top of page
Writer's picturePandranki Subramani

అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 7


'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 7' New Telugu Web Series

Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 7' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ...


అశ్వథ్, మంగళ భార్యాభర్తలు. అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ గా కొత్తగా ప్రమోట్ అయ్యాడు. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.


అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.


భర్త దగ్గర పవన్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తుంది మంగళ. ముఖాన్ని చూసి ఖైదీల మనస్తత్వాన్ని అంచనా వేయలేమని భార్యతో అంటాడు అశ్వథ్.


మూడు రోజులాగి మళ్ళీ పవన్ ప్రస్తావన తెస్తుంది మంగళ.

తల్లిని చూడాలంటూ పుట్టింటికి బయలుదేరుతుంది.


ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన- 7 చదవండి.


ఇంటివాకిట సూటుకేసునీ ట్రావెలింగ్ బ్యాగునీ రెండుచేతులా పట్టుకుని ఆటోరిక్షానుండి దిగుతూన్న కూతుర్ని చూసి, ముంగిట కసవు ఊడుస్తూన్న ఊర్మిళాదేవి అశ్చర్యంగా- “ఆ వచ్చేది మంగళేనా!” అన్నట్టు కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది.


రిక్షా అతనికి చార్జీ చెల్లించి వాకిట వరకూ వచ్చి నిల్చున్న కూతుర్ని చూసి ”మంగళాదేవే!” అని తేల్చుకుంటూ ఎదురెళ్ళి చేతినుండి సూటుకేసుని అందుకుని- “అదేంవిటే అలా చెప్పాచెయ్యకుండా వేడి నీళ్లు పోసుకున్నట్టు వచ్చేసావు! కబురంపితే మీ నాన్న బస్టేషనుకి వచ్చి తీసుకురారూ?” అని అడిగింది.


ఆమె పైకి యథాలాపంగా మామూలు వ్యవహారంలా ముఖం పెట్టి అడిగిందే గాని, లోలోన గొంతు ముడి వద్ద గజి బిజి ఊహలు ఒక్క పెట్టున చెలరేగుతూనే ఉన్నాయి. స్వతస్సిధ్ధంగా కూతురుది యెంతటి మృదు స్వభావమో;విషయం ఏదైనా బెడిసి కొడితే అంతే మోతాదున హృదయావేశమూ చూపిస్తుంది. అంతు తేల్చుకోనిదే ఒక పట్టాన విడిచి పెట్టదు. వియ్యంకురాలి గురించి తనకు తెలుసు. మంగళకు భరతమ్మ అత్తకాదు-స్వంత తల్లే. మరి నేడు ముందస్తు కబురు కూడా లేకుండా-యుధ్దం కాని యుధ్ధం వంటి సరిహద్దు ఫిరంగి మోతలా పుట్టింట్లో దిగిందంటే మెట్టింట పుట్టి మునిగిందన్న మాటేనేమో! ఎక్కడో ఏదో ఎడారి సుడిగుండమే చెలరేగి ఉంటుంది. పుట్టిల్లు ఎంతదగ్గ రైతే మటుకు భర్తతో చేతులు జోడించి వచ్చి ఉంటే అది వేరే విషయంగా ఉండదూ! కనుల పండువుగా కనిపించదూ! మంగళ పెదవి విప్పలేదు. బదులివ్వ లేదు.


కుడిచేతనున్నట్రావిలింగ్ బ్యాగుని ఇంట్లోపల ఉంచి, మళ్ళీ గడప దాటి బైటకొచ్చి తీరుబడిగా రెండుచేతుల్నీ నడుం పైన ల్యాండింగ్ చేసి కుదురుగా చూపులు నిలిపి స్పందించింది- “ఏం?నేను నా పుట్టింటికి రావాలంటే జయభేరి మ్రోగిస్తూ బుచ్చెర పాలెం బూర ఊదుకుంటూ యేతెంచాలా!పెళ్లయినంత మాత్రాన మేకు కొట్టి దిగేసిన అమ్మవారి పటంలా మెట్టింట్లోనే పడి ఉండాలా? మీ అల్లుడిగారికున్నట్లే నాకు మాత్రం స్వంత పనులేవీ ఉండకూడ దంటారా?“


ఈసారి ఊర్మిళాదేవి గుండెల్లో నిజంగానే ఏదో కలుక్కుమన్నట్లయింది. కూతురు అంత నిదానంగా హుం దాగా చెక్కుచెదరని ముఖ భావంతో స్పందిస్తుంటే- చెరువు నీళ్ల పైన కనిపించేంత ప్రశాంతత కూతురు లోలోన లేదేమో!


తల్లి కళ్లలోని అనుమానపు చూపులు- ముఖాన తాండవించిన సందిగ్ధాస్థ చూసి మంగళ చల్లబడింది. కూతుళ్ళ కాపు రాల గురించి తల్లులందరూ చూపించే వ్యాకులత మామూలేగా!


”అలా బెంబేలు పడిపోయి చూడకమ్మా అదేదో అప్రకటిత పోరు ఆరంభమైనట్టు! నీ కూతుర్ని. నీ కడుపున పుట్టిన దానిని. నేనెలా తొందరపడి వచ్చేస్తాననుకుంటున్నావు? మా అత్తమ్మ నాకు బాగా దోస్త్. ఆమెతో నేనెందుకు పేచీ పూచీ పెట్టుకుని వస్తాను? ఆయన ప్రోత్సాహంతోనే నేను యాక్టివ్ సర్వీస్-లీగల్ సర్వీస్ చే యడానికి పూనుకున్నాను. ఆ మాటకొస్తే, నా “లా” పుస్తకాలన్నీ ఇంట్లోనేగా పడున్నాయి. చదివిన లీగల్ కేసులన్నిటినీ రివైజ్ చేసుకొని, ప్రొసిడ్యరల్ “లా” ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఇవన్నీ స్వంతంగా నాకు నేనుగా చేసుకునే పనులు కావు. నేను చదివిన కాలే జీలోనే ఫ్రొఫెసర్ గా ఉండి రిటైరయిన పిదప స్వంతంగా ‘లా’ ఫాం పెట్టుకుని లీగల్ కన్ సల్టేషన్ సర్వీసు చేస్తూన్న మా గురువు గారి వద్ద ట్రైనీ -కమ్-అసిస్టెంటుగా చేరబోతున్నాను.


ఈ లోపల మా గురువుగారి వద్దనుండీ కబురు కూడా వచ్చింది వెంటనే వచ్చి చేరమని. సంసార జంజాటంలో పడి నా న్యాయశాస్త్ర పట్టం వృథా అయిపోతుందని నాన్నగారిలాగే ఆయన కూడా తెగ ఇదయిపోతుంటేను--ఇప్పుడర్థమైందా నా రాక వెనకున్న పరమార్థం?ఇప్పుడైనా కాస్తంత తేటగా నవ్వుతల్లీ!”


అప్పుడు గాని ఊర్మిళమ్మ మనసు తేటపడలేదు. నవ్వు చిందిస్తూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.

కూతురు చెప్పిన విషయం వెనుకు ఉన్న కథా కమామిషూ ఎంటువంటిదైనా- అల్లుడు మంగళను ఒక మంచి ప్రయోజ కురాలిగా ఒక ఉన్నత స్థితిలో చూడాలనుకుంటున్నది మాత్రం ఆమెకు తెలుసు. ఇక కుటుంబ పక్షంగా చూస్తే- సామర్థ్యం గల ఆడది వేణ్ణీళ్ళకు చన్నీళ్ళగా రెండు రాళ్ళు సంపాదించాలని తలపోస్తే ఏ మగాడు మడి కట్టుకుని కాదంటాడు!


అయినా చివరి అధ్యాయాన్ని మాట పలుకుతో వత్తాసుగా ముగించాలన్న ఉద్దేశ్యంతో అంది ఊర్మిళాదేవి-ఇంకా చెదరని నవ్వు ముఖంతో- “మరి మొన్న అల్లుడుగారితో ఫోనులో మాట్లాడినప్పుడు నువ్వు చేయబోయే లీగల్ సర్వీసు గురించి మాట మాత్రంగానైనా చెప్పలేదే!”


“నీది మరీ ఛాదస్తమమ్మా! మా అత్తగారేమో ఊరికి వెళ్ళారు. ఆమె గాని ఉండి ఉంటే విషయం చెప్పి ఉండేవారు. ఇక మీ అల్లుడి గురించి చెప్పాలంటే— ఎప్పుడూ జైలు గోడల చుట్టూ తిరుగుతూ కోర్టుకేసులకు హాజరవుతూ తెగ హడావిడి పడిపోతుంటారు. ఎప్పుడు చూసినా హార్డ్ కోర్ ఖైదీల మధ్య తిరుగుతుంటారేమో- వాళ్ల కరకుతనం కూడా ఆయనకు అబ్బినట్లుంది.


సున్నితమైన విషయాల గురించి తలపోయడం ఈ మధ్య మరచిపోతున్నట్టున్నారు. ఏదీ- ఫోను ఇలా ఇయ్యి. ఇప్పుడే ఆయన్ను అడుగు తాను- నీతో యెందుకు మాట వరసకైనా చెప్పలేదని--”


“అంత సీను వద్దుగానీ, ముందు లోపలకు వెళ్లి రా! మీ నాన్న యేదో ముఖ్యమైన ఆఫీసు పని చేసుకుంటున్నారు“


ఆ మాటతో మంగళకు గతుక్కుమంది. ”నాన్నగారు ఇంట్లోనే ఉన్నారా!ఇంతవరకూ చెప్పలేదేమి?”


“నేను చెప్పలేదు సరే. మరి నువ్వు అడగలేదేమి?” అంటూ నవ్వుతూనే లోగిలి వేపు కదలబోయింది ఊర్మిళమ్మ. కాని అదే సమయంలో సివిల్ లాయరైన జగదీశం అక్కడకు రానే వచ్చాడు. వచ్చి కూతురి నెత్తిపైన చేయివేసి గుండెకు హత్తుకున్నాడు. అతడికి కూతురంటే వాత్సలం. కూతురికి సున్నిత స్వభావం కాస్తంత అధికమైనా మంచి తెలివైనదని- స్థిరచిత్తమూ హుందాత నమూ గల అమ్మాయన్న సదభిప్రాయం ఆయనకు ఉంది. అంతేకాక- మంగళలోని మరొక అంశం అతణ్ణి ఆకట్టుకుంది. ఎదుటివారిని ఎట్టి పరిస్తితిలోనూ నొప్పించకూడదన్న సత్సంకల్పాన్ని పాటిస్తుంది. పచ్చదనం తరగని తీవెలా కళకళలాడుతూ ఉంటుంది.


అప్పటికతడు ఆలోచనలు కట్టిపెట్టి, మంగళ తల నిమురుతూ అడిగాడు- “బాగున్నావా తల్లీ! మీ అమ్మ చాలాసేపు ఆరుబైట నిల్చుని మాట్లాడుతుండటం చూసి తెలిసిన వారెవరో వచ్చారనుకున్నాను. అల్లుడుగారు ఎలా ఉన్నారు?


మా వియ్యంకురాలు కులాసాయేనా!”


“మేం బాగున్నాం నాన్నా! మీరెలాగున్నారు? కోర్టు కేసుల్లోపడి టెన్షన్ కి లోనయి షుగర్ లెవల్స్ బిపి లెవల్స్ చూసుకోవడం మరచిపోవడం లేదు కదా!”


జగదీశం నోటితో కాకుండా పెదవుల చివరన బిగించిన చిర్నవ్వుతో తలూపాడు.


అప్పుడు మంగళ మళ్లీ అందుకుంది- “అది సరే గానీ! వంధిమాగధుల్లా మీ చుట్టూ తిరిగే మీ జూనియర్లేరీ? చెప్పాచెయ్యకుండా డుమ్మా కొట్టేసారా?”


“భలే దానివమ్మా! నువ్వొచ్చేసావు గనుక అందరికీ ఇప్పుడిప్పుడే పొద్దు పొడిచిందను కుంటున్నావా! వాళ్లకప్పగించిన కేసుల్ని వాళ్లు చూసుకోవాలి కదా! కోర్టులన్నీ ఒకే కాంప్లెక్సులో ఉండవు మరి. హియరింగ్ సమయంలో ఏవైనా అడ్డంకులు వస్తే అప్పుడు నన్ను సంప్రదిస్తారు. అదంతా తరవాత మాట్లాడుకుందాం గాని.. మొదట మీ గురువుగారి గురించి చెప్తాను. విన్న తరవాత అడుగు వేయి. నువ్వు చెప్పినట్టే కోర్టులో ఎదురైతే మీ గురువుగారు వేంకట్రావుగారితో మాట్లాడానమ్మా!“


ఆ మాటవిని ఊర్మిళమ్మ కళ్ళుపెద్దవి చేసుకుని దగ్గరకు వచ్చింది విసురుగా- ”అంటే- నాకు తెలియకుండానే తండ్రీ కూతురూ చాలా విషయాలే మాట్లాడుకుంటున్నారన్నమాట!”


అది విని జగదీశం భార్యవేపు తిరిగి చూసి నవ్వాడు- “విషయం ఏదీ కొలిక్కి రాకుండా నీకెలా చెప్పేదోయ్!” అంటూ మళ్ళీ మంగళ వేపు తిరిగి చెప్పసాగాడు- “కొన్నాళ్లు ఇంట్లోనే ఉండి లా-పుస్తకా ల్ని- లా-జార్నల్సుని రిఫర్ చేసుకోమన్నారు. ముఖ్యమైన ల్యాండ్ మార్కు కేసుల్ని గుర్తుపెట్టుకోవడానికి కృషి చేయమన్నారు. ఆ తరవాత ఫోను చేసి వచ్చి చేరమన్నారు. వీలుంటే ఓసారి అశ్వథ్ ని ఇంటికి తీసుకురమ్మన్నారు. నేనడక్కుండానే తన వద్ద పనిచేసే అందరు లీగల్ అసిస్టెంట్లకు ఇచ్చినట్టే నీకూ రిమ్యునరేషన్ ఇస్తానన్నారు. హి సీమ్స్ టు బి ఎ రీజనబుల్ మ్యాన్. అన్నట్టు చెప్పడం మరిచేను. నీ బార్ కొన్సిల్ మెంబర్ షిప్పుని రిన్యూ చేసుకుంటున్నావా? అది గాని ల్యాప్స్ అయిందంటే కొత్త వాళ్ళకు పెట్టిన నిబంధన ప్రకారం నువ్వు కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వ్రాయాలేమో!”


మంగళ సమాధానంగా తలూపుతూ బదులిచ్చింది- “దానికేముంది నాన్నగారూ! ఏ వైనా కొత్తరూల్స్ పడిరాళ్ళలా వచ్చిపడితే రిటర్న్ గాని ఓరల్ గాని ఎందుకు హాజరు కానూ? కొంచెం శ్రమపడి చదివితే అదే అప్ డేట్ అయిపోతుంది”


అప్పుడు మళ్ళీ ఊర్మిళమ్మ కలుగజే సుకుంది- “క్లయింట్ల తరపున కోర్టుకి హాజరవుతూ వాళ్లాయనను కోర్టులోనే సవాలు చేయాలని ఉబలాటపడు తుందేమో!’


అది విని మంగళ మొదట గతుక్కుమన్నట్టు చూసి ఆ తరవాత తేలిగ్గా నవ్వేసింది. నవ్వుతూనే తండ్రి కాళ్లకు నమస్కరించి లోపలకు వెళ్లి తన గురువుగారైన క్రిమినల్ లాయర్ వేంకట్రావుగారితో ల్యాండ్ లైన్ లో పలకరించి ఇల్లు చేరిన వైనం తెలియజేసింది. ఇక విషయానికి వస్తే, అందరిలాగే లాయర్ల మధ్యకుడా ఇచ్చి పుచ్చుకునే సర్దుబాట్లు ఉంటాయి. మంగళను వేంకట్రావుగారు అసిస్టెంటుగా తీసుకున్నట్టే ఆయన చెప్పి పంపిన -లా-గ్రాడ్వేట్లను జగదీశం కూడా తన అసిస్టెంట్లుగా తీసుకోవడం కద్దు.


ఇవన్నీ స్నేహపూరిత సంబంధాలు. ఈ రీతిన ఫ్రెష్ లా గ్రాడ్వేట్సుకి ప్రాక్టికల్ ట్రైనింగు, గ్రౌండ్ లెవల్ పధ్ధతుల పట్ల తగినంత అవగాహన దొరికే అవకాశం మెండుగా ఉంటుంది. ఉభయతారకం అన్నమాట.


నట్టింట దీపస్తంభంలా తమ ఒక్కగానొక్క కూతురి రాకతో ఇంటి ముంగిట మునుపటి కళా కాంతీ పెళ్ళు మన్నట్ల నిపించింది జగదీశానికీ ఊర్మిళమ్మకూ. త్వరగా బైట పడడుగాని-జగదీశానికి ఆ అలికిడి వల్ల వచ్చిన సంతోషం మరీను.


మొన్నొక రోజు ఒక సోషల్ వెబ్ సైట్లో ఒక ప్రశ్న వేసారు దృష్య మాధ్యమ యాంకర్లు- “కూతుళ్లు తండ్రులకు ఎక్కువగా దగ్గరవుతుంటారు. ఎందుకు?“ అని.


ఆ కార్యాక్రమాన్ని అతడు ఆసక్తితో ఫాలో చేసాడు. ఆ ప్రశ్నకు వచ్చిన పెక్కు జవాబుల్లో అతడికి నచ్చినది ఒకటి వచ్చింది- “ఆడపిల్లల తల్లుల్లా కాకుండా తండ్రులు సాధారణంగా మౌన నివేదన అర్పిస్తూ జీవిస్తారు. వాళ్ళకు కూతళ్ళను చూస్త్తుంటే తమ తల్లుల కళ్లు కనిపిస్తాయి. చిన్నమ్మల పెద్దమ్మల గొంతులు వినిపిస్తాయి. తమతో బాటు పెరిగి పెద్దయిన తోబుట్టువుల ఆటలూ పాటలూ గుర్తుకొస్తాయి!”


ఇక ఊర్మిళమ్మ విషయానికి వస్తే- కూతురుని సంతోష పెట్టడానికి- పచ్చటి మార్దవమైన జ్ఞాపకాలను కళ్ళముందుకు తెచ్చుకోవడానికి ఆమె చేసిన మొదటి పని; భర్తతో కలసి మంగళ రెండు కళ్లూ మూసి పెరడు తోటలోకి తీసుకెళ్ళి భళ్లున విడిచి పెట్టడం. మెల్లగా కళ్ళువిప్పిన మంగళకు విరబూసిన సన్నజాజి పందిరి కళకళలాడుతూ పలకరించింది. ముద్ద మందార పూల చెట్టు ఆమెను మురిపెంగా చూసి నవ్వింది. సంపెంగ చెట్టేమో మంగళ తలను సుతారంగా స్పర్షించడానికి గాలిని ఊతగా తీసుకుని క్రిందకు వంగింది. మంగళ అలికిడి విని ఫెళ్ళున మేల్కున్నట్టు కోకిలమ్మ కూహూ-కూహూ- అని చెట్లసందులమ్మట కళ్యాణి రాగం వినిపించనారంభించింది. తన్మయత్వంతో ఆమె కళ్ల చివర్లు తుంపరతో తడిసాయి. బడి రోజుల జ్ఞాపకాలు వాన పాటల్లా పూబంతుల జల్లులా ఉక్కిరి బిక్కిరి చేసాయి.


అప్పుడామెకు ఉన్నపళాన అశ్వథ్ కళ్ల ముందు కనిపించాడు. అతడి వెచ్చటి ఊపిరి ఆమె చెంపలకు తాకినట్లనిపించింది. అతడి మోహపూరితమైన గుసగుసలు గుండెల్లో యేవో ఊసులు చెప్పినట్లనిపించింది. అది భ్రమే--- కాని ఎంతటి ప్రేమ పూరితమైన మధురాతి మధురమైన భ్రమ— ఎంతటి మనోహరమైన యవ్వన ప్రాయ మధురోహ--

=======================================================================

ఇంకా వుంది...

=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






31 views0 comments

Comments


bottom of page