top of page
Writer's pictureBVD Prasada Rao

ఆంతర్యం - అంతరంగం

ఈ కథ వినడానికి ప్లే బటన్ నొక్కండి.


'Antharyam Antharangam' written by BVD Prasada Rao

రచన : బివిడి ప్రసాదరావు

నేను నిద్ర లేచాను. కల్పన ఇంకా లేవలేదు. ఆశ్యర్యమయ్యింది. నిజానికి నాకంటే ముందు తనే లేచి ఉంటుంది. ఏమైంది! ఈ రోజు ఇంకా లేవకపోవడమేమిటి? కొద్దిగా తిరిగి ఆమె వైపుకు జరిగాను. నా కుడి అర చేతిని ఆమె నుదురు మీద నెమ్మదిగా అద్దాను. ఆమె ఒళ్ళు మామూలుగానే ఉంది. అలిసి పడుకుందా? మంచం దిగాను. టైంకై చూస్తే, గడియారం ఏడున్నర చూపుతుంది. అరె. కల్పన ఇంకా పడుకోవడమేమిటి?! పైగా రాత్రి ఇద్దరం త్వరగానే నిద్రపోయామే. అలాగే మా మధ్య ఏ ఇబ్బందీ చోటు చేసుకోలేదే. మరేమిటి? ఏమైంది! బహుశా తను చేసిన పాయసం నేను రాత్రి డిన్నర్ లో తినలేదు కదా. అందుకు అలిగిందా. కావచ్చు. తను దానికై పట్టు పట్టింది. వాదులాడింది కూడా. దాని వాసనే నాకు ఏదో తేడా అనిపించిందన్నాను. నేను దానిని ససేమిరా తినను అన్నాను. తీవ్రంగా తిరస్కరించాను. అందుకు కల్పన హర్ట్ అయిందా? ఆలోచనలతోటే వాష్రూంకి వెళ్ళి వచ్చాను. హాలులోని సోఫాలో కూర్చున్నాను. కల్పనతో నాకు పెళ్లై నెల కాలేదు. ఇద్దరం కొత్త కాపురంలో ఉన్నాం. ఇద్దరికీ అన్నీ కొత్త కొత్తే. ముచ్చట్లుతో సర్దుకుపోతున్నాం. ఒకర్ని ఒకరం తెలుసుకుంటున్నాం. నాది చిలిపితనం. కల్పనది జోరుతనం. నేను పెద్ద కుటుంబం నుండి వచ్చాను. అమ్మ, నాన్న, తాత, నాన్నమ్మ, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి నా కుటుంబ సభ్యులు. కల్పన చిన్న కుటుంబం నుండి వచ్చింది. ఆమె కుటుంబం - అమ్మ, నాన్న, తనే. అంచేతనే కావచ్చు, ఆమె అల్లారుముద్దుకు లోనై అన్నింటా తనదే చెల్లుబాటు అన్నట్టు అగుపిస్తుంది. నాకు అది ఇబ్బంది పెడుతుంది. కానీ తనకి అన్నీ తెలిసేలా చేయాలని ఉంది. మళ్లీ టైం చూసాను. అమ్మో ఆఫీస్ కు వెళ్లాలి. ఇక త్వరగా తెమలాలి. లేచి గదిలోకి వెళ్ళాను. కల్పనని మెల్లగా తట్టి లేపాను. తను ఒళ్లు విరుచుకుంటూ లేచింది. "గుడ్ మోర్నింగ్" చెప్పాను. కల్పన దాన్ని రిసీవ్ చేసుకోలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది. "నేను ఆఫీసుకెళ్లాలి" చెప్పాను. ఆమె మాట్లాడలేదు. "ఏం నిద్ర లేవడం ఆలస్యమైంది" అడిగాను. "తల నొప్పిగా ఉంది. కాస్తా కాఫీ ఇస్తారా" అడిగింది కల్పన. "నేనా! నాకు అంతగా రాదు" చెప్పాను. ఆమె గుర్రుగా నన్ను చూస్తుంది. "అంతగా రాదా. పోనీ వచ్చినంతగా చేసి తెండి" అంది. నేను తప్పక వంట గదిలోకి నడిచాను. నిజానికి నాకు కాఫీ చేయడం వచ్చు. కానీ ఒక్కసారి కమిటయ్యితే అది కొనసాగుతుందనే భయం. కాఫీ కలిపాను. కానీ చక్కెర తగ్గించాను. పైగా చాలా మేరకు చల్లార్చేసాను. అంతే. నా నుండి కాఫీ కప్పు అందుకొని, దానిని తన ముక్కు దరిన చేర్చుకుంటూనే, "ఛ. ఏమిటీ స్మెల్. ఇదేం కాఫీ" అంది. వెంటనే రుసరుసలాడుతుంది. "తాగితేగా తెలిసేది" అన్నాను. "ఏమిటి. ఏమిటేమిటీ" అంది ఆమె ఒక్కమారున. "అదే. తాగకనే, వాసన చూస్తూనే బాగోలేదనస్తే ఎలా" అన్నాను. "ఏమిటబ్బా. కోపం వచ్చిందా. రోషమా. ఆఁ." అంటుంది కల్పన వెటకారంగా. నాకు నిజంగా చిర్రెత్తుతుంది ఆమె వాటంకి. ఆమెనే చూస్తున్నాను. "ఏమిటా చూపు. కాలుతుంది కదూ." అని, "నాకూ మండింది. రాత్రి నా పాయసాన్ని మీరు తిరస్కరించడం." అంది వ్యంగ్యంగా. నేను డంగయ్యాను. "తినకనే, వాసన చూసేసి, ఇదేం పాయసం అని మీరు హేళన చేసారే. మరి నేను ఎంతగా కాలాను. ఆఁ." అని, "పైగా మా వాళ్ల గారాబం నన్ను ఏమరపరుస్తుందని ఒక స్టేట్మెంట్. చోద్యం కాకపోతే మరిన్నూ" అంది కల్పన గట్టిగానే. నేను తుళ్లి పడ్డాను. "దెప్పిపోడవడం కాదు కానీ, మీరు ఎరగాలనే నేను లేట్ గా లేచాను. కాఫీ కోరాను" చెప్పేసింది కల్పన - తన ఆంతర్యాన్ని. నా అంతరంగం తేలు కాటుకు గురైన దొంగైంది.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.

157 views0 comments

Comments


bottom of page