top of page

అమ్మనాన్నలు

#Amma Nannalu, #అమ్మనాన్నలు, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Amma Nannalu - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 23/01/2025

అమ్మనాన్నలుతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


మన అమ్మ.... నాన్నలు నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష దేవతలు.

వారు లేనిదే నేను, నీవు, మనందరం లేము.

అమ్మ... మనలను నవమాసాలు తన గర్భంలో ఎంతో పదిలంగా దాచి, నవమాసాలు నిండగానే మనలను ఈ భూమి మీదకు, పంచభూతాల మధ్యకు తెస్తుంది.

ఆ మహాతల్లిని గురించి ఏమని చెప్పగలం?... ఆ తల్లి తన జీవితకాలంలో మన పట్ల చూపే ప్రేమాభిమానాలను గురించి ఏమని వ్రాయగలం?....


ఇది ఒక తల్లికి మాత్రం సంబంధించిన విషయం కాదు, ప్రతి మాతృమూర్తికీ అతి సాధారణ విషయం. తాను నరకయాతనలను అనుభవించి, మనలకు జన్మనిస్తుంది. తాను పునర్జ్మను పొందుతుంది.


మన వయస్సు ఐదారు మాసాల వరకు తన స్తన్యాన్ని మనకు అందించి ఒడిలో వుంచుకొని సాకుతుంది.


ఆపై... చందమామను, విశాల గగనంలో ఎగిరే వింత వింత పక్షులను చూపుతూ, మాటలు నేర్పుతూ, మనకు గోరుముద్దలు తినిపిస్తుంది. మనలను చూచి మురిసిపోతుంది. మన నాన్న ముఖంలోకి సగర్వంగా ఎంతో ఆనందంతో చూస్తుంది. తల్లి మనకు నవ్వడాన్ని, అమ్మా నాన్న అనే మాటలను నేర్పుతుంది. మనకు ఆది గురువు మన అమ్మే. 


అందుకే హైందవతలో అమ్మా, నాన్న, గురువు ప్రత్యక్ష దేవతలు అన్నారు. మనం దోగాడేటప్పుడు మురిసిపోతుంది. మనం లేస్తూ, పడుతూ నడక సాగించేదానికి ప్రయత్నించేటప్పుడు, తన చిటికెన వ్రేలిని మన చేతిలో వుంచి మనకు నడకను నేర్పుతుంది మన అమ్మ.


ఊయలలో పడుకోబెట్టి మనకు జోలపాటను పాడుతుంది. భుజాన వేసుకొని మన వీపుపై మెల్లగా తడుతూ, జోకొట్టి నిద్రపుచ్చుతుంది. రెండు మూడేళ్ళ ప్రాయాన, మనకు మన పురాణాల మహోన్నత పురుషుల కథలను చెప్పి మంచిని మనకు తెలియజేస్తుంది.


మనకు వయస్సు పెరిగేకొద్దీ, మన వయస్సుకు అవసరమైన వాటిని మన తండ్రికి చెప్పి, మనకు సమకూర్చుతుంది. మనం మన ఇంటి పెద్దలు నానమ్మ, తాతయ్యలు, నాన్న వారి సోదరీ సోదరులు తిన్న తరువాత, మిగిలివున్న వాటితో తన కడుపును నింపుకొంటుంది.


నాలుగైదేళ్ల ప్రాయంలో శుభదినాన మనచేత మన తెలుగు అక్షరాలను పురోహితుల వేద మంత్రోఛ్చారణతో మన అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు అమ్మా నాన్నలు.

అది మొదలు మనం స్కూలుకు వెళతాము. స్కూలు దగ్గరగా వుంటే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాము. ఇంట అమ్మ చేతి భోజనం తిని స్కూలుకు వెళతాము.


సాయంత్రం ఇంటికి రాగానే, మనకు స్నానం చేయించి బట్టలు మార్చి, ఏదో తినిపించి, మన హోంవర్కు ఏమి వుందో చూచి, ఆ వర్కును మన చేత చేయిస్తుంది. రాత్రి భోజనాలు అయిన తరువాత, మన పడకను విదిలించి శుభ్రం చేసి మనలను పడుకోబెడుతుంది.


ఆ వయస్సులో నాన్నగారు మనకు మన తెలుగు నెలల పేర్లు నేర్పుతారు. 


1. ఛైత్రము, 2. వైశాఖము, 3. జ్యేష్టము, 4. ఆషాడము, 5. శ్రావణము, 6. భాద్రపదము,7. ఆశ్వయుజము, 8. కార్తీకము, 9. మార్గశిరము, 10. పుష్యము, 11. మాఘము, 12. ఫాల్గుణము – 


ఈ పన్నెండు నెలలను, మనలను తన ప్రక్కన కూర్చొన బెట్టుకొని, ఒకటికి నాలుగు సార్లు చెప్పి మన చేత పలికించి కొద్దిరోజుల్లోనే, మనం తడబాటు లేకుండా ఏకధాటిగా ఆ పన్నెండు నెలల పేర్లను చెప్పేలా చేస్తారు. నెలల పేర్లే కాదు మన తెలుగు సంవత్సరాల పేర్లనూ నేర్పుతారు. 


1. ప్రభవ 2. విభవ 3. శుక్ల 4. ప్రమోదూత 5. ప్రజోత్పత్తి 6.అంగీరస 7. శ్రీముఖ 8. భావ 9. యువ 10. ధాత 11. ఈశ్వర 12. బహుధాన్య 13. ప్రమాది 14. విక్రమ 15. వృష 16. చిత్రభాను 

17. స్వభాను 18. తారణ 19. పార్ధివ 20. వ్యయ 21. సర్వజిత్తు 22. సర్వధారి 23. విరోధి 24. వికృతి 25. ఖర 26. నందన 27. విజయ 28. జయ 29. మన్మథ 30. దుర్ముఖి 31. హేవిళంబి 32. విళంబి 33. వికారి 34. శార్వరి 35. ప్లవ 36. శుభకృతు 37. శోభకృతు 38. క్రోధి 39. విశ్వావసు 40. పరాభవ 41. ప్లవంగ 42. కీలక 43. సౌమ్య 44. సాధారణ 45. విరోధికృతు 46. పరీధావి 47. ప్రమాదీచ 48. ఆనంద 49. రాక్షస 50. నల 51. పింగళ 52. కాలయుక్త 53. సిద్ధార్ధి 54. రౌద్రి 55. దుర్మతి 56. దుందుభి 57. రుధిరోద్గారి 58. రక్తాక్షి 59. క్రోధన 60. అక్షయ


ఈ అరవై పేర్లు మన తెలుగు సంవత్సరాల పేర్లు.


ఆపై ఋతువులు ఆరు పేర్లు చెబుతారు.

1. వసంత ఋతువు 2. గ్రీష్మ ఋతువు 3. వర్ష ఋతువు 

4. శరత్ ఋతువు 5. హిమంత ఋతువు 6. శిశిర ఋతువు 

ఋతు ధర్మాలు తెలుపుతారు.


1. వసంత ఋతువు - చైత్రమాసం, వైశాఖ మాసం - చెట్లు చిగురించి పూలను పూయును

2. గ్రీష్మ ఋతువు - జ్యేష్ఠమాసం, ఆషాఢ మాసం - ఎండలు మెండుగా ఉండును

3. వర్ష ఋతువు - శ్రావణమాసం, భాద్రపద మాసం - వర్షములు ఎక్కువగా కురియును

4. శరత్ ఋతువు - ఆశ్వయుజమాసం, కార్తీక మాసం - వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉండును

5. హేమంత ఋతువు - మార్గశిరమాసం, పుష్య మాసం - మంచు కురియును. అతి చల్లగా ఉండును. 

6. శిశిర ఋతువు - మాఘమాసం, ఫాల్గుణం మాసం - చెట్లు ఆకులను రాల్చును. 


నా చిన్నతనంలో మా నాన్నగారు నాకు ప్రతిరోజు సాయంత్ర సమయాల్లో, ప్రక్కన కూర్చొనబెట్టుకొని చెప్పేవారు. ఇవేకాదు ఇంగ్లీషు నెలల పేర్లనూ చెప్పేవారు.


ఏ విషయమైనా ఒక వ్యక్తినుండి మరో వ్యక్తి తెలుసుకొనడానికి వినికిడి చాలా గొప్ప సాధనం. పూర్వకాలంలో మన భారతీయ గురుకుల ఆశ్రమాల్లో శాస్త్ర బోధనలు ఆ వినికిడి పద్ధతిలోనే జరిగేవి.

ఆంగ్లపాలన, ఆంగ్ల కాన్వెంట్స్ వచ్చి మన గురుకుల ఆశ్రమాలు బోధనలు నామరూపం లేకుండా పోయాయి.


ప్రతి వ్యక్తికి జీవన విధానం సమస్యగా మారిపోయింది. ఆంగ్లేయుల విధ్యా విధానం శరణ్యం అయింది. ఆ స్థితిలో మనదైన సత్ సంస్కృతి విద్యా విధానం సమసిపోయింది. సంకర విద్య మన పాలైంది. అలాంటి అమ్మా నాన్నలను మనం పెరిగి, మన కాళ్ళమీద నిలబడి, ఒక అతివకు భర్తగా మారిన తర్వాత వృద్ధాప్యంలో వున్న తల్లిదండ్రులను, భార్య మాట విని, నిర్లక్ష్యం చేయడం మహాపాతకం. అనాధ వృద్ధ ఆశ్రమం పాలు చేయడం రాక్షసత్వం. మనకూ ఆ వయస్సు ఒకనాడు వస్తుంది. అప్పుడు మన పిల్లలు మనలను ఎలా చూస్తారో!... అనే భయంతో, మనం మన అమ్మా నాన్నలను వారి వయస్సు మీరిన తరువాత ఆదరాభిమానాలతో చూచుకోవడం మన ధర్మం, కర్తవ్యం, తల్లిదండ్రుల ఋణాన్ని తీర్చుకొన మనకు ఈ జన్మ చాలదు. 

*

"హలో!... సోదరా!... గుడ్ ఈవెనింగ్!....."


వ్రాస్తున్న సుబ్బరాయుడు ఆపి ద్వారం వైపు చూచాడు.

ద్వారం ముందు వెంకు, అతని పూర్తిపేరు వెంకటేశ్వరరావు.


సుబ్బు నవ్వుతూ... "ఒరే, నీవా రారా!... ప్లీజ్ కమ్" అన్నాడు.


వెంకు నవ్వుతూ గదిలో ప్రవేశించాడు.

"కూర్చో సోదరా!... ఏమిటి ఈ ఆకస్మిక ఆగమనం?" చిరునవ్వుతో అడిగాడు సుబ్బు.


వెంకట్ అతని ముందున్న కుర్చీలో కూర్చున్నాడు.

"ఆఁ.... సోదరా!... ఏదో వ్రాస్తున్నట్లున్నావ్?"


"అవును...."


"ఏమిటిది?"


"అమ్మా నాన్నలు... కథ....."


"టైటిల్ సూపర్!...." చిరునవ్వుతో చెప్పాడు వెంకట్.


"అమ్మా నాన్న బాగున్నారా!"


వెంకు వెంటనే జవాబు చెప్పలేదు. అతని మస్తిష్కంలో ఏదో ఆలోచన.

"ఏంటి సోదరా!... అదోలా వున్నావ్?" అడిగాడు సుబ్బు.


"అమ్మా నాన్నలు అయిన సంబంధం అని, మా మేనమామ ముకుందరావు గారి పెద్ద అమ్మాయి కీర్తిని నా మెడకు కట్టారా!... ఆవిడ కాపురానికి వచ్చి నెలరోజులైంది. నాకు మనశ్శాంతి కరువైంది"


"అవునూ!... ఇప్పుడు సమస్య ఏమిటి?"


"చిన్న సమస్య కాదురా!... చాలా పెద్ద సమస్య!"


"ఏమిట్రా అది?"


"కీర్తికి అమ్మ నచ్చలేదురా!"


"నీవు నచ్చావా?"


"అదీ అంతంత మాత్రమే!... వేరు కాపురం పెట్టుకొందామని ప్రతిరోజూ నా ప్రాణం తీస్తూ వుందిరా!"

"అయితే నీవు ఏం చేయాలనుకొంటున్నావ్!"


"ఓరే సుబ్బూ!... ప్రస్తుతంలో నా పరిస్థితి ముందు నుయ్యి!... వెనుక గొయ్యిలా వుందిరా!... అమ్మను ఏమీ అనలేను. కీర్తి మనస్సును మార్చలేని దుస్థితి నాది. నాకేదైనా మంచి సలహా ఇవ్వరా!" అభ్యర్థనగా కోరాడు వెంకట్. 


"వెంకట్!..."


"చెప్పరా!.... నేను చెప్పబోయేది నీకు తెలియని విషయాలు కాదు, తెలిసినవే. నేటి విధ్యా విధానం మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పెద్దల పిన్నల విషయంలో ఎలా నడుచుకోవాలనే విషయాలను పిల్లలకు స్కూళ్ళలో నేర్పించలేరు. అలాంటి పాఠశాలల నుంచి వచ్చిన తల్లిదండ్రులు, పిల్లలకు ఆ విషయాలను గురించి నేర్పడం లేదు. తొంభై శాతం వ్యక్తుల జీవితాలు నేడు ఇంగ్లీషు చదువుకోవాలి, పాస్ కావాలి. ఉద్యోగం సంపాదించుకోవాలి, ప్రేమించుకోవాలి. పెళ్ళి చేసుకోవాలి. ఆలుమగలు ఆనందంగా బ్రతకాలి. అనే మధుర భావన. కొద్ది నెలల్లో ఇరువురి మధ్యన, ఏ విషయంలోనైనా బేధాభిప్రాయం కలిగితే, పెద్దలతో అంటే కన్నవారితో సమస్యను గురించి చర్చించడం, సమస్యా పరిష్కారం చేసుకోవాలనే భావన నేటి యువతలో (ఆడ, మగ) లేదు. స్వతంత్ర అభిప్రాయాలు.


నీకంటే నేనేం తక్కువ?. నేనూ సంపాదిస్తున్నాను నీ తత్త్వం నాకు నచ్చలేదు, విడాకులు తీసుకొందాం అనుకోవడం, విడాకులు తీసుకోవడం, విడిపోవడం సర్వసాధారణమైపోయింది. ఒక పది పదిహేను పర్సంట్ పై రీతిని వ్యతిరేకులుగా, పెద్ద చిన్నల పట్ల గౌరవం, సమస్యను పెద్దలతో చెప్పి పరిష్కరించుకొని... మన సనాతన ధర్మ రీత్యా, మన వివాహ వ్యవస్థను గౌరవిస్తున్నారు. పెద్దల మాటలను విని, సమస్యను పరిష్కరించుకొంటున్నారు. దీనికి కారణం స్త్రీలు మనతో సమానంగా విద్యావంతులు కావడం. పాశ్చాత్య ఆంగ్ల విద్య ఉపాధికి దోహదకారి. కాని, మన జాతి సంస్కృతికి గొడ్డలి పెట్టు. పాశ్చాత్యుల సంస్కృతి, ఇష్టంలేకపోతే విడాకులు తీసుకోవచ్చు.


అతనికి మరొకతె (స్త్రీ నచ్చినచో) ఆమెకు మరొక పురుషుడు (ఆమెకు పురుషుడు నచ్చినచో) వివాహం చేసుకోవచ్చు... అంటే వివాహ వ్యవస్థ అనేది వారికి ఒక వ్యాపారమే. మనకు తరతరాల అనుబంధం... గౌరవప్రదం. రెండు కుటుంబాలను కలిపే సేతువు.... 


"చాలా చెప్పి బోర్ కొట్టించాను కదూ!..." చిరునవ్వుతో అడిగాడు సుబ్బు.


"లేదురా!... చాలా మంచి విషయాలను చర్చించావు"


"నా ప్రసంగాన్ని విన్న తరువాత నీ నిర్ణయం ఏమిటి?"


"నా సమస్యను నేనే పరిష్కరించుకోవాలి!"


"ఏ రీతిగా!"


"దాన్ని గురించే ఆలోచిస్తున్నాను."


"నాకు తోచిన సలహా ఇవ్వనా!" అడిగాడు సుబ్బు.


"చెప్పు...." 


"మీ సమస్యను నీవు నీ తల్లిదండ్రులకు, ఆమె తల్లిదండ్రులకు వివరంగా చెప్పి, నాకు మీ సలహా ఏమిటని అడుగు. ఏ తల్లి తండ్రీ తన కూతురు కాపురం కూలిపోవాలని అనుకోరు. అలాగే ఏ తల్లీ తండ్రీ కోడలి మూలంగా తమ కుమారుని జీవితం నాశనం కావాలని ఆశించరు. మీ సమస్యకు తగినట్లుగా వారు వారి జీవితానుభవ రీత్యా మంచి సలహాను ఇస్తారు. ఇలా కూడా కావచ్చు, నీ తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకొని, మీ ఇరువురి మధ్యన వున్న సమస్యను పరిష్కరించవచ్చు. అంటే... మీ ప్రస్తుత మనోభావాలను అరమరికలు (మీ సొంత ఆలోచనలు) లేకుండా మీ మీ తల్లిదండ్రులకు తెలియజేయడంలో మీ సమస్య పరిష్కారం అవుతుందని నా నమ్మిక వెంకట్!" అనునయంగా చెప్పాడు సుబ్బు.


వెంకట్ మౌనంగా కళ్ళు ముసుకున్నాడు.

సుబ్బు అతని ముఖంలోకి చూచాడు.

తాను అంతవరకు వ్రాసిన మూడుపేజీల కథను జిరాక్స్ తీసి....

"వెంకట్!..."


"ఆఁ...." కళ్ళు తెరిచి అడిగాడు వెంకట్.


"ఈ మూడు కాగితాలు నేను వ్రాసిన కథ. నీవు తెలుగు పండిట్‍వి కదా!.... ఇందులోని విషయాలని నీ పిల్లలకు నేర్పు. వారిని చక్కని హైందవ వారసులుగా చేయి. వారికి తమ తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు పెరిగేలా తీర్చిదిద్దు. 


నేటి పిన్నలు రేపటి భావి భారత పౌరులు. ఒక గురువుగా అది నీ ధర్మం, చక్కటి భావి భారత పౌరులను తయారు చేయడం, నీ ప్రతి శిష్యుడు, నీ మూలంగా తెలుసుకోవాలి, వారి వారి ’అమ్మా నాన్నలు’ ఎటువంటి వారనే విషయం...." సుబ్బు చెప్పడం ఆపాడు.


వెంకట్, సుబ్బు ఇచ్చిన మూడు పేజీలను చదివాడు. పూర్తి అయ్యేసరికి అతని కళ్ళల్లో కన్నీరు.

వెంకట్ ముఖంలోకి చూచిన సుబ్బు....

"వెంకట్!... బాధపడుతున్నావా!...."


"లేదురా!... ఈ నా కన్నీరు ఆనంద భాష్పాలు. నీ కథ నాకు నా సూడెంట్స్ కు మార్గదర్శకం. ధన్యవాదాలు సోదరా!..." చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు వెంకట్.


సుబ్బు లేచి నిలబడి, అతన్ని కౌగలించుకొని.... "నా మిత్రుడివైన నీవు పదిలో పదకొండు కాకూడదు. నీవు అందరికీ స్పెసిమన్స్ మార్గదర్శి కావాలి. దైవాన్ని నమ్ము. అమ్మా నాన్నలను విశ్వసించు నీ సమస్య సమసిపోతుంది. నీ వైవాహిక జీవితం పున్నమి వెన్నెల అవుతుంది. మంచివారిని దేవుడు పరీక్షిస్తాడు. కొంతకాలం, నీలోని సహనానికి అది పరీక్ష, ఆపై నీవు విజయుడివి అవుతావు. త్వరలో నీ సమస్య తీరిపోతుంది వెంకట్" భుజం తట్టి, వెంకట్ ముఖంలోకి ప్రీతిగా నవ్వుతూ చూచాడు సుబ్బు.


"ధన్యవాదాలు సోదరా!...."


"విష్ యు ఆల్ ది బెస్ట్ సోదరా!"


"వస్తాను"


"మంచిది మిత్రమా!"


ఇరువురు వాకిట్లోకి వచ్చారు.


బై చెప్పి వెంకట్ తన స్కూటర్ ఎక్కి వీధిలో ప్రవేశించాడు. క్రొత్త భావాలతో... ఆనందకరమైన ఆశయాలతో....


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


 
 
 

1 Comment


అమ్మ నాన్నలు కథ సి ఎస్ శర్మ గారిది ... చాలా చక్కగా రూపు దిద్దారు. అమ్మ - నాన్న లు ప్రత్యక్ష దైవాలు ... వారిని నిర్లక్ష్యం చేయకూడదు ... అలాగే భార్య ను మరియు పిల్లలను కూడా బాగా చూసుకోవాలి.


ఎలా కలసి ఉండటం? ... అందులోనే కలదు సుఖం కదా!


1) జోక్యం లేకుండా 2) 1 టు 1 సంతోష పూరిత నిర్వహణ+ ఆనంద పూరిత పరిష్కారాల తీరు లో మసలుతూ 3) ఒక్క పుస్తకం పెట్టుకొని లిఖిత పూర్వకంగా సలహాలు ఇచ్చుకోవచ్చు. ఇష్టం ఉంటే స్వీకరించాలి. లేకుంటే వదిలేయాలి, జవాబు ఇవ్వకుండా.


నోటి మాటలు లేనప్పుడు ... జగడాలు, మనస్పర్ధలు ఉండవు కదా!


మరీ మంచిది ఉభయులకు ... పక్క పక్క పోర్షన్ లలో ఉంటే లేక వేరే వేరే గదులలో ఉంటే

...

. దూరంగా ఉంటారు, దెగ్గరగా కూడా ఉంటారు. జగడాలకు తావు అస్సలు ఉండదు.

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page