top of page

అనగనగా ఒక అమ్మ

Writer's picture: BVD Prasada RaoBVD Prasada Rao

'Anaganaga Oka Amma' written by BVD Prasada Rao రచన : బివిడి ప్రసాదరావు

ఆ హాలు నిండుగా ఉంది. ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ 'మేలిమి స్త్రీ' ఎంపిక జరుగుతోంది.

అప్పటికే, నియమాల ప్రకారం, వివిధ ప్రాంతాల్లో, మూడు అంచుల ఎంపిక జరిగిపోయింది. అలాగే ఈ ఎంపికకై పాల్గొన్న స్త్రీలు, వారి వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి. చివరి ఎంపిక పిమ్మట ఆ స్త్రీలు, వారి వివరాలు విడుదల కాబోతున్నాయి.

చివరి అంచు ఎంపికకి ముగ్గురు స్త్రీలు నిలిచారు. తుది కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అందరిలో చిక్కటి ఆత్రం ఆవరించి ఉంది.

వివిధ రంగాలకు చెందిన ఎనిమిది మంది న్యాయమూర్తులు ఉత్తమ ఎంపికకై యుక్తిగా వ్యవహరిస్తున్నారు. ఆ చివరి అంచులో చివరి వడపోత మొదలయ్యింది.

"స్నేహితులారా! మేము 'మేలిమి స్త్రీ' ఎంపికకై ముందుకు వచ్చాం. దానికై ఎక్కడా రాజీ పడకుండా శ్రమించాం. వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుగా మేము పెట్టుకున్న నియమాల ప్రకారంగా నిర్వహించాం. మొత్తమ్మీద వివిధ వడపోతల తర్వాత 25 మందిని ఎంపిక చేశాం. వారి నుండి ముగ్గురిని చివరి పోటీకి ఎంపిక చేశాం. వారిలో ఒకరు ఇప్పుడు 'మేలిమి స్త్రీ' గా మీ సమక్షాన ఎంపిక కాబడుతున్నారు. ముందుగా వారిని ఒక్కొక్కరిగా మీ ముందుకి తీసుకువస్తున్నాం" చెప్పాడు నిర్వాహకుడు.

అలా ఇద్దరు స్త్రీల వంతయింది.

మూడో స్త్రీగా - "ఈమె చదువు పిజి. వృత్తి ఓ ప్రయివేట్ సంస్థలో మార్కెటింగ్ సెక్షన్ హెడ్ " అని చెప్పి,

"సంధ్యా!" అని పిలవగా ఆమె వచ్చి ఆ వేదిక మధ్య నిల్చుంది.

సంధ్య నిశ్చలమైన నిండు కుండలా ఉంది.

అలా సంధ్యని చూసిన - ప్రత్యక్ష ప్రేక్షకుల్లో కొద్ది మంది, టీవీ వీక్షకుల్లో చాలా మంది గతుక్కుమన్నారు. ఆ వెంటనే తేలు కుట్టిన దొంగల్లా మెదిలారు.

అలాంటి వారిలో - ఒకరు రాజశేఖర్.

రాజశేఖర్ ఓ ప్రొఫెసర్. పిజి చేస్తున్న సంధ్య ఆయన స్టూడెంట్.

సంధ్య ఆయనతో - "నా ఉత్తీర్ణతకై నా ఒళ్లుని మీ కింద పెట్టాలా? ఛ!" అని -

"మీరు మారకపోతే మిమ్మల్ని నడిరోడ్డున నిలబెట్టేస్తాను సార్! అక్కడ నా చదువుని నిరూపించుకుంటాను" అని చెప్పి ఉంది.

రాజశేఖర్ హడలిపోయాడు. కామ్ అయిపోయాడు.

మరొకరు వెంకట్రావు.

వెంకట్రావు వ్యాపారవేత్త. డిగ్రీకై చదువుతున్న సంధ్య క్లాస్మేట్ గిరికి తండ్రి.

సంధ్య ఆయనతో - "నా మానాన నేను ఉన్నాను. గిరి నన్ను వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే ఏదో చేస్తానంటున్నాడు. మీ సంపాదన గిరికి అండ సార్! అందుకనే నా బతిమలాటలని కానీ, నా హెచ్చరికలని కానీ, తను పట్టించుకోవడం లేదు. నాకు 'అంత' ఉంది, తలుచుకుంటే ఏమైనా చేస్తాను, అని పేట్రేగిపోతున్నాడు. దయచేసి తనని నియంత్రించండి సార్. లేదంటే నేను జనం మధ్య మిమ్మల్నే నిలుపుతాను. తర్వాత పరువు పోయిందని వాపోవ్వొద్దు" అని చెప్పి ఉంది.

వెంకటరావు తెములుకున్నాడు. గిరిని నొక్కి పట్టాడు.

ఇంకొకరు ఏడుకొండలు.

ఏడుకొండలు టీచర్. పదవ తరగతి చదువుతున్నసంధ్య ఆయన స్టూడెంట్.

సంధ్య ఆయనతో - "పాఠాలు చెప్పక నా వద్ద ఈ ప్రేమ మాటలు ఏమిటండీ? మీరు టీచర్. నేను స్టూడెంట్. ఎలా మరిచారు టీచర్! మీరు గుర్తించలేకపోతే మీ అమ్మని అడిగి తెలుసుకోండి. లేదంటే మీ అమ్మని అడిగి నన్ను చెప్పమంటారా?" అని చెప్పి ఉంది.

ఏడుకొండలు బెదిరాడు. తలదించుకున్నాడు.

ఇంకొకరు శ్యామలరావు.

శ్యామలరావు క్లర్క్. సంధ్య ఆరవ తరగతిన చేరుతుంది.

సంధ్య ఆయనతో - "ఇంత వరకు ఇంత గట్టిగా అడగలేదు. ఇప్పుడేమిటి. తండ్రి పేరు తప్పనిసరి అంటారేమిటి? అమ్మ పేరు పనికి రాదంటే ఎలా. అంతైతే తండ్రి పేరు దగ్గర మిష్టర్ దేవి అని రాసుకోండి. అంతేకానీ నేను డబ్బులిచ్చే ప్రసక్తే లేదు" అని చెప్పి ఉంది.

శ్యామలరావు తగ్గాడు. 'తండ్రి పేరు' అన్న చోట సంధ్య చెప్పినట్టు నమోదు చేసేశాడు.

మరొకరు ఆనందరావు.

ఆనందరావు ఆఫీసర్. సంధ్య ఉద్యోగంకై ఆయన్ని కలిసింది.

సంధ్య ఆయనతో - "అంటే ఉద్యోగంకి అర్హతగా నా చదువు వద్దా.. మీ పక్కన పడుకోవాలా?" అని -

"అలానే! మనం పడుకున్నప్పుడు మన దగ్గర నీ కూతుర్ని నిలబెడతావా? ఛీ!" అని చెప్పి ఉంది.

ఆనందరావు తుళ్ళి పడ్డాడు. సంధ్య అక్కడ నుండి తప్పుకుంది. మరొకరు కృపాకర్. కృపాకర్ యాడ్స్ క్రియేటర్. సంధ్య సెక్షన్ హెడ్.

సంధ్య ఆయనతో - "వద్దు సార్! మన యాడ్స్ లో అలా వద్దు. అమ్మాయిల్ని అందంగా చూపిద్దాం. దానికై వాళ్ల హావభావాలను మాత్రమే వినియోగించుకుందాం. అంతే కాని వాళ్లకి సగం సగం దుస్తులు వద్దు. పైవారికి మీరు ఇలాంటి సలహాలు ఇవ్వకండి. ఆఁ. మీరు నా మాటే వినాలి. లేదంటే నాకు ఉన్న అధికారంతో మిమ్మల్ని తీసిపారేస్తాను" అని చెప్పి ఉంది.

కృపాకర్ తలవంచాడు. సంధ్య చెప్పిందే చేయ మొదలెట్టాడు.

మరొకరు మాణిక్యరావు. మాణిక్యరావు యాడ్స్ ఏజెన్సీ మేనేజర్. సంధ్య పని చేస్తున్న సంస్థ ఆయన క్లయింట్. సంధ్య ఆయనతో - "లేదండీ! మీరు సూచించిన పేపర్ల సర్కులేషన్ తక్కువ. వాటికి పదిమార్లు మా యాడ్ ఇస్తే మాకు ఒరిగేది ఏమీ ఉండదు. సర్క్యులేషన్ ఉన్న పేపర్లతో రెండు, మూడు మార్లు మా యాడ్ వెళ్తే చాలు. మీ సలహాతో మీకు మాత్రమే లాభం. మోసం వీడండి." అని చెప్పి ఉంది.

మాణిక్యరావు డంగయ్యాడు. సంధ్యని వ్యతిరేకించలేకపోయాడు.

ఇలా గతంలో, ఎంతో మంది, రకరకాల తమ తీరున, సంధ్యతో పరాభవింపబడి ఉన్నారు. వారంతా ఇప్పుడు సంధ్యని ఆ వేదిక మీద చూడగానే గతంలోకి పోయారు. భుజాలు తడుముకుంటున్నారు.

ప్రస్తుతం -

ఆ వేదిక ముందున్న - ఆ ఎనిమిది మంది న్యాయమూర్తులలో ఏడుగురు ఒకరి వెంబడి ఒకరు వరస పెట్టి సంధ్యని ప్రశ్నించారు. ఆ అన్నింటికీ తనదైన రీతిన సమాధానాలు ఇచ్చింది సంధ్య.

ఇక ఆ ఎనిమిదో న్యాయమూర్తి కూడా సంధ్యని అడిగాడు - "మీ గురించి చెప్పదగ్గది చెప్పండి" అని.

సంధ్య - "డియర్ సర్, మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఎక్కడా ఎప్పుడూ చెప్పుకోని నా స్వవిషయాలు ముచ్చటించబోతున్నాను. కారణం - ఇది ఒక గొప్ప వేదిక. ఎందరికో చేరువ చేసే సత్తా ఉన్న వేదిక ఇది అని నమ్ముతున్నాను. ఆ కారణం చేతనే నేను ఈ పోటీలోకి వచ్చాను. దీని ద్వారా నా మరుగున ఉంచిన వివరాలని వెల్లడించే ప్రయత్నం చేస్తున్నాను. వృత్తి పరంగా మా అమ్మమ్మ మా అమ్మని ఉంచేసింది. కానీ మా అమ్మ నన్ను మా వృత్తికి దూరంగా పెట్టింది.

నన్ను హాస్టల్ లో పెట్టి చదివించింది. నాకు మరో మార్గం చూపింది. నా ఉనికిని మార్చింది. నా ఉన్నతిని తీర్చిదిద్దింది. నాలో నిబ్బరం నింపింది. నన్ను నిటారున నిలిపింది. అట్టి నా అమ్మని ఈ వేదిక మీదికి తేవాలనుకుంటున్నాను" అని - ఆ వేదిక ముందున్న న్యాయమూర్తులుని ఉద్దేశించి, "అందుకు మీ అనుమతిని కోరుకుంటున్నాను" అంది. వాళ్లు సమ్మతి తెలిపారు.

వెంటనే సంధ్య - "అమ్మా, ఆ మూల నుండి పైకి రామ్మా." అంది గట్టిగా. మరి కొంత ప్రయత్నం చేయగా, సంధ్య అమ్మ దేవి, బిడియంతో ఆ వేదిక ఎక్కింది. అలా వచ్చిన తన అమ్మకి ఎదురెళ్లి, ఆవిడ భుజాల చుట్టూ చేయి వేసి, ఆ వేదిక మధ్యకి తీసుకు వచ్చింది సంధ్య.

"మా అమ్మ ఒక వేశ్య అనీ , నేను ఈమె కూతుర్ని అనీ చెప్పుకోవడానికి నేను బెదరడం లేదు. నేను సిగ్గుపడడం లేదు. పైగా మా అమ్మని చూసి గర్విస్తున్నాను. మీ సమక్షంలో మా అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను." అని చెప్పింది సంధ్య నిలకడగా.

కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ పిమ్మట అచ్చటి వారే కాదు, దీన్ని టీవీల్లో చూస్తున్న వారు కూడా లేచి నిల్చున్నారు. వాళ్ల చప్పట్లు కొనసాగుతున్నాయి.

న్యాయమూర్తులు దగ్గరగా చేరారు. ముచ్చటించుకున్నారు. చివరికి, తమ ఎంపిక 'ఏకగ్రీవం' అని నిర్వాహకుడికి, విజేత పేరును చెప్పారు. నిర్వాహకుడు స్టేజ్ మధ్యకి వచ్చాడు. విజేతని ప్రకటించాడు.

ఈ మారు సంధ్యతో పాటు, ఆమె అమ్మ దేవి కూడా స్టేజ్ పైకి అహ్వానింపబడింది.

సంధ్య తన అమ్మ దేవి ద్వారా 'మేలిమి స్త్రీ' బిరుదు అందుకుంది.

చప్పట్లకి తెరిపి లేదు ఇంకా!

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.

368 views1 comment

1 Comment




Like
bottom of page