top of page
Writer's pictureB Sathyavani

అందరిల్లు



'Andarillu' - New Telugu Story Written By B. Sathyavani

Published In manatelugukathalu.com On 21/07/2024

'అందరిల్లు' తెలుగు కథ

రచన: బి. సత్యవాణి


మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నిప్పుల కొలిమిలా కాలిపోతున్నాడు. ఎండ తీవ్రంగా ఉంది. నడిరోడ్డులో చెప్పులు లేకుండా కాలే కడుపున పట్టుకొని కాలుతున్న కాళ్ళని సైతం లెక్కచేయకుండా ఆకలి బాధతో “బాబ్బాబూ.. తినడానికి ఏదైనా ఉంటే పెట్టండి బాబు.. దానికి తగ్గ పని చేసి పెడతాను” అని వెళ్లే ప్రతి వారిని ఒక చిన్న పాప అడుగుతుంది. 


ఏం లాభం! ఒక్కరైనా చూస్తేనే కదా తెలిసేది ఆ పసి దాని ఆరాటం. అనుకోకుండా దీప కంట పడింది. దీపకి తన జీవితం మొత్తం కళ్ళ ముందు మెదులుతుంది. తనని తాను చూసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ దేవుడు లాంటి సీతారామయ్య గారు ఆరోజు చేరదీయబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని అనుకుంటుంది. సీతారామయ్య గారు చేరదీసి సొంత కూతురు లాగా భావించి చదివించి దీపను ఒక స్థాయిలో నిలబెట్టారు. అనాధ అని భావన ఎప్పుడు రానీయకుండా పెంచారు. 


దీప ఆ పాపని చూసి పాపం ఈ పాపని ఎవరూ ఆదరిస్తారు? అని అనుకుంటూనే ఆ పాపకి దగ్గర్లో ఉన్న హోటల్లో భోజనం కొని ఇచ్చింది. పార్సెల్ చించి ఆవురావురమంటూ తింటుంది. అంతలో ఏదో ఆలోచన వచ్చిందనుకుంటా ఆ పాపకి ఒక్కసారిగా దీపకాళ్ళ మీద పడి “అమ్మగారు మీరు చల్లగా ఉండాలి” అని కాళ్ళని పట్టుకుని వదలదు. 


అతి కష్టం మీద దీప వదిలించుకుంటుంది. ఒక్కసారిగా దీపకళ్ళ నుంచీ నీళ్ళు వచ్చేసాయి. ఆ చిన్నపిల్ల అన్నాన్ని పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంది దాచుకుని.. తర్వాత తింటుందేమో అని దీప అనుకుంటుంది. 


అనుకోకుండానే తనని అనుసరిస్తూ వెళ్ళిపోతుంది. అక్కడ ఒక ముసలి అతను ఉన్నాడు. ఆ పాప అతని దగ్గరకు వెళ్లి పొట్లం ఆ ముసలి అతనికి అందించింది. ఆ ముసలి తాత తడుముతూ తడుముతూ ఆమె తల మీద చేయి వేసి “చల్లగా ఉండమ్మ నా బంగారు తల్లి” అంటూ తిన్నాడు. 


అప్పుడు అర్థమైంది అతనికి కళ్ళు కనిపించవని. ‘చూస్తుంటే ఇదివరకు కష్టపడి పనిచేసి సంసార భారాన్ని మోసి అలసిపోయిన వాడివలే ఉన్నాడు. ఏం కష్టం వచ్చిందో? ఈ దుస్థితి వచ్చింది’ అని దీప అనుకుంటుంది. 


ఆ పాపని వాళ్ళ తాత గురించి అడుగుదామనుకుంటుంది. కానీ ఇంతలో ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లి పోవాల్సి వచ్చింది. 

 

ఏప్రిల్ 3న దీప వాళ్ళ నాన్నగారి సంవత్సరికం. కావున తెలిసిన వాళ్ళు ఎవరు అంతగా లేరని గుడి దగ్గర అన్నదానం పెట్టిస్తుంది. దీప వడ్డన లో మునిగిపోతుంది. అక్కడ ఉన్న పెద్దలు ఆ దిక్కు మొక్కు లేని జనాన్ని భోజనం తినడానికి లోపలికి రానివ్వలేదు. వాళ్ళు వస్తే అపవిత్రమైపోతుందట. 

 “మిగిలితే మీకే పడేస్తాం” అని అంటూ లోపలికి రానివ్వడం లేదు. 


దీప వాళ్ళని రానివ్వండి అన్నా ‘నీకు తెలియదమ్మా ఊరుకో.. ఇలాంటి వారిని చూసి జాలి పడకూడదు’ అన్నారు. 


‘ఏం? వాళ్లు మనలా మనుషులు కాదా? వాళ్ళకి మాత్రం ఆకలివేయదా?’ అని అడుగుదామనుకుంటుంది కానీ ‘మూర్ఖులకు ఎంత చెప్పినా మన మాట వినరు. వాళ్ళు చెప్పేదే వేదం అని అనుకుంటారు’ అనే మాటలు వీళ్ళను చూస్తే దీపకి నమ్మాలనిపించింది. అందుకే ఏమీ మాట్లాడలేదు. త్వరగా వడ్డన ముగించుకుని మిగిలిన భోజనాలను గుడికి వెనుక భాగంలో ఖాళీ స్థలంలో పెట్టిస్తుంది. ఇక విస్తర్లు వేసి ఆ దిక్కు మొక్కు లేని జనాన్ని పిలిచి వడ్డిస్తుంది. 


“ఇంకా ఎవరైనా ఉంటే తీసుకురండి” అని వాళ్లకు చెప్తుంది. వాళ్ళందరూ దీప మంచితనానికి తమపై చూపిస్తున్న ప్రేమకి ఆమె కాళ్ళని పట్టుకొని ఏడ్చి వదలడం లేదు. 


అతి కష్టం మీద వాళ్లని వదిలించుకుని “పెద్దలు నాకాళ్లు మొక్కడం ఏంటి?” అని అంటూనే బాధపడుతుంది. 


వారికి వడ్డన చేయడానికి ఇద్దరు ముగ్గురు యువకులు వచ్చారు. కడుపు నింపావు అని బాధ సంతోషం మిళితమైన కళ్ళతో దీవిస్తూ తింటున్నారు. అంతలోనే దీపకి ఇదివరకు చూసిన ఆ కళ్ళు లేని ముసలి తాత కనిపించాడు. 


దీప “తాతా! మీ మనవరాలు ఏది?” అడుగుతుంది. 


దానికి ఆ తాత “ఏదైనా తినడానికి దొరికితే నా దగ్గరకు వచ్చి పెడుతుంది. లేదంటే జాడైనా ఉండదు. ఏంటో ఇంత చిన్న పిల్లలకు ఎన్ని కష్టాలు? దానికి తోడు నా బాధ్యతను కూడా తనేమోస్తుంది. దాని కడుపు తోపాటు నా కడుపూ నింపుతుంది” అని చెప్పాడు. 


“మధ్యతరగతికి చెందిన వాడనని, వ్యవసాయం చేసే, తన కొడుకులను చదివించి ప్రయోజకులకుని చేశానని, వాన వచ్చి పంట నాశనం అయ్యింది అని, ప్రభుత్వం ఇచ్చే భరణం అధికారులు తన వద్దకి రానీయ లేదని, పొలాన్ని ఇంటిని తాకట్టు పెట్టి మరీ తన కొడుకు అమెరికా వెళ్ళాడు అనీ, కనీసం ఎలా ఉన్నావ్? అని కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదనీ, ఆ వడ్డీల పుల్లారావు వచ్చి పొలాన్ని స్వాధీనం చేసుకున్నాడనీ, మొత్తం చెబుతాడు. 


“నా అనుకున్న వాళ్లే నన్ను నిలువునా ముంచేశారమ్మా! దానికి తోడు కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యింది. ఆపరేషన్ కి డబ్బులు కట్టమన్నారు. తినడానికి తిండి లేని వాడికి అంత డబ్బు అంటే మాటలా.. నావల్ల కాదని వచ్చేసా. అలా కళ్ళు పోయాయమ్మా! ఆ దేవుడు ఆ పాప రూపంలో వచ్చి సాయం చేస్తున్నాడమ్మా. కానీ ఆ పాపకి నేను మరింత భారం అయ్యా”నని చెప్పి బాధపడతాడు. 


ఇదంతా వింటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనసును కదిలించే బాధలు కష్టాలు ఉన్నాయని అర్థమైంది. 

 

ఇంక ఇంటికి వెళ్లినా ధ్యాస మొత్తం వాళ్ల మీదే ఉంది దీపకి. మరుసటి రోజు తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తుంది. 


“ఏంటి నా పెళ్ళికి ఇంత తొందరగా వచ్చావు? తాళి కట్టే సమయానికి రాకుండా?” అని దీపతో అంటుంది. 


దీప మామూలుగా ఉండుంటే మాటకు మాట ఇచ్చేది కానీ ఏదో పరధ్యానంగా ఉంది. ఇంతలో తన బెస్ట్ ఫ్రెండ్ వసుధ, వాళ్ళ అమ్మ పిలిచిందని వెళ్ళిపోతుంది. పెళ్లి అంతా బాగానే జరుగుతుంది. దీప భోజనాన్ని కూడా ఆలోచిస్తూనే తింటుంది. 


ఇదంతా గమనించిన తన బెస్ట్ ఫ్రెండ్ వసుధ “అసలు ఏమైంది?” అని అడుగుతుంది. “చెప్పు నీకంటూ ప్రస్తుతం ఎవరున్నారు నేను తప్ప” అని ఏడుపు ముఖం పెట్టేస్తుంది. 


“పెళ్లికూతురు ఏడ్వకూడదు” అంటూ జరిగినది మొత్తం చెప్తుంది దీప. 


“అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?” అని అడుగుతుంది. 


“వసుధా! ప్రస్తుతానికి నీ పెళ్లిలో మిగిలిన బోజన పదార్థాలు ఉంటే ఏమైనా ఇప్పించగలవా?” అని అడుగుతుంది. 

అప్పుడు వసుధ, వాళ్ళ నాన్న గారితో చెప్తే “ఓ….. దానికి ఏముంది? నీ పెళ్లి రోజు అలాంటి వాళ్ళ కడుపునింపితే అంతకన్నా పుణ్యం ఏముంటుంది చెప్పు” అని మనుషులను పెట్టించి దీప చెప్పిన ప్రదేశానికి భోజన పదార్థాలన్నీతీసుకువెళ్తారు. 


వాళ్ళందరు దీపను దీవిస్తూ “కన్న కొడుకులే నడిరోడ్డున పడేస్తున్నారు. కూతుర్లు నాకు ఏం సంబంధం లేదనుకుంటున్నారు ఈరోజుల్లో. నీ మంచితనానికి మేము ఏమి ఇచ్చి రుణం తీర్చగలము” అని బాధపడతారు. 


దారంతా వెళ్లే వాళ్ళు వాళ్ళని చూస్తూ పాపం అనుకుంటే మరి కొంతమంది “ఇలా వీళ్ళకి నొప్పి తెలియకుండా పెడుతుంటే ఇంకెందుకు పని చేసుకుంటారు? సోమరులాగా కూర్చుని దెబ్బి తింటారు” అని అనుకుంటున్నారు. 


ఆ మాట దీప మనసును తాకింది. ఒకసారి దీప హృదయం చివ్వుక్కు మంది. 

 

ఇంటికి వెళ్ళింది. ఎవరో సీతారామయ్యగారి గిడ్డంగి కొనుక్కుంటామని వచ్చారు అప్పుడు దీపకి మెరుపు వేగంతో వచ్చిన ఆలోచన వాళ్లకి గిడ్డంగిని ఇవ్వనివ్వలేదు. 


ఆ అభాగ్యుల దగ్గరికి వెళ్లి “మీకు పని, దానితో పాటే తిండి కూడా ఇస్తాను. నాతో పాటు వస్తారా” అని అడిగితే ముందు నమ్మలేదు. తర్వాత వస్తామని బయలుదేరుతారు 20 మంది వస్తారు. దీప వాళ్ళతో కలిసి ఆ గిడ్డంగి ని శుభ్రం చేస్తుంది. తను ముందుగానే ఫ్యాక్టరీ ఓనర్ తో మాట్లాడుతుంది. 


“ఇలా ఇంతమంది పనికి వస్తారు” అని చెప్తుంది. దీప చేస్తున్న మంచి పనికి తన వంతు సాయం చేద్దామని ఒప్పుకుంటాడు. దీప సీతారామయ్య గారు తన పేరు మీద రాసిన గిడ్డంగి పత్రాలను బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని కూరగాయలు సరుకులు, వాళ్ళకి బట్టలు తెస్తుంది. ఆ గిడ్డంగికి “అందరిల్లు” అని నామకరణం చేస్తుంది. 


అందరి ఇల్లు అనే పేరు కింద భాగాన “నీకు ఉన్నది తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టుకో” అని రాయిస్తుంది. 


ఇక చిన్నపాటి ఆశ్రమం తయారవుతుంది. “అందరిల్లు లో ఉండే మీరు ఇకనుండి అనాధలు కాదు. మనమంతా ఒకే ఒక కుటుంబం. అందరూ కలిసికట్టుగా ఉండి పనులు చేసుకోవాలి” అని చెప్తుంది. 


“మీరు మీ కాళ్ళ మీద నిలబడే గలిగే స్తోమత వచ్చాక మీరు, ఇంకో నలుగురు నిలబడేందుకుగాను చేయూత ఇవ్వాలి” అని చెబుతోంది. 


ఫ్యాక్టరీ ఓనర్ కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువగానే జీతాన్ని ఇస్తున్నారు. ఆడవాళ్లు, మగవాళ్ళు పనులకు వెళ్తున్నారు. ముసలి వాళ్లు ఏదో వాళ్ళకి చేతనైన పనులు అందరి ఇంట్లో చేస్తున్నారు. తుడవడం, అంట్లు తోమడం, వంటకి కూరగాయలు కోయడం.. లాంటివి. 

 

దీప పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేరిపించి ఉపాధ్యాయులకు విషయం చెప్పి వాళ్ళ బాధ్యతను అప్పచెప్తుంది. ఆ పిల్లల గురించి మిగతా పిల్లలకు తెలియకుండా మామూలుగానే వాళ్లందరికీ పాటలు చెబుతూ అందరిని ఒకేలా చూసుకుంటున్నారు. పిల్లలు కూడా తమ బ్రతుకు సరిదిద్దుకొని దీపక్క లాగా నలుగురికి సాయం చేయాలి అనే లక్ష్యంతో చదువుకుంటున్నారు. వారికి మధ్యాహ్నం భోజనం అక్కడ పెట్టడం, అది కూడా పోషకాహారం కావడం.. పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. 

 

ఒక పక్క వారి బాగోగులు చూసుకుంటూనే మరో పక్క ఆఫీస్ కి వెళ్లి వచ్చిన జీతంతో బ్యాంకు లోన్ తీసి మిగతావి అందరి ఇంటికి ఖర్చు పెడుతుంది. ఫ్యాక్టరీ యజమాని ఏ రోజు జీతం ఆరోజే ఇవ్వడంతో వారికి కొంచెం ఆసరా లభించింది. రోజు రోజుకి ‘అందరి ఇంట్లో’ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. 


ఇల్లు ఇరుకైనా వారి మనసులు విశాలంగా ఉన్నవి. అందుకే అలా సర్దుకుపోతున్నారు. దీప చిన్న గుడిసె వేద్దామన్నా చేతిలో డబ్బు ఉండడం లేదు. వసుధ వాళ్ళ భర్త మీడియా జర్నలిస్ట్ కావడంతో ఆమెకు తన వంతు సాయం చేద్దామని ఆ చిన్న ఆశ్రమమైన ‘అందరిల్లు’ గురించి న్యూస్ లో న్యూస్ పేపర్స్ లో వేయడం, దాన్ని అందరూ చూడడం వలన చాలామంది తమ వంతు సాయం చేస్తున్నారు. 


కొంత మంది అయితే కొత్త వ్యాపారం మొదలు పెట్టారా? బానే సంపాదిస్తున్నారే వాళ్లని అడ్డం పెట్టుకొని అనీ అంటున్నారు. దీపకి చాలా బాధ కలుగుతుంది. మంచి చేస్తుంటే చేయూత ఇవ్వడం పక్కన పేట్టి నాలుగు రాళ్ళు వేస్తున్నారు. అయినా దీప సమాజం అన్నాక మంచి వారు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు దేవుడి మీదభారం వేసి ముందుకు సాగితే దైవమే సాయం చేస్తుంది అనీ దీప నమ్మకం. 


వారిలో కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలుగా వచ్చి అందరిల్లు అనే సంస్థ అభివృద్ధికి కృషి చేసి విరాళాలు సంపాదించి సంవత్సరం తిరిగేలోగా పైన ఇంకో స్టేర్ వేశారు. దిన దినాభివృద్ధి జరిగి ఆశ్రమం గురించి దీప గురించి నాలుగు ఐదు సంవత్సరాలలో ప్రపంచం మొత్తం తెలిసింది. 


విరాళాలు పంపి సరిహద్దులు తెంచుకుని దేశాల పౌరులము మాత్రమే కామని ప్రపంచ పౌరులము అని అంతా సాయం చేశారు. దగ్గరలో ఎక్కడైనా పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలు జరిగినా ఆ అందరిల్లు కి పంపుతున్నారు. పెద్దపెద్ద వాళ్లు పుట్టినరోజులు అక్కడే చేసుకునే వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. అందరింట్లో సభ్యులందరూ ఎంతో కలిసిమెలిసి ఉంటున్నారు. 


కులమత వర్గాల వివక్షత లేకుండా ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అన్నట్లు తమ వంతు సాయం చేసి ఆ సంస్థ అభివృద్ధికి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తున్నారు. 

 

చాలామంది “దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు” అనేది సామెత అని అనుకున్నాము కానీ ఈనాడు నిజంగా చూస్తున్నాము అని చాలామంది అనుకుంటారు. ఆనాడు సీతారామయ్య గారు దీప అని ఏ ఉద్దేశంతో పేరు పెట్టారో గాని ఈనాడు ఎంతోమంది జీవితాలకు దారి చూపిస్తుంది. తన దీపపు వెలుగులతో ఎంతోమంది జీవితానికి వెలుగులు నింపుతుంది అని దీపని అందరూ ప్రశంసించారు. 


పది సంవత్సరాల తర్వాత “గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి”కి దీప ఎంపిక అవుతుంది. భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం “ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్” ను అందిస్తుంది. దానికి దీప ఎంపిక కావడం ఎంతోమంది ఆనందానికి కారణమైంది. భారతదేశంలో నగదు రూపంలో ఉన్నతమైన అవార్డు. అవార్డు విజేతకు అవార్డు పథకం, లిఖిత పత్రంతో పాటు “ఒక కోటి రూపాయల నగదు” బహుమానాన్ని కూడా అందజేస్తారు. ఇటువంటి ఉన్నతమైన అవార్డు దీపకి రావడం అనేది మన దేశం చేసుకున్న అదృష్టమని చెప్పుకోవాలి. 


భారత ప్రభుత్వం బహుమతి స్వీకరించడానికి దీపకు పిలుపునిచ్చింది దీపకి దీని గురించి అసలు ఏమీ తెలియదు. దేశంలో చాలామంది ఈ సన్నివేశాన్ని చూడడానికే టీవీ చూస్తున్నట్లు ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఈ సంస్థ గురించి తెలిసిన వారు కూడా ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నారు. చివరికి ఆ శుభ తరుణం వచ్చేసింది. 


 ప్రధాని చేతుల మీద గాంధీ అవార్డును అందించారు. ఒక కోటి రూపాయల క్యాష్ ని కూడా అందించారు. దీప అవార్డును తీసుకుంటూ “స్వచ్ఛందంగా ఇటువంటి స్వార్థం లేకుండా ప్రతిఫలం ఆశించకుండా తమ వంతు సాయం చేసిన నా ప్రపంచ సోదర సోదరీమణులకు ఈ అవార్డు అంకితం. మానవత్వాన్ని బ్రతికిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా తరపున మీ అందరికి చెబుతున్న మాట ఒకటే.. మీకు ఉన్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆధారంగా పెట్టుకోండి” అని చెబుతుంది. 


 “ఈరోజు మనకి వచ్చిన ఈ డబ్బును సంస్థ అభివృద్ధికే కృషి చేస్తాను” అని సభాపూర్వకంగా చెబుతుంది. 


చెప్పడం పూర్తికాక మునుపే సభంతా చప్పట్ల వర్షంతో మునిగిపోయింది. ఇప్పుడు ప్రతి వారి మదినా “నీకు ఉన్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆధారంగా పెట్టుకో” అనే మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. దేశంలో చాలావరకు ఆహారాన్ని వృధా చేయడం మానేశారు. 


మన భారతదేశం యొక్క గొప్పతనం “అందరిల్లు” కారణంగా విశ్వమంతా వ్యాపించింది. 


***

బి. సత్యవాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: బి. సత్యవాణి

హాబీస్ చదవడం, కథలు నవలలు రాయడం, కార్టూన్స్ గీయడం.




























 



 

 


40 views0 comments

Comentarios


bottom of page