ఇల్లు నాకు అమ్మెయి. అంతె తప్ప బయట వాళ్లకు అమ్మకు మామయ్య" అని ఫోన్ పెట్టేసాను.
తరువాత మావయ్య ఏమనుకున్నాడో ఆ ఇంటిని నా పేరు మీద రాసేశాడు. నేను ఆరోజు ఆవేశంతో మావయ్యని అలా అన్నాను కానీ తర్వాత చాలా బాధపడి, "సారీ" చెప్పాను.
నాకు ఆ ఇంటిని ఎలా ఉపయోగించాలి? అని ఆలోచించాను. తరువాత నా ఆలోచనకి ఒక రూపం వచ్చింది. అమ్మని తీసుకుని ఊరు వెళ్లాను. ఊరి పెద్దలతో మాట్లాడి ఏమి చేయాలో చెప్పి, కావలసిన డబ్బు ఇచ్చి వచ్చేసాను.
పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఊరి ప్రెసిడెంట్ సదానందం నాకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులు చెబుతున్నారు. నేను తగిన సూచనలు ఇస్తున్నాను.
పనులన్నీ కంప్లీట్ అయ్యాయని సదానందం గారు నాకు ఫోన్ చేసి చెప్తే, నేను మా పిన్ని లకి మామయ్యకి అన్ని విషయాలు చెప్పి అందర్నీ అమ్మమ్మ గారి ఊరు రమ్మని చెప్పాను.
ఆరోజు రానే వచ్చింది. మేమందరం కలిపి అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాము. ఇంటిముందు పెద్ద బ్యానర్ "సీతారామ గ్రంథాలయం ప్రారంభోత్సవం" అని పెద్దపెద్ద అక్షరాలతో బ్యానర్ వేలాడుతోంది. ఇంటి రూపురేఖలే మారిపోయాయి. అది చూసి మావయ్య ఆశ్చర్యపోయాడు. సదానందం గారు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఊరి పెద్దలు అందరూ వచ్చారు.
యువతి యువకులు కూడా వచ్చారు. ప్రెసిడెంట్ సదానందం గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ "ఊరిలో ఉండి మనం ఎవరూ చేయలేకపోయిన పనిని అమ్మమ్మగారి ఊరు మర్చిపోకుండా ఈ ఊరికే ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో శ్రీమతి మీనా రఘురాం గారు ఎంతో పెద్ద మనసుతో ఈ ఊరి యువతీ యువకులకు ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్ధేశ్యం తో కంప్యూటర్ సెంటర్ ని, గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
దీన్ని మనందరం ఇంకా ముందుకు తీసుకుపోవాలి. వారికి, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు తెలియ జేసుకుంటున్నాను" అంటూ సదానందం గారు మాట్లాడారు. నేను చేసిన పనికి అందరూ ఎంతో మెచ్చుకున్నారు. మావయ్య నాకేసి అభినందన పూర్వకంగా చూశాడు.
అందరం లోపలికి వెళ్ళాం. షెల్ఫ ల్లో పిల్లలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవడానికి కావలసిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, పెద్దవాళ్ళకి కావలసిన రామాయణ, భారతాలు, వివిధ రచయితల పుస్తకాలు అందంగా కనిపిస్తున్నాయి.
కుర్చీలు, టేబుల్స్ ఓ పక్కగా ఉన్నాయి. రెండో గదిలో టేబుల్స్, వాటి మీద కంప్యూటర్లు, కూర్చోవడానికి ఆఫీసు చైర్లు ఉన్నాయి. ఊరిలో పిల్లలు కంప్యూటర్ నేర్చుకోవడం కోసం బయటకు వెళ్ళనవసరం లేకుండా ఇవన్నీ ఏర్పాటు చేశాను. వాటిని అన్ని మేనేజ్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టాను.
నేను ఏవైతే చేయాలనుకున్నానో అన్నీ రూపు దాల్చాయి.
నాకు చాలా తృప్తిగా అనిపించింది. ఈ రూపేణా అమ్మమ్మ గారి ఇల్లు పదిమందికి ఉపయోగపడుతుంది అనుకున్నాను. మిగిలిన పోర్షను అంతా మా ఆధీనంలోనే ఉంది.
పిన్నులు అడిగారు ‘ఇంత డబ్బు ఎక్కడిది’ అని.
"అమ్మమ్మ నాకు ఒక ఎకరం పొలం రాసిందిట. దాని బాపతు డబ్బంతా తాతయ్య తను చనిపోయే ముందు నాకు ఇచ్చారు. అంతవరకు నాకు తెలియదు. అప్పుడే అనుకున్నాను అందరికీ ఉపయోగపడే పని చేయాలని వారి పేరు మీదే ఏదైనా చేయాలని అనుకున్నాను. మావయ్య ఈ ఇల్లు నా పేర రాసినంత మాత్రాన నాది కాదు. మన అందరిదీ. ఈ ఇంటికి హక్కు దారులు మనందరం. ఎప్పటిలాగే అందరం కూడా ఇక్కడికి ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు". అన్నాను.
"మీనా! వారసుడిగా నేను చేయలేని పని మనవరాలి వైనా నువ్వు చేశావు. అమ్మమ్మ తాతయ్యల పేరుని చిరస్థాయిగా నిలబెట్టావ్. అమ్మమ్మ, తాతయ్యలా విగ్రహాలు నేను తయారు చేయిస్తాను. వాటిని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేద్దాం." అన్నాడు మామయ్య.
"అలాగే” అన్నాం సంతోషంగా.
“నేనే కనుక అమ్మేస్తే ఈపాటికి ఇక్కడో బిల్డింగ్ లేచేది. కానీ ఈ ఊరితో మన అనుబంధం తెగిపోయేది. కానీ ఇప్పుడు మన ఇంటి తో ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉన్నాయి. దీనికి కారణం మీనా నువ్వే" అన్నాడు మనస్ఫూర్తిగా.
అందరూ నేను చేసిన పని కి అభినందనలు తెలిపారు. ఇంతకు మీకు చెప్పలేదు కదూ! అమ్మమ్మ పేరు సీత. తాతయ్య పేరు రామారావు. నేను చేసిన పనికి వాళ్లు ఆశీర్వదిస్తున్నట్టుగా చిరుజల్లులు కురిసాయి.
సమాప్తం
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.




Comments