'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 8' New Telugu Web Series
Written By Pandranki Subramani
'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 8' తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ...
అశ్వథ్, మంగళ భార్యాభర్తలు. అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.
అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.
భర్త దగ్గర పవన్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తుంది మంగళ. ముఖాన్ని చూసి ఖైదీల మనస్తత్వాన్ని అంచనా వేయలేమని భార్యతో అంటాడు అశ్వథ్.
మూడు రోజులాగి మళ్ళీ పవన్ ప్రస్తావన తెస్తుంది మంగళ.
తల్లిని చూడాలంటూ పుట్టింటికి బయలుదేరుతుంది.
తాను లాయర్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు, అందుకోసం కొద్దిరోజులు తన గురువుగారి వద్ద జూనియర్ గా చేరబోతున్నట్లు చెబుతుంది.
ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన- 8 చదవండి.
అశ్వథ్ ఆ రోజంతా జైలు వ్వవహారాలలో గొంతు ముడివరకూ మునిగిపోయాడు. అతడి పరిస్థితి ఎంత రద్దీగా తయా రయిందంటే; శరీరమంతటా అలసి సొలసిపోయి చివరి బొట్టు వరకూ ప్రాణసారాన్ని కోల్పోయి ఒరిగి పోయిన ఎడారి మొక్కలా- నిర్వీర్యంగా తయారయాడు. అక్కడ జరిగిందేమంటే-- స్పెషల్ సెక్యూరిటీ జోన్ లోని కొందరు హార్డ్ కోర్ ఖైదీలకు ఎవరో ఆగంత కులు అసాంఘిక శక్తులతో కలసి అడ్డదారిన సెక్యూరిటీ సెంట్రీల కనుగప్పి జైలు మాన్యువల్ కి విరుధ్దంగా సెల్ ఫోన్లు అందిచ్చి వెళ్ళిపోయారు.
అలా అక్రమంగా సెల్ ఫోన్లు అందిచ్చి హార్డ్ కోర్ నేర వ్యవస్థల గొలుసుకట్టుని పునరుధ్ధ రించడానికి బహుళార్థ పధక రచన చేసారు. దానికంటే సీరియస్ విషయం- టెర్రర్ సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కుంటూన్న నిందుతుల వద్ద రికార్డడ్ మెసేజ్ లతో అత్యాధునిక స్మార్ట్ సెల్ ఫోన్లు దొరకడం.. ఆ వార్త పొక్కిన వెంటనే జైలు వాతావరణ మంతా ఉడకబెట్టిన బంగాళా దుంపలా వేడెక్కి పోయింది. అధికార గణమంతా బిర్రబిగుసుకు పోయింది. వార్త సోకిన నగరం ఉలిక్కిపడి లేచి నిల్చుంది.
స్టేట్ క్రైం బ్రాంచీ సీనియర్ ఆఫీసర్లతో బాటు యాంటీ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్సువాళ్లు- తెరలు తెరలుగా వచ్చి అలలు అలలుగా క్వరీలు లేవదీసి జైలు సూపరింటెండెంట్ చేంబర్ని దుర్బేధ్య చీకటి గుహలా మార్చేసారు. నలువైపులా కుమ్మేసారు. వాళ్ల హడావిడికి అశ్వథ్ కి తీవ్రమైన అసహనం కలగక పోలేదు. కాని- నిభాయించుకున్నాడు. అది వాళ్ల కర్తవ్యం. వాళ్లు దానికోసమేగా ఉన్నారు. తను కూడా వాళ్ల స్థానంలో ఉంటే అదేగా చేసేవాడు!
అతడి అసహనానికి మరొక కోణం లేకపోలేదు. ఆడిటింగ్ టీములా వచ్చి స్పెషల్ టాస్క్ ఫోర్సు వాళ్ళు యెన్నైనా క్వరీలు లేవ దీయవచ్చు. కాని దైనందిన జైలు ఉద్యోగ పర్వంలో తాము ఎదుర్కుంటూన్నయిక్కట్ల గురించి వాళ్లకు తెలుసా! ప్రీ- ఇన్ స్పెక్షన్ ప్రోసెస్ గా ఇంతకు మునుపెన్న డైనా వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారా!
ఇప్పటికే ఫోను చేసి ఉద్రిక్త పరిస్థితి గురించి కనుక్కున్న డి. జి. ప్రిజిన్స్ కూడా మరునాడు ఏ క్షణాన్నైనా రావచ్చు. ఎడా పెడా సెన్సిటివ్ క్వరీలు లేవదీయవచ్చు.
సచివాలయం నుండి అత్యవసర ఆదేశాలు అందకముందే, మిమోల మిస్సాయిల్స్ దూసుకురాక ముందే తన సీనియర్ల ఆలోచన ప్రకారం దొంగ సెల్ ఫోన్ల ప్రవేశానికి దోహదం చేసిన జైలు వ్యవస్థలోని లోటు పాట్లని కనిపెట్టి ఇంటి దొంగల తోకలు పట్టుకుని బైటకు లాగడానికి అశ్వథ్ ద్వారా ఇంటర్నల్ విజిలిన్స్ వింగుని బలపరచేలా ప్రత్యేక దర్యాప్తు టీముని రంగంలోకి దింపారు.
ఇక చేసింది చాలనిపించేవరకూ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులోనే ముఖ్యమైన దస్త్రాలతో రోడ్డు మ్యాపులతో కుస్తీపడుతూ ఉండిపోయి దీపాలు పెట్టే వేళ దాటింతర్వాత జీపెక్కి స్టాఫ్ క్వార్టర్సు చేరుకున్నాడు అశ్వథ్.
అతడికి ఇల్లంతా బోడిగా మొగ్గ తొడగని మొండి రెమ్మలా కనిపించింది. మొదటిసారి అమూల్యమైన దానినేదో పొగొ ట్టుకున్నట్లనిపించింది. అలసి సొలసి వచ్చిన అతడికి మంగళ కాలి మట్టెల అలికిడి వినిపించలేదు. గాజుల గలగలలు సోకలేదు, పలకరింపుల చిలకరింపులు దరి చేరలేదు. ఏవి? అప్పటి మల్లియల గుభాళింపులు- గుళాబీల సుమధుర సుమ సౌరభాలు-- మిస్సింగి ది లైఫ్ పార్టనర్ అంటే- కిస్సింగ్ ది డార్క్ సైడ్ ఆఫ్ ది లైఫే కదా! ఎడారిలా మండుతూన్న అతడి మనసుకి స్నేహపు చెలమ దూరమైపోయింది. ఇంతకీ దానికి బాధ్యత ఎవరిదో!
అతడలా ఆలోచిస్తూ చుక్కానిలేని నావలా ఇంట్లో పచార్లు చేస్తున్నప్పుడు అతడేమాత్రమూ ఎదురు చూడని విధంగా తల్లి భరతమ్మ పెట్టే బేడాతో ఊరునుంచి దిగింది. తల్లిని చూసిన వెంటనే అతడికి దప్పికగొన్న పథికుడికి గంగమ్మ తల్లి ఎదురైన ట్లని పించింది. ప్రత్యుత్థానం చేస్తూ తల్లి రెండు చేతులూ ఆతృతగా పట్టుకున్నాడు అశ్వథ్. గెడ్డాలు వస్తేనేం- సామాజిక స్తాయీ, వృత్తి పరమైన స్థానమూ పెరిగితేనేమి? తల్లికి కొడుకు ఎవర్ గ్రీన్ గారాల పట్టియేగా!
“వచ్చేసావమ్మా! ఒక రోజు ముందే వచ్చినట్టున్నావు. ఫోను చేసి చెప్తే స్టేషన్ కి రానూ! ”
“అదీ జరిగింది- ఒక సారి కాదు, రెండు మూడు సార్లు. నీ సెల్ ఫోన్ రింగవుతుందే గాని నువ్వు ఎత్తనే ఎత్తవు, మరి మంగళ యేం చేస్తుంది? శనివారం కదా- నోము నోచి వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్లిందా?”
అతడు ముఖభావంలో యేదీ కనిపించనీ యకుండా నవ్వి పుట్టింటికి వెళ్లిందని తాపీగా చెప్పాడు. ఆ బదులుకి భరతమ్మ విస్మయంగా చూసింది. ఆ బదులు ఆమెకు రుచించలేదు. కొడుకు వేపు సంశయాత్మకంగా చూసింది. తను ఒక రోజు ముందుగానే వచ్చిన మాట వాస్తవమైనా; తను మాత్రం రెండు మూడురోజుల్లో వస్తున్నానన్నది కాదనలేని వాస్తమే కదా! మరెందుకిలా వేడి నీళ్లు పోసుకున్నట్టు పుట్టింటికి వెళ్ళింది? కుటుంబంలో ఒక్కగానొక్క కూతురు; గారాబంగా పెరిగినమ్మాయి. ఒకవేళ అమ్మానాన్నలపైన బెంగపెట్టుకుందేమో!
ఆడపిల్లల మనసు పెళుసైనది. అప్పుడప్పుడు మనసుకి తోచింది తోచినట్లు అలానే చేసేస్తుంటారు- వేప కాయంత వెర్రితో. పుట్టింటితో వాళ్ళకున్న బంధం అటువంటిది మరి.. అప్పుడామెకు ఉన్నపాటున పుట్టినూరులో తన కళ్ళముందే జరిగిన ఓ సంఘటన దిగ్గున కళ్ళముంది మెదిలింది.
తనతో బాటు బడిలో చదువుకున్న ఒక అమ్మాయి కులంకాని వ్యక్తిని ప్రేమించి ఎంత వద్దన్నా వినకుండా తల్లి దండ్రుల్ని ఎదురించి ప్రేమించిన అబ్బాయిని గుళ్లో పెళ్ళిచేసుకుంది. అంత వరకూ బాగానే ఉంది. ఆ పిల్ల మిత్రురాండ్రు అబ్బాయి తరపు వాళ్లు మెండుగా మెచ్చుకున్నారు కూడా. కాని కొన్నాళ్ల తరవాత తిరకాసు ఎదురైంది. ఆమెకు మాటిమాటికీ కన్నవాళ్లూ తోబుట్టువులూ జ్ఞాపకం రాసాగారు. కాని ఏముఖం పెట్టుకుని కన్నవాళ్లింటికి వెళ్ళ గలదు? ఆ బెంగతో మంచాన పడింది. ఆ తరవాత విషయం తెలుసుకున్న పుట్టింటివారు వైద్యుడి సలహాతో సర్దుబాటు చేసుకుని కూతుర్ని యింటికి తీసుకువెళ్ళారు.
సంప్రదాయం ప్రకారం శుభ ముహూర్తాన పసుపూ కుంకుమా పెట్టి పంపించారు.
మరి కొద్ది సేపటికి భరతమ్మ స్నానం ముగించి పొడిచీర కట్టుకుని దేవుడి గూట్లో దీపం వెలిగించి తులసీ దేవి మంగళ ప్రద మంత్రం- “యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా: యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్“ పఠించి, కాఫీ చేసి కొడుకుకి అందిస్తూ అనునయంగా అంది-
“కొత్త సంసారం కదూ- అయిన దానికీ కాని దానికీ మాటలూ మూతి విరుపులూ అలాగే ఉంటాయి మరి. రేపు అనుభవంతో బాటు అవన్నీ సమసిపోతాయిలే. ఇంటికి ఒక్కగా నొక్క ఆడపిల్ల. అయిన వాళ్ళందర్నీ విడిచి వచ్చింది. మనమే ఆ పిల్లతో తాకీ తాకనట్లు చూసీ చూడనట్లు సర్దుకుపోవాలి. బిడ్డాపాపా కలిగితే అంతా దానికదే సర్దుకుపోతుందిలే!”
తల్లి మాటకు ఖంగుతిన్నట్టు చూసాడు అశ్వథ్. “అంటే- నువ్వంటున్నది యేంవిటమ్మా! నేనేదో గొడవపడి నీ కోడలు పిల్లను వాళ్ల పుట్టింటికి పంపించేసేనంటావా? ”
“తెలుస్తూనే ఉందిగా! నువ్వు వేరే చెప్పాలా యేంవిటి? బంగారు ముద్ద దాని మనసు. బాగా చదువుకున్నది. కాలేజీలో గోల్ట్ మెడలిస్ట్ కూడాను. వర్షాకాలపు చదువులు వెలిగించిన వాళ్లే ఆమాంబతు మిడిసి పాటుతో చెట్టెక్కి నిక్కి చూస్తారు. అవన్నీ లేకుండా మనసిచ్చి మెసలుతుంది పిచ్చి పిల్ల. మీ ముగ్గురు అన్నాదమ్ముల్లోనూ నువ్వే సౌమ్యుడివని చెప్తుంటాను. కాని నువ్వు ఆ పిల్ల మనసుని నొప్పిస్తావనుకోలేదు! ”
ఆ మాటకు ఏదో అనాలని నోరు తెరవబోయాడు గాని వెంటనే ఆపుకున్నాడు అశ్వథ్. ’నీ కోడలు నొచ్చుకుని వెళ్ళలేదమ్మా! నొప్పించి వెళ్ళింది. ప్రేమతో వెళ్ళలేదమ్మా, పంతంతో వెళ్ళింది. ఇది తెలుసుకో! ’ అని గట్టిగా అరవాలనిపించింది.
కాని గొంతు నొక్కుకుపోయి నిదానంగా చెప్పాడు- “నీ కోడలు ఘనకార్యమేదో సాధించడానికి వెళ్లినట్లుంది. ఇది ముందు తెలుసుకో బంగారు తల్లీ! “
భరతమ్మ ఏమీ అనలేదు. కొడుకు అదోలా ఉండటం గమనించినామె వాతావరణాన్నిసమ స్థితికి తీసుకు రావడానికి పూనుకుంది. దగ్గరకు వచ్చి నెత్తిపైన చేతినుంచి అనునయంగా అంది-
“అదంతా తరవాత మాట్లాడుకుందాం గాని, ముందు కాళ్ళూ చేతులూ కడుక్కొచ్చి భోజనం చేయి. నీ కిష్టమైన కూర. మీ ఆవిడ నిన్ను మురిపించి లాలించి గారాలు ఒలకబోసి పద్యాలూ జావళీలు పాడుతూ తినిపిస్తుందే- ఆ గుత్తి వంకాయ కూర చేసాన్రా! వేడి చల్లారకముందే కడుపార తిను. లేలే! ”
ఈసారి అశ్వథ్ మరొక మారు ఉలిక్కిపడ్డట్టయాడు. ఎక్కడో ఏదో మూల భార్యాభర్తల ఊసెత్తకుండా మాగన్నుగా నిద్రపోతుంటుందను కున్న తల్లి మంగళ తనకోసం పాడే పాటలూ చెప్పే చాటువులూ చెవులొగ్గి వింటుందన్నమాట! ’అమ్మ దొంగ తల్లీ! “ అనుకుంటూ తల్లి వేపు ఓరగా చూసాడు.
మొన్నెప్పుడో మంగళ తన కోసం పాడిన జానపద గీతాన్ని గుర్తుకు తెచ్చుకోవ డానికి ప్రయత్నించాడు-
“గుత్తోంకాయ్ కూరోయ్ బావా! కూరలోపల నా వలపు అంతా కూరిపెట్టినానోయ్ బావా! కోరికతో తినవోయ్—కోరికతో వినవోయ్ బావా! “
మరికొద్ది సేపట్లో కాళ్ళూ చేతులూ కడుక్కొచ్చి డైనింగు టేబల్ ముందు కూర్చున్నాడు అశ్యథ్.
భరతమ్మ హాట్ ప్యాక్ నుండి అన్నం వడ్డించి అప్పటి కప్పుడు పెరట్లోని కరివేపాకు రెబ్బలతో చేసిన కమ్మటి పచ్చడితో బాటు గుత్తొంకాయ్ కూరపెడ్తున్నప్పుడు ఫోను మ్రోగింది. ”మా సీనియర్ ఎవరో ఫోను చేస్తున్నట్టున్నారు! “ అంటూ లేవబోయాడతడు. భరతమ్మ వారించింది.
”భోజనానికి కూర్చున్నప్పుడు కంగారు పడుతూ తినకూడదని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు కష్టపడి చదివిందీ, అహర్నిశలూ ఆపసోపాలు పడి ఉద్యోగంలో చేరిందీ ఈ అన్నం ముద్ద కోసమే! ఇది గుర్తుంచుకో” అంటూ అక్క ణ్ణించి కదలి వెళ్ళి ఫోను అందుకుని- “హల్లో! ఎవరదీ? ”అని అడిగిందామె.
అక్కణ్ణించి మంగళాదేవి గొంతు వినిపించింది- “మీరా అత్తయ్యా! నమస్కారమత్తయ్యా! రేపు కదూ మీరు వస్తారని చెప్పి వెళ్ళారూ! “
“రేపు కాదు- ఎల్లుండీ- లేదూ మరుసటి వారమే వస్తాననుకో-- అంతవరకూ ఆగకుండా కట్టుకున్నవాణ్ణి ఉన్నపళంగా విడిచి వెళ్తావా? కనీసం నా కోసం వెయిట్ చేసి నాకొక మాట చెప్పి వెళ్ళకూడదా?" అంతవరకూ అణచుకున్న అక్కసునంతా ఒక్కసారిగా వెళ్ళగక్కింది భరతమ్మ.
“సారీ అత్తయ్యా! నేను మీ అబ్బాయికి చెప్పే మా ఇంటికి వచ్చాను. మీ అబ్బాయి చెప్పలేదా? ”. అది విని భరతమ్మ కస్సుమంది.
“ఈ వరస మరీ బాగుందమ్మా! అక్కడికెళ్లి మా ఇల్లంటున్నావు. మరి ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నావు?”
అక్కడితో మంగళ మౌనంగా ఉండిపోయింది. అప్పటికి భరతమ్మ సర్దుకుంది. తను యేదో మూడ్ లో ఉండి కోడలు పిల్లతో కాస్తంత కఠినంగా మాట్లా డేసిందేమో!
“ఏదో అన్నానని బాధపడకు. పెద్దదానిని కదా- ఛాదస్తం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అందులో నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి ఇల్లంతా వెలితిగా యేదోలా అనిపించి అనేసి ఉంటాను. నువ్వేదో ఘనకార్యంపైన ఊరికెళ్ళా వంటున్నాడు అశ్యథ్. విషయం చెప్తావా! ”
“అంతా మీ అబ్బాయికి తెలుసత్తయ్యా! మీ అబ్బాయి అడపా దడపా చెప్తునే ఉన్నారుగా చదువుని వృధా చేయకుండా చూడ మని. అందుకని మా ‘లా’ కాలేజీ ప్రొఫెసర్ నడుపుతూన్న లా- ఫామ్ లో చేరబోతున్నాను. ఆయనేమా నాన్నగారితో కబురంపారు వెంటనే వచ్చి కలవమని. అందుకే ఆదరాబాదరాగా వచ్చానత్తయ్యా! ఈలోపల బార్ కౌన్సిల్ మెంబర్ షిప్పు రిన్యూ చేయాల్సి వచ్చింది కూడా-- ”
“మంచిదే! నా ఆశీర్వాదం ఉంటుంది. ఇంతకీ ఎప్పుడొస్తావు? ”
“ చెప్పలేనత్తయ్యా! పూర్తి ట్రైనింగు తీసుకోవాలి కదా! నెలలు పట్టవచ్చు. సంవత్సరమూ పట్టవచ్చు. లా- ఫామ్ ఇక్కడికి దగ్గరే. లా- కాలేజీ లైబ్రరీ కూడా దగ్గరే. అయితే- అప్పుడప్పడు వస్తుంటాను అత్తయ్యా.! మందులు గట్రా టైముకి తీసుకోండి. ఏదైనా అర్జంటు పనుంటే నాకు చెప్పండి దూరం గురించి ఆలోచించకుండా.. వెంటనే వస్తాను, ఆయనకు ఓసారి ఫోనిస్తారా! “
“ఎందుకివ్వనూ! అన్నట్టు ఈలోపల తీరిక చూసుకొని మీ అమ్మానాన్నలిద్దర్నీ చూడటానికి వస్తానని చెప్పు—ఏవో ప్రాపర్టీ వ్యవహారాలటగా—అవన్నీ నిదానంగా చూసుకో-- ”అంటూ కొడుకుని పిలిచింది భరతమ్మ.
అంతవరకూ ఓరకంట ఊపిరి బిగబట్టి అత్తాకోడళ్ళ మాటలు వింటూన్న అశ్వథ్ ఆఖరి ముద్ద నోట్లో వేసుకునేటప్పుడు పొల మారాడు. ”నీ పెళ్ళాం నిన్ను తలచుకుంటున్నట్లుందిరా అశ్వథ్! “అని నవ్వింది.
పెదవుల చివరన నవ్వుతూ చేతులు కడుక్కుని వెళ్లి ఫోను అందుకున్నాడు. “హల్లో! ఎలాగున్నావు మేడమ్? ”
అశ్వథ్ పలకరింపుకామె నవ్వింది- “రెండు రోజుల్లోపల కరిగిపోనులే! మా గురువుగారు వెంటనే రమ్మన్నారు. ముందు యింటి ప్రొపర్టీ వ్యవహారాలు గట్రా చూసుకున్న తరవాత ఆయన చెప్పినట్టు ప్రాత కేసుల్ని తిరగదోడిన తరవాత వచ్చి చేరమన్నారు. మరోవారం రోజుల్లోపల లీగల్ అసిస్టెంటుగా చేరబోతున్నాను”
“అదంతా సరేనోయ్! మధ్య నన్నెందుకు ముగ్గులోకి లాగుతున్నావు? నిజం చెప్పు. అంతా చెప్పే మీ ఊరికెళ్ళావా? “
మంగళ బదులివ్వకుండా ఊరకుండిపోయింది.
అతడే మళ్ళీ సంభాషణ ఆరంభించాడు- “అయినా నువ్వు ఎమోషనల్ అయిపోయి తొందరపడిపోయినట్టున్నావు, నేను కేసుని సాంతమూ చూస్తానన్నానే గాని- టూ- జీరో త్రీకి యేమీ చేయనని చేతులు విదిలించు కో లేదుగా! జైలు శాఖలో పనిచేస్తూ నేరారోపణ ఎదుర్కుంటూన్న ఒక ఖైదీకి వత్తాసుగా నిలవాలనుకోవడం మాటలా! ”
“ఇప్పుడదంతా ఇక్కడ వద్దు, మా అత్తగారు అక్కడే ఉన్నట్టున్నారు. పవన్ కుమార్ మీరనుకుంటున్నట్టు పరాయి వ్యక్తి కాడు. ఒకసారి మన బెడ్ రూముకి వెళ్ళి బీరువా లోని నగషీ పెట్టె తెరచి చూడండి. మీ కోసం రాసిన ఉత్తరం ఉంటుంది. దయచేసి ముఖం మరీ బింకంగా పెట్టి ఫోను దభాలున పెట్టేయకండి. అత్తగారు ఇంకేదో ఊహించేసుకుంటారు--”
అతడు- ఉఁ అంటూ ఫోను పెట్టేసాడు, తల్లివేపు ఓపారి నవ్వు ముఖంతో చూస్తూ- అక్కణ్ణించి లోపలకు కదులుతూ--
=======================================================================
ఇంకా వుంది...
=======================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments