top of page

అంతర్యుద్ధం

#Varanasi Bhanumurthy Rao, #వారణాసి భానుమూర్తి రావు, #Antharyuddham, #అంతర్యుద్ధం, #TeluguKathalu, #తెలుగుకథలు


Antharyuddham - New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao

Published In manatelugukathalu.com On 11/04/2025

అంతర్యుద్ధం - తెలుగు కథ

రచన: వారణాసి భానుమూర్తి రావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కరుణా మెటర్నటీ హాస్పిటల్ ముందర...

రామారావు తచ్చాడుతున్నాడు వెయిటింగ్  హాల్లో ...

సముద్రపు హోరులా గజిబిజిగా ఉంది హృదయం. తన  గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.


కుజోపరితలంపై మొదటి సారిగా దిగిన వైకింగ్ నుంచి మొదటి సారిగా ఏం వింటామా అన్న శాస్త్రజ్నుల ఆరాటం..ఆతృత...

ఇంకొక ఐదు నిమిషాల్లో భూకంపం వస్తుందని విన్నప్పుడు , అక్కడి ప్రజల హృదయాల్లో చెలరేగిన ఆందోళన , వేదన ,  భయం...

ఇప్పుడు  రామారావులో చోటు చేసుకొన్నాయి.


మూడు గంటల నుండి ...

ఏకాంతంగా తను..

తనతో అంతరాత్మ ..

అంతరాత్మతో తను ..

తెలియని వుద్తిక్తతతో బిగుసుకు పోయిన పిడికిళ్ళలో వెచ్చదనం.


లబ్ డబ్ మని సెకనుకు ఎనభై సార్లు వేగాన్ని హెచ్చించిన హృదయం. చల్లగాలి రివ్వున చెవులకు తగులుతూంటే భరింపరాని చల్లదనం. వాతావరణం  అసహ్యంగా ఉంది.

పరిసరాలు రుచించడం లేదు.


మనసు వికలంగా ఉంటే ప్రకృతి గూడా వికృతి లాగా కనబడుతుందేమో!

రేడియం డయల్ వాచీలో నిమిషాలు , సెకళ్ళ ముళ్ళ గమనం పై తన కళ్ళు. ముళ్ళు ముందుకే కదలడం లేదు.


సూర్యుడు ఆకాశంలో ఒకే చోట నిలబడి తనని వెక్కిరించినట్లోంది.అర్థం లేని ఆలోచనలు.

భరింప రాని ఆలశ్యం.

ఏదో వెగటు...ఏదో వెలితి...

రామారావు అడుగులు వేస్తున్నాడు.


ముందుకు ఐదు ...వెనక్కి ఐదు ...

తనకు అక్కడ తెలిసిన వారెవ్వరూ లేరు.


నిజంగా ఏకాంతం భరించ రానిది.

నరకం లాంటిది .

జానకికి ఇది మొదటి కాన్పు ...

తనకీ ఆనందమే!

పెళ్ళయిన ఏడాదన్నరగా  ఆడుకొన్న వలపు ఆటల ఫలితం.

అనుభవించిన ఆనందాలకు ప్రతి రూపం.


అలా రామారావు అనుకొన్నా...

తన అంతరాత్మ అడ్డంగా వాదిస్తుంది. ససేమిరా ఒప్పుకోదు.

నవ మోసాలు మోయాలి.

అఫ్ కోర్స్ ...తను గాక పోయినా..తన శ్రీమతి .

ప్రసవ వేదన ...అతి భయంకర మైన పురిటి నొప్పులు భరించాలి.

నేరం తనది. అనుభవించ వలసిన శిక్ష తన భార్యకు.

కర్త తను....కర్మ తన భార్య .


ఆమెకు కడుపు రావడానికి కారణం తను...

ఆమెను అలా హింసించడానికి కారణం తను...

రామారావు ఆత్మ పిచ్చిగా వాదిస్తోంది.

ఇంకా గూడా వాదించ గలుగు తుంది.

రామారావు తన అంత రాత్మ తో పోటీ పడ లేడు.

దానిని ఎదిరించ లేడు. అశక్తుడు పాపం తను!


జీవితంలో ఏ నాడో అంతరాత్మతో ఓడిపొయ్యాడు తను.

అంతరాత్మకు తను బానిస.

అది చెప్పినట్లు చెయ్యడమే తన కిష్టం.

అందుకే అది మంచయినా, చెడు అయినా అంతరాత్మ సలహా లేనిదే అడుగు ముందుకు వెయ్యడు.

ఇదీ రామారావు పద్ధతి.


ఆలోచిస్తున్నాడు...ఆలోచనలు ఒకరకమైన సంతృప్తిని ఇవ్వ గలుగు తాయి ఒక్కొక్కప్పుడు.

హృదయంలో ఆరాటం, బాధ , భయం , ఆవేదన

ఱంపపు కోత లాంటి ఆవేదన .

తన అర్థాంగి ప్రసవ వేదన.

రాత్రి కరుణా మెటర్నటీ ఆసుపత్రి లో చేర్పించాడు తను.

ప్రొద్దుటి నుండీ పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి తీవ్రంగా.


కానీ - ఇంకా ప్రసవం కాలేదు.

ఒకటి - రెండు - రెండన్నర - మూడు ...

మూడన్నర గంటలు దాటిపొయ్యాయి  పురిటి నొప్పులు ప్రారంభమయి...

భగవాన్ !!??

ఏమిటీ పరీక్ష??

జానకిని రక్షించు స్వామీ! నా దేవిని కాపాడు!

కనుల పొరల్లో నిండాయి కన్నీళ్ళు.


సిజేరియన్ ఆపరేషన్ తప్పదన్నారు డాక్టర్లు.

సరే నన్నాడు తను.

ఒక నో  అబ్జెక్షన్ సర్టిఫికెట్  మీద తన సంతకం తీసుకొన్నారు.

రామారావు హృదయంలో విపరీతమైన అలజడి.

గుండెల్లో దడ దడ.

హాస్పిటల్ వాతావరణం మరీ ప్రత్యేకం.


ప్రతి మనిషి ముహంలో ఏదో తెలియని విచారం.భయం.

రామారావుకి హాస్పిటల్ వాతావరణం అసలు నచ్చదు.

ప్రక్కనున్న పిల్లల వార్డు లోంచి గట్టిగా ఏడ్పులు.

ముసుగు కప్పిన పిల్ల వాడి శవం మీద పడి ఒక తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

రామారావు లేచి చూశాడు.


కాళ్ళల్లో వణుకు , చేతుల్లో కంపరం .

నోట్లో తడి ఆరి పోతోంది. ముఖం లో చెమట .

నిలబడలేక పోతున్నాడు.

ప్రక్కన వున్న  కూలర్  నుండి మినరల్ వాటర్ గ్లాసులో నింపుకొని గడగడ మని త్రాగేశాడు.

ఆయాసం తగ్గింది.


తుండు గుడ్డతో మొహం మీదున్న స్వేద బిందువుల్ని తుడుచు కొన్నాడు.

ఏవో వికృతమైన శబ్ధాలు ..

ఆ రోదనలను , పెడబొబ్బల్ని విన లేక పోతున్నాడు రామారావు.


నిజమా! జానకి గూడా నొప్పులు భరించలేక ఇలానే అరుస్తుంటుందా?

" ఓ ...మై గాడ్! జానకీ..నా జానకీ ! ''


గొంతులో వణుకు.కాళ్ళల్లో కంపరం.  పీలగా అరచాడు.

ప్రసూతి వార్డు  ప్రక్కనున్న ఆపరేషన్ రూం కేసి నడిచాడు రామారావు.

తెల్లని డ్రస్సులో సిస్టర్ తన వైపే వస్తోంది.

" సిస్టర్ " ఆయాసంగా పిలిచాడు రామారావు.


" రామారావు మీరే గదూ? "


" అవును...నా జానకి ఎలాగుంది? "


కంగారెక్కువయింది రామారావుకి.

సిస్టర్ ముఖంలో ఆనందం కంటే సానిభూతి ఎక్కువ పాలు కనిపిస్తోంది.

ఆమె కళ్ళు చురుకు దనంగా లేవు.

మాసి పోయినట్లు నిర్జీవంగా ఉన్నాయి.

రామారావు ఇవన్నీ గమనించే స్థితిలో లేడు.


" సిస్టర్ ! " రామారావు గొంతులో ఆతృత.


" తల్లీ బిడ్డా క్షేమంగానే వున్నారు రామారావు గారూ! డోంట్ వర్రీ ! " అన్నది సిస్టర్ ఎక్కడో చూస్తూ.


" బేబీ ఆడా..మగా? " వుండ బట్ట లేక అడిగాడు రామారావు.


" బాబే...కానీ ..."


" కానీ ...."


రామారావు లో కోటి సందేహాలు.

సిస్టర్ మౌనంగా ఉంది.

" ఏమిటి సిస్టర్....మీ అనుమానం? "


ఆ..ఏమీ లేదు...ఇంకో గంట తరువాత తల్లీ బిడ్డను మీరు చూడవచ్చు " వెనుతిరిగింది సిస్టర్.


రామారావు గొంతులో వెలగ బడ్డట్లయింది ఆమె సమాధానం.

తనకు బాబు పుట్టాడు. తను అదృష్ట వంతుడు.


తను ఓ బాబుకి తండ్రి ఇప్పుడు.

గర్వంగా చెప్పుకొంటాడు తను.


ఆనందంగా వుంది తనకు.బాబు మీద ఎన్నో కలలు.

" తన పోలికా? జానకి పోలికా? "


తన పోలికయితే జానకిని ఏడ్పించాలి.


బాబుని పెద్ద పెద్ద చదువులు చదివించాలి. బాబుని ఐ ఏ ఎస్ ఆఫీసరుని చెయ్యాలి.

పదిమంది తనని గొప్ప ఆఫీసర్ తండ్రినని చెప్పుకోవాలి.

పరి పరి విధాల పోతున్నాయి ఆలోచనలు రామారావు మస్తిష్కంలో.

********************************

" రామారావ్ ! " పిలిచింది  అంతరాత్మ.


" నాకు బాబు పుట్టాడు " చెప్పేశాడు రామారావు.


" సంతోషం "


" మరీ చప్పగా ఉన్నావేంటి? ఇలాంటి ఆనంద సమయంలో గూడా !"


" పిచ్చి రామారావ్ ...నీకానందంగా ఉంటే నాకు ఆనందంగా ఉండాలా? "


" మరి..." అర్థం కాలేదు రామారావుకి.


" ముందు ఆలోచనలు పనికి రావని తెలుసా? "


" తెలుసు "


" మరి తెలిసే ఆలోచిస్తున్నావా? "


జవాబు చెప్పలేదు తను.  మెలికలు త్రిప్పుతూ అంతరాత్మ అడిగే ప్రశ్నలకు సమాధానం  చెప్పడం తనకు చేతగాదు ఒక్కొక్క సారి.

" ఏం మాట్లాడవు ? బాబుని నువ్వు చూశావా? '


" లేదు "


" మరి అంత సుందరంగా అంచనాలు వేసుకొంటున్నావు? గంభీరమైన ప్రశ్న అంతరాత్మ నోటి నుండి.

" --------------------"

" సిస్టర్ చెప్పింది విన్నావా ? కానీ........అని అర్ధాంతరంలో చెప్పి వెళ్ళింది. "   గొప్ప రహస్యం భోధిస్తున్నట్లు ఫీలయ్యింది  అంతరాత్మ.


" అవును " రామారావు తల వూపాడు.


" ఆ...కానీ ...అనే పదంలో ఎంత గూడార్థం దాగివుందో  కనుక్కో! మళ్ళీ కలలు కను . నే వస్తా! "

రామా రావు నుండి అంత రాత్మ నిష్క్రమించింది.

హృదయం నిండా మేఘాలు పులుముకొన్నాయి.

" అవును ... సిస్టర్ ఎందుకు సంకోచంగా, సంశయంగా వెళ్ళిందో !!?? "


గంటన్నర దాటింది.

సిస్టర్ తనను పిలుచుకొని వెళ్ళింది జానకిని  , బాబుని చూపడానికి.

జానకి బెడ్ మీద పడుకొనింది నీరసంగా.

కళ్ళు గూడా తెరవడం లేదు.


" ఆమెకు విశ్రాంతి కావాలి. ఆమెను లేపకండి ." సిస్టర్ వారించింది.


" బాబు ఎక్కడ? " రామారావు గొణిగాడు.


" అదిగో ...అ వుయ్యాల్లో ..." సిస్టర్ ముఖం త్రిప్పుకోవడం తను గమనించాడు.


ముద్దుగా నిదురోతున్న తన బాబుని మొదటి సారిగా చూశాడు రామారావు.

అంతే ....!!


కోటి బాంబులు పగిలినట్లు -

భూమండలం గిర్రని ఘీంకార నాదాలతో తిరిగినట్లు -


మహా ప్రళయం వచ్చి భూమండలం పటాపంచలయినట్లు - చుట్టూ గాఢాంధకారం - రామారావుకి ఏం కనబడ్డం లేదు.

తను తూలి పడి పోతూంటే కంగారుగా సిస్టర్ పట్టు కోవడం తెలిసిందతనికి .

*********************************

ఆ రాత్రి ....

రామారావుకి నిద్ర పట్టడం లేదు.

ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచి పొయ్యాయి.

" భగవాన్ ! నీకేం అపకారం చేశానని? మా కెందుకీ శిక్ష విధించావు? " కన్నీరు మున్నీరుగా విలపించాడు రామారావు.

**********************************

" రామారావ్! "

" ----------"

" నిన్నే పలక వేం ? "


" నేనే పాపం చేశాను? "


ఏడ్చేశాడు రామారావు.

" నీ పాప ఫలం గాదది..వాడి కర్మ ఫలం "


" నన్నేం చెయ్య మంటావ్ ? "


" కన్న తండ్రివి . ఏం చెయ్యాలో నీకే తెలియాలి "


" భగవాన్ !!?? "


" రామా రావ్ ..అటు చూడు "


కళ్ళల్లో నిండిన కన్నీటి పొరల మధ్య మసక మసక గా తెల్లని వెలుతురు దగ్గరగా అయినట్లనిపించింది రామా రావుకి . అస్పష్టంగా ఉన్న దృశ్యం స్పష్ట కాసాగింది.

రెండు కాళ్ళు  వంకరలు తిరిగిన అవిటి వాడు. రెండు చేతులు వంకర్లు పోయిన మొండి చేతి వాడు.


అష్టకురూపిలా మారిన ముఖం.

మాసి పోయిన గడ్డం . పిపీలకలు అయిన గుడ్డలు.

నడవ లేక పోతున్నాడు. ముఖం పీలగా అంద వికారంగా ఉంది.

రోడ్డు మీద బోర్లా పడి అడుక్కు తింటున్నాడు.


మూల్గు తున్నాడు. బలంగా నిట్టూర్పులు విడుస్తున్నాడు. బాధగా అరుస్తున్నాడు.

నడవ లేక - నడిచే వాళ్ళను చూసి ఏడుస్తూ ...

పరుగెత్తే వాళ్ళు తనని చూసి నవ్వుతూంటే ...

కాకులు..ఈగలు..దోమలు..కుక్కలు ముసురుతూంటే

" నో..నో...అలా జరగడానికి వీల్లేదు ఇది అసంభవం.  " పిడుగులా అరచాడు రామారావ్ .


" రామా రావ్ "


" నో..నో..."


" రాబోయే ఆ రేపులో ఎంత భయంకరత్వం దాగి ఉందో గమనించావా? "


" నో..అసంభవం - ఇంపాజిబుల్ ! అలా జరగ డానికి వీల్లేదు . "


" అన్నీ నువ్వు అనుకొన్నట్లు జరగవు "


భయంకర మైన నిశ్శబ్ధం.

ఆ నిశ్శబ్ధం లో ...జ్వాలా కీలలతో గిర్రని తిరిగే చక్రం .

ప్రళయ కాల రుద్ర శబ్ధా రావములు .

విలయ తాండవ గర్జనలు.

ఎర్రని రక్తం..రక్తం లో ముద్దయి పోయిన మనిషి.


" ఏమిటిది? నా కేమయ్యింది ? నేనెందుకిలా మారాను ? " పీలగా అరచాడు రామారావు.


" నువ్వు మారలేదు. పరిస్థితులు నిన్ను మారుస్తున్నాయి ."


" నా కెందుకీ శిక్ష? "


" శిక్ష గాదది. భయంకర పరీక్ష.ఈ పరీక్షలో నెగ్గాలి. "


" నేను నెగ్గ లేను.నేనోడిపోతాను. నేను ఓడి పొయ్యాను భగవాన్ !"


" పిచ్చి ఆలోచనలు మానేసి పరిష్కార మార్గం ఆలోచించు. "


" నా వల్ల కాదు. నేను ఆలోచించ లేను ."


" అయితే ....అనుభవించు.  "


దిగ్భ్రమ చెందాడు రామారావు.

శివ మెత్తి నట్లు వూగుతూ నవ్వు తోంది అంత రాత్మ తనని చూసి.

పిచ్చి వాడిని చూసినట్లు చూస్తోంది.

ప్రపంచం పగిలి పొయ్యేలా వికృతంగా నవ్వుతోంది.


" నీ కొడుకు రామారావ్..రెండు కాళ్ళు లేని అవిటి  వాడు-  చేతుల్లేని మొండి వాడు - కురూపి - కుంటి వాడు- అవిటివాడు. " అంతరాత్మ వికృతంగా తనని చూసి నవ్వుతోంది - ఆ రాత్రంతా.

****************************************************************************************************

ఉదయం పది గంటల సమయం.

రామా రావు హాస్పిటల్ కేసి నడక సాగించాడు.

హృదయంలో  రంపపు కోత లాంటి బాధ.

ఆవేదన , వేదన, భరింపరాని వ్యధ.


చరిత్రలో జరగని విచిత్రాతి చిత్రం.

సృష్టిలో జరిగే అతి రహస్యం .

కసాయి వాడు గొర్రెను పెంచి నరికేటట్లు ...

మొక్కల్ని పెంచి త్రుంచేసినట్లు ...

రాజుల ప్రభుత్వాలు మనుషుల్ని పోషించి యుద్ధాలకు పంపేటట్లు ...అంతా స్వార్థం...అందరివీ స్వార్థపు పనులే!


రేపటి జీవితంలో గుదిబండ లాంటి బరువు మోయ వలసి వస్తుందని -

తన మెడకు తన కొడుకు వురిత్రాడై వుచ్చులా బిగిస్తుందని -

తను ఏదో చెయ్య బోతున్నట్లు - చెయ్యాలని వెతుకు తున్నట్లు -

తనదీ స్వార్థపు పనే -


అన్నెం పున్నెం ఎరుగని ఓ అమాయక పచ్చి జీవితాన్ని...

రక్తం ఇచ్చి జీవం పోసిన తను నా - శ- నం ....

తను కిరాతకుడు - తను హంతకుడు -

నో- నో - తను కిరాతకుడు గాదు . హంతకుడు అసలే గాదు .


జీవితాంతం బ్రతుకే శాపంగా ....

ప్రతి ఘడియ లోనూ నరక బాధతో ...

కన్నీళ్ళ క్షణాలతో...విషాద గాధలతో...

గాఢాంధ కారం అలుముకొన్న జీవితం-

పుట్టుకే ఒక ఘోర శాపంగా పరిగమించకుండా...

శభాష్..గర్హిస్తున్నాడు తను …


ఏ కన్న తండ్రీ చెయ్య లేని పని ...తను చెయ్య గలడు- తన మంచికి గాదు....

పుట్టిన పసికందు మంచికి....వాడి బాగు కోసం ...

శాపగ్రస్థుడిగా పుట్టిన వాడి జీవితం అలా కొనసాగకుండా...

దుర్భర మానసిక వేదనా సంఘర్షణలతో జీవితాంతం కుమిలి పోకుండా...

తను ఏదో చెయ్య బోతున్నాడు.


నిష్కర్షతో - ఆత్మ నిగ్రహంతో - ఆత్మ శక్తితో - అంత రాత్మ ప్రభోధంతో ముందుకు అడుగు లేస్తున్నాడు తను.

తను హంతకుడు గాదు. కానే కాదు. తను కిరాతకుడు గాదు. తనకీ తండ్రి ప్రేమ తెలుసు. తనకీ మానవత్వం వుంది. తను పాపి గాడు.


పాప పరివృత్త మైన బీజాన్ని పుణ్య భూమి లోకి విసిరి  వేయడానికి , భగ భగ మని మండే మంటలలో ఉరక బోతున్న పురుగును నీటి ప్రవాహంలోకి విసిరి వేయ డానికి---

త్వర త్వరగా ముందుకు అడుగు లేస్తున్నాడు తను.

*********************************

వార్డు లోకి అడుగు పెట్టాడు రామారావు .

బిగ్గరగా ఆర్తనాదం లాంటి ఏడ్పు.

ఆ ఏడ్పు తనకి సుపరిచితంగానే ఉంది.

" ఎవరిదా ఏడ్పు? "


అంతరాత్మ నవ్వింది.

" తెలీదా? "


" ఊహూ! "


" నీ భార్య జానకిది."


" ఏమయింది ? ఎందుకని ?? "


కోటి సందేహాలు.  గుండె ఆగి పోయినట్లుంది రామారావుకి.

" నీవు అనుకొన్నదే జరిగింది గనుక...."


" అంటే! "


" ఇంకా డొంక తిరుగుడెందుకు రామా రావ్ ? వికృతంగా వున్నాడని , అవిటి వాడని నీ బిడ్డను నువ్వు చంపదలచు కోలేదా? " అంతరాత్మ నిలదీసి అడుగుతోంది.

తప్పు చేసిన అపరాధిలా తలొంచు కొన్నాడు రామా రావు.


రెండు క్షణాలు నిశ్శబ్ధం.

ఏడ్పు మరీ భయంకరంగా వినిపిస్తోంది.

" అ...అవును "


రామారావు పాంటు  జోబీ కేసి చూసుకొన్నాడు. జోబీ లోంచి ఒక పసుపు పచ్చని మందు డబ్బా పైకి తీసి దాని మీదున్న అక్షరాలు చదువుకోసాగాడు.

" టూ..మచ్...ఈజ్...పాయిజనస్ " అని వ్రాసి వుంది ఆ డబ్బా మీద.


" నీవు హంతకుడివి...కిరాతకుడివి...రాక్షసుడివి...అవునా? "


అంతరాత్మ పిచ్చిదానిలా అరుస్తోంది.

వణికి పోతూ క్రింద తూలి పడబొయ్యాడు రామారావు.

కళ్ళు గిర్రుమని తిరిగినట్లోంది.

హాస్పిటల్ అంతా తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నట్లు అనిపిస్తోంది.


" వాట్ హాపెన్డ్ టూ యు మిస్టర్ రామారావ్ ? "


తూలిపడ బోతున్న రామారావును పొదివి పట్టుకొన్నాడు అటుగా వెడుతున్న డాక్టర్.

" కమాన్ టేక్ రెస్ట్ "


" నో..నో...నా బాబుని చూడాలి . వాడికేమయింది డాక్టర్ ? "


'' అయాం సారీ రామారావ్ గారూ? రాత్రి నుండి వామిట్స్ ....మోషన్స్ ....వుయ్ హావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ !"


" డా..క్ట...ర్ !"


అప్రయత్నంగా కళ్ళల్లోంచి నీళ్ళు ఉబుకుతూంటే జానకి ఉన్న బెడ్ కేసి పరిగెత్తాడు రామారావు.


" ఏమండీ ! " జానకి రామారావుని చుట్టేసి బావురుమంది.


ఆమెను సముదాయించడానికి అక్కడున్న వారు అశక్తులై పొయ్యారు.

" జానకీ ! "


ఆమెను హత్తుకొన్నాడు రామారావు.

" బాబు మనల్ని వదలి వెళ్ళి పొయ్యాడండీ ! "


నిర్జీవంగా పడివున్న తన బాబు కేసి చూశాడు రామారావు.

కళ్ళల్లోంచి కన్నీళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.

అంతరాత్మ తన కేసి సానుభూతిగా చూస్తోంది.

***

వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.

వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు.‌ .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.

వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్‌ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.

తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్‌ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.

*వీరి ముద్రిత రచనలు*------------------

1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.

2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .

3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్‌ నెల 17 వ తేదీ వెలువరించారు.‌ ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు

4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.

5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!

*అముద్రిత రచనలు*

1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు‌. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.

2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.

3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.

4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.

*విద్యాభ్యాసం*-----------

వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.

ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు.‌ ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు.‌ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు.‌ వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు.‌ ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.

*వృత్తి*------

వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.

వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‌

ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు;1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ2. సహస్ర కవి రత్న3. సాహితీ భూషణ4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో.5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 20216. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.


1 comentário



@hindudharmamargam2136

• 1 day ago

అద్భుతమైన కథను‌ వినిపించారు. పద్మావతి గారికి ధన్యవాదములు.‌‌ఈ‌ కథ ఒక వ్యక్తి అంతర్మథనాన్ని తెలియ చేస్తుంది.‌ ప్రతి మనిషీ అంతరాత్మతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు.‌ మంచయినా చెడ అయినా అంతరాత్మ సలహా తీసుకొనే ముందుకు అడుగులేస్తాడు.‌ ఒక వ్యక్తి మానసిక సంఘర్షణలతో వ్రాసిన ఈ కథ బాగుంది.‌ రచయిత వారణాసి భానుమూర్తి రావు గారికి అభినందనలు.

Curtir
bottom of page