#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #అనుకున్నదొక్కటి, #Anukunnadokkati, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Anukunnadokkati - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 06/01/2025
అనుకున్నదొక్కటి - తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
"ఒరేయ్ రాఘవా" అంటూ వంటింట్లో నుండి పిలిచింది మహాలక్ష్మి.
ఆరోజు వార్తాపత్రిక చదువుతున్న రాఘవ, తల్లి పిలుపుకి వెంటనే లేచి, "ఏంటమ్మా అంటూ తల్లి దగ్గరకు వచ్చాడు.
కొడుకు వైపే నిశితంగా చూస్తూ, " పెరవలి నుండి ఆదిశేషయ్య కబురు పెడ్తున్నారురా, వారి మూడవ కూతురు శ్రీలక్ష్మి ని నీకివ్వాలని, పెళ్లిచూపులకు రమ్మంటున్నారురా అబ్బాయీ!"
"అమ్మా, మళ్లీ అదే పాటా? కొత్తగా చెపుతున్నట్లు. నీకు ఎన్నో సార్లు చెప్పాను నా అభిప్రాయాన్ని. అయినా కూడా ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటావు”, కాస్త విసుగునిండిన స్వరంతో అన్నాడు.
"ఇలా ఎన్నాళ్లురా రాఘవా. నేను ఉన్నంత కాలం ఫరవాలేదు. ఆ తరువాత ఎవరూ తోడులేకుండా ఎలా బ్రతుకుతావని నా బాధ. "
"అమ్మా ఎన్ని సార్లు చెప్పాలి, నీకు? నేను పెళ్లి చేసుకుంటే గోపాలం పరిస్తితి ఏమిటి? వచ్చిన అమ్మాయి మన గోపాలాన్ని బాగా చూస్తుందన్న నమ్మకం ఏమిటి? నాకైతే నమ్మకం లేదమ్మా, నిక్షేపంలా ఆరోగ్యంగా ఉండే గోపాలానికి హఠాత్తుగా మతి స్తిమితం తప్పడం, వాడి పిచ్చి ప్రేలాపనలన్నింటినీ ఆ వచ్చే అమ్మాయి భరిస్తుందా? విడికాపురం పెడదామని నన్ను పోరితే!? సొంత తోడబుట్టిన వాళ్లే బాధ్యతలకు భయపడుతూ దూరంగా ఉంటున్నపుడు, ఎక్కడో పరాయింటి నుండి వచ్చిన అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవడం అవివేకమమ్మా. అందుకనే నేను పెళ్లి చేసుకోను. ఇంకెపుడూ నా పెళ్లి ప్రస్తావన తీసుకురా”కంటూ సమాధానమిచ్చాడు.
"నీవన్నీ లేనిపోని శంకలు రాఘవా. అంతా బాగానే ఉంటుందని ఆలోచించాలేగానీ, ముందే మనం ఊహించేసుకుంటే ఎలాగరా?"
"అమ్మా నేను చెపుతున్నది విను. నీవు బ్రతికున్నంత కాలం వాడిని చూస్తావు. తరువాత నా భార్య వాడిపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే తరువాత వాడి పరిస్తితి ఏమిటమ్మా, " అనగానే ఆవిడకు దుఖం ముంచుకొచ్చేసి చీరచెంగుతో కళ్లు తుడుచుకుంటూ లోపలకు వెళ్లిపోయింది.
----
కోరుమిల్లి గ్రామంలో ఉంటున్న రమణయ్యకు, ఆయన భార్య మహాలక్ష్మి కి ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. పెద్దవాడు నరసింహం. ఆ తరువాత ఇద్దరు ఆడపిల్లలు కామేశ్వరి, వరలక్ష్మి. వారి తరువాత రాఘవ, ఆ తరువాత ఆఖరివాడు గోపాలం.
గోపాలం, ఎస్ ఎస్ ఎల్ సి చదివేరోజుల్లో ఒక రోజు మంచి ఎండలో స్కూల్ నుండి మధ్యాహ్నమే వచ్చేసాడు.. కళ్లు చింత నిప్పుల్లా ఉన్నాయి.. రావడంతోటే పడుకుండి పోయాడు.. అలా పడుకోవడం పడుకోవడం పదిరోజులు తీవ్ర జ్వరం తో మంచాన పడ్డాడు.. ఏదో సంధి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతో అర్ఘరాత్రిళ్లు లేచిపోయి బయటకు వెళ్లిపోయేవాడు. ఇంట్లోవాళ్లు అతన్ని పట్టుకుని తెచ్చేవారు.. ఎవరినీ గుర్తుపట్టడం మానేసాడు.. అప్పట్లో ఏదో గాలి సోకిందంటూ మంత్రాలు తంత్రాలూ వేయించడం, దానివల్లకూడా నయంకాకపోతే డాక్టర్లకు చూపిస్తే, మతి స్తిమితం తప్పిందని చెప్పారు. వాళ్లూ, వీళ్లూ చెప్పడంతో ఎన్నా చిట్కా వైద్యాలు చేయించారు. హోమియోపతి వాడారు. అప్పడికింకా భారతదేశానికి స్వాతంత్రం రాని రోజులు. వైద్యరంగం ఇంకా అభివృధ్ది సాధించలేదు. ఏ విదేశాలకో తీసుకు వెడ్తే నయమయ్యేదేమో కానీ, అంతటి స్తితిగతులు లేని కుటుంబం వారిది.
అంత ఆరోగ్యంగా ఉండే గోపాలం అలా అయిపోవడానికి కారణం ఏమిటో అర్ధం కాలేదు.. ఎవరితోనో తీవ్రంగా తగువు పడి ఉండచ్చని, లేదా ఏదైనా అనుకోని సంఘటన అతని మనస్సులో తీవ్ర ప్రభావం చూపించి ఉండవచ్చని రక రకాల ఊహాగానాలు చెలరేగాయి.. పసివాడికంటే కనాకష్టంగా మారిపోయింది అతని పరిస్తితి. పొద్దుటే పళ్లు తోమించడం, స్నానం చేయించడం, బట్టలు తొడగడం, భోజనం తినిపించడం, బాత్రూమ్ కు తీసుకువెళ్లడం అవన్నీ రాఘవ, తల్లే చూసుకునేవారు.
పెద్దవాడు నరసంహానికి పెళ్లి అయిపోవడం, నిడదవోలు రైల్వే స్టేషన్ లో ఉద్యోగం మూలాన భార్య రాజ్యలక్ష్మి తో నిడదవోలులో కాపురం పెట్టాడు.
ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్లు అయి అత్తవారింటికి వెళ్లిపోయారు.
గోపాలం అంటే తగని ఇష్టం ఇంట్లో అందరికీ. ఇంట్లో హడావుడిగా తిరిగేస్తూ అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. అందరూ అతన్ని లక్ష్మణుడంటూ ముద్దుగా పిలిచేవారు. అటువంటి గోపాలం దుస్తితికి తల్లడిల్లిపోయి బెంగతో రమణయ్య చనిపోయాడు.
అక్కగార్ల పురుళ్లూ, పుణ్యాల బాధ్యత అంతా రాఘవ మీదే పడింది.
రమణయ్య చనిపోయేముందు, కాలువ ఒడ్డుకి దగ్గరలో వారు ఉంటున్న ఆరుసెంట్ల స్తలంలో అప్పట్లో కట్టుకున్న పెంకుటింటిని రాఘవ పేరున వ్రాసి గోపాలం బాధ్యత అంతా రాఘవదేనంటూ విల్లు వ్రాయించాడు.
వారింటి చుట్టూ చాలా ఖాళీ స్తలం ఉన్న మూలాన ఆ స్తలంలో రక రకాల కాయగూరల చెట్లు, పాదులు, కొబ్బరి మామిడి చెట్లు, అరటి లాంటి వెన్నో వేసాడు రాఘవ. కాలువ కి అతి సమీపంలో వారిల్లు ఉన్నమూలాన నీటికి కొరత లేదు.. పండించిన కాయగూరలు, పండ్లు, కొబ్బరి మామిడిని ఆ ఊరి సంతకు పంపి వ్యాపారం చేసేవాడు రాఘవ.
మామగారు తన భర్తకు ఆస్తి ఏమీ ఇవ్వలేదని రాజ్యం మూతి ముఫైవంకరులు తిప్పుతూ.. .. "అదేమి బుధ్దండీ మీ నాన్నగారిదీ, ఆస్తి మీ తమ్ముడి పేరు వ్రాయడమేమి”టని యుధ్దానికి దిగింది.
నరసింహం కూడా భార్యా విధేయుడే.. "పోనీలేవే రాజ్యం, మా నాన్న ఆస్తి నాకిస్తే నా పిచ్చి తమ్ముడిని, రాఘవనీ, మా అమ్మను మనమే చూడాలికదే, ఇప్పుడు మనకు ఆ బాధ్యత లేదు. సంతోష పడు. అసలే నీ ఓపిక అంతంత మాత్రమే, వాళ్లందరినీ సాకే శ్రమ నీకు తప్పింది కదే” అంటూ ఉరడించాడు.
రాఘవ తమ్ముడిని, తల్లిని చూసుకుంటూ, కూరగాయలు పండిస్తూ, తన ఇంటిలోనే వయోజనులకు ఒక స్కూల్ ఏర్పాటుచేసి, సాయంత్రాలు వారికి చదువు చెప్పేవాడు.. వాళ్లు రాఘవ మీద గౌరవంతో పాలు, పళ్లూ, ధాన్యం, పప్పులూ ఉప్పులూ అవీ ఇస్తూ ఉండేవారు.. అదీగాక రాఘవకి హోమియో వైద్యం తెలుసు.. ఊళ్లో ఉన్నవారు అతని దగ్గరకు చిన్నా చితకా వైద్యానికి వచ్చేవారు.. ఖాదీ ఏకులు కొనిఖాళీ సమయాల్లో తెచ్చి రాట్నం మీద నూలు ఒడికి, దగ్గరలోనున్న పట్టణానికి తీసుకెళ్లి అమ్మేవాడు.. తమ్ముడిమీద విపరీతమైన ప్రేమ. నాన్నా గోపాలం అంటూ ఎంతో ప్రేమగా ఓపిగ్గా పసిపిల్లాడిలా చూసుకునేవాడు.
కొన్ని సంవత్సరాలకు తల్లి చనిపోయింది కొడుకులమీద బెంగతో అనారోగ్యం తెచ్చుకుని.. రాఘవకి గోపాలమే తోడుఅయ్యాడు. కనీసం అన్నగారు, వదినగారు మా దగ్గరకు వచ్చి కొన్ని రోజులు ఉండమని కూడా అనని స్వార్ధపరులు. రాఘవ పిచ్చి తమ్ముడ్ని చూసుకుంటూ బ్రహ్మచారిగా ఉండిపోయాడు.. ఆ ఊరి వాళ్లకు రాఘవ అంటే ఎంతో గౌరవం.. తమ్ముడికోసం అతని జీవితాన్నే ఫణం పెట్టిన త్యాగమూర్తి అని. రాఘవ నిర్వహించే వయోజనా శిక్షణ కేంద్రానికి గవర్నమెంట్ గ్రాంట్ లభించడమే కాకుండా అతనికి ప్రభుత్వం ప్రతీనెల జీతం మంజూరు చేసింది.
మరి కొన్ని సంవత్సరాలకు గోపాలం పరిస్తితి విషమించింది.. తమ్ముడి పరిస్తితిని చూస్తూ తల్లడిల్లిపోయేవాడు రాఘవ. కొన్నినెలల తరువాత జబ్బు తీవ్రమై మంచంపట్టి చివరకు చనిపోయాడు. పదహారేళ్ల ప్రాయంలో మతిస్తిమితం తప్పి పిచ్చివాడైన తన చిన్నారి తమ్ముడైన గోపాలానికి నలభై సంవత్సరాల వయస్సు వచ్చేవరకు అన్నీ తానై ఒక పసిపిల్లవానిగా చూసుకున్న రాఘవ ఎంతటి నిస్వార్ధ జీవి. తమ్ముడి మరణానికి పసిపిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు.. ఆ దృశ్యాన్ని చూసిన ఊరి జనానికి కూడా కన్నీళ్లు ఆగలేదు. రాఘవ ఒంటరివాడైనాడు..
రాఘవ తను ఉంటున్న ఇంటిని ఒక చిన్న డాబా ఇల్లుగా మార్చి ఇంటిని రెండు పోర్షన్లుగా చేసాడు.
రాఘవ చిన్నప్పటినుండి గాంధేయవాది.. పరోపకారమే ఊపిరిగా భానించే వ్యక్తే కాకుండా చక్కని క్రమ శిక్షణతో ఆరోగ్యం పట్ల నియమ నిబంధలను పాటిస్తూ ఆరోగ్యంగా దృఢంగా ఉండేవాడు.
ఒకరోజు ఆ ఊరి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ కి లెక్కల టీచర్ గా ఎపాయింట్ అయి కొత్తగా వచ్చిన ఒక యువతికి ఇల్లు కావలసివస్తే ఆ ఊరివారెవరో రాఘవ దగ్గరకు ఆమెను తీసుకొచ్చారు.. ఒంటరి యువతి, బాల వితంతవు అని తెలిసి జాలిపడి తన ఇంట్లో ఖాళీగా ఉన్న ఒక చిన్నగదీ వసరా చూపిస్తూ అందులో ఉండవచ్చని చెప్పాడు. ఆ యువతి అతని మంచితనానికి సహృదయతకు ధన్సవాదాలు సమర్పించుకుంది.
ఆ రోజు తోటలో పనిచేస్తున్న రాఘవ, కాళ్లు కడుక్కుంటూ, నూతిదగ్గర జారి పడిపోవడంతో కాలు ఫ్రాక్చర్ అయింది.. కొన్నివారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్నారు.. ఆ స్తితిలో లెక్కల టీచర్ అయిన లలిత రాఘవ కి ఎంతో సహాయంగా ఉంటూ సేవ చేసింది. ఆమె మంచితనం, సహృదయత రాఘవని ఆకర్షించాయి. ఎవరూలేని అనాధ అయిన లలిత పట్ల ఏదో తెలియని అనురాగం కలిగింది.. ఆకర్షణ, శారీరక వాంఛ కంటే ఆ అమ్మాయి జీవితానికి ఆసరాగా ఉండాలని నిశ్చయించుకున్నాడు.. లలిత కూడా అభ్యంతరం పెట్టక సమ్మతించడంతో సింపుల్ గా వివాహం చేసుకోవాలని అక్కలకూ, అన్నగారైన నరసింహానికి ఉత్తరాల ద్వారా తెలియపరుస్తూ, వివాహానికి వచ్చి ఆశీర్వదించమనీ కోరాడు.
అసలే మామగారి ఆస్తినంతా అనుభవిస్తున్నాడని అసూయతో రగిలిపోతున్న రాజ్యం, "అబ్బో.. .. !? హేవిటీ.. . !? యాభైయో వడిలో పడ్డాక, మరికొద్ది కాలంలో రిటైర్ అవబోతున్న మీ తమ్ముడికి ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలనే బుద్ధి పుట్టడం ఏమిటండీ, పాడు ఆలోచనలు కాకపోతే”నంటూ బుగ్గలు నొక్కుంది. ఆ స్వరంలో బోలెడంత ఈసడింపు.
నరసింహానికి ఎక్కడో మనస్సులోతుల్లో తమ్ముడిపట్ల అణగారిపోయిన ప్రేమ కాస్తంత కరిగిందో ఏమోగానీ, భార్య ఈసండింపులకు సమాధానం ఇస్తూ, "పోనీలేవే రాజ్యం, రాఘవ ఒక విధంగా పెళ్లి చేసుకోవడమే మంచిది. లేకపోతే రేపు వాడికి కాలూ, చేయీ ఆడక అనారోగ్యంపాలై, మనల్ని ఆశ్రయిస్తే వాడికి చాకిరీ మనం చేయగలమటే!" అనగానే భర్త దూరదృష్టికి సంబర పడింది రాజ్యం.
కానీ రాజ్యం ఊహించని అద్భుతం జరిగిపోయింది.. పెళ్లైన సరిగ్గా ఒక సంవత్సరానికల్లా రాఘవ, లలిత దంపతులకు కవలపిల్లలు పుట్టారు.. ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయికి తల్లిపేరు మహాలక్ష్మి, పిల్లవానికి తమ్ముని పేరు గోపాల్ అని పెడ్తున్నామని, అన్నగారిని వదినగారిని బారసాల మహోత్సానికి రమ్మనమంటూ ఆహ్వానం పంపాడు రాఘవ.
ఆ కబురువిన్న రాజ్యం " ఆ.. .. .. .. అంటూ కళ్లు తేలసింది " !! "సిగ్గూ, శరం లేకుండా ఇప్పుడు పిల్లలేమిటీ మీ తమ్ముడి”కంటూ భర్త దగ్గర ఈసడిస్తూ మాట్లాడింది.
"పోనీలేవే రాజ్యం, మనకు పిల్లలెలాగూ కలగలేదు. రాఘవ పిల్లలే మన పిల్లలు. పాపం మా మరదలు లలిత స్కూల్ కు వెడుతూ ఇద్దరరపిల్లలనూ సాకడం కష్టం కదే. వాళ్ల పిల్లనో, పిల్లాడినో తెచ్చుకుని మనం పెంచుకుందాం”. భర్త ఆలోచనకు రాజ్యం మురిసిపోయింది. కానీ, భార్యావిధేయుడైనా నరసింహం మనసున్న వాడే. తాత్కాలికంగా భార్యను సముదాయించేడేగానీ, ఏ తల్లితండ్రులకూ తమ పిల్లలు బరువుకాదన్న సత్యాన్ని తెలుసున్నవాడు. రాజ్యం లాంటి స్వార్ధపూరిత వ్యక్తి ఒడిలో రాఘవ పిల్లలు పెరగకూడదనుకున్నాడు మనస్సులో.
***
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments