top of page

అనుబంధం

#Anubandham, #అనుబంధం, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #పిల్లలకథలు, #TeluguChildrenStories

Anubandham - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 23/04/2025

అనుబంధం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


అగ్రహారం హైస్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న పల్లవికి నాయనమ్మంటే ఇష్టం. శలవులప్పుడు, పండగలప్పుడు నానమ్మ తనకి బోలెడు దేముడి కథలు చెబుతుంది. తెలుగు వారాలు, నెలలు, నక్షత్రాలు, ఋతువులు, శతక పద్యాలు వల్లె వేయిస్తుంది. తలదువ్వి పెరట్లోని మల్లెమొగ్గలు కోసి దండ గుచ్చి జడలో ముడుస్తుంది. 


నాయనమ్మ చేతులు వణుకుతూంటాయి. కళ్లు సరిగ్గా కనిపించకపోయినా ఇంట్లో పనులు చేస్తూంటుంది. ఐనా అమ్మా నాన్నా నాయనమ్మని కసురు కుంటుంటారు. పెద్దమ్మ జబ్బు చేసి చచ్చిపోతే నాన్న అమ్మని పెళ్లి చేసుకున్నారని నానమ్మ చెప్పింది. 


ఒకసారి చేతిలోంచి టీ కప్పు జారి కిందపడి పగిలిపోతే అమ్మ తిట్టడం గదిలో ఉన్న పల్లవి విన్నది. అలాగే నాన్న కూడా నానమ్మ మీద చికాకు పడటం పల్లవి చూసింది. అమ్మా నాన్నా ఎప్పుడూ నానమ్మని ఎందుకు తిడుతూంటారో పల్లవికి అర్థమయేది కాదు. అపుడపుడు మామ్మ వరండాలో నులకమంచం మీద కూర్చుని ఏడవటం చూసేది. కారణమడిగితే చెప్పేది కాదు.. 


 గతంలో జరిగిన సంగతి ఏమంటే ఊరి కరణంగారి భార్య పార్వతమ్మ, భర్త చనిపోతే కొడుకులిద్దర్నీ పెంచి పెద్ద చేసింది. పెద్ద కొడుకు వేణు ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.. తల్లి అక్కడి వాతావరణంలో ఉండలేదని అగ్రహారంలో

తమ్ముడు సూర్యం దగ్గర ఉంచి డబ్బు పంపిస్తూంటాడు. 


అన్నయ్యని బాగా చదివించి తనని ఊరి పంచాయతీ గుమస్తాగా చేసిందని చిన్న కొడుకు సూర్యం తల్లి మీద అక్కసుతో సూటీపోటీ మాటలతో బాధ పెడతూంటాడు. భార్య చెప్పుడు మాటలు విని తల్లిని ఇంటికి దూరంగా ఉంచాలని ఆలోచించాడు. 


ఒకరోజు పల్లవి స్కూలు నుంచి వచ్చేసరికి ఇంటి గుమ్మం ముందు ఆటోరిక్షా ఆగి ఉంది. నాన్న ఇనపపెట్టెని చేత్తో పట్టుకుని రాగా వెనక నానమ్మ మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆటోలో కూర్చుంది. పల్లవికి ఏమీ అర్థం కాక నానమ్మని ఎక్కడికి తీసుకెల్తున్నారని తండ్రిని అడిగింది. 


నానమ్మ కొద్ది రోజులు తీర్థయాత్రలు చేసి వస్తుందని, మన బంధువులతో పట్నమెళ్లి రైలు ఎక్కుతుందని చెప్పి ఆటో ఎక్కి కూర్చున్నాడు. 


'నానమ్మా' అంటూ ఒడిలో తలపెట్టి ఏడుస్తుంటే తల నిమిరింది నానమ్మ. తల్లి వచ్చి పల్లవిని ఇంట్లోకి తీసుకెళ్లింది. ఆటో ముందుకెళ్లింది. 


చాలా రోజుల వరకు నానమ్మ రాలేదు. ఎప్పుడొస్తుందని పల్లవి తండ్రి నడిగితే, తీర్థయాత్రల నుంచి పెదనాన్న తీసుకెళ్లారని సర్ది చెప్పాడు. నానమ్మ జ్ఞాపకాలు వస్తున్నా కాల గమనంలో రోజులు గడుస్తున్నాయి. 


ఏడాది గడిచింది. పల్లవి తొమ్మిదో తరగతి కొచ్చింది. స్కూలు విహారయాత్ర సందర్భంగా పల్లవి క్లాసు విధ్యార్దుల్ని పట్నం తీసుకెళ్లారు ఉపాధ్యాయులు. అన్ని ప్రదేశాలు చూసిన తర్వాత చివరగా పిల్లల్ని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. 


ముసలి వయసులో వివిధ వయసుల వారు ఆశ్రమంలో ఉన్నారు. కొంతమంది చేతి కర్రల సాయంతో, చక్రాలకుర్చీల్లో కొందరు బయట సంచరిస్తూంటే ఇంకొందరు లోపల మంచాల మీద ఉన్నారు. 


ఆ రోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవ మైనందున ఆశ్రమ ముఖద్వారం, పరిసరాలు పూలతో చక్కగా అలంకరించారు. వృద్దాశ్రమ నిర్వాహకులు, పనిచేసే ఆయాలు కోలాహలంగా కనిపిస్తున్నారు. సందర్సకుల వత్తిడి ఎక్కువగా ఉంది. 


పల్లవి పాఠశాల ఉపాధ్యాయులు ఆశ్రమ నిర్వాహకుల అనుమతితో వృద్ధాశ్రమంలోని అన్ని విభాగాల్నీ చూపిస్తున్నారు. స్త్రీల విభాగం సందర్శనలో ఒక గదిలో మంచం మీద పల్లవి నానమ్మ దగ్గుతు కనబడింది. అది చూసి పల్లవి ఖిన్నురాలై పరుగున వెళ్లి అమాంతం నానమ్మ ఒళ్లో వాలిపోయింది. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. 


జరిగిన వృత్తాంతం విద్యార్థి పల్లవి ద్వారా విన్న ఉపాధ్యాయులు నిర్ఘాంతపోయారు.. సమాజంలో వృద్ధుల కిస్తున్న విలువ చూసి ముక్కున వేలేసుకున్నారు. అగ్రహారం తిరిగి వచ్చిన పాఠశాల ఉపధ్యాయులు, ప్రధానోపాద్యాయుడి ద్వారా పల్లవి అమ్మా నాన్నలకు కౌన్సెలింగ్ చేయించి 

పార్వతమ్మను ఇంటికి రప్పించగా ప్రేమాను రాగాలతో చూసుకుంటున్నారు. 


పల్లవి ముఖంలో ఆనందం కనబడింది. 

 

 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page