#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 1 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 23/03/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
గమనిక: కథ జరిగిన ప్రాంతం వేరే రాష్ట్రంగా పేర్కొన్నా, పాఠకుల సౌకర్యం కోసం సంభాషణలు తెలుగులో చెప్పబడ్డాయి. తెలుగు వారికి పరిచయమైన పేర్లే పాత్రలకు పెట్టబడ్డాయి.
అది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా కేంద్రం.
ముందు రోజే జిల్లా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, ఆ రోజు అన్ని స్టేషన్ల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించనని తన మనసులో మాట స్పష్టం చేశాడు. అలాగే రాజకీయ ఒత్తిడికి లొంగకుండా పని చేయడం తన అభిమతమని కూడా చెప్పాడు.
ముప్పై ఏళ్ళ దీక్షిత్ ఇంకా అవివాహితుడు. తన తలిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కాన్ఫరెన్స్ ముగిసి, ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన దీక్షిత్ తో తల్లి నందిత, "ఎస్ పీ అయ్యేదాకా పెళ్లి మాట ఎత్తవద్దన్నావు. ఇప్పుడు ఇంకేం సాకు చెప్పినా నేను ఊరుకోను. ఈరోజే మాట్రిమొనీలలో నీ ప్రొఫైల్ పెడుతున్నాను" అంది.
"తొందర పడకమ్మా! ఇది కాస్త గొడవలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. పరిస్థితి నా అదుపులోకి రావడానికి ఒక సంవత్సరమన్నా పడుతుంది. ఆ తరువాత నీ మాట కాదనను. ప్లీజ్.. కాస్త ఓపిక పట్టమ్మా" తల్లి ముందు మోకాళ్ళ మీద కూర్చుని బతిమాలుతున్నట్లు అన్నాడు దీక్షిత్.
"మీకేం పట్టనట్లు ఉంటారేం? వీడి పెళ్లి నా ఒక్కదాని బాధ్యత మాత్రమే అన్నట్లు.." అంది నందిత, భర్త రామ్మోహన్ ను ముగ్గులోకి లాగుతూ.
"ఇప్పటికి పాతిక సార్లైనా నువ్వు పెళ్లి మాట ఎత్తడం, వీడు నీ ముందు మోకాళ్ళ మీద కూర్చుని రిక్వెస్ట్ చెయ్యగానే నువ్వు కరిగి పోవడం జరిగింది. ఈ టెక్నిక్ ఏదో బాగుంది. నీ అలక తీర్చడానికి నేను కూడా పాటిస్తాను" అన్నాడు రామ్మోహన్.
"వీడు మోకాళ్ళ మీద కూర్చున్నా నా అంత హైట్ ఉంటాడు. చూస్తూ మురిసిపోతాను. మీకు అంత సీన్ లేదులెండి" అంది నందిత సరదాగా.
"అంత సీన్ వుంటే నీలాంటి మరుగుజ్జును ఎందుకు చేసుకుంటాను?" అంటూ ఉడికించాడు రామ్మోహన్.
'మొత్తానికి టాపిక్ డైవర్ట్ అయ్యింది. ఈ రోజుకి సేఫ్' అనుకున్నాడు దీక్షిత్.
"అమ్మా! నేను స్నానం చేసి వస్తాను. బాగా అలసటగా ఉంది" అంటూ టవల్ తీసుకొని బాత్ రూమ్ వైపు నడిచాడు.
"నువ్వు చెప్పేది నిజమే. ఇంతటితో సంబంధాలు వెతకడం మొదలు పెడితే మంచిది" అన్నాడు రామ్మోహన్ భార్య ఆలోచనను సమర్ధిస్తూ.
ఇంతలో దీక్షిత్ మొబైల్ మోగింది.
"బాత్ రూమ్ దగ్గరకు వెళ్లి ఆ ఫోన్ ఇచ్చేసి వస్తాను" అంటూ పైకి లేచాడు రామ్మోహన్.
"బాగా అలిసిపోయానని చెప్పాడు కదా. కాస్త ప్రశాంతంగా స్నానం చేయనివ్వండి" అంటూ భార్య వారించడంతో ఆగాడు.
మరి కాస్సేపటికే దీక్షిత్ వాకీటాకీ నుండి బీప్ సౌండ్ వచ్చింది.
ఇక తప్పదన్నట్లు దాన్ని తీసుకొని బాత్ రూమ్ వైపు నడిచాడు రామ్మోహన్. అంతలోనే టవల్ తో తల తుడుచుకుంటూ బయటకు వచ్చాడు దీక్షిత్.
తండ్రి చేతినుండి వాకీటాకీని అందుకున్నాడు.
అవతలి వైపు చెప్పింది విని, "వెంటనే స్పాట్ కి వస్తున్నాను. ఓవర్" అంటూ "అమ్మా! అర్జెంట్ గా ఒక చోటికి వెళ్ళాలి" అంటూ రెండు నిముషాల్లో రెడీ అయ్యాడు. ఈ లోపలే డ్రైవర్ కి ఫోన్ చేసి, కార్ స్టార్ట్ చేసి ఉంచమన్నాడు.
బయలుదేరే ముందు తలిదండ్రులకు నమస్కారం చేసి, "ఇక్కడికి వచ్చాక ఇదే నా మొదటి కేసు. నేరస్తుల్ని తొందరగా కనిపెట్టాలని ఆశీర్వదించండి" అంటూ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని బయటకు నడిచాడు.
***
దీక్షిత్ కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ కోదండం.
"ఎక్కడికి వెళ్లాలో తెలుసుగా" అడిగాడు దీక్షిత్.
"మీకు ఫోన్ చేసాక సి ఐ మురళి గారు నాక్కూడా చేసి ఎక్కడ ఉన్నా మీ క్వార్టర్ దగ్గరకు వెళ్ళమన్నారు. అయితే నేను ఇక్కడే ఉన్నాను. అపోజిషన్ లీడర్ శివరాం శర్మ గారిని ఎవరో అయన ఇంటి దగ్గరే మర్డర్ చేశారటగా. " అన్నాడు కోదండం.
"అవును. సంఘటన ఇరవై నిముషాలకు ముందే జరిగింది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం" చెప్పాడు దీక్షిత్.
స్పాట్ కు చేరుకొని దీక్షిత్ కారు దిగేటప్పటికే సి ఐ మురళి తన సిబ్బందితో అక్కడికి చేరుకొని, మర్డర్ స్పాట్ ని తన అదుపులోకి తీసుకొని ఉన్నాడు.
తాను సేకరించిన వివరాలను వెంటనే క్లుప్తంగా దీక్షిత్ కు వివరించాడు సి ఐ మురళి.
అపోజిషన్ లీడర్ శివరాం శర్మ, తన ఇంటి గేట్ ముందే హత్య చేయబడ్డాడు.
బైక్ లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన్ని కలవాలని సెక్యూరిటీ పాయింట్ లో అడిగారు.
అయన ఎవరినైనా పార్టీ కార్యాలయంలోనే కలుస్తారని వాళ్ళు చెప్పారు. సరిగ్గా శివరాం శర్మ కారు, అయన బంగ్లాలోకి ఎంటర్ కావడం కోసం రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో ఆ బైక్ వాళ్ళు వెనుదిరిగారు. ఆ సమయంలోనే అదుపు తప్పిన బైక్, కారుకింద పడింది.
కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి కిందకి దిగాడు. శివరాం శర్మ కూడా కిందకి దిగుతూ ఉన్న సమయంలో మరో బైక్ లో మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులు వచ్చి వెనకనుండి ఆయనపై కాల్పులు జరిపారు. శివరాం శర్మ స్పాట్ లోనే నేలకొరిగాడు. వారు వెంటనే పారిపోయారు. ఆ సమయంలో ఒక వ్యక్తి మాస్క్ జారిపోయింది.
ఇక కారు కింద పడ్డ వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ళు స్థానిక పార్టీ కార్యకర్తలే. వాళ్లలో ఒక వ్యక్తి శివరాం శర్మ పై దుండగులు కాల్పులు జరిపే సంఘటనను తన సెల్ లో ఫోటోలు తీసాడు.
ఆ ఫొటోల్లో మాస్క్ తొలగిన వ్యక్తి ముఖం స్పష్టంగా ఉంది. వాళ్ళు పారిపోయిన బైక్ నంబర్ కూడా ఉంది. అంబులెన్స్ మరి కొద్ది సేపట్లో రాబోతోంది. బాడీని తీసుకొని వెళ్లి పోస్ట్ మార్టం చేసి మరణాన్ని ధృవీకరించాల్సి ఉంది. శివరాం శర్మ పిల్లలు భోపాల్ లో వ్యాపారాల్లో ఉన్నారు. పెద్ద కోడలు ప్రెగ్నెంట్ అయినట్లు తెలియడంతో ఒక సారి చూసి వస్తానని శివరాం శర్మ భార్య నిన్ననే భోపాల్ వెళ్ళింది. కాబట్టి ప్రస్తుతం ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేరు.
పై విషయాలన్నీ దీక్షిత్ కి వివరించి ఫొటోస్ ఉన్న సెల్ ని దీక్షిత్ కు అందించాడు సి ఐ మురళి.
ఫోటోలను పరిశీలించాడు దీక్షిత్. తరువాత "సిటీ నుండి బయటకు వెళ్లే అన్ని రహదారుల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయించండి. అక్కడ ఉన్నవారికి ఆ బైక్ నంబర్ ను, మాస్క్ తొలగిన దుండగుడి ముఖాన్ని షేర్ చెయ్యండి. బైక్ నంబర్ ని బట్టి అది ఎవరిదో ట్రేస్ చెయ్యండి. షాపింగ్ మాల్స్, థియేటర్స్ లలో ఉన్న అన్ని పార్కింగ్ ప్లేసెస్ లో ఆ నంబర్ బైక్ కోసం గాలించండి. ఎక్కడైనా ఖాళీ ప్రదేశాల్లో, వదిలి వేయబడ్డ బైక్ లు ఉన్నాయేమో గమనించండి. అన్నట్లు కార్ కింద పడ్డవాళ్ళు ఎక్కడ?" అని అడిగాడు.
వాళ్ళిద్దరినీ దీక్షిత్ ముందుకు తీసుకొని వచ్చారు పోలీసులు.
"మీరు ధైర్యంగా హంతకులని ఫోటోలు తీసి మంచి పని చేశారు. మీకు కూడా గాయాలు అయినట్లు ఉన్నాయి. తగిన ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. తరువాత మిమ్మల్ని కూడా కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. " అన్నాడు దీక్షిత్ వాళ్ళని పరిశీలనగా చూస్తూ.
"తప్పకుండా సర్. అవసరమైతే మమ్మల్ని కస్టడీలోకి తీసుకున్నా పరవాలేదు. మా నాయకుడిని చంపిన వాళ్ళను పట్టుకోవడానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తాం" అన్నాడు వాళ్లలో ఒకడు.
కొద్ది దూరంలో నిలబడి తన ఇంటర్వ్యూ కోసం చూస్తున్న న్యూస్ రిపోర్టర్ లను చూసాడు దీక్షిత్. ఒక్క పది నిముషాలు అంబులెన్స్ వచ్చేవరకు ఆగమన్నట్లు సైగ చేసాడు. ఎస్పీ తమను పట్టించుకున్నందుకు కృతజ్ఞతగా చేతులు ఊపారు వాళ్ళు.
ఇంతలో వాళ్ళ మధ్యనుంచి తన ఛానల్ బ్యాడ్జి మెడలో వేసుకుని ఉన్న ఓ పాతికేళ్ల అందమైన అమ్మాయి అందరినీ దాటుకుని దీక్షిత్ వైపు వస్తోంది.
"ఈ అమ్మాయి శివరాం శర్మ గారికి మేనకోడలు అవుతుంది. స్వంతగా ఒక లోకల్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ నడుపుతోంది" చెప్పాడు మురళి.
ఆ అమ్మాయి జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ వేసుకొని ఉంది. "శివరాం శర్మ గారు నాకు మామయ్య అవుతారు. మధ్యాహ్నం మామయ్యకు మా ఇంటినుంచి కారియర్ తీసుకొని వచ్చాను. అత్తయ్య ఊర్లో లేరు. అన్నట్లు నా పేరు నీతూ శర్మ" అంటూ దీక్షిత్ తో చేయి కలిపింది.
"ఆవిడ భోపాల్ వెళ్లినట్లు తెలిసింది. ఈ న్యూస్ విని ఎలా తట్టుకోగలరో.. " అన్నాడు దీక్షిత్.
"మామయ్య పిల్లలకు నేనే ఫోన్ చేసి చెప్పాను. అత్తయ్యకు విషయం పూర్తిగా చెప్పకుండా తీసుకొని రమ్మన్నాను. నేను మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. ఇంత తొందరగా ప్రతిపక్ష నాయకుడి కోసం ఎస్పీ స్థాయి అధికారి రావడం.. రియల్లీ గ్రేట్" అంటూ మరోసారి షేక్ హ్యాండ్ ఇచ్చింది.
దూరంగా ఉన్న ఇతర రిపోర్టుర్లు ఆమె వంక కాస్త ఈర్ష్యగా చూడ్డం గమనించిన దీక్షిత్ "ఒక్క పది నిముషాలు వెయిట్ చెయ్యండి. రిపోర్టుర్స్ తో మాట్లాడిన తరువాతే ఇక్కడినుంచి వెళ్తాను" అన్నాడు.
"ప్రస్తుతం అందుబాటులో ఉన్న శివరాం శర్మగారి బంధువును నేనే. నేను కూడా హాస్పిటల్ కు వెడతాను. అది చెప్పడానికే వచ్చాను. ఇంటర్వ్యూ, రేపు మిమ్మల్ని కలిసి తీసుకుంటాను" అంది నీతూ శర్మ.
ఇంతలో అంబులెన్స్ రావడంతో శివరాం శర్మ గారి దేహాన్ని అందులోకి తరలించారు. నీతూ తన కారులో అంబులెన్స్ ను ఫాలో అయింది.
మురళిని ఎస్కార్ట్ గా పంపి తను ఓ పది నిముషాలు విలేఖరులకు కేటాయించాడు. నేరస్థులను ఒక వారం లోపే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.
తరువాత తను కూడా హాస్పిటల్ కు బయలుదేరాడు.
పోస్ట్ మార్టం పూర్తయ్యేసరికి రాత్రి పన్నెండయింది. బుల్లెట్ గాయాల వల్లే మరణం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి రిపోర్ట్స్ మర్నాడు ఇస్తామన్నారు డాక్టర్లు.
ఒంటి గంటకు ఇల్లు చేరుకున్నాడు దీక్షిత్.
అతను ఇంటికి వచ్చేసరికి తల్లి నందిత మేలుకొనే ఉంది.
"విషయం తెలిసింది. ఈ సమయంలో నువ్వు భోజనం గానీ టిఫిన్ గానీ చేయవని తెలుసు. ఫ్రూట్స్ తరిగి ఉంచాను. కాసిని తిని, పాలు తాగి పడుకో. లేకుంటే పొద్దుటికి నీరస పడతావు" అంది.
"నువ్వు పడుకొని ఉండొచ్చు గదా అమ్మా! నా కోసం వెయిట్ చెయ్యడం ఎందుకు?" అన్నాడు దీక్షిత్ తల్లివంక ప్రేమగా చూస్తూ.
"ఇంకెన్నాళ్ళులే.. నీ పెళ్లయ్యాక ఎదురు చూసే బాధ్యత నా కోడలిదే" అందావిడ ఆప్యాయంగా కొడుకు తల నిమురుతూ.
టాపిక్ మార్చి తన మనసు తేలిక పరచడానికి ఆమె ప్రయత్నిస్తోందని గ్రహించాడు దీక్షిత్.
ఇంతలో గదినుండి బయటకు వచ్చిన అతని తండ్రి రామ్మోహన్ "మీ అమ్మ సైకాలజీ చదివిన వాళ్ళకంటే తెలివిగా ప్రవర్తిస్తుంది. ఏమనుకున్నావ్?" అన్నాడు కొడుకు పక్కనే కూర్చుంటూ.
"ఇలా అప్పుడప్పుడూ నన్ను పొగుడుతూ ఉండొచ్చుగా. సంవత్సరానికోసారి కాకుండా" అంది నందిత.
"అప్పుడప్పుడూ ఎందుకు.. ఇప్పుడే పొగుడుతాను. మీ అమ్మ చదివింది ఇంటర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ల తెలివికి తీసిపోదు" అన్నాడు రామ్మోహన్.
"ఇది పొగడ్త అనుకోవాలా లేక తెగడ్త అనుకోవాలా.. " అంది నందిత అనుమానం నటిస్తూ.
"పొగడ్తే లేమ్మా. ఈ రోజుకి నాన్నని వదిలేయ్" అన్నాడు దీక్షిత్ పైకి లేస్తూ.
అతని మనసు కాస్త తేలిక పడ్డట్లు గ్రహించి గుడ్ నైట్ చెప్పారు వాళ్ళు.
అలసట వల్లనేమో.. పడుకోగానే నిద్ర పట్టింది దీక్షిత్ కు.
***
సరిగ్గా రెండు గంటలకు అతని ఫోన్ మోగింది.
మురళి కాల్ చేశాడు.
అనుమానాస్పదంగా బైక్ పై వెళ్తున్న ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. కాస్త గట్టిగా అడిగేసరికి వాళ్లే షూట్ చేసినట్లు ఒప్పుకున్నారట.
"సరే. వాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళను ఎవరన్నా చంపడమో వాళ్లే సూయిసైడ్ చేసుకోవడమో జరగవచ్చు. బీ కేర్ ఫుల్. రేపు ఇంటరాగేట్ చేద్దాం" అన్నాడు దీక్షిత్.
మర్నాడు ఉదయం ఆరుగంటలకే ఫోన్ కాల్ తో లేచేసాడు దీక్షిత్.
మళ్ళీ సి ఐ మురళి చేశాడు.
"సర్! నిన్న శివరాం శర్మ గారి ఇంటిదగ్గర ఒక అమ్మాయి మిమ్మల్ని కలిసింది కదూ.. నీతూ శర్మ అని.. ఆ అమ్మాయి మీద హత్యాప్రయత్నం జరిగింది. " చెప్పాడు మురళి.
నిశ్చేష్టుడయ్యాడు దీక్షిత్.
==============================
ఇంకా ఉంది
అపరాధ పరిశోధన - పార్ట్ 2 త్వరలో..
==============================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
ఇంట్రెస్టింగ్ 👌👌👌