top of page
Writer's picturePandranki Subramani

అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 10



'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 10' New Telugu Web Series Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 10' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ:


అశ్వథ్, మంగళ భార్యాభర్తలు. అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.


అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.


భర్త దగ్గర పవన్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తుంది మంగళ. ముఖాన్ని చూసి ఖైదీల మనస్తత్వాన్ని అంచనా వేయలేమని భార్యతో అంటాడు అశ్వథ్.


మూడు రోజులాగి మళ్ళీ పవన్ ప్రస్తావన తెస్తుంది మంగళ. తల్లిని చూడాలంటూ పుట్టింటికి బయలుదేరుతుంది. తాను లాయర్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు, అందుకోసం కొద్దిరోజులు తన గురువుగారి వద్ద జూనియర్ గా చేరబోతున్నట్లు చెబుతుంది. భర్తతో తాను రాసి పెట్టి వచ్చిన ఉత్తరం చదవమంటుంది మంగళ.


పవన్ కేస్ టేకప్ చేయబోతున్నట్లు అందులో రాసి ఉంటుంది మంగళ. పవన్ అరెస్ట్ కి కారణమైన శ్రీనిత్యను కలుస్తుంది.


ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన- 10 చదవండి.


“మరి నన్నిప్పుడేమి చేయమంటారు? నా వల్ల ముఖ్యంగా నేనిచ్చిన తప్పుడు స్టేట్మెంట్స్ వల్ల పవన్ కి చాలా కష్టం కలిగింది మేడమ్”


మంగళ కాసేపు తలూపుతూ ఉండిపోయి నిదానంగా అంది- “నువ్విప్పుడు తెగించి మీ తండ్రిని యెదిరించి అంతా నీ సమ్మతి తోనే జరిగిందని అఫిడవిట్ చేసినా దానికి అంత ప్రభావం ఉండకపోవచ్చు. అప్పటి అఫిడవిట్ కున్న అఫెక్ట్ - నువ్వు మైనర్ గా ఉండటమే.


ఇక మీ నాన్న యెలాగూ కేసు విత్ డ్రా చేసుకోడు కాబట్టి మనకు మిగిలిన దారి ఒక్కటే ఉంది. నీకూ పవన్ కీ మధ్య సాగిన సంబంధం గురించి మీ ఇంట్లోవాళ్లకు తెలుసన్నది నిరూపించగలగాలి. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమే! కాని ప్రయత్నించే తీరాలి. ఇందులో మావారి సహాయ సహకారాలు ఉంటాయి”


“కాదు మేడమ్. మా సంబంధం గురిచి తెలిసినవారు ఉన్నారు. నన్ను యెదురింటి ఫ్లాట్ లో ఉంటూన్న పవన్ వద్దకు వెళ్లకని మా పెద్దమ్మ హెచ్చరించేది”


మంగళ కళ్లుపెద్దవి చేసుకుని చూసి- పెద్దమ్మంటే- అని అడిగింది.


”పెద్దమ్మంటే మా డాడ్ మొదటి భార్య. నేను సాధారణంగా ఆమె దగ్గరే ఉంటాను. ఇంకా చెప్పాలంటే మా పెద్దమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. మా అమ్మ ఆఫ్గన్ స్త్రీ అని మీకు తెలుసు కదూ! మా నాన్నతో పాలలో నీళ్లలో అన్ని విషయాల్లోనూ అమ్మ కలసిపోయేది. నాకు నచ్చదని చెప్పినా వినేది కాదు“


మంగళ తలూపుతూ ఉండిపోయింది. ఇక తన ముందున్న తదుపరి అంశం- జోగయ్య తనకూతురి తరపున పవన్ కి యెదురుగా వేసిన కేసు వివరాలు సేకరించడం.

ఇక అదెంతలో పని? శ్రీనిత్య తనకు చేరువయిందిగా! ఆ పని ఆమే చేసిపెడ్తుంది. ఇక ఆఖరి విషయం- శ్రీనిత్య పెద్దమ్మ-- తన భర్తకు యెదురు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తుందా! చూడాలి మరి— ప్రయత్నం చేయకుండానే అడుగులో హంసపాదులా వీలుపడదని డీలా పడిపోతే యెలా--

--------------------------------------------------------------------------------------------

మనోతత్వ అధ్యయనంలో అమితాసక్తిగల మంగళకు మొదటి దశలోనే సానుకూల అంశం లభించింది.


అంతో కొంతో జోగయ్యకు క్రిమినల్ ప్రపంచంతో సంబంధం ఉండే తీరాలి. ఏదో ఒక సందర్భంలో అతడి మితి మీరిన చర్యలు అతడికే వ్యతిరేకంగా తిరగబడే అవకాశం లేకపోలేదు. ముల్లుని ముల్లుతో తీయాలంటే తన మనస్తత్వానికి అతీతంగా కొంచెం గుచ్చే తీరాలిగా!


ఇక కాస్తంత ముందుకు సాగి చెప్పాలంటే మరొక అనుకూల అంశం యేమంటే, పవన్ కుమార్ తనకు అన్యాయం జరిగిందని లోలోన ఆవేశానికి లోనై జైలునుండి బైటకు వచ్చిన తరవాత శ్రీనిత్య పనిపడ్తానని-- కోపావేశంలో శ్రీనిత్యను అది చేస్తాను- ఇది చేస్తానని బెదిరింపులకు పాల్పడకపోవడం.


అలాగ్గాని రికార్డయిందంటే అది పవన్ కుమార్ కి వ్యతిరేకంగా మరొక నేరంగా పరిణమించవచ్చుఇంతవరకూ అలా జరగకపోవడం-- ఒక విధంగా గుడ్డిలో మెల్ల-

--------------------------------------------------------------------------------------

అక్రమ మార్గాన చట్టవిరుధ్దంగా లోపలి ఖైదీలకు గ్యాంగస్టర్ లకూ సెల్ ఫోన్లు అందిన వ్యవహారాన్ని రాష్ట్ర స్థాయిలో ఆరాతీసే ప్రక్రియను జైలు శాఖ సూచన ప్రకారం హోమ్ మినిస్టరీ సి. ఐ. డి స్పెషల్ బ్రాంచీకి అప్పగించింది. అంతటితో అది అక్కడ ఆగదని సున్నిత హృదయుడూ వ్యవహార దక్షతగల వాడూ అయిన అశ్వథ్ కి తెలుసు.


ఆ విచారణ అలా సాగుతున్నప్పుడే సి. బి. ఐ. కూడా మధ్యలోకి దూసుకురావచ్చన్నది అతడికి తెలుసు. అన్నిటికీ అతడు సంసిధ్ధడయాడు. ఒడిలో భారం ఉంటేనే కదా ప్రక్కలకు ఒరిగిపోవడానికి- ఆమాటకు వస్తే తనెప్పుడని తన బాధ్యతలనుండి తొలగడానికి ప్రయత్నించాడు--


“కష్టే ఫలీ! ”- అన్నచందాన అతడి ఆద్వర్యాన యేర్పడ్డ ఇంటర్నల్ స్పెషల్ స్క్వేడ్ అందిచ్చిన నివేదిక వల్ల ఒక మంచినీ ఒక మంచి మార్పునీ జైలు శాఖ తీసుకురాగలిగింది. నివేదికను చూసిన జైలు శాఖ డిజీ- డిఐజీలు బాగానే స్పందించారు. జైలు మాన్యువల్ లో ఉన్నదా లేదా అన్నది చూడకుండా మరుచూపుకి వెళ్లకుండా ఖర్చు ముఖం కూడా చూడకుండా ఖైదీల సెక్యూరిటీ సెల్స్ వద్దా బ్యారక్సు వద్దా మరింత కట్టుదిట్టమైన కట్టడాల నిర్మాణం పూర్తి చేసారు.

అంతేకాక- జైలుశాఖ ముఖ్య కార్యదర్శి సహకారంతో బడ్జట్ మైనస్ లెక్క లోకి వెళ్తుందన్నది కూడా ఖాతరు చేయకుండా ముబైల్ ఫోను జామర్లు జైలు చుట్టూ ఏర్పాటు చేసారు.


ఈ కారణాన ఇవన్నీ జైలు సూపర్ వైజరీ అధికారులకు సానుకూల అంశాలుగా మారాయి. అక్కడక్కడ చోటు చేసుకున్న లూప్ హోల్స్ వల్ల యెదురైన ప్రతికూల వాతావరణ ప్రభావం తగ్గిందనాలి.


బైటనుండీ లోపలనుండీ సెల్ ఫోన్ల రవాణాకి తోడ్పడిన క్రిమినల్ గ్యాంగస్టర్లందరూ కటకటాల వెనక్కి తరలించబడ్డారు, బైలు దొరకని సీరియస్ క్రిమినల్ చార్జస్ పైన-


ఈ సంఘటన వల్ల అశ్వథ్ కి యెదురైన చేదు అనుభవం;ప్రభుత్వ యంత్రాగానికి యెంత సేవ చేసారన్నది కాదు ముఖ్యం. ఎంత చేయకుండా మిగిల్చారన్నదే ముఖ్యం. ఎంత చేసినా గుర్తింపు కోసం యెన్నడూ యెదురు చూడకూడదు.


గీతలో శ్రీకృష్డుడు చెప్పలేదూ—“కర్మము ఫలాసక్తితో నాచరించిన యెడలనే బంధము;ఫలాసక్తి లేని యెడల కర్మము మోక్షప్రద మగును“ మొత్తానికి తను చేస్తూన్న ఉద్యోగం- ఒక ప్రొఫెషనల్ హజార్డ్, ఎంత జాగ్రత్తగా ఉన్నా, బ్రతుకంతా ముళ్ల బాటే—అతుకుల మూటే—దీర్ఘకాల పోరాట బ్రతుకు పోటే--

---------------------------------------------------------------------------------

మ్లానముఖుడై ఆలస్యంగా ఇల్లు చేరిన కొడుకుని చూసి భరతమ్మ కలవరపడింది. ఎదురు వెళ్ళి అతడి ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది- “అదేంవిట్రా అలాగున్నావు యెండిన తోటకూర కాడలా! మధ్యాహ్నం భోజనానికి రాలేదు ఫోను చేస్తేనేమో స్విచ్చాఫ్ చేసుంచావు.


మంచి ఆఫీసరువన్న పేరుని సంపాదించాలన్న యావ యెంతగా ఉన్నా, పనినంతటినీ ఒక్క డివే నెత్తిపైన వేసుకుని తిరగాలా యేమిటి? మీ బాబు బ్రతికున్నన్నాళ్ళూ ఇలానే వేళాపాళా లేకుండా వచ్చి ఆరోగ్యం పాడుచే సుకుని నా ప్రాణం తీసాడు ఇప్పుడు నువ్వూ బయల్దేరు తున్నావన్న మాట. ముఖం చూడు ఎలా జేవురించుకుపోయిందో! ”


“అదేం లేదమ్మా! ఏమీ లేకుండా మరీ కంగారు పడిపోతే ఎలా? ముందు ప్రతిదానికీ నాన్నగారిని పిక్చర్ లోకి తేవడం మాను కో! ఎక్కువ పని చేస్తున్నానంటున్నావే- ఊరకే చేస్తున్నానా? నెలనెలా రెండుచేతులా జీతం రాళ్లు తీసుకోవడంలేదూ? ”


“అక్కడికి నువ్వొక్కడివే జీతం తీసుకుంటున్నట్టు! ఇంతకూ ఒంట్లో సుస్తీగాని చేసిందా యేవిటి?”


“ఏంవీ లేదు రెస్టు తీసుకుంటే సరిపోతుందిలే! “


“అలసిపోయావని వేరే చెప్పాలా! వచ్చి కూర్చో ఫిల్టర్ కాఫీ చేసి తీసుకొస్తాను“


“ కాఫీ వద్దుగాని, నాకు వేడి చారు తాగాలని ఉంది. చేసావా యేంవిటి? “


“ఇప్పుడిప్పుడే మిరియాల పొడి చారు చేసాను. తెస్తానుండు“ అని కొడుకుని చేయి పట్టుకుని కుర్చీవేపు తోసి భరతమ్మ లోప లకు వెళ్ళిపోయింది. అతడు తలూపి కుర్చీలో కాస్తంత సర్దుకుని కూర్చున్నాడో లేదో—అంతవరకూ తనకు దూరంగా తొలగి గూట్లోనో గాలి తెరల్లోనో దాక్కున్న ఆలోచనలు సముద్ర నురగలై నిప్పుపొగలై అతణ్ణి చుట్టుముట్టాయి.


మంగళ ఉంటే బాగున్ను! మనసు మూలిగింది. తన పరిస్థితికి కరిగి ఉన్నపళంగా గుండెల్లోకి లాక్కుందును, పరిమళ భరితమైన శిరోజాలతో తన ముఖాన్ని మెత్తటి వెండి మేఘంలా కప్పేసి చిన్నచిన్నముద్దులతో మోహ సముద్రంలో ముంచి ఉందును. అలసటతో కూడుకున్న శారీరావస్థను ఆమడ దూరానికి తరమేసి ఉండును. ఆమెలోని సర్వమూ మనోజ్ఞ రసభరిత మోహనరాగమే! ఇంతటి అమోఘమైన శక్తి ఆడదానికెవరిచ్చారో!


ప్రేమ పూరితమైన భార్య కోమలమై చూపులు మనసున మెదిలి- అతడికి తెలియకుండానే కనురెప్పలు తడిసాయి. ఒకసారి మంగళ పాడి వినిపించిన పద్యాన్నినెమరు వేసుకున్నాడు ఆర్ద్రతతో- “మధురముగా మార్దవంబుగా- మంజులముగ మనసానంద కరముగా- మంగళముగ- వరమనోహర పంచమి స్వరమునెత్తి పాడవేమమ్మ కోకిలా. పాడవేమె! ”


ఆ లోపల తల్లి తెచ్చిచ్చిన మిరియాల చారు ఆలోచనా పరంపరల మధ్య తేలుతూనే కొంచెం కొంచెంగా తాగుతూ ఉన్నపాటున గబుక్కున లేచి నిల్చున్నాడు అశ్వథ్. అప్పుడు భరతమ్మ అక్కడకి వచ్చింది. ”ఇంకొంచెం చారు తాగరా! నోటికీ ఒంటికీ మంచిది”ఆ మాటతో అతడు మళ్ళీ కుర్చీలో కూర్చుండిపోయాడు. చారు గిన్నెను రెండు చేతుల్లోకి తీసుకుంటూ అన్నా డు- “అమ్మా! ఆ రోజు నువ్వేదో అన్నావుగా- మంగళ వాళ్ల ఇంటికి వెళ్లి వస్తానని. ఎప్పుడు వెళ్తావు? ”


“అవును. అన్నాననుకో! ఆ పిల్లకూడా నన్ను చూడాలనిపిస్తుందని వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్లమని పిలిచింది. మరి తీరిక చిక్కొ ద్దూ! అందులో నువ్వీ మధ్య ఇంటిపట్టున ఉండక పోతివి మరి. అందుకే అనేది-- ”అంటూ అర్థోక్తిలో ఆగిపోయిందామె.


అప్పుడు అశ్వథ్ కదిపాడు- “ఆగి పోయావేం? చెప్పమ్మా! ”


“మరేం లేదురా! పరులింట్లో పుట్టి పెరిగిన అమ్మాయితో చూసి మెసలుకోవాలంటాను. ఆ పిల్ల- ప్రాక్టీసు ప్రారంభించడానికి వాళ్ల గురువుగారి వద్ద ట్రైనింగు తీసుకోవడానికి వెళ్లిందంటున్నావు. అదేదో బార్ కౌన్శిల్ మెంబర్ షిప్పు పునరుధ్ధరించుకోవడానికి కూడా వెళ్ళిందంటున్నావు. వినడానికి అంత వరకూ సరే అనుకో. కాని నా మనసుకి మాత్రం మీ మధ్య ఇంకేదో జరిగిందనిపి స్తుందిరా అశ్వథ్!”


అతడేమీ అనకుండా చారు తాగుతూ ఉండిపోయాడు.


అప్పుడు భరతమ్మ కొడుకు తల నిమురుతూ అంది- “మీ ముగ్గురు అన్నదమ్ములూ చిన్న వయసులో ఉన్నప్పుడు ఇల్లు యెంత కళ కళగా ఉండేదని- “


అప్పుడు తల్లి ముఖంలోకి తేరి చూస్తూ అడిగాడు-


“ఇప్పుడేమయిందమ్మా! మా అన్నయ్యలిద్దరూ వాళ్ళ వాళ పనులు చేస్తూ బాగానే ఉన్నారుగా! ”

“ఔను. మన వరకు అందరూ బాగానే ఉన్నారు. మరి నీ సంగతి? కొన్ని రోజులుగా ఏదోలా అగుపిస్తున్నావు, రేపు వినాయక చవితి. గుర్తుందా? ”


ఆ మాట విని అశ్వథ్ నిజంగానే ఆశ్చర్యపోయాడు. వినాయక చవితి అంత త్వరగా వచ్చేసిందా! నమ్మశక్యం కాకుండా ఉందతనికి. జైలు వ్యవహారాల వల్ల యెదురైన రాపిళ్ళ వల్ల తను తీవ్రమైన స్ట్రెస్ కి లోనయినట్టున్నాడు. మంగళ గాని ఉంటే ఇల్లంతా యెలాగుండేదని—అతడు యధాలాపంగా లేచి తల్లి అందించిన సంచీలు అందుకుని, సెంట్రీలు యెదురు వచ్చి తాము వెళ్ళి పూజాద్రవ్యాలు తీసుకొస్తామని మొరపెట్టుకుంటున్నా వినకుండా అతడు జైలుగోడలకు అవతల ఉన్న సంత వేపు సాగిపోయాడు.


పండగ చేయడం పుణ్యకార్యం కాబట్టి పూజా సామగ్రి మరొకరి చేత చెప్పించడం అమ్మకూ మంగళకూ నచ్చదని అతడికి తెలుసు. అవన్నీ తాముగా చేయతలపెడ్తేనే పూజా ఫలం తమకు దక్కుతుందన్నది అత్తాకోడళ్ళ ప్రగాఢ విశ్వాసం.


వినాయక చవితి పండగ జరిగిన మరునాడు భరతమ్మ కొడుకుని పిలిచి మంగళ విషయమై మాట్లాడింది. అత్తా మామలూ అల్లుణ్ణి చూసి చాలా రోజులయిందను కుంటున్నారని చెప్పింది. అల్లుడితో కలసి పంక్తిలో కూర్చుని కూడా చాలా రోజులయిందని అత్తా మామలిద్దరూ ఫీలవుతున్నారని కూడా చెప్పింది. కావున, ఓపారి మంగళ వాళ్ల ఇంటికి వెళ్లి రమ్మంది.

ఈ మధ్య జైలు గొడవలూ ఎక్కువయాయి కాబట్టి ముందస్తుగానే లీవు వేసుకొమ్మని సలహా ఇచ్చింది. అశ్వథ్ కాదనలేక పోయాడు. తనకి కూడా కాస్త తెరపి ఉంటే బాగున్ననిపించింది. చెప్పడంతో భరతమ్మ ఆగలేదు ఆమె.


వారం రోజుల్లోపల అశ్వథ్ అత్తగారింటికి వస్తాడని భర్తను అలరించడానికి కొత్త కొత్త పద్యాలు కొత్త కొత్త జావళీలు పాటలూ మననం చేసుకొమ్మని కూడా కోడలు పిల్లకు తీపి కబురు అందించింది.

=======================================================================

ఇంకా వుంది...

=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





30 views0 comments

Comments


bottom of page