top of page

అంకితం

#UndavilliM, #ఉండవిల్లిఎమ్, #Ankitham, #అంకితం, ##TeluguHeartTouchingStories


Ankitham - New Telugu Story Written By Undavilli M

Published In manatelugukathalu.com On 22/04/2025

అంకితం - తెలుగు కథ

రచన: ఉండవిల్లి.ఎమ్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



జీవితంలోని సమస్యల్లా గోదావరిలోని చిన్న చిన్న అలలు మెరుస్తూ కనుమరుగైపోతున్నాయి. 


విశ్వం మరో సిగరెట్టు వెలిగించి, దీర్ఘంగా పీల్చి గాల్లోకి వదులుతున్నాడు పొగని. గోదావరి నిర్మలంగా ఉంది. 


రాత్రి కావడంతో నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల్లో గోదావరి మిలమిల మెరుస్తూ ఓ అనుభూతిని అంతర్వాహిని గా జారవిడుస్తుంది. ఎంతకీ తెగని ఓ సుదీర్ఘ ఆలోచన. విశ్వం మరో సిగరెట్టు వెలిగించాడు. 


వెళ్లిపోయే రిక్షావాళ్ళు "రిక్షాబాబు" అంటూ పలకరిస్తున్నారు. విశ్వం గట్టు మీంచి రోడ్డు ముందుకు నడచి ఎడమ వైపు తిరిగాడు. ఆరని సిగరెట్టునే నమ్ముకున్నవాడిలా శూన్యంలోకి పోతున్న పొగలాగే అతనూను. 


వెన్నెల్లో ఏదో మెరిసింది అతని కళ్ళకి, తల తిప్పి చూసాడు. తెలుపు కలిసే చీరతో, తలనిండా తెలుపుని ఆరబోసినట్లున్న మల్లెపూలతో, గుచ్చుకునే మత్తైన చూపుల్తో దీక్షగా, ఆర్తిగా పిలుస్తున్నట్టే ఉన్నాయి ఆ కళ్ళు. 


ఒక్క నిముషం ఆగి అటువైపు చూసాడు. సిగరెట్ దమ్ము బలంగా లాగి, ఏదో స్ఫురించిన వాడిలా వెనుదిరిగి ఆమె గుమ్మం ముందు నిలబడ్డాడు. 


నవ్వుతూ "లోపలకి రండి" అంటూ స్వాగతం పలికింది ఆమె. లోపల సోఫా చూపించి కూర్చోమంది. 


మంచినీళ్లు తెచ్చిచ్చింది. విశ్వం "వద్దు" అన్నాడు. ఆమె అతనికెదురుగా సోఫాలో కూర్చుంది. 


"ఎక్కడ్నుంచి వచ్చారు?" ఆమె అడిగింది. 


"లోకలే.. "


"నీ పేరు?"మళ్ళీ విశ్వమే అడిగాడు. అతని చేతిలోని సిగరెట్టు ఆరిపోనివ్వడంలేదు. 


"అంకిత" అంది. 


"సిగరెట్లు కావాలి తెప్పించు" ఐదు వందల రూపాయల కాగితం టీపాయ్ మీద పెట్టి "గోల్డ్ ఫ్లాక్ కింగ్ సైజ్ నాలుగు పెట్టెలు" అన్నాడు.

 

నాలుగు పెట్టెలనడంతో వింతగా చూసి, పిల్లవాడ్ని పిలిచి ఐదు వందల రూపాయల నోటు ఇచ్చి పంపించి వేసింది. 


"భోజనం చేస్తారా" అంది. 


"వద్దు" అన్నాడతను. 


"టిఫిన్ తెమ్మంటారా?" అని అడిగింది. 


"ఏమీ వద్దు" అన్నాడతను. 


"మరేమైనా.. " అంటూ ఆగింది అంకిత. అతను ఆమె కళ్ళలోకి చూశాడు. 


"కాఫీ, టీ, పాలేమైనా.. " అంది అంకిత. 


"టీ తీసుకురా" అన్నాడతను. 


సిగరెట్లకు వెళ్లిన కుర్రాడు నాలుగు పెట్టెలు, మిగతా చిల్లర తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. 


అంకిత టీ తీసుకువచ్చి ఇచ్చింది. అప్పటికే రాత్రి పదిగంటలు దాటింది. విశ్వం కొంచెం 'టీ' తాగి సిగరెట్టు వెలిగించాడు. 


కప్పు టీపాయ్ మీద పెట్టి, మరో సిగరెట్టు వెలిగించాడు. 


"రండి పడుకుందురు గాని" అంది అంకిత.

 

"నువ్వెళ్ళి పడుకో నేను వస్తాను" అన్నాడు. 


ఆమె వెళ్లి హాలుకు ఎదురుగా ఉన్న బెడ్ రూమ్ లో డబుల్ కాట్ మంచంపై పడుకుని, సోఫాలో కూర్చున్న విశ్వం రాకకోసం ఎదురు చూస్తోంది. 

విశ్వం చూపులు ఎక్కడికో సుదీర్ఘ ఊహా తీరాల్లోకి వెళ్లిపోయాయి. సిగరెట్ మీద సిగరెట్.. అతనికి ఏ ఆలోచన కొలిక్కిరావడం లేదు. 


ఏ మార్గమూ అతనికి శాంతినివ్వడం లేదు. అతని వ్యక్తిత్వపు తీరు తెన్నులు అతనే మరచిన వాడిలా, స్థాన భ్రంశం చెందిన మనస్సుతో శరీరాన్ని అక్కడే అంకిత ఇంట్లో వదిలిన వాడై.. ఇంతలో.. 


అంకిత అతని ఎదురుగా వచ్చి నిలబడి ఉంది. తదేకంగా విశ్వాన్ని చూస్తూ "ఏవండీ.. ఏవండీ.. " అని పిలుస్తూ ఉంది. లీలగా ఆ పిలుపులు అతన్ని సోకాయి, ఈ లోకంలోకి వచ్చి అంకిత వైపు చూశాడు. చేతిలోని సిగరెట్ ఇంకాసేపట్లో అయిపోవడానికి ఆయత్తమవుతుంది. గట్టిగా దమ్ము లాగి వదిలాడు. 


"చాలా పొద్దుపోయింది వచ్చి పడుకోండి" అంది అంకిత. 


నవ్వి సిగరెట్ వెలిగించాడు. "నువ్వెళ్ళి పడుకో, నేను వచ్చాక, నిన్ను లేపుతాను" అన్నాడు.


ఆమె నుంచుని నుంచుని వెళ్లి పడుకుంది. ఆమెకి నిద్రెలా వస్తుంది. హాల్లోని విశ్వాన్ని చూస్తూ పడుకుంది. అతని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో మూడో జాములో ఆమె నిద్రలోకి జారిపోయింది. 


ఉదయాన్నే లేత భానుడి కిరణాలు వెంటిలేటర్లోంచి లోపలి తెల్ల గోడపై పడి, అంకితను కలవరపెట్టాయి. 


గబగబా లేచి, హాల్లోకి వచ్చి విశ్వాన్ని చూసింది. విశ్వం అదే సిట్టింగ్ ముద్రలో అలాగే సిగరెట్లు కాల్చుకుంటున్నాడు. 


అతనొదిలిన పొగ రింగు రింగులుగా అంతు చిక్కని జీవితపు రహాస్యంలా శూన్యంలోకి వెళ్ళిపోతుంది. కఠోర దీక్షాపరుడిలా ఏదో లోకంలో ఉన్నవాడిలా ఉన్నాడు. 


అంకిత అతన్ని పిలవడానికి దగ్గరగా వెళ్లబోయి టీపాయ్ తగిలి అక్కడే నిలబడిపోయింది. 


అంతరాయం కలిగిన వాడిలా తల తిప్పి అంకితని చూశాడు. చేతిలో ఆరిపోయి ఉన్న సిగరెట్ పీకని 'యాష్ ట్రే' లో పడేసి, మరో సిగరెట్ తీసాడు. 


పైకి లేచి నిలబడి "నీ రేటెంత?" అని అడిగాడు. 


"మాములుగా ఐదొందలు కానీ.. " అని ఏదో చెప్పబోయిందల్లా ఆగి అలాగే ఉండిపోయింది. 


విశ్వం ఐదొందల కాగితం తీసి ఆమె కిచ్చాడు. 


"దీనికి ఇక్కడి వరకూ దేనికి? లాడ్జిలో రూము తీసుకునైనా ఉండొచ్చు!" అంది అంకిత. 


అతను చిన్నగా నవ్వి చూశాడు. 


"మీ పేరు?" అంది. 


"విశ్వం"


విశ్వం ఓ అంతుచిక్కని, అర్ధం కాని మనిషిలా కన్పించాడామెకు. వెళ్లబోతూ ఆగి, "నెలకైతే నీ రేటెంత?" అని అడిగాడు. 


"పదివేలు"


"అలాగైతే, ఈరోజు నుండి నెలరోజులు నాక్కావాలి! ఇవిగో డబ్బులు. ఖర్చులకవీ ఎక్స్ ట్రా ఇస్తాలే!" అన్నాడు. 


ఆమె ముఖంలో ఆశ్చర్యం తొంగిచూసింది. కానీ, మనసులో ఏదో సందేహం వచ్చిన దానిలా అతనివేపు చూస్తుండిపోయింది. 


"నేను మధ్యాహ్నం వస్తాను భోజనం రడీ చెయ్యి" అని విశ్వం బయటికెళ్లిపోయాడు. 


ఇతనెవరో పూర్తి వివరాలు అడగలేదు. అడిగే లోపునే బయటికెళ్లిపోయాడు. శృంగారాన్ని త్యజించిన వాడిలా కన్పిస్తున్నాడు. నాతో అవసరం ఎలా ఉంటుంది, అనుకుంటూ వంటలో నిమగ్నమైంది. 

అప్పటికే పదిరోజులు గడిచిపోయాయి. అంకిత మంచం మీద వెల్లకిలా పడుకుని ఆలోచిస్తుంది. అన్ని విషయాల్లోను ఏ లోటు రానీయడు. కావాల్సిన సదుపాయాలన్నీ అమరుస్తాడు. అన్నిపన్లు ప్రేమగా చేస్తాడు. కానీ, ఇప్పటివరకూ తన శరీరాన్ని తాకనైనా తాకలేదు. 


అసలు అతని ఉద్ధేశ్యం..! ఆమెకు అర్థంకాక తల్లడిల్లిపోతుంది. 


నెమ్మదిగా కుడికాలును పైకి జరిపింది. బాత్ రూమ్ తలుపు రేకు చీరేసి కాలుకు గాయమైంది. చాలా పెద్దగా తగలడంతో నాలుగు రోజుల్నుంచి విశ్వమే కాలుకు కట్టు కడుతున్నాడు. 


ఈరోజు కూడా తనే, పాత బ్యాండేజి తీసేసి, క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కట్టు కట్టాడు.. నా దెబ్బ తన దెబ్బలా ఫీలవుతాడు. అసలు, ఇతను అర్ధం కాడేంటి! భగవంతుడా! అతనికి కావాల్సిన మనశ్శాంతిని, అతను కోరుకునే తృప్తిని ఇవ్వు స్వామి అంటూ దేవుళ్ళకు మొక్కుతూనే ఉంది. 


కాలు కదపనివ్వడం లేదు. అలా పడుకునే ఉంది అంకిత. మధ్యాహ్నం అయింది. విశ్వం వచ్చాడు. చేతిలో పొగలు కక్కుతున్న సిగరెట్. అంకిత నీరసంగా ఉండటం చూసి, నుదుటి మీద చేయి వేసి చూశాడు. ఏదో అనుమానం వచ్చిన వాడిలా ధర్మామీటరు తీసి ఆమె నోట్లో పెట్టాడు. అది 101 డిగ్రీలు చూపెడ్తుంది. 


"అయ్యో జ్వరం" అంటూ తన బ్యాగులోని పేరాసిటమల్ టాబ్లెట్ వేసి, మంచినీళ్లు పట్టించాడు. 


తన చిన్నప్పట్నుంచి అంకితకి ఇలాంటి అనుభవం ఎదురవలేదు. తన మనసుకి చాలా చిత్రంగా ఉంది. ఎప్పుడూ విటులతో యాంత్రికంగా సాగిపోయే తన జీవితంలో ఇలాంటి అనుభూతులు చవిచూడలేదు. ఏదోలా ఉంది. అతనే అన్నం కలుపుకుని వచ్చి తినిపించాడు. 

సాయంత్రానికి జ్వరం పూర్తిగా తగ్గింది. రాత్రి పడుకున్నాక దుప్పటి కప్పి, తను హాల్లోకి వెళ్లి పడుకున్నాడు. 


నెమ్మదిగా కాలుకి తగిలిన గాయం తగ్గింది. మర్నాడు తిరుపతి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేశానని చెప్పాడు. ఇద్దరం వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి వద్దాం అన్నాడు. తను కూడా అతనికి చేయవలసిన పనులు చేస్తూనే ఉంది. 


ఆరోజు రాత్రి.. 


అంకితకి తన జీవితం రీలులా కళ్ళముందు దృశ్యాలై సాగిపోయింది. జీవితం నిండా కష్టాలు, కన్నీళ్లు, వ్యధాభరిత కథలే, మానసిక వత్తిడి, దుఃఖం, యాంత్రికమైన నవ్వులు, ఒక లక్ష్యం లేని మార్గంలోనుంచి, ఎక్కడికో ప్రయాణం. 

అకస్మాత్తుగా.. 


ఇతనితో సహవాసం వేరే మార్గంలోకి తీసుకెళుతున్నట్టే అన్పిస్తుంది. యాంత్రికమైన బతుకు కవరును తొలగిస్తూ, నిజ జీవితాన్ని చూపుతున్నట్టే మనసుకు ఏవో కొత్త కొత్త అనుభూతులతో, ఆరాత్రి ఎప్పటికో కానీ నిద్రపట్టలేదు. పైగా మర్నాడు ప్రయాణపు ఊహలు..

◆◆◆◆ ◆◆◆◆ ◆◆◆◆

ఆరోజు ఉదయమే తిరుపతి నుండి వచ్చారు. 

అంకితకి ఎంతో హాయిగా, తృప్తిగా ఉంది. దైవ దర్శనం చేసిన ఆనందం మనస్సంతా వ్యాపించి, బతుకు పరిపక్వత పొందినట్లు ఏదో భావం తనని నిలువునా ఆక్రమించి ప్రశాంతంగా ఉంది అంకితకి. 


సాయంత్రం.. 

ఈరోజుతో విశ్వం గడువు పూర్తయింది. తాను వెళ్ళిపోతున్నట్టు చెప్పి, తన బ్యాగ్ లో బట్టలు సర్దుకుంటున్నాడు. 


అంకితకి ఒక్కసారే గుండె జల్లుమన్నట్టయింది. తనలోని సంతోషాన్ని ఎవరో లాగేసుకున్నట్టనిపించింది. ఏదో అభావం, అభద్రతలో తాను కూరుకుపోతున్నదానిలా.. , మెదడు సరిగ్గా స్థిరత్వంతో ఆలోచన్లు కొనసాగించడం లేదా!? తనకేం తెలియడం లేదు!


అయినా, అతనెళ్లిపోయాక, రోజూ ఎవరో ఒకరు వస్తుంటారు. తను ఎప్పటిలాగే బతికేస్తుంది. దానికి! తను ఇలా ఫీలైపోతుందేమిటి!? సాంఘిక భద్రతతో కూడిన ప్రేమకి తన మనసు లొంగిపోతుందా! ఎందుకని? తను అలా మార్పులకు లోనవుతుంది. 


ఆమె అంతు చిక్కని ఉహాలతో కొట్టుమిట్టాడుతోంది. 

'అంకితా! నేను వెళ్లిపోతున్నాను. ఇన్ని రోజులు నీ సహకారానికి నా కృతజ్ఞతలు" అని వెనుతిరిగాడు. 


"నా వృత్తి వేరు, మీ సదుద్దేశం వేరనుకుంటాను. ఇన్ని రోజులున్నా ఏనాడు మిమ్మల్ని నేను ఆకర్షించలేకపోయాను. నన్ను క్షమించండి!" అంది. 


విశ్వం అంకిత కళ్ళలోకి సూటిగా చూశాడు. "అంకితా. శృంగారమంటే నా దృష్టిలో యాంత్రికంగా జరుపుకునేది కాదు. అది మనసుతో చెలిమి కలిపి, శరీరంతో రమించేది. అలా జరగని శృంగారం అర్ధం లేనిది. 


నీతో స్నేహం చేశాను. కానీ, ప్రేమలేని నీ శరీరంతో సుఖించలేను. అలా అని నీతో ప్రేమను కోరుకునే పరిస్థితిలో నేను లేను. నాలో అశాంతిని చల్లార్చుకోలేని ఓ మండే సూర్యగోళం నా గుండె, అది ఎవ్వరికీ అర్ధం కాదు. దాన్ని ఎవరూ ఆప్యాయంగా కౌగిలించుకోలేరు. ఇక నన్ను వెళ్లనీ అంకిత" అన్నాడు. 


"వద్దు! వెళ్లొద్దు!!" అని గట్టిగా అరచి అతని వైపే చూస్తుండిపోయింది అంకిత, ఆమెలో భయం, ఆందోళన, ఏదో పోగొట్టుకున్నదానిలా, చేతిలోనుంచి ఏదో జారిపోతున్నట్టు, తనేం చెప్పాలి! ఏం?మాట్లాడాలి? 


తనలో తనే అంతర్మథనంతో పెదాలు విప్పడానికి చిన్నగా వణుకు, "నన్ను విడిచి వెళ్ళకండి"అని అతన్ని సమీపించబోయింది. 


అతను వెళ్లిపోబోయాడు. ఆమె స్థాణువులా నిలబడిపోయింది. 


"నన్ను విడిచి వెళ్ళకండి. మీతోనే ఉండిపోతాను. ఏం చేసైనా మీతోనే ఉంటాను. మీ కనుపాపల్లో బతుకుతూ, నన్ను అంకితం చేసుకుంటాను. ఎప్పుడూ నా మనసుకు ఇంత బాధ కలగలేదు. ఈరోజు మీరెళ్ళి పోతుంటే, మీరు లేకుండా నేనుండగలనా అనే భావంతో జీవితం శూన్యంలా అగుపిస్తుంది"


అతను కదిలెళ్లిపోయాడు. ఆమె చటాలున గుమ్మాన్ని సమీపించబోయిన అతని కాళ్ళని రెండు చేతుల్తో ఒడిసి పట్టుకుంది. 


అతను స్థాణువులా నిలబడిపోయి, విస్మయంగా అమెకేసి చూసాడు. 


ఆమె కనుకోనల్లోంచి కన్నీళ్లు చిప్పిల్లుతున్నాయి. కళ్ళు ఎరుపెక్కాయి. "మీతో శృంగారం నాకవసరం లేదు. మీ ఆప్యాయత, అనురాగం, మీరు చూపే ప్రేమ ఇవి నాకు శాశ్వతంగా కావాలి. మీ రాకతో నేను వేశ్యననే ఉనికినే మర్చిపోయాను. నా గుండె అంతా మీరే నిండిపోయారు. మీలో నాకు చిటికెడు చోటివ్వరూ" అంటూ కాళ్ళని గట్టిగా బంధించింది. 


ఎక్కడో ప్రశాంతతను పోగొట్టుకున్న విశ్వం కళ్ళల్లో మెరుపు కన్పించింది. అట్టడుగు పొరల్లోంచి, చిన్నగా నవ్వు అతని ముఖంలో చోటుచేసుకుంది. కళ్ళు పెద్దగా అయ్యాయి. చేతిలోని సిగరెట్ దూరంగా విసిరేశాడు. రెండు చేతుల్తో ఆమెని పైకి లేవదీసి, ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ ఆమె నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. 


ఆమె తన మనసుని చేతుల్లోకి తెచ్చుకుని అమాంతం విశ్వాన్ని చుట్టేసింది. 

◆◆◆◆

 

ఉండవిల్లి.ఎమ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ఉండవిల్లి.ఎమ్

ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, పక్ష, రేడియోలలో కలిపి 150 కథలు, 200 వరకు కవితలు వచ్చాయి. 

'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి, నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి. 

 నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి. 


చాలా కథా, కవిత సంకలనాల్లో కథలు, కవితలు వచ్చాయి. 

 అనేక మనసుల్ని కథల్లో, నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం! 


Comments


bottom of page