అనుమానం – పెనుభూతం
- Yasoda Pulugurtha
- Apr 5
- 5 min read
#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #అనుమానంపెనుభూతం, #AnumanamPenubhutham, #WorkingWomenProblems, #కొసమెరుపు

Anumanam Penubhutham - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 05/04/2025
అనుమానం – పెనుభూతం - తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
ఆరోజు అవంతీ గర్ల్స్ హైస్కూల్ హెచ్.ఎమ్ శారదాదేవి ఒక ఒక కొత్త టీచర్ ని స్టాఫ్ కి పరిచయం చేయడానికి టీచర్స్ రూమ్ లోకి వచ్చి అక్కడ టీచర్స్ ని ఉద్దేశిస్తూ, “డియర్ టీచర్స్, “ఈవిడ మిసెస్ పరిమళాశేఖర్!”. నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ లకు సోషల్ స్టడీస్ టీచ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ మీద వచ్చారంటూ చెప్పింది. నలభై రెండు, నలభై మూడు ఏళ్ల వయసు ఉండవచ్చేమో కానీ అంత వయస్సున్నదానిలా కనపడడం లేదు.
చక్కని ఎత్తులో సూపర్ నెట్ పింక్ కలర్ చీరలో ఎంతో అందంగా హుందాగా ఉంది. ఆమె ఒత్తైన పొడవైన జడలో కనకాంబరాల మాల వేళ్లాడుతోంది. చక్కని కనుముక్కుతీరులో ఆకర్షణీయంగా ఉంది. హెచ్.ఎమ్ అక్కడున్న టీచర్స్ తో ఈవిడకేమైనా సహాయం కావాలంటే అందరూ సహకరించండంటూ ఆవిడను పరిచయం చేయి తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్లిపోయారు. పరిమళ చిరునవ్వుతూ అక్కడున్న టీచర్స్ అందరికీ నమస్కారం చేసి తను అదివరకు పనిచేసిన స్కూల్ గురించి, అక్కడ టీచర్స్ గురించి చెప్పింది. అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా, ప్యూన్ వెంటరాగా తన క్లాస్ గదివైపు వెళ్లిపోయింది.
పరిమళ తన పనేమిటో తాను చేసుకుపోతూ చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. అనవసరంగా క్లాస్ లేని సమయంలో ఇతర టీచర్లతో బాతాఖానీ కొట్టడం, ఇంకొకరు స్వవిషయాలు తెలుసుకోవడం లాంటి కుతూహలం కనపరచేది కాదు. ఖాళీ సమయంలో వార్తా పత్రికలు చదవడం, లేకపోతే స్కూల్ లైబ్రరీ నుండి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు రిఫర్ చేస్తూ ఉండేది. పిల్లలకు శ్రధ్దగా పాఠాలు చెపుతూ, అతి కొద్దికాలంలోనే మంచి పేరుని సంపాదించింది.
అదే స్కూల్ లో పనిచేస్తోంది సుమతీ టీచర్. ఆవిడ తెలుగు సబ్జెక్ట్ టీచ్ చేస్తుంది. ఎంతో సాంప్రదాయంగా ఉంటానని, మిగతా టీచర్లలా కాదన్నట్లుగా ప్రవర్తిస్తుంది. అందరికీ నీతిబోధలు బోధిస్తుంది. తాను చాలా సంస్కారవంతురాలన్నట్లు, మిగతా అందరిలో ఏవో లోపాలున్నట్లుగా మాట్లాడుతుంది. వాళ్ల వ్యక్తిగత విషయాలన్నీ ఈవిడకే కావాలి. అక్కడ విషయాలెక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చేరవేర్చే గుణం ఉంది. పైకి కనిపించే రూపం ఎంత సాంప్రదాయంగా ఉన్నా, మనస్సునిండా విషమే. పరిమళ ను చూస్తే ఏదో ఆపుకోలేని ఆక్రోశం. రోజూ ఇంత బాగా అందంగా తయారవడానికి మీకు టైమ్ ఎక్కడటుంటుంది పరిమళ గారూ, వంటవార్పూ మీ వారు చేస్తారేమో, అందుకే మీరు అంత తీరికగా తయారయ్యి స్కూల్ కి వస్తారంటూ కాస్త హేళన నిండిన స్వరంతో మాట్లాడుతుంది. పరిమళ చిరునవ్వు నవ్వి మౌనం వహిస్తుంది.
ఆ రోజు పరిమళ లీవ్ తీసుకుంది.
సుమతీ టీచర్ హడావిడిగా టీచర్స్ రూమ్ లోకి వచ్చింది. అది లంచ్ టైమ్. అందరూ తమ తమ టిఫిన్ బాక్స్ లను తెరవబోతున్నారు. సుమతి కూడా వాళ్ల పక్కనే కూర్చొంది. ఆవిడ ముఖంలో ఒక అద్భుతమైన సమాచారాన్ని తెలుసుకున్నానన్న గర్వం, ఒక రకమైన ఆనందం తాండవిస్తోంది.
“ఇదిగో ఈ విషయం మీరు విన్నారా?”
“పరిమళ భర్త పెరాల్సిస్ పేషంటుట!” బెడ్ మీద నుండి లేవలేడుట. ఈవిడగారు స్కూల్ కి వచ్చేస్తుంది కదా, మరి ఆయన్ని చూడడానికి ఒక కేర్ టేకర్ ని పెట్టిందిట. ఇంకా పిల్లా, పీచూ ఎవరూ లేరట.
మరి ఈవిడ ను రోజూ స్కూల్ కి డ్రాప్ చేయడం, పిక్ అప్ చేసుకోడానికి వచ్చే అతను ఎవరో మరంటూ సర్ కాష్ట్ గా అంది. అందరు టీచర్స్ అవునా పాపం అంటూ సానుభూతి చూపారు.
ఎందుకంత సానుభూతి? భర్త రోగిస్టి, మరి ఈవిడ ఇలా బయట మొగాళ్లతో స్నేహాలు.
“మీకీ విషయం ఎలా తెలిసింది సుమతిగారూ?” పద్మజా టీచర్ అడిగింది.
“మనసుంటే వేయి మార్గాలు పద్మజా.” ఈవిడ ఇక్కడ చేరినప్పటినుండి నాకేదో అనుమానంగానే ఉంది. ఆ కట్టూ బొట్టూ, సంసారం చేసేదానిలా ఏమైనా ఉందా?” అసలు మనం అందరం ఎంత హడావిడి పడుతూ చీర చుట్టబెట్టేసుకుని, కనీసం ముఖానికి పౌడర్ కూడా వ్రాసుకోకుండా స్కూల్ కి టైమ్ కి వచ్చి పడతామా, ఆవిడగారు ఎంత చక్కగా స్టైల్ గా బైక్ మీద వస్తుందో చూస్తున్నారు కదా. పైగా ఆ అబ్బాయి భుజం పై చేతులేసి మరీను. నేను రోజూ అతను డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం చూస్తూనే ఉంటాను. ఈవిడేదో అనడం, అతను ఈమె భుజం పై చేతులేసి మాట్లాడడం “అబ్బబ్బ, దరిద్రం అనుకో.
ఇదే దరిద్రాన్ని నేను బయట కూడా చూస్తున్నాను. ఎక్కడపడితే అక్కడ వీరిద్దరే. నవ్వుతూ తుళ్లుతూ. మొన్నోరోజు కూరగాయల మార్కెట్ దగ్గర, మరోరోజు ఐస్ క్రీమ్ పార్లర్ లోనూ కూడా కనపడ్డారు. కేరక్టర్ లేనివాళ్లు స్కూల్ విధ్యార్ధులకు ఏమి బోధిస్తారు, నా ముఖం.
ఇంతకీ ఆవిడ భర్త విషయం ఎలా తెలిసిందని కదూ, మీ అనుమానం. చెపుతా, చెపుతా, అక్కడకే వస్తున్నాను.
నిన్న సాయంత్రం రత్నదీప్ సూపర్ మార్కెట్ కి వెళ్లాను, గ్రాసరీ తీసుకుందామని. సడన్ గా సుమతీ అని ఎవరో పిలిచే సరికి తలెత్తి చూసాను. మా వదిన చెల్లెలు, పక్కనే మరొకావిడ. ఆవిడకు నన్ను పరిచయం చేస్తూ, నేను ఫలానా స్కూల్ లో తెలుగు టీచరి గా పనిచేస్తున్నానని చెప్పేసరికి, ఆ పక్కనే ఉన్నావిడ “అరే మా పరిమళ కూడా అదే స్కూల్, ఆరు నెలలైంది చేరి అని చెప్పింది. వెంటనే నేను అడిగాను, ఆవిడ భర్త ఏమి చేస్తారని. ఒక్క క్షణం ముఖం బాధగా పెట్టి పాపం పరిమళ భర్త పెరాలసిస్ పేషెంట్ అని చెప్పింది.
అలా పరిమళ భర్త గురించి తెలిసిందంటూ హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. నిన్నటి సాయంత్రం నుండి కడుపులో దాచుకున్న విషయం, రాత్రంతా కడుపుబ్బరం చేసి చాలా బాఘపడిపోయింది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు స్కూల్ కి వెళ్లి ఈ కడుపుబ్బరాన్ని తగ్గించుకుందామా అని ఎదురు చూస్తోందేమో, అప్పటికి సుమతి స్తిమితపడింది.
చాలా మంది టీచర్స్ అయ్యోపాపం అని సానుభూతి చూపించారు కానీ ఏ ఒక్కరూ మిగతా విషయాలమీద ఆసక్తి చూపకపోవడంతో సుమతి కాస్త నిరుత్సాహ పడింది. ఎవరైనా ఏదైనా అంటే చిలవలు పలవలు అల్లి చెప్పాలని ఎదురుచూచింది. మన హెచ్.ఎమ్ కి చెపుతానీ విషయం అనేసరికి ప్రభావతి టీచర్ వెంటనే స్పందించారు.
“చూడండి సుమతీ, మనకు ఆవిడ వ్యక్తిగత విషయాలు అనవసరం. పదే పదే తెలుసుకుని ప్రచారం చేయడృ కూడా సంస్కారం అనిపించుకోదు. ఆవిడ తన వృత్తికి న్యాయం చేస్తోందా, లేదా అని ఆలోచించాలి తప్పించితే ఆవిడ స్వవిషయాలు మనకెందుకండీ అనేసరికి సుమతి ముఖం నల్లగా మాడిపోయింది.
ఆ రోజే కాదు, మరో నాలుగు రోజులు వరకు రాలేనని పరిమళ లీవ్ లెటర్ పంపింది.
మరో రెండురోజులు గడచిపోయాయి. సుమతీ టీచర్ కి ఏ మాత్రం ఉత్సాహంగా లేదు. పిల్లల పాఠాలపై శ్రథ్ద పెట్టలేకపోతోంది. “ఏమైంది పరిమళ కి అన్న ఆరాటం, ఏదో కూపీని బయటకు లాగాలన్న ఉత్సుకత.” ఏ విషయమూ తెలియడం లేదు.
అదే రోజు సాయంత్రృ ప్రభావతి టీచర్ బంధువు ఒకామెకు ఆరోగ్యం బాగాలేదని, హాస్పటల్ లో చేర్చారన్న విషయృ తెలిసి ఆవిడ స్కూల్ అయిపోగానే హాస్పటల్ కి వెళ్లింది. ఆవిడ తన బంధువుని పరామర్శించి వస్తున్నపుడు సడన్ గా పరిమళ ఎదురైంది.
పరిమళను చూడగానే ప్రభావతి ఆశ్చర్యపోతూ, “ఏమిటి మీరిక్కడ అని అడిగానే, పరిమళ ఏమీ మాట్లాడకుండా ప్రభావతిని ఒక రూమ్ లోకి తీసుకువెళ్లింది.
అక్కడ మంచంమీద ఒక ముసలాయన నిద్రపోతున్నాడు.
“మీ నాన్నగారా, ఏమైందంటూ అడిగింది ప్రభావతి?”
'కాదు మా వారే అనేసరికి తృళ్లిపడింది”.
మెదడులో ఏదో అనుమానం, సుమతి మాటలు గుర్తొచ్చాయి. సుమతి చెప్పిందంతా నిజమా? ఒక్క క్షణం మీమాంసలో కొట్టుకుంటున్న తరుణంలో, పరిమళ చెప్పసాగింది.
“ఆయన మా బావగారు అంటే మా అక్క భర్త.” అక్కకి బాగా సుస్తి చేసి చనిపోతే కొన్ని అనివార్య కారణాలవల్ల మా బావను పెళ్లి చేసుకున్నాను. పెరాల్సిస్ వచ్చిన కారణంగా ఏభై అయిదు సంవత్సరాలకే అలా అయిపోయారు. వారం రోజుల నుండి అసలు బాగోపోతే ఇక్కడ అడ్మిట్ చేసాం.”
ఇంతలో, “పిన్నీ అంటూ తరచుగా పరిమళ కోసం స్కూల్ కి వచ్చే ఆ అబ్బాయి ప్రవేశించాడు. ఇరవై అయిదు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయేమో, ఎత్తుగా, అందంగా ఉన్నాడు.
“పిన్నీ, నాన్నకెలాగుంది అని ఆత్రంగా అడుగుతూనే” ఆ పేషెంట్ మంచం దగ్గరకు వెళ్లాడు.
“చనిపోయిన మా అక్క కొడుకు భరణి, నా కొడుకంటూ” చెప్పింది.
ప్రభావతి షాకు నుండి తేరుకునే సరికి కొన్ని నిమిషాలు పట్టింది.
మా అక్క చనిపోయేసరికి వాడు ఏడు సంవత్సరాల పిల్లాడు. తల్లిగురించి బెంగపడి, చనిపోతాడేమో అనుకుని భయపడ్డాను. ఆ తరుణంలో వాడిని బ్రతికించుకోడానికి వాడికి తల్లినయ్యాను’.
ప్రభావతికి పరిమళ మాటలేమీ వినపడం లేదు. ఇటువంటి మంచి మనసున్న అమాయకురాలి మీదా ఇన్ని అభాండాలు? అక్క కొడుకు కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన పరిమళ ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు తామంతా అల్పులే. ఈ సమాజం ఎంత నీచంగా ఆలోచిస్తుంది? సుమతి లాంటి చీడ పురుగులు ఉన్నంత కాలం ఈ సమాజం బాగుపడదనుకుంటూ, పరిమళకు ధైర్యం చెప్పి, భారంగా ఇంటికి తిరిగి వచ్చింది.
***
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


Comments