'Antharmukham - Part 2/2' - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 31/07/2024
'అంతర్ముఖం - పార్ట్ 2/2' పెద్ద కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
మెటర్నటీ లీవ్ పూర్తి చేసుకుని డ్యూటీలో జాయిన్ అవుతుంది సమీర.
కొత్తగా వచ్చిన బాస్ తనతో అతి చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు గ్రహిస్తుంది.
అతన్ని ఎలా అదుపులో పెట్టాలా అని ఆలోచించే సమయంలోనే అతనితో కలిసి ముంబై అఫీషియల్ టూర్ కి వెళ్లాల్సి వస్తుంది.
ఇక అంతర్ముఖం పెద్ద కథ రెండవ భాగం చదవండి.
అనుకున్నట్లుగానే సమీరకు ఫ్లైట్ టిక్కెట్, హొటల్, అకామడేషన్ అవీ ఆన్ లైన్ లో ఏర్పాట్లు జరిగిపోయాయి. దీపక్ సీనియర్ ఎక్జిగ్యూటివ్ కేడర్ లో ఉన్నమూలాన అతనికి ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ ప్లస్ స్టార్ హొటల్ లో స్పెషల్ రూమ్ బుక్ చేసారు..
శనివారం సాయంత్రం బాంబే ఫ్లైట్.. ఓన్.. జీ.. సీ కాంట్రాక్ట్ ఫైల్, తన ఆఫీస్ లేప్ టాప్, ఇంకా అవసరమైన పేపర్లు, జతచేయాల్సిన సర్టిఫికెట్లు వగైరా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంది.. టూర్ అడ్వాన్స్ అదీ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ నుండి డ్రా చేసుకుంది. దీపక్ అన్నాడు.. తను ఇంటినుండి డైరక్ట్ గా ఎయిర్ పోర్ట్ కు వచ్చేస్తానని, అక్కడ కలుద్దామని.. ఏదైనా అవసరమొస్తే ఇంటికి ఫోన్ చేయమన్నాడు..
హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ లో ముంబయి కి వెళ్లే ఫ్లైట్ చెక్ ఇన్ లో దీపక్ సోఫాలో కూర్చుని ఉన్నాడు సమీర కోసం చూస్తూ..
అప్పుడే సమీర చెక్ ఇన్ లోకి వస్తూ దూరంగా కనబడింది.. లైట్ పింక్ కలర్ చూడీదార్ లో ఎవరో కాలేజ్ గర్ల్ లా అనిపించింది. చాలా అందంగా ఉంది ఆ డ్రెస్ లో..
ఆఫీస్ కు చక్కని కాటన్ చీరల్లో సింపిల్ గా హుందాగా వస్తుంది సమీర.. అదేమిటీ.. ఆ పక్కన ఉన్నది ఎవరు?
అతని చేతిలో ఎనిమిది తొమ్మిది నెలలు బాబు.. తెల్లగా బొద్దుగా చూడగానే ఎత్తుకోవాలనిపించేటట్లు ఉన్నాడు..
సమీర, సమీరతోబాటు ఉన్న ఆ వ్యక్తి దీపక్ కూర్చున్న ప్రదేశానికి వచ్చారు.. సమీర దీపక్ ను విష్ చేస్తూ.. “ఈయన నా భర్త శ్రీకాంత్ సర్, ఈ బాబు మా అబ్బాయి గౌతమ్” అంటూ చెప్పింది..
శ్రీకాంత్ దీపక్ కు కరచాలనం చేస్తూ 'హలో సర్’ అంటూ విష్ చేసాడు.. అప్పుడు సమీర నెమ్మదిగా, “మావారు, బాబు కూడా నాతో వస్తున్నారు సర్.. బాబు నాకోసం బెంగపెట్టుకుంటాడు నేను లేకపోతే.. అదీగాక బాబు కి ఫీడింగ్ సమస్య అవుతుంది.. ముఖ్యమైన పని. అదీగాక మన జిఎమ్ గారు చెప్పారని వస్తున్నాను.. లేకపోతే మిమ్మలని రిక్వెస్ట్ చేసేదాన్ని రాలేనని” అనగానే దీపక్ ముఖం ఒక్కక్షణం రంగుమారింది..
కాని అంతలోనే సర్దుకుని నవ్వేస్తూ.. “సారీ ఫర్ ది ట్రబుల్ సమీరా, అరె, మీకు కూడా” అంటూ శ్రీకాంతి వైపు చూస్తూ..
“నో ప్రాబ్లమ్, నేను అంతగా ఆలోచించలేదు. నిజమే సమీరాజీ! టూర్స్ అంటే లేడీస్ కు చాలా సమస్యలు ఉంటాయి.. పాపం కిడ్స్ ను ఎక్కడ వదులుతారు ? పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలికూడా.. యూ డిడ్ గుడ్ జాబ్ సమీరాజీ.. కమాన్, టైమ్ అయినట్లు ఉం”దంటూ ఫ్లైట్ ఎక్కడానికి క్యూ లోకి వచ్చి నిలబడ్డారు!
హమ్మయ్య.. అంతవరకు ఎంతో టెన్షన్ గా ఫీలౌతూ ఉంది సమీర.. తనని బాంబే టూర్ వెళ్లమన్నారని, తప్పనిసరి అని ఇంట్లో శ్రీకాంత్ కి చెప్పినపుడు, వెళ్లిరా ' సమీ' అంటూ ఉత్సాహ పరిచాడు..
కాని తనకు ఒంటరిగా వెళ్లాలనిపించలేదు.. ఔట్ సైడ్ ప్లేస్ లో తనకి ఎన్ని సౌకర్యాలు కంపెనీ ఏర్పాటు చేసినా, తనకి దీపక్ తో వెళ్లడం అంతగా నచ్చలేదు..
అదే విషయాన్ని శ్రీకాంత్ కు చెబితే.. మరి ఎలా సమీరా, తప్పదు కదా అని అనేసరికి, శ్రీకాంత్ ను కూడా తనతో రమ్మనమని అడిగింది..
శ్రీకాంత్ కాదన లేక శెలవు అప్లైచేసి భార్యకు తోడుగా వచ్చాడు.. తను బాబుతో హొటల్ రూమ్ లో ఉండిపోయాడు..
సమీర టాక్సీ బుక్ చేసుకుని బాస్ చెప్పిన సమయానికి ఓ.. ఎన్.. జి.. సి హెడ్ ఆఫీస్ కు చేరుకుంది!
అనుకున్నట్లుగా కాంట్రాక్ట్ నెగోసియేషన్స్ విజయవంతంగా ముగిసాయి.
అక్కడ ఉన్న హైయర్ అఫీషియల్స్ తో దీపక్ మాట్లాడిన తీరు, వారిని కన్విన్స్ చేసిన పధ్దతి అదీ దగ్గరే ఉండి గమనించిన సమీర అతని తెలివితేటలకు విస్మయం చెందింది..
చక్కని అతని ఇంగ్లీషు వాక్చాతుర్యం తో కస్టమర్ ని బుట్టలో పడేసాడు. అయిదు శాతం తగ్గిస్తూనే మరొకచోట తమ కంపెనీకు లాభాన్ని కలుపుకుంటూ అదివరకు సబ్ మిట్ చేసిన ఆఫర్ ను తిరిగి కొన్ని మార్పులు చేసి సబ్ మిట్ చేసారు.. కంపెనీ చాలా సంతోషపడ్తూ, తమ అంగీకారాన్ని తెలుపుతూ, 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' ను దీపక్ కు ప్రజంట్ చేసింది.
దీపక్ చాలా ఎగ్సైజ్ మెంట్ కు లోనైనాడు. హమ్మయ్య కాంట్రాక్ట్ తమ కంపెనీ పరమైందని. సమీర కూడా రిలీఫ్ గా ఫీలయింది..
అందరికీ ధన్యవాదాలు చెబుతూ దీపక్, సమీర కేబిన్ బైటకు వచ్చారు.. దీపక్ ముఖం అంతా ఉత్సాహమే.. బయటకు రాగానే సమీర చేతులు పట్టుకుని కంగ్రాట్స్.. "యు డిడి ఎ స్పెలిండిడ్ జాబ్ సమీరా" అని అభినందించాడు!
"హా.. సమీరా, ఇప్పుడు ఎక్కడికి వెడ్తారు ? ఇంకా చాలా టైమ్ ఉందికదా.. మధ్యలో షాపింగ్ చూసుకుని.. జుహు బీచ్ కు వెళ్దాం రండి. సూర్యాస్తమయం జుహుబీచ్ నుండి చూస్తే చాలా మనోహరంగా ఉంటుంది తెలుసా.. దాన్ని చూడడానికే చాలామంది బీచ్ కు వస్తారుట.. వస్తున్నారు మీరు నాతో" అనగానే సమీర గొంతులో పచ్చి వెలక్కాయపడింది..
ఇటువంటి సందర్భాలు వస్తాయనే తను ఒంటరిగా రాలేక శ్రీకాంత్ ను బాబునీ వెంటబెట్టుకు రావలసి వచ్చింది.. చెప్పాలి తను రాలేనని..
హే భగవాన్, మధ్య మధ్యలో ఇటువంటి పరీక్షలు ఏమిటి తనకు ? వెంటనే స్ఫురించింది, నిజానికి తను అబధ్దం ఆడడం లేదు. ఈరోజు పొద్దుటే గౌతమ్ ఒళ్లు కాస్త వెచ్చగా ఉన్నట్లు తోచింది.. తను బయలుదేరుతుంటే ఒకటే ఏడుపు, చేతులు చాస్తూ, ఎత్తుకొమ్మని. జ్వరం ఎక్కువగా ఉంటే డ్రాప్స్ వేయమని శ్రీకాంతక్ చెప్పి, వాడు చూడకుండా తను ఇలా వచ్చేసింది.
‘ఎలా ఉన్నాడో చంటాడు? శ్రీకాంత్ ఏమి అవస్తపడుతున్నాడో వాడితో’ అనుకుంటూ, ఈ విషయమే బాస్ కు చెప్పాలనుకుంటూ.. "సారీ దీపక్ జీ, ఈ రోజు ఉదయం లేస్తూనే మా బాబుకి జ్వరం. నా భర్త వాడితో ఏమి అవస్తపడుతున్నాడో, ఏమో. వెళ్లిపోవాలి వెంటనే హొటల్ కి” అంటూ సున్నితంగా తిరస్కరించింది..
ఒక్క క్షణం దీపక్ ముఖంలో నిరాశ నీడలు క్రమ్ముకున్నాయి.. "ఇట్స్ ఓకే.. కేరీ ఆన్ సమీరాజీ" అంటూ అతను టాక్సీ బుక్ చేసుకుని వెళ్లిపోయాడు..
సమీర కూడా టాక్సీలో హొటల్ కు వస్తూ అనుకుంది.. దీపక్ నుండి ఇటువంటి సిట్యుయేషన్ ను ఎదుర్కొవాలంటే తనకి చాలా చిరాకుగా ఉంటోంది..
అతనికి తగిన సమయం చూసుకుని మరోసారి తన గురించి చాలా స్పష్టంగా అతనికి తెలియచేయాలని నిర్ణయించుకుంది!
ఓ.. ఎన్.. జీ.. సీ నుండి విలువైన కాంట్రాక్ట్ తమ కంపెనీ కు తెచ్చినందుకు దీపక్ తోబాటు సమీరకు కూడా అభినందనలు లభించాయి.
తన మొదటి టూర్ విజయవంతమైనందుకు సమీరలో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. ఇది తన ఉద్యోగ జీవితంలో లో ఒక మైలురాయి వంటిదని ఆనందపడింది.
ఆ నెలలోనే వచ్చిన రాఖీ పౌర్ణమి నాడు, సమీర తన బాస్ భార్యకు ఒక చక్కని చీర, పిల్లలకు డ్రెస్ లు, స్వీట్ పాకెట్ కొనుక్కుని, వాటితోబాటు ఒక అందమైన రాఖీ ని కూడా తీసుకుని తన భర్తతో కలసి దీపక్ జీ ఇంటికి వెళ్లింది..
దీపక్ జీ వాళ్లింట్లో రాఖీ పండుగ హడావుడి, తమని చూడగానే బాస్ కాస్తంత తెల్లబోయినా సాదరంగా ఇంటిలోపలకి ఆహ్వానించి తన భార్యను పిలిచి పరిచయం చేసాడు..
ఎంతో సింపుల్ గా, హుందాగా ఉన్న అతని భార్య నీతాఅగర్వాల్ ను ఆప్యాయంగా కౌగలించుకుని రాఖీ శుభాకాంక్షలు చెప్పి సమీర తెచ్చిన బహుమతులను ఆమెకు అందించింది..
అలాగే రాఖీని అందమైన అట్ట పెట్టెలోనుండి తీసి సమీర బాస్ చేతికి రాఖీ కడుతూ, " ఐ లవ్యూ బ్రదర్.. హేపీ రక్షాబంధన్ దీపక్ జీ” అంటూ అతనిని విష్ చేసింది!
మరునాడు ఉదయం సమీర, సమీర స్నేహితురాలు గౌరీప్రియ ఆఫీస్ కేంటీన్ లో కాఫీత్రాగాలని వచ్చారు..
కాఫీ తాగుతూ, సమీర “ధాంక్స్ గౌరీ, నీ సలహా బాగా పనిచేసింది.. మా దీపక్ జీ కు రాఖీ కట్టేసి అన్నయ్య ను చేసేసుకున్నాను” అని అనగానే..
గౌరీ నవ్వుతూ.. “అభినందనలు సమీరా.. ఎప్పుడూ అంటూ ఉంటావుగా, అన్నయ్యలు లేరని! చూడు దేవుడు నీ మొర ఆలకించి దీపక్ లాంటి చక్కని అన్నయ్యను నీకు కానుకగా ఇచ్చేసా”డంటూ హాస్యమాడింది.
“అయినా నేను నీకు చెపుతూనే ఉన్నాను యూనియన్ కు కంప్లైంట్ చేయమంటే విన్నావు కాదు” అంటూ నిష్టూరమాడింది!
“పోనీలే గౌరీ, మంచి భవిష్యత్ కలవాడు, ట్రేడ్ యూనియన్ వరకు వెడితే అతనూ నేనూ కూడా అందరి దృష్టిలోకి వెళ్లిపోతాం.. పెద్ద సంచలన వార్త అయిపోతుంది.. బోల్డన్ని చిలవలు పలవులు అల్లేస్తారు. నేను నా కెరియర్ అంతా, ‘ఫలానా సమీర బాస్ అసభ్య ప్రవర్తనకు యూనియన్ ని ఆశ్రయించింది’ అన్న మార్క్ తో.. ఇది అంత అవసరమా అనిపించింది.
ఇద్దరం కూడా పరిణితి చెందిన వ్యక్తులం. సమస్యను సామరస్యంగా చక్కదిద్దుకోవాలి!
మనిషి ఎంత గొప్పవాడైనాగాని, ఒక్క చిన్న బలహీనత అతని వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తునూ పూర్తిగా నాశనం చేస్తుంది.. అందరూ నాలాగే అతని ప్రవర్తనని మౌనంగా భరిస్తూ ఉండలేకపోవచ్చు. ఎంత మంది నాలాంటి వాళ్లు ఇలా బాస్ ల లైంగిక వేధింపులకు బలౌతున్నారో అనిపిస్తుంది..
ఉద్యోగం మానుకోలేని దుస్తితి. నేను ఏదో తెలివిగా తప్పుకున్నాను కాని నా స్థానంలో మరొకరు ఉండి ఉంటే ఏమిచేసేవారో నన్నది ఊహకు అందనిది.
అన్నట్లు గౌరీ, నీకీ విషయం తెలుసా! దీపక్ మాకందరికీ తరచుగా చెప్పే ‘స్వాట్ అనాల్సిస్’.. దాన్నే స్వీయ విశ్లేషణ అంటారు తెలుగులో.. మేనేజ్ మెంట్ పాఠ్యాంశంలో ఇది ఒక ముఖ్య పాఠం ట.. కార్పొరేట్ రంగంలో ప్రతీ సంస్థకు బలాలు, బలహీనతలు కూడా ఉంటాయిట.. కేవలం బలాలకి మాత్రమే ప్రాధాన్యమివ్వకుండా, వారి బలహీనతలను గురించి కూడా చక్కగా ఆలోచిస్తూ, ఏరకమైన చర్యల ద్వారా తమ బలహీనతలను అధిగమించవచ్చునో తెలియచెప్పే ఈ స్వాట్ ఎనాల్సిస్ ను ప్రతీ సంస్థా ఎనలైజ్ చేసుకుంటూ ఆచరణ రూపంలో పెట్టగలిగితే ఆ కార్పొరేట్ సంస్థలు తమ రంగాలలో అనేక విజయాలను సాధిస్తూ ముందుకు పరుగెడ్తాయిట..
కార్పొరేట్ రంగానికే కాకుండా, ఇది ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే స్వీయ విశ్లేషణ అంటూ మా ‘దీపక్ భయ్యా’ తరచుగా చెపుతూ ఉంటాడు మా అందరితో! ఆయన గారికి ఇటువంటి పాఠాలు చెపుతున్నప్పుడు తనలో ఉన్నఈ బలహీనత గుర్తురాదేమో పాపం” అంటూ సమీర అమాయకంగా అంటూంటే ' గౌరీ' ఫక్కున నవ్వేస్తూ.. “వెళ్లి మీ దీపక్ భయ్యాని నిలదీసి అడుగు సమీ ” అంటూ ఆటపట్టించింది!
“పోనీలే, తన తప్పు తెలుసుకోడానికి నేను ఒక అవకాశం ఇచ్చాను.. నా మూలంగా అతను మారితే ఈ సమీర అనబడే చెల్లాయేగా ఎక్కువ ఆనందపడుతుంది” అని అనగానే గౌరి ‘అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను'.. అని రాగం తీసేసరికి, సమీర గౌరి ని చిలిపిగా దెబ్బవేయడానికి చెయ్యి పైకి ఎత్తింది!
రెండు సంవత్సరాల కాలగమనం ప్రశాంతంగా గడచిపోయింది! చూసావా, 'రాఖీ' మహిమ అంటూ గౌరీ సమీరను జోక్ చేసేది! సమీర కు ఆఫీసర్ గా ప్రమోషన్ వచ్చింది.
సమీర పరఫార్మెన్స్ ఎప్రైజల్ దీపక్ చాలా బాగా వ్రాసాడు.. మంచి రేటింగ్ ఇచ్చాడు..
అప్రైజల్ లో రేటింగ్ పూర్ గా ఉన్నా లేక ఏ ఏడ్వర్స్ రిమార్కులున్నా సమీరకు భవిష్యత్ లో ప్రమోషన్ రాదు.. అందుకనే చాలామంది ఉద్యోగం చేస్తున్న స్త్రీలు తమ బాస్ లు లైంగిక వేధింపులతో సతాయిస్తున్నా భరిస్తూనే ఉంటారు. దీన్ని ఒక ఆయుధంగా వాడుకునే బాస్ లు కార్పొరేషన్స్ లో ఉంటారనేది నిజం!
తనని సమీర నిర్లక్యం చేసిందన్న కోపం మనసులో ఏమీ పెట్టకోకుండా, పని విషయంలో సమీర నిజాయితీని, క్రమశిక్షణని చక్కగా హైలేట్ చేసాడు దీపక్! సమీర అతని బలహీనతను ద్వేషించింది కాని వృత్తి పరంగా అతని సంస్కారాన్ని గౌరవించింది!
దీపక్ జీ కి మరో చోట వేరే కంపెనీలో చాలా పెద్ద పోస్ట్ కి ఆఫర్ వచ్చిందని తొందరలో అతను తమ కంపెనీని వదిలేస్తున్నాడని తెలిసేసరికి కంపెనీ యాజమాన్యమే కాకుండా, అతని తో పనిచేసే అతని సబ్ ఆర్డ్ నేట్స్ చాలా బాధపడ్డారు. నిజమే, కంపెనీ ఒక గొప్ప ఉద్యోగిని, ఒక ఎసెట్ ను కోల్పోతోంది! కాని ఇది దీపక్ భవిష్సత్ కు సంబంధించినది! ఎవరూ అడ్డుకోలేనిదీ కూడా!
దీపక్ తన సబ్ ఆర్డ్ నేట్స్ నుండి వీడ్కోలు తీసుకుంటూ సమీర కు ఒక మంచి ఇంగ్లీషు నవల " The Glassblower’s Breath by Sunethra Gupta " ప్రెజెంట్ చేసాడు.. బుక్ తెరిచి చూసిన సమీరకు మొదటి పేజీలో.. " బెస్ట్ విషెస్ టూ మై లవ్లీ సిస్టర్ సమీర " అని అందమైన అతని చేతివ్రాతతో వ్రాసి ఉంది.. సమీరకు ఎందుకో కళ్లు చెమర్చాయి!
తను దీపక్ జీ ని ఒక సొంత అన్నగా అభిమానించింది! సమీర అంటే ఏమిటో, ఆమె ఎటువంటి వ్యక్తో బాస్ కు బాగా అర్ధమైందని ఆనంద పడింది.. ' దీపక్ భయ్యా ' తనకి ఉన్న బలహీనతలన్నింటిని అధిగమించి ఒక మంచి సంస్కారవంతుడైన వ్యక్తిగా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా భావించింది..
========================================================================
సమాప్తం
========================================================================
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments