top of page
Writer's pictureDivakarla Padmavathi

అంతర్మథనం

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #Antharmathanam, #అంతర్మథనం, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు




'Antharmathanam' - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 04/11/2024

'అంతర్మథనం' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సాయంకాలం. 


సోఫాలో కూర్చొని టివిలో వస్తున్న సినిమా చూస్తున్న అరవింద్ మనసు అందులో లగ్నం కావడంలేదు. ఎదురింట్లో ఉన్న జంట మీదే అతని మనస్సంతా కేంద్రీకృతమై ఉంది. తెరిచిన కిటికీలోంచి వాళ్ళిద్దరూ అరవింద్ కి స్పష్టంగా కనిపిస్తున్నారు. ఎదురింట్లో ఉన్న మానస, మనోహర్ ల వివాహం జరిగి ఒక సంవత్సరం కూడా కాలేదు. చూడ ముచ్చటైన జంట వారిది. ఆమె నవ్వు మనోహరంగా, మైమరపించేదిగా ఉంది. 


మనసును దోచే అందం మానసది. ఆమె నవ్వుతూ భర్తతో ఏదో చెప్తోంది. అతను చిలిపిగా నవ్వుతూ సుతారంగా ఆమె చెక్కిలి మీటాడు. మనోహర్ కూడా ఆమెకి తగ్గ అందగాడే! ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె కూడా ఉద్యోగస్తురాలే. ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ ఉంది. ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్తారిద్దరూ. 


'మేడ్ ఫర్ ఈచ్ అదర్' కి ఉదాహరణ ఆ జంట! అతనితో ముందునుండి పరిచయం ఉంది అరవింద్ కి. వాళ్ళ పెళ్ళైన తర్వాత చాలా సార్లు వాళ్ళింటికి వెళ్ళాడు కూడా. వాళ్ళ అన్యోనత చూసిన అరవింద్ కి తను పెళ్ళి చేసుకుంటే తన భార్య కూడా అంత గాఢంగా ప్రేమించగలదా అనిపించింది. ఒకవేళ ఆమె ప్రేమించగలిగినా, తను కూడా అంత ప్రేమను అందించగలడా ఆనుకొనేవాడు.


పెళ్ళికి ముందు శని, ఆదివారాలు తనతో కబుర్లు చెప్తూ, టివి చూస్తూ గడిపిన మనోహర్ కి ఇప్పుడు భార్య తోటిదే లోకం. తనెప్పుడు పిలిచినా, "మరో సారి వస్తాను, ఈ రోజు మాకు సినిమా ప్రోగ్రాం ఉంది!" అనేవాడు. "ఇంతకు మునుపైతే ఒంటరివాణ్ణి, ఇప్పుడు మానస మనిషిని నేను." నవ్వేసి చెప్పేవాడు. సెలవులు వస్తే, ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేవారు.


అరవింద్ కి ఇంకా పెళ్ళి కాలేదు. ఇంట్లో పెళ్ళి చేసుకోమని పోరేవారెవరూ లేరు. అతని ఉద్యోగం వచ్చిన కొత్తలోనే తల్లితండ్రులిద్దరూ పోయారు. అతని బాగోగులు ఎవరైనా చూసుకొనేవారంటే, ఒక్క మేనమామ మాత్రమే. అతను తప్పించి దగ్గర బంధువులెవరూ లేరు. అప్పుడప్పుడు అరవింద్ కి ఫోన్ చేస్తూ తమ క్షేమ సమాచారాలు తెలుపుతూ, అతని గురించి అడుగుతూ ఉంటాడు. మేనమామకి కూతురు ఉన్నా, ఆమె అరవింద్ కన్నా పెద్దది కావడం వల్ల ఎప్పుడో పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది. అతనే అరవింద్ కి ఫోన్ చేసి పెళ్ళి సంబంధాల గురించి చెప్తూ ఉంటాడు. అతను తెచ్చిన సంబంధాలు ఏవీ అరవింద్ కి నచ్చలేదు. చేసుకుంటే మానసలాంటి అమ్మాయినే చేసుకోవాలి, వాళ్ళ జంటలాగే ఉండాలి. వీలైతే ప్రేమించి పెళ్ళి చేసుకొని, ప్రేమలోని మజాని ఆస్వాదించాలి.


అరవింద్ చూపులు వాళ్ళింటి వైపే ఉన్నాయి. ఆ రోజు ఆదివారం కావడంవల్ల ఏమీ తోచడంలేదు. మాములు రోజుల్లో అయితే, అఫీసు నుండి వచ్చి స్వయంపాకం చేసుకొని, టివి చూస్తూ భోజనం చేసేసరికే సమయం అయిపోతుంది. కేవలం వారాంతం-శని, ఆదివారాలు మాత్రం నిస్సారంగా గడుస్తున్నాయి. సినిమాకైనా, షికారు కైనా ఎంత సేపు వెళ్ళి వస్తాడు? తనకి కూడా అందమైన, మనసారా ప్రేమించే భార్య లభిస్తే ఎంత బాగుణ్ణు అని తలపోసాడు.


అరగంట తర్వాత, ఎదురింటి తలుపులు తెరుచుకున్నాయి. మానస, మనోహర్ ఇద్దరూ చేతిలో చెయ్యి వేసుకొని నవ్వుతూ బయటకు వచ్చారు. బహుశా సినిమాకి వెళ్ళడానికై ఉంటుంది. మనోహర్ అదృష్టానికి ఒకంత ఈర్ష కలిగింది అరవింద్ కి. తనకీ మానసలాంటి సౌందర్యవతి, అనుకూలవతి భార్య లభించాలని అనుకున్నాడు. 


తన ఆఫీసులో పనిచేస్తున్న పెళ్ళికాని అమ్మాయిలు గుర్తుకు వచ్చారు. నీరజ, ప్రమీల ఇద్దరికీ పెళ్ళి కాలేదు. కానీ వాళ్ళిద్దరూ కూడా తనంటే ఆసక్తి చూపలేదు. తన ఆఫీసులోనే ఉన్న ఉద్యోగస్తులతో ప్రేమలో పడ్డారు. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారు. సహజంగానే బిడియస్థుడైన అరవింద్ కాలేజీలో చదివేటప్పుడు కానీ, ఉద్యోగం చేసేటప్పుడు కానీ, ఎవరితో పెద్దగా పరిచయాలు పెంచుకోలేదు. ఎవరి ప్రేమనూ పొందలేదు. ఇప్పుడు మానస, మనోహర్ జంటను చూసిన తర్వాత, తనూ ప్రేమించబడాలన్న కోరిక అతని మనసులో బలంగా నాటుకుంది. మెట్రిమొనీ సైట్లలో నమోదు చేసుకున్నా, తగిన సంబంధం కుదరలేదు ఇంతవరకూ. 


అలా సాయంకాలం బయటకు వెళ్ళిన మానస, మనోహర్ రాత్రి పది దాటిన తర్వాత నవ్వుతూ, తుళ్ళుతూ ఇంటికి చేరుకున్నారు. ఆ రాత్రంతా వాళ్ళ గురించే ఆలోచిస్తూ అరవింద్ నిద్రకి దూరమయ్యాడు. 

 *****

విధి చేతిలో మనిషి కీలుబొమ్మ. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. సరిగ్గా మూడు నెలల తర్వాత, ఎవరూ ఊహించని విధంగా ఓ ఘోరం జరిగిపోయింది. జరిగిన ఆ హఠాత్ పరిణామానికి అరవింద్ మాన్పడిపోయాడు. తన లాంటి ఎంతమంది కళ్ళు ఆ జంటమీద పడ్డాయో, ఎంతమంది మానస మనోహర్ల దాపత్య జీవితం మీద అసూయపడ్డారో గానీ, ఓ రోజు రాత్రి మనోహర్ కి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఇరుగుపొరుగు సహాయంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసి, చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. హాస్పిటల్ నుండి వచ్చిన మనోహర్ మృతదేహం చూసిన మానస గుండెలవిసేలా ఏడ్చింది. 


ఆ సన్నివేశం చూసిన వాళ్ళెవరికైనా కన్నీళ్ళు రాక మానదు. ఆ సంఘటన తెలిసిన అరవింద్ కూడా అక్కడికి చేరుకున్నాడు. శోకదేవతైన మానసను ఊరడించడం ఎవరివల్లా కాలేదు. అప్పటివరకూ మనోహర్ అదృష్టానికి ఈర్ష్య చెందిన అరవింద్ కి ఆమె మీద అంతులేని జాలి కలిగింది. ప్రాణానికి ప్రాణమైన భర్త పోయిన తర్వాత మానస ఎలా బతుకుతుంది? ఇంకా నిండు యవ్వనంలోనే ఉన్న ఆమె బ్రతుకు మోడు వారినట్లేనా?


మూర్తీభవించిన శోకదేవతలా ఉన్న మానసను చూస్తూంటే అరవింద్ కి గుండె తరుక్కుపోయింది. వాళ్ళది ప్రేమ వివాహం కావటం వలన ఇరువైపుల తల్లితండ్రులు వచ్చినా, ఒకర్నొకరు దూషించుకోవడానికే ప్రాధన్యతనిచ్చారు. తప్పు మీదంటే, మీదని ఒకరిమీదొకరు విరుచుకుపడ్డారు. మానసని పట్టించుకోలెదెవరూ. తల్లితండ్రుల వెంట వెళ్ళిపోయిన ఆమె పదిహేను రోజుల తర్వాత తిరిగి వచ్చింది. 


అయితే, ఆమె మొహంలో ఇంతకు ముందున్న కళాకాంతులు లేవు. మంగళ సూత్రం లేని ఆమె మెడ బోసిపోయింది. కళ్ళు కాంతి విహీనమయ్యాయి. మొహంలో విచారం గూడు కట్టుకొని ఉంది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఎంత తేడా! నిజమే మరి! ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తోడు లేకపోతే జీవితమంతా ఎంత నిస్సారంగా మారుతుందో ఎవరికి మాత్రం తెలియదు? మానసను చూస్తే డిప్రెషన్ లోకి వెళ్ళి, ఆత్మహత్య చేసుకోదు కదా అనిపించేదొక్కోసారి. 


తనకు తెలియకుండానే మానస దినచర్య గమనిస్తున్నాడు అరవింద్. రెండు మూడు సార్లు పలకరిద్దామని ప్రయత్నించాడు అరవింద్. కానీ ఆమె నిర్లిప్తత చూసి ఏమీ మాట్లాడలేకపోయాడు. యాంత్రికంగా ఆఫీసుకు వెళ్ళివస్తోందామె.


అలా రోజులు గడిచిపోతున్నాయి. రోజూ మానసను పరిశీలించడమే అరవింద్ దినచర్య అయింది. ఓ రోజు ఆరవింద్ లో ఓ కొత్త ఆలోచన మెదిలింది. తనెందుకు మానసను వివాహమాడకూడదు? తనామెకు కొత్త జీవితం ప్రసాదించవచ్చు. ఆమె మొహంలో ఇదివరకటిలా నవ్వులు పూయించవచ్చు. అయితే, ఆ విషయం ఆమెతో ఎలా ప్రస్తావించడం? ఆమె దృష్టిలో తనెంతో బుద్ధిమంతుడు. మనసులోనే మానసను ఆరాధిస్తూ, ఆమెనే గమనిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అరవింద్. 


తను ఇప్పుడు పెళ్ళి ప్రవస్తావన తీసుకు వస్తే, ఆమె తనని ఏవగించుకోవచ్చు. ముందునుండి తన కళ్ళు ఆమె మీదే ఉన్నాయని భావించినా భావించవచ్చు. ఆ ఊహ తను భరించలేడు. పెళ్ళిచేసుకుంటే, తను కూడా ఆమెకి మనోహర్ లాగే ప్రేమ అందించగలడు. ఆమెని అందలమెక్కించగలడు. అయితే, ఆమెకి తన విషయం తెలపడమెలా- ఇలా ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నాడు అరవింద్. 


ఇలా ఓ సంవత్సరం గడిచింది కానీ అరవింద్ ధైర్యం చేసి చెప్పడానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఈ సంవత్సరంలో అనేక మార్పులు జరిగాయి. ఆరవింద్ కి ఆఫీసులో పదోన్నతి లభించింది. మానస కూడా ఈ సంవత్సర కాలంలో భర్త పోయిన విషాదం నుండి క్రమంగా కోలుకుంది. ఎంతటి విషాదాన్నైనా మరిపించే శక్తి కేవలం కాలానికి ఉంది. కాలం ఆమెలో మార్పు తెచ్చింది. ఆమె మొహంలోకి మునపటి కళ తిరిగి వచ్చింది. ఇంతకు పూర్వంలా కాక, బొట్టు ధరిస్తోంది, మెళ్ళో మంగళ సూత్రం లేదు కానీ, మిగతా ఆభరాణాలు మెరుస్తున్నాయి. సరదాగా, చలాకీగా ఉంటోంది. పెదవులపై నవ్వు విరుస్తోంది. 


అందరితో నవ్వుతూ మాట్లాడుతోంది. ఆమెని ఈ విధంగా చూసి అరవింద్ కూడా చాలా సంతోషించాడు. ఇక ఆమెతో తన విషయం ప్రస్తావించడానికి సమయం ఆసన్నమైందని భావించాడు. శని, ఆదివారాల్లో ఆమె ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడితే బాగుండునని ఎదురు చూస్తున్నాడు. 


శనివారం ఉదయమే లేచి, కిటీకీలోంచి ఎదురింటివైపు దృష్టి సారించిన అరవింద్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. సోఫాలో మానస ఎదురుగా కూర్చొని ఉన్నాడో యువకుడు. ఆమె అతనితో నవ్వుతూ మాట్లాడుతోంది. అతన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు అరవింద్. బహుశా, అతను మానస ఆఫీసు సహోద్యోగి అయ్యుండవచ్చు, ఆఫీసు పని మీద ఏదో చర్చించుకుంటున్నారేమో అని సమాధానపడ్డాడు అరవింద్. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అరవింద్ కి వినపడటం లేదు. దాదాపు ఓ గంటసేపు గడిపిన తర్వాత, ఆ యువకుడు బయటకు వచ్చాడు. అతన్ని నవ్వుతూ సాగనంపింది మానస. 

మళ్ళీ సాయంకాలం కూడా వచ్చాడా యువకుడు. అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది. ఆ తర్వాత, చాలా సార్లు ఆ యువకుడు ఆమె ఇంటికి వచ్చి, వెళ్ళడం ఇద్దరూ కలిసి గంటలుగంటలు కబుర్లతో గడపడం అరవింద్ కళ్ళపడుతూనే ఉన్నాయి.


వాళ్ళ స్నేహం ఆఫీస్ స్నేహం కాదని, వాళ్ళ కబుర్లు ఆఫీసుకు సంబంధించినవి కాదని సులభంగానే అర్ధం అయింది అరవింద్ కి. ఇప్పుడు ఆమె నవ్వు మనోహరంగా తోచలేదు అతనికి. సరిగ్గా సంవత్సరం క్రితం భర్త మనోహర్ మీద ఎంత ప్రేమ ఒలకబోసింది! ఇప్పుడా ప్రేమ ఏమైంది? ఓ ఏడాదిలోనే మనోహర్ని ఎలా మర్చిపోగలిగిందామె? అంత చంచలమైన మనసా ఆమెది? మరో వ్యక్తితో నవ్వుతూ, తుళ్ళుతూ ఎలా మాట్లాడగలుగుతోంది? అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధమేమిటి? ఈమె గురించా తను అంత ఉన్నతంగా భావించింది? ఇంకా నయం, తన మనసులో మాట ఆమె ముందు ఉంచాడు కాదు. ఆమె తనని తిరస్కరించి ఉంటే తన పరువేమైయ్యేది? ఇప్పటివరకూ ప్రేమరాహిత్యంతోనే బతికిన తను అమె తిరస్కరణ భరించగలిగి ఉండేవాడా?


రెండు రోజుల తర్వాత, ఓ ఆదివారం నాడు మానస తన ఇంటి తలుపులు తట్టేసరికి తడబడుతూ తలుపులు తెరిచాడు. తను ఇంతకుముందు వాళ్ళింట్లో చూసిన యువకుడు ఆమె పక్కన ఉన్నాడు. మనోహర్ అంత అందగాడు కాదు కాని, బాగానే ఉన్నాడతను. అతన్ని మానస పక్కన అలా చూస్తూనే మనసులో భగ్గుమన్నాడు ఆరవింద్. ఇంతకు ముందు మనోహర్ని మానస పక్కన చూసి, ముచ్చట పడేవాడు కానీ, ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరిమీద ద్వేషంతో కూడిన ఈర్ష అరవింద్ మనసులో జనించింది.


మానస మౌనంగా కార్డ్ అందించింది. అది పెళ్ళి శుభలేఖగా గుర్తించాడు అరవింద్. ఆ యువకుడు నవ్వుతూ అరవింద్ తో కరచాలనం చెయ్యడానికి చేయి చాచాడు. అప్రయత్నంగా చేతులు కలిపాడు అరవింద్.


"హాయ్! నా పేరు ప్రకాశ్! నేను, మానస ఒకే ఆఫీసులో పని చేస్తున్నాం. మనోహర్ పోయిన తర్వాత, పాపం మానస ఒంటరిదైపోయింది. ఆమెని నేను ముందే ప్రేమించాను. నా ప్రేమ విషయం ఆమెకి తెలపకముందే, ఆమె మనోహర్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆమె మానసికంగా కృంగిపోతూంటే నేను భరించలేకపోయాను. అందుకే, ఆమె అంగీకారంతో ఆమెకో కొత్త జీవితం ప్రసాదించాలని నిర్ణయం తీసుకున్నాను. వచ్చే ఆదివారమే మా పెళ్ళి! మీరు తప్పక రండి!" అన్నాడు.


మానస కూడా నవ్వుతూ, "మా పెళ్ళికి తప్పక రండి!" అని చెప్పి, ప్రకాశ్ చేతిలో చెయ్యి వేసి అక్కణ్ణుంచి వెనుదిరిగింది.


వాళ్ళిద్దరూ వెళ్ళినవైపే అలా చూస్తూ ఉండిపోయాడు అరవింద్ చాలాసేపు. మనోహర్ స్థానంలో ప్రకాశ్ ని ఊహించలేకపోతున్నాడు అరవింద్. అతని అదృష్టానికి అసూయ కలిగింది. 

అంతలోనే ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు అరవింద్. 


 తనెందుకలా ఆలోచిస్తున్నాడు అసలు? అతనిలో అంతర్మధనం మొదలైంది. ప్రకాశ్ లాగే తను కూడా మానసకు కొత్త జీవితం ప్రసాదించాలని అనుకున్నాడు. మరి అతనిమీద తనకెందుకు ద్వేషం కలిగింది? తను కూడా ప్రకాశ్ లాగే భావించాడు కదా! తను మనసులో అనుకున్నది ప్రకాశ్ చేసి చూపించాడని అతని మీద అసూయ కలుగుతోందా? ఏమీ తేల్చుకోలేకుండా ఉన్నాడు. చివరికి తన మనసులో గూడు కట్టుకున్న ప్రేమరాహిత్యం తననలా ఆలోచింపజేసిందని సరిపెట్టుకున్నాడు. 


మానసలాంటి అమ్మాయి తనకెప్పటికైనా తారసపడకపోదు, తను కూడా ప్రేమలోని మాధుర్యాన్ని చవి చూడకపోడని మనసులో గట్టిగా అనుకున్నాడు. వెంటనే అరవింద్ మనసులో అసూయ దూదిపింజలా ఎగిరిపోయింది. 

వారం రోజుల తర్వాత, అప్రయత్నంగా అరవింద్ దృష్టి ఎదురింటివైపు పడింది. అప్పుడే వీధిలోకెళ్ళి తిరిగి వచ్చినట్లున్నారు ప్రకాశ్, మానసలు. ఇద్దరూ ఇంట్లోకెళ్ళి తలుపేసుకున్నారు. ఇప్పుడు కిటికీకి పరదా వేసి ఉంది. 


 అరవింద్ కూడా తన మనసుకి పరదా వేసి, టివిలో వస్తున్న సినిమా మీద మనసు లగ్నం చేసుకున్నాడు.


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


54 views0 comments

Comments


bottom of page