top of page

ఆనంద బృందావనం

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #AnandaBrundavanam, #ఆనందబృందావనం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Ananda Brundavanam - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao 

Published In manatelugukathalu.com On 10/12/2024 

ఆనంద బృందావనం - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



''ఒరే.. రామచంద్ర.. నేను రా విష్ణువర్ధన్ ని గుర్తు పట్టావా.. 2003 టెన్త్ క్లాస్ బ్యాచ్ కాకినాడ.. గుర్తు వచ్చానా.. నువ్వు ఎక్కడున్నావు. ?'' సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అటు నుంచి విష్ణువర్ధన్. 


''విష్ణువర్ధన్! ఎక్కడినుంచి మాట్లాడుతున్నావ్. ఎక్కడున్నావు నువ్వు. '' రామచంద్రం సెల్ ఫోన్ లోనే పలక రించాడు తన స్నేహితుడు విష్ణువర్ధన్ ని. 


''నేను ఐదు సంవత్సరాల నుంచి హైదరాబాదులోనే ఉంటున్నానురా. మన బ్యాచ్ సత్యప్రసాద్, సంతోష్ కుమార్, గుణశేఖర్ గాడు కూడా ఇక్కడే ఉంటున్నారు. 


నేను జూబ్లీహిల్స్ సెంటర్లో కారులో వెళ్తున్నప్పుడు సత్యప్రసాద్ గాడు మరో కారులో వెళ్తూ నాకు సడన్ గా కనిపించాడు. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. మనవాళ్లు అరడజను మంది ఇక్కడే ఉన్నట్లు వాడే చెప్పాడు. అందరి నంబర్లు తీసుకున్నాను. నీ నెంబర్ 

కూడా వాడే నాకు ఇచ్చాడు. నువ్వు కూడా హైదరా బాద్ లోనే ఉన్నావట కదా. 


సరే మనవాళ్లు అందరినీ ఒకసారి కలుసుకుందామని 

రెండు రోజుల నుండి అందరి ఇళ్లకు వెళ్లి కలుసుకో గలిగాను మొత్తానికి. నిన్ను ఒక్కడినే కలుసుకోవడం కుదరలేదు. ఈ రోజు నీ ఇంటికి వద్దాము అనుకుంటున్నాను. నీ అడ్రస్సు లొకాలిటీ నాకు షేర్ చెయ్. ఏదో టైం లో వస్తాను. '' అంటూ విష్ణువర్ధన్ తన చిన్ననాటి స్నేహితుడు రామ చంద్రంతో విషయాలు అన్నీ మాట్లాడాడు. 


''ఒరేయ్ విష్ణువర్ధన్.. నేను ఈరోజు ఆఫీసు పని మీద

బయటకు వెళ్తున్నాను రా. వచ్చేసరికి బాగా రాత్రి కావచ్చు. రేపు లొకాలిటీ షేర్ చేస్తానులే, కలుసు కుందాం. '' అని చెప్పి సెల్ ఆఫ్ చేశాడు రామచంద్ర. 


నాలుగు రోజులు చూశాడు విష్ణువర్ధన్. రామచంద్రం నుండి ఎటువంటి మెసేజ్ రాకపోవడంతో రామచంద్రానికి మళ్లీ ఫోన్ చేశాడు. 


''ఏరా రామచంద్రం! ఏమి చేస్తున్నావు? నేను రా విష్ణు వర్ధన్.. లొకాలిటి షేర్ చేయలేదే. నువ్వు మనవాళ్ళు ఎవరిని కలుసుకోలేదట కదా. వాళ్లు నిన్ను కలుసు కుందామంటే నీ లొకాలిటీ షేర్ చేయడం లేదట. అంత బిజీగా ఉన్నావ్ అన్నమాట. 


సరే.. మొన్న సత్య ప్రసాద్ గాడి ఇంటికి వెళ్లాను రా. ఒక పూట వాళ్ళ ఫ్యామిలీతో గడిపాను. వాడు ఆటో మొబైల్ హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాడు నీకు తెలుసా.. 

కోట్ల మీద ఉంటుంది టర్నోవర్. మూడు ఫారిన్ కార్లు మెయింటైన్ చేస్తున్నాడు మన గురుడు. వాళ్ల ఆవిడ మన తూర్పుగోదావరి జిల్లా అమ్మాయి. బాగుంటుంది. 

ఇద్దరు పిల్లలు హైస్కూల్ చదువులు చదువుతున్నారు


వాడి ఇంటిదగ్గర నేను తిన్న ఫుడ్ 5000 రూపాయలు ఉంటుంది రా బాబు.. తినలేకపోయాను అనుకో. వాడు నెంబర్ వన్ స్టేజ్ లో ఉన్నాడు. వాడి బిల్డింగు రెండు కోట్లు ఖరీదు చేస్తుంది. 


ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్ళ అమ్మానాన్న మొన్న ఈ మధ్యనే ట్రైన్ యాక్సిడెంట్ లో పోయారట పాపం. 


ఆ తర్వాత సంతోష్ కుమార్ ఇంటికి కూడా వెళ్లాను. 

కూకట్పల్లి. వాడికి పెద్ద సినిమా ధియేటర్ ఉంది. భార్య పిల్లలు అంతా హ్యాపీగా ఉన్నారు. కోటి రూపాయల పెద్ద బిల్డింగు. 


ఇకపోతే వాడి ఫ్యామిలీలో ఏదో డిస్ట్రబెన్స్. వాడి అమ్మానాన్న ఇక్కడికి రారట. విజయవాడ దగ్గర గన్నవరం లో వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంటారట. వీడిని అడిగితే వాళ్ళు అదోరకం మనుషులు అంటాడు. ఫ్యామిలీ విషయాలు తొంభై రకాలు ఉంటాయి కదా. ఎందుకులే అని లోతుగా అడగలేదు. 


ఇప్పుడు నా ఫ్యామిలీలో కూడా అలాంటి చిన్న డిస్టర్బెన్స్ ఉంది. మా అమ్మ కాలం చేసిందఅనుకో.. 


మా నాన్నకు, నా భార్యకు పడదు. రోజు గొడవలు పడితే మన డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా. పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. అందుకని మా నాన్నను దగ్గర్లో ఉన్న వృద్ధాశ్రమం లో పెట్టి చాలా జాగ్ర త్తగా చూస్తున్నాను. పేరుకు వృద్ధాశ్రమం కానీ అలా ఉండదు. నెలకు పదివేలు కడుతున్నాను మరి. అంతా కాస్ట్లీ మనుషులే ఉంటారు అందులో. ఎవరేమనుకున్నా నా ధర్మం కదా.. నా ధర్మం నేను నిర్వహిస్తున్నాను తండ్రి పట్ల. బంధువులు అందరూ నన్ను శభాష్ అంటున్నారు కానీ తప్పు అనడం లేదు. 


ఇదిరా విషయం.. పోతే మన గుణశేఖర్ గాడు ఉన్నా డు కదరా.. నల్లగా పొడుగ్గా ఉండేవాడు.. తుమ్మ చెక్క అని పిలిచే వాళ్ళం.. ఆడి ఇంటికి ఈరోజు ఉదయమే వెళ్లి వచ్చాను. నీకు గుర్తు ఉన్నాడా వాడు?''' అడిగాడు విష్ణువర్ధన్. 


''గుర్తున్నాడు. నాతో ఎక్కువగా ఉండేవాడు. ఒకసారి కబడి ఆటల్లో కూతకు వెళ్లి రెండు మోకాళ్లు చిప్పలు రక్తసిక్తం చేసుకున్నాడు వాడే కద..'' అన్నాడు రామచంద్ర. 


''వాడేరా.. ఏలంగి నుండి సైకిల్ తొక్కుకుంటూ వచ్చే వాడు. వాడు ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు రా. ఒక పక్క ఫైనాన్సు, మరోపక్క రియల్ ఎస్టేట్ ఎడా పెడ అదర గొట్టేస్తున్నాడు. ఈ హైదరాబాద్ మొత్తం దున్నేస్తున్నాడు అనుకో.. . మనం కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకునే వెళ్లాలి వాడి దగ్గరికి. రాజ కీయ నాయకులు, లాయర్లు, పోలీసులు వాడు ఏం చెబితే అది చేస్తున్నారు. వాడి వైభోగం అక్కడ చాలా సేపు ఉండి చూసి అమ్మో అనుకున్నాను. లైఫ్ అంటే వాడిదిరా.. మహారాజవైభోగం అనుభవిస్తున్నాడు అనుకో. 


ఫ్యామిలీ విషయానికి వస్తే.. . మామూలే. మన గుణ శేఖర్ గాడికి అమ్మ ఉంది, నాన్న లేడు. అయితే ఆవిడకు రెండు కళ్ళు కనిపించవు పాపం.. అలాంటి మనిషిని ఈ రోజుల్లో ఏ కొడుకు మాత్రం చూడగలరు.. 


వీడు ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు.. నాకునచ్చింది. 

వీడి సొంత పెద్ద బిల్డింగు లో ఆవిడ వల్ల న్యూసెన్స్ లేకుండా.. . దగ్గరలోనే ఒక పెంకుటిల్లు కొని అందులో వాళ్ళ అమ్మను పెట్టి ఇద్దరు పని మనుషులు పెట్టాడు మరి. నాకు దగ్గర ఉండి అన్ని చూపించాడు. తల్లి పట్ల వాడు తీసుకున్న నిర్ణయం, విధానం నాకు చాలా ఆనందం అనిపించింది. చాలామంది గాలికి వదిలేస్తున్నారు కదా మరి. అలాంటప్పుడు వీడు ఎంత గ్రేట్. 


సరే మన వాళ్లను నువ్వు కలవలేదు కదా అని నేను వివరంగా ఇంతసేపు చెప్పుకొచ్చాను. ఇప్పుడు నేను నీ ఇంటికి రాక తప్పదు. కారులో ఉన్నాను లొకేషన్ షేర్ చెయ్. ''.. అంటూ అడిగాడు విష్ణువర్ధన్. 


రామచంద్ర సరే అంటూ లొకేషన్ షేర్ చేశాడు. 


ఐదు నిమిషాల్లో విష్ణువర్ధన్ కారు కొండాపూర్ సెంటర్ లోపల కు వెళ్లి.. సురేష్ మహల్ అనే పెద్ద ఐదు అంత స్తుల బిల్డింగు ముందు ఆగింది. 


అక్కడే నిలబడి ఉన్న రామచంద్ర గబగబా విష్ణువర్ధన్ దగ్గరకు వచ్చి.. ఖాళీలో కారు పార్కు చేయించి మిత్రు డు విష్ణువర్ధన్ చేయి పట్టుకుని నడిపించుకుంటూ పక్కనే ఉన్న పార్కులోకి తీసుకెళ్లాడు.  


'' ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటే ఎలా? మీ ఇంటికి వెళ్దాం పద. '' అన్నాడు విష్ణువర్ధన్. 


''కాసేపు మాట్లాడుకోవడానికే కదా. ఇంటి వరకు ఎందుకు.. ఈ సందులోంచి చాలా దూరం వెళ్ళాలి, కారు కూడా వెళ్ళదు. '' అంటూ అక్కడ సిమెంట్ బల్లమీద కూర్చుండి పోయాడు రామచంద్ర. 


''నడుచుకుంటూ వెళ్దాం రా. '' అంటూ కూర్చున్న రామచంద్ర భుజం పట్టుకుని పైకి లేవదీసి.. బలవంతంగా అతని ఇంటి వైపు దారి పట్టించాడు. ఇద్దరు కలిసి నడిచి కాసేపటికి ఒక రేకులు షెడ్డు ముందు ఆగారు. 


''ఇదే మా ఇల్లు రా'' అంటూ లోపలికి నడిపించాడు రామచంద్ర''. 


విష్ణువర్ధన్ ఆ రేకుల షెడ్డులోకి వెళ్లి చూశాడు. అతని భార్య చిరిగిపోయిన చీర కట్టుకొని ముందుకు వచ్చి నమస్కారం పెట్టి, టీ కాయడానికి వెళ్ళింది. పిల్లలు ఇద్దరూ శరీర సంస్కారం, తైలసంస్కారం లేకుండా చాలా నీరసంగా ఉన్నారు. ఓ పక్కన నులక మంచం మీద తొంభై సంవత్సరాల రామచంద్ర తండ్రి, పూర్తిగా కళ్ళు కనిపించని స్థితిలో, ఏదో వస్తువు గురించి వెతు క్కుంటున్నాడు. 


రామచంద్ర “కూర్చో” అన్నాడు స్నేహితుడిని.. కానీ అక్కడ కూర్చోలేదు విష్ణువర్ధన్. 


మంచం మీద ముసలాయన, కట్టుకున్న పంచె లో గడబిడ చేసుకున్నాడు. వెంటనే రామచంద్ర స్నేహితుడిని వదిలి తండ్రిని శుభ్రం చేసే పనిలో పడ్డాడు. 


ఆ తర్వాత ఆ ముసలాయన గట్టిగా దగ్గడంతో మూతికి చెయ్యి అడ్డం పెట్టుకుని బయటకు వచ్చేసాడు విష్ణువర్ధన్. 


రామచంద్ర భార్య గ్లాస్ తో టీ తెచ్చి ఇచ్చింది. విష్ణువర్ధన్ గ్లాసు అందుకోలేదు. అతని మొఖం చాలా చిరాకుగా అనిపించింది రామ చంద్ర కు. 


విష్ణువర్ధన్ రెండు వీధులు గబగబా నడుచుకు వెళ్లి తన కారు ఎక్కి కూర్చున్నాడు. 


రామచంద్ర డోర్ దగ్గర నిలబడి. ''అందుకనే నిన్ను లోపలకు రావద్దు అన్నాను. సరే ఎలాగూ వచ్చావు కనుక.. నాకు.. పదివేలు సర్ద గలవా. అప్పుగానే.. నెలకు వెయ్యి చొప్పున ఇస్తాను.. వడ్డీ కూడా ఇస్తాను. '' అంటూ దీనంగా ముఖం పెట్టి అడిగాడు. 



విష్ణువర్ధన్ సమాధానం చెప్పలేదు. ఎయిర్ విండ్ మిర్రర్ పైకి జరిపి కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 


రామచంద్ర నవ్వుకున్నాడు. చాలాసేపు నవ్వుకున్నాడు. 


''''నేను కుచేలుడిని కాదు. వచ్చింది శ్రీకృష్ణ భగవానుడు కాదు.. '' అనుకుంటూ రామచంద్ర మళ్లీమళ్లీ నవ్వుకున్నాడు చాలాసేపు.


****


 రెండు నెలలు గడిచింది. రామచంద్ర దగ్గరలో ఉన్న పార్కులో కూర్చున్నాడు. అతను ఒక సమస్యతో బాధ పడుతున్నాడు. అతను ఉండే రేకుల షెడ్డు ఓనరు దానిని ఖాళీ చేయమని నెల క్రితమే చెప్పాడు. ఆ ప్రదేశంలో అపార్ట్మెంట్ కట్టుకోవాలి అన్న ఉద్దేశంలో ఉన్నాడు ఓనరు. 


తల పట్టుకుని కూర్చున్న రామచంద్ర దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నిలబడి ఇలా మాట్లాడాడు.. . 


''మీరు రేకు షెడ్ లో ఉండే రామచంద్ర గారు కదూ. నమస్తే! నా పేరు చలపతిరావు. నేను అదే వీధిలో బాగా చివర బిల్డింగు లో ఉంటున్నాను. అది రెండు పోర్షన్ల సొంత బిల్డింగే. విషయం ఏమిటి అంటే నేను మా అబ్బాయి దగ్గరికి అమెరికా వెళుతున్నాను. ఆరు నెలల వరకు రాను. నా బిల్డింగు అలా వదిలి పెట్టేసి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అలాగని అద్దెకు కూడా ఇవ్వదలుచుకోలేదు. మంచి వాళ్లకు అద్దె తీసుకో కుండా ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా చూస్తారని. మీ తాలూకా ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చెప్పండి. మీరు వచ్చినా పర్వాలేదు. నేను మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటాను. మీరు నాకు చాలా కాలం నుండి తెలుసు. కరెంటు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఇంటికి సంబంధించిన ఇతర ఖర్చు లన్నీ నేను ఏర్పాటు చేసి వెళ్తాను. ఎటు వచ్చి ఇంటిని బాధ్యతగా చూసుకోవడమే. '' అంటూ చెప్పాడు. 


రామచంద్రకు మహదానందం కలిగింది. దేవుడు ప్రత్యక్షమై కోటి రూపాయలు ఇచ్చినంత ఆనందం కలిగింది. వెంటనే ఆయనతో పరిచయం పెంచుకొని ఆ ఇంట్లో ఉండగలనని చెప్పి ఆయన అమెరికా వెళ్ళగా ఆ ఇంట్లోకి రెండు రోజుల తర్వాత ప్రవేశిం చాడు. 


రామచంద్ర ఆ ఇంట్లో ఆనందంగా ఉంటున్నాడు ముసలి తండ్రి తో, భార్యాబిడ్డలతో. 


ఒకరోజు ఆ వీధిలో హౌస్ హెల్త్ సర్వే చేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ అధికారులు రామచంద్ర ఇంటికి వచ్చారు. 


వృద్ధుడైన అతని తండ్రి పరిస్థితిని చూసి తమ యొక్క సంస్థ ద్వారా అతని తండ్రికి రెండు కళ్ళకు ఆపరేషన్ చేయిస్తామని, మిగిలిన ఆరోగ్య విషయాలన్నీ సరి చేయించి.. ఇంటికి పంపిస్తామని ఒక రూపాయి ఖర్చు మీకు ఉండదని చెప్పారు. 


రామచంద్ర ఆనందానికి అవధులు లేకుండా పోయి నాయి. వాళ్ళు చెప్పినట్లే ఆయన తండ్రిని వాళ్ల కూడా పంపించాడు. 


కానీ అతనికి అనుమానం పీక్కొని తినడం మొదలు పెట్టింది. ఒకేసారి ఇన్ని మార్పులు ఎలా సంభవం. రామచంద్ర అనుమానంతో ఆ సాయంత్రం ఆ వీధిలో సిద్ధాంతి దగ్గరకు వెళ్లి తన జాతకం చూపించాడు. 


జాతకంలో దైవ అనుగ్రహ ప్రారంభమైందని, ఇంకా అన్ని గ్రహాలు సానుకూలంగా ఉన్నాయని, శని బాగా కలిసి వచ్చే పనులు చేస్తాడని, చాలా చిత్రాలు జరుగుతాయని అతను చెప్పడంతో ఆనందించాడు రామచంద్ర. 


నెల రోజులకు క్షేమంగా ఇంటికి వచ్చాడు రామచంద్ర ముసలి తండ్రి. 


అమర్నాడే అతని తండ్రి పుట్టిన రోజు. కేకు తేవడానికి కొండాపూర్ సెంటర్ కు వెళ్లాడు రామచంద్ర. 


తిరిగి వస్తున్నప్పుడు దూరంగా ఆగి ఉన్న కారులో కనిపించాడు విష్ణువర్ధన్. విష్ణువర్ధన్ కిందకు దిగి తనతో మాట్లాడ లేదు. తనను చూసి ఎయిర్ విండ్ మిర్రర్ అప్ చేశాడు. 


తప్పు కాదు అని సమర్ధించుకొని తన ఇంటి దారి పట్టాడు రామచంద్ర. 


 ***


 ఆరోజు


తండ్రి పుట్టిన రోజు చేస్తున్నాడు రామచంద్ర. సడన్ గా తన ఇంటి ముందు నాలుగు ఫారిన్ కార్లు వచ్చి ఆగాయి. 


అందులోంచి కుటుంబాలపరంగా దిగుతున్నారు రామచంద్ర పదవ తరగతి స్నేహితులు. 


విష్ణువర్ధన్, సత్యప్రకాష్, సంతోష్కుమార్, గుణశేఖర్. 


అప్పుడు అర్థమైంది రామచంద్రం కు. 


తన జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చింది తన చిన్ననాటి స్నేహితులే అని!


విష్ణువర్ధన్ చిన్నగా నవ్వాడు రామచంద్ర వైపు చూసి. 

రామచంద్రకు అర్థం అయింది. తన జీవితంలో మార్పులకు తన స్నేహితుడు విష్ణువర్ధన్ మొట్టమొదటి కారణం అని. 


వాళ్లందరూ తెచ్చిన బట్టలు, స్వీట్లు ఆ పెద్దాయనకు ఇచ్చారు. 


''ఒరేయ్ రామచంద్ర.. నీ గురించి మన విష్ణువర్ధన్ మాకు అంతా చెప్పాడురా. చేతిలో పైసా లేకపోయినా నీ తండ్రిని చూసుకున్న విధానం మాకు కనువిప్పు కలిగించిందిరా. అమ్మానాన్న ప్రత్యక్ష దేవుళ్ళు అని పుస్తకాల్లో చదవడం, పది మందికి చెప్పడం తప్పించి ఆచరించలేకపోయిన మూర్ఖులు రా నీ ఫ్రెండ్స్ ముగ్గురం. నాకు బుద్ధి వచ్చింది. ఎక్కడో దూరంగా గన్నవరంలో ఉంటున్న మా అమ్మ నాన్నను మా ఇంటికి తీసుకు వచ్చేసాను. వాళ్లు అదోరకం మనుషులని అందరితో చెప్పటం నా బుద్ధి తక్కువ రా. మా అమ్మ నాన్న ఇప్పుడు నాతోనే ఉంటున్నారు. '' అన్నా డు సంతోషకుమార్. 


''మా నాన్నను కూడా వృద్ధాశ్రమం నుండి తీసుకొచ్చేశాను. అంతే కాదురా, మన గుణశేఖర్ గాడి అమ్మ కూడా ఇప్పుడు వాడితోనే ఉంటుంది తెలుసా. '' మరింత సంతోషంగా చెప్పాడు విష్ణువర్ధన్. 


రామచంద్ర మిత్రుల మాటలకు ప్రవర్తనకు ఉబ్బి పోయాడు. ఆనందంతో ఒక్కొక్కరిని గట్టిగా వాటేసు కున్నాడు. 


ఆ ప్రదేశం ఇప్పుడు ఒక బృందావనంలా మారిపో యింది. మంచి స్నేహితుల మధ్య వాళ్ళందరితో పాటు రామచంద్ర కూడా ఇప్పుడు కోటీశ్వరుడు అయిపో యాడు. 


 సమాప్తం


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






32 views0 comments

コメント


bottom of page