అమృత వర్షం
- Vagumudi Lakshmi Raghava Rao
- Dec 25, 2024
- 11 min read
#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Supushta, #సుపుష్ట,#TeluguMythologicalStory, #ఊర్వశీపురూరవులకథ

ఊర్వశీపురూరవుల కథ
Amrutha Varsham - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 25/12/2024
అమృత వర్షం - తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
త్రేతాయుగం అనగానే మనకు శ్రీరామ చంద్రుడు గుర్తుకు వస్తాడు. శ్రీరామ చంద్రుడు అనగానే ‘శ్రీరాముడు చెట్టు చాటునుండి వాలిని చంపాడు. సీతను అగ్ని ప్రవేశం చేయమన్నాడు. నిండు గర్భవతిగా అయిన సీతమ్మ ను అడవికి పంపాడు. అమానుషం గా శంబూకుని సంహరించాడు. ఆడదైన యక్ష రాక్షసిని చంపాడు. శూర్పణఖ ముక్కూ చెవులూ కోయించాడు’ వంటి విషయాలు గుర్తుకు వస్తాయి.
అయితే త్రేతాయుగంలో ధర్మం మూడు కాళ్ళ మీద నడుస్తుంది. మూడు కాళ్ళ ధర్మం లో జన్మించిన శ్రీరామ చంద్రుడు యుగ ధర్మం ప్రకారం సంచరించాడు అనే విషయం మాత్రం గుర్తుకు రాదు. అలాగే వన వాసం పూర్తి చేసుకుని సకాలంలో అయోధ్య కు రాకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని భరతుడు శ్రీరామ చంద్రుని తో అన్నాడు.
అలాగే శరంబంగ మహర్షి వంటి మహర్షులు అగ్ని ప్రవేశం చేసారు. అసలు ఆ కాలంలో అగ్ని ప్రవేశం అంటే ఏమిటి అనే విషయాలు కూడా గుర్తుకు రావు.
త్రేతాయుగం ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన సత్య యుగం కాదు అనే విషయం కూడా గుర్తుకు రాదు. ఏదేమైనా ధర్మం మూడు పాదాల నడిచిన త్రేతాయుగంలో జరిగిన కథ ఊర్వశీపురూరవులు.
త్రేతాయుగం లో ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని పురూరవుడు అనే రాజు పరిపాలించేవాడు. సమస్త లోకాలలో అతనిని మించిన అందగాడు లేడని అందరితో పాటు దేవతలు కూడా అనుకునేవారు. అతని పరాక్రమానికి అతని పరాక్రమమే సాటి అని సుర నర యక్ష కిన్నెర రాక్షసాది వీరులు ధీరులు అనుకునేవారు. అతని అందాన్ని ఉన్నది ఉన్నట్లుగా చిత్ర పటం లో చిత్రించాలని నరసురాది
చిత్రకారులు అందరూ ప్రయత్నించారు. కానీ అది ఎవరికీ సాధ్యం కాలేదు.
అతడు యుగ ధర్మాన్ని అనుసరించి లెక్క లేనన్ని అశ్వమేధ యాగాలను చేసాడు. అహంకారం ప్రదర్శించే రాజుల అహాన్ని మట్టి కరిపించాడు. మంచి మానవత్వం ఉండి, ప్రజలను కన్న బిడ్డల వలే చూసుకునే రాజులను సోదరుల కంటే మిన్నగా చూసుకున్నాడు. వారు "మేం పేరుకు సామంత రాజులమే గానీ నిజానికి మేం పురూరవుని ఆరవ ప్రాణం" అనుకునేటట్లు ప్రవర్తించాడు.
ఇలా పురూరవుడు భూమండలం మొత్తాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. భూమండలం తో పాటు పదమూడు ద్వీపాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తన ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో నివసించే నిరుపేదల కష్టసుఖాలను తెలుసుకుని వారికి తగిన సహాయ సహకారాలు అందించాడు. తను పుట్టిన పురు పర్వతం మీద వేద పాఠశాలను, లౌకిక విద్యలను నేర్పించే పాఠశాలలను, వైద్య శాలలను, మనుషుల మనో గతాలను అనుసరించి వారి సామర్థ్యాలను పెంచే విద్యాలయాలను నిర్మించాడు.
పురూరవుడు తన అవక్ర పరాక్రమంతో సంపాదించిన సంపాదన సమస్తాన్ని తన రాజ్యంలోని వారందరు సమానంగా పంచుకోండి అని అన్నాడు. సంపదను సమానంగా పంచవలసిన బాధ్యతను తన రాజ్యంలోని కొందరు బ్రాహ్మణులకు అప్పగించాడు. నిరు పేదలకు, నిర్భాగ్యులకు యుగ ధర్మానుసారం కొంచెం ఎక్కువ ధనం ఇవ్వమనీ బ్రాహ్మణులకు చెప్పాడు.
అందుకు ఆ బ్రాహ్మణులు, "రాజా పురూరవ! అవసరమైతే నిరుపేదలకు మా ధనం కూడా ఇచ్చేస్తాం" అన్నారు.
బ్రాహ్మణుల మాటలను విన్న పురూరవుడు మిక్కిలి సంతోషించాడు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం లా పురూరవుని రాజ్యం లో ప్రతి రోజూ ఏదో ఒక వేడుక జరుగుతుండేది. అతని రాజ్యం లో యజ్ఞ యాగాదులు విస్తృతంగా జరిగేవి. శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులను జరిపించిన ఋషులు, వేద పండితులు సంతృప్తి గా జీవించడానికి కావలసిన ధనకనకవస్తు వాహనాలను పురూరవుడు వారికి పుష్కలంగా సమకూర్చాడు. యజ్ఞ యాగాదులకు కావలసిన సరకులను, గజతురగాదులను, గోవులను సమకూర్చిన వారికి సహితం పెద్ద ఎత్తున సకల సంపదలను సమ కూర్చాడు.
నిరుపేదలను ఆదుకున్న ఋషులను వేద పండితులను పురూరవుడు తానే స్వయంగా పెద్ద ఎత్తున సన్మానించాడు. యజుర్వేద పురుష వదన రూపమైన మేకలను సంరక్షించే వారిని ప్రత్యేకంగా గౌరవించాడు. వారికి కావలసిన సకల సదుపాయాలను సమకూర్చాడు. " సా విశ్వాయుః.. సా విశ్వ కర్మా.. సా విశ్వధాయాః" అంటూ శుక్ల యజుర్వేద మంత్రముల లోని వర్ణాలను ఉదాత్తానుదాత్తాది స్వరాలతో గణిత బద్దంగా ఉచ్చరించే వారికి ప్రత్యేక ప్రయోగ శాలలను నిర్మించి ఇచ్చాడు. అప్పుడప్పుడు తను కూడా ప్రయోగ శాల లకు వెళ్ళి కొత్త విషయాలను నేర్చుకో సాగాడు.
పురూరవుడు తన రాజ్యంలో ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హ్యపత్యం అనే త్రేతాగ్నులు పరిపూర్ణ తేజస్సు తో లేవని గమనించాడు. త్యాగ గుణం నిమిత్తం అవి తప్పక ఉండాలనుకున్నాడు. పవిత్ర తేత్రాగ్నులను తీసుకు రావడానికి పురూరవుడు గంధర్వ లోకం బయలు దేరాడు. మార్గ మధ్యంలో పురూరవునికి కొందరు సాధువులు కనపడ్డారు.
వారు ఒక్కొక్కరు ఒక బంగారు పాత్రను పురూరవునికి ఇస్తూ, "రాజా ! ఇవి అక్షయ బంగారు పాత్రలు. వీటిని స్వీకరించి సుఖంగా ఉండు. నీ గంధర్వ లోక పయనం ఆపు. "అని అన్నారు.
పురూరవుడు వారు సాధువులు కాదని, త్యాగ గుణ కంటకులు అని గ్రహించాడు. వెంటనే వారు ఇచ్చిన బంగారు పాత్రలను వారి ముఖం వైపుకే విసిరి కొట్టాడు.. బంగారు పాత్రలు మండుతున్న మంటలు గా మారి సాధువుల ముఖాలను మాడ్చి వేసాయి. పురూరవుడు, సాధు రూపంలో వచ్చినవారు తన ప్రయత్నానికి అడ్డుపడే దుష్ట శక్తులు అని గ్రహించాడు.
మాడిన ముఖాలతో దుష్ట శక్తులు మాయమై పోయాయి. అంత పురూరవుడు గంధర్వ లోకము నుండి త్రేతాగ్నులను తీసుకుని వచ్చాడు. యజ్ఞ శాలకు తూర్పు వైపున ఉండే ఆహవనీయ గుండం విషయంలో అత్యంత శ్రద్ద తీసుకోమని ఋషులకు, వేద పండితులకు చెప్పాడు. తన రాజ్యంలో యజ్ఞ శేషము ను భుజించు అమృతాశులు అధికంగా ఉండాలని మహర్షులకు సూచించాడు.
పురూరవుడు త్రేతాగ్నులను తీసుకువచ్చే సందర్భంలో రంభ మేనక త్రిలోత్తమాదులతో ఉద్యానవనం లో సంచరించే ఊర్వశి మొదటిసారి గా త్రేతాగ్నులలో ప్రకాశించే పురూరవుని చూసింది. పురూరవుని చూడగానే ఊర్వశి లోని అందం ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అయ్యింది. ఆమె ఆలోచనల్లో ఇల్లాలి తనం, మాతృత్వం అధికం కాసాగాయి. ఆమె నర్తన లో అయిదవ తనం గల ఇల్లాళ్ళ హావభావాలు అధికం కాసాగాయి.
ఆ హావభావాలను చూసిన దేవేంద్రుడు ఇంద్ర సభ లో ఆమెకు మహోన్నత స్థానాన్ని ఇచ్చాడు. ఊర్వశి తనకు మహోన్నత స్థానం సంక్రమించినప్పుడు "ఇదంతా పురూరవ దర్శన భాగ్యం" అని మనసులో అనుకుంది.
నారాయణుని ఊరువుల నుండి జన్మించిన తన జన్మ మరింత పవిత్రమైనది అని అనుకుంది.
పురూరవుని చూసిన ఊర్వశి, "ఇతడు సామాన్యుడు కాదు. మహారాజు లను మించిన మహారాజు. ఘన రాజులను మించిన ఘన రాజు. సురులను మించిన సురుడు. " అని మనసులో అనుకుంది.
క్రమం తప్పకుండా శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులను విస్తృతంగా నిర్వహించే పురూరవుని తో అనేకమంది దేవతలు స్నేహ సంబంధాలను పెంచుకున్నారు. యజ్ఞ దేవతలందరూ సంతృప్తిగా హవిస్సులను అందుకున్నారు.
వైకుంఠం లో, కైలాసం లో, బ్రహ్మ లోకం లో, తదితర లోకాలలో దేవతల నడుమ అప్సరసల నడుమ వచ్చిన చిన్న చిన్న సమస్యలకు పురూరవుడే తగిన పరిష్కారాన్ని చూపించి సమస్త లోకాల దేవతల మన్ననలను పొందాడు.
ఒకసారి బ్రహ్మ లోకం లో బ్రహ్మాభారతులు, ‘సృష్టించడం గొప్ప విషయమా? సృష్టి లోని జీవరాశులకు జ్ఞానం ప్రసాదించడం గొప్ప విషయమా?’ అన్న విషయం మీద తగవులాడుకున్నారు. వారి తగాద చివరికి చిన్నపాటి యుద్దం అయ్యింది.. ఈ విషయం పురూరవునికి నారదుని ద్వారా తెలిసింది.
అప్పుడు పురూరవుడు బ్రహ్మ లోకం వెళ్లి, "జ్ఞానం లేని సృష్టి అల్లకల్లోలమై అనుక్షణం రక్త సముద్రం అవుతుంది. సృష్టి శృతి మించకూడదు. జ్ఞానం వెర్రి తలలు వెయ్యకూడదు. " అని పురూరవుడు బ్రహ్మ భారతులకు చెప్పాడు.
26 కలియుగంలో శృతి మించిన సృష్టి చక్రం గురించి, వెర్రి తలలు వేసిన జ్ఞానం గురించి బ్రహ్మ భారతులకు పురూరవుడు చెప్పాడు. పురూరవుని మాటలను విన్న బ్రహ్మ భారతులు పురూరవుని పలు విధాలుగా మెచ్చుకున్నారు.
అమలిన జ్ఞాన చక్రాన ప్రకాశిస్తూ బ్రహ్మ భారతుల మెప్పును పొందే పురూరవుని ఊర్వశి రెండవ సారి చూచింది. అప్పుడు పురూరవుడు ఊర్వశి హృదయంలో సుస్థిరంగా నిలిచి పోయాడు. ఊర్వశి తన అంతఃపురంలో శయనించినప్పుడు ఆమె హృదయం లోని పురూరవుడు ఆమె శయనం మీదకు వచ్చాడు. ఆమె అధరాలను నిమిరి అమృతం కురిపించాడు.
ఊర్వశి పురూరవునే తలచుకుంటూ ఇంద్ర సభకు సహితం వెళ్ళడం మానేసింది. అది తెలిసిన ఇంద్రుడు ఊర్వశి మందిరం నకు వచ్చి పురుషోత్తమ నృత్యం చేయమన్నాడు.
ఊర్వశి పురుషోత్తమ అని ప్రారంభించి పురూరవ అంటూ శతప్రశంస పురూరవ నృత్యం చేసింది. దేవేంద్రుడు ఊర్వశి మనసును గ్రహించాడు. ఊర్వశి పురూరవుని మనసులో నిలుపుకోవడానికి విధాత రాత లో ఏదో ప్రత్యేకత ఉంది అనుకున్నాడు. కడకు కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అనుకున్నాడు.
ఒకనాడు ఊర్వశి, రంభ, మేనక, త్రిలోత్తమాదులతో కూడి ఉద్యానవనం లో ఉంది. ఊర్వశి రంభ కు పురూరువుని రూపం గురించి పలు విధాలుగా వర్ణించి చెప్పసాగింది. అప్పుడు అందమైన యువతుల వెంట్రుకల కోసం వచ్చిన కేశిన్ అనే మాంత్రిక రాక్షసుడు ఊర్వశిని చూసాడు.
సృష్టి లో యజుర్వేదం లేకుండా చేయాలని కేశిన్ అనే మాంత్రికుడు అనేక మేకలను క్షుద్ర దేవతలకు బలి ఇచ్చాడు. యజుర్వేద పురుషుడి బొమ్మను అప్సరసల వెంట్రుకలతో కట్టాలని క్షుద్ర దేవత అనడంతో కేశిన్ అక్కడకు వచ్చాడు. అప్సరసల వెంట్రుకలను అపహరించాలని అనుకున్నాడు.
ఊర్వశిని చూడగానే కేశిన్. ఆలోచనా సరళి మారింది. కేశిన్ క్షుద్ర పూజకు మంగళం పాడి ఊర్వశి ప్రేమలో మునిగి పోయాడు. ‘ఊర్వశి నా ప్రేయసి నువ్వే నా ప్రాణం, నేనే నీ హృదయ రూపం’ అంటూ ఊర్వశి నామం జపియించ సాగాడు.
పురూరవుని పక్షపాత రాహిత్యానికి, అతని నిజాయితీకి మిక్కిలి సంతసించిన కొందరు రాక్షసులు కూడా అతని అనుచరులు అయ్యారు. యుగ ధర్మం తప్పని రాక్షసులకు సహితం పురూరవుడు తన సహాయ సహకారాలను అందించాడు.
అప్పుడప్పుడు దేవతలు రాక్షస సంహారం నిమిత్తం పురూరవుని సహాయం కోరేవారు. పురూరవుడు యుగ ధర్మం తప్పిన రాక్షస సంహారం నిమిత్తమే దేవతలకు సహకరించేవాడు. యుగ ధర్మం తప్పిన రాక్షసులనైన సరే దేవతలనైన సరే పురూరవుడు కఠినంగా శిక్షించేవాడు.
ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునే పురూరవుడు నిరుపేదల పాలిట దేవుడు అయ్యాడు. పురూరవుడు నిరుపేదలు తప్పు చేసిన ఊరుకునేవాడు కాదు. "ప్రతి మనిషి తన శక్తి మేర ఏదో ఒక పని చేయాలనేవాడు. మనిషికి నిద్రలేమి మంచిది కాదనే వాడు.. ఓంకార జపము లో ఔషద గుణం ఉందనే వాడు. అందరితో కలిసి జీవించాలి అనేవాడు.
ఎవరైనా సరే తమ శక్తి మేర ఆరోగ్య నిమిత్తం యాగం చేయించాలి అనేవాడు. పౌర్ణమి నాడు చేసే పూర్ణ యాగం, అమావాస్య రాత్రి చేసే దర్శ యాగం ఇంకా తదితర యాగాల గురించి తనకు తెలిసింది ప్రజలందరికి చెప్పేవాడు. యజుర్వేద పఠనం ద్వారా గణిత జ్ఞానం వికసిస్తుందనేవాడు. చీకటి వెలుగుల జీవన గమనాన్ని విధాత రాతకు అనుకూలంగా చూపించేవి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అనేవాడు.
ఒకసారి పురూరవుడు వైకుంఠం లో కలిసిన సమస్త దేవ బృందం ను దర్శించుకుని తిరిగి వస్తుండగా, ఊర్వశి అతని కంటపడింది. అప్పుడు అతని మనసులో నారాయణుని ఊరువులు మెదిలాయి. మహోన్నత ఉషస్ లో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అతని మనసులో కదలాడాయి. అప్రయత్నంగా అతని పెదవుల నుండి ఓం కేశవాయ స్వాహ అంటూ మంత్ర శ్లోకాలు ఉద్భవించాయి. అటు పిమ్మట ఊర్వశి రూపం అతని మనసులో నిలిచిపోయింది.
పదే పదే మనసులో కదలాడే ఊర్వశి రూపం మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ, ఊర్వశీ ఊర్వశీ అంటూ పురూరవుడు అంతఃపురంలో అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. ఈ విషయం అవకాశవాదులైన కొందరు బ్రాహ్మణ పండితులకు తెలిసింది. వారు పురూరవుని మనసుని, అతని మనసులోని ఊర్వశి రూపాన్ని రకరకాలుగా వక్రీకరించి వర్ణించారు. ఈ విషయం కుల గురువు వశిష్ట మహర్షి ద్వారా పురూరవునికి తెలిసింది.
అప్పుడు పురూరవుడు కుల గురువు వశిష్ట మహర్షి తో, "దేవ వశిష్ట మహర్షి.. ఊర్వశి నా మనసున కేవలం అప్సరస గా కాకుండా యజుర్వేద తేజంతో నారాయణ ఊరు తేజంతో నిలిచింది అన్నది ముమ్మాటికీ నిజం. అయితే కేవలం ఒక స్త్రీ వ్యామోహ తేజం లో పడి నేను రాజ్య పరిపాలనా బాధ్యతను విస్మరించేటంతటి అవివేకిని కాదు" అని అన్నాడు.
ఒకనాడు ఒక నిరుపేద పురూరవుని అంతఃపురంలో పురూరవుని కలిసాడు. నిరుపేదను విషయం ఏమిటని పురూరవుడు అడిగాడు. అప్పుడు ఆ నిరుపేద, "రాజా! బ్రాహ్మణులకు మీరు పంచమని ఇచ్చిన సంపదను పూజలు, వ్రతాల పేర్లతో వారే ఉంచి వేసుకుని, మా ముఖాన ఎంగిలి మెతుకులు వేస్తున్నారు. అదేమంటే ఇది అంతే అంటున్నారు. మా నిరుపేదలకు మీరే న్యాయం చెయ్యాలి. " అని అన్నాడు.
నిరుపేద మాటలను విన్న పురూరవుడు మంత్రులనూ, ఊరి పెద్దలను పిలిపించి నిరుపేద మాటలలో నూటికి నూరు శాతం నిజం ఉందన్న విషయాన్ని తెలుసుకున్నాడు. అంత కత్తి పట్టి బ్రాహ్మణుల దగ్గరున్న ధనాన్నంత తెప్పించి నిరుపేదలందరికి పంచి పెట్టాడు.
కొందరు ఛాందస బ్రాహ్మణులు పురూరవుని కుల గురువు వశిష్ట మహర్షి దగ్గరకు వెళ్ళి ‘పురూరవుడు ఊర్వశి మైకం లో పడి చెయ్యకూడని పనులను చేస్తున్నాడు మా ధనాన్నంత అతగాడు అపహరించాడు. అంతేగాక పురూరవుడు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతను ఇచ్చి ధర్మానికి కొరివి పెడుతున్నాడు’ అని చెప్పడమే గాక కొందరు పండితుల చేత పురూరవుడు బాహ్య సౌందర్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు అని ప్రచారం చేయించారు. అలా కొన్ని తాళ పత్ర గ్రంథాలు కూడా వ్రాయించారు.
బ్రాహ్మణుల మాటలను విన్న వశిష్ట మహర్షి పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇచ్చివేయమన్నాడు. అందుకు పురూరవుడు నిరాకరించి, అది బ్రాహ్మణ ధనం కాదు. నిరుపేదల ధనం అన్నాడు.
వశిష్ట మహర్షి కోపంతో బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్ళి పురూరవుడు బ్రాహ్మణ ధనం తీసుకున్న విధానం చెప్పాడు. బ్రహ్మ సనత్ కుమారుని పిలిచి పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇప్పించి రమ్మని పలికాడు. సనత్ కుమారుడు పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇచ్చివేయమన్నాడు. అందుకు పురూరవుడు "సనత్ కుమార! బ్రహ్మ జ్ఞానం తెలిసిన బ్రాహ్మణులు ధర్మం మూడు పాదాల మీద నడిచే త్రేతాయుగంలో కూడా ధర్మం నాలుగు పాదాల మీద నడిచే సత్య యుగం బ్రాహ్మణునిగా బతికి బ్రహ్మ తేజం తో యశసించాలి. అలాంటి వారే నిజమైన బ్రాహ్మణులు. బ్రాహ్మణుడు ముందుగా బ్రహ్మ జ్ఞానం ను తాను అనుసరించి చూపించాలి.
అది చెయ్యని వారు పుట్టుకతో బ్రాహ్మణులైన అసలు సిసలు బ్రాహ్మణులు మాత్రం కాదు. అలాంటి వారికి ఎలాంటి సహాయం చేయనవసరం లేదు. నేను సమస్త ప్రజలకు, నిరుపేదలకు, నిర్భాగ్యులకు సమానంగా పంచమని ఇచ్చిన సంపదను కొందరు బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం వినియోగించుకున్నారు. అలాంటి వారికి ధనం ఇవ్వవలసిన పనిలేదు. "అని అన్నాడు.
పురూరవుని మాటలకు ఆగ్రహోదగ్రుడైన సనత్ కుమారుడు, "హే పురూరవ! నువ్వు సూర్యోదయం లతో అనుసంధానించబడిన చంద్ర వంశ సంజాతుడవు.. నీలో సూర్య చంద్ర కళలు సమ స్థాయిలో ఉన్నాయి. నీకు కొందరు దేవతలనే శాసించగలిగిన సామర్థ్యం ఉంది అని నాకు తెలుసు. త్రేతాగ్నులు, యజుర్వేద పురుషుడు నిన్ను విశ్వ సుర కవచం తో కాపాడుతున్నారు. అలాంటి నీ మీద నా శాపం పని చేయదు. అయినా నా సుర శక్తినంత ధారపోసి నువ్వు కొంత కాలం వెర్రివాడిగ తిరగాలని శపిస్తున్నాను. " అని పురూరవుని శపించాడు.
సనత్ కుమారుని శాపాన్ని విన్న పురూరవుడు
"హే దేవ! యుగ ధర్మం నిరుపేదల మానసిక ధర్మం దరిదాపు ఒకే రీతిన ఉంటుంది. నేను ఆ పథానే పయనిస్తున్నాను. ఆకలి దప్పిక లకు అల్లంత దూరంలో ఉండే మీలాంటి మహాత్ములు కృత యుగ ధర్మ భావనలతోనే సంచరిస్తుంటారు. ఆ ఆలోచనలతోనే ఒక్కొక్కసారి ఆవేశపడుతుంటారు. అదేమంటే మేము మీ మాటలను పెడ చెవిన పెట్టి గర్వంగా సంచరిస్తున్నాము అంటారు.
మీ శాపం నా మీద పని చేయదని మీరే అంటున్నారు. అయితే మీలాంటి మహాత్ముల వరాలను, శాపాలను యుగ ధర్మం తప్పకుండా సదా తలవంచి స్వీకరించాలనే సదాలోచనలు ఉన్నవాడిని నేను.. మీ శాపాన్ని నా తలరాత గా భావించి స్వీకరిస్తాను. మీ శాపం నాకు తగల వలెనని యుగ పురుషుని ప్రార్థిస్తాను" అని పురూరవుడు సనత్ కుమారుని తో అన్నాడు.
పురూరవుడు సనత్ కుమారుని శాపాన్ని స్వీకరించాడు. సనత్ కుమారుని శాప ప్రభావం నూరింట ఒక వంతు పురూరవుని తనువు ని ఆక్రమించింది. అప్పటినుండి సమస్త భూమండలంలో, విశ్వంలో ఉండే మేకలు అధికంగా చని పోసాగాయి. గణిత జ్ఞానం ఉన్న వారు అధిక శాతం పిచ్చి వాళ్ళు కాసాగారు. యజుర్వేదం లోని శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం చదివే వారిలో అప శబ్దాలు అధికం కాసాగాయి.
ఒకనాడు పురూరవుడు గంధర్వ లోకం నుండి భూమి మీదకు వస్తుండగా ఊర్వశి వెంట పడుతున్న మాంత్రిక రాక్షసుడు కేశిన్ అతని కంట పడ్డాడు. పురూరవుడు కేశిన్ తో యుద్దానికి సిద్ధపడ్డాడు.
కేశిన్ వెంట్రుకలు వంటి తెలుపు నలుపు కిరణ బాణాలతో పురూరవుని తో యుద్దం చేయసాగాడు. అది గమనించిన పురూరవుడు యూక( పేను మరియు స్వేదం వలన పుట్టిన క్రిములు) కిరణ బాణాలతో కేశిన్ ని ఎదుర్కొన్నాడు. కేశిన్ శరీరం నిండా యూక బాణాలు చుట్టుముట్టాయి. కేశిన్ భయంకర ఆర్తనాదాలతో ప్రాణాలను విడిచాడు.
పురూరవుడు ఊర్వశిని పరిశీలనగ చూసాడు. సనత్ కుమారుని శాప ప్రభావం చేత అతని మనసులో
కేవలం ఊర్వశి యే నిలిచింది. అంతకు ముందే పురూరవుని చూచి ఉండటంతో ఊర్వశి పురూరవుని కౌగిలిలో ఒదిగి పోయింది. ఇరువురు ప్రేమ లోకం లో విహరించ సాగారు.
ఊర్వశి కౌగిలి లోనే కాలం గడుపుతున్న పురూరవుని ప్రవర్తనను గమనించిన వశిష్ట మహర్షి ఇదంతా తన వలనే జరిగింది అని అనుకున్నాడు. కొందరు అవకాశవాద బ్రాహ్మణుల మాటలకు అగ్ర పీఠం వేసి పురూరవుని ఈ పరిస్థితికి తెచ్చి తప్పు చేసానని వశిష్ట మహర్షి అనుకున్నాడు.
అంత వశిష్ట మహర్షి పురూరవుడంటే ప్రాణమిచ్చే క్షాత్ర ధర్మం ఉన్నవారికి పరిపాలనా బాధ్యతలను అప్పగించాడు. వారికి వశిష్ట మహర్షి పురూరవుని శాప విషయం చెప్పకుండా మీ పరిపాలనా దక్షతను పరిక్షీంచుకోండి అని చెప్పాడు.
ఋషులు, మహర్షులు యజుర్వేద క్షీణత గురించి, పిచ్చి వారవుతున్న గణిత పండితుల గురించి, తగ్గిపోతున్న మేకల సంపద గురించి దేవేంద్రుని కి చెప్పారు.
అప్పుడు దేవేంద్రుడు తన దివ్యదృష్టితో సమస్తం తెలుసుకుని "మహర్షులారా! చంద్రవంశానికి చెందిన పురూరవుని లో యజుర్వేద అంశ ఉంది. అతను సనత్ కుమారుని శాపాన్ని వినయంగా స్వీకరించాడు. ప్రస్తుతం సనత్ కుమారుని శాప ప్రభావం నాలుగింట ఒక వంతు పురూరవుని మీద ఉంది. అందువలన యజుర్వేదం చదవాలని ప్రయత్నించే వారి నాలుకలు తడబడి అప శబ్దాలు ఉత్పన్నమవుతాయి.
యజుర్వేదం లో అనేకానేక గణిత అంశాలు ఉంటాయి. అందులో వధూ పీఠం ( పరిపూర్ణ పైథాగరస్ సిద్దాంతం) వంటి గణిత అంశాలు ఉంటాయి. శాప ప్రభావాన యజుర్వేద గణితాంశాలను ఔపాసన పట్టిన వారు పిచ్చివాళ్ళు అవుతున్నారు. యజుర్వేద పురుషుడు మేక ముఖం తో పసుపు రంగు తో ఒక చేత కర్ర పట్టి ఉంటాడు. సమస్త సృష్టికి సంపదలు, శుభములు ప్రసాదిస్తుంటాడు.
సృష్టిలో మేకల సంపద తరిగి పోవడానికి ప్రధాన కారణం సనత్ కుమారుని శాపం. ప్రస్తుతం మూడింట ఒక వంతు మాత్రమే పురూరవుని సనత్ కుమారుని శాప ప్రభావం ఆవరించింది. మొత్తం శాప ప్రభావం పురూరవుని ఆవహిస్తే సృష్టిలో యజుర్వేద ఛాయలు లేకుండా పోతాయి. పురూరవుని శపించడం అంటే యజుర్వేదం ను శపించటమే. గణిత తేజం ను శపించటమే " అని మహర్షులతో అన్నాడు.
"పురూరవుని కబళిస్తున్న శాప ప్రభావం మొత్తం తగ్గిపోవాలంటే తక్షణ కర్తవ్యం ఏమి”టని మహర్షులు దేవేంద్రుని అడిగారు.
"పురూరవుడు ఇలా బుధుల సంతానం. బుధుడు చంద్రుని కుమారుడు. పురు పర్వతం మీద ఇలా బుధులకు పుట్టిన సంతానమే పురూరవుడు. అతడే యజుర్వేద సంరక్షణ చెయ్యాలి. పురూరవుడు అంటే యజుర్వేదం. యజుర్వేదం అంటే పురూరవుడు. అందుకే అతను భూమండలం తో పాటు పదమూడు ద్వీపాలను జయించ గలిగాడు. త్రేతాగ్నులను తన గుప్పిట ఉంచుకో గలిగాడు.
ఇక యజుర్వేద సంరక్షణ నిమిత్తం పురూరవుడు దిగంబరంగా మారాలి. అప్పుడు చంద్రుడు పురూరవుని మీద అమృత వర్షం కురిపిస్తే పురూరవుని శాపం తక్షణం అతన్ని వదిలిపోతుంది." అని మహర్షులతో దేవేంద్రుడు అన్నాడు.
"పురూరవుని దిగంబరునిగా ఎలా చేయాలి? అప్పుడు అతను యజుర్వేద సంరక్షణ ఎలా చేస్తుంటాడు? " అని మహర్షులు దేవేంద్రుని అడిగారు.
"ఈ ప్రశ్నకు సమాధానం బ్రహ్మ భారతులే చెప్పాలి " అని మహర్షులతో అన్నాడు దేవేంద్రుడు.
దేవేంద్రుడు మహర్షులు అందరినీ తీసుకుని బ్రహ్మ భారతుల దగ్గరకు వెళ్ళాడు. తన వంతు కర్తవ్యం గా పురూరవుని గురించి చెప్పాడు..
దేవేంద్రుడు చెప్పిన మాటలన్నిటిని విన్న బ్రహ్మ" ఈ సమస్యకు పరిష్కారం చెప్పు " అన్నట్లు సరస్వతీ దేవి ముఖం చూసాడు. అప్పుడు సరస్వతీ దేవి, " దేవేంద్ర! మహర్షులారా! యుగ ధర్మాన్ని చక్కగా పాటించే వారి ముందు దేవతలు సహితం తల వంచాల్సిందే. లేకుంటే ఇలాంటి ఉపద్రవాలే వస్తాయి. ఛాందస భావ జాలం అధికంగా ఉన్నవారు సత్య యుగ ధర్మం సత్య యుగ ధర్మం అని ఎదుటివారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూస్తారు తప్పించి వారు సహితం సత్య యుగ ధర్మం పాటించరు.
అలాంటి వారి మీద సురనరయక్షకిన్నెరరాక్షసాది జాతులు వారు ఎవరూ జాలి దయ చూపించకూడదు. యుగ ధర్మం పాటించని బలి చక్రవర్తి వంటి వారి వలన సృష్టి కి మేలు కంటే కీడే ఎక్కువ జరిగింది.
ఇక యుగ ధర్మం గురించి ఆలోచించకుండా కొందరు బ్రాహ్మణుల మీద అధిక జాలి చూపించడం వలననే ఇదంతా జరిగింది. ప్రస్తుతం పురూరవుడు ఊర్వశీ ప్రేమ సాగరం లో మునిగి తేలుతున్నాడు.. మీరు ఊర్వశిని కలిసి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అనే రెండు మేకలను ఆమెకు ఇవ్వండి. ఆ రెండు మేకలను పురూరవుడు అతి జాగ్రత్తగా సంరక్షించాలి. అలాగే పురూరవుడు ఎప్పుడూ ఊర్వశి ముందు దిగంబరంగా ఉండరాదు. అప్పుడే తనని పెళ్ళి చేసుకుంటానని ఊర్వశి తో పురూరవునికి చెప్పించండి. ఆపై యుగ ధర్మ కాలమే చూసుకుంటుంది." అని సరస్వతీ దేవి దేవేంద్రుని తోనూ మహర్షుల తోనూ అంది.
దేవేంద్రుడు బ్రహ్మ భారతులకు నమస్కరించి మహర్షులతో ఊర్వశి దగ్గరకు పయనమయ్యాడు. ఊర్వశి ఒడిలో శయినించిన పురూరవుడు ఊర్వశి అధరాలను, ఆమె అందాలను సప్త ఛందో వృత్తాలతో ప్రశంసిస్తూ, తనని పెళ్ళి చేసుకోమని ఊర్వశిని అడిగాడు. అందుకు ఊర్వశి ధర్మ బద్ధంగా ఆలోచించి చెబుతాను అంది.
అనంతరం పురూరవుడు ప్రేమ జలం తీసుకురావడానికి దగ్గరలో ఉన్న శృంగార శైలానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు ఊర్వశిని కలిసి సరస్వతి చెప్పిన మాటలను చెప్పాడు. సరస్వతీ దేవి చెప్పిన పని చేసినప్పుడే నీకు ఇంద్ర లోక దర్శనం. ఇదే నీకు నా శాపం " అన్న దేవేంద్రుని తో ఊర్వశి అలాగే అంది.
దేవేంద్రుడు, మహర్షులు సుర బలంతో, తపో బలంతో రెండు మేకలను సృష్టించి ఊర్వశి కి ఇచ్చారు. శుక్ల యజుర్వేదం తోనూ, కృష్ణ యజుర్వేదం తోనూ రెండు మేకలు ప్రకాశిస్తున్నాయి.
పురూరవుడు తెచ్చిన ప్రేమ జలం తాగుతూ ఊర్వశి "నా ప్రేమ ప్రాణేశ్వర! శశాంక పౌత్ర! ఈ రెండు మేకలను నువ్వంతట నువ్వే జాగ్రత్తగ సంరక్షించాలి. ఇక నువ్వు నా కళ్ళ ముందెప్పుడూ దిగంబరంగా కనపడ కూడదు. ఇందుకు సరే అంటేనే నిన్ను నేను వివాహం చేసుకుంటాను. " అని ఊర్వశి పురూరవుని తో అంది.
పురూరవుడు ఊర్వశి చెప్పినట్లు చేస్తాను అని చెప్పి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కొంత కాలం ప్రణయ సాగరంలో మునిగి తేలారు.
ఒక నాడు పురూరవుడు రెండు మేకలను తీసుకుని నిగమ శిఖరం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మేకలను మేతకు వదిలాడు. మేకల ముఖం లో పురూరవునికి శుక్ల యజుర్వేద పురుషుడు, కృష్ణ యజుర్వేద పురుషుడు కనపడ్డాడు. వెంటనే అప్రయత్నంగా అతని నోట యజుర్వేద మంత్రాలు వచ్చాయి.
దేవేంద్రుడు పంపిన విశ్వావసువు మరియు మాయా గంధర్వ గొల్లలు రెండు మేకలను దొంగిలించాలని చూసారు. అప్పుడు పురూరవుడు వారితో పెనుగులాడి రెండు మేకలను సంరక్షించాడు. ఆ పెనుగులాటలో పురూరవుని కుడి చేతి వేళ్ళకు కొంచెం గాయాలయ్యాయి.
పురూరవుడు మేకలను తీసుకుని యింటికి వచ్చాడు. తను నెల తప్పిన విషయం ఊర్వశి పురూరవునికి చెప్పింది. పురూరవుడు మిక్కిలి సంతోషించాడు.
మేకల దొంగలు ఎక్కువయ్యారని పురూరవుడు రెండు మేకలను తను శయనించే గది పక్క గదిలోనే వాటి నివాస స్థావరం ఏర్పాటు చేసాడు.
పురూరవుడు రెండు మేకల దగ్గర కూర్చుని చదివే యజుర్వేద మంత్రాలను ఊర్వశి గర్భం లో ఉన్న శిశువు వినసాగాడు.
ఒక శుభ ముహూర్తాన ఊర్వశి కి పండంటి మగ శిశువు పుట్టాడు. ఆ శిశువుకు పురూరవుడు ఆయువు అని పేరు పెట్టాడు. అటు పై ఊర్వశి పురూరవులకు మరో అయిదుగురు మగ శిశువులు పుట్టారు. వారికి వనాయువు, శతాయువు, ధీమంతుడు, ధృఢాయువు, అమావసువు అనే పేర్లను ఊర్వశి పురూరవులు పెట్టారు.
ఒకనాడు ఊర్వశి పురూరవులు నిద్రిస్తుండగా దేవేంద్రుడు పంపిన విశ్వావసువు మాయా గంధర్వ గొల్లలు మారు వేషంలో వచ్చి రెండు మేక పిల్లలను దొంగిలించారు. మేక పిల్లల అరుపులకు పురూరవునికి, ఊర్వశి కి మెలకువ వచ్చింది. మేక పిల్లలను దొంగలు ఎత్తుకు వెళుతున్నారని పురూరవునికి అర్థం అయ్యింది.
పురూరవుడు వెంటనే మంచం మీద నుండి లేచాడు. అతడు ధరించిన పంచె మంచం కోడుకు పట్టుకుని అతనికి దూరం అయ్యింది. అతడు అదేమీ పట్టించుకోకుండా రెండు మేక పిల్లల సంరక్షణ నిమిత్తం పరుగు తీసాడు. దేవేంద్రుని ప్రభావాన ఉరుమలు ఉరిమాయి. మెరుపులు మెరిసాయి. ఆ మెరుపు లో ఊర్వశి దిగంబరంగా ఉన్న పురూరవుని చూసింది.
దేవేంద్రుని విన్నపము ను అనుసరించి చంద్రుడు తన మనుమడు పురూరవుని మీద "అమృత వర్షం" కురిపించాడు. ఆ అమృత వర్షమే పురూరవునికి అమృత వస్త్రాలయ్యాయి . సనత్ కుమారుడు పెట్టినాడు శాపం సగం కూడా పురూరవుని అంటక ముందే శాప శక్తి ఛాందస శక్తిని చుట్టు ముట్టింది.
శాప విమోచనం కలిగిన పురూరవుని వశిష్ట మహర్షి రాజ్యానికి ఆహ్వానించాడు. నియమాను సారం ఊర్వశి తన పతిగ పురూరవుని విసర్జించింది.
పురూరవుడు సతిగా కాకున్న సాటి మనిషి గా కొంత కాలం తన రాజ్యంలో ఉండమని ఊర్వశి ని కోరాడు. అందుకు ఊర్వశి సమ్మతించింది. అంత పురూరవుడు ఊర్వశి తోనూ, తన సంతానం తోనూ ప్రతిష్టాన పురానికి వచ్చాడు. కొందరు ఛాందస బ్రాహ్మణులు తమ తప్పు తెలుసుకుని తమని క్షమించమని పురూరవుని ప్రార్థించారు. పురూరవుడు అందరినీ క్షమించాడు. నిరుపేదల పేదరికం తొలగించడానికి నిరంతరం పోరాడతానని ప్రజలందరికి మాట ఇచ్చాడు.
ఊర్వశీపురూరవులు కొంత కాలం ఆనందంగా జీవించారు. పురూరవుడు కడు సమర్థుడు అయిన తన కుమారుడు ఆయువు కు పట్టాభిషేకం చేసాడు. అనంతరం ఆనందంగా తపోవనానికి వెళ్ళిపోయాడు.
తపోవనానికి వెళుతున్న పురూరవుడు ఉషను విసర్జిస్తున్న సూర్య నారాయణునిలా ఉన్నాడు. అతని నోట వెలువడే యజుర్వేద మంత్రాలలో పునర్జన్మ వాసనలు బహిర్గతం మవుతున్నాయి.
ఊర్వశి దేవేంద్రుని విన్నపము ను అనుసరించి ఇంద్ర లోకం వెళ్ళిపోయింది.
సర్వే జనాః సుఖినోభవంతు
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

Comments