top of page

అంతా ఆయన వల్లే!

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #అంతాఆయనవల్లే, #AnthaAyanaValle, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Antha Ayana Valle - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 10/04/2025

అంతా ఆయన వల్లే - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రవి, గాయత్రి దంపతులకి ఇద్దరు కొడుకులు. రవి తాతముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఏమిలేవు. రవి తండ్రి, కొడుకును చదివించి, ఉద్యోగం వస్తే చాలు వాడి బతుకు వాడు బతుకుతాడు అనుకున్నమనిషి.


అదే పోలిక రవి కి రావడంతో తన జీవిత ఆశయం కొడుకులు ఇద్దరు బాగా చదువుకొని జీవితంలో స్థిర పడితే చాలు అని అనుకుని ఆడంబరాలకు పోకుండా వున్న డబ్బులు దాచుకుని పిల్లలని ఇంజనీరింగ్ చదివించాడు. వాళ్ళు చదువు అయ్యేవరకు, ఒక సినిమా కి వెళ్ళటం కాని, హోటల్ కి వెళ్ళడం కాని చేసేవాడు కాదు. అతని భార్య కూడా భర్త కి పోటీగా అతి జాగ్రత్తగా సంసారం గడిపేది.


పెద్దకొడుకు శ్రీకాంత్, చిన్న కొడుకు శ్రీరామ్ లు ఒక్క ఏడాది తేడాతో పుట్టటం తో చదువులు కూడా ఒకేసారి పూర్తి అయ్యి ఉద్యోగాలలో చేరిపోయారు. తండ్రిని తల్లిని పువ్వులో పెట్టుకుని చూసుకుంటున్నారు.


ఒకరోజు పిఠాపురం నుంచి కామేశ్వరరావు, అతని భార్య ఇద్దరూ రవి వాళ్ల పెద్దబ్బాయ్ కి తమ కూతురు వనజ ని ఇవ్వటానికి మాట్లాడటానికి కైకలూరు వచ్చారు. ఆటో దిగి రవి యింటి ముందు దిగిన కామేశ్వరరావు రవి వాళ్ళ యిల్లు చూసి “వెలిసిపోయి పెచ్చులు ఊడిపోయిన ఈ యింట్లో సంబంధం ఎలా కలుపుకోవాలి” అని భార్య వరలక్ష్మి తో అన్నాడు. 


“ఛాలెండి పిల్లాడిని యింకా చూడలేదు.. అప్పుడే అనుమానలా! అయిన మనం వుండే యిల్లు ఏమైనా భవనమా, పెంకుటిల్లేగా” అంది లోపలికి నడుస్తూ.


అనుకోని అతిధులని లోపలికి ఆహ్వానించాడు రవి. 


“రండి, మీరు..” అని ఆగిపోయాడు. 


“నా పేరు కామేశ్వరరావు, నా భార్య వరలక్ష్మి. మాది పిఠాపురం. నాకు ఒక కూతురు, యిద్దరు కొడుకులు, వ్యవసాయ కుటుంబం” అని పరిచయం చేసుకున్నాడు. 


“వ్యవసాయ కుటుంబం అంటున్నారు, మేము బ్రాహ్మణ కుటుంబం” అన్నాడు. 


“కామేశ్వరరావు పక్కున నవ్వుతూ “భలే వారు సార్, బ్రాహ్మణులు వ్యవసాయం చేయకూడదా, మా తాతగారి నుంచి మాది వ్యవసాయం. మాకు ముప్పై ఎకరాల భూమి వుంది” అన్నాడు.


జేబులో నుంచి తన కూతురు ఫోటో తీసి రవి కి యిచ్చి “మా అమ్మాయి వనజ, కుదిరితే మీ పెద్దబ్బాయ్ కి యిద్దామని వచ్చాము” అన్నాడు. 


ఇంతలో వున్నవాటిల్లో మంచి చీర కట్టుకుని కాఫీ గ్లాసులతో వచ్చి వరలక్ష్మి పక్కన కూర్చుని వివరాలు లాగడం మొదలుపెట్టింది గాయత్రి.


కామేశ్వరరావు చెప్పటం మొదలుపెట్టాడు, “మా యింట్లో లక్ష్మిదేవి వుంది గాని సరస్వతి దేవి లేదు. మా ఆవిడ 8 th క్లాస్, నేను 10 th క్లాస్, మగపిల్లలు ఇద్దరు వ్యవసాయం లో నాకు సహాయంగా వుండటంతో 10 th వరకు చదివి వూరుకున్నారు. యిహ మా అమ్మాయి ఆడపిల్లని కాలేజీ కి పంపటం యిష్టం లేక 10 th వరకు చదివింది” అన్నాడు.


“మాకు యిద్దరు అబ్బాయిలు. ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నారు. నేను ఈ ఊరిలో ప్రెవేట్ కాలేజీ లో లెక్చరర్ ని. ఈ యిల్లు గవర్నమెంట్ వేలంపాట లో కొనుకున్నాము. యివి తప్పా మాకు ఆస్తులు ఏమీలేవు” అన్నాడు రవి.


“యింటికి రంగులు కూడా వేయించలేదు” అంది వరలక్ష్మి. 


“‘బయటకు కనిపించే రంగులు బయట వాళ్ళు చూడటం కోసం వేస్ట్ అని, యింట్లో మనం చూడటానికి రంగులు ఎందుకు, ఆ డబ్బులు పిల్లల చదువు కి ఉపయోగించాము” అంది గాయత్రి.


“అయితే మీ అబ్బాయి ఉద్యోగం తప్పా ఏ ఆస్తి లేదు అన్నమాట,, మాకు పొలాలు వుంటే గాని కంటికి ఆనవు. ఉద్యోగం నమ్మి పిల్లని ఆస్థి లేని యింట్లో యిస్తే ఇమడలేదు, క్షమించండి” అంటూ లేచి బయటకు నడిచారు కామేశ్వరరావు దంపతులు.


“యింత దూరం వచ్చాము వెతుకుంటూ, మరీ ఆస్తి లేని సంబంధం, మాకు పిల్లల చదువే ఆస్తి అంటూ గొప్పగా చెపుతున్నాడు ఆయన” అంది వరలక్ష్మి. 


మాట్లాడుకుంటూ బస్టాండ్ దగ్గరికి వచ్చారు. యింతలో వెనుక నుంచి ‘ఒరేయ్ కామి’ అంటూ పిలుపు విని వెనక్కి చూసి ఆశ్చర్యం తో “ఒరేయ్ వెంకట్ నువ్వేమిటి యిక్కడ” అన్నాడు కామేశ్వరరావు.


“నేను మన వూరిలో పొలం అమ్మేసి కైకలూరు లో చేపల చెరువులు కొన్నాను. నువ్వు కూడా కొనరా అంటే మేము బ్రాహ్మలం చేపల చెరువులు మాకెందుకు రా అన్నవుగా, ఏమిటి మా ఊరు వచ్చావు” అన్నాడు.


“ఏముందిరా.. మా అమ్మాయి కి మంచి సంబంధం వుంది అంటే వచ్చాను, పిల్లాడు ఇంజనీర్, కాణి ఆస్తి లేదు, ఆస్తులు లేనివాళ్ళకి ఎలా యిస్తాం అని వెనక్కి వెళ్లిపోతున్నాము” అన్నాడు. 


“నువ్వు వెళ్ళింది రవి మాస్టర్ యింటికా, ఈ ఊరిలో ఇంజనీర్ చేస్తున్న బ్రాహ్మణ పిల్లలు వాళ్లే” అన్నాడు వెంకట్.


“అవును, అనవసరంగా వచ్చాము. మరీ మధ్యతరగతి యింట్లో ఎలా యివ్వాలి రా” అన్నాడు. 


“వెంకట్ ఒక్కసారి నవ్వి, “ఒరేయ్! కిందటి ఏడాది తూఫాన్ వచ్చి నీ పొలం లో పంట నాశనం అయితే, ‘అయ్యా సహాయం చెయ్యండి’ అని గవర్నమెంట్ ని ఆడుకున్నావు నాతో సహా గుర్తుందా, అప్పుడు కూడా మాస్టర్ గారి అబ్బాయిల జీతం ఒక్క పైసా తగ్గకుండా వాళ్ళకి వచ్చింది. మన సంపాదన వాన ఎండల మీద ఆధారపడి వుంది. అందులో నీ కూతురు చదివింది ఎక్కువ కాదు. సరస్వతి దేవి కటాక్షం వుంటే లక్షలు అవే వస్తాయి, నువ్వు ఎంతో అదృష్టం చేసుకుంటే గాని మీ అమ్మాయి మాస్టర్ కి కోడలు అవ్వదు, ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని మళ్ళీ వెళ్ళి మాట్లాడుకో” అన్నాడు.


“నిజమే రా. అంత అలోచించి లేదు. యిప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే ఆయన గేటౌట్ అంటాడేమో” అన్నాడు కామేశ్వరరావు. 


“మాస్టర్ దయార్ద్రహృదయుడు, పద నేను కూడా వస్తాను” అని మళ్ళీ తిరిగి రవి మాస్టర్ యింటికి వచ్చి కాలింగ్ బెల్లు కొట్టారు. 


ఎవ్వరా అని తలుపు తీసిన గాయత్రి ఉదయం వచ్చిన వాళ్ళని చూసి, “ఏమైనా మర్చిపోయారా” అంది. 


“అవును అమ్మా, మాస్టర్ వున్నారా” అని ఆడిగాడు వెంకట్. 


“కూర్చోండి” అని చెప్పి భర్తని పిలిచింది గాయత్రి.


రవి ఆశ్చర్యపోతు “ఏమిటి కామేశ్వరరావు గారు” అన్నాడు. 


“అయ్యా! చదువు విలువ తెలియక ఆస్తులు వుంటే చాలు అనుకుని వెళ్ళిపోయాము. ఇతను మా స్నేహితుడు, ఆస్తి పరుడు, అతను నా కళ్ళు తెరిపించాడు, మా తప్పు క్షమించి మా అమ్మాయి ని చూసుకోవడానికి మీ అబ్బాయి తో సహా రమ్మని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను” అన్నాడు. 


“అవును మాస్టర్! మా కామేశం కొద్దిగా తెలివితక్కువ, మా అబ్బాయి మీ కాలేజీ లో చదువుతున్నాడు. మీ గురించి మా అబ్బాయి చెప్పాడు” అన్నాడు వెంకట్.


“సరే, వీలుచూసుకుని వస్తాము, ఈ ఫోటో మీ అమ్మాయి కి చూపించండి, మీ అమ్మాయి ఫోటో మాకిస్తే మా అబ్బాయి కి పంపుతాను. మీకు ముందుగా తెలియచేసి వస్తాము” అన్నాడు రవి. 

ఫోటో చూసిన పెద్దకొడుకు శ్రీకాంత్ “బాగానే వుంది. మీరు ఇష్టపడితే నేను వారం రోజులు సెలవు పెట్టి వస్తాను, మీతో గడిపినట్టు కూడా ఉంటుంది” అన్నాడు.


గాయత్రి వెంటనే క్యాలెండరు, పంచాంగం, శాస్త్రి గారిని అడిగి పెళ్లిచూపులకి తేదీ నిర్ణయం చేసింది. రవి ఆ విషయం కామేశ్వరరావు కి అలాగే కొడుకు శ్రీకాంత్ కి, చిన్న కొడుకు చెవిలో కూడా వేసాడు.


అనుకున్న తేదీకి పిఠాపురం చేరుకున్నారు కారులో. వూరి మొదట్లో కామేశ్వరరావు, వెంకట్ మోటార్ సైకిల్ మీద నుంచుని రవి దంపతులను, శ్రీకాంత్ కు ఆహ్వానం పలికి ఇంటికి తీసుకుని వెళ్లారు. పనివాళ్ళు అనుకుంటా శ్రీకాంత్ ని చూసి అచ్చు సినిమా హీరో ల వున్నాడని గుసగుసలాడుకుంటున్నారు. 


“మీరు యిక్కడే ఉన్నారే” అని వెంకట్ ని పలకరించాడు రవి. 


“మా కామేశం కూతురు కి పెళ్లిచూపులు అంటే ఒకరోజు ముందే వచ్చేసాను” అన్నాడు. తన స్నేహబంధం తెలియచేసాడు.


ఉన్నంతలో యిల్లు నీట్ గా వుంది. పెద్ద దొడ్డి ఉండటం వల్ల నాలుగు గేదలు, రెండు ఆవులు కట్టేసి వున్నాయి.


అమ్మాయి ని తీసుకుని వచ్చి చూపించారు, ఫొటోలో కంటే బాగానే వుంది. కామేశ్వరరావు తన కూతురు ని లోపల కి పంపించి ఒక్కనిమిషం అంటూ తను కూడా లోపలికి వెళ్ళి కూతురు ని ఆడిగాడు. 


‘నాకు ‘అంది సిగ్గుపడుతో. బయటకు వచ్చి రవి కి విషయం చెప్పి “మీ అబ్బాయి అభిప్రాయం తెలుసుకుంటే ఈరోజు తాంబులాలు పుచ్చుకుందాము. మిగిలిన విషయాలు పెద్ద సమస్య కాదు” అన్నాడు.


శ్రీకాంత్ తండ్రికి మెసేజ్ పెట్టాడు ‘నాకు సరే, మీరు అమ్మా సరే అంటే ప్రొసీడ్ అవుదాము’ అన్నాడు.


రవి “అయ్యా కామేశ్వరరావు గారు, మాకు కూడా సరే, అయితే ఒక విషయం మీకు ముందుగా చెప్పాలి. ఏమిటంటే మా తరుపున బంధువులు ఒక అరవై మంది వరకు వస్తారు. పెళ్లి పిఠాపురం లో అంటే వారందరిని నేను ఖర్చులు పెట్టుకుని తీసుకొని రాలేను. మాకు కట్నకానుకలు అక్కరలేదు. పెళ్లి బాగాచెయ్యడం, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ యిచ్చి, వసతి యిస్తే చాలు. లేదంటే మీరు పెళ్లి మా వూరిలో చేస్తే భోజనాల ఖర్చులు తప్పా మీకు ఏమివుండవు” అన్నాడు.


“ఇదేమి పెద్ద కోరిక బావగారు. మీ వూరికి పది కార్లు పంపుతాను, మా గార్డెన్ లో వున్న గెస్ట్ హౌస్ లో వసతి యిస్తాను, యిహ మా అమ్మాయి పేరున అయిదు ఎకరాల పొలం యిస్తాను” అన్నాడు వరస కలుపుతో.

 

శ్రీకాంత్ అన్నాడు “పొలం మాకొద్దు, పెళ్లి చేసి పంపించండి, పొలం పనులు మాకేమి తెలియవు” అన్నాడు. 


“దాని విషయం నేను చూసుకుంటాలే అల్లుడు, నీకు పంట మీద వచ్చే ఆదాయం అంతే” అన్నాడు కామేశ్వరరావు. 


మిగిలిన పనులు చక చక అయ్యిపోయాయి.


వేసవికాలం లో పెళ్లి ఘనంగా జరిగింది. భార్యని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు శ్రీకాంత్. వెళ్లేముందు మామగారికి చెప్పాడు బావమరుదులని చదువు లో పెట్టమని.


సంవత్సరాలు గడుస్తున్నాయి, రవి రిటైర్ అయ్యాడు, పెద్ద కొడుకు శ్రీకాంత్ కూడా తండ్రి అవ్వడంతో, రవి, గాయత్రి యిక్కడ యిల్లు అమ్మేసి హైదరాబాద్ లో కొడుకులతో పాటు స్థిరపడ్డాడు. చిన్న కొడుకు శ్రీరామ్ మూలా నక్షత్రం అవ్వడంతో సంబంధాలు త్వరగా కుదరడం లేదు.


ఒకరోజు శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అతని భార్య విచారం గా ఉండటం చూసి ఏమైంది అని అడిగాడు.


 తన తమ్ముళ్లు చెడు స్నేహాలు పట్టి, అప్పులు చేసి పొలం పంచి యివ్వమని గొడవ పెడుతున్నారు అని, ‘అప్పుల వాళ్ళు వీళ్ళని ఎక్కడ చంపేస్తారో అని భయం తో పొలం అమ్మేసి అప్పులు తీరిచ్చి, మిగిలిన పొలం వాళ్ళ పేరున రాసిచ్చాను, యిహ నీ పొలం మిగిలింది, త్వరలో స్వాధీనం చేసుకో’ అని ఫోన్ చేసి చెప్పారు అంది.


తండ్రికి ఈ విషయం చెప్పాడు శ్రీకాంత్. కోడలు ని కూడా పిలిచి రవి అన్నాడు, “చూడు శ్రీకాంత్, వనజా, మొదటి నుంచి ఈ పొలాల గొడవ మనకి లేదు, యిప్పుడు ప్రతీ ఏడాది మీ నాన్నగారు పంపించే పంట మీద వచ్చిన డబ్బులు కూడా మనకి అంత అవసరమా, అందుకే వనజా.. మీ నాన్నగారికి చెప్పు, నీకు యిచ్చిన అయిదు ఎకరాల భూమి మీద వచ్చే డబ్బులు వారి జీవితాంతం వాడుకోమని, నేను కూడా చెప్పమన్నాను అని చెప్పు” అని అన్నాడు. 


మామగారి దయార్ద్ర హృదయానికి వనజ ఆశ్చర్యపడి, తండ్రికి విషయం చెప్పింది. ఆయినా కామేశ్వరరావు యింతో అంతో ప్రతి సంవత్సరం కూతురుకి పంపిస్తోనే వున్నాడు.


ఒకరోజు ఉదయం అక్కడకి దగ్గరలోనే వున్న కాలనీ నుంచి శంకరం గారు వచ్చి, “అయ్యా! మాకు ఒక్కగాని ఒక్క కూతురు, పేరు రజిని. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది. ఉద్యోగం యింకా రాలేదు. మీ రెండవ అబ్బాయి ని నేను రెండు మూడు సారులు చూసాను. మీకు యిష్టం అయితే ఒకసారి మీ కుటుంబ సమేతం గా వచ్చి మా అమ్మాయిని చూసుకోండి” అన్నాడు.


చాలా రోజుల నుంచి సంబంధాలు రావడం, పోవడం తో ఈ సంబంధం కుదురుతుంది అనే నమ్మకంతో సరే అని ఒక ఆదివారం శంకరంగారింటికి బయలుదేరి వెళ్లారు. పిల్ల బంగారం బొమ్మలా వుంది, శ్రీరామ్ కి రజిని నచ్చడం, అలాగే రజని కి శ్రీరామ్ నచ్చడంతో మాటలు మొదలుపెట్టారు.


“మీ అబ్బాయి జాతకం వుంటే యిస్తే మా శాస్త్రి గారికి చూపిస్తాను, మీరు కూడా మా అమ్మాయి జాతకం చూపించుకోవచ్చు” అంటూ కూతురి జాతకం కాయితం రవి చేతుల్లో పెట్టాడు. 

“మాకు జాతకాల మీద నమ్మకం లేదండి, అంతా భగవంతుడు చేతిలో వుంది. యిదిగో మా అబ్బాయి జాతక పత్రిక” అంటూ యిచ్చి బయటకు వచ్చారు. 


“ఈ సంబంధం కూడా కుదిరేడట్లు లేదు, వీళ్ళ జాతకాల పిచ్చి చూస్తోవుంటే” అన్నాడు రవి భార్యతో.


అనుకున్నట్టే “మీ అబ్బాయి నక్షత్రం మూల, మూలా నక్షత్రం వాళ్ళు నష్ట జాతకులు. మా అమ్మాయి కి కుదరదు. క్షమించండి, మేము మీ సంబంధం కలుపుకోలేము” అని అన్నాడు శంకరం గారు. 


ప్రతీ రోజూ వాకింగ్ కి శంకరం యింటి మించి వెళ్లే రవికి ఎందుకు ఆవైపు వెళ్లడం అనిపించి మరో రోడ్డులో నడుస్తూ, అయినా నేను ఎందుకు భయపడాలి అని మళ్ళీ యదాప్రకారం రోజు నడిచే రోడ్లోకి వెళ్ళాడు. శంకరం యింటి ముందుకు రాగానే నడక వేగం పెంచాడు. 


యింతలో సార్ అని పిలుపు విని వెనక్కి చూసాడు. 


శంకరం యింటి ముందు స్కూటీ ఆపి, రవి దగ్గరకి వచ్చిన రజిని, “క్షమించండి, నాకు జాతకాల మీద నమ్మకం లేదు, మీ సంబంధం నాకు నచ్చినా, నా తల్లిదండ్రులని ఎదురించలేను” అంది. 

“పర్వాలేదు తల్లి, నీకే బంగారం బొమ్మలా వున్నావు, మంచి సంబంధం వస్తుంది, తల్లిదండ్రుల మాట జవదటకూడదు” అని అక్కడ నుంచి కదిలాడు.


గాయత్రి రోజు పూజలు చేస్తో తన కొడుకు శ్రీరామ్ కి మంచి సంబంధం రావాలి అని కోరుకుంటూ చేసిన ప్రసాదం రవికి తినిపించడంతో రవికి బ్లడ్ షుగర్ వచ్చింది. డాక్టర్ గారి సలహాతో వాకింగ్ ఎక్కువ చెయ్యడం మొదలుపెట్టాడు. ఆ రోజు పద్దతిగా శంకరం యింటి దగ్గర నుంచి నడుస్తోవుండగా, శంకరం యింటి ముందు పందిరి వేస్తో కనిపించింది. 


యింటికి రంగులు ఎప్పుడు వేసారో కొత్త యిల్లులా కనిపిస్తోంది. బహుశా ఆ అమ్మాయి పెళ్లి అనుకుంటా అనుకుంటూ యింటికి చేరి భార్యకి చెప్పాడు. 


“పోనీలెండి మన యింట్లో అడుగుపెట్టాలిసిన అమ్మాయి వేరే యింటికి వెళ్తోంది, ఏదైనా రాసిపెట్టి ఉండాలి, చేసే పూజలు అన్నీ ఏమవుతున్నాయో” అంది గాయత్రి. 


“ఏమవుతాయి నా కడుపులో షుగర్ గా మారిపోయాయి” అన్నాడు నవ్వుతూ రవి.


నాలుగు రోజుల నుంచి నీరసంగా ఉండటం తో వాకింగ్ కి రెస్ట్ యిచ్చాడు రవి. “యిదిగో ఈ జీడిపప్పు ఉప్మా తినండి నీరసం తగ్గుతుంది” అంటూ ప్లేట్ భర్త చేతికి యిచ్చినట్టే యిచ్చి, “అదిగో కలియుగ నారదుడు సుందరమ్మ వస్తోంది, ఆవిడ కళ్ళు దిష్టి కళ్ళు” అంటూ ప్లేట్ పట్టుకునిపోయింది.


“ విన్నారా ఈ విషయం.. మిమ్మల్ని కాదన్న శంకరం తన కూతురికి పెళ్లి కుదుర్చుకున్నాడు. అంతా బాగుంటే మొన్న రాత్రి పెళ్లి జరిగేది. పాపం పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్న బస్సు కాలువలో పడి పెళ్ళికొడుకు, అతని తండ్రి చనిపోయారుట. పెళ్లి ఆగిపోయింది. తన కూతురు జాతకం గొప్పది అన్నాడుగా” అంటున్న సుందరమ్మ ని వారించి, “యితరుల దుఃఖం ని చూసి యింత సంతోషంగా ఎలా వున్నారు” అన్నాడు రవి. 


దానితో మొహం మాడిన సుందరమ్మ “అవునులే నాయనా. మీరందరు చదువుకున్న వాళ్ళు, నాకేమి తెలుసు దేనికి సంతోషించాలో, దేనికి ఏడవాలో. మా ఆయన నా పెళ్లి అయిన ఏడాదికే పోవడంతో ఎవ్వరింట్లో పందిరి కనిపించినా ఒక్కటే ఆవేదన” అంటూ వెళ్ళిపోయింది.

“నాన్నా! పదిహేను రోజుల నుంచి మీరు వాకింగ్ కి వెళ్లడం లేదు, యిలా అయితే షుగర్ మందులు వాడాలిసి వస్తుంది, పదండి నేను కూడా వస్తాను. అలా నడుద్దాం” అన్నాడు శ్రీరామ్. 

సరే పదా అని తండ్రీకొడుకులు నడక మొదలుపెట్టారు.


శంకరం యింటి ముందుకి వచ్చేసరికి రవి మనస్సు కలుక్కుమంది. ఏమిటో ఆ దేముడి లీలలు అనుకుంటూ ముందుకు కొంత దూరం వెళ్లి, “అబ్బాయి! యింక వెనక్కి వెళ్దాం, శంకరం గారింటి ముందు వెళవెల పోతున్న ఆ పందిరి చూసి నాకు చాలా బాధ అనిపిస్తోంది, యిహ నడవలేను” అన్నాడు.


“నాన్నా, ఆ అమ్మాయి పెళ్లి అయిన తరువాత అతను పొయాడా” అన్నాడు. 


“పెళ్ళికి వస్తో పోయాడుట, అయినా ఈ సుందరమ్మ లాంటి కాకులు పొడుస్తున్నారుగా ఆ అమ్మాయి తప్పు అని” అన్నాడు రవి. 


“ఒక్కమాట నాన్నా, పెళ్లి కాలేదు కాబట్టి ఆ అమ్మాయి ని నేను చేసుకుంటే ఎలా ఉంటుంది” అన్నాడు శ్రీరామ్. 


కొడుకు వంక చూసి, “బాగానే ఉంటుంది, ఆమెకి కొత్త జీవితం యిచ్చినట్టు అవుతుంది, శంకరం గారు ఒప్పుకున్నా మీ అమ్మని ఒప్పించడం ఎలా?” అన్నాడు. 


“నాన్నా! అమ్మని మాయచేయడం మీకు నేను చెప్పాలా” అన్నాడు.


“సరే పద, ముందు శంకరం గారిని పలకరించి చూద్దాం” అని శంకరం యింటికి వచ్చారు. 

యింటి ముందు నుంచుని కూలీలతో పందిరి విప్పేసేయమని అంటున్నాడు. 


“ఆగండి శంకరం గారు, మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం చెప్పాలి, జరిగిన విషాదం తెలిసింది. జాతకం చూసి కుదిరిచ్చిన పెళ్లి జరగకుండా పోయింది. ఎవ్వరికి ఎప్పుడు ఏమి జరగాలో ఆ కృష్ణపర్మాత్మ చేతిలో వుంది. మనుషులు చెప్పే జాతకం లో మంచిని తీసుకుని, చెడుని ఆ భగవంతుడుకి వదిలేయాలి. మీరు నమ్మే జాతకం ప్రకారం మూలా నక్షత్రం లో పుట్టిన వాళ్ళు అయితే పైకి రాకుండా పోతారు లేదంటే అఖండ జాతకులు అవుతారు అని కదా.


మా అబ్బాయి ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ సంపాదించాడు, మంచి ఉద్యోగం, మంచి జీతం. మీరు నమ్మిన జాతకం లోని రెండో భాగం మా అబ్బాయి. యిప్పటికి మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని మా అబ్బాయి కి చేసుకుంటాము” అన్నాడు.


ఈ మాటలు విన్న శంకరం గారి భార్య పరుగున వచ్చి రవి చేతులు పట్టుకుని “మీరు అన్నది నిజమేనా, మా అమ్మాయి కి ప్రాణబిక్ష పెట్టటానికి వచ్చిన భగవంతుడే మీరు” అంది. 


శంకరం గారు తెప్పరిలి, శ్రీరామ్ ని కౌగిలించుకుని, “మమ్మల్ని కాపాడటానికి వచ్చిన శ్రీహరి లా వున్నావు నాయనా, బుద్ది తక్కువ అయ్యింది, మా అమ్మాయి మాట వినకుండా జాతకం అంటూ కూర్చుని దానిని అగ్నిగుండలోకి తోసాను. నువ్వు, మీ నాన్నగారు మమ్మల్ని కాపాడారు” అని వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్లి, “ఆ పక్కన గదిలో వున్న మా అమ్మాయి ని ఒక్కసారి పలకరించి విషయం చెప్పి రా నాయనా” అన్నాడు.


రాత్రి భోజనం అయిన తరువాత పడుకోబోతో భార్య గాయత్రి తో అన్నాడు, “పాపం శంకరం గారి అమ్మాయి ఏం పాపం చేసింది అని యింత కష్టం తెచ్చిపెట్టాడు భగవంతుడు” అన్నాడు. 

“ఉదయం నుంచి నేను అదే బాధ పడుతున్నాను, చక్కగా వున్న అమ్మాయి కి ఈ అపవాదు ఏమిటి” అని అంది. 


“గాయత్రి, నువ్వే దేముడువి అయితే ఆ అమ్మాయిని ఎలా కాపాడే దానివి” అన్నాడు. 

“అసలు అమ్మాయి పెళ్లి సవ్యం గా జరిపించి కలకాలం హాయిగా ఉండేడట్లు దీవించే దానిని” అంది. 


“అయితే యిప్పుడు నువ్వే దేముడివి ఆ అమ్మాయి పాలిట” అంటూ జరిగిన విషయం చెప్పాడు. 

“పెళ్ళికి ముందే పెళ్ళికొడుకు చనిపోయాడు, అటువంటి అమ్మాయి ని శ్రీరామ్ కి చేసుకుంటే” అంటూ ఆగిపోయింది. 


“నువ్వే దేముడివి నీ పేరు గాయత్రి. యిహ నీ కోడలికి ఆపద ఎలావస్తుంది” అన్నాడు.

తీసేద్దాము అనుకున్న పందిరి అలాగే వుంచారు, బాజాలు మ్రోగాయి. సుందరమ్మ మరో రోడ్డులో సంచరిస్తోంది.


కామేశ్వరరావు దంపతులు, శంకరం దంపతులు రజిని కొడుకు ఉయ్యాల ఉత్సవానికి వచ్చారు. రవి దంపతులు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ‘అంతా ఆయన వల్లే’ అని.


 శుభం 

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
















Comments


bottom of page