top of page
Writer's picturePandranki Subramani

అణువణువున జ్వలించిన ఓ హృదయాన---ఎపిసోడ్ 13


'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 13' - New Telugu Web Series Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 13' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:


అశ్వథ్, మంగళ భార్యాభర్తలు. అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.


అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.


భర్త దగ్గర పవన్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తుంది మంగళ. ముఖాన్ని చూసి ఖైదీల మనస్తత్వాన్ని అంచనా వేయలేమని భార్యతో అంటాడు అశ్వథ్.


తల్లిని చూడాలంటూ పుట్టింటికి బయలుదేరుతుంది.


తాను లాయర్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు, అందుకోసం కొద్దిరోజులు తన గురువుగారి వద్ద జూనియర్ గా చేరబోతున్నట్లు చెబుతుంది. భర్తతో తాను రాసి పెట్టి వచ్చిన ఉత్తరం చదవమంటుంది మంగళ.


పవన్ కేస్ టేకప్ చేయబోతున్నట్లు అందులో రాసి ఉంటుంది మంగళ. పవన్ అరెస్ట్ కి కారణమైన శ్రీనిత్యను కలుస్తుంది.


మంగళకు సహకరిస్తానని శ్రీనిత్య చెబుతుంది.


మంగళను కలవడానికి అశ్వథ్ వస్తున్నట్లు చెబుతుంది భారతమ్మ.


మంగళ ఇంటికి వచ్చిన అశ్వథ్ జరిగిన విషయం చెప్పమంటాడు.

తనకు మత్తు మందు ఇచ్చి లొంగదీసుకోవాలని కొందరు ప్రయత్నించినా సందర్భంలో పవన్ తనకు కాపాడిన విషయం అశ్వథ్ తో చెబుతుంది మంగళ.


ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన---13 చదవండి.


మూడవ రోజు ఊరు చేరి డ్యూటీలో చేరిన అశ్వథ్ చేసిన మొదటి పని ఖైదీ నెంబర్-టూ జీరో త్రీని తనుంటూన్న స్టాఫ్ క్వార్టర్సుకి పిలిపించుకు రమ్మని అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ద్వారా కబురందించడం. కాని పవన్ కుమార్ బ్యారెక్సు లో లేడని అతడికి సుస్తీగా ఉందని మెడనరాలు బాగా పట్టేయడం వల్ల కదల్లేని స్థితిలో ఉన్నాడని, క్లీనిక్ నుంచి వచ్చింతర్వాత యింటికి పంపిస్తానని, కావాలంటే మరొకరిని పంపిస్తానని సెంట్రీల ద్వారా చీఫ్ వార్డెర్ బదులు పంపించాడు. పవన్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నయంగా ఉంటే మరునాడు అతణ్ణి మాత్రమే ఇంటికి పంపించమని ఆదేశాలందించాడు డిప్యూటీ జైలు సూపరింటెండెంటు అశ్వథ్.


పవన్ కుమార్ మరునాడు కూడా రాలేకపోయాడు. మెడ నరాలు పట్టడం మాటలు కాదు కదా! అంచేత రెండవ రోజు వస్తానని కబురు అందించాడు; సమయానికి రాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతూ--పెరట్లోని తోట పని చూసుకోవడానికి ఎయిర్ ఓపెన్ జైలు నుండి ఎవరో జైలు ఖైదీని కొడుకు సరాసరి ఇంటకి పిలిపిస్తున్నాడని తెలుసుకున్న భరతమ్మ రుసరుస లాడింది.


“కొరివితో తల గోక్కోవడం కాకపోతే ఎప్పుడూ లేని ఈ కొత్త వ్యవహారమేమిటిరా అశ్వథ్! “


తల్లి మనసులో తారట్లాడుతూన్న సందేహాన్ని గ్రహించిన అశ్వథ్ దగ్గరకు వచ్చి వివరించాడు- “ఆ టూ జీరో త్రీ ఉన్నాడే-అతడు అందరివంటి వాడు కాదమ్మా! అతడు గాని డేంజర్ మనిషయితే అతణ్ణి అసలు ఓపెన్ జైలుకు రప్పించే వాళ్లమే కాదుగా! బాగా పధ్ధతుల నిర్వహణలో ఫిల్టర్ చేయబడి సెలెక్ట్ చేయబడ్డ వ్యక్తి. చదువుకున్నవాడు కూడాను. అతడికి హార్టి కల్చర్ కోర్సులో ప్రవేశం ఉంది. తోట పని పచ్చగా కళాత్మకంగా చేస్తాడు. పాదులు వేయడం బాగా వచ్చు. మునుపేమో- మంగళ దగ్గరుండి పూల చెట్లూ పండ్ల చెట్లూ చూసుకునేది. కొమ్మల ట్రిమ్ముంగ్ కూడా చేసుకునేది. ఇప్పుడు మంగళ తన గురువుగారి ఆధ్వర్యంలో లీగల్ ట్రైనింగులో పుట్ట మునిగి ఉందిగా! నేనేమో-పని రద్దీలో పడ్డానాయె--పెరడులో కాలు మోపి వారాలు దాటుతూంది. మొన్నవాళ్లింటికి వెళ్తే ఇంటి తోట చూసుకొమ్మని పదే పదే చెప్పింది మంగళ. మొన్నేమో-మా కొలీగ్ ఒకతను నాకు ప్రత్యేకంగా ఫుట్ బాట్ లిల్లీ అనే పూలమొక్కను కానుకగా ఇచ్చాడు. దానికి కుదురుగా పాదులు వేసి నాటకపోతే-అది వాడి నేల కొరిగిపోతుంది. అది గాని తెలిస్తే మంగళ తెగ నొచ్చు కుంటుంది. అంతే కాదు. ఖైదీల దినసరి భత్యాలలో కూడా వ్యత్యాసం ఉంటుంది. మామూలు కామాటి పనులు చేసేవాళ్ళకు ఇరవై ఇస్తే ఓపెన్ జైలు ఖైదీలకు ఇరవై ఐదు, ఎందుకంటే వీళ్లు పనితనం గల ఖైదీలమ్మా! జైలు నిర్వహణకు రాబటి తెచ్చే నిపుణులమ్మా-- ”


కోడలి పిల్ల ప్రసక్తి వచ్చిన తరవాత-కొడుకు వివరణ విన్న తరవాత భరతమ్మ ఊరకుండిపోయింది. “అదేంవిటమ్మా అలా ఊరకుండిపోయావు! పనితనం ఉన్న వాడు కదా అని పిలిపిస్తున్నాను. వద్దంటే రావద్దని చెప్తేస్తాను. సరేనా?“


“అది కాదురా అశ్వథ్. మీ ఆవిడ పూబంతి చామంతి పూల చెట్లను పెరడు తోట నలువైపులా నాటి వెళ్లినట్లుంది. ఆ ఎయిర్ ఓపెన్ ఖైదీని అవన్నీ జాగ్రత్తగా చూసుకొమ్మను. అవి గాని వాడి ఒరిగి పోతే మంగళ చాలా దిగులు పడిపోతుంది. పిచ్చి పిల్ల. ఇప్పుడేమి చేస్తుందో! మొత్తానిక నీ పెళ్ళాం నన్ను ముగ్గులోకి బాగానే ఈడ్చిందిరా! ”


ఏమయిందన్నట్టు తల్లి ముఖంలోకి చూసాడతను.


“చెప్తే కుదరదు. చూస్తేనే తెలుస్తుంది. మొదటేమో మేడపైకి రెండు పావురాలను చేరదీసింది. వాటి గురించి బోలెడన్ని కబుర్లు చెప్పి నన్ను కూడా పావురాలమ్మను చేసింది. గింజలు తినేవాటిని గ్రానివోరస్, పండ్లు తినేవాటిని ఫ్రూగివోరస్ అని పిలుస్తారట. మునుపు మూడవందల జాతుల పావురాలుండేవట. వాటిలో అరవై జాతులు అంతరించే స్థితికి చేరుకున్నాయని తెగ దిగులు పడిపోయంద నుకో. ఇప్పుడేమయిందో తెలుసా?ఆ రెండు పావురాలతో మరి కొన్నిపావురాలు చేరి మేడను చిత్తడి చేస్తున్నాయి. దానితో ఊరు కుందా-ఉడుతల్ని సాకనారంభించింది.


గూడు నుంచి చెట్లపైనుండి క్రింద పడ్డ పిల్ల ఉడుతల్ని ఇంటికి తీసుకొచ్చి చికిత్సలు చేసి పంపించ నారంభించింది. వాటికి మంగళ వద్ద ఎంత మాలిమి అంటే-గింజల్ని గాని పలుకుల్ని గాని చేతిలో పెట్టి అందిస్తేనే తింటాయి. పిట్ట గోడపైన ఎక్కడైనా పెట్టి తినమంటే మూతి ముడుచుకొని వెళ్లిపోతాయి. చెట్ల పైన మేడలపైనా దెబ్బలు తిని మన పెరట్లో పడ్డ పిచుకల్ని రామచిలుకల్ని ఇంటికి తీసుకొచ్చి కట్టుకట్టి పంపించేది. అప్పుడు మీ ఆవిడకి అసిస్టెంటుగా ప్రక్కనుండేది నేను. ఒకసారి ఏమైందంటే-మీ ఆవిడ చేసిన ఘనకార్యం గురించి చెప్తే నమ్మవుగాని-ఏకంగా ఇంటికి పెద్ద గ్రద్దను తీసుకొచ్చేసింది; ఎగురుతూన్న గాలిపటాల మాంజా దారానికి రెక్కులు తెగి గిలగిల తన్ను కుంటుందని”


“గ్రద్దనా! ఏవిటమ్మా నువ్వు చెప్పేది?అది చాలా బరువుగా తీక్షణంమైన చూపులతో ఉంటుంది కదా!”


“అదే మాట నేనూ అన్నానురా అశ్వథ్! గరుడరూపం కదానని-నోము నోచి శుధ్ధి కోసం గుడికి వెళ్ళి రమ్మని కూడా చెప్పాను దానికి మీ ఆవిడ అరగంట సేపు లెక్చర్ ఇచ్చి నన్ను బ్రెయిన్ వాష్ చేసింది. నోరు లేని జీవాలను ఆడిపోసుకోకూడదంది. ఆకాశానికే కాక-పర్యావరణానికి కూడా గ్రద్దల అవసరం యెంతైనా ఉందని నన్ను నోరుమెదప నీయలేదు. అదెక్కడో జంతు పక్షుల మిత్ర మండలి ఉందటగా-వాళ్లను పిలిపించి దానికి కట్టుకట్టించి ఊరవతల చెట్టుపైన దానిని పెట్టించింది. సరే-లోపల నాకు పనుంది. మిగతాది తరవాత మాట్లాడుకుందాం లే--”అంటూ భరతమ్మ వెళ్లి పోయింది.


అదంతా విన్న అశ్వథ్ కాసేపు అలాగే నిల్చుండి పోయాడు. మనుషుల్ని పక్షుల్ని జంతువుల్నీ ఒకే తాటిపైన ఉంచి ఒకే భావనతో చూడగలగటం అందరికీ సాధ్యం కాదేమో! మంగళది నిజంగానే ఉదాత్త హృదయం కదూ!

---------------------------------------------------------------------------------------------

మరునాడు మధ్యాహ్నం అన్నాలు తినే వేళ దాటింతర్వాత పవన్ కుమార్ డిప్యూటి సూపరింటెండెంట్ అశ్వథ్ ఇంటి ముంగిట వచ్చినిల్చున్నాడు. డ్యూటీలో ఉన్న సెంట్రీలు వచ్చిన కారణ కార్యాన్ని అడిగి తెలుసుకుని లోపలకు వెళ్ళి అశ్వథ్ కి తెలియజేసారు; ఖైదీ నెంబర్-టు జీరో త్రీ వచ్చాడని. అతణ్ణి చూసేందుకు బైటకు వచ్చిన డిప్యూటీ సూపరింటెండెంటుని చూసి పవన్ కుమార్ కాస్తంత దూరంగా తొలగి నమస్కరించాడు. మరొకసారి క్షమాపణలు చెప్పుకున్నాడు ఆలస్యంగా వచ్చినందుకు. అశ్వథ్ అతణ్ణి కొన్ని క్షణాల పాటు నఖశిఖ పర్యంతమూ పరీక్షగా చూసాడు. అక్కడొకసారి ఇక్కడొకసారి పవన్ కుమార్ ని అతడు చూసున్నట్టే జ్ఞాపకం. మొన్నెప్పుడో జరిగిన వ్యాసరచన పోటీలో పవన్ కుమార్ యేదో కన్సొలేషన్ ప్రైజు కూడా గెలుచుకున్నట్టు గుర్తు. రూపంలో కనుచూపులో హుందాతనంతో కూడిన నిదానం కనిపిస్తూంది.


తన భార్య తలపుని సుకుమారమైన మనసుని అణువణువునా ఆకట్టుకున్న వ్యక్తి ఇతనే కదూ!


ఇతని కోసం, ఇతని కేసుని టేకెప్ చేయడం కోసమే కదూ మంగళ తన వెచ్చటి పరిష్వంగం నుండి హరితారణ్య గృహప్రాంగ ణం నుండి తొలగి వెళ్లిపోయింది! అన్నిటికీ తెగించి వెళ్ళిపోయిందీ--అతడికి తెలియకుండానే అతడి చూపులో విస్మయం కొంత తాకీ తాకని వడగాలి వంటి ఈర్ష్య మరి కొంత కలగలిసాయి. నిజం చెప్పాలంటే తమ భార్యాభర్తలిద్దరి మధ్యా అనురాగ స్రవంతులు మధ్యా ఖైదీ రూపంలో యెట్టెదుట నిల్చున్న ఇతను లేనే లేడు. తమ మధ్యకు రావడానికి ప్రయత్నించనే లేదు. కాని అంతటా ఇతనే వ్యాపించి ఉన్నాడు; ఆకాశాన్ని వింతగా నేలకు వంచిన ఇంద్ర ధనుస్సులా—పొగ మంచులా--


అప్పుడు పవన్ కుమారే అక్కడి బరువైన నిశ్శబ్దాన్ని భంగపర్చాడు- “సార్! నేను అటునుండి పెరడు చుట్టూ తిరిగి వచ్చానండి. పెద్దటి పెరడు. విరబూసిన గుబురు చెట్లు. చక్కటి తోటండి. ఇంటి గడప చూసి ఇంటి ఇల్లాల్ని చూడాలంటారు కదండీ. మీ ఇంటి పెరటి తోట చూస్తే చాలండి ఇంట్లో వాళ్ళు ఎంతటి ప్రకృతి ప్రేమికులో తెలిసిపోతుందండి“అలా ఏదేదో చెప్పుకు పోతూ చప్పున ఆపేసాడు పవన్ కుమార్.


”సారీ సార్! రియల్లీ సారీ సార్! ఎగ్జాయిట్ మెంట్ లో ఏదో వాగేసినట్టున్నాను. క్షమించండి“


“లేదు. నేనేమీ అనుకోవడం లేదు. తోటమాలి తోటగురించీ మగ్గం ముందు కూర్చున్నవాడు గుడ్డ అల్లిక గురించేకదా ఎక్కువ ఆలోచిస్తాడు. చెప్పండి. ముందుకు సాగండి“


ఆ మాట విని ఖైదీ నెంబర్ టు జీరో త్రీ ఉలిక్కిపడ్డట్టు చూసాడు. అతడితో బాటు సెంట్రీలు కూడా ఆశ్ఛర్యంతో ఓర చూపులు చూస్తూ ప్రక్కలకు ఒదిగారు. చిన్న చిన్న ఉద్యోగుల దగ్గరనుంచి పెద్ద అధికారుల వరకూ ఉదారత మాట అటుంచి మార్దవమైన పలుకే ఉపయోగించరు ఆ చుట్టు ప్రక్కల. ఆ మాటకు వస్తే బ్యారెక్సులోకి వచ్చి చేరిన కొనాళ్లకు సెల్ ఇన్ మేట్సు చాలా మంది అక్కడి కర్కశ వాతావరణానికీ మోటైన పదాలకూ అలవాటు పడిపోతారు-


”ఇక ఈ జన్మకు మాగతి ఇంతే! ”అనుకుంటూ-అలాంటప్పుడు, విచారణ ఖైదీగా ఉన్న తన పట్ల ఇంతటి మన్నన చూపిస్తున్నాడీయన! మొత్తానికి మంగళ పుణ్యవతి, అందుకే ఇంతటి మృదు స్వభావుడైన భర్త లభించాడు.


“చెప్పండి పవన్ కుమార్. మీరేదో చెప్పబోతూ ఆగిపోయారు. చెప్పి ముగించండి“ అశ్వథ్ మరొకసారి కదిపాడు.


“సారీ సార్! ఏదో ఆలోచనలో పడిపోయి-- గరుడ వర్థిని-కనకాంబరం-పలాశకుసుమ మొక్కలు-ఇవన్నీ ఏపుగానే పెరుగుతున్నాయి. పాదుల్ని కాస్తంత కుదురుగా తవ్వి ఉన్నవాటిని ట్రిమ్ చేసి కాంతి పడేలా చేసి కాస్తంత ఎరువులు గాని వేస్తే మరింత వికసిస్తా యండి” అశ్వథ్ తలూపుతూ విన్నాడు. ఆ తరవాత నిదానంగా అన్నాడు-


“సరే ఇప్పటికిది చాలు. లోపలకెళ్లి మాట్లాడుకుందామా! “అంటూ ఇంట్లోపలకు నడిచాడు అశ్వథ్.


అప్పుడు పవన్ కుమార్ వినమ్రంగా అన్నాడు- "ఇలా అంటున్నందుకు క్షమించండి సార్. దయచేసి నన్ను’అండీ! ’ అని బహవచన ప్రయోగంతో పిలవకండి. ప్లీజ్! ”


ఆ మాటతో అశ్వథ్ నిశ్సబ్దంగా చూస్తూండి పోయాడు. అటు వేపు వస్తూ ఆ వాళ్ళిద్దర్నీ గమనించిన భరతమ్మ అడిగింది-“ఏంవయ్యా అబ్బీ! చదువుకున్నావా?”


“ఎక్కువగా చదువుకోలేదు మేడమ్. డిగ్రీ పూర్తిచేయలేదు“


అలాగా-అని తలూపుతూ లోపలకు వెళ్లిపోయిందామె.


సత్యాన్ని ప్రేమించగలగాలంటే ఒక ఉన్నత అహంకార రహిత శూన్య స్థితిలోకి వెళ్లగలగాలి. మన: పూర్వక శ్రధ్ధా శుధ్దీ కలి గుండాలి. అప్పుడు గాని మనిషి నలుపు తెలుపులమధ్య- చీకటి వెలుగుల మధ్య ఉన్న వ్యత్యాసాన్నిసున్నిత మనోభావంతో గ్రహించలేడు. ఇప్పుడు అశ్వథ్ అదే స్థితిలో ఉంటూ సర్వమూ సమదృష్టితో వీక్షించాలని మనసున తీర్మానించుకున్నాడు. లోపలకు వచ్చిన తరవాత అన్నాడతను-“వచ్చి కూర్చో పవన్! ”


ఆ మాటకతడు దిగ్భ్రాంతితో చూసాడు. ఒక సీనియర్ జైలు అధికారి ముందు తను కూర్చోవడమా! ఇది కర్కశ జైలు వాతావరణంలో కనీ వినీ ఎరగని విషయం కాదూ!


“పర్వాలేదు సార్. మీరు చెప్పండి. మీ స్టడీ రూముని శుభ్రం చేసి ర్యాక్సులో ఉన్న పుస్తకాలన్నిటినీ ధూలి దులిపి సర్ది పెట్టమంటారా? లేదా మీ గదిలోని చెత్తను ఊడ్చి శుభ్రం చేయమంటారా? మీ గదిలోని పుస్తకాలు చూస్తుంటే నాకు నా కాలేజీ రోజులు జ్ఞప్తికి వస్తున్నాయి సార్. మీ రూములో మంచి ఇండోర్ పూల మొక్కలు- ఎయిర్ ఫిల్టర్ ప్లాంట్లూ పెట్టమంటారా! ఇక్కడ లేకపోతే మరొక చోటునుండి తెస్తాను”


అశ్వథ్ గ్రహించాడు పవన్ కుమార్ హృదయం గతకాల జ్ఞాపకాల తాకిడితో ఆక్రోశిస్తుందని.

“నువ్విక్కడకు ఎందుకొచ్చినట్టు?”అడిగాడతను,


“మీరు చెప్పిందంతా చేయడానికి“


“ఇప్పటికి అదే చెయ్యి. పావురాల గూళ్ళు శుభ్రం చేయడం-పెరడులో గొప్పులు తీయడం- అవన్నీ తరవాత చేద్దాం. సరేనా?“


తెల్లబోయినట్టు చూసాడు పవన్ కుమార్. అంత సేపూ మాట్లాడిన తరవాత అతడికి జైలు సీనియర్ ఆఫీసరు నుండి మొదటి సారిగా అధికారపూర్వకమైన స్వరం వినిపించింది. తను అవధికి మించిన రీతిన అతి ఉత్యాహం చూపిస్తూ మాట్లాడి ఉంటాడేమో! అతడింకా సంశయాత్మకంగా నిల్చోవడం చూసి అశ్వథ్ ఆఖరు అస్త్రం ఉపయోగించాడు.


”నిజం చెప్పాలంటే నేనిప్పుడు ఇక్కడకు పిలిపించింది ఖైదీ నెంబర్-టు జీరో త్రీ-గా కాదు. ఒకప్పటి నా భార్య మంగళాదేవి కాలేజీ మేట్ గా.. ఆమె ఫ్రెండుగా పిలిపించాను. ఈజిట్ క్లియర్ నౌ”


పవన్ కుమార్ ఇక మాట్లాడ లేదు. తిన్నగా వెళ్లి అశ్వథ్ కి ఎదురుగా ఉన్న విజిటర్స్ కుర్చీని ప్రక్కకు తొలగించి మూల నున్న మూడుకాళ్ళ స్టూలుని తెచ్చుకుని కూర్చున్నాడు. అంతలో పనావిడ వచ్చి గదిలో కూర్చున్న ఖైదీని ఎగాదిగా అదోలా చూసి- “అమ్మగారు టీ రెడీ అయిందన్నారు. తెచ్చేదా సార్?”

అతడు-“ఉఁ“అని పవన్ వేపు చేయి చూపించాడు; అతడికి కూడా టీ తెచ్చివ్వమని సంకేతం ఇస్తూ.


”నేరాల పుట్టలోనుంచి వచ్చిన ఒక ఖైదీ పట్ల ఇంతటి మన్ననా! ఇదెక్కడి పిచ్చి మా లోకమో మరి! ” అనుకుంటూ వెళ్లిపోయింది పనావిడ. అప్పుడు చిన్నగ నవ్వి సంభాషణ ఆరంభించాడు అశ్వథ్-


“మిస్టర్ పవన్! మీరంటే మంగళకు మంచి అభిప్రాయం. మీకు వ్యతిరేకంగా ఒక కారణమో లేక ఒక ఘటనో ఉంటుందంటే ఆమె నమ్మలేకపోతూంది. ”

=======================================================================

ఇంకా వుంది..


=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




39 views0 comments

Comentários

Não foi possível carregar comentários
Parece que houve um problema técnico. Tente reconectar ou atualizar a página.
bottom of page