top of page

అంతర్ముఖం - పార్ట్ 1



'Antharmukham - Part 1/2' - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 27/07/2024

'అంతర్ముఖం - పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సమీర తన మెటర్నటీ లీవ్ మూడు నెలలు అయిపోగానే ఆ రోజే ఆఫీస్ డ్యూటీలో జాయిన్ అయింది. మూడునెలల పిల్లాణ్ణి అత్తగారికి అప్పచెప్పి ఉద్యోగానికి రావడం కాస్త బాధే అనిపించింది.. తప్పదుకదా, జీతం నష్టం మీద ఎన్నాళ్లని లీవ్ పెట్టగలదు ? ఇంకా తను చాలా అదృష్టవంతురాలు.. మనవడిని ముద్దుగా, ప్రేమగా చూసుకునే అత్తగారు ఉన్నారు.. లేకపోతే 'డే కేర్' అని ఎక్కడో పసివాడిని వదిలి ఉద్యోగానికి రావడం ఊహించుకోడానికే కష్టంగా ఉంది.. మాటి మాటిగా తన చిట్టి నాన్న ' గౌతమ్' గుర్తొస్తుంటే మనసు బాధగా మూలిగింది. 

 

సమీర రెండు సంవత్సరాల క్రితం ఆ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో లో జాయిన్ అయి ఆఫీస్ అసిస్టెంట్ గా, మార్కెటింగ్ డిపార్ట్ మెంట్లో పనిచేస్తోంది. 

 

ఆ సంస్థ దేశంలోనే అత్యంత పేరుపొందిన ప్రతిష్టాత్మకమైన సంస్థ. నాణ్యమైన ఎలక్రానిక్స్ పరికరాలను, యంత్రాలను, ఆధునిక సాంకేతిక పరిజ్నాంతో తయారుచేసి, డిఫెన్స్, రైల్వే, పవర్ ప్లేంట్స్, ఆయిల్ కంపెనీలకు, ఏయిర్ పోర్ట్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు సరఫరా చేస్తుంది.. వేల కోట్ల టర్నోవర్ చేసే సంస్థ.. 


ఉద్యోగంలో చేరిన ఆరునెలలకు సమీర వివాహ జరగడం, తరువాత ఆరునెలల్లో ప్రెగ్నెన్సీ రావడం, తరువాత డెలివరీ, మెటర్నటీ లీవ్ ఆ తరువాత ఇదిగో ఇలా ఆఫీస్ కు రావడంతో ఏదో కొత్తగా అనిపిస్తోంది వాతావరణం.. 

 

పేరుకి తన సర్వీస్ రెండు సంవత్సరాలు పూర్తి చేసినా తను పని విషయంలో ఏ మాత్రం అనుభవం సంపాదించలేదు ఇంతవరకూ. కొత్తలో చేరినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అదేవిధంగా ఉంది! కాని శెలవు తరువాత ఆఫీస్ లో జాయిన్ అయ్యేసరికి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి డిపార్ట్ మెంట్ లో! అదివరకు తను ఏ మేనేజర్ దగ్గర పనిచేసిందో, ఆ మేనేజర్ మూర్తిగారిని మరో డివిజన్ కు బదిలీచేసారు.. 

సమీర తన సీటులో కూర్చోగానే ఆమె కొలీగ్స్ కొంతమంది చుట్టముట్టారు.. 


వస్తూనే.. హాయ్ సమీరా, కంగ్రాట్స్! ఏమి అదృష్టమే బాబూ నీది, ఒక యంగ్ అండ్ డైనమిక్ బాస్ దగ్గర పడ్డావు నీవు! అతనిపేరు దీపక్ అగర్వాల్! సింపుల్ గా ' దీపక్ ' అని పిలుస్తున్నారు అందరూ! 


“ఓ అవునా, ఆ మాత్రానికే అదృష్టమా” అనేసరికి.. 

“నీకు తెలియదులే సమీరా.. వచ్చిన కొద్దికాలానికే అతను టాప్ అఫీషియల్స్ ను బుట్టలో వేసేసుకున్నాడు తెలుసా ?”


“ఓహ్.. అంత ఎఫిషెంటా ?”

 

“అవును సమీరా! హైలీ క్వాలిఫైడ్ ట, అదివరకు ఏదో కంపెనీలో పనిచేసి ఇక్కడకు వచ్చాడు, అయినా చూస్తావుగా, తినబోతూ రుచెందుకు” అంటూ జోక్ గా మాట్లాడు కునేంతలో, సమీర బాస్ రావడంతో వారు వాళ్ల సీట్లలోకి వెళ్లిపోయారు.. 


సమీర తన బాస్ దగ్గరకు వెళ్లి విష్ చేసి తను ఫలానా అని పరిచయం చేసుకుంది!


ఈరోజే మెటర్నటీ లీవ్ నుండి వచ్చానని, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చానని చెప్పింది!


“ఓ.. ఐసీ.. గుడ్.. ప్లీజ్ టేక్ ది సీట్” అంటూ కుర్చీ చూపిస్తూ కూర్చోమన్నాడు! 


ధాంక్స్ చెపుతూ సమీర కూర్చుంది!

నిజమే, తన ఫ్రండ్స్ ముందే చెప్పినట్లుగా హేండసమ్ అండ్ డైనమిక్ గానే ఉన్నాడు అనుకుంది మనసులో! 


“చూడండి సమీరా, నిజానికి పని బాగా ఉంది.. మీరు లీవ్ నుండి ఎప్పుడొస్తారా అని చూస్తున్నాను! బై ది బై.. మీకు బేబీ నా, బేబీ బాయ్ నా” అడిగాడు.. 


సమీర బేబీ బాయ్ అని, మూడవ నెల అని చెప్పింది.. 


గుడ్.. అంటూ, బేబీ కేర్ గురించి చాలా విషయాలు వివరించాడు.. చంటి పిల్లల విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలో చెబుతూ, పిల్లల పెంపకం మీద తన దగ్గర ఒక మంచి పుస్తకం ఉందని, చదవి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని తెచ్చి ఇస్తానని చెప్పాడు.

బాస్ తనతో అంత ఫ్రీగా మాటలాడేసరికి సంతోషం కలిగింది సమీరకు! ధాంక్యూ సర్ అని చెప్పింది.. 


తనకి కూడా ఇద్దరు పిల్లలని ఆయన భార్య ఎమ్. ఎస్సి (కెమిస్ట్రీ ) చదివిందని, హౌస్ వైఫ్ గా పిల్లలతో బిజీ గా ఉంటుందని.. ఇలా చాలా విషయాలు ఇంగ్లీష్ లో చాలా ఫ్రీగా మాట్లాడాడు.. 


సమీరకు బాస్ అలా మాట్లాడుతుంటే చాలా కంఫర్ట్ అనిపించింది!


ఆరోజు నుండే వర్క్ ఎసైన్ చేసాడు. మార్కెటింగ్ డిపార్ట్ మెంట్ కాబట్టి కస్టమర్స్ తో చాలా పని ఉంటుంది. టెండర్స్ చదివి కస్టమర్స్ కు కొటేషన్స్ తయారు చేయడం, ప్రాడక్ట్ వివరాలు పంపడం, వారితో కమ్యూనికేషన్ సంబంధాలు పెట్టుకుంటూ విలువైన ఆర్డర్స్ సంపాదించడం, వారివద్దనుండి బకాయిలను వసూళ్లుచేయడం, ఇలా చెప్పుకుపోతూనే మధ్యలో ఫాలో అవుతున్నారా, అనుమానాలుంటే అడగమని, ఫీల్ ఫ్రీ.. అంటూ చాలా మృదువుగా మాట్లాడాడు. 


సమీర కు అంతా కొత్తగా అనిపించింది అయినా ధైర్యం తెచ్చుకుని, ఒకటికి రెండుసార్లు అనుమానం వచ్చినప్పుడల్లా ఆయన్నే అడుగుతూ మొత్తానికి కొన్ని రోజులలో రొటీన్ లో పడిపోయింది!

దీపక్ పని విషయంలో చాలా ఎఫిషెంట్, నిజాయితీ పరుడు. తన సబ్ ఆర్ట్ నేట్స్ ను ఎప్పుడూ పనితో బిజీగా ఉంచుతాడు. పొరపాట్లు చేస్తుంటే నెమ్మదిగా సరిదిద్దుతాడు.. 

మంచి యూనివర్సిటీ లో ఇంజనీరింగ్, ఎమ్ బి ఏ చేసిన దీపక్ అగర్వాల్ మంచి వాక్చాతుర్యం గల మనిషి.. తిమ్మిని బొమ్మిచేయగల మహా మేధావి. మార్కెటింగ్ డిపార్ట్ మెంట్ కు అటువంటి వ్యక్తే కావాలి వ్యాపారాన్ని అభివృధ్ది చేయడానికి. 


వస్తూనే అతికొద్దికాలంలోనే కంపెనీకు మంచి ఫలితాలను చూపెడుతూ ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోగలిగాడు.. 

అతని కింద పనిచేసే ఉద్యోగులను ఎఫిషెంట్ గా తయారు చేయడానికి చాలా కష్టపడేవాడు.. వారిలో సమీర కూడా ఉంది.. 


అతని ఇంగ్లీష్ ఉఛ్చారణ, డ్రాఫ్టింగ్ అద్భుతం.. తెలుగు అసలు రాదు.. సమీర ఎంత ఎఫిషెంట్ గా తయారయిందంటే, బాస్ ఒక్క మాట చెబితే చాలు చక్కగా అల్లుకుపోతూ, ఇండిపెండెంట్ గా పని చేయగలిగే స్తాయి కి చేరుకుంది.. 


చక్కని ఇంగ్లీష్ లో కస్టమర్స్ కు స్వతంత్రంగా లెటర్స్ వ్రాయగలిగే స్టేజ్ కు ఎదిగింది.. 


పని బాగా చేస్తే, ఎక్స్ లెంట్, గుడ్, కీప్ ఇట్ అప్ లాంటి పొగడ్తలే కాకుండా, మంచి మంచి ఇంగ్లీష్ పుస్తకాలు కొని చదవమని గిఫ్ట్ గా ఇస్తూ.. వారి నాలడ్జ్ ను అప్ డేట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉండేవాడు. అతనిదగ్గర పనిచేయడం ఒక గొప్ప ఛాలెంజ్ గా భావించేవారందరూ! 


కొన్ని సంస్థలలో అయితే బాస్ లు తమ సబ్ ఆర్డ్ నేట్స్ చేత పనులన్నీ చేయించుకుని, అది అంతా తమ ప్రతిభే అన్నట్లుగా చెప్పుకుంటూ నిజానికి అసలు కష్టపడి పనిచేసిన వారిని పైకి రానీయకుండా తొక్కి పెట్టేస్తారు.. కార్పొరేట్ సంస్థలలో అదొక రాజకీయం! 


కాని దీపక్ అటువంటి వ్యక్తికాదు.. తన సబ్ ఆర్డ్ నేట్స్ పనితీరుని ఉన్నతాధికారులవద్ద ప్రస్తావిస్తూ, పని విషయంలో ఒక్కొక్కరి ప్రతిభను వివరిస్తూ ఉండేవాడు. అలాగే దీపక్ సమీర ప్రతిభను గురించి జీ.. ఎమ్.. మార్కెటింగ్ దగ్గర ప్రస్తావించాడు.. 


దీపక్ తరచుగా కంపెనీ పని మీద టూర్స్ వెడ్తూ ఉంటాడు. 

దీపక్ అఫీషియల్ టూర్స్ లో ఉన్నప్పుడు జి.. ఎమ్.. మార్కెటింగ్ సమీరను నేరుగా పిలచి ఆయనకు కావలసిన పని చేయించుకునేవాడు.. ఆ విధంగా సమీర వర్క్ బాగా చేస్తుందనే పేరు కూడా సంపాదించింది!


ఒకరోజు ఆఫీస్ కు వచ్చీ రాగానే సమీరను దీపక్ పిలిచాడు.. 

వెళ్లి గుడ్ మార్నింగ్ సర్ అని విష్ చేసింది!


“హా.. సమీరా, ఏమిటీ అలా డల్ గా మీ కళ్లు వాచిపోయి ఏడ్చినట్లుగా ఉన్నాయి, ఏమి జరిగింది, మీ వారు ఏమైనా భాధ కలిగేటట్లు బిహేవ్ చేసారా” అంటు ప్రశ్నించాడు!

‘నో.. సర్’ అంటూ సమీర ఒక్క క్షణం అయోమయంలోకి వెళ్లిపోయింది అతని మాటలకు.. 


అతను అలా మాటలాడతాడని ఊహించని విషయం కాబట్టి సమీర తడబడిపోయింది. 


“ఇట్స్ ఓకే.. కాని మీ స్వవిషయాలను కూడా నాతో పంచుకోవచ్చు.. యూ కెన్ ఫీల్ ఫ్రీ విత్ మీ..” అంటూ ఏదో అర్జంట్ గా చేయాల్సిన పని ఇచ్చి పంపించివేసాడు.. 


సమీర వెంటనే రెస్ట్ రూమ్ కి వెళ్లి చూసుకుంది, ఏడ్చినట్లు ఉందా తన మొహం అనుకుంటూ.. రాత్రి బాబు సరిగా నిద్ర పోకపోతే వాడికోసం తను కూడా జాగరణ చేయవలసి వచ్చింది.. కాస్తంత బడలిక తప్పించితే మరేమీ తనకు కనపడలేదు.. ఎందుకలా అన్నాడో అనుకుంటూ పనిలో పడింది.. 


ఇలా ఒకటి రెండుసార్లు, ‘ఏమిటీ డల్ గా ఉన్నారు, ఏడ్చినట్లుగా, మీ వారు మిమ్మలని బాగా చూసుకుంటారా’ లాంటి ప్రశ్నలు వేయడం కూడా జరిగింది. 


సమీరకు అతను అడిగే పధ్దతి నచ్చడం లేదు! ఏమిటీ బాస్ మాటలు వింతగా ఉన్నాయనుకుంది! 


అతను తనతో క్లోజ్ గా ఉండడానికి చేస్తున్న ప్రయత్నం అతని మాటల్లో చేతల్లో ప్రస్ఫుటమౌతోంది. ఒక్కోసారి ఫైల్ తన చేతికి అందిస్తూ కావాలని తన చేతిని స్పృశిస్తున్నాడు.. 

మొదట్లో ఏదో పొరపాటున జరిగి ఉండొచ్చనుకుంది.. కాని కావాలని చేస్తున్నట్లుగా అనిపించసాగింది. 


ఒకరోజు వర్క్ విషయం డిస్కస్ చేస్తూ.. ఉన్నట్టుండి. , మీరు కట్టుకున్న చీర చాలా బాగుందని, ఎక్కడ కొన్నారని అడిగాడు.. 


తన భార్యకు కూడా కొనాలనుకుంటున్నట్లు చెప్పేసరికి తను నిజాయతీగా ఎక్కడ కొనిందీ, వగైరా చెప్పింది! 


“ఈ చీరలో మీరు చాలా బాగున్నారు సమీరా” అంటూ మెచ్చుకోలుగా తన కళ్లల్లోకి చూసాడు! 


ఒక్క క్షణం తెల్లబోయి, ఏమీ మాట్లాడకుండా ఊరుకుండిపోయింది! 


తను కట్టుకున్న చీర వైట్ ఆర్గండీ మీద చిన్న చిన్న పింక్ ఫ్లవర్స్.. చాలా బాగుంటుంది.. తమ వెడ్డింగ్ యానివర్సరీ కి తన భర్త శ్రీకాంత్ ఎంతో ముచ్చట పడి కొన్నది! 


నిజానికి సమీర చాలా సింపుల్ గా ఉన్నా ఆకర్షణీయమైన రూపం. సన్నగా, తెల్లగా పొడుగ్గా, పొడవైన జడ, చుబుకం మీద చిన్న పెసరబద్దంత పుట్టుమచ్చ.. నవ్వుతున్నప్పుడు సొట్టలు పడుతున్న బుగ్గలు. పెళ్లై, ఒక బిడ్డకు తల్లి అంటే ఎవ్వరూ నమ్మరు. 


ఎప్పుడూ చక్కని కాటన్ చీరల్లో నీట్ గా వస్తుంది ఆఫీస్ కు!

ఇలాగే ఒకరోజు " దీపక్ " సమీర ను ఆ చీర రేపు మరొకసారి కట్టుకుని వస్తారా " అన్న అర్ధింపు.. 


తను వినీ విననట్టు నిర్లక్యంగా ఊరుకుంది.. 


ఆ రేపు వేరే చీరలో చూసిన తన తో అతను అన్నాడు, డిస్పాయింట్ అయ్యానని! 


అయితే నాకేమిటీ అనుకుంది మనసులో సమీర! అయినా నీ ఆనందం కోసం నేను ఆ చీర కట్టుకురావాలా అని గింజుకుంది మనసులో.. 


ఒకసారి సమీర కళ్లకు కాటుక పెట్టుకోకపోతే అడిగాడు, మీరు కళ్లకు కాటుక పెట్టుకుంటే చాలా బాగుంటారని! 


ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఎప్పటిలా కంఫర్ట్ గా లేదు తన పరిస్తితి.. పని విషయం లో అతనితో మాట్లాడడానికి వెడ్తే, ఏదో అసందర్భంగా మాటలాడు తున్నాడు.. అదీ తనకు నచ్చని విధంగా! 


సమీరకు తన బాస్ " దీపక్ " అంటే గౌరవం.. తను అతని ప్రోత్సాహంతో ఎంతో పని నేర్చుకుంది.. ఒక ఎఫిషెంట్ వర్కర్ గా పేరు తెచ్చుకుంది.. 


ఒకరోజు ఏవో పేపర్లు అందిస్తూ, డ్రాఫ్ట్ వ్రాయమని చెపుతూ, వాటితోబాటు ఒక స్లిప్ ఇచ్చాడు. 

పనికి సంబంధించినది అనుకుంటూ సీట్ కొచ్చి చూసుకునేసరికి ఆ స్లిప్ మీద " ఐ లవ్ యూ", అని, వచ్చే ఆదివారం సాయంత్రం ఫలానా పార్క్ కి రాగలరా అని వ్రాసి ఉంది.. 


సమీర అది చదివి నిర్ఘాంతపోయింది! వణుకు వచ్చేసింది! 

 తనని ఎవరైనా చూస్తున్నారా అన్న బెదురు.. ఏమిటో చెమటలు పట్టేస్తున్నాయి.. ఆ స్లిప్ ని భయంతో చిన్న చిన్న ముక్కలు చేసి డస్ట్ బిన్ లో పడేసి మామూలుగా అవడానికి ప్రయత్నించింది! 


మరి రెండు రోజుల తరువాత అడిగాడు, నేను ఇచ్చిన స్లిప్ లోని విషయంపై ఏమాలోచించారని! 


తను ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయి, నెమ్మదిగా అంది, “మీరంటే నాకు చాలా గౌరవం సర్! మీరు నాకు ఒక గురువు, మీమీద నాకు అపారమైన సోదరభావం, తప్పితే మరో భావం లేదు.. నేను నా భర్తను మనసారా ప్రేమిస్తాను. అలాగే నా భర్తకు నేనంటే ప్రాణం. నాకు నా సంసారం, నా భర్త, పిల్లల తోనే నా జీవితం అల్లుకుపోయింది. మీరు నన్నుఅలా పిలవగానే వచ్చేస్తుందని అనుకుంటున్నారేమో, నా గురించి మీరు ఎందుకంత చీప్ గా ఊహిస్తున్నారోనన్న ఆశ్చర్యం, బాధ కలుగుతోంది.. క్షమించండి సర్” అంటూ వెనక్కి తన సీట్ కు వచ్చేసింది! 


తను.. తను అలా మాట్లాడుతుందని, మాటలాడగలనని ఎప్పుడూ ఊహించలేదు సమీర!

ఒక రెండురోజుల తరువాత జి. మ్ కేబిన్ నుండి సమీరకు పిలుపువచ్చింది.. అర్జంట్ గా రమ్మనమంటూ! ఎందుకో అనుకుంటూ కంగారుగా వెళ్లింది.. 


అక్కడ సమీర బాస్ దీపక్ కూడా ఉన్నాడు.. సమీర జి.. ఎమ్ కు విష్ చేసింది.. ఆయన కూర్చోమని చెప్పారు.. 


చూడండి సమీరా, ఆ ఓన్.. జీ.. సీ టెండర్ ఫైనలైజేషన్ దశలో ఉంది.. బహుశా మీ బాస్ దీపక్ మీకు చెప్పే ఉంటారు అనగానే.. 


జిమ్ వైపు చూస్తూ యస్ సర్ అని తల ఊపింది సమీర! 


“అయిదువందల కోట్ల కాంట్రాక్ట్.. మన కంపెనీ దక్కించుకోవాలి.. ఆ కాంట్రాక్ట్ నెగోసియేషన్ష్ కు వీలైతే అప్పటికప్పుడు రివైజ్డ్ కొటేషన్ సబిమిట్ చేయడానికి దీపక్ బాంబే వెళ్లవలసి ఉంది, మీ బాస్ తో పాటూ మీరూ వెళ్లాలి! ఈ కాంట్రాక్ట్ లో మీ ఇన్వాల్వ్ మెంట్ చాలా ఉందని, కస్టమర్ సమక్షంలో మినిట్స్ తయారు చేయడానికి, అలాగే రివైజ్డ్ కొటేషన్ తయారుచేయడానికి మీ అవసరం ఉంటుందని, ఫైల్ అంతా ఎమ్.. ఎస్ ఆఫీస్ (ఎక్సె ల్ ) లో సేవ్ చేసారని దీపక్ చెబుతున్నాడు.. సో.. మీరు దీపక్ కు అసిస్ట్ చేయా”లంటూ ఆర్డర్ జారీ చేసాడాయన!


అది నిజమే.. దీపక్ ఆ కాంట్రాక్ట్ ఎలా కోట్ చేయాలో తనతో దగ్గర ఉండి అంతా తయారు చేయించాడు. ప్రైసింగ్ ఫార్మలా తీసుకుని ఎక్స్. ఎల్ లో వర్క్ అవుట్ చేసింది.. కాంట్రాక్ట్ కు సంబంధించిన అనేక నింబంధనలను ఒక్కో క్లాజ్ చదువుతూ పొందుపరిచింది కూడా.. ముఖ్యమైన విషయాలు మటుకు దీపక్ సూచించినా, మిగతావన్నీ తనే చదివి టెండర్ తయారుచేసి దీపక్ కు చూపిస్తే అతను తనని మెచ్చుకున్నాడు.. 


ఇప్పుడు తనుకూడా బాస్ తో బాంబే వెళ్లాలి.. ఎలా ? నిజానికి జీమ్ ఆర్జర్.. కంపెనీకి విలువైన కాంట్రాక్ట్!


వచ్చే సంవత్సరం సమీర ఆఫీసర్ పోస్ట్ కు డ్యూ ఉంది.. ఇటువంటి ఛాలెంజస్ ను తను తీసుకుని చేయకపోతే భవిష్యత్ లో ఒక ఆఫీసర్ గా ఎదగలేదు.. అలా అని ఒక్కర్తీ తన బాస్ తో వెళ్లలేదు.. పని విషయంలో దీపక్ ఎంత నిజాయతీగా ఉన్నా అప్పుడప్పుడు సమీరతో అతని ప్రవర్త న తనను ఆలోచింపచేస్తోంది! 


ఆ మధ్య తన కొలీగ్, బెస్ట్ ఫ్రండ్ అయిన గౌరీ ప్రియ దీపక్ గురించి ఒక కొత్త సమాచారాన్ని తీసుకుని వచ్చింది. దీపక్ ఒక వుమెనైజర్ అని, అదివరకు అతను పనిచేసిన కంపెనీలో ని అతని లేడీ పి. ఏ ని చాలా రకాలుగా మభ్యపెట్టి లోబరుచుకునే ప్రయత్నం చేసాడని, ఆమె అక్కడనుండి బదిలీ చేయించుకుని వెళ్లిపోయిందని!

========================================================================

ఇంకా వుంది..

======================================================================== 

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








42 views0 comments

Comentarios


bottom of page