అంతరిక్ష యానంలో నేర్వదగ్గ పాఠం
- Rayala Sreeramachandrakumar
- 7 hours ago
- 4 min read

Anthariksha Yanamlo Nervadagga Patam - New Telugu Article Written By R C Kumar
Published In manatelugukathalu.com On 21/04/2025
అంతరిక్ష యానంలో నేర్వదగ్గ పాఠం - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
అంతరిక్షంలో సాంకేతిక సమస్యలకు లోనైన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ఇరుక్కుపోయి అష్ట కష్టాలు అనుభవించిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మార్చి 19న సురక్షితంగా భూమిపైకి చేరుకోవడం యావత్ ప్రపంచం సంతోషించదగ్గ విషయమే. ఈ విషయంలో చొరవ తీసుకొని, సరైన రీతిలో స్పందించి ఇరువురు వ్యోమగాములను క్షేమంగా వెనక్కి తీసుకువచ్చే ఏర్పాటుచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ అభినందనీయులు. 8 రోజుల రోదసీ యాత్ర చేసి తిరిగి రావలసిన మహిళా వ్యోమగామి 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత భూమిపైకి చేరుకోవడంతో స్వగ్రామంలో సంబరాలు జరుపుకోవడం, కరతాళ ధ్వనులతో స్వాగతించి సరిపెట్టేసుకున్నాము. ఈ ఉదంతం ద్వారా కష్టాలను, నష్టాలను మించిన పాఠాలు ఇక వేరే ఉండవని తెలుసుకున్నాక అందులోనే సంతోషాన్ని వెతుక్కుని సానుకూల దృక్పథంతో ఎలా ముందుకు సాగాలో నేటి యువత గ్రహించాలి.
ఆ మహిళా వ్యోమగామి అధిగమించిన విపత్కర పరిస్థితులపై అవగాహన తెచ్చుకొని తగిన విధంగా స్ఫూర్తి పొందాలి. అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఊహించని విధంగా ఎక్కువ కాలం గడిపిన సమయంలో అనూహ్యమైన, అనిశ్చితమైన పరిస్థితులను ప్రశాంతంగా స్వీకరించింది. ప్రతికూలతలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ మానసిక స్థిరత్వాన్ని పొందగలిగే విలువైన పాఠాలను మనకు అందించింది. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండగల సామర్థ్యాన్ని నేర్పింది.
విలియమ్స్ కథ పట్టుదల యొక్క శక్తిని మరియు శాస్త్రీయ ఆవిష్కరణల తెర వెనుక సంక్లిష్టతలను ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు ప్రేరణగా పనిచేస్తుంది. తిరిగి వచ్చే తేదీ ఊహకు అందనప్పటికీ ఆమె తన పనులపై దృష్టి సారించి, లక్ష్యాన్ని, నియంత్రణను కొనసాగించింది. కష్టాలను ఎదుర్కోగల చాతుర్యం మరియు ఆవిడ దృఢసంకల్పాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. అంకితభావం, సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమే అన్న సూక్తికి ఆమె అంతరిక్ష అనుభవాలే నిదర్శనాలు. మానసిక సంఘర్షణలకు లోనుకాకుండా సునీత విలియమ్స్ స్థితప్రజ్ఞత సాధించడానికి కారణం అంతరిక్షంలో సైతం వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని అధ్యయనం చేస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశాన్ని జీర్ణించుకోవడమే.
పది రోజులపాటు ఇంటిల్లపాదిని వదిలి దూర ప్రాంతాలకు వెళ్లిన వారు కుటుంబ సభ్యుల తోడు లేక విలవిల్లాడుతూ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకుంటూ బెంగపడటం చూస్తున్నాం. స్వామి వివేకానంద చెప్పినట్లుగా ప్రతికూల పరిస్థితులలోనూ సంయమనం పాటిస్తూ ఇనుప కండలతో, ఉక్కు లాంటి నరాలతో దృఢచిత్తంగా నిలబడాలేగాని గాలికి రాలిపోయే ఎండుటాకుల్లా పడిపోకూడదు.
ఊహకు అందనంత దూరంలో నా అనుకునేవాళ్ల జాడ లేని గగనాంతర సీమలో, ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియని విపత్కర పరిస్థితుల్లో ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది నెలల పాటు సుదీర్ఘకాలం ఉద్వేగభరిత జీవితాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడడం సామాన్య విషయం కాదు. మరో నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ తప్ప మరెవరు తోడు లేని అంతులేని అంతరిక్షం. సతుల్, సుతుల్, హితుల్ లేక పోనీ! పోతే పోనీ !రానీ రానీ! వస్తే రానీ! కష్టాల్, నష్టాల్, కోపాల్, తాపాల్, శాపాల్, రానీ, వస్తే రానీ! అని శ్రీశ్రీ గారు రాసిన అద్భుతమైన కవితని ఆహా ఓహో అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ అనుభవించే సమయంలోనే దాని ప్రభావం ఏమిటో తెలుస్తుంది.
భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అమెరికా నావికాదళ అధికారిణి. ఆ తర్వాత నాసా వ్యోమగామిగా పని చేసిన అంతర్జాతీయ అంతరిక్ష స్టేషను లో మహిళల్లో నంబర్ వన్ స్థానంలో, అత్యంత అనుభవజ్ఞులైన స్పేస్‌వాకర్ల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. రాబోయే కొద్ది నెలల్లో 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని సీనియర్ సిటిజన్ల జాబితాలో చేరబోతోంది.
సంసార సాగరంలో అలలు, అలలుగా ఉత్పన్నమయ్యే సమస్యలను తట్టుకునే దృఢ సంకల్పం నేటి గృహస్తులకు సైతం కొరవడింది. నిజజీవితంలో ఎదుర్కొనే విపత్కర పరిస్థితులకు కృంగిపోవడం మన లక్షణం కాకూడదు. ఈ ప్రపంచం ద్వంద్వాలమయం. మనకు కనిపించేది, వినిపించేది, మనది అనుకున్నది, ఏదీ శాశ్వతం కాదు. భౌతికమైన, లౌకికమైన ప్రతి అంశానికీ ఏదో ఒకనాడు ముగింపు ఉండి తీరుతుంది.
కష్టమైనా అంతే, సుఖమైనా ఒకదాని వెన్నంటే మరొకటి. అన్నీ కదిలిపోయే మేఘాల లాంటివే. ఈ పరిణామక్రమాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరించడానికి సునీత విలియమ్స్ కి ఉపయోగపడ్డ ఉపకరణాలే మన ఉపనిషత్తులు, భగవద్గీత. అందువలననే ఆ మహిళా వ్యోమగామి మనసుని ఎటువంటి సమస్యలూ వేధించడం గానీ, భయభ్రాంతులకు గురి చేయడం గాని జరగలేదు. సుఖ-దుఃఖాల వంటి ద్వంద్వాలను సమానంగా స్వీకరిస్తూ ప్రతికూల పరిస్థితుల్లోనూ సవాళ్లను ఎదుర్కొంటూ ఫలాపేక్ష లేని కర్మలు పాటించగలిగితే ప్రతి ఒక్కరూ అర్జునుడిలా విషాద యోగం నుంచి బయటపడి కర్మయోగానికి చేరుకోగలరు.
స్థితప్రజ్ఞత లభించేలా చేయడంలో మనకు ఉపకరించే సాధనం నిజమైన భక్తిశ్రద్ధలతో కూడిన ధ్యానం. అందుకే భగవంతునిపై భక్తిని, ధ్యానాన్ని ఒక జీవన విధానంగా మార్చుకోవాలే తప్ప మొక్కులకు, షోడశోపచారాలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇటీవల కాలంలో జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా మనసుని అల్లకల్లోలం చేసుకోవడం యువతకు, గృహస్థులకు పరిపాటిగా మారింది. అనవసర ఆందోళనలకు, భావోద్వేగాలకు గురికాకుండా ఉండాలంటే జీవితానుభవం ఉన్నవారిని, సునీత విలియమ్స్ లాంటి వారి స్ఫూర్తిని మార్గదర్శకంగా తీసుకొని సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యం పొందాలి. గెలుపును ఎలా సాధించాలో తెలిసిన వాడికంటే, ఓటమిని ఒత్తిడిని ఎలా జయించాలో తెలిసినవాడే గొప్పవాడని ఒక కవి చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
ధన్యవాదాలు
వినమ్రతతో ��
ఆర్ సి కుమార్
సామాజిక కార్యకర్త
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
Comments