top of page
Writer's pictureMohana Krishna Tata

అంతా మీ మంచికే



'Antha Mi Manchike' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 28/05/2024

'అంతా మీ మంచికే' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రామస్వామి పుట్టి, పెరిగింది అంతా అగ్రహారంలోనే. తండ్రి గొప్ప జ్యోతిష్య పండితుడు కావడం, చిన్నప్పటినుంచి తండ్రి చాటున ఉండి అన్నీ గమనించిన రామస్వామి, జ్యోతిష్యం మీద.. ఆచార వ్యవహారాల పైన నమ్మకం చాలా ఎక్కువ. పెళ్ళైన తర్వాత.. ఇంకా పట్టింపు చాలా ఎక్కువ అయింది. తండ్రి పౌరోహిత్యం, జ్యోతిష్యం నేర్చుకోమన్నా, వద్దని, సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయ్యాడు రామస్వామి. 


ఇప్పుడు అగ్రహారం నుంచి సిటీ లో కాపురం పెట్టాడు రామస్వామి. సిటీ లో అంతా హడావిడి జీవితమే; ఆచారాలు, గ్రహాలూ, అనుగ్రహాలు గురించి అంతగా ఆలోచించేవారు అక్కడ లేరని గ్రహించాడు రామస్వామి. ప్రతిదానికీ తండ్రిని అడగడానికి ఆయన ఇప్పుడు బతికిలేరు. రామస్వామి భార్య కి అంతగా వీటి గురించి తెలియదు.. పైగా అంత నమ్మకం కుడా లేదు. 


ఇలాంటి సమయంలో, రామస్వామికి ఉన్న ఒకే మార్గం, టీవీ లో రాశిఫలాలు ఫాలో అవడమే. ఉదయమే నిద్ర లేచి.. వచ్చే రాశిఫలాలు చూడడం.. దానిలో చెప్పేది ఫాలో అయిపోవడం చేసేవాడు. అలా, కొన్ని రోజులు ఫాలో అవగానే, కొన్ని బాగా జరగడంతో ఇక రోజూ అదే పని. 


"ఏమండీ.. ! సాఫ్ట్వేర్ మేనేజర్ అయి ఉండి కుడా ఏమిటండీ.. ఈ రాశిఫలాలు అవీ.. రోజు ఫాలో అవడం. అవడమే కాదు.. వాళ్ళు చెప్పినట్టు చెయ్యడం అంత అవసరమా.. ?" అడిగింది భార్య కాంతం 


"మనకి బాగా కలిసి రావాలంటే, అన్నీ ఫాలో అవాలి కదా.. !" అన్నాడు రామస్వామి


"మా అమ్మ ఏదో నోముకి నన్ను రమ్మని పిలిచింది. నేను మా ఇంటికి వెళ్తున్నాను.. నా పుట్టిల్లు ఇక్కడే కావడం నా అదృష్టం" అంది కాంతం 


"వెళ్ళు గానీ కాంతం.. నీ రాశి ప్రకారం.. ఈ రోజు నువ్వు ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంటే మంచిది.. పైగా తూర్పు దిశ లో ఉన్న బస్ స్టాప్ లో బస్సు ఎక్కితే, అంతా శుభమే.. "


"నా ఖర్మ.. ! నాకు ఆకుపచ్చ రంగు చీరే లేదు. నా లక్కీ కలర్ ఎరుపు అని చెప్పి, ఎప్పుడూ ఆ కలర్ షేడ్స్ లోనే చీరలు కొన్నారు గా.. ! ఇంటి పక్కనే ఉన్న బస్ స్టాప్ వదిలేసి, ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్న బస్ స్టాప్ కి నడచి వెళ్లి బస్సు ఎక్కాలా.. ? మీ చాదస్తం మీరూ.. " అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పుట్టింటికి బయల్దేరింది కాంతం 


కాంతం.. బస్సు ఎక్కి పుట్టింటికి వెళ్ళింది.. 


"అమ్మా.. ! నేను వచ్చేసానే.. "

"ఏమిటే పిల్లా అలా ఉన్నావు.. ? అల్లుడు ఏమైనా అన్నాడా.. ?" అడిగింది తల్లి జానకమ్మ

"ఆయన ఎప్పుడూ ఏదో అంటూనే ఉంటారు అమ్మా.. !"

"అయితే మరి ఏమైందో చెప్పు.. !"


"ఈ మధ్య మా ఆయనకి.. ఈ దిన ఫలాలు, వార ఫలాల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఉదయాన్నే నిద్ర లేవడం.. టీవీ లో ఆ ఛానెల్, ఈ ఛానల్ పెట్టడం.. అందులో చెప్పిన విధంగా.. ఆ రోజు ఏ చొక్కా వేసుకోమంటే అదే రంగు చొక్కా వేసుకోవడం.. ఏ దిక్కు కి వెళ్ళమంటే.. ఆ రోజు అదే దిక్కు వైపు వెళ్లడం చేస్తున్నారు. ఒక రోజు ఆఫీస్ కి టైం అయిపోతున్నాసరే.. దిక్కు కోసం రెండు కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళారు. 


ఇంకా.. ఒక రోజు అదేదో రంగు చొక్కా వేసుకోమని టీవీ లో చెప్పారు. ఆ రంగు నేను ఎక్కడా వినేలేదు. అప్పుడు మా ఆయనని చూడాలి.. ఈయన గూగుల్ లో సెర్చ్ చెయ్యడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆఫీస్ లో ఇంపార్టెంట్ ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉందని.. అందుకే ఆ చొక్కా కోసం.. ఊరంతా తిరిగారు. చివరికి దానిని కొని మరీ వేసుకున్నారు. ఇంకోసారి అయితే, చెప్పిన రంగు చొక్కా ఎక్కడా దొరకకా.. నా చీర అదే రంగు లో ఉందని.. దానిని కట్ చేసి చొక్కా కుట్టించుకున్నారు తెలుసా.. ?"


"పోనీలేవే.. ! మీ ఆయన బాగుంటే, నువ్వూ బాగునట్టే కదా.. ! అంతా మీ మంచికే.. " అంది జానకమ్మ 


"నేను గమనించనేలేదు.. ! నువ్వేంటే, బాగా చిక్కినట్టున్నావు.. తిండి తినట్లేదా ఏమిటి.. ?"

"ఏం చెప్పనే అమ్మా.. ! అప్పుడప్పుడు ఆ రోజు గ్రహాలు బాగోలేకపొతే, పూజలు అవీ చేయించమంటే, నైవేద్యం కోసం రోజుకొక రకమైన వంటకం చెయ్యమంటారే మా ఆయన.. ఉదయాన్నే నిద్ర లేచి చెయ్యాలి. ఆ గ్రహాలు శాంతించాయి లేదో నాకు తెలియదు గానీ, నాకు మాత్రం బొత్తిగా శాంతి లేదే అమ్మా.. !"


"మీ మావయ్యగారు కుడా ఇలాగే అన్నీ పాటించేవారని మీ అత్తగారు నాకు చాలా సార్లు చెప్పారు. ఆయన అడుగు జాడ లోనే నడుస్తున్నాడు కాబోలు మీ ఆయన. మీ మావయ్యగారి చేతికి మొత్తం అన్నీ ఉంగరాలే తెలుసా.. ! చూసి నేనూ, మీ నాన్న చాలా ఆశ్చర్యపోయాము.. ఒకొక్క ఉంగరం ఒకొక్క గ్రహం కోసమని విన్నాను.. "


"ఉంగరాలంటే గుర్తొచ్చిందే అమ్మా.. ! పోయిన నెలలో టీవీ లో అదేదో ఉంగరం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు. అదీ బంగారం లోనే అంటా.. ! నా దగ్గర ఉన్న ఉంగరం కాస్తా చెరిపించి, ఆయన కొత్త ఉంగరం చేయించుకున్నారే.. !


మొన్నటికి మొన్న.. రాశి ఫలాలలో, శని కోసం ఉంగరం పెట్టుకుంటే, అంతా బాగుంటుందని చెబితే, ఇంకొక ఉంగరం చేయించుకున్నారు. ఈ సారి పెళ్ళికి మీరు పెట్టిన ఉంగరం ఖర్చు పెట్టేసారే అమ్మా.. " అంటూ దీనంగా చెప్పింది కాంతం 


"పోనీలేవే.. ! మీ ఆయన బాగుంటే, నువ్వూ బాగునట్టే కదా.. ! అంతా మీ మంచికే.. "


"ఏం బాగో.. ! సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి.. ఇంకా ఇలాగైనా ఉన్నాము.. !"


"మీ ఆయన ఫోన్ చేస్తున్నట్టు ఉన్నాడే.. ! ఎత్తి మాట్లాడు.. అదేంటే మీ ఆయన పేరు ఫోన్ లో అలా సేవ్ చేసావు.. ?" అడిగింది తల్లి 


"నీకు ఇంకా ఆ ముచ్చట చెప్పలేదు కదా.. ! ఈ మధ్య పేరు లో బలం తగ్గిందని ఎవరో చెబితే.. న్యూమరాలజీ కుడా ఫాలో అవుతున్నారు మీ అల్లుడుగారు. రామస్వామి పేరుని కాస్త రామసామి గా మార్చుకుంటే, దురదృష్టం పోయి.. అదృష్టం పరిగెత్తుకుంటూ వస్తుందని, అదేదో ఛానల్ లో చెబితే పేరుని అలా వంకరగా మార్చుకున్నారు. నా ఫోన్ లో కుడా తన పేరుని అలాగే మార్చమని మరీ చెప్పారు.. "


"అవునా.. ?" అంటూ దీర్ఘం తీసింది జానకమ్మ 


"ఇంకా చెబుతాను.. విను అమ్మా.. !"


కొత్త పెళ్ళాం తో వారంలో మూడు రోజులు మాట్లాడకపోతే, ఆయుష్షు రెట్టింపు అవుతుందని ఎవరో స్వామిజీ చెబితే.. నాతో మాట్లాడడం మానేసారు. నాతో అన్నీ సైగలే.. ఆ మూడు రోజులు.. "


"అయితే వారంలో మూడు రోజులు ప్రశాంతంగా ఉంటుందనమాట మీ ఇల్లు.. " అంది తల్లి 


"ఇదింకా నయం.. ఇంకొకటి చెబితే.. నువ్వు ముక్కు మీద వేలు వేసుకుంటావు.. ! ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి నా ముఖము చూడకపోతే.. గ్రహాలూ అనుకూలించి సంసారం చాలా బాగుంటుందని ఎవరో అంటేనూ.. నా ముఖం కనిపించకుండా గుడ్డ తో కప్పుకోమని ఆర్డర్ వేసారే మీ అల్లుడుగారు.. "


"పోనీలేవే.. ! మీ ఆయన బాగుంటే, నువ్వూ బాగునట్టే కదా.. ! అంతా మీ మంచికే.. "


"ఏం బాగో.. ! ఆలస్యం అవుతోంది.. " అంటూ ఇంటికి బయల్దేరింది కాంతం 


*************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


144 views0 comments

コメント


bottom of page