అనాథ
- Neeraja Prabhala
- 5 hours ago
- 3 min read
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #అనాథ, #Anatha, #TeluguKathalu, #తెలుగుకథలు, #కొసమెరుపు

Anatha - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 20/04/2025
అనాథ - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
మారుమూల చిన్న కుగ్రామంలో పెరిగిన లక్ష్మికి బాల్యం నుంచి చదువంటే చాలా ఇష్టం. రైతుకూలీలైన రామయ్య, జయమ్మ దంపతులకు ఏకైక బిడ్డ లక్ష్మి.
తమ లాగా తమ కూతురు నిరక్షరాస్యురాలు కాగూడదనుకుని ఉన్నంతలో ఏలోటూ లేకుండా లక్ష్మిని ప్రేమగా చూసుకుంటూ చదివిస్తున్నారు. ఆమె కూడా కష్టపడి చదువుతూ స్కాలర్షిప్ తెచ్చుకుంటూ పదవతరగతి మంచి మార్కులతో పాసయింది. కాలేజీలో చేరి చక్కగా చదువుతోంది.
కాలేజి నుంచి వచ్చినాక మిగిలిన సమయంలో చిన్న పిల్లలకి పాఠాలు చెపుతూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది.
ఇంటర్ పూర్తైనాక హైదరాబాదులో ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తూ రెండుసం… తర్వాత తను స్వంతంగా నిలదొక్కుకుని గ్రామంనుంచి తన తల్లి తండ్రులను తెచ్చుకుని తన వద్దే ఉంచుకుంటూ వాళ్లని ప్రేమగా చూసుకుంటోంది లక్ష్మి.
కొన్నాళ్లకు ఆమె తన సహోద్యోగి వేణుతో ప్రేమలో పడింది. ఇరువురి మనసులు కలిసి వాళ్ల పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వేణుది సాంప్రదాయ కుటుంబం. అతని తల్లి పార్వతమ్మ.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వేణుని ఆవిడ చేరదీసి ప్రాణంగా పెంచి చదివించింది. వాడిచేత ‘అమ్మా’ అని పిలిపించుకుంటూ కన్నతల్లి ప్రేమని చూపిస్తోంది. ఆ గ్రామంలో ఆవిడ అంటే అంటే అందరికీ గౌరవాభిమానాలు. మంచితనానికి మారుపేరు ఆవిడ. తన కొడుకు ఇష్టాన్ని ఆవిడ ఏనాడూ కాదనలేదు. వేణుకి కూడా తల్లి అంటే చాలా ప్రేమ. వేణుకి ఉద్యోగం వచ్చాక ఆవిడ కొడుకుతో హైదరాబాద్ లో ఉంటోంది.
వేణుతో వివాహం జరిగిన తర్వాత అత్తగారింట్లో అడుగు పెట్టింది లక్ష్మి. వేణు, లక్ష్మిలు ప్రతిరోజూ తమ ఉద్యోగానికి యధావిధిగా వెళుతూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. తొలి రోజులలో అయినా అత్తగారు తనతో చాలా ప్రేమగా ఉంటున్నా, లక్ష్మిలో ఏదో తెలియని భయం, బెరుకుతనం. బంధాలు కొత్తగా ఉండటం వల్ల ఆమె ఆ ఇంట్లో నెమ్మదిగా కలిసిపోవడంలో కాస్త సమయం తీసుకుంది. ఒకరోజున రోడ్ యాక్సిడెంట్లో లక్ష్మి తల్లి తండ్రులు చనిపోయారు. జరిగిన దారుణం తెలిసి వేణు, లక్ష్మి, పార్వతమ్మలు చాలా బాధపడి లక్ష్మిని ఓదార్చి, జరగాల్సిన కార్యక్రమాలను దగ్గరుండి సక్రమంగా నిర్వహించారు. తర్వాత అందరూ తమ ఇంటికి వచ్చారు.
పార్వతమ్మకు ఆడపిల్లలు లేనందున లక్ష్మిని తన కూతురులాగా చూసుకుంటోంది. కానీ ఆవిడ పెద్దగా చదువుకోనందున తన భావాల్ని మాటల్లో చెప్పే అలవాటు లేదు. ఆమె లక్ష్మిపై ప్రేమ చూపించే పద్ధతి కాస్త కఠినంగానే ఉండేది. "ఇలా చేయాలి, అలా చేయాలి" అంటూ తన కోడలు కూడా తన పద్దతుల్లో ఉండాలని అనుకునేది. ఆవిధంగా ఆవిడ ప్రవర్తించేది.
లక్ష్మి ఈ కాలపు అమ్మాయిగా, తన స్వంత భావాలతో ఉండాలని అనుకునేది. క్రమేణా చిన్నచిన్న విషయాలకు కూడా అత్తాకోడళ్ల మధ్యలో స్పర్ధలు మొదలయ్యాయి. ఉదయం పాలు కాచే దాని నుంచి, వంటావార్పు, వడ్డన దాకా తమ కాలంలో ఎలా ఉండేవో, ఈ ఇంటికి కోడలిగా లక్ష్మి బాధ్యతలను సమయం దొరికినప్పుడల్లా వాటినన్నింటినీ పార్వతమ్మ కోడలి తో వివరంగా చెప్పేది. లక్ష్మి వాటన్నింటినీ నెగటివ్‌గా తీసుకునేది. అన్నింటినీ తన భర్తకు చెప్పి సాధించేది.
వేణు మధ్యలో ఉండి, ఇద్దరికీ సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినా తల్లి మాటల గంభీరత, భార్య కోపం అతన్ని సైతం కలవరపరిచేవి.
కొన్ని నెలల తర్వాత లక్ష్మి గర్భవతైంది. ఇంట్లో అందరూ ఆనందించారు.లక్ష్మి ఉద్యోగం మానేసి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటోంది. కానీ ఆ సమయంలో లక్షికి మానసికంగా పెద్ద మద్దతు అవసరం ఏర్పడింది.ఎప్పటిలాగే పార్వతమ్మ కోడలిని ఎంత ప్రేమగా చూస్తున్నా లక్ష్మికి ఆవిడ అంటే సుతరామూ గిట్టట్లేదు. ఏదోవిధంగా లక్ష్మి అత్తతో ఘర్షణకు దిగేది. పార్వతమ్మకి చాలా బాధేసి మౌనంగా తన మనసులోనే దాచుకునేది. ఇంట్లో నిత్యం భార్య గొడవలు వేణుకి చాలా బాధగా ఉంటున్నా భార్యనేమీ అనలేకపోయేవాడు. పార్వతమ్మకి తన కొడుకు నిస్సహాయత అర్థమైంది. రోజులు గడుస్తున్నాయి.
ఒక రోజు రాత్రి లక్ష్మికి పురిటి నొప్పులు రాగానే వేణు ఆమెని హాస్పిటల్ లో చేర్చాడు. పార్వతమ్మ కూడా వాళ్లతో వెళ్లింది. కాసేపటికి పండంటి కొడుకుని కన్నది లక్ష్మి. కొడుకుని చూసి వేణు, మనవడిని చూసి పార్వతమ్మ చాలా సంతోషించారు. బాబుతో ఇంటికి వచ్చినాక వాడికి ‘కిరణ్’ అని పేరు పెట్టుకుని అందరూ వాడిని చాలా ప్రేమతో పెంచుతున్నారు.
తల్లైనాక కూడా లక్ష్మిలో మార్పులు వస్తాయని తనను అర్ధం చేసుకుంటుందని ఆశించిన పార్వతమ్మకి నిరాశే ఎదురైంది. ఆవిడ తన మనవడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని లాలిస్తున్నా లక్ష్మికి నచ్చక ఆవిడ చేతిలోంచి కొడుకుని లాక్కెళ్లేది. ఇవేమీ వేణు దాకా వచ్చేవికావు. పార్వతమ్మకి ఏనాడూ తన కోడలిమీద నేరాలు కొడుకుకి చెప్పే అలవాటు లేదు. అనవసరంగా కొడుకుని బాధపెట్టకూడదని ఆవిడ భావన.
వేణు ఉద్యోగబాధ్యతలలో తలమునకలై ఇంటి విషయాలు పట్టించుకోవడం మానేసినా తన భార్య ప్రవర్తన వలన తల్లి మనసు బాధపడుతోందని మాత్రం గ్రహించాడు. ఆ విషయాన్ని ఎన్నోమార్లు లక్ష్మికి నచ్చచెప్ప ప్రయత్నించి విఫలమయ్యాడు వేణు. కొడుకు పరిస్థితిని అర్థం చేసుకున్న పార్వతమ్మ తన మనసుకు తనే సర్దిచెప్పుకునేది.
ఇంట్లో జరిగే ప్రతి విషయంలో లక్ష్మిదే పెత్తనమైంది. కిరణ్ క్రమేణా పెద్దవాడై స్కూలుకు వెళుతూ చక్కగా చదువుకుంటున్నాడు. ఒకరోజున లక్ష్మి తన స్నేహితురాలి సలహాతో తన అత్తగారిని అనాథాశ్రమంలో చేర్చ నిశ్చయించుకుని ఆ ఆశ్రమం పూర్తి వివరాలు తెలుసుకుని ఆ విషయాన్ని భర్తతో నెమ్మదిగా చెప్పింది. అక్కడన్నా తన తల్లి సంతోషంగా ఉంటుందనుకుని వేణు తన తల్లిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకుని ఆ విషయాన్ని తల్లికి చెప్పాడు.
ప్రాణంగా పెంచుకున్న కొడుకు నిర్ణయం విన్న పార్వతమ్మ ఖిన్నురాలైంది. ఆవిడ మనసు విలవిలలాడింది. తను ఇంక కొడుకు, కోడలికి భారం కాగూడదనుకుని మౌనంగా మనవడిని ప్రేమగా ఎత్తుకుని ముద్దాడి ఆ ఇంటిని వీడి బాధగా వేణుని అనుసరించింది. బాధతో వెళుతున్న అత్తగారిని చూసైనా లక్ష్మి మనసు కరగలేదు సరికదా సంతోషంగా ఉంది. అది పార్వతమ్మ గమనించి మరింత వ్యధచెందింది.
అనాథాశ్రమంలో ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేసిన వేణు తన తల్లికి జాగ్రత్తలు చెప్పి ఆవిడకి నమస్కరించాడు. కొడుకుని ప్రేమతో లేవదీసి తన గుండెలకు హత్తుకుంది పార్వతమ్మ. తన కొడుకు, కోడలు, మనవడు నిండునూరేళ్లు సుఖంగా ఉండాలని మనసారా ఆశీర్వదించింది. తల్లిని చూసి వేణు కూడా బాధపడ్డాడు. కాసేపటికి వేణు ఇంటికి వచ్చాడు.
తనను వీడి వెళుతున్న కొడుకుని కనుచూపు మేరా చూస్తున్న పార్వతమ్మ కనులు చెమర్చి తన పైట కొంగుతో కనులని తుడుచుకుంది. కొంతసేపటికి ఆశ్రమంలో ఆవిడ తన గదిలో నిద్రకి ఉపక్రమిస్తూ గతమంతా కనులముందు గుర్తుకు వచ్చింది.
తన కొడుకుకి ఈ తల్లి ప్రేమ, మనసు, తల్లి గుండెల్లో బాధ ఎప్పటికి తెలుస్తుందో? అప్పటిదాకా తను బ్రతికి ఉంటే కదా? ప్రాయము, కాలము, జననమరణాలు ఏవీ ఆగవు కదా! అవి ఎవరిచేతులలోనూ లేవు. అంతా దైవనిర్ణయం అనుకుని తన మనసుకు సర్దిచెప్పుకుని బాధాతప్తహృదయంతో కలత నిద్రలోకి జారింది పార్వతమ్మ.
భార్య వత్తిడితో అనాథాశ్రమంలో తల్లిని వదిలి ఇంటికి చేరిన వేణుకి కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. తను ఒకప్పుడు ‘అనాథ’ అని అతనికి ఎప్పటికీ తెలియదు.
కొసమెరుపు…అనాథా అయిన వేణుని ప్రేమతో చేరదీసి ప్రాణంగా పెంచి పెద్దచేసి, విద్యాబుధ్ధులు నేర్పి, అతనికి మంచి జీవితాన్ని ఇచ్చిన తల్లిలాంటి పార్వతమ్మని వేణు అనాథని చేసి అనాథాశ్రమంలో చేర్చాడు.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
YouTube Playlist Link
Comments