top of page

అందరి వాడు

#AndariVadu, #అందరివాడు, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKathalu, #తెలుగుకథలు

Andari Vadu - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 16/03/2025

అందరి వాడు - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి

"రహీం బేటా, జల్దీ స్కూలుకి పో! స్కూలు అవగానే దుకాణం కాడకు వచ్చేయ్" రెహమాన్ కేక వేసాడు. 


"అలాగే బాబా, నేరుగా ఆడికే వస్తా" రహీమ్ సమాధానం ఇచ్చాడు. 


ముస్లిం బస్తీలో రెహమాన్ కి చిన్న పచారీ షాపుంది. కొడుకు అబ్దుల్ రహీమ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. తన ఆర్థిక పరిస్థితి బాగులేక పోయినా వాడి భవిష్యత్ బాగుండాలని కష్టపడుతున్నాడు. 


రెహమాన్ - జుబేదాబీ కి రహీం అంటే ప్రాణం. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. 


పక్కింటి రజాక్ బేటీ ఫాతిమా - రహీమ్ చిన్నప్పటి నుంచి దోస్తులు. ఫాతిమా బాలికల స్కూల్లో చదువుతోంది. 


ఇరుగు పొరుగు కుటుంబాలైనందున ఫాతిమా తరచు మాముతో కలిసి జుబేదా దగ్గరికి వస్తూంటుంది. రహీం వద్ద చదువు సంబంధించిన విషయాలు తెలుసుకునేది. అందువల్ల రహీంతో చనువుగా ఉంటుంది. 


రజాక్ సున్నీ ముస్లిం. బస్తీలో అతనికి చికెన్, అంగడితో పాటు ఫేన్సీ షాపుంది. 


రజాక్ షాపు నుంచి గుడ్లు తెచ్చి రెహమాన్ చిల్లరగా తన షాపులో అమ్ముతూంటాడు. 


రోజులు గడుస్తున్నాయి. వయసులో పెద్దవారవుతున్నందున ఫాతిమా - రహీం ఇదివరకటిలా కలుసుకోలేక పోతున్నారు. ఫాతిమాకి బురఖా ఆంక్షలు ఎక్కువైనాయి. 


రజాక్ - రెహమాన్ లది మతం ఒకటైనా కులాలు వేరు. రజాక్ ది ఉన్నత కులం. రెహమాన్ ది దూదేకుల కులం. అదీగాక ఆర్థికంగా కూడా అంతరాలున్నాయి. 


ఈ మధ్య వ్యాపార లావాదేవిల్లో విభేదాల వల్ల రెండు కుటుంబాల మధ్య రాకపోకలు తగ్గేయి. 


రహీం స్కూలు అవగానే షాపు కొచ్చి తండ్రి రెహమాన్ కి సాయం చేస్తూంటాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. 


రహీం ఇంటర్ లోకి వచ్చేడు. ఇంటర్ తో చదువు ఆపి దుకాణం మీద కూర్చేబెట్టాలనుకుంటున్నాడు రెహమాన్. రహీం మాత్రం డిగ్రీ పూర్తి చెయ్యాలనుకుంటున్నాడు. 


రహీం కి చిన్నప్పటి నుంచి చదువంటే శ్రద్ధ ఎక్కువ. వారు నివాసముండే బస్తీలో అందరు చిరు వ్యాపారులు, కార్ఖానాల్లో పని చేసే కార్మికులే కనిపిస్తారు. చదువుకున్న వారు తక్కువ. 


పేదరికం, నిరక్షరాస్యత, అపరిశుభ్ర వాతావరణం వల్ల బస్తీలో జనం తరుచు రోగాల బారిన పడుతూంటారు. చెడు అలవాట్లతో ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. సంప్రదాయమైన కట్టుబాట్ల వల్ల స్త్రీ లలో లోక జ్ఞానం తక్కువగా ఉంటోంది. 


రహీం చదువుతో పాటు లోకజ్ఞానం సంపాదించి బస్తీ ప్రజల్లో పరిసరాల పరిశుభ్రత, శరీర శుభ్రత, విధ్యా విషయాలపై అవగాహన కల్పిస్తున్నాడు. దురలవాట్ల నుంచి దూరం చేసి డబ్బు పొదుపుకి కృషి చేస్తున్నాడు. 


రహీం కృషి వల్ల బస్తీలో తాగి కొట్లాడుకోవడం, దొంగతనాలు తగ్గుముఖం పట్టేయి. పిల్లల్ని స్కూలుకి పంపిస్తున్నారు. 


ఇంట్లో ఒకరు చదువుకున్న వారుంటే కుటుంబ సబ్యులు విజ్ఞానులవుతారు. ఒక వెలిగే దీపంతో ఎన్నో దీపాల్ని వెలిగించొచ్చు. ఒక విజ్ఞాన జ్యోతితో ఆమడల అజ్ఞాన జ్ఞోతిని పారదోలవచ్చు. ఇదీ రహీం సిద్ధాంతం. 


స్థానిక రాజకీయ నాయకులు రహీం కృషిని ప్రశంసించి బస్తీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 


రహీం ఎలాగైనా డిగ్రీ చదివి బి. ఎడ్. పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా స్థిరపడి జనాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించాలనుకున్నాడు. 


రహీం ఇంటరు చదువు పూర్తి చేసాడు. "బేటా, ఇక పెద్ద చదువులకి పైసలు కష్టమవుతాయి. దుకాణం మంచిగ నడుస్త లేదు. నువ్వు షాపుకాడ నాకు మదద్ చెయ్యి." రెహమాన్ తన అశక్తత తెలియచేసాడు. 


"బాబా, నువ్వు ఫికర్ కావద్దు. నేను సర్కారు పైసలతో  స్కాలర్ షిప్ సంపాదించి కాలేజీ చదువు పూర్తి చేస్తా" నన్నాడు. 


బస్తీ రాజకీయ నాయకుల సాయంతో స్కాలర్ షిప్ సంపాదించి డిగ్రీ పూర్తి కావించి ముస్లిం మైనారిటీ కోటాలో బి. ఎడ్. సీటు వచ్చి ట్రైనింగు పూర్తి చేసి తన కోరిక ప్రకారం టీచరై జిల్లా స్కూలుకి వెళ్లి జాయిన్ అవమని ఆర్డర్స్ వచ్చాయి. 


టీచర్ గా తమ బిడ్డ సర్కారీ నౌకరి సంపాదించినందుకు ఆనందంగా ఉన్నా బస్తీకి, తమకి దూరంగా పల్లెకి వెళ్తున్నందుకు బాధ వ్యక్తం చేసారు రెహమాన్ దంపతులు. 


"కొద్ది రోజులే బాబా, పహలీ నౌకరి పల్లెలో చేస్తే ఆనక సిటీలో స్కూలుకి బదిలీ అవుతాది. పరిషాన్ కావద్దు అబ్బా! " ఓదార్చాడు రహీం. 


టీచర్ గా మొదటి పోస్టింగు ఇచ్చిన గ్రామానికి మకాం మార్చేడు రహీం. 


ముస్లిం బస్తీలో పెరిగిన రహీం కొత్త ఊరు, పల్లె ప్రజల అమాయకత్వం, నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు చూసి ఆశ్చర్యపోయాడు. 


శని ఆది వారాల్లో, స్కూలుకి శలవులప్పుడు సిటీ కొచ్చి బస్తీలోని మామి బాబాలను కలసి వెల్తున్నాడు రహీం. 


నెలలు గడిచిపోయాయి. పల్లె జీవితానికి అలవాటు పడుతున్నాడు


ఒకరోజు ఊరి పంచాయతీ ఆఫీసు దగ్గరున్న స్థానిక లైబ్రరీ వద్దకు వెళ్లిన రహీంను చూసి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ముఖాన్ని, మెడ మీదున్న పెద్ద పుట్టుమచ్చను, కుడిచేతి కాలిన గాయపు గుర్తును చూసి

"నువ్వు యాదయ్య పెద్ద కొడుకు అనంత రాములు కదురా" అన్నాడు. 


రహీం ఒక్కసారిగా ఆశ్చర్య పోయి "నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ని. నా పేరు అబ్దుల్ రహీం." అన్నాడు. 


"కాదు, నువ్వు సిటీలో ఇరవై సంవత్సరాల క్రితం తప్పిపోయిన యాదయ్య కొడుకు రాములు గాడివే. ఈ గుర్తులన్నీ ఆడికున్నాయి. నిజం చెప్పు" ఆ పెద్ద మనిషి గద్దించాడు. ఆ మాటలు విన్న రహీం అవాక్కయాడు. 


గ్రామం నుంచి ఎప్పుడో సిటీలో పనికెళ్లినప్పుడు తప్పిపోయి చనిపోయాడనుకున్న పెద్ద కొడుకు రాములు బతికే ఉన్నాడని తెల్సి ముసలి దంపతులు యాదయ్య - నర్సవ్వ అయోమయానికి గురయారు. 


ఊరి స్కూలుకి కొత్తగా వచ్చిన మాస్టరే ఎప్పుడో సిటీలో తప్పి చచ్చిపోయాడనుకున్న రాములేనని జనాలు చెప్పుకుంటున్నారు. ఊరి ప్రజలు రహీంని వింతగా చూస్తున్నారు. ఇది రహీంకి ఇబ్బందిగా మారింది. 

 

యాదయ్య ఇంట్లో ఉన్న పాత కుటుంబ పోటోలో చిన్నప్పటి రాములు మెడ మీద పుట్టుమచ్చ స్పస్టంగా కనబడుతోంది. ఊరి సర్పంచి ద్వారా ఈ విషయం తహసీల్దారు తర్వాత పోలిసు స్టేషనుకి చేరింది. సిటీలో చిన్నప్పుడు రాములు తప్పిపోయిన విషయం లేబర్ కాంట్రాక్టరు ఇచ్చిన పోలీసు కంప్లంయింటు రిఫర్ కి వచ్చింది. 


రహీం తల్లి దండ్రులుగా చెప్పుకుంటున్న రెహమాన్ - జుబేదా లు రహీం తమ స్వంత కొడుకేనని బర్త్ సర్టిఫికేటు, స్కూలు సర్టిఫికేటు అందచేసారు. 


రాములు అమ్మా నాన్నలు, ఊరి జనం మాత్రం రహీమే రాములని నిర్ధారణగా చెబుతున్నారు. 


పోలీసు వారికి కోర్టు ద్వారా రెండు కుటుంబాల సబ్యులకీ డి. ఎన్. ఎ. పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. 


డి. ఎన్. ఎ. పరీక్ష ఫలితాల్లో యాదయ్య - నర్సవ్వలే అసలైన జన్మనిచ్చిన తల్లి దండ్రులుగా నిర్దారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు వయసులో మేజరైన రహీం నిర్ణయానికి వదిలి పెట్టారు. 


ఈ సందిగ్ద పరిస్థితిలో అసలు నిజమేమిటో తెలుసుకోవాలని ఏం జరిగిందో చెప్పమని రెహమాన్ - జుబేదాలను ప్రాధేయ పడ్డాడు రహీం. 

 

రహీం మనోవేదన చూసిన వారు నిజం చెప్పక తప్పలేదు. "ఔను బేటా, ఇరవై సంవత్సరాల కిందట రంజాన్ మాసంలో పిల్లల్ని అపహరించి బిక్షాటనలో పెట్టే ఒకవ్యక్తి నువ్వు ఐదు సంవత్సరాల వయసప్పుడు ఎత్తుకొచ్చి పోలిసోళ్లకి భయపడి మా ముస్లిం బస్తీలో వదిలి పెడితే, ఆకలితో మా దుకాణం దగ్గర ఏడుస్తూ కనబడిన నిన్ను చేరదీసి మీ బంధువుల కోసం ఎదురు చూసి ఎవరు రాకపోతే బిడ్డలు లేని మేము రహీమ్ పేరు పెట్టి పెంచి పెద్ద చేసా”మని అసలు

విషయం చెప్పేరు. 


"బేటా, ఈ ముసలి వయసులో మమ్మల్ని అనాథలుగా వదలి వేయ వద్దని" పెంచిన ప్రేమతో కన్నీరు పెట్టుకున్నారు వారు. 


ఇంతకాలం తనని కంటికి రెప్పలా కాపాడి పెంచి వారి శక్తికి మించి చదివించి ప్రయోజకుణ్ణి చేసారు. వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా ఒదిలి పెట్టనని నిర్ణయించుకున్నాడు. వారే నా అసలైన తల్లిదండ్రులని నిశ్చయించుకుని కోర్టుకి తన నిర్ణయాన్ని లిఖిత పూర్వంగా తెలియజేసాడు రహీమ్. 


 కొద్ది కాలం తర్వాత సిటీలో స్కూలుకి బదిలీ చేయించుకుని వారి బస్తీలో అనేక మార్పులు తెచ్చి అందరికి అభిమాన పాత్రుడయాడు. 


కుటుంబ బేదాభిప్రాయాలతో దూరమైన రహీమ్ - ఫాతిమా నిఖాతో రెండు కుటుంబాలు దగ్గరయాయి. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


 
 
 

Comentarios


bottom of page