'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 5'
New Telugu Web Series
Written By Pandranki Subramani
'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 5' తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ. .
అశ్వథ్, మంగళ భార్యాభర్తలు.
అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ గా కొత్తగా ప్రమోట్ అయ్యాడు. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.
అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది. .
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.
భర్త దగ్గర పవన్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తుంది మంగళ.
ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన- 5 చదవండి.
“అబ్బ! మళ్ళీ మొదలు పెట్టారూ! పూర్తిగా వినండి. విన్నతరవాత స్పందించండి. అప్పుడు అనుకోకుండా ఆ ‘టూ జీరో త్రీ’ తో మా ట్లాడాను. నాకెలా అనిపించిందంటే- అతడి ముఖవర్ఛస్సు చూస్తే అతడు నేరస్థుడిలా తోచ లేదండి. అతడు కళ్ళు పరిపూర్ణమైన నిశ్చలత్వంతో సజీవ చైతన్యంతో వెలగడం చూసానండి. నేరం చేసిన ఖైదీ కళ్ళు అంత ప్రశాంతంగా ఉండవండీ! ”
“మనోతత్వ విశ్లేషనన్నమాట! ఇక ముందుకెళ్ళి చెప్పండి మేడమ్- వింటాను“
“అసలా ఖైదీ డ్రెస్సు ఆ మనిషికేమాత్రమూ కుదరదనిపించింది. ముఖ్యంగా అతడి చూపుల్లో ఎక్కడా ఎప్పుడూ చూడలేని నిబ్బ రం కనిపించింది. అతడి కళ్ళల్లోని కాంతి చూస్తే- ‘మీరు నన్నేమి చేసుకుంటారో చేసుకోండి!’ అని అడుగుతున్నట్లు ఉంది. నేనిప్పుడు చెప్పొచ్చేదేమంటే, ఒకసారి అతడి కేసు ఫైలు తిరగదోడితే అసలు విషయం పైకి పొక్కవచ్చేమో! జస్ట్—యాజ్ యే మాటర్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్టు-- ”.
అది విన్న అశ్వథ్ వెంటనే బదులివ్వలేదు. విస్ఫారిత నేత్రాలతో చూస్తూండి పోయాడు. భార్య కళ్ళల్లో కానవచ్చే ఆర్ద్రత, దీర్ఘ భావ స్రవంతిలో ద్విగుణీకృ తమవుతూన్న ఉద్విగ్నత అతణ్ణి ఆలోచింపచేసింది. అంతేకాక, తననింత వరకూ నిశ్శబ్ద ఢమరుకంలా అలజడికి లోనుచేస్తున్న విషయం తననుకున్నంత ఆషా మాషీ వ్యవహారం కాదనిపించింది. అసందర్భంగా ప్రేలకుండా, అకారణంగా ఆవేశానికి లోనుకాకుండా- తొందరపడి ‘మంగళ మనసుని గాయపర్చకుండా చూడు సుమా’! - అని అతడిలోని సిక్స్తు సెన్స్ హెచ్చరించింది.
కొన్ని చిన్నచిన్న తడబాటులే, చిటపటి చినుకుల్లా యెదురు కావచ్చు-- కాని కాల ఘట్టాన యెదురు చూడని రీతిన అవి భారీ ఖరీదు కట్టమంటాయి! అశ్వథ్ నిదానంగా స్పందించాడు-- “అతడెవరో చూసుంటాను మంగళా! నెంబర్ని బట్టి అతడెవరో.. అతడెటువంటి వాడో.. ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. వాళ్ళందరూ సాధారణంగా డిప్యుటీ జైలర్ల అదుపాజ్ఞలలో ఉంటారు. అయితే- నేనిప్పుడు ఒకటి చెప్తాను. వింటావా మంగళా?”
ఆమె నిదానంగా తలూపింది.
”నాకు తెలుసు, నువ్వు మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న స్త్రీవని. ట్రైనింగ్ పీరియడ్ ని సగంలో ఆపేయకుండా పూర్తి చేసుకుని లీగల్ ప్రొఫెషన్ లోకి వెళ్ళి ఉంటే ఒక ప్రముఖ లేడీ లాయర్ గా ఓ సోషియల్ యాక్టవిస్టుగా ఓవెలుగు వెలిగుండేదానివని. గొప్ప ఆలోచనలు హృదయవైశాల్యం గల వాళ్ళకే వస్తాయన్నది నాకు బాగా తెలుసు. అందుకేగా ఇన్ స్టీన్ మహాశయుడు అన్నాడు- ‘నాకు వచ్చే గొప్ప ఆలోచలన్నీ భవగవంతుడి వద్దనుండే వస్తాయి‘ అని.
అయితే నీతో వచ్చిన గడబిడ వ్యవహారం యేమంటే- అతి సున్నితత్వ స్వభావం వల్ల ఎక్కువగా హృదయంతోనే ఆలోచిస్తావు, హృదయంతోనే ఎక్కువ పనులు చేయ తలపెడ్తావు. కాబట్టే- నీ ముందున్న ఉజ్జ్వల కెరీర్ని సహితం మలుచు కోకుండా భర్తగా నాపైన ప్రేమభావంతో అత్తగారికి తోడుగా ఉండాలన్న ఉదాత్తమైన ఆలోచనతో నాలుగు గోడల మధ్యా గృహిణిగా యిమిడి పోవడానికి సిధ్దపడ్డావు. అంచేత నీలో ఉన్న స్త్రీత్వం అంటే నాకు ఇష్టం. మరి అదే సమయంలో నీలో హద్దుమీరిన ఒక అవగుణం కూడా ఉన్నట్లనిపిస్తుంది”
ఆ మాటవిని మంగళ కనురెప్పల్ని అల్లార్చి చూసింది- అదేమిటన్నట్టు--
అశ్వథ్ మళ్ళీ చెప్పసాగాడు- “తెలియని తనం అనను గాని. అలవికి మించిన అమాయకత్వం ఉందనిపిస్తూంది. ఇటువంటి పోకడ రాను రాను పెళుసైన మనస్తత్వానికి దారి తీస్తుంది. ఇప్పుడు నువ్వేమంటున్నావంటే- ముఖం చూస్తే, ముఖంలోని ప్రశాంతత చూస్తే.. ఎదుటి వ్యక్తిలోని మంచితనం తెలు స్తుందంటున్నావు. అటువంటి ప్రశాంత ముఖంలో అమాయకత్వం తొంగి చూస్తుందంటావు.
నువ్వు సైకలాజీ చదువుకున్న దానివే! కాదనను. అయినా నీ మాటలు వింటుంటే నాకు అప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలలోని ప్రతినాయకులు గుర్తుకొస్తు న్నారు. సీనులోకి వచ్చీ రావడంతోటే తెలిసిపోతుంటుంది- వాళ్ళు ప్రతినాయకులని. చెరొకవేపూ నిమ్మకాయలు నిల్చోగల బుర్రమీసాలు. చెంపన అణా కాసంత పులిపిరికాయ- నుదుట నల్లగా పడ్డ గాటు- పల్చటి సిల్కు ఖద్దరు జుబ్బాలో మెలికలు తిరిగిన కండరాలు—ఇవన్నీ వచ్చీ రావడంతోటే చెప్పేస్తాయి వాడొక లోఫర్ అని.
కాని ఈ కాలంలో- అదీను ఇప్పటి ఇన్ స్టంట్ కాస్మోటిక్ నాగరిక ప్రపంచంలో చెడ్డవారిని చెడ్డవారిగా గుర్తుపట్టడం అంత సులభతరం కాదు. ఎందుకంటే ఈ కాలపు క్రిమినల్స్ చాలామంది చదువరులు- సైకలాజీలో మాష్టర్స్.
అందుకే చెప్తున్నాను- కొందరు ఖైదీలు చూడటానికి అమాయకంగా ముక్కుపచ్చలారని ముఖాలతో నోట్లో వ్రేలు పెట్టినా కరవలేనంత దీనంగా గోచరిస్తారు. మనల్ని ఆకట్టుకునేలా హుందాతనం ఉట్టిపడేలా ప్రవర్తిస్తారు. అదంతావాళ్లు కొని తెచ్చిపెట్టు కున్న లైఫ్ స్టైల్. ఒక్కసారి గాని వాళ్ళ కడుపులోకి తొంగి చూస్తే- అందులో ఎన్నెన్ని అమాయకపు జీవుల కళేబారాలు దాగున్నాయో- వాళ్ళ వల్ల ఈ నేల పైన ఎంత ఎత్తున రక్తమోడిందో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను భార్యామణీ- ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్న సూక్తి ఏనాడు కొండెక్కి పోయింది”.
అతడు చెప్పడం ఆపి మంగళ వేపు తేరిపార చూసాడు. ఆమె యేమీ అనలేదు. చిన్నగా నవ్వి ఊరకుంది. “మరొక ప్రాక్టికల్ పాయింట్ కూడా చెప్తాను. వింటావా?”
“ఎందుకు విననూ! మీ జీవన సహచరిని. నేను వినకపోతే ఇంకెవరు వింటారు చెప్పండి” చిరునవ్వు చిందించ కుండానే పెదవుల బిగువన ఆ మాటల్ని అందామె.
ఆమె మాట చమత్కారానికి అతడు కూడా నవ్వుతూ అన్నాడు- “నువ్విక్కడ జైలు పోలీసు ఆఫీసరు భార్యవి కాబట్టి మంచిగా ప్రవర్తిస్తే రేపు ఇక్కడి వాళ్ళకు కలసిరావచ్చు. ఆఫీసు సీనియర్ స్టాఫ్ కి అసిస్ట్ చేస్తే మంచి కలగవచ్చు. ఆ లేడీ వార్డెర్ని తీసుకో! నీ ముందు మన్ననతో వంగి వంగి ఎందుకంత వినయంగా మూవ్ చేస్తుందను కుంటున్నావు? ఆవిడ భర్తకూడా ఇదే చోట సెల్ ఖైదీలను అదమాయిస్తూ తిరిగే అసిస్టెంట్ మేల్ వార్డనర్. ఇద్దరూ వాళ్ల వాళ్ల రీతుల్లో నేరాలు చేసి వచ్చిన వాళ్లే.
అతడేమి చేసాడంటే- స్పెషల్ సెక్యూరిటీ జోన్ లో ఉన్న సెల్ ఖైదీలకు గంజాయి పొట్లాలు స్మగల్డ్ చేసుకొచ్చి అందించేవాడు. డబ్బు చేసుకునేవాడు. ఇలా ఎన్ని రోజుల్నించి చేస్తున్నాడో మరి. . బైటనుంచి వచ్చీపోయే లారీ డ్రైవర్లు క్లీనర్ లు పడ్రంగి పని వాళ్ళు- ఇంటువంటి వాళ్ళతో సంపర్కం పెట్టుకుని పని కానిస్తుండేవాడు. మొన్నొక రోజు జరిపిన స్క్వేడ్ దాడిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు.
పట్టుబడ్డ అదేరోజు వాడి స్టేటస్ ని తొలగించి సంస్పెండ్ చేసి మామూలు ఖైదీగా మార్చారు. ఇప్పుడు అందరిలాగే కామాటి పనులు చేస్తున్నాడు. ఇక అసలు విషయం యేమంటే- రేపు యేవైనా కారణాలు అనుకూలించి అతగాడి సస్పెన్సన్ యెత్తి వేసినా అతణ్ణి ఇదే జైలులో అదే స్థాయిలో వేసే ప్రసక్తి లేదు.
అందుకే ఆలేడీ అసిస్టెంటు వార్డర్న్ అందరి ఆఫీసర్ల కుటుంబాలముందూ అతి విధేయతలు చూపిస్తూ వాళ్ల ద్వారా పై అధికారుల్ని, ముఖ్యంగా జైలు అడ్వైజరీ కమిటి మెంబర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయిత్నిస్తుంటుంది- అంతే సంగతులు”
అంతావిన్న మంగళాదేవి ఇంకేమీ అనకుండా మౌనంగా లేచి వెళ్లి ఫ్రిజ్ తెరచి పళ్ళరసం కలిపి తెచ్చి అందిచ్చింది. తను కూడా నిశ్శబ్దంగా తాగసాగింది. అశ్వథ్ మనసున అసౌకర్యం వంటి భావం కలిగింది- “ఏంవిటి అలాగుండిపోయావు? నా స్పందన నెగటివ్ గా ఉందని నొచ్చుకుంటున్నావా! ”
ఈ సారి ఆమె మృదువుగా నవ్వేందుకు ప్రయిత్నించింది. క్షణం సేపు అశ్వథ్ ముఖంలోకి తేరిపార చూస్తూండి పోయింది. ఆ తరవాత తేరుకుంటూ అంది- ”నా మనసులో మెదిలేది అది కాదండి“
మరింకే మన్నట్టు కళ్ళెత్తి చూసాడు.
“జుడీషియల్ లెవల్ లో గాని- అడ్మినిస్ట్రేషన్ లెవల్ లో గాని ఒక స్థాయి ఆఫీసర్లకు అంతర్గతమైన క్వాసి జుడీషియల్ పవర్స్ ఉంటాయి, అవునా?"
ఊఁ అన్నాడతను.
“అందువల్ల నేను రిక్వెస్టు చేస్తున్నదేమంటే- మీరు గాని ఒకసారి సొమొటోగా టు- జీరో- త్రీ కేసు ఫైలుని తిరగదోడితే తప్పకుండా తెరమరుగున కనిపించకుండా తప్పుకున్నది- ఇంతవరకూ కనిపించనిది బయటకు వచ్చే తీరుతుందంటాను“
ఆ మాటతో అశ్వథ్ ఆశ్చర్యంగా చూసాడు. ప్రసన్న పూర్ణమైన ఆ సుందర ముఖారవిందంలో ఎంతటి గాఢమైన పట్టు దల దాగి ఉన్నదో అతడికి తెలుస్తూనే ఉంది! మంగళతో హృదయమిచ్చి- హృదయం తీసుకుని సంసారాన్ని నెట్టుకొస్తూన్న అశ్వ థ్ కి తెలుసు; ఆమెకు అంత త్వరగా నచ్చచెప్పి దరిచేర్చడం సులభసాధ్యం కాని వ్యవహారమని. అంతవరకూ అతణ్ణి అతల కుతలం చేస్తూన్న ఉద్విగ్నతకు అర్థం లభిస్తున్నట్లనిపించింది.
కొన్నాళ్ళుగా ఆమెనూ తననూ అంతులేని ఊపుకి లోనుచేసిన అగమ్యగోచర వ్వవహారానికీ ఆ టూ- జీరో- త్రీకీ ఏదో సంబంధం ఉండేతీరాలి మరి. తరచి చూస్తే విషయం లోతైనదనే తోస్తూంది, ఎందుకూ- తన భార్య మంగళ కూడా లోతైనదేగా! అప్పుడతని ముందు కొత్త కర్తవ్యమొకటి పుట్టుకొచ్చినట్లనిపించింది. ఇకపైన భార్యను గాడిన పెట్టించి హృదయంతో కాకుండా మెదడుతో ఆలోచింపచేయడం-- ఇక అశ్వథ్ మరేమీ మాట్లాడకుండా ఫ్రూట్ జ్యూస్ గ్లాసుని అక్కడలాగే ఉంచేసి మరునాడు డ్యూటీకి కాస్తంత పెందలకడే వెళ్ళవలసుందంటూ మిగతాది తరవాత చర్చించుకుందాం అంటూ నిద్రకుపక్రమించాడు.
అతడంతవరకూ ఒక్కసారి కూడా మంగళను ఆ టూ- జీరో- త్రీ ఖైదీ పట్ల అంతటి అక్కరెందుకు చూపిస్తున్నావని అడగలేదు. హృదయపు పొంగుతో సున్నితమైన మనస్తత్వంతో జీవన నదిని దాటాలని ఈదే స్త్రీల విషయంలో నాజూకుతనం- నెమ్మది తనం చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నది అతడికి బాగానే తెలుసు.
మంగళ నిద్రపోలేదు. ఆమెకు చాలా సేపు నిద్రపట్టలేదు. బయట రోడ్డుపైన రివ్వు రివ్వున దూసుకుపోతూన్న వాహనాల సైరన్ల్ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉన్నట్లుండి ఉలిక్కిపడ్డట్లు పిట్టలు కూడా కూస్తున్న గొంతులు వినిపిస్తున్నాయి. ఆమె నిదానంగా యధాస్థితికి రావటానికి పూనుకుంది. సంభాషణను అధికంగా సాగదీసి భర్తను అకారణంగా అసహనానికి లోను చేసిందేమో!
జైలు గోడల మధ్యే కాక, జైలుకి ఆవల కూడా పోలీసు ఆఫీసర్లకి నూరు రాచరికాలుంటాయి. వృత్తి పరమైన ఒత్తిళ్ళు లెక్కకు మించిన రీతిన ముంచుకు వస్తుంటాయి. తన వద్దకు వచ్చి డ్యూటీలో ఎదురవుతూన్న సమస్యలన్నిటినీ ఏకరువు పెట్టడు అశ్వథ్. చాలా అవసరమైన విషయాలను మాత్రమే చెప్తాడు. అదీను తను ఉక్కిరబిక్కిరి కాకుండా విషయాన్ని వడపోతకు లోను చేసి మరీ చెప్తాడు.
అటువంటి సంస్కావంతుణ్ణి అలా టైట్ కంపార్టుమెంటులోకి ఇరికించి హీటెడ్ వాతావరణం లోకి నెట్టడానికి ప్రయిత్నిండం సముచితం కానేకాదు. అనుకోకుండా ఆమెకు ఓ విధమైన గీల్టీ ఫీలింగ్ కలిగింది. అందువల్ల భర్తను ఊరడించాలన్న తలంపుతో సంభాషణను కొనసాగించింది.
“నిద్రపోతున్నారా ప్రియసఖా! ”
“ఉపక్రమిస్తున్నాను ప్రాణ సఖీ! ”
“ఒకటి చెప్పేదా? ”
“నాకు తెలుసు నువ్వేంటి చెప్పబోతున్నావో- నీ టోన్ ని బట్టి. నీ కిష్టమైన పద్య పఠనంతో నన్ను సమీపిస్తావని. నన్ను ప్రశాంతంగా నిద్రపుచ్చుతావని, నౌ ప్రొసీడ్ మై లవ్లీ బ్యూటిఫుల్ ఉమన్! ”
ఆమె చిన్నగా నవ్వి థేంక్స్ చెప్పి పాడనారం భించింది- “అడుగ కర్థమిచ్చునతడు బ్మహ్మజ్ఞాని. అడుగునర్థమిచ్చునతడు త్యాగి-- “అటు తరవాత ఆమె చెప్పకుండా ఆగిపోయింది.
అప్పుడతడు ఆమె వేపు తిరుగుతూ అన్నాడు- “ఆగిపోయావేం? మిగతాది కూడా చెప్పి ముగించు. అదెందుకులే- వేమన వారి వేదవాక్కేగా! నేనే చెప్పి ముగిస్తాను—‘అడుగనీయలేని యతడు పెనులోభి! ’అంతేకదూ నువ్వుచెప్పి ముగించబోయేది? “
మంగళాదేవి బదులివ్వలేదు. చిన్నగ నవ్వి భర్తకు ఆనుకుని కళ్ళు మూసుకుంది.
మేడ్ ఫర్ ఈచ్ అదర్!
=======================================================================
ఇంకా వుంది...
=======================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments