#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #AmmantePranam, #అమ్మంటేప్రాణం, #TeluguKathalu, #తెలుగుకథలు
Ammante Pranam - New Telugu Story Written By - Vemparala Durgaprasad
Published In manatelugukathalu.com On 09/01/2025
అమ్మంటే ప్రాణం - తెలుగు కథ
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కిషోర్ కొంతమంది మిత్రుల తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు హైదరాబాద్ లో. కిషోర్ ఆ కంపెనీ కి మేనేజింగ్ డైరెక్టర్. అన్ని కీలక నిర్ణయాలు సాధారణం గా అతనే తీసుకుంటూ ఉంటాడు. 18 సంవత్సరాల క్రితం, హైదరాబాద్ వచ్చి ఈ కంపెనీ పెట్టి, అంచెలంచెలుగా ఎదిగాడు. డబ్బు బాగా గడించాడు. ఇప్పుడు అతను సంఘం లో పెద్ద బిజినెస్ మాగ్నెట్. అతని ఆదాయం కోట్ల లో ఉంటుంది.
సువిశాలమయిన తన ఛాంబర్ లో అతను ఆఫీసు పని లో వున్నాడు. అప్పుడే అతని పిన్ని కూతురు సునంద లోపలకి రావడం జరిగింది. సునంద హైద్రాబాద్ లో ఒక ప్రముఖ ఐ. టీ కంపెనీ లో పని చేస్తోంది. ఈ మధ్య ఒక ముఖ్యమయిన ప్రపోసల్ విషయమై, ఆమెని ఈ రోజు తన ఆఫీస్ కి రమ్మనమని చెప్పేడు.
నవ్వుతూ వచ్చి, ఎదురు సీట్ లో కూర్చుంది.
మాట్లాడదామని ముందుకు వంగుతుండ గా టేబుల్ మీద ఫోన్ మోగింది.
"జస్ట్ ఏ మినిట్, అమ్మ కాల్ చేస్తోంది".. అని ఫోన్ తీసేడు.
అవతలి నుండి.. "నాయనా బావున్నావా?" అమ్మ స్వరం.
"అమ్మా, నేను ఇప్పుడే నా ఫోన్ నుండి నీకు చేస్తాను. " అని పెట్టేసాడు. పక్కనే టేబుల్ మీద వున్న బంగారు భరిణ లాంటిది తెరిచి, అందులో పాతకాలపు “నోకియా” ఫోన్ తీసేడు.
సునంద కి ఆశ్చర్యం వేసింది. అంత బిజినెస్ మాగ్నెట్, కిషోర్ దగ్గర 3 ఆపిల్ ఫోన్లు చూసింది, అలాటిది ఈ పాతకాలపు ఫోన్, అది కూడా ఒక బంగారు భరిణ లోనుంచి తీసి మరీ, “ఫోన్ చేస్తాను అనడం” ఏమిటో.. అర్ధం కాలేదు.
కిషోర్ తల్లికి డయల్ చేసేడు. అవతలి నుండి.. " నాయనా ఒక సారి ఇంటికి రావా?" అంది సావిత్రి.
“ఆఫీస్ నుండి అక్కడికే వస్తానమ్మా.. ఇప్పుడు సునంద మా ఆఫీస్ కి వచ్చింది. తనతో ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడాలి. " అన్నాడు.
“పర్వాలేదు రా.. దాన్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చేయ్, ఒకసారి వెంటనే రా.. " అని ఫోన్ పెట్టేసింది సావిత్రి.
కిషోర్ కి అర్ధం కాలేదు. అమ్మ, ఎప్పుడూ ఇలా రమ్మని చెప్పదు, ఇవాళ ఎందుకు అంత తొందరగా వచ్చెయ్యమని అంటోంది” అనుకుంటూ.. సునంద వైపు తిరిగి, “అమ్మ, నిన్ను, నన్ను వెంటనే ఇంటికి రమ్మని అంటోంది..
“పద! ఇంట్లోనే, తీరికగా మాట్లాడుకుందాం " అన్నాడు.
అన్నాక, ఆ చిన్న పాతకాలపు ఫోన్ మళ్ళీ టేబుల్ మీద బంగారు భరిణ లో పెట్టేసేడు. బయటకి వచ్చి, లిఫ్ట్ లో 12 వ అంతస్తు నుండి కిందకి వచ్చి, కార్ ఎక్కేరు. కార్ లో కూర్చోగానే, సునంద ఇంక ఆపుకోలేక అడిగేసింది.
“ఏమిటి కిషోర్ ఇంకా ఆ పాతకాలపు ఫోన్ వాడుతున్నావు, పైగా దానిని ఒక బంగారు భరిణ లో పెట్టి మరీ దాచుకున్నావు.. ఏమిటి దాని ప్రత్యేకత”? అంది.
“ఓహ్ ! అదా.. అది ఒక పెద్ద సెంటిమెంట్ కథ. నీకు తెలియదు కదా. చెప్తాను విను “ అని, ఇలా చెప్పసాగాడు:
“అది 2003 వ సంవత్సరం. అప్పటికి నేను ఇంకా హైదరాబాద్ రాలేదు. విశాఖపట్నం లో ఒక ప్రైవేట్ కంపెనీ లో జాయిన్ అయి 6 నెలలే అయింది. అప్పటికి నేను ఫోన్ కూడా కొనుక్కోలేదు. అప్పుడే నోకియా ఫోన్లు ఎక్కువ గా కొంటూ ఉండేవారు. నాకు ఫోన్ లేదు, ఆఫీస్ ఫోన్ నుండే మాట్లాడేవాడిని. ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేది. ఆరోజు దీపావళి సెలవు అయినా, ఒక ముఖ్యమయిన పని ఉండి ఆఫీస్ లో గడపవలసి వచ్చింది. రాత్రి 8 గంటల వరకు ఉండిపోయాను. 8 గంటలకి బయలు దేరి, ఇంటికి వచ్చేసరికి, అమ్మకి వంట్లో బాగులేదు. ఆవిడ “అనీజీ గా వుంది” అంది. గాస్ ప్రాబ్లెమ్ ఏమో అని అనుమానం వచ్చింది. ఇంట్లో వున్న గాస్ టాబ్లెట్ ఇచ్చి వేసుకో మన్నాను.
వేసుకుని పడుకుంది, కానీ, అరగంట అయిందో లేదో, మళ్ళీ మంచం మీద నుండి లేచి వచ్చి సోఫా లో కూల బడింది. అప్పుడే భోజనం చేసి వచ్చేను నేను. అమ్మని చూస్తే.. ఏదో కడుపులో బాధ పడుతోంది అని అనిపించింది. "ఎమ్మా పడుకోలేదు”.. అంటున్నాను, ఇంతలో ఆవిడ పెద్ద వాంతి చేసుకుంది.
నా భార్య స్వాతి వెంటనే వచ్చి, ఆవిడ మొహం కడిగి, తీసుకుని వచ్చి సోఫాలో కూర్చో బెట్టింది. “ అత్తయ్య గారిని ఒక సారి హాస్పిటల్ కి తీసుకెళ్లండి..” అంది. పొద్దున్న తిన్న పిండివంటలు అరిగినట్లు లేవు అనుకున్నాను.
పైగా ఆ రాత్రి డాక్టర్లు వుంటారా అని నా అనుమానం. “సరే.. చూద్దాం” అని, ఆవిడని తీసుకుని, నా స్కూటర్ మీద ఎంవీపీ కాలనీ లో ఒక చిన్న హాస్పిటల్ తెరిచి ఉంటే, తీసుకుని వెళ్లేను. ఆ రోజు పండగ రోజు కావడం తో పెద్ద డాక్టర్లు లేరు హాస్పిటల్ లో. ఒకే ఒక జూనియర్ డాక్టర్ వున్నాడు.
డాక్టర్ అమ్మని చూస్తూనే, ఈసీజీ తీయాలని అన్నాడు. నాకు అప్పటికి అంత అవగాహన లేదు, పైగా, అది రొటీన్ అనుకున్నాను. వెంటనే ఈసీజీ తీసేడు డాక్టర్. మా అమ్మకి పరీక్ష చేసేక, నన్ను లోపలికి పిలిచేడు.
"ఇప్ప్పుడు ఆవిడకి హార్ట్ అటాక్ నడుస్తోంది. ఇక్కడ మాకు సరి అయిన ఎక్విప్మెంట్, ఫెసిలిటీస్ లేవు. ఆవిడ కి విషయం చెప్పకుండా.. వెంటనే అపోలో లాంటి పెద్ద హాస్పిటల్, కి తీసుకెళ్లి పోండి.. ఆలస్యం చేస్తే ప్రమాదం “ అన్నాడు.
నాకు ఎటూ పాలు పోలేదు. పైగా ఇంకో మాట చెప్పేడు.. “ఇప్పుడు ఆవిడని ఆటో లో కాకుండా, మెత్తటి సీట్లో కార్లో తీసుకుని వెళ్ళండి, నెమ్మదిగా డ్రైవ్ చెయ్యండి" అన్నాడు.
“అప్పటికి నీకు కారు కూడా లేదేమో?” మధ్యలో కల్పించుకుని ప్రశ్నించింది సునంద.
"అవును. నాకు కారు లేదు, కనీసం డ్రైవింగ్ రాదు.. ఆ క్షణం నాకు పిచ్చెక్కి నట్లు అయిపోయింది. హాస్పిటల్ బయట టాక్సీలు కూడా లేవు. అమ్మని వదిలి బయటకి వెతుక్కుంటూ వెళ్ళలేను. ఇంతలో నాకు ఆలోచన వచ్చింది. మా ఎదురు ఫ్లాట్ లో వాళ్లకి కార్ వుంది. ఎదురు ఇంటి ఆవిడ స్వప్న గారు కార్ నడుపుతారు. వెంటనే ఇంటికి ఫోన్ చేయాలని చూస్తే, హాస్పిటల్ లో ల్యాండ్ లైన్ పాడయిందిట. అప్పుడు ఆ జూనియర్ డాక్టర్ గారి ఫోన్ తీసుకుని ఇంటికి మాట్లాడేను”.
“స్వాతి కి విషయం చెప్పి, స్వప్న గారిని తీసుకుని కార్ లో హాస్పిటల్ కి రమ్మనమని చెప్పేను. పది నిముషాల లో, ఆవిడ కార్ లో హాస్పిటల్ కి వచ్చేరు. స్వాతి, మా పిల్లలు ఇద్దర్నీ వాళ్ళ ఇంట్లో పడుకో బెట్టి, ఆవిడ తో వచ్చింది.
ఆవిడ కార్ లో అపోలో హాస్పిటల్ కి వెళ్ళేము. అమ్మకి వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చి, ICU లో చేర్చేరు.
కార్డియాలిజిస్టు వచ్చి, ‘సమయానికి తీసుకుని వచ్చేమని, లేకుంటే ఆమె దక్కేది కాదు’ అని చెప్పేరు. అయితే 24 గంటలు పరిశీలించాలి, తప్పదు అన్నారు. ఆ రాత్రి భారంగా గడిచింది. భగవంతుడి దయ వలన, ఆమె బతికింది. నీకు తెలుసుకదా.. అమ్మ అంటే నాకు ప్రాణం. ఈ 20 ఏళ్ళూ అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను.. " అని ఆపేడు. కిషోర్.
“ఇంతకీ ఆ ఫోన్ గురించి”.. అని ఆగిపోయింది సునంద..
“ఆ అక్కడికే వస్తున్నాను. ఆ ఫోన్ ఏదో కాదు, ఆ జూనియర్ డాక్టర్ గారి ఫోన్.. ఆరోజు ఆ ఫోన్ వల్లనే అమ్మని సకాలం లో అపోలో కి తీసుకెళ్లగలిగేను. అదే మా అమ్మని మృత్యువు నుండి కాపాడింది. మరునాడు, ఆ డాక్టర్ గారికి, పళ్ళు పట్టుకెళ్లి ఇచ్చి, థాంక్స్ చెప్పేను.
సందేహిస్తూ.. " మీరు ఏమీ అనుకోక పొతే, మీ ఫోన్ నాకు కావాలి మీకు యెంత ఇమ్మన్నా ఇస్తాను, అది, నాకు సెంటిమెంటు గా నా దగ్గర ఉంచుకుంటాను " అని అడిగేను.
ఆయన ముందు ఆశ్చర్య పోయినా, సెంటిమెంట్ అర్ధం చేసుకుని, ఆ ఫోన్ రేట్ మాత్రమే తీసుకుని నాకు ఇచ్చేసేరు.
అదీ సంగతి. అప్పటి నుండి, అది నా దగ్గర భద్రం గా వుంది. అమ్మతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఆ ఫోన్ లోనే మాట్లాడుతాను. అది నాకు తృప్తి”.. అని ముగించాడు కిషోర్.
ఇంతలో సునంద ఫోన్ మోగింది.
"హలొ”.. అంది.
"ఆంటీ.. మీరు నాన్న తో వస్తున్నారు కదా”.. స్వీటీ గొంతు అవతలి వైపు. స్వీటీ అంటే కిషోర్ కూతురు.
"అవునమ్మా.. నేను మీ నాన్న తో వస్తున్నాను.. ఏమిటి మీ మామ్మ అంత తొందర పెడుతుంది మీ నాన్న ని " అంది చాలా మామూలు గా. " మీరు యెంత వరకూ వచ్చేరు?" అంది స్వీటీ.
“మీ వీధి లోకి కారు తిరుగుతోంది” అంది సునంద.
“అమ్మయ్య.. వచ్చేసేరు కదా.. నాన్నకి చెప్పకండి. ఇందాక మాట్లాడింది మామ్మ కాదు.. నేనే. నేను మిమిక్రీ చేస్తాను మీకు తెలుసు కదా. ”
“నాన్న తట్టుకోలేని విషయం జరిగింది.. అందుకే, మీరు కూడా తోడు ఉంటారని రమ్మన్నాను. ఇక్కడ నాన్న ని చూసుకోవడానికి ఫామిలీ డాక్టర్ గారు కూడా సిద్ధంగ వున్నారులే.. " ఆ మాటలు అంటున్నప్పుడు స్వీటీ గొంతు వణకడం, ఏడుపు ఆపుకోవడం అర్ధం అవుతున్నాయి సునందకు.
ఆమె కి గాభరా వేస్తోంది. ఇంతలో బంగాళా లోకి కార్ ప్రవేశించింది. కార్ దిగిన కిషోర్ ని స్వాతి ఎదురు వచ్చి పట్టుకుంది. నౌకర్లు, పని వాళ్ళు పోర్టికో లోనే నుంచుని తన కోసం ఎదురు చూడడం అతను గమనించేడు. ఏదో మనసు కీడు శంకించింది అతనికి. గాభరాగా.. “ఏమైంది.. స్వాతి! అమ్మ త్వరగా రమ్మంది?” అంటున్నాడు.
అతని చెయ్యి పట్టుకుని, లోపలికి తీసుకెళ్లింది. హాల్ లో దివాను మీద పడుకో బెట్టి వుంది సావిత్రమ్మ గారి పార్థివ శరీరం. ఫ్యామిలీ డాక్టర్ కూడా అక్కడే వున్నాడు. తల్లిని ఆ స్థితి లో చూస్తూనే, తల్లడిల్లి పోయాడు కిషోర్.
“ఎలా జరిగింది”.. ప్రశ్నించాడు. అతని గొంతు బొంగురు పోయింది.
"ఆమె కి ఇన్నాళ్ళకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. ఈ సారి పెద్దగా వచ్చింది. మనకి సమయం దక్క లేదు." అన్నాడు డాక్టర్.
సోఫాలో కూలబడి పోయాడు కిషోర్. డాక్టర్ కిషోర్ కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. స్వీటీ అతని భుజం మీద చెయ్యి వేసి, సోఫాలో పక్కనే కూర్చుంది. స్వాతి మంచి నీళ్లు ఇచ్చి, అతన్ని ఊరుకో బెట్టే ప్రయత్నం చేస్తోంది.
సునంద కి ఆ దృశ్యం చూసి మనసు చలించి పోయింది, దుఃఖం ఆగలేదు. పిన్ని పార్థివ శరీరం పక్కనే కూలబడింది.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.
దుర్గ ప్రసాద్ గారి "అమ్మంటే ఇష్టం" కథ కళ్ళలో నీళ్ళు తెప్పించాయి.
అమ్మ ఎవరికైనా అమ్మే ... నిస్వార్థ సేవకురాలు ... అంటూ ఉద్భోదించింది.
హాట్స్ ఆఫ్.
P V Padmavati Madhu Nivriti