'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 2'
New Telugu Web Series
Written By Pandranki Subramani
'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 2' తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
అశ్వథ్, మంగళ భార్యాభర్తలు.
అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ కొత్తగా ప్రమోట్ అయ్యాడు.
హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి తనతో రమ్మంటాడు అశ్వథ్.
జైలు వాతావరణం తనకు పడదని, రాలేనని అంటుంది మంగళ.
ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన- 2 చదవండి.
అశ్వథ్ మాట్లాడుతూ ”యు ఆర్ రైట్. రైట్! నీది బ్రిలియంట్ అకాడమిక్ రికార్డ్. దీనికి తోడు సైకలాజీ కూడా చదివావు. ఇంతే కాదు. నీకు మరొక అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. స్వార్ధచింతన తక్కువగా ఉన్న సెన్సిటివ్ నెస్. మీ సీనియర్ వద్ద మరి కొంత ట్రైనింగు పూర్తిచేసుకుని - హైరోడ్డున సింగిల్ రూము అపార్టుమెంటొకటి తీసుకుని దానిని ఒక లీగల్ ఆఫీసుగా మలచుకున్నావంటే- అనుభవానికి అనుభవమూ వస్తుంది- రాబడికి రాబడీ కలిసొస్తుంది.
ఆ తరువాత నీవద్దకు కూడా ఇద్దరు ముగ్గురు జూనియర్లు చేరకపోరు. నీకు మీ గురువుగారి ఆశీర్వాదం ఎటూ ఉందిగా! నిన్ను నిరుత్సాహపర్చడానికి కాదు గాని, నువ్వూ మీ మిత్రబృందమూ పరిసరాలను గమనించకుండా జంతుజాలం గురించే ఆలోచిస్తూ ఉండిపోతున్నారేమో ననిపిస్తుంది. ఊరకుక్కల్ని చంపకూడదని- వాటి ఉనికి వల్ల ర్యాభీస్ వ్యాపిస్తున్నాయని తోస్తే, వాటిని చంపకుండా ఇంజెక్షన్ల ద్వారానో అపరేషన్ల ద్వారానో వాటి సంతతి పెరుగుదలను అరికట్టాలని ఉద్యమాలు లేవదీస్తున్నారు. ఈ మధ్య మా కొలీగ్ ఒకతను చెప్పగా మరొకటి కూడా విన్నాను. వట్టిపోయిన ఆవులకు, అచ్చొత్తిన ఆబోతులకూ ప్రభుత్వ ఖర్చుతో వాటి ఆలనా పాలనా చూడాలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కబేళాలకు తరలించ కూడదని- ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ చట్టం క్రింద ప్రజాక్షేమ వ్యాజ్యాలు కూడా వేస్తున్నారట.
ఇందులో నాకేమీ ఆక్షేపణ లేదు. వాటికి మానవీయ కోణాలు లేవని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కాని- అట్టడుగున అలమటిస్తున్న మానవాత్మల పైనా కొంచెం దృష్టి సారించమంటున్నాను”.
అంటే?- అని అడుగుతూ సావధానంగా సర్దుకుని కూర్చుంది మంగళాదేవి.
భర్త తను చేస్తూన్న సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపించడం ఆమెకు ఎనలేని సంతోషాన్ని కలుగ జేసింది. ఎవరో ఎక్కడో కాదు. తనతో ఏడడుగులు నడిచి తనను సహధర్మిణిగా స్వంతం చేసుకున్న మగాడు తనను మెచ్చుకోలుతో ముంచెత్తితేనే కదా- తనకూ తమ సామాజిక సమితికీ సార్థకత ఉన్నట్లు!
అప్పుడు అశ్వథ్ మళ్లీ చెప్పనా రంభించాడు- “అత్యాచారాలకు లోనవుతూన్న స్త్రీల కోసం- గృహ హింస వల్ల అగచాట్లు పడుతూన్న అభాగినుల కోసం.. తదితర చట్టాలను ప్రయోగించేలా చూడమంటున్నాను. కొడుకుల అనాదరణకు, కూతుళ్ల అలక్ష్యానికి గురవుతూ వీధి పాలవుతూన్న వయోవృధ్దుల బాగోగుల కోసం సమయాన్ని వెచ్చించమంటున్నాను. అంటే- అది చేస్తే దీనిని మానేయమని కాదు నా ఉద్దేశ్యం. అందరికీ సమపాళ్లలో సహాయం అందించ మంటున్నాను.
నీకున్న లీగల్ బ్యాక్ గ్రౌండు క్రిమినల్ లాకి సంబంధించి ఉండొచ్చు. కాని మొత్తానికి తరచి చూస్తే, దాదాపు అన్నీ వాటికవి జమిలిగానే ఉంటాయి. మరి కొన్ని రాజ్యాంగ పరమమైన అంశాలను పుణికి పుచ్చుకొని ఉంటాయి. ఏది ఎలా వున్నా వాటిని పరిష్కరించే తీరాలిగా! ” అని చెప్పడం ముగించి నవ్వుతూ ఉండిపోయాడు అశ్వథ్.
అప్పుడు ఆమె కాస్తంత సమయం తీసుకుని- ‘ఇక నేను చెప్పేదా?’ అని అడిగింది. అదే నవ్వు ముఖంతో. ఉఁ- అన్నాడ తను.
“ఇంత పెద్ద క్వరీకి ఆన్సర్ వెతుక్కోవడానికి టైము పడ్తుంది. మీది మంచి ఆలోచనే- కాదనను. కాని ప్రతి వ్యక్తికి తన కంటూ ఒక మనస్తత్వం ఉంటుంది. దానిని ఎక్కణ్ణించో అరువు తెచ్చుకుంటే అలవడేది కాదు. దాని పరిధిలోనే ఉంటూ ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. ఇక అన్ని పనులూ ఒకే ఊపున చెయలేక పోవడం మాట అటుంచి- చేసే పనులు యేవైనా సరే- అవి వ్యక్తి మనస్తత్వానికి దగ్గరగా ఉంటేనే కదా- హుందాగా సజావుగా ఉంటుంది.
ఇప్పటికి నాకు అన్యాయమంటే తెలియని నోరులేని మూగజీవుల పట్ల మనసు ఆక్రోశిస్తూంది. ఇప్పటికిప్పుడు అటువంటి మూగజీవాల పట్లే మనసు నిమగ్నం చేస్తాను. ఇక నాకొక ఆఖరి ఆలోచన కూడా ఉంది. మీ బిడ్డకు తల్లినయన తరవాత నేను వీటన్నిటితో బాటు- నా ప్రొఫెషనల్ జీవితాన్ని ముందు ముందు యెలా మలచుకోవాలో ఆలోచిస్తాను. ఈ విషయంలో మా శ్రీవారి వత్తాసు ఉండాలన్నది విస్మరించరాని సత్యం. ఏమంటారు?”
అతడిక మాట్లాడలేదు. మంగళ చెంపల్ని ప్రేమగా నిమురుతూ అక్కున చేర్చుకున్నాడు. భర్తను పెనవేసుకుంటూ మంగళ గోముగా అంది- “అలా ఉన్నపాటున ఊరకుండిపోతే ఎలా? మనసు విప్పి మాట్లాడితేనే కదా ఊరటగా ఉంటుంది!”
“నీవి తేటదనం గల తెలివితేటలు. మంచితనానికి అమృతాభిషేకం చేసే తెలివితేటలు. దీనికి తోడు బంగారానికి మెరుగులు దిద్దేలా మీ ఇంటి పెంపుదల కూడా నీకు ఆసరాగా వచ్చింది. స్త్రీ సహజ సూనృత గుణాంశంతో నిష్పాక్షికమైన నిర్ణయాలు తీసుకోగల గుండెనిబ్బరం గలదానివి. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్! ”
ఆమె భర్తను మరింత గట్టిగా ఆలింగనం చేసుకుంది.
అప్పుడప్పుడే ఇంటి ముంగిట కారు ఆగిన చెప్పుడు- భరతమ్మ అక్కడి ఆర్డర్లీలతో సంభాషిస్తూన్న గొంతూ విన్న భార్యా భర్తలిద్దరూ అనుకోకుండా పక్కున నవ్వేసారు.
ఇంకానయం ఆ మహాతల్లి కాస్తంత ఆలస్యంగానే వచ్చింది. పురాణ కాలక్షేప విశేషాల గురించీ- మూలవిరాట్టుకు జరిగిన వివిధ లక్షార్చనల గురించీ యేక బిగిన విశ్లేషణలు అందిస్తూ వాళ్ల శుభ లఘ్నానికి రాదారికడ్డంగా పెట్టిన బైకులా అడ్డం తగిలి ఉన్ను.
“ఇది ఈనాటి చివరి ముహూర్తం సుమా! ” అన్నట్టు అశ్వథ్ కి గాఢంగా ముద్దుపెట్టి చీర సర్దుకుంటూ అత్తయ్యను పలకరించడానికి నవ్వు ముఖంతో బైటకెళ్ళింది. మనసుకి నచ్చిన మగాడు తోడుగా లభించడం ఒక యవ్వన స్త్రీ జీవితానికి అద్భుత అలంకార భూషితమే మరి.
***
డిప్యుటీ జైలు సూపరింటెండెంట్ అశ్వథ్ ని మంగళాదేవి పెళ్ళి చేసుకుని కాపురానికొచ్చి ఏణ్ణర్థం కావస్తూంది.
అంతకు ముందెప్పుడో ఏదో ఈవెంటు కోసం వెళ్ళి చుట్టుపు చూపుగా కలయదిరిగి ఉదయకాల గాలి వీచికలాగ రివ్పున జైలు ఆవరణ నుంచి బైటకొచ్చేసేదామె. జైలు బారెక్స్ వేపు గాని, కరడు గట్టిన ఖైదీలుండే సెక్యూరిటీ సెల్సు వేపు వెళ్ల గలిగే సందర్భం కలగలేదు. అంతేకాదు- అక్కడికి మరీ దూరంగా లేని ఆడ ఖైదీల బారెక్సు వేపు కూడా వెళ్లలేదు.
అవన్నీ అలా తీరిగ్గా కుదురుగా చూడలేక పోవడానికి ప్రవేశం లభించక కాదు. తన మగాడు తలచుకోవాలే గాని తను వెళ్లలేని స్థలమంటూ జైలు శాఖలో ఏముంటుందని? ఇక విషయానికి వస్తే మంగళ స్వతహాగా సున్నిత హృదయురాలు. హృదయావేగం గల స్త్రీ. ఆడేమిటి, మగేమిటి- ఖైదీలు ఖైదీలేగా! అంచేత వాళ్ళ సంబంధిత జీవిత నేపథ్యాలను దగ్గరగా ప్రత్యక్షంగా చూడటానికి ఆమె మానసికంగా సంసిధ్ధురాలు కాకపోవడమే అసలు కారణం.
అంతేకాక- కొందరు హార్డ్ కోర్ నేరస్థుల కాళ్లకు ఇనుప గొలుసులు వ్రేలాడు తుంటాయన్నది కూడా ఆమెకు తెలుసు. కొందరు ఖైదీల విషయంలో అలా చేయడానికి సహేతుకత ఉన్నట్లనిపించినా ఆమెకు మాత్రం అటువంటి దృశ్యాలను చూసి నిలబడగల నిబ్బరం అలవడ లేదు. ఇంతకూ మంగళ “లా” కోర్సుతో బాటు సైకలాజీ కూడా పూర్తి చేసింది. అంచేత దీర్ఘమైన మనోతత్వ పరిశీలన చేయగల సమర్థనీయ నేపథ్యం గల స్త్రీ.
మంగళ ఆలోచనలో పడి తనలో తను పరిపరి విధాలా తర్కించుకోసాగింది. నలుగురు తమ్ముళ్లనూ కాపాడుకోవడానికి యక్షుడి ముందు నిలబడ వలసి వచ్చినప్పుడు- యుధిష్టరుడు వేపు ఆ యక్షుడు ఒక ప్రశ్నను సంధిస్తూ- “నీకీ ప్రపంచంలో అత్యధికంగా అబ్బుర పరచేదేది?”అని అడుగుతాడు.
తడుముకోకుండా బదులిస్తాడు- ధర్మరాజు- “మానవుడు! ” అని.
అలా అనుకోవడానికి కారణం చెప్పమంటాడు యక్షుడు.
”ఎందుకంటే?మనిషిలోని ఆత్రతా- అతడు పడే నిత్య తాపత్రయమూ చూస్తుంటే- అతడి బ్రతుక్కి చివరి రోజంటూ లేనే లేదనిపిస్తుంటుంది! ”
కారాగారంలో బంధించ బడటమన్నది అదేదో మామూలు వ్వవహారం కాదుగా- “ఇదిగో! ఇలా వెళ్ళి అలా దీపాలు పెట్టే వేళకు రానూ! ” అని భార్యబిడ్డలకు వీడ్కూలు పలికిన పధికుల్లా ప్రతిరోజూ కామాటి పనులు చేస్తూ- సాయంత్ర మయేసరికి మేత వెతుక్కోవడం పూర్తి చేసుకుని గూళ్ళకు చేరుకునే పక్షుల్లా సెల్సులోకి చేరుకోవడం— చూస్తుంటే తలచుకుంటే మంగళకు కడుపులో తిప్పుడు వంటిది ఆరంభమవుతుంటుంది.
నిజంగానే కరడుగట్టిన ఖైదీలు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు మర మనుషుల్లా మారిపోయారా! వాళ్ళు దు:ఖానికి అతీతులుగా రూపాంతరం చెందారా! లేక.. తనూహిస్తున్నట్టు పైకి కనిపించినట్టు కాక- రాత్రుళ్లు చీకటి సెల్సు లోపల ఎవరికీ కనిపించని ఒక మూల ఒదిగి కూర్చుని అనాధుల్ని చేసి వచ్చిన భార్యా బిడ్డల్ని తలచుకుని మౌన నివేదనతో రోదిస్తుంటారా! అంతరాత్మకు సున్నితత్వంతో బాటు అశాంతి కూడా యెక్కువ కదూ!
ఒకే ఒక నిమిషం ఆగి ఆలోచించి ఉంటే ఇప్పటి నకారాత్మక వలయం నుండి తొలిగి బైటపడి ఉండేవారు చాలా మంది ఖైదీలు. మరి ఆ ఒక్క క్షణమే కదా ప్రాణాపాయంలో పడ్డ పేషెంటుకి ఎదురయే గోల్డెన్ అవర్ వంటిది! అది అత్యాశతో చేసే దొంగతనాలు గాని, ఆక్రోశంతో చేసే హత్యలు గాని- ఫలితం మాత్రం ఒక్కటేగా- జైలు శిక్షేగా! ఇక మిగిలేది అంధకార బంధురమైన జీవితమేగా! బ్రతుకు కన్నీటి కావ్యమేగా..
ఆ రోజు మంగళకు అప్పాయింటెడ్ డే! అడ్డదోవన లోపలకు వెళ్ళే దారి ఉన్నా ఆమె భర్తతో బాటు సింహద్వార ప్రిజిన్ గేటు దాటి లోపలకు వెళ్ళింది. మంగళ అల్లంత దూరం నుంచి కళ్ళెత్తి చూసిన వెంటనే- “వావ్! నిజంగా ఎయిర్ ఓపెన్ ప్రిజన్ అం టే ఇదేనా! ” అని మనసున అబ్బురపడింది. ఇంత పచ్చగా ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే- ఒక రోజేమిటి- ప్రతిరోజూ అత్తయ్యతో బాటు వచ్చి కూర్చోదూ!
ఇక్కణ్ణించేనన్నమాట, కాయగూరలూ పండ్లూ తీసుకొచ్చి ఆ చుట్టుప్రక్కల అమ్ముతుంటారు. వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. ఎందుకో మరి- అశ్వథ్ కి ఇక్కణ్ణించి కాయగూరలు గట్రా ఇంటికి తీసుకురావడం ఇష్టముండదు. అప్పుడు భార్య చూపుల్లోని కుతూహలాన్ని చూసి అశ్వథ్ ఆశ్చర్య పడ్డాడు.
ఇక పోతే ఆమె ఓపెన్ ఎయిర్ ప్రిజిన్ గురించి విన్నదే గాని, చూసెరగదు. నిజం చెప్పాలంటే ఆమెకెప్పుడూ చూడాలని అనిపించనే లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా మ్లాన ముఖాలతో సర్వమూ పోగొట్టుకున్న నిస్సార చూపులతో తిరిగే జైలు ఖైదీలనే చూడవలసొస్తుంది కదా! మొత్తానికి కనుచూపు మేర అక్కడి పరిసరమంతా అంతరిక్ష వీధిలా విశాలమైన మైదానంలా పచ్చటి ప్రకృతి ఒడిలా సుశోభితంగా కనిపించింది.
పలకరింపులూ పరిచయాలూ అయింతర్వాత- ఆడాళ్ల మధ్య కట్టుకున్న చీరల నాణ్యత గురించిన భోగట్టాల ఆచూకీ పూర్తయిన తరవాత, మంగళాదేవి చేతి వాచీ చూసుకుంది. ఫంక్షన్ ఆరంభ మవడానికి వేదిక పైన అగ్రాసనాధిపత్యం స్వీకరించబోయే వారందరూ విచ్చేయడానికి సమయం ఉంది కాబట్టి- తను ఒకసారి అలా చూసొస్తానని భర్త చెవిలో చెప్పింది.
భార్య అక్కడి పరిసరాలతో మమేకం కావడం గమనించిన అశ్వథ్ చిరునవ్వు చిందిస్తూ అన్నాడు- “అలాగే! నీకు పచ్చటి చెట్లూ ఫల వృక్షాలూ చూస్తుంటే అప్పటి కాలేజీ ఫ్రెండ్సును చూస్తున్నంత అనుభూతే కదా! మరీ లోపలకు వెళ్తే చెట్ల నీడల్లో పడి దారి తప్పిపోయి యెటూ తోచని అయోమయంలో పడే ప్రమాదం ఉంది. నీకు దారి చూపించడానికి లేడీ అసిస్టెంటుని పంపిస్తాను.
బట్ ఒన్ థింగ్. అక్కడ కనిపించేవాళ్ళందరూ నేరాలు మోపబడ్డ ప్రిజినర్సు అనుకునేవు.
ప్రిజినర్లకు గైడ్ చేసే హార్టీకల్చరిస్టులుంటారు. వ్యవసాయరంగ నిపుణులు కూడా ఉంటారు. అన్నట్టు చెప్తే నమ్మవేమో గాని- ఇక్కడ పూల చెట్లూ ఫల వృక్షాలే కాక- వ్యవసాయ నిపుణుల సహాయంతో కొన్ని అరుదైన ఔషధ మొక్కలుకూడా పెంచుతారు. సతవా, నీలవేము, కొడిసపాల, టిప్పతీగ- ఇంకా చాలానే పెంచుతున్నారు. ఇక్కణ్ణించే కాక దూర ప్రాంతాలనుంచి కూడా ఆయుర్వేద వైద్యులు వచ్చి తీసుకెళ్తుంటారు. ఇక వెళ్ళిరా! త్వరగా వెళ్ళిరా! ”
“వాళ్ళందరితో నాకేం పనండీ! ఇదిగో- ఇలా వెళ్లి అలా వచ్చేయనూ! ” అంటూ మంగళ లేడీ అసిస్టెంట్ వార్డెర్ని అనుసురించింది.
కాని.. అలా జరగలేదు. ఆమె అనుకున్నట్టు ఇలా వెళ్ళి అలా రాలేకపోయింది. అసిస్టెంట్ వార్డెర్ సరోజను తీసుకుని వృక్ష సమూదయాల వాకిళ్ళ వేపు అడుగులు వేసిందామె. ఎన్నెన్నో కొత్త పరిసరాలు. ఇంకెన్నెన్నోవిచిత్ర మార్పులు. కొత్త కొత్త మొక్కలు. అంతటా చక్కదనం- శోభిల్లే పచ్చదనం. అన్నిటికీ తనకు తానుగా దూరమై ఆధారాలు లేని అనుమానాలతో వికార దృక్ఫథాలతో కొట్టుమిట్టాడుతూ తను జీవిస్తుందేమో! అయితే.. జీవితపు మనుగడలో మనిషి ఆలోచనలకు తోచని ఓ విచిత్రిత దాగి ఉంటుంది. అందులోనుంచి ఊహకందని వైరుధ్య సంశోభితం తొంగి చూస్తుంటుంది.
మరి కొద్ది దూరం నడుస్తూ వెళ్లిన తరవాత మంగళాదేవి అసంకల్పితంగా అంది- “సరోజా! ఇక మీరిక్కడే ఉండండి. దారులు సరిగ్గానే గుర్తుపెట్టుకున్నాను. స్వేఛ్ఛగా నాకు నేనుగా ఓపారి అలా చూసి వస్తాను“.
ఆమాటతో లేడీ అసిస్టెంట్ వార్డెర్న్ ఆగిపోయింది.
“అలాగే మేడమ్ గారూ! మరీ దూరం వెళ్ళబోకండి. ఇక్కడ ఫంక్షన్ కి టైమయిపోద్ది. నేనలా వెళ్లి ఇక్కడే పన్చేస్తు న్న మా ఆడపడుచుని చూసొత్తాను“ అని బదులిచ్చింది.
మంగళాదేవి అలాగే- అన్నట్టు తలాడించి ముందుకు నడిచింది; అక్కడ నేలంతా వ్యాపించి ఉన్న పరిమళ భరితమైన ప్రసూన వాసనల్ని తనివిదీర ఆస్వాదిస్తూ.. ఆమెకక్కడ ఇసుమంత నేరమయ వాతావరణం కూడా గోచరించ లేదు. ఎవరి పనులు వారు యధాలాపంగా క్రమ పధ్ధతిలో పనులు చేసుకుంటూపోతూన్న తోటి మనుషులు తప్ప అక్కడ నేరస్థులేరీ! బ్యారెక్సుకీ ఓపెన్ ఎయిర్ ప్రిజన్ కీ యెంతటి వ్యత్యాసం! నక్కకూ నాక లోకానికి ఉన్నంత వ్యత్యాసం కదూ..
మంగళ తనలో తను అనూహ్యమైన అనిర్వచనీయమైన ఆలోచనలతో ఆనందపడిపోతూ చెట్లన్నిటినీ కనుల వాకిళ్ళతో పలకరిస్తూ ముందుకు సాగుతోంది. ఇవే కాదు.. లోకంలోని చెట్లన్నీ ఒకానొకప్పుడు దేవతాస్రీలేనట. పార్వతీ దేవికి ఎందుచేతనే కోపం వచ్చి శపిస్తే ఆ దేవతలందరూ ఇలా చెట్లుగా మారిపోయారట. కట్టు కథో వాస్తవమో తెలియదు గాని, వినడానికి యెంత హృద్యంగా ఉంది!
అక్కడక్కడ ఇద్దరు ముగ్గరు ఖైదీ తోటమాలీలు చెట్ల పాదులకు పంపునీళ్లు చిందిస్తున్నారు. మరొక చోట ఇంకొందరు పాదులు తీస్తున్నారు. గొప్పులు తవ్వుతున్నారు. కొత్త మొక్కలు నాటడానికేమో.. అలా ఆలోచిస్తూ అక్కడొక క్షణం ఆగిందామె అనుకోకుండానే. పూలమొక్కలన్నీ ట్రిమ్ముగా వయ్యారపు వంపుతో షేపు కోల్పోకుండా ఆమె వేపు పలకరింపుగా తలలూపుతున్నాయి. చామంతి- పూబంతి- నంది వర్థనం- గరుడ వర్థనం- ముద్ద మందారం. రామబాణం- నిండారోగ్యంతో మెరిసే చంటి పాపల చెక్కిళ్ళలా ఆమెను దగ్గరకు రమ్మనమని పిలుస్తున్నట్లున్నాయి.
కారణం లేకుండా రీసెస్ లో విరగబడి నవ్వే మిడిల్ స్కూలు అమ్మాయిల నగుమోముల్లా ముద్దులు మూట గట్తున్నాయి. అప్పుడు తనను తను మరచిపోతూ మనసా వాచా కర్మణ: మైమరచిపోతూ, అటుతిరిగి కర్తవ్య చింతనా పరుడై పురుగుల మందు పిచకారీ చేస్తూన్న ఖైదీని అడిగింది- “అదేంవిటి?ఆ పూవు మనూరి జాతి పూవులా లేదే! ఫుట్ బాల్ అంతటి పెద్ద స్థాయిలో ఉందే! ఇంతకూ ఇదే ఊరిదండీ?”
ప్రక్కనే ఎవరిదో స్త్రీ గొంతు విన్నంతనే పిచకారీ చేయడం ఆపి ఆ ఖైదీ తోటమాలి తిరిగి చూసాడు. డంగైపోయి నిల్చున్నాడు. అంతే! ఒకరినొకరు కళ్ళు మిటకరించి చూసుకుంటూ అశ్చర్యచకితులవుతూ- “మీరా! మీరా! “ అన్నఅదే రీతిన ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఉండిపోయారు.
ఇద్దరికీ కొన్ని క్షణాల పాటు నోటమాట పెగల్లేదు. ఆ లోపల అతడి చేతిలోని పిచకారీ పంపు దానికదే చేతిలోనుంచి జారిపడింది. వెంటనే తనను తను తమాయించు కుంటూ చప్పున పైపుని అందుకుంటూ సర్రున అక్కణ్ణించి కదలబోయాడు. అమె కూడా తేరుకుంటూ వెన్వంటనే రియాక్టు అయింది- “ఆగండి! నిజం చెప్పండి. మీరు మిస్టర్ పవన్ కదూ! “
అతడేమీ అనకుండా తలవిదిలిస్తూ అక్కణ్ణించి కదలడానికి మరొకమారు యత్నించాడు. అప్పుడామె అతడి చేతిని అందుకుంది- “ప్లీజ్ ! ఆగి చెప్పండి. చెప్పకపోతే నా పైన ఒట్టే! ”
|
=======================================================================
ఇంకా వుంది...
=======================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments