top of page
Writer's pictureSurekha Puli

అంతర్యుద్ధం

#SurekhaPuli, #సురేఖ పులి, #Antharyuddham, #అంతర్యుద్ధం #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Antharyuddham - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 15/12/2024

అంతర్యుద్ధం - తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



అంజలి వీల్ చైర్లో కూర్చున్న భర్త ముకుందంను వార్డ్ బాయ్ సహాయంతో న్యూరోలాజిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది. 

“నమస్తే డాక్టర్” అంది. 


కూర్చోమని సైగ చేశాడు డాక్టర్. ముకుందం క్రితం మెడికల్ రిపోర్ట్స్ తిరగేసి “మీరు ఏం చేస్తుంటారు?” అని అడిగాడు. 


“నేను గవర్నమెంట్ స్కూల్ రిటైర్డ్ ప్రిన్సిపాల్” జవాబిచ్చింది. 


“మేడమ్, మీ వారికి మతిమరుపు.. అల్జీమర్స్ వ్యాధి; ఒక దీర్ఘకాలిక న్యూరో డిజెనరేటివ్ జబ్బు. జ్ఞాపకశక్తి మందగించడం దీని ముఖ్య లక్షణం” 


అంజలి నెత్తిమీద సుత్తి పెట్టి కొడుతున్నట్టుగా వుంది. అసలే ముకుందం స్థూలకాయుడు, జబ్బు తట్టుకోలేని అల్ప ప్రాణి. 


“జన్యు, పర్యావరణ, జీవనశైలి ఏవైనా కారణాలు కావచ్చు. ప్రస్తుతానికి ఈ మందులు వాడండి. ”


“ఈ జబ్బు తగ్గే మార్గాలు లేవా డాక్టర్?” ఆశగా అడిగింది. 


“ఒక రకంగా లేదని చెప్పవచ్చు. 24 గంటలు ఉపచారాలు చేసే ఆరోగ్యమైన మగ మనిషిని నియమించుకోండి. ” 


అంజలి గుండె బరువెక్కింది. ఎప్పుడూ ఏదో అశాంతి, అసంతృప్తి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మురళి కష్టంగా టెన్త్ పాసై ఇంట్లో నుంచి పారిపోయాడు, బోలెడు డబ్బు ఖర్చు చేసి దేశమంతా గాలించారు. “సైన్యంలో చేరాను, ఇప్పట్లో రాను” అని చాన్నాళ్లకు ఒక ఉత్తరం వచ్చింది. 


ఏదో విధంగా మరచి పోవాలని స్కూల్ ప్రిన్సిపాల్ హోదాలో మనసా-వాచా పిల్లల విద్యా విధానం గూర్చి శ్రమించింది. 

ముకుందం అంజలిని స్నేహితులు, బంధువుల మధ్య ఎక్కువ కలువ నివ్వలేదు. అదే అలవాటు స్థిరపడింది. 


పెళ్ళైన నాటి నుండి ఏ బహుమతి ఇవ్వని భర్త ప్రేమగా పదవీ విరమణ నాటికి డైమండ్ నెక్లెస్ బహుమానం ఇచ్చాడు. నగలు అంటే అంతగా కోరిక లేని భార్య వజ్రాల బహుమానం పెట్టుకుంటుంటే ముకుందానికి ముచ్చటేసి ‘డైమండ్ రాణీ’ అని ముద్దుగా పిలిచేవాడు. ముకుందం తరచూ మురళి గురించి చింతించడం వలన కాబోలు అనారోగ్యం! 


భర్త సేవలు ఒక్కతీ చేయలేక యాదగిరిని కుదుర్చుకుంది. పెరిగిన ఖర్చులకు ప్రైవేట్ కాలేజీ అడ్మిన్ మేనేజర్ పదవి చేతబూని ఉద్యోగంతో పరుగుల జీవితంలో తనను తాను బిజీ చేసుకుంది. 

***

“సారు పనులు చేయగలను, కానీ వేరే పనులు చేయలేనమ్మా?”


“ఎందుకు, ఏమైంది, సార్ నిద్రపోయేటప్పుడు చేయొచ్చు కదా?”


“నాతోని కాదమ్మా, కావాలంటే ఒక రోజు మీరు ఇంట్లో ఉండి చెకింగ్ చేయండి, మీకే తెలుస్తది. ”


“వద్దులే, నీ మీద నమ్మకం వుంది. వేరే ఎవరైనా నీలాంటి వారు కావాలి, ఎందుకంటే.. నువ్వు ఏదైనా కారణం చేత పెద్దసార్ గారిని చూడలేకపోయినా, అడ్జస్ట్ చేసుకోవాలి. ” 


ముకుందం కోసం గదిలో అన్ని ఏర్పాట్లు చేసి ముందు గది, వంటిల్లు తెరిచి పెట్టి; బెడ్ రూమ్ తాళం పెట్టి ఉద్యోగానికి రాను-బోను ఆటో కుదుర్చుకుంది. 

***

“అమ్మా.. నేను రాజు, మీ ఇంట్ల పనిమనిషి కావాలంటే.. ” బక్కపలుచగా ఉన్న అబ్బాయి గేటు అవతలి వైపు నుండి అడిగాడు.


“అవును కావాలి, ఎక్కడుంటావు?”


“పక్క బస్తీల.. ”


ఇంటికి దగ్గరలోనే నివాసం, చూడడానికి శుభ్రంగా వున్నాడు. జీతం నిశ్చయించుకొని, ఇంట్లో చేయాల్సిన పనులన్నీ వివరంగా తెలియ చేసింది. 

రాజు, యాదగిరి ఇద్దరూ పేరుకే పని వాళ్ళయినా ఇంటి మనుషులుగా కలిసి పోయారు. ముఖ్యంగా ముకుందం పనుల్లో ఎక్కడా వేలెత్తి తప్పు చూపే పరిస్థితులు లేవు. 

యుక్త వయసులో ఉండవలసిన తొందర, దుడుకుతనం రాజు యందు మోతాదు కంటే ఎక్కువ. గంట పని, గంటల తరబడి ఫోన్లో ముచ్చట్లు! 


“రాజు.. అంతగా ఏమిటా మాటలు? ఇంతకీ ఎవరా అవతలి వ్యక్తి?” చిరాకు అణచుకొని లాలనగా అడిగింది అంజలి. 


“అమ్మా, నేను లవ్ చేస్తున్న రోజా” సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పేశాడు. 


“ఓహో, అలాగా” అంతకు మించి మాట్లాడలేకపోయింది. 


“మా ఇంట్ల ఇష్టం లేదమ్మా, ఎందుకంటే లవ్ కదా. పెళ్లి చేసుకుంటే మా ఇంటికి కట్టుబట్టలతో వస్తది. అదే వేరే పిల్ల అయితే కట్నం పైసలు, సొమ్ములు తెస్తుండే. ఈ ముచ్చటకే ఇంటికాడ దినాము లొల్లి ఐతుంది. అందుకే ఈడ టైమ్ పాస్ చేసున్న. ” 


ఒక్క వాక్యం ప్రశ్న అడిగితే ఐదు వాక్యాలు జవాబు ఇచ్చాడు! పాపం చెప్పుకోను దిక్కులేక యజమాని ముందు గోడు వెళ్లబెట్టుకున్నాడు. 

***

పెళ్లి రోజు అంజలి భర్తకు ఇష్టమైన పాయసం స్వయానా తన చేతులతో తినిపించింది. ఆరోగ్యం బాగానే వున్న రోజుల్లో పుట్టిన రోజు గాని, పెళ్లి రోజు గాని ఎంతో ఆర్భాట-ఆనందాలతో గడిపే వాళ్ళు. 

అన్ని కాలాలు ఓకే మాదిరి వుండవు. 


అంత అస్వస్థలో కూడా ‘డై.. మం.. రా.. ణి.. ’ అని ఎంతో ప్రయాస పడి పల్కి గిఫ్ట్ పెట్టుకోమని సైగ చేశాడు. ముకుందం కోరిక మేరకు నగ పెట్టుకుంది, ఆయన కళ్ళల్లో మెరుపు చూడగానే అంజలికి హాయిగా తోచింది. 


భగవంతుడా! మనిషికి సుఖాలు-కష్టాలు ఇచ్చావు, వార్ధక్యపు అసహాయతను ఆపాదించావు; సరే, బాగానే వుంది, కానీ ఈ అనారోగ్య దుస్థితి ఎందుకు? వారితో జీవితం పంచుకున్న వాళ్ళ మనసుకు క్షోభ! అనుభవించే వారికి ఇంకెంత? 


అంజలి కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకుంది. మందుల తీవ్రత కాబోలు శరీరం బరువు హెచ్చింది. మనిషికి కావలసిన సహజ అవసరాలు తీర్చడం అందరూ చేయగల పని. కానీ మతిమరుపు (అల్జీమర్స్) వ్యాధి వారి అవసరాల పరిపూర్ణత కోసం చేసే సేవ చాలా కష్టం! 


బంధుమిత్రులు ఫోన్లో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపి భోజనానికి వస్తామని బీరాలు పలికిన వారు ఎవ్వరు రాలేదు. ఆహ్వానితులు రానందుకు మిగిలిన వంటకాలు అన్నీ పని వాళ్ళిద్దరికీ ఇచ్చేసి అలసట మూలంగా రాత్రి పడుకునే వేళ డైమండ్ సెట్ తీసి అల్మారాలో పెట్టె ఓపిక లేక డ్రెస్సింగ్ టేబుల్ పైనే పెట్టి నిద్రపోయింది. 

***

“హలో అమ్మగారు. ”


“హలో యాదగిరి చెప్పు.. నేను బిజీగా వుండి నీ కాల్ చూసుకోలేదు. ”


“అమ్మా మీరు జల్ది ఇంటికి రావాలే, సారు ఏందో కింద-మీద చేస్తుండు” గుక్క తిప్పుకోకుండా అరిచాడు. 


“అవునా, వస్తున్నా.. ” హడావిడిగా డీన్ గారి పర్మిషన్ తీసుకుంది. 


“మేడమ్ గారు టెన్షన్ పడకండి, నా కారులో ఇంటికి వెళ్ళండి. ”


మొహమాటం పడక “సర్ థాంక్స్, ఒకవేళ అవసరం వస్తే ఇంటి నుంచి హాస్పిటల్ వరకు మీ కార్లో డ్రాప్ తీసుకుంటాను, ప్లీజ్.. ”


“మేడమ్ గారు, మీరు అడగాల్సిన అవసరం లేదు. యు కెన్ గో ఎహెడ్!” బాస్ ఆఫీసు పని విషయంలో ఎంత కఠినమో, అత్యవసర పర్సనల్ విషయాల్లో అంతే దయార్థ హృదయుడు! 

***

‘బాగా టెన్షన్ ఫీల్ అయినట్టున్నారు’ అని డాక్టర్ మెడిసిన్ మార్చారు. ‘ఎందుకు టెన్షన్’ అర్థం కాలేదు అంజలికి, భర్తను అడిగితే జవాబు చెప్పే స్థితిలో లేడు. అన్నీ సక్రమంగా ఉంటే అనవసరంగా టెన్షన్ పెట్టుకుంటే ఎవరికి నష్టం! 


“అందరం బాగానే ఉన్నాము ప్లీజ్, టెన్షన్ పెట్టుకుంటే లాభం ఒరిగేది ఏమైనా వుందా?” బుజ్జగిస్తూ భర్తను సమాధాన పరచింది. ఆ రోజంతా భర్త దగ్గర వుండి గమనించింది, అతని ఆందోళన అర్థం కాలేదు. 


ఆఫీసు పనుల ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. జీవితంలో ఇదొక మలుపు అని తలచిందే గాని భర్త వలె ఉద్రిక్తతతో పెంచుకొని డాక్టర్లు, మందులు అని మరో లోకంలో పయనించలేదు. 

***

“రేపు ఆదివారం ఒక రోజు చుట్టి కావాలే అమ్మా. ” 


“ఎందుకు?”


“కొండకు పోతున్న, మా దోస్తులు కూడా వస్తరు” రాజు సిగ్గు పడుతూ మొహమాటంగా చెప్పాడు. 


ఎప్పుడు సెలవు తీసుకోని రాజు ఒక రోజు సెలవు అడిగితే కాదనలేక ‘సరే’ అంది. 

“అమ్మా.. మా నాయిన మిమ్ముల అడిగితే ఏం చెప్తరు?”


“మీ నాన్న నన్ను ఎందుకు అడుగుతారు? ఇంట్లో చెప్పకుండా ఎంజాయ్ చేస్తున్నవా? ఇంతకీ ఏ కొండ?” 


“లేదమ్మా, రోజారానితో యాదగిరి గుట్ట మీద పెండ్లి చేసుకుంటున్న. రోజా ఇంట్ల కూడా ఈ పెండ్లి వద్దన్నరు. నా దోస్తుల తోల్క పోతున్న. ”


అమ్మో! ఎంత తెగింపు అని మనసులో అనుకుంది. 

“మీ నాన్న నన్ను అడగకుండా నువ్వే మేనేజ్ చేయి. ” 


“జీతంల పట్టుకుందువు, ఏమైనా పైసలిస్తావమ్మా? ఒక ఐదు వేలు?”


“అంత డబ్బు లేదు, వేయి వున్నాయి. ”


“సరే, ఇయ్యమ్మ” సంతోషంగా తీసుకున్నాడు

***

రాజు పెళ్లి చేసుకొని భార్యతో వచ్చాడు, ఫరవాలేదు ఈడు-జోడు బాగానే వుందనుకుంది. నూతన వధువుకు పసుపు-కుంకుమ తాంబూలం యిస్తూ ఇంట్లో ఉన్న కొత్త చీర పెట్టింది. వాయనం తీసుకుంటుంటే భుజాల మీదుగా కప్పుకున్న చీర పక్కకు జరిగింది. అంజలి అవాక్కై ఇంకాస్త దగ్గర జరిగి చూసింది. 


అనుమానం లేదు, తన డైమండ్ నెక్లెస్! ఈ అమ్మాయి మెడలో!! అంజలి తొట్రుపాటు రాజు గమనించాడు, “రోజా.. లెగు ఇంటికి పోదాం పా” చప్పున బయలుదేర బోయాడు. 


“యాదగిరి, ఇటు రా” అని గర్జించింది. వెంటనే వీల్ చైర్లో ముకుంద తో పాటు యాదగిరి హాల్లోకి వచ్చాడు. 


రాజు భార్యను చూపిస్తూ “నా డైమండ్ నెక్లెస్ ఈ అమ్మాయి వంటి మీద వుంది” కోపంగా అరిచింది. రోజారాణి భయపడి రాజు వంక బిత్తరపోయి చూసింది. 

“నువ్వు ఇంటికి పా” గద్దిస్తూ తలుపు వైపు చూపించాడు. 


అంజలి, యాదగిరి కలిసి రాజును పట్టుకొని చెడా-మడా దెబ్బలు కొడుతూ తిడుతున్నారు. ఓ వారగా వీల్ చైర్లో ముకుందం గమనిస్తున్నాడు. 


తానుగా అర్ధాంగి కోసం ఎప్పుడు ఏ ప్రత్యేకత చూపలేదు. తన తోబుట్టువుల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుట్టినరోజులు లేదా ఆఫీసు, యూనియన్ స్నేహితులు! పాపం, ఇల్లాలు గా అన్ని భరించింది. సహనం స్త్రీ జన్మ హక్కు అనుకొని తేలికగా తీసుకున్నాడు. 


రిటైర్మెంట్ రోజు తన స్తోమతకు మించి ఖర్చు చేసి ప్రియమైన అంజలి కోసం కొన్న డైమండ్ నెక్లెస్ ఎవరో పరాయి స్త్రీ ఒంటి పైన మెరుస్తూ ఉంటే సహించలేకపోయాడు. 

ఏదో అరవాలని, కోపంతో రక్కాలని సెగల రూపంలో వెలువడుతున్నాయి. ఏమీ చేయలేక కళ్ళు మూసుకున్నాడు, ఎవరు గమనించే స్థితిలో లేరు. 

***

అంజలి, యాదగిరి ధ్యాస రాజు మీదే వుంది “చెప్పు.. ఎందుకు దొంగతనం చేశావు?” పదే పదే నిలదీసింది అంజలి. 


“నా లవర్, పెండ్లాం కోసరం” తణుకు బెణుకు లేక చెప్పాడు. 


“నా రూమ్ తాళం కూడా పెట్టాను, వీడికి దొరికే ఛాన్స్ లేదు” అంజలి బేరీజు వేసుకుంది. 


“నేను ఎప్పుడూ ఇంట్లోనే వుండేటోడిని, ఎట్ల తీసినవు బె?” మరోసారి కాలితో తన్నాడు. 

ఇక దెబ్బలు శరీరం భరించలేక పోయింది “మెరుస్తూన్న నెక్లస్ నాకు మస్తు పసంద్ ఐయింది. ఎన్నో టైంలు చూడంగ దొరకలేదు. ఇగ అద్దం కాడా కనబడ్డది, కానీ అమ్మ కూడా ఆడనే తిరుగులాడుతుండే. నేను ఏం జేషిన అంటే.. గమ్మున ఆ నెక్లస్ తీసి కిడికి కాడా పెట్టిన. అమ్మ ఆఫీసుకు పొంగానే కిడికి కున్న దోమల జాలిని చాకు పెట్టి కోసి నెక్లస్ అందుకున్న” ఎంతో హుషారుగా చేసిన దొంగతనం వివరించాడు. 


“అరే, దొంగ ముండా కొడుకా, నేను ఏమైన రా?” కోపంగా యాదగిరి అనుమానం. 


“పెద్ద సారు జూసీ తండ్లాడి పిచ్చిగా అరిచిండు, నీకు ఇన రాలే, మస్తుగ పండుకున్నవ్. ఆయాలనే పెద్ద సారుకు బాగా సుస్తి అయ్యి, అమ్మ డ్వయిటీ నుంచి రాంగానే దావాకాన కొండపోయిడ్రు. ” వినుర వేమ! అన్నట్టుగా అప్పజెప్పాడు. 


‘పెద్ద సార్’ మాట వినగానే అంజలి భర్త వైపు చూసి రక్తవిహీనురాలైంది. రోజారాణి డైమండ్ నెక్లెస్ పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టింది “ఛీ! మంచోడని ఇల్లొదిలి వస్తే, దొంగోడు తేలిండు, తూ.. బద్మాష్” అంటూ బయటకు నడిచింది. 

***

మానసికంగా, శారీరకంగా బాధల నుంచి ముకుందం ముక్తి పొందాడని ఆధ్యాత్మిక అలవర్చుకోవాలా? మొహం చాటేసిన బంధుమిత్రులు చావు వార్త విని మొహమాటం కోసం వచ్చి మళ్లీ వెనుతిరగని వారి బంధుత్వం ఏవగించు కోవాలా? భర్త ఇచ్చిన కానుక నెక్లెస్ దొరికిందని సంతోషపడలా? కొడుకు క్షేమంగా ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూస్తూ కాలం గడపలా? 


డైమండ్ నెక్లెస్ భద్రంగా దాచి బీరువా తాళం వేసింది, మిగిలినవి జ్ఞాపకాలు మాత్రమే! జ్ఞాపకాలకు భద్రత లేక విచ్చలవిడిగా పోరాటం చేస్తున్నాయి. 


*****


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 


94 views2 comments

2 Comments


mk kumar
mk kumar
Dec 19, 2024

కథలో "అంతర్యుద్ధం" అనే పేరు పాత్రల మనసులో జరుగుతున్న లోపలి పోరాటాలను సూచిస్తుంది. అంజలికి తన భర్త ముకుందం అనారోగ్యం, తన జీవితానికి తలపెట్టిన సవాళ్ల మధ్య, ఆత్మబలాన్ని నిలుపుకోవాల్సిన సంఘర్షణ ప్రధాన అంశం.


థ ఆధునిక కుటుంబాల్లోని వాస్తవ సమస్యలను స్పృశిస్తుంది. అల్జీమర్స్ వంటి జబ్బు వల్ల కుటుంబంలో దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను హృదయానికి హత్తుకునే రీతిలో ఆవిష్కరించింది.


కుందం, అంజలి, రాజు, ఇతర పాత్రల మధ్య సామాజిక సంబంధాలు, వాటి స్థిరత్వం, మానవ విలువలు వాస్తవికతతో వివరించబడ్డాయి. డైమండ్ నెక్లెస్ చోరీ వంటి చిన్న సంఘటన ద్వారా నమ్మకం, ఆత్మాభిమానం, నైతిక విలువలపై ఉన్న నిర్దిష్టతను చర్చించింది.


పాత్రలో చూపించిన ధైర్యం, త్యాగం, బాధ్యత ఈ కథకు ముఖ్యమైన బలం. తన భర్త ఆరోగ్యం, జీవితంలో ఒంటరితనం, ఆర్థికంగా తనను తాను నిలబెట్టుకోవడం వంటి వాటిని అంగీకరించి ముందుకు సాగింది.


సురేఖ పులి గారు రాసిన ఈ కథ సున్నితమైన భావోద్వేగాలు, యథార్థ జీవితంలోని పరమార్థాలను ప్రతిబింబించింది. భాష సాదా హృదయానికి దగ్గరగా ఉంది, ప్రతి సంఘటనను పాఠకుల హృదయంలో నిలిపేస్తుంది.


థలోని చిన్న విషయాలు,…


Like
Replying to

సర్, మీ ఆత్మీయ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజే మీ అమూల్యమైన విమర్శ చూశాను (పర్సనల్ కారణాల వలన వెంటనే చూడలేక పోయాను).

Like
bottom of page