'Annadataku Annam Leda' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 25/07/2024
'అన్నదాతలకు అన్నంలేదా' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
అతను రైతు.... పేరు శివయ్య....
భార్య గౌరి... ఇద్దరు చిన్నపిల్లలు. ఆరు మూడు సంవత్సరాల వయస్సు. హరి, అంబిక.
వున్న ఆస్థి, ఒక ఎకరం భూమి. నూరు గజాల ఇంటి స్థలం. అందులో పూరి ఇల్లు.
తన భూమిలో పంట వర్షాధారంగా పండుతుంది. సకాలంలో వర్షాలు పడకపోతే, నాటిన పంట (వరి) ఎండిపోతుంది. తన పొలానికి తోడుగా ఆ గ్రామంలో వున్న రాజన్న భూస్వామి వద్ద రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని, తన భూమిలో ఆ భూమిలో కూడా వరి మొక్కలు నాటేవాడు. రాజన్న భూమికి పంటకాలువ మూలంగా నీటి వసతి వుంది. శివయ్య ఎకరం నేల మెరక. నీటికాలువ వసతి లేనిది.
నారుమడికి నీటి కాలువలోని నీటిని బానలతో ముంచి పోసి దుక్కి అయినాక, నారును నాటేవాడు. ఆ తరువాత నీటికోసం మెడను సారించి ఆకాశాన్ని మేఘాలను చూచేవాడు, వర్షం కోసం. ఆరునెలల పాటు నీరు, చేలో నిలువ లేకుండా వరి ఎదుగదు.
ఆ కాలువలో ప్రవహించే నీటిని దానిక్రింద వున్న భూస్వాములు వంతుల ప్రకారంగా వారి చేలకు నీటిని నింపుకొంటారు. కాలువలో ఒక్కోసారి నీరు బాగా ప్రవహిస్తే, ఎవరూ శివయ్య కాలువ నుండి బానలతో తన భూమిని తడుపుతున్నందుకు అభ్యంతరం చెప్పేవారు కాదు.
ఒక్కో పర్యాయం ఆ పంట కాలువలో నీటి ప్రవాహం తగ్గి సన్నగా ప్రవహించే సమయంలో ఆ కాలువ క్రింది భూస్వాములు కాలువకు అడ్డంగా కట్టను ఏర్పరచి, తమ పొలాలకు నీటిని నింపుకొనేవారు. అలాంటి సమయంలో శివయ్య తన ఎకరం నేలను తడుపుకొనే దానికి వీలుపడేది కాదు.
ఆ సమయంలో... శివయ్య రాజన్న వద్ద కౌలుకు తీసికొన్న రెండు ఎకరాల భూమిని వారి వంతు వచ్చినప్పుడు కాలువకు అడ్డంగా కట్టవేసి, ఆ రెండు ఎకరాలనూ తడిపేవాడు. తన ఎకరంలోని పైరు ఎండిపోతూ వుంటే చూచి బాధపడేవాడు. పైరు నీరుండి ఏపుగా పెరిగేటప్పుడు అధిక దిగుబడి కోసం అప్పు చేసి తెగులు తగలకుండా సకాలంలో మందులు కొని చల్లేవాడు. చివరిదశలో పంటకు నీరు అందకపోయి చేతికి అందింది నోటికి అందలేదని ఎండిపోయిన పైరును చూచి వాపోయేవాడు.
తన ఒక ఎకరం సాగుబడికి నారుపోసే దశనుండి, నాటు మందులు, కలుపు తియ్యడానికి రాజయ్య, మంగయ్యశెట్టి దగ్గర నోటి వ్రాసి ఇచ్చి డబ్బులు తీసుకొని కార్యక్రమాన్ని సాగించేవాడు. ఫలింపు రాక పంట ఎండిపోతే వడ్డీతో కలిసి ప్రామిసరి నోటును తిరిగి రాసిచ్చేవాడు. మంగయ్యశెట్టి శివయ్య అడిగినప్పుడల్లా డబ్బు, చిల్లరసామాను, బియ్యం అప్పుగా ఇచ్చేవాడు. అతని ఉద్దేశ్యం, ఇలాగే కొంతకాలం శివయ్యకు అప్పుఇస్తూ, మొత్తం పెరిగాక, ఆ ఒక ఎకరాన్ని తాను కొనేసెయ్యాలనే దుష్ట చింతన....
కాలం కలిసిరాక వరుసగా మూడు సంవత్సరాలు శివయ్య ఎకరం చేలో ఫలింపు లేదు. మంగయ్యశెట్టి గారి అప్పు వడ్డీతో సహా ఎనిమిదివేలయ్యింది. అవసరానికి వెళ్ళి సామాగ్రిని అడిగిన శివయ్యతో మంగయ్యశెట్టి....
"చూడు శివయ్యా!.... ఇప్పటికి నీవు నాకు ఎంత బాకీయో తెలుసా!.... ఎనిమిదివేల ఆరువందల తొంభై తొమ్మిది రూపాయలు. ఎప్పుడు తీరుస్తావ్!.... ఎలా తీరుస్తావ్!... చెప్పు!..." వికటంగా నవ్వుతూ అడిగాడు మంగయ్య.
శివయ్య శెట్టిగారి మాటలకు, జవాబు చెప్పలేకపోయాడు. అతని కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ’దాదాపు ఎనిమిదివేలా ఏడువందలు మంగయ్యకు బాకీ!... ఆయన అడిగినట్లు అంత సొమ్మును నేను మంగయ్యకు ఎప్పుడూ ఇవ్వగలను. ఎలా ఇవ్వగలనూ!... శ్రమ, ఖర్చు తప్ప ఫలితాన్ని ఇవ్వని ఆ ఎకరం నేలను ఇంకా నమ్ముకొని అప్పుచేసి పెట్టుబడి పెట్టి.... సాగుచేసి ప్రయోజం ఏమిటి?... అమ్మేసి మంగయ్య బాకీ తీర్చేసే తలమీది ఋణపు బరువు దిగిపోతాది కదా!... ఆ భూమికి వెలకట్టి మంగయ్యనే తీసుకోమంటే మంచిది కదా!’ అనుకొన్నాడు. మరుక్షణంలో ’అయినా... ఒకసారి గౌరితో కూడా మాట్లాడి, విషయాన్ని మంగయ్యకు చెప్పడం మంచిది కదా!’ నిర్ణయించుకొన్నాడు.
"ఆఁ.... ఏం శివయ్యా!... బదులు పలుకవూ!" ఆశ్చర్యంతో మంగయ్యశెట్టి శివయ్య ముఖంలోకి చూచాడు.
"మంగన్నా!..."
"ఆ చెప్పు!"
"నేను రేపొచ్చి, నీతో మాట్టాడతా!... రెండు కిలోలు బియ్యం, ఉప్పు, మిరపకాయలు, ఎఱ్ఱగడ్డలు, చింతపండు ఇయ్యన్నా. లెక్క రాసుకో!..." ఎంతో వినయంగా చెప్పాడు శివయ్య.
"శివయ్యా!..."
"అన్నా!..."
"రేపు నీవు నాకు, నా బాకీ ఎట్టా తీరుస్తావో చెప్పాలి మరి!..."
"అట్టాగే అన్నా!..."
శివయ్య అడిగిన సామాన్ను మంగయ్య ఇచ్చాడు.
"ఇప్పుడు ఇచ్చిన సామాను ఖరీదు మూడువందల అరవై ఒకటి. దీంతో కలిపి నీవు నాకు ఇయ్యాల్సింది తొమ్మిదివేల అరవై. రెండు రోజుల్లో ఇచ్చేశావనుకో, వడ్డీ ఏం వుండదు. దినాలు గడిపావనుకో ఆ మొత్తానికి వడ్డీ కట్టాలి మరి. సరేనా!...." వ్యంగ్యంగా నవ్వాడు ఆ వ్యాపారి.
శివయ్య తలాడించి సామానులతో తన ఇంటివైపుకు నడిచాడు విచారవదనంతో.
*
ఆ రాత్రి భోజనాలైన తరువాత వాకిట్లో చాప పరుచుకొని భార్యా భర్తలు పడుకొన్నారు. ఉన్న నులకమంచంపై పిల్లలు హరి, అంబిక పడుకొని నిద్రపోతున్నారు.
ఆరోజు తనకు, మంగయ్యకు జరిగిన సంభాషణను, వారు అతనికి ఇవ్వవలసిన మొత్తం బాకీని గురించి భార్య గౌరికి తెలియజేశాడు శివయ్య. గౌరి ఎంతగానో విచారపడింది.
"గౌరీ!... మనం విచారపడితే మన ఆరోగ్యాలు దెబ్బతినడం తప్ప ఏం ప్రయోజనం వుండదే!.... నేను ఆలోచించి... ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినానే!..." ఎంతో సౌమ్యంగా చెప్పాడు శివయ్య.
"ఏంటయ్యా అది?" అడిగింది గౌరి.
"మన ఎకరం నేలను మంగయ్యను తీసుకోమని చెబుతా!... మనం ఆయనకు ఇయ్యాల్సిన మొత్తానికి సరిపెట్టుకోమంటా!... మన ఈ ఇంటి స్థలాన్ని అమ్మేస్తా. మనం ఆ వచ్చిన డబ్బుతో పిల్లలతో కలిసి పట్నం ఎల్లిపోదాం. వున్న ఎకరం నేలను నమ్ముకొని మనం అప్పులు చేస్తూ, ఇక మీదట ఈ ఊళ్ళో బతకలేమే!.... పట్నంలో అయితే ఏదో పని, చిన్న బంకు లేదా కురగాయల యాపారం తోపుడు బండితో చేసుకొంటా. మనం కష్టపడి పిల్లలని చదివిస్తామే!.... నీవేమంటావు?" అడిగాడు శివయ్య.
గౌరి తెలివికలది. ఆలోచించింది. తన భర్త సలహా ఆమెకు నచ్చింది.
"అయ్యా!... నీకు తోచినట్టే చెయ్యి. ఆపైన దేవుడుండాడు. అన్నీ ఆయనే చూచుకొంటాడు." ఎంతో ఘనంగా నమ్మికతో చెప్పింది గౌరి.
ఇరువురి మనస్సులు స్థిమితపడ్డాయి. కళ్ళు మూసుకొన్నారు. భవితకు సంబంధించిన ఊహలతో....
*
"అయ్యగోరూ!... దండాలు" రాజన్నను చూచి చేతులు జోడించాడు శివయ్య.
"ఆఁ.... ఏం శివయ్యా!... ఏమిటి విశేషాలు!" చిరునవ్వుతో అడిగాడు రాజన్న.
"అయ్యా!..." దీనంగా శివయ్య రాజన్న ముఖంలోకి చూచాడు.
"చెప్పు శివయ్యా!"
"సామీ!... నేను, పిల్లలూ, భార్య పట్నం ఎల్లిపోవాలనుకొన్నామయ్యా!"
"ఏంటీ!... పట్నమా!" ఆశ్చర్యపోయాడు రాజన్న.
"అవునయ్యా!... ఆడ ఏదైన పని చూచుకొంటా. పిల్లల్ని చదివించుకొంటా!... నా ఇంటి స్థలం, మీ పశువుల దొడ్డికి ప్రక్కనే కదయ్యా!... తమరు తీసుకొని, ఏదో మీకు న్యాయంగా తోచిన డబ్బును నాకు ఇయ్యండి సామీ!" దీనంగా అడిగాడు శివయ్య.
"మెట్టభూమిని మంగయ్య శెట్టిగారికి యిచ్చేశానయ్యా!.... వారికి నేను బాకీ. దానికి చెల్లుబెట్టాను. ఇంటి స్థలం మీరు తీసుకొని డబ్బులిస్తే, నేను నా కుటుంబం పట్నం ఎల్లి బతుకు తెరువు చూచుకొంటామయ్యా. నాకు ఈ సాయం చేయండి సామీ!... జీవితాంతం తమరికి ఋణపడి వుంటా!...." దీనంగా అడిగాడు శివయ్య.
రాజయ్య ’సరే’ అన్నాడు. ఇరవైవేలు డబ్బు యిచ్చాడు. కాగితం మీద వ్రాసి రాజన్న, శివయ్య వ్రేలి ముద్రలను తీసుకొన్నాడు. నమస్కరించి శివయ్య ఇంటివైపుకు నడిచాడు ఆనందంగా.
మరుదినం.... ఆరున్నరకు బస్సు వచ్చింది.
ఇద్దరు పిల్లలు, భార్య గౌరి, శివయ్యలు మూడు చేసంచులతో రెండు సామాన్ల గోతాపు సంచులతో బస్సులో ఎక్కారు.
కండక్టర్ ’రైట్.... రైట్’ అన్నాడు. బస్సును డ్రైవర్ పట్నం మార్గాన కదిలించాడు.
చిరునవ్వుతో శివయ్య తన ప్రక్కన వున్న భార్య గౌరి ముఖంలోకి చూచాడు. గౌరి ఆనందంగా నవ్వింది. తెల్లని ఆమె పలువరుస వికిశింత మల్లెలై వెలిగిపోయాయి. ఇరువురి మనస్సుల్లో క్రొత్త ఆశలు... వూహలు...
*
పల్లెలో పుట్టి పల్లెలో పెరిగి, నేటికాల
పరిస్థితుల రీత్యా పట్టెడన్నం కోసం...
పట్నాల పాలైన ఆనాటి అన్నదాతలు ఎందరో!...
వారికి ఈ చిరుకథ అంకితం.....
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments