top of page

అనురాగ దేవత అమ్మ

Writer's picture: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AnuragaDevathaAmma, #అనురాగ దేవత అమ్మ, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 6

Anuraga Devatha Amma - Somanna Gari Kavithalu Part 6 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 26/01/2025

అనురాగ దేవత అమ్మ - సోమన్న గారి కవితలు పార్ట్ 6తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అనురాగ దేవత అమ్మ

----------------------------------------

అమ్మ జోలపాటలో

ఆమె చెప్పు మాటలో

తేనియలే జాలువారు

ప్రేమలొలుకు నోటిలో


మాతృమూర్తి మనసులో

ప్రేమ నదులు ప్రవహించు

ఆమె చల్లని చేతిలో

దీవెనలే ఉదయించు


అమ్మ అనే పిలుపులో

అనురాగము కురిసేను

ఆమె శుద్ధ తలపులో

పరిమళాలు విరిసేను


అమ్మ ఉన్న ఇంటిలో

వెలుగులే నాట్యమాడు

ఆమె ఉన్న లోకంలో

నాకమే ఉండు చూడు


దివ్వెలా త్యాగమూర్తి

పువ్వులా పంచు స్ఫూర్తి

దివి నుంచి భువికొచ్చిన

అనురాగ దేవత అమ్మ

















అమ్మ ఇంటి దీపము

----------------------------------------

అమ్మ ఇంట ఉండగా

దీపాలే దండగా

దేదీప్యమానమై

గృహం వెలుగు మెండుగా


అమర ప్రేమ పంచగా

త్యాగగుణం పెంచగా

జగమంతా అమ్మమయము

అవుతుది దేవాలయము


ఆమె లేక ఈ లోకము

నిండి ఉండు కడు శోకము

అమ్మ ఉంటే నాకము

వద్దు వద్దు అవివేకము


దిద్దుతుంది కుటుంబము

పంచుతుంది మమకారము

అమ్మ పాత్ర అమోఘము

ఆమె సృష్టికధారము


అమ్మ వంటి త్యాగమూర్తి

అవనిలోన ఉండునా!

ఆమె చూపు ఘన స్ఫూర్తి

అన్వేషిస్తే దొరుకునా!















కన్నవారి రుణము తీర్చలేనిది!

----------------------------------------

గుండెలోని ప్రేమలు

ఎండమావులాయెను

కన్నవారి పాలిట

శాపంగా మారెను


కొడుకులుండి కూడా

అనాథ ఆశ్రమాలు

పుట్ట గొడుగుల వోలె

అడుగడుగునా వెలసెను


అమ్మానాన్నలపై

గౌరవము అడుగంటెను

వారు చూపు త్యాగము

గంగలోన కలిసెను


తల్లిదండ్రుల రుణము

ఎవరు తీర్చలేనిది

ఈ నిజం గ్రహిస్తే

ఉండదు నిర్లక్ష్యము











నాన్న అన్నింటి కన్న మిన్న

----------------------------------------

కుటుంబాన అధిపతి

ఖరీదైన బహుమతి

కనిపించే దేవుడు

కన్న తండ్రి భానుడు


బాధ్యత గల యోధుడు

నాన్న త్యాగమయుడు

అహర్నిశలు శ్రమించే

కుటుంబ పోషకుడు


సదా పూజనీయుడు

నాన్న ప్రేమామయుడు

తన బిడ్డల కోసము

పాటు పడును సతతము


పిల్లలు జీవితాన

అభివృద్ధి చెందితే

నాన్నెంతో పొంగును

మీసాలు మెలేయును


నాన్న ఇంటికి అండ

బలీయమైన కొండ

సదన వనంలోన

పరిమళాల పూదండ


నాన్న కంటే మిన్న

జగతిలో లేదన్న

వారితో అభివృద్ధి

ఇంటిలోన సమృద్ధి











నాన్న ఒక నమ్మకము

----------------------------------------

తండ్రి మనసు ఎరిగితే

త్యాగము కన్పించును

గుండెపై ఒరిగితే

ప్రేమ ధ్వని విన్పించును


చేతితో పట్టుకుని

ముద్దుగా నడిపించును

కళ్ళలో పెట్టుకుని

భద్రంగా కాచును


నాన్న గారి కోపము

క్షణ కాలముండును

దాని వెనుక మాత్రము

క్రమశిక్షణ ఉండును


నాన్నంటే నమ్మకము

బాగు చేయు జీవితము

భవితకిల భరోసా

గౌరవించు అమేషా











రియల్ హీరో నాన్న

---------------------------------------

శ్రమించును అనునిత్యము

పోషించును కుటుంబము

నాన్న గారు కల్పతరువు

గృహంలోన ఆదరువు


మోయును ఇంటి భారము

అందించును ఆనందము

తిరుగులేని నాయకుడు

దక్షత గల పాలకుడు


అవనిలో నాన్న గారు

అపురూపము వారి తీరు

త్యాగంలో సాటిలేరు

వెదికినా కానరారు


మాటేమో!కాస్త కరకు

మనసేమో తీపి చెరుకు

వర్ణింపనెవరితరము!

నాన్న ప్రేమతత్వము















శ్రేష్టమైనది స్నేహము

---------------------------------------

మధురమైన స్వప్నము

మంచి వారి స్నేహము

కోరుకొనును క్షేమము

లేదు అందు క్షామము


వికసించిన పద్మము

వెలిగించిన దీపము

సృష్టిలోన స్నేహము

శ్రేష్టమైన హేమము


కడిగినట్టి ముత్యము

ఖరీదైన రత్నము

దేవుని బహుమానము

బ్రతుకులో ప్రకాశము


పవిత్రమైన బంధము

జీవితాన అందము

స్నేహానికి మించినది

లోకాన చూడలేము


స్నేహానికి ద్రోహము

చేయడమే నేరము

హేయమైన కార్యము

యోచింప దారుణము











ధ్యానము ముఖ్యము

---------------------------------------

ప్రతిరోజూ ధ్యానము

చేస్తే ఆరోగ్యము

ఒత్తిడి తొలగిపోయి

మనసుకెంతో హాయి


ధ్యానమే ఔషధము

మనశ్శాంతికి మార్గము

ఖర్చు అసలు లేనిది

మదికెంతో బలమది


అనారోగ్యము దూరము

చేసేటి సాధనము

ఆధునిక కాలంలో

అందరికిఅవసరము


చేయాలోయ్! ధ్యానము

పోవాలోయ్! రోగము

ఉండాలోయ్! శాంతము

గుండె నిండా అనిశము










బాలలుండే చోటు పాఠశాల!

---------------------------------------

పిల్లలతో వెట్టి పనులు

చేయిస్తే తప్పు తప్పు

వారిని బడికి పంపిస్తే

ఎంతైనా ఒప్పు ఒప్పు


బాలల బంగరు బాల్యము

కాకూడదోయ్! చెరసాల

వారు ఉండాల్సిన చోటు

వసుధలోన పాఠశాల


చిట్టి చిట్టి చేతులకు

బానిస సంకెళ్లు వద్దు

ఆడే పాడే వయసుకు

పలకా బలపం ముద్దు


అక్షరాలు నేర్పితే

మారునోయి తలరాతలు

అజ్ఞానము తొలగిపోయి

బాగుపడును జీవితాలు











పల్లెకు పోదాం

---------------------------------------

పల్లెసీమ అందాలు

పచ్చని తోరణాలు

చేయునోయ్! కనువిందు

కాయాలోయ్!మున్ముందు


అంతటా పచ్చదనము

అత్యంత ఆహ్లాదము

తల్లి వంటి పల్లెటూరు

అందరి క్షేమము కోరు


పక్షుల కోలాహలము

సెలయేరుల ప్రవాహము

నింపునోయ్! ఆనందము

అనుభూతి అద్వితీయము


పల్లెతల్లిని చూద్దాం!

ప్రణమిల్లి మ్రొక్కుదాం!

జగతి ప్రగతి పట్టుకొమ్మ

ఆసక్తి చూపిద్దాం!

***

-గద్వాల సోమన్న


25 views1 comment

1 Comment


అనురాగ దేవత అమ్మ: సోమన్న


పేరు లోనే ఉంది ... ఆ కవిత దివ్యత్వం.


తల్లి ... లేక... తండ్రి ... లేక ... ఇద్దరూ లేని చిన్నారులకు ... అందరి అనాథలకు ... ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. అప్పుడే వారి జీవితాల్లో నిజంగా వెలుగు నింప వచ్చు.

పి.వి. పద్మావతి మధు నివ్రి

Edited
Like
bottom of page