top of page
Writer's pictureSingeetham Vijayalakshmi

అంతేగా.. అంతేగా



'Anthega Anthega' - New Telugu Story Written By Singeetham Vijayalakshmi

Published In manatelugukathalu.com On 19/06/2024

'అంతేగా.. అంతేగా' తెలుగు కథ

రచన: సింగీతం విజయలక్ష్మి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కాలింగ్ బెల్ మ్రోగింది. 


తలుపు తీసి పాల ప్యాకెట్లు అందుకొని కుళాయి క్రింద కడిగి ఫ్రిడ్జ్ లో పెట్టాడు రిత్విక్. మొదలయ్యింది సమస్య అనుకున్నాడు. అందరినీ సాధారణంగా వేదించే సమస్య అదే.. తలనొప్పితో సతమతమవుతున్నాడు. 


ఆరోజు ఆదివారం కావడం వల్ల ఆలస్యంగానే నిద్ర లేచాడు. లేచింది మొదలు ఒకటే బాధ. నిద్ర ఎక్కువైతే కూడా తలనొప్పి రావాలా అంటూ విసుక్కున్నాడు. వేడిగా కాఫీ త్రాగితే సరిపోతుందేమో అని కాఫీ పెట్టుకొని త్రాగాడు. ఊహూ.. లేశమాత్రమైన ఉపశమనం దొరకలేదు. 


మొబైల్ తీసాడు. గూగుల్ లో తలనొప్పి నివారణ చిట్కాలకై వెదికాడు. సులభతరమైన చిట్కా ఒకటి దొరికింది. అదేమంటే డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి వస్తుందట. ఒక పెద్ద గ్లాస్ లో నీరు త్రాగితే తలనొప్పి తగ్గుతుంది అన్నారు. 


కష్టమైందేమీ కాదుకదా చేసేద్దాం అంటూ లేచి వంటగదికి వెళ్లాడు. రిత్విక్ గ్లాసులో నీళ్లు తీసుకొని గటగట త్రాగాడు. బయటకు వస్తూ బాల్కనీ లో మొక్కలు చూశాడు. వెంటనే ఒక పెద్ద పాత్రలో నీళ్లు నింపి అన్ని మొక్కలకూ పోసాడు. వచ్చి సోఫాలో కూర్చుని పేపర్ తిరుగేయసాగాడు. తలనొప్పి చదవనివ్వలేదు. 


కళ్ళుమూసుకొని పాట ఆరంభించాడు. 

“నారాయణా.. శ్రీమన్నారాయణా.. నారాయణా.. లక్ష్మీ నారాయణా” అంటూ భక్తి పారవశ్యంతో పాడసాగాడు. 


ఒక్కసారిగా హోరు గాలి వీస్తూ కిటికీ రెక్కలు.. వాకిలీ టపటప లాడాయి. ఇదేంటీ.. ఇంత గాలి అంటూ విభ్రాంతితో చూడసాగాడు. గోపాలా గోపాలా సినిమాలో కృష్ణుడిలా శ్రీమన్నారాయణుడే ఎదుట ప్రత్యక్షం!


“దేవా.. మీరు.. మీరేనా.. ” అడిగాడు ఆశ్చర్యంగా. 


“అవును భక్తా. భక్తి పారవశ్యంతో నీవు పాడడమే నేనిక్కడకీ రావడానికి కారణమైంది. ఇక్కడి పరిస్థితి అర్థమైంది. నీ తలనొప్పికి కారణం నాకు తెలుసు”


“చెప్పండి స్వామీ”


“రెండు నెలలుగా నీవు బస్టాండులో కనిపించే ఆ అమ్మాయి పై మనసు పారేసుకొన్నావు. రోజూ దూరం నుండే అమ్మాయిని గమనిస్తున్నావు. మాట్లాడే ధైర్యం చేయలేక పోతున్నావు. నిన్నంతా.. ఎన్నాళ్లిలా? ఎప్పటికి పలకరించే ధైర్యం వస్తుందో అని నీలో నీవే తెగ బాధపడిపోయావు. ఆ ఒత్తిడి ఫలితంగానే ఈనాటి నీ తలనొప్పి” అన్నారు దేవుడు. 


“నేనేం చేయాలి స్వామీ” అన్నాడు రిత్విక్ ముకుళిత హస్తాలతో. 


“ఆ అమ్మాయి చేతి స్పర్శతో నీ తలనొప్పి హాం.. ఫట్ అంటూ మాయమవుతుంది” 


“దేవా, అమ్మాయి నాతో మాట్లాడుతుందా? కాలికున్న చెప్పు తీయదు కదా” అన్నాడు భయంగా. 


“నీకంటే ముందే ఆ అమ్మాయి స్వప్నంలో నిన్ను చూసింది. స్వప్నంలోని నీవే నిజంగా కనిపించేసరికి ఆ అమ్మాయి కూడ మనసు పారేసుకొంది. కానీ అమ్మాయి కదా. బయట పడదు అంతే”


“నిజంగానా స్వామీ. ఐతే రేపే ప్రొసీడయిపోతా. ఆశీర్వదించండి దేవా” అంటూ నమస్కరించాడు. 


“అలాగే. అమ్మాయి దగ్గరకెళ్ళి పళ్లికిలించకు. పలకరించు” అని అంతర్ధానమయ్యాడు దేవుడు. 

***

శుభ్రంగా ముస్తాబై రిత్విక్ బయలు దేరాడు. ఆకుపచ్చ చీరలో ఆ అమ్మాయి అందంగా నిలబడి ఉంది. ఏ మాత్రం సంశయించకుండా దేవుడు ఇచ్చిన ధైర్యంతో వెళ్లి ప్రక్కన నిలబడ్డాడు. 


“మీరు నాకు రెండు నెలలుగా తెలుసు” అంటూ తనను తాను పరిచయం చేసుకొన్నాడు. కరచాలనానికై చేయందించాడు. ఆ అమ్మాయి కూడా చేయందించింది. 


ఆశ్చర్యం.. ! ఆ క్షణమే తలనొప్పి పరార్. 


అలా ప్రారంభమైన వారి పరిచయంతో ఒకరి విషయాలు మరొకరు పంచుకున్నారు. 


కీర్తనకు ఒక్కగానొక్క చెల్లి పేరు పద్మిని. కీర్తన డిగ్రీ ముగించి ఉద్యోగ వేటలో ఉండగా వాళ్ళ నాన్న మరణించారు. షాక్ తో తల్లి కూడా మరణించారు. తల్లిదండ్రులు సంపాదించి కట్టిన ఇంట్లో ఉంటూ ఉన్న బాంక్ అకౌంట్ లోని సొమ్ముతో జీవితం గడిపారు. కొన్నాళ్ళకు కీర్తనకు మంచి పేరుమోసిన కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత ఇప్పుడు రిత్విక్ తో పరిచయం.. ఇరువురి పరిచయం అలా పెరిగి ప్రేమగా మారి పరిణయం వరకూ దారి తీసింది. ఓ శుభ ముహూర్తాన బాజాభజంత్రీల నడుమ ఆలూ మగలై సంసార జీవితం ఆరంభించారు. 


కీర్తన పెళ్లవగానే పద్మిని ఉన్నత విద్యలు చదవాలంటూ వెళ్లి హాస్టల్ లో ఉండి చదవసాగింది. సెలవులో అక్క వాళ్ళింటికి వచ్చి తరువాత హాస్టల్ కు వెళ్లిపోయేది. 

***

వర్తమానంలో.. ప్రస్తుతం.. 


“ఆడవారి మాటలకు అర్థాలే లేవులే” అంటూ అద్దం చూస్తూ మీసం దువ్వుకొంటున్నాడు రిత్విక్.

 

అక్కడే మంచం మీద కూర్చొని మడతలు పెట్టిన బట్టలు తీసి అలమరాలో పెడుతూ కీర్తన “అది తప్పు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని పాడాలి” అంటూ ఒరకంటితో భర్తను చూసింది. 

రిత్విక్ నిశ్శబ్దంగా బయటకు పోబోయాడు. వాకిలి దగ్గరే చేయి పెట్టి ఆపేసింది కీర్తన. 

ఏమిటన్నట్టు కళ్ళెగరేసాడు రిత్విక్. 


“నేను చెప్పిన విషయం ఏం చేశారు?”


“నీవేమి చెప్పావు?” అంటూ అడిగాడు అమాయకంగా. 


“నా వడ్డాణం విషయం” అంటూ గుర్తు చేసింది. 


“రా. ఇలా వచ్చి కూర్చో” అంటూ ప్రక్కనే కూర్చోబెట్టాడు. 


“కీర్తనా, అందంగా, నడుము సన్నగా, రిపటలా ఉన్నావు. నడుమెక్కడుందమ్మా పిడికిడీ నడుమూ అంటూ వెతుక్కోవలసి వస్తోంది. వడ్డాణం వేసుకొంటే అస్సలు కనిపించదు తెలుసా. తక్కువ బంగారంతో పని అయిపోతుంది. ప్చ్. నాకది నచ్చడం లేదు. అందుకే నిన్ను బొద్దుగా చేయడానికి డైటీషియన్ దగ్గర ప్లాన్ తీసుకున్నాను. ఆ ప్రకారం అన్నీ డ్రై ఫ్రూట్స్, మంచి పోషకాలున్న పదార్థాలు తెస్తాను. ఇంకెంత ఓ ఆరు నెలల్లో నీ నడుం చుట్టకొలత పెరగగానే చేయించేస్తా. కొంచెం ఓపిక పట్టు డియర్” అన్నాడు సన్నగా భుజం తడుతూ. 


భర్త మాటలకు పరవశంతో కళ్ళు మూసుకొంది ఒక్క నిమిషం మాత్రమే. 


ఆ మరుక్షణమే “మీ మాటలతో నన్ను మాయ చేయకండి. నాకు వడ్డాణం ఇప్పుడే కావాలి. గోల్డ్ షాప్ కు వెళ్దాం పదండి” అన్నది భర్తను లేపుతూ. 


“బంగారం. నా బంగారానికి బంగారంతో అన్నీ చేయించాలని నాకు మాత్రం ఆశ లేదా? ఏం చేయాలి చెప్పు. వచ్చే డబ్బులు సరిపోవట్లేదు. భార్యగా రాబోయే నీవు దేనికీ కష్టపడకూడదని పెళ్ళికి ముందే ఇంత పెద్ద ఇల్లు కట్టి అన్నీ అధునాతన సౌకర్యాలు అమర్చాను. అవి అన్నిటికీ లోన్ కట్టగా మిగిలిన డబ్బుతోనే ఉన్నంతలో హాయిగానే ఉంటున్నాం. లోన్ త్వరగా కట్టి ముగించాలని అమౌంట్ ఎక్కువ చేసి కడుతున్నాను. ఇంకో ఐదు సంవత్సరాలు అంతే. ఆ తర్వాత ఇంకా జాలీ గా ఉండొచ్చు” ఏమంటావ్ అన్నట్టు చూసాడు. 


అప్పటికి ఆ ప్రస్తావన ముగిసినట్టుగా కనిపించింది. హమ్మయ్య అంటూ మెల్లగా ఆమెకు కనబడకుండా గుండెలమీద చెయ్యి వేసుకున్నాడు. 

***

మరికొన్నాళ్ళు గడిచాక, ఒక సాయంత్రం పూట.. 

“నేనొక మాట చెబుతాను వింటారా?”


“చెప్పు కీర్తనా, నీవు ఎంతటి మంజుళభాషిణివి అంటే నీవు పలికే చక్కటి మాటలు నాకెంతో హాయిని ఇస్తాయి కదా చెప్పు” అన్నాడు. 


“నేను చదివిన చదువు సార్థకం చేసుకోవాలని అనిపిస్తూ ఉంది”


“నాకు తెలుసు. నీవూ ఉద్యోగం చేస్తానంటావ్ అంతేనా”


అవునన్నట్టు తలూపింది. 


“కీర్తనా, మన పెళ్ళైన క్రొత్తలోనే నే చెప్పిన మాటలు గుర్తున్నాయా?”


“ఆ ఆడవాళ్లు పడే కష్టాలు చూసి చలించి పోయిన మీరు మీ భార్యను అస్సలు కష్టపెట్టకూడదనుకొన్నారు. నేను ఆర్థికంగా స్వతంత్రురాలిని అన్న ఫీలింగ్ లోనే ఉండాలని ఇంటి ఖర్చులకు, నాఖర్చులకని నా అకౌంట్ లో ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూ ఉన్నారు. ఏం ఖర్చు చేస్తున్నానని కూడా అసలడుగరు. పైగా క్రెడిట్ కార్డ్ కూడా చేతిలో పెట్టారు. అదంతా సరే అండీ. ఇక్కడ కేవలం డబ్బు కోసమే కాదండీ. ఉద్యోగం అంటూ చేస్తే నా బుద్ధికి పదును పెట్టచ్చు. ఒకే తరహా ఆలోచనలు కాకుండా పరిపరి విధాలా ఆలోచించ వచ్చు. నా నైపుణ్యం వల్ల పనిచేసే కంపెనీ లాభాలు గడిస్తే నాకూ మంచి పేరు కీర్తిప్రతిష్ఠలు కలుగుతాయి. ఆవిధంగా ఉత్సాహం ఉరకలు వేస్తూ శరీరం కూడా ఆరోగ్యం గా ఉంటుంది కదా అని నా అభిప్రాయం”


“వడ్డాణం అడగగానే కొని ఉంటే బాగుండేది. నీ ఆలోచన విధానం మారి ఉండేది” అన్నాడు కొంచెం కష్టంగా. 


“అలా కాదండీ. నాకసలు వడ్డాణం పై మోజు లేదండీ. ఈ నెపంతో నైన మీ అంగీకారంతో ఉద్యోగం చేయొచ్చు అని అంతే. వడ్డాణం వద్దూ.. ఉద్యోగం వద్దూ. మీ మనసు కష్టబెట్టడం నాకిష్టం లేదు” అంటూ లోనికెళ్ళిపోయింది. 


ఐదు నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో బయటకు వచ్చింది. 


‘ఒకరికి ఇష్టమైనట్టు ఒకరు వుండి పోవాలనుకొన్నాం. భార్యపై అపరిమిత ప్రేమానురాగాలతో తనకు ఏ కష్టం కలుగరాదని పాపం తన ఇష్టం వచ్చినట్లు ఉండనివ్వక హింస పెడుతున్నానేమో’ అంటూ బాధపడ సాగాడు. 


అంతే.. మళ్లీ తలనొప్పి ప్రారంభమైంది. ఉపశమనం దొరికే మార్గం కనిపించలేదు. హటాత్తుగా ఆలోచన వచ్చి మళ్లీ ఆనాటి భక్తి పాట పాడసాగాడు. 


అప్పటిలాగే మళ్ళీ హోరున గాలి.. దేవుడు ప్రత్యక్షం!


“భక్తా.. ఇది నీవు కోరి తెచ్చుకున్న తలనొప్పి. జీవితాంతం నీతోనే ఉంటుంది. నా ఉద్దేశ్యం నీ భార్యే నీ తలనొప్పి అని కాదు సుమా. ఐనా ఈ ప్రపంచంలో పరిష్కారంలేని సమస్య ఉండదు. ఇప్పటి నీ తలనొప్పికి సమర్థవంతమైన శాశ్వతమైన చిట్కా ఒకటుంది”


“ఏమిటది? త్వరగా సెలవివ్వండి స్వామీ”


“ఆమె చెప్పినదానికల్లా తల ఊపడమే. అలా ఊపడం వల్ల తలలోని నరాలన్ని ఉత్తేజితమై నీ నొప్పి మటుమాయమౌతుంది. నీ సంసార జీవితమూ ఆనందమయంగా ఉంటుంది. ఆ చిట్కా పాటిస్తే సంసారంలో కలతలు, కల్లోల్లాలు, గొడవలు అస్సలు ఉండవు. ఆలోచించుకో”


“అలాగే దేవా. ఐతే తల ఊపడమంటే తను చెప్పినదానికంతా ఒప్పుకున్నట్టే కదా. అసలే ఆర్థిక ఇబ్బందులు. నావల్ల ఔతుందా?”


“అనుమానం వద్దు. ఊపి చూడు. ఆశ్చర్యపోతావు. ఆనందిస్తావు” అంటూ దేవుడు అంతర్ధానమయ్యాడు. 


అప్పటికి మూడురోజులయింది, ఒకరికొకరు సరిగా మాట్లాడక ముభావంగా ఉంటూ. 


రిత్విక్ బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోసి ఒక పూలకుండీలో మొక్కకు అందంగా అలరారు తున్న పన్నీర్ రోజ్ తెంపి లోపలకు వచ్చి భార్యామణికి అందించాడు. 


రిత్విక్ ఇచ్చిన పూవు అందుకొంటూ చిరునవ్వు నవ్వింది. 


“నవ్వులు రువ్వే పువ్వమ్మా.. ఆనందం మనదే నమ్మా. అంటూ తోచినట్టు పాడాడు. 


అందంగా నవ్వింది కీర్తన. కీర్తన చేతిలో పాస్ బుక్ చూసి ఏమిటన్నట్టు అడిగాడు. 


“ఇంకో పదహారు రోజుల్లో పద్మిని పుట్టిన రోజు వస్తుందండి. తనకు గిఫ్ట్ ఇవ్వాలని అకౌంట్ లో అమౌంట్ చెక్ చేస్తున్నాను”


“ఏమివ్వాలనుకొంటున్నావు?”


“స్కూటీ కొనిస్తే ఎలా ఉంటుందంటారు? తనకు అవసరం అవుతుంది అనుకొంటున్నాను”


ఆమెకు కనబడకుండా అదిరిపడ్డాడు. స్కూటీ అంటే కనీసం అరవైవేలు! తలనొప్పి ప్రారంభమౌతున్నట్టు అనిపించింది. అంతలోనే దేవుడి మాటలు గుర్తొచ్చి వెంటనే అమలు చేశాడు. 


తల వేగంగా ఊపి “భేష్. మంచి ఐడియా. సాయంకాలం తయారుగా ఉండు. వెళ్లి బుక్ చేసి వద్దాం నీ అకౌంట్ లో అమౌంట్ ఏమీ తీయకు. ఆదలాగే ఉండనీ. పద్మిని పెళ్ళికి పనికి వస్తుంది. మనం క్రెడిట్ కార్డులో కొందాం. పాయింట్స్ కూడా వస్తాయి” అన్నాడు. 


ఆశ్చర్యంగా, ఆరాధనగా చూసింది కీర్తన. ఇదేమిటి? మూడు రోజుల్లో ఇంత మార్పు!


“కానీ క్రెడిట్ కార్డ్ అక్కడ వాడేస్తే మన బాబుని మంచి కాన్వెంట్ లో చేర్పిద్దాం అనుకొన్నాం కదా అడ్మిషన్ ఫీజ్ బోలెడు ఉంటుంది కదండీ. ఇలా ఖర్చు పెట్టేస్తే ఎలాగండీ?”


“వాడిని చేర్పించడానికి ఆరు నెలలు టైముంది కదా. నీవేమీ వర్రీ అవకు. సంపాదించడం ఖర్చు పెట్టడానికి కాదా. నీవే అంటుంటావు కదా. డబ్బు ధారాళంగా ఖర్చు పెడుతుంటేనే ఇంకా ఇంకా మనకీ వచ్చి చేరుతూ ఉంటుంది అని” అన్నాడు. ఆశ్చర్యం! తలనొప్పి మాయం! భగవంతుని చిట్కా ఫలించింది. అంతకన్నా ముఖ్యంగా మనసెంతో తేలికగా అనిపించింది. 


ఆ రోజే సాయంకాలం వెళ్లి పద్మిని కి నచ్చిన రంగు స్కూటీ ఆర్డర్ చేసి వచ్చారు. సరిగ్గా పుట్టినరోజు నాడు డెలివరీ చేయమన్నారు. 

***

“ఏమండీ”


ఆమె ధోరణి చూసి మళ్ళీ ఏదో గొంతెమ్మ కోరికతో వచ్చిందన్న విషయం అర్థమైంది. అంటే మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అన్నమాట అనుకుంటూనే “ఏంటీ” అన్నాడు. 


“క్రితంలో ఒకసారి ఉద్యోగం చేయాలన్న ఉత్సాహం ఉంది అన్నాను. ఉద్యోగం కాదు నేను ఆన్ లైన్ ట్రేడింగ్ షేర్ మార్కెట్టింగ్ చేయనా”


ముందూ వెనకా ఆలోచించకుండా వేగంగా తలూపేశాడు. 


“ఓకే. నీ ఇష్టం. జాగ్రత్తగా పరిశీలిస్తూ ప్రొసీడ్ అవ్వాలి. నా దగ్గర కూడా అప్పుడెప్పుడో కొనుగోలు చేసిన షేర్లు చాలానే ఉన్నాయి. డీమాట్ అకౌంట్ తెరవాలంట. చూద్దాం. నీవు స్టార్ట్ చేయి మొదట. కలిసొస్తే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు కదండీ చూద్దాం బాగా కలిసి వస్తుందేమో ఈ బిజినెస్. మంచిరోజు, ముహూర్తం చూసి మొదలు పెట్టు”


“ఆహా.. అలా కాదు. మీరే ప్రక్కనుండి మొదలు పెట్టించండి”


“ఒకే డన్” అన్నాడు రిత్విక్. తలనొప్పి వస్తూ వస్తూ ఆగిపోయింది. 


***

“ఏమండీ. ఉదయం టీవీ లో నా రాశికి ఈ రోజు మంచి అదృష్టం కలిసొస్తుందని చెప్పారండీ. సరదాగా నాకోసం లాటరీ టికెట్టు తెప్పించి ఇవ్వండి. లాటరీ తగిలితే సరి. లేకపోయినా మనమేమీ బాధ పడవద్దు” అన్నది. 


ఇప్పుడు, ఈ మధ్యన ఆమె ఏం చెప్పినా తలూపడం అలవాటైపోయింది రిత్విక్ కు. 

***

పద్మిని పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి పార్టీ ఇచ్చారు. తనకిష్టమైన రంగులో స్కూటీ చూడగానే మురిసి పోయింది. అక్క, బావలు తనపై చూపించే ప్రేమకు ఆనందపడింది. వాళ్ళకెప్పుడూ ఏ కష్టాలూ రాకూడదని, సుఖ సంతోషాలతో ఉండేలా దీవించమని భగవంతుని ప్రార్థించింది. 


“ఈ సంతోషంలో మరొక సంతోషం ఊహించు చూద్దాం” అన్నాడు రిత్విక్ కీర్తనతో. 


“మీరే చెప్పండి” అన్నది అర్థం కాక. 


“క్రితంలో నీవు లాటరీ కొనమన్నావు కదా. ఆ రోజే బాబాయ్ గారికి ఫోన్ చేసి నీ పేరు మీద లాటరీ టికెట్ తీసుకున్నాను. దానికి బంపర్ డ్రా కోటి రూపాయల ప్రైజు తగిలింది. నిజంగా నీవు అదృష్టవంతురాలివి” అంటూ గిరగిరా త్రిప్పాడు కీర్తనను. 


“నేను కొనమన్నప్పుడు మారు మాట్లాడకుండా కోపగించుకోకుండా మనస్ఫూర్తిగా కొన్నారు కాబట్టే ఈ లాటరీ తగిలింది. ఆలి మాటలకు అడ్డు చెప్పక పోతే ఆనందాలే మరి. అంతేనంటారా” అన్నది కీర్తన ఆనంద పారవశ్యంతో. 


“అంతేగా.. అంతేగా.. ” అన్నాడు రిత్విక్ భగవంతుడి విలువైన సలహాను తలుచుకుంటూ. 


ఆనందపారవశ్యంతో ముద్దుగా బొద్దుగా అమ్మానాన్నలనే చూస్తున్న సాత్విక్ ను ఎత్తుకొని ముద్దాడారు. నవ్వుతూ ఆ అపురూప దృశ్యాన్ని మొబైల్ కెమెరాలో బంధించింది పద్మిని. తరువాత మొబైల్ కెమెరాలో టైమర్ ఆన్ చేసి అందరూ కలిసి ఫోటో తీసుకొన్నారు. 

***


సింగీతం విజయలక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

పేరు : సింగీతం విజయలక్ష్మి

జననం. : 12/04/1968

జన్మస్థలం: అనంతపురం


తండ్రి : బాపూరం గురురాజ రావు గారు, న్యాయవాది.


తల్లి : చంద్రకాంత బాయి.


తోబుట్టువులు : అన్న గారు, తమ్ముడు,చెల్లెలు  వినుతా గాయత్రి


బాల్యం విద్యాభ్యాసo


పుట్టి పెరిగింది అనంతపురంలో.


చదువు : B.A , B.Ed, హిందీ ప్రవీణ


ఉద్యోగం : 1990 నుండి 1996 వరకు ఉపాధ్యాయురాలిగా పనిచేశాను.


1996 జనవరిలో సింగీతం ఘటికాచలరావు గారితో వివాహం జరిగింది.


మా వారు రైల్వే ఇంటిగ్రల్  కోచ్ ఫేక్టరీలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ గా పనిచేసి ఏప్రిల్ 2024 లో పదవీ విరమణ పొందారు. కథా రచయిత, నవలా రచయితగా మంచి పేరుపొందారు.


పిల్లలు : ప్రద్యుమ్న రావు, ప్రద్యోత రావు


రచనా వ్యాసంగం:


2013లో భర్త ప్రోత్సాహంతో నేను వ్రాసిన మొట్టమొదటి కథ  నవ్య వార పత్రికలో ప్రచురించ బడింది. ఆ తరువాత అంతర్జాల వార పత్రిక సహరి లో మూడు కథలు ప్రచురించ బడ్డాయి. ఇటీవల విశాలాక్షి పత్రిక వారు నిర్వహించిన పోటీలో సునామీ అనే కథకు బహుమతి లభించింది. భర్త, అన్నయ్య ప్రోత్సాహంతో కవితా సాహిత్యం మీద మక్కువ ఏర్పడి ఎన్నెన్నో కవితలు వ్రాసాను. పలుమార్లు పలురకాల పోటీలలో విజేతనయ్యాను. సాహిత్య రంగంలో ఉన్నత మజిలీలు చేరుకోవాలని అన్ని సాహిత్య ప్రక్రియలు ఇంకా బాగా వృద్ధి చేసుకోవాలని నా ఆకాంక్ష.



102 views0 comments

Comments


bottom of page