#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #Annayya, #అన్నయ్య, #TeluguKathalu, #తెలుగుకథలు

Annayya - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 22/01/2025
అన్నయ్య - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రామూర్తి, సీతలకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. పెద్దకొడుకు పేరు సుధాకర్, రెండవ కొడుకు పేరు రాజారామ్, కూతురు పేరు మంజుల.
రామూర్తి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, చాలిచాలని సంపాదన అయినా పిల్లలను బాగా చదివించాలి అనే కోరిక. పెద్ద కొడుకు సుధాకర్ టెన్త్ క్లాస్ అవ్వగానే తండ్రి తమ ముగ్గురిని పెద్ద చదువులు చదివించటం కష్టం అని, తండ్రి తో చెప్పాడు, “నాన్నా! నేను పై చదువులు చదవను. తమ్ముడిని, చెల్లమ్మ ని మంచి చదువు చదివిద్దాము. నేను మన యింటి వరండాలో టిఫిన్ సెంటర్ పెడతాను” అన్నాడు.
వంటలు చెయ్యడం తల్లి దగ్గర చూసి నేర్చుకుని వుండటం వలన ఒక మంచి రోజు చూసి తల్లి పేరుతో టిఫిన్ సెంటర్ మొదలుపెట్టాడు.
చుట్టుప్రక్కల పెద్దగా టిఫిన్ సెంటర్స్ లేకపోవడం, వీళ్ళ రోడ్డులోనే పెద్ద కాలేజీ వుండటం సుధాకర్ కి కలిసివచ్చింది.
సీతా టిఫిన్ సెంటర్ లో సాంబార్, చట్నీ బాగుంటాయి అని పేరు రావడం తో జనం బాగా రావడం మొదలుపెట్టారు. రామూర్తి రెండవ కొడుకు బ్యాంకు ఎగ్జామ్స్ రాసి బ్యాంకు లో జాబ్ సంపాదించాడు. దానితో రామూర్తి కి డబ్బు యిబ్బంది తీరింది. కూతురు మంజుల ని ఇంజనీరింగ్ లో చేరిపించాడు.
“అన్నయ్యా! ఆ గ్రైండర్ ఆపుతావా లేదా.. నేను చదువుకునే టైములో వెధవ గొడవ” అంది మంజుల.
“వుండవే, చట్నీ తయారు చేస్తున్నాను, నువ్వు మేడ మీద కి వెళ్ళి చదువుకో” అన్నాడు సుధాకర్.
“అసలు నీ చేత నాన్న హోటల్ పెట్టించడమే తప్పు. నా ఫ్రెండ్స్ అందరు రేపు కాలేజీ కి వచ్చేప్పుడు మైసూర్ బజ్జిలు తీసుకుని రావే అని ఒకళ్ళు, దోసెలు తెమ్మని ఒకళ్ళు ఎక్కిరిస్తో వుంటే చచ్చిపోతున్నాను సిగ్గుతో” అని తల్లితో చెప్పింది.
“వాడి హోటల్ మీద సంపాదన తోనే మీ అన్నయ్య ని, నిన్ను చదివిస్తున్నాడు తెలుసా, వాడు చదువుకోకుండా త్యాగం చేసి మీ కోసం కష్టపడుతున్నడు”.
“చదువు రాక అంతే, మాలాగా చదువుకోవచ్చుగా.. ఎవ్వరు వద్దన్నారు?” అన్న కూతురు వంక చూసి, “అవును. మీ నాన్న కి మీ ముగ్గురిని చదివించే స్తొమత లేదు, వాడిని చదివించి మిమ్మల్ని వంటలు చెయ్యడానికి పంపాలిసింది” అంది సీత.
“ఏమిటమ్మా వాడి హోటల్ మీద వచ్చే డబ్బులు తో బతుకుతున్నట్టు మాట్లాడుతావు, ఎంతైనా నీకు పెద్దకొడుకు అంటేనే యిష్టం” అంది.
***
“అమ్మా! తమ్ముడు జీతం తీసుకుని నీకు యిస్తున్నాడా?” అని ఆడిగాడు సుధాకర్.
“రెండు వేలు యిచ్చి జాగ్రత్తగా వాడు అంటున్నాడు, నేను కూడా ఏమి అడగటం లేదు, నువ్వు సాయంత్రం కల్ల దోసిడు నిండా డబ్బులు యిస్తున్నప్పుడు మళ్ళీ వాడిని అడగటం ఎందుకు రా” అన్న తల్లితో “అదికాదు అమ్మా, చెల్లి చదువు అవగానే మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి కదా, వాడు కూడా డబ్బు కొంత దాచి ఉంచితే మంచిది” అని అన్నాడు సుధాకర్.
‘ఏమిటో వీడి ప్రేమ, దానికి మాత్రం అన్నగారంటే చిన్న చూపే హోటల్ నడుపుకుంటున్నాడని’ అనుకుంది మనసులో.
“అన్నయ్యా! నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా” అని అన్న తమ్ముడు రాజారామ్ తో “ఎందుకురా నీకు తొందర, ఎవ్వరైనా నువ్వు యిష్ట పడ్డావా చెప్పు, నా పెళ్లిది ఏముంది ముందు నీ పెళ్లి చేస్తాము” అన్నాడు.
“లేదన్నయ్యా! ఉదయం లేచి సాయంత్రం వరకు నువ్వు ఒక్కడివే హోటల్ పని చూసుకుంటున్నావ్, వదిన వస్తే నీకు సహాయంగా వుంటుంది కదా” అని అన్నాడు.
“అంటే వచ్చే మీ వదిన కూడా వంట చేసి హోటల్ నడపాలా? నాకు కాబోయే పెద్దకోడలు మంచి ఉద్యోగం చేస్తోవుండాలి” అంది తల్లి అందుకుని కొడుకుతో.
పక్క గదిలోనుంచి “అన్నయ్య కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని చూడమ్మా, అన్నయ్య కి చదువు లేకపోయినా వదిన చదువుకున్నది అయితే మంచిది, అయితే చదువుకున్న అమ్మాయి అన్నయ్య ని చేసుకుంటుందా” అంటున్న కూతురు తో “చూడవే.. నవ్విన ఊళ్లే పట్నాలు అవుతాయి” అని అంది కూతురు ని కేకలేస్తో.
“ఊరుకో అమ్మా, అది చిన్న పిల్ల” అన్నాడు సుధాకర్.
రోజులు గడుస్తున్నాయి, సుధాకర్ చెల్లెలు మాటలు ఎక్కువ చదువు తక్కువ అయ్యి, ప్రతీ సంవత్సరం కొన్ని సబ్జక్ట్స్ లో తప్పడం, ఏదైనా అంటే యింట్లో చదువుకోవడానికి ప్రశాంతత లేదు రోజు అంత హోటల్ కి వచ్చి వెళ్లే వాళ్ల గొడవ అని చెప్పేది. సుధాకర్ గ్రహంచాడు, చెల్లమ్మ కి చదువు మీద దృష్టి లేదు అని, కాలేజీకి స్నేహితుల కోసం వెళ్తోంది అని.
చెల్లెలు మంజుల ని పిలిచి “ఈ ఏడాది నువ్వు అన్ని సబ్జక్ట్స్ లో పాసు కాకపోతే చదువు మానిపించి పెళ్లి చేసి పంపుతాను” అన్నాడు.
“నా పెళ్లి నాన్న అమ్మా చూసుకుంటారు, నువ్వు బాధ్యత తీసుకోవక్కరలేదు, ఇంజనీరింగ్ అంటే ఇడ్లీలు వెయ్యడం కాదు” అంది.
“ఓహో! అయితే రేపు నువ్వు ఇడ్లీ వేసి యివ్వు చూస్తాను ఎంత ఈజీగా చేస్తావో” అన్నాడు.
“నాకేం ఖర్మ ఇడ్లీలు అమ్ముకోవడానికి, నేను పెద్ద ఇంజనీర్ అవుతాను” అంది.
“అయితే త్వరగా చదువు పూర్తి చేసుకో” అన్నాడు.
***
“అమ్మా, కాలేజీ ఫీజు కట్టాలి. డబ్బులు నాన్నని అడిగి యివ్వు” అంది మంజుల.
“మీ నాన్న జీతం యింటి ఖర్చులు కి సరిపోతోంది. యిప్పటివరకు మీ పెద్దన్నయ్య నీ ఫీజు కి డబ్బులు యిస్తున్నాడు, వెళ్ళి మీ అన్నయ్య ని అడుగు” అంది.
“అదేమిటి నా కాలేజీ ఫీజు అన్నయ్య సంపాదన తో కడుతున్నాడా, నేను నాన్న డబ్బు తో చదువుకుంటున్నాను అనుకున్నాను. అమ్మా! అన్నయ్య హోటల్ మీద అంత డబ్బు వస్తుందా” అంది.
“వాడి మంచితనం తో చిన్న వ్యాపారం ని పెద్ద టిఫిన్ రూమ్ గా చేసి రెండు పూటలా రెక్కలు విరుచుకుని సంపాదించి మనల్ని ఈ స్టేజిలో వుంచాడు. నువ్వు కట్టే ఖరీదు అయిన బట్టల వెనుక అన్నయ్య కష్టం ఎంతో వుంది” అంది.
“యింకో విషయం. మీ అన్నయ్య పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ముందు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయకుండా తను చేసుకుంటే రేపు వచ్చిన అమ్మాయి లెక్కలు అడగటం మొదలుపెడితే కష్టం అని ఆగిపోయాడు. కాని నువ్వు నీ చదువు దింకీలు కొట్టుకుంటో పోతున్నావు” అంది. “సరే నేను చట్నీ తయారు చేస్తున్నాను, నువ్వు వెళ్ళి అన్నయ్యని అడుగు ఫీజు విషయం, త్వరలో అరేంజ్ చేస్తాడు” అంది తల్లి.
ఏదో ఆలోచిస్తో అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. జనం తో హోటల్ కిక్కిరిసి వుంది. అన్నయ్య అర్జునుడు లా రెండు చేతులతో ఎవ్వరికి కావలిసిన టిఫిన్స్ వాళ్ళకి అందిస్తో వాళ్ళు యిచ్చిన డబ్బులు గల్లా పెట్టెలో వేసుకుంటున్నాడు.
అక్కడికి వచ్చిన చెల్లెలు మంజుల ని చూసి, ‘ఏమిటమ్మ’ అని ఆడిగాడు సుధాకర్.
“అన్నయ్యా! కాలేజీ ఫీజు కట్టాలి” అంది.
“ఫీజు డబ్బులు విడిగా తీసి అల్మారా లో పెట్టాను తీసుకో” అన్నాడు.
అన్నయ్య గదిలోని అల్మారా తీసి చూస్తే ఒక కవర్ మీద ‘చెల్లమ్మ కాలేజీ ఫీజు’ అని రాసి వుంది. ఆ కవర్ తీసుకుని తలుపు వేస్తోవుండగా లోపల నుంచి ఒక నోట్ బుక్ జారిపడటం తో తీసి లోపల పెడుతో పుస్తకం లో అన్నయ్య ఏమి రాశాడో అని చూసింది.
అందులో మొదటి రెండు పేజీలలో హోటల్ లెక్కలు గురించి, మూడో పేజీలో చెల్లమ్మ పెళ్లికోసం యూనియన్ బ్యాంకు లో దాచిన డిపాజిట్ ఎనిమిది లక్షలు అని, తల్లిదండ్రుల మెడికల్ ఖర్చులు కోసం నాలుగు లక్షలు డిపాజిట్, తమ్ముడు పెళ్లి ఖర్చులు కోసం రెండు లక్షలు డిపాజిట్ వివరాలు రాసుకున్నాడు.
ఇన్నాళ్ళు అన్నయ్య కి చదువు లేదు హోటల్ పెట్టుకుని బతుకుతున్నాడు అనుకున్నను గాని, యింత ముందు చూపు తో డబ్బులు దాచి పెట్టి అన్నగారిగా బాధ్యత తీసుకున్నాడు అని తెలిసి మంజుల కళ్ల నుంచి తెలియకుండానే కన్నీళ్లు జారిపడ్డాయి
పుస్తకం లోపల పెట్టేసి కాలేజీ కి బయలుదేరుతున్న చెల్లెలు తో, “డబ్బు తీసుకున్నావా, తోడుగా చిన్నాడిని తీసుకుని వెళ్ళు” అన్నాడు.
“పరవాలేదు అన్నయ్య, నేను జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను” అని చెప్పి ఆటో ఎక్కి కాలేజీ కి బయలుదేరింది.
అన్నయ్య తమ కోసం యింత కష్టపడుతోవుంటే తను ఆషామాషిగా చదువుతో కొన్ని సబ్జక్ట్స్ తప్పడం సిగ్గుగా అనిపించింది. యిహ నుంచి జాగ్రత్తగా చదివి అన్నయ్య శ్రమకి ఫలితం చూపించటమే కాకుండా అన్నయ్య కోసం మంచి అమ్మాయి ని చూసి ఋణం తీర్చుకోవాలి అని నిర్ణయం తీసుకుంది.
కాలేజీ లో తనతో పాటే చదువుతున్న స్నేహ అయితే బాగుంటుంది అనిపించింది, వాళ్ల నాన్నగారు వంటలు చేస్తో దాతలు యిచ్చిన డబ్బులు తో తనని చదివిస్తున్నారని చెప్పడం గుర్తుకు వచ్చి, ఎలాగైనా స్నేహ ని తన వదిన గా చేసుకోవాలి అని అనుకుని స్నేహతో విషయం చెప్పింది.
“మా అన్నయ్య యింటి బాధ్యతలు కోసం చదువు ఆపి చిన్నగా టిఫిన్ సెంటర్ పెట్టుకుని యిప్పుడు పెద్ద టిఫిన్ సెంటర్ గా చేసాడు. నువ్వు ఏమి అనుకోకుండా వుంటే ఒకసారి నాతో మా యింటికి వచ్చి మా అన్నయ్య ని, హోటల్ ని చూడు, నీకు నచ్చేతే మిగిలిన విషయాలు పెద్దగా అడ్డురావు, అయితే నీ మనసులో హోటల్ నడుపుకునే వాడితో పెళ్లి ఏమిటి అని వుంటే మొహమాటం లేకుండా చెప్పేసేయి” అంది మంజుల స్నేహితురాలుతో.
“మా నాన్న వంటలు చేసి మా కుటుంబం ని లాగుతున్నాడు
నాకు పెద్ద ఆశలు లేవు. మీ సంబంధం కుదిరితే నేను అదృష్టవంతురాలునే” అంది.
ఒక రోజు మంజుల తో వాళ్ల ఇంటికి వెళ్ళింది స్నేహ. పెద్ద దొడ్డిలో ఒక చిన్న డాబా యిల్లు, రోడ్డుకి అనుకుని పెద్ద షెడ్డులో టిఫిన్ రూమ్ కనిపించింది. సాయంత్రం వేళ కావటంతో స్నాక్స్ కోసం జనం చుట్టిముట్టి వున్నారు.
చెలెళ్లు తో యింకో అమ్మాయి రావడం చూసిన సుధాకర్ ని చూసి “అన్నయ్య.. ఈ అమ్మాయి మా ఫ్రెండ్ స్నేహ, ఏదో పుస్తకం కోసం వచ్చింది” అని పరిచయం చేసింది మంజుల.
టిఫిన్ రూమ్ లో అనగానే బట్టలు నిండా పచ్చళ్ళు సాంబార్ తో ఉంటాడేమో అనుకున్న స్నేహకి చక్కని గళ్ళ చొక్కా వేసుకొని మంచి క్రాఫ్ తో తెల్లగా మెరుస్తూ హడావుడి గా వున్న సుధాకర్ ని చూసి ఆశ్చర్యపోయింది స్నేహ.
“లోపలికి తీసుకుని వెళ్ళమ్మా, టిఫిన్ పంపిస్తాను, నీ స్నేహితురాలుకి మన హోటల్ టిఫిన్ రుచి చూపించు” అన్నాడు సుధాకర్. అయిదు నిముషాలు తరువాత పని కుర్రాడు రెండు ప్లేట్స్ లో మిర్చి బజ్జిలు, మైసూర్ బజ్జిలు గట్టి చట్నీ తీసుకుని వచ్చి స్నేహితురాలు ముందు వుంచాడు. వేడి వేడిగా వున్న బజ్జి నోట్లో పెట్టుకుని ‘ఆహా’ అంది స్నేహ.
“మా అన్నయ్య ని చేసుకుంటే నీకు కావలిసిన టిఫిన్ తినచ్చు” అంది నవ్వుతు మంజుల.
యింతలో మంజుల వాళ్ల అమ్మగారు రెండు కప్పుల నిండా టీ తీసుకుని వచ్చి ఇద్దరికి యిచ్చి, స్నేహ గురించి వివరాలు అడిగి తెలుసుకుంది.
స్నేహితురాలు వెళ్లిన తరువాత తల్లిని అడిగింది, “మా ఫ్రెండ్ ని అన్నయకి చేసుకుంటే ఎలావుంటుంది అమ్మా” అని.
“నీలాగానే ఆ అమ్మాయి చదువుకుంటోంది, నువ్వే మీ అన్నయ్యని చులకనగా చూస్తావు చదువు తక్కువ అని, అటువంటప్పుడు పరాయి పిల్ల ఎలా ఒప్పుకుంటుందే” అంది సీతమ్మ గారు.
“అమ్మా! అన్నయ్య గురించి నేను పొరపాటుగా అర్ధం చేసుకున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మనలాంటి కుటుంబమే, నువ్వు, అన్నయ్య అవును అంటే మిగిలిన విషయాలు పట్టించుకొక్కరలేదు” అంది.
“ఏమో మీ అన్నయ్య ఏమంటాడో, రాత్రికి అడిగి చూద్దాం” అంది.
రాత్రి అన్నం తింటున్న కొడుకుతో పెళ్లి విషయం కదిపింది సీతమ్మ గారు.
తల్లి మాట విని చెల్లెలు వంక చూసి, “వాళ్ల బీదరికం ఆసరా చూసుకుని చదువుకునే ఆ అమ్మాయి ఆశలు పాడు చెయ్యడం ఎందుకమ్మా, నాకు తగ్గ సంబంధం చూద్దువుగాని.. చెల్లమ్మ పెళ్లి అయిన తరువాత” అన్నాడు.
“నా పెళ్లితో ముడిపెట్టుకుంటే యిహ నీ పెళ్లి అయినట్టే అన్నయ్య, ముందు మా స్నేహితురాలు నీకు నచ్చిందా” అని అడిగింది అన్నగారిని.
“ఆ అమ్మాయికేం.. బాగానే వుంది, మన ఆశ బాగుండలేదేమో” అన్నాడు సుధాకర్.
అన్నగారు ఒప్పుకున్నట్టే అని అనుకుని, స్నేహితురాలు ని యింకోసారి అడిగింది.
“మీ నాన్నగారితో మా నాన్నకి ఫోన్ చేయించు” అంది సిగ్గుపడుతో స్నేహ.
యిహ మిగిలిన వ్యవహారం చక చక జరిపించి అన్నగారి పెళ్లి మొత్తం తనే అయ్యి తిరిగి జరిపించింది మంజుల.
పెళ్లి అయిన తరువాత మామగారితో చెప్పాడు.. “యింకా ఈ వయసులో వంటకి వెళ్ళటం ఎందుకు, మన హోటల్ లో కిచెన్ ఇంచార్జి గా వుండి నాకు సహాయం చెయ్యండి” అని అడిగాడు సుధాకర్. అల్లుడి మాట కాదనలేక ఒప్పుకున్నాడు స్నేహ తండ్రి.
ఒక ఆదివారం మంజుల టీవీ చూస్తో అన్నగారు నోట్ బుక్ లో ఏదో రాయడం చూసి, అన్నగారు బయటకు వెళ్లిన తరువాత పుస్తకం తెరిచి చూసింది. అందులో యిహ నుంచి స్నేహ కాలేజీ ఫీజు కి డబ్బులు దాయాలి, హోటల్ లో భోజనం కూడా పెట్టడం మొదలుపెడతాను అని రాసి వుంది. యిటువంటి అన్నయ్యకి చెల్లెలు అవడం తన అదృష్టం అనుకుంది మంజుల.
చేసే పని ఏదైనా ఉద్దేశ్యం మంచిది అయితే వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవ్వరు?
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments