#KandarpaMurthy, #కందర్పమూర్తి, #అన్నదాతలఅగచాట్లు, #AnnadathalaAgachatlu, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు
Annadathala Agachatlu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 04/01/2025
అన్నదాతల అగచాట్లు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
"ఒరె, పైడిగా ఈ కందిబేడలు పట్నానికి తోలుకుపోయి అమ్మెయ్యరా! సినుకులు పడినాయంటే బూజు పట్టి ఖరాబవుతాయి. పోయినేడు కరోనా రోగం గుబులు పుట్టించి అమ్మకాలు లేక పురుగు పట్టి ఎటూ కాకుండా పోయినాయి. ఈ పాలైనా పంట కర్చులైన తెచ్చుకోవాల" కొడుకు పైడయ్యకు నచ్చ చెబుతున్నాడు సన్నకారు రైతు సైదులు.
"అయ్యా, పట్నం తీసుకుపోయినా కొనేటోళ్లు లేరు. సేట్లు కాడ మిత్తికి పైసలు తెచ్చి బూమ్మీద ఎడితే పంటకి గిరాకీ రావటం లేదు. ప్రతి సంవత్సరం పంట మార్పిడి సేసి ఎవసాయం సేస్తున్నా డబ్బులు కానడం లేదు.
పోయినేడు పత్తి ఇత్తనాలు జల్లితే సగం కూడా గిట్టుబాటు కానేదు. ఆ దుకాణం ఓడు బి. టి ఇత్తనాలని చెప్పి నాసిరకం ఇచ్చి కొంప కూల్చినాడు. అంతకు ముందు సంవత్సరం మిరపతోట ఏస్తే పండుకాయకి చీడ పట్టి సగం పంట ఎందుకూ పనికి రాక పోయినాది.
పెబుత్వం ఏమో అందరు ఒకటే పంట ఎయ్యకండ్రి, మార్కెట్లో ఏ పంటకి గిరాకీ ఉంటే అందరూ దాని మీదే పడకుండ ఏరు ఏరుగా పంటలు ఏసుకుంటే అందరికీ మేలు జరుగుతాదని సెబుతారు.
ఒకసారి ఉల్లికి మార్కెట్లో గిరాకీ ఉందని అందరూ అదే పంట ఏసి మార్కట్టుకి తెత్తే రేటు పడిపోయి అందరు నెత్తిన సేతులు ఏసుకున్నారు. మరొకపాలి టమాటా పంటకి పైసలు వత్తాయంటే వర్షాలు ఎక్కువై పంట కుళ్లి ఎటూ కాకుండా పోనాది.
“అయ్యా, ఇదివరకటిలా ఎవసాయం గిట్టుబాటు కావడం లేదు. మనం ఎండనక వాననక కట్టపడి ఎవసాయం సేసినా మన శ్రమే మిగులుతోంది.
దళారోళ్లు లేకుండా మార్కెట్లో పంట అమ్మలేక పోతున్నాం. పెబుత్వం ఏం సెయ్యనేక పోతోంది. ఎరువులు సమయానికి దొరకవు. నకిలీ ఇత్తనాలు, సీడలు పీడల నుంచి పంట కాపాడాలంటే బోలెడన్ని డబ్బులు పెట్టి పురుగుమందులు కొనాల.
ఇలాగైతే ఎప్పటికి మన అప్పులు తీరాల. బేంకుల కాడ నుంచి ఋణం కావాలంటే బోలెడు పితలాటకం. ఎలాగరా అయ్యా" ఏకరువు పెడుతున్నాడు పైడయ్య.
"తప్పదురా, బతికినా సచ్చినా మన బతుకులు ఈ నేల మీదే పోవాల. పోయినేడు యాదిగాడు పత్తి పంటంతా కాయ తొలుచు పురుగు తినేసిందని పెట్టిన పెట్టుబడి రాక అప్పులు మిగిలాయని బెంగతో పొలంలో పురుగుల మందు తాగి పేణం ఒగ్గేసాడు.
అంతకు ముందేడు కిట్టిగాడు వరదలొచ్చి వరిపంట తుడుచుకు పోనాదని పొలం గట్టంట ఏప చెట్టుకు ఉరోసుకుని జీవిడిచినాడు. మనకా సదువులు లేవాయె. మన పెద్దోళ్లు ఇచ్చిన ఈ ఎవసాయ బూమిని నమ్ముకుని బతుకుతున్నాం. మన పెద్దోళ్ల సమయంలో కాలం పెకారం వర్షాలు కుర్సేటివి. పంట దిగుబడి మస్తుగా ఉండేది. పసువుల ఎరువులు, పచ్చిరొడ్డ ఇలా పొలానికి సత్తువ, గట్టి ఇత్తనాలు దొరికేవి. పెట్టుబడికి బయం లేకుండేది.
ఇప్పుడు కాలం మారింది. సీజను పెకారం వానలు రావాయె. ఎప్పుడు తుపానులు వరదలు వత్తయో ఎరిక లేదు. బగవంతుడి మీద బారం ఏసి రోజులు గడపాల" కొడుక్కి నచ్చ చెబుతున్నాడు సైదులు.
"అలాగేర, అయ్యా.. కందిపప్పు ఒకపాలి ఎండబెట్టి బోరీ కెక్కిస్తాలే. ఒక బోరి బస్సు మీద ఏసుకుని పట్నం ఈదుల్లో అమ్ముతా " అని నాయనకు బరోసా ఇచ్చినాడు.
ఒకరోజు ఒక బస్తా నిండా యాబై కేజీల కందిపప్పు నింపి బస్సు మీద పట్నం చేరుకుని అరుచుకుంటు అమ్మకం మొదలెట్టాడు పైడయ్య.
వీధిలో అరుచుకుంటు వెల్తుంటే ఒక ఇంటి ముందు ఇల్లాలు ఆపి " కంది పప్పు అబ్బాయి, ఇలారా " అని పిలిచి బస్తాలోంచి కందిపప్పు చేత్తో పైకి తీసి కేజి ఎంతని అడిగింది.
మార్కెట్ రేటుకి చాల తక్కువగా ధర చెప్పాడం పైడయ్య.
"ఇదేంటయ్య, ఇంత ఖరీదు చెబుతున్నావు. సూపర్ మార్కెట్లో పాలిష్ చేసి పేక్ చేసిన కందిపప్పే తక్కువ ఖరీదుకి వస్తుంటే నువ్వేంటి ఇంత రేటు చెబుతున్నావని " అంటూ ఇది నకిలీ సరుకు కాదు కదా అని అనుమానం వెలిబుచ్చింది.
"లేదమ్మా, మా పొలంలో పండించిన నికార్సైన కందిపప్పు. ఊరి నుంచి కొంచం కొంచం సరుకు పట్నానికి తెచ్చి అమ్ముకుంటున్నాను. సరుకు అమ్ముడైతే సాయంకాలం ఊరికి పోతా. చెప్పమ్మా, ఎంత కావా”లన్నాడు పైడయ్య.
"లేదయ్యా, కందిపప్పు రంగు చూస్తుంటే నకీలీ దానిలాగుంది. నేనడిగిన రేటుకైతె రెండు కేజీలు తీసుకుంటా”నని పైడయ్య చెప్పిన రేటుకి సగానికి తగ్గించి అడిగింది ఆ ఇల్లాలు.
"అమ్మా, సూపర్ బజార్లో మందులు జల్లిన పప్పులు పేకెట్లో ఎట్టి మా దరకి రెండింతలు తీసుకుంటారు. మేము పొలంలో కాయకష్టం చేసి అసలు సరుకు మీ గుమ్మాల ముందు తెచ్చి అమ్మితే ఇట్టా మాటాడతారు. నాయానికి రోజులు కావమ్మా, తప్పుడు కొలతలు, నకిలీ సరుకే జోరుగా అమ్ముడు పోతాది " అంటూ ముందుకు సాగిపోయాడు అమాయక రైతు పైడయ్య.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments