కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Antharmadanamlo Sandhi Kalam' New Telugu Story Written By P Dinakar Reddy
రచన: పి. దినకర్ రెడ్డి
"ఇందులో తన తప్పేముంది మేడమ్?" వీణను ఓదారుస్తూ అడిగింది శైలజ.
ప్రిన్సిపల్ మేడమ్ కళ్ళజోడు సరి చేసుకుని చుట్టూ చూసింది.
"ఆ కిషోర్ ఒక మొండి వెధవ. పైగా ఇది ర్యాగింగ్ అని కూడా చెప్పలేం శైలజా" అంది.
"మళ్లీ ఒక్కసారి చూడండి మేడమ్. క్లాసులో ఉండగానే వీణ ఫోటో తీసి, వాళ్ళు తన శరీరాన్ని ఎలా అనుభవించాలి అనే తమ కోరికల్ని సిగ్గు లేకుండా డిస్కస్ చేస్తున్నారో చూడండి" అంటూ ఒక వాట్సాప్ గ్రూప్ లో జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్ చూపించింది శైలజ.
"గట్టిగా అరిచి ఆ అమ్మాయిని ఇంకా అల్లరి చెయ్యడం సబబా. వాళ్ళ పర్సనల్ వాట్సాప్ గ్రూపులో మాట్లాడుకున్న విషయాల గురించి సీరియస్గా తీసుకోకపోవడం మంచిది. అమ్మాయ్! ముందు నువ్వు క్లాసుకు వెళ్ళు" అంటూ వీణను పంపించింది ప్రిన్సిపల్ మేడమ్.
"శైలజా! కిషోర్ చేసిన పనిని నేను సమర్థించడం లేదు. కానీ కొన్ని విషయాలు మనం చూసీ చూడనట్టు వదిలేయాలి. లేదంటే అవి అందరినీ ఇబ్బంది పెడతాయి" అని చెప్పి లెక్చరర్ శైలజను కూడా పంపించింది.
ప్రిన్సిపల్ మేడమ్ కళ్ళల్లో తడి చూసాక శైలజ ఏమీ మాట్లాడలేదు. ఆ కళ్ళలో అశక్తత..
శైలజకి కారిడార్లో కనిపించాడు కిషోర్ మిడిగుడ్లు వేసుకుని.
'నువ్వు నన్ను ఏమీ చేయలేకపోయావు' అనే గర్వం వాడి కళ్ళల్లో కనిపించింది.
ప్రిన్సిపల్ మేడమ్ భయపడ్డారు అంటే ఆ కిషోర్ తండ్రికి రాజకీయ పార్టీ అండ దండలు ఉన్నాయి అనే కదా. అశక్తత..
ఇంటర్మీడియెట్, డిగ్రీ చదివే ఈ పిల్లలు అమ్మాయిని ఆట వస్తువుగా చూడడం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? ఇంటి నుంచా? సమాజం నుంచా? తనేమీ చెయ్యలేక తల దించుకుంది. అశక్తత. అంతర్మథనం చేసుకున్న ప్రతీసారీ అశక్తత పలకరిస్తుంది.
రోజులు గడిచిపోయాయి. నగరంలో ఆసక్తిని వదులుకోలేక లెక్చరర్ కొలువు చేస్తున్నా,ఊళ్లో శైలజ భర్తకు కావాల్సినంత ఆస్తి ఉంది. పాప చదువు కోసం సిటీకి వచ్చారు గానీ అక్కడ లంకంత కొంప కూడా ఉంది.
ప్రతి ఏడూలానే ఈ సంవత్సరం కూడా గంగమ్మ తల్లి జాతర హంగూ ఆర్భాటాలతో జరుగుతోంది. శైలజ మనసులో ఎన్నో ఆలోచనలు.
ఆదిశక్తి స్వరూపంగా గ్రామ దేవతను ఆరాధించి, ఆమెలో అమ్మను చూస్తారు.
మరి ఆడదానిలో కనీసం మనిషిని కూడా చూడలేకపోతున్నారు కదా..
రాత్రి వేళ ప్రత్యేకంగా బండ్లు కట్టి రికార్డింగ్ డాన్సులు పెట్టించారు.
తనెప్పుడూ చూడలేదు ఈ డాన్సులు. శైలజ కూడా భర్త శ్రీనివాస్ తో కలిసి చూడాలి అనుకుంది.అదే విషయం చెబితే సాధారణంగా ఆడవాళ్ళు ఉండరు ఇక్కడ అన్నాడతను.
ఈ రికార్డింగ్ డాన్సుల పేరుతో ఏం జరిగేదీ శైలజ కూడా కొద్దిగా వింది. ఇంటికి వెళుతున్నట్లే వెళ్లి అక్కడ ఉన్న గుడారం వెనక కూర్చుంది.
ఆడా మగా డాన్సు చేస్తూ, ఒకరిని మరొకరు కవ్విస్తూ చేసే ప్రదర్శనకు జనం మైమరచిపోతున్నారు. డాన్సు వేసే వారి మధ్య పోటీ హెచ్చింది. ఒకామె పైటని లాగారు. ఆమె సిగ్గు పడలేదు. ఆటవిడుపు వస్తువుగా ఆడదాని శరీరాన్ని మార్చిన విలువైన సంస్కృతిని చూసి ఒక ఆదిమ జాతి స్త్రీ పేలవంగా నవ్వినట్లు అనిపించింది.
మరొక స్త్రీ ఒంటి మీద జాకెట్ కూడా విప్పమని జనాల్లో యువత గట్టిగా అరుస్తోంది. యువత. వివేకానందుని పుట్టిన రోజుని యువ దినోత్సవంగా జరుపుకునే ఈ దేశంలోని యువత.
ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే. ఆ.. ఇందాక పసి పిల్లకు పాలిస్తూ కనిపించింది. ఇప్పుడు ఇలా.. లేని మత్తును చూపిస్తూ డాన్స్ చేస్తోంది. ఆకలి ఘోరమైన మహమ్మారి కదూ..
ఆమె జాకెట్ విప్పేంతవరకూ వదల్లేదు. జనాల్లోంచి ఎర్రని లేజర్ లైట్ కిరణాలు ఆ స్త్రీ వక్షోజాల మీద పడ్డాయి.
ఇందాక పిల్లకు పాలిచ్చి వచ్చింది కదా ఆ స్త్రీ చన్నుల దగ్గర పాల చుక్క కనిపించింది శైలజకు . మైకంలో తూలినట్లు జనం ఆడుతున్నారు. అరుస్తున్నారు. కాటికి కాళ్లు చాపుకుని కూర్చున్న మామగారు, వీలు చిక్కినప్పుడల్లా ఆధునిక మహిళా శక్తి గురించి మాటలు చెప్పే మా శ్రీవారు, ఇంకెంత మందో మగ వాళ్ళు. వారి ముఖాల్లో ఏదో వికృతానందం.
అందరిలోనూ ఆమెకు ఆ కిషోర్ కనిపించాడు. స్త్రీ శరీరాన్ని ఆట వస్తువులా చూడడమే కాదు, ఆమెను కేవలం వాంఛను తీర్చుకునే యంత్రంలా భావించడం.
తనలో తనే శైలజ ఆలోచిస్తోంది.
అందరూ అలానే ఆలోచిస్తారని అనను. కానీ కొద్దో గొప్పో మగ పిల్లలు పెరిగే వాతావరణం, కుటుంబంలో స్త్రీ పాత్ర, సమాజంలో జరిగే అఘాయిత్యాల వంటి వాటి నుంచి ప్రభావితం కారా? . వీటన్నిటి నుంచీ ఆ పసి మనసులకు ఎవరు రక్షణ ఇస్తారు? మగాడంటే ఆడదాన్ని తక్కువగా చూడాలి, అవమానించాలి. ఏదీ కుదరకపోతే తన శరీరాన్ని అనుభవించి అహాన్ని తృప్తి పరచుకోవాలి. అలా అయినా ఆమెను అణగదొక్కాలి..
ఇదేనా మనం నేర్చుకుంది.. నేర్పిస్తుంది..
తరం మారుతున్నా పిల్లలకూ అవే గుణాలను, అభిప్రాయాలను ఇస్తున్నామా? శైలజకు ప్రశ్నలే సమాధానంగా వస్తున్నాయి.
అమ్ము ఇంట్లో పడుకుని ఉంది. నా కూతురు అమ్ము. ఇలాంటి సమాజంలో నెగ్గుకు రావాలంటే తన హృదయాన్ని ఎంత బలమైనదిగా మార్చాలిరా భగవంతుడా అనుకుంది.
ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు తనకి. ఇంటికి వచ్చి నిద్రపోతున్న అమ్ము నుదుటిపై ముద్దు పెట్టింది. ఏమీ పాలుపోక హాల్లో టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానెల్ పెట్టింది.
హైదరాబాద్ లో ఓ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిపిన తోటి విద్యార్థులు.. అని బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.
దేవుడా! వీణకు అలా జరక్కూడదు అంటూ శైలజ కుప్పకూలింది. అంతర్మథనంలో ఆమె గెలుపుకూ ఓటమికీ మధ్య సంధి కాలంలో, బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉంది.
***శుభం ***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం : బాల్యంలో చందమామ కథలు చదువుతూ ఊహాలోకంలో విహరించిన జ్ఞాపకాలు తనలో రచనలు చేయాలనే ఆసక్తిని కలిగిస్తాయని, మొదటి కథ వ్రాసే వరకూ తనకే తెలియదంటారు యువ రచయిత దినకర్ రెడ్డి.
వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన దినకర్ ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా పుస్తకాలు చదవడం,కథలు,కవితలు వ్రాయడంలో నిమగ్నమై ఉండటానికి ఇష్టపడతారు.
జీవితం,బంధాలు,స్నేహం,ప్రేమ,సమాజం,ప్రకృతి ఇవన్నీ నా కథా వస్తువులు అని చెప్పే దినకర్ రచనలు స్టోరీ మిర్రర్, ప్రతిలిపి వంటి ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ లలో అతడికి అభిమానులను సంపాదించి పెట్టాయి.పాఠకుల హృదయాల్ని హత్తుకునే రచనలు చేయాలనే అభిలాష కలిగిన ఈ వర్థమాన రచయిత యొక్క సోషియో ఫాంటసీ నవల "నాగనిధి" అచ్చంగా తెలుగు ప్రచురణలు ద్వారా ప్రచురితమైంది.
ఫేస్బుక్ లో రచయిత పేజీ :
Comments