అపరాధ పరిశోధన - పార్ట్ 2
- Seetharam Kumar Mallavarapu
- Mar 28
- 6 min read
Updated: Apr 2
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 2 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 28/03/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 2 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్య ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు.
ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 2 చదవండి..
ఒక్క క్షణం అతని కళ్ళ ముందు అందమైన ఆమె రూపం, సమ్మోహన పరిచే ఆమె నవ్వు గుర్తుకు వచ్చాయి.
మరుక్షణమే తేరుకొని "ఎక్కడ.. ఎలా జరిగింది? ఆమెకు ప్రమాదం ఏమీ లేదు కదా" అని సి ఐ మురళిని ఆతృతగా అడిగాడు ఎస్ పీ దీక్షిత్.
"ప్రమాదమేమీ లేదు సర్. నిన్న రాత్రి శివరాం శర్మ గారిని హత్య చేసిన దుండగులు దొరికారు కదా. ఆ విషయం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ అమ్మాయి రాత్రి మూడు గంటలప్పుడే ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టింది.
ఐదు గంటలప్పుడు ఇద్దరు వ్యక్తులు చేతుల్లో ఐరన్ రాడ్లతో ఆ ఇంటి కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వెళ్లారు.
ఎదురింట్లో ఒక రిటైర్డ్ మిలిటరీ మేజర్ దంపతులు ఉంటారు. వాళ్ళు ఈ అమ్మాయి వాళ్లకు ఫ్యామిలీ ఫ్రెండ్స్.
ఆ దంపతులిద్దరికీ ప్రతిరోజూ ఐదు గంటలకు జాగింగ్ కి వెళ్లడం అలవాటు. ఇంటి తలుపు తీసేముందు కిటికీలోనుండి పరిసరాలు పరిశీలిస్తారు అయన.
ఆలా చూసినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎదురింటి కాంపౌడ్ వాల్ దూకడం గమనించారు. వెంటనే భార్యను ఎదురింటి వాళ్లకు ఫోన్ చెయ్యమని చెప్పి, తను పోలీసులకు కాల్ చేసాడు. పోలీసులు గస్తీలో ఉన్న వారికి తెలియజేసారు.
మేజర్ భార్య, నీతూ శర్మ తల్లికి ఫోన్ చెయ్యడంతో ఆ ఇంట్లో వాళ్ళు లేచి లైట్లు ఆన్ చేశారు.
మేజర్ ఎదురింటి వేపు ఫ్లాష్ లైట్ ఫోకస్ చేశారు.
దుండగులు అప్పటికే ఎదురింటి కిటికీ స్క్రూలు ఊడదీసారు. ఒక్కసారిగా లైట్లు వెలగడంతో తమ ఆయుధాలతో వెనుదిరిగారు.
వెళ్తూ వెళ్తూ "లేనిపోని వీడియోలు పెట్టి దొరికిన హంతకులను విడిపించాలని చూస్తున్నావ్. వాళ్లతో పాటు నిన్ను కూడా చంపేస్తాం. శివరాం శర్మ అమర్ రహే" అని కేకలు పెడుతూ బయటకు వెళ్లిపోయారు.
క్షణాల వ్యవధిలో పోలీసులు రావడం, విషయం తెలుసుకొని, వాళ్ళను వెంబడించి పట్టుకోవడం జరిగిపోయాయి."
జరిగిన విషయాలు చెప్పాడు సి ఐ మురళి. "డ్రైవర్ కోదండాన్ని అలర్ట్ చేశాను. మీరు చెప్పినప్పుడు బయలుదేరడానికి రెడీగా ఉండమని చెప్పాను" అని కూడా చెప్పాడు.
"యు అర్ టూ షార్ప్. శివరాం శర్మగారిని షూట్ చేసిన వాళ్ళను, అయన కారు కింద పడ్డ వాళ్ళను, ఈ రోజు నీతూ శర్మ ఇంటి మీదకు వెళ్లిన వాళ్ళను.. అందర్నీ నా ఆఫీసుకు టైట్ సెక్యూరిటీతో చేర్చండి. నేను అరగంటలో బయలుదేరుతాను." చెప్పాడు దీక్షిత్.
ఆ తరువాత తన మొబైల్ లో యూట్యూబ్ ఓపెన్ చేసాడు.
నీతూ శర్మ స్వయంగా కనిపించి మాట్లాడుతూ చేసిన వీడియో అది. ఆ వీడియో లో ఇలా ఉంది.
"ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నేత శివరాం శర్మ గారి మరణం మనందరినీ కలచి వేసింది. దగ్గరి బంధువు కావడంతో ఆ బాధ నాకు మరికాస్త ఎక్కువగా ఉంది. అయితే వెంటనే హంతకులు దొరకడం ఆనందంతో బాటు ఆశ్చర్యాన్నీ, అనుమానాన్నీ కలిగిస్తోంది.
ఇలా వాహనాన్ని అటకాయించి హత్య చేయడం ఎన్నోసార్లు జరిగింది.
అయితే 'మోడస్ అపరాండీ' గమనిస్తే 2021 లో యూపీలో, గత సంవత్సరం.. అంటే 2024 లో ఛత్తీస్ ఘడ్ లో జరిగిన రెండు హత్యలను పోలి ఉంది ఈ దారుణ హత్య. ఆ రెండు హత్యలు కూడా బీహార్ కు చెందిన సుపారీ గ్యాంగ్ చేసినవి.
2021 లో జరిగిన హత్యలో నిందితులు స్వయంగా పోలీసులకు లొంగి పోయారు.
మృతుడు ఒక మాజీ ఎమ్మెల్యే. కార్ పార్కింగ్ విషయంలో గొడవ జరిగిందని, ఆ కోపంలో హత్య చేశామని చెప్పారు వాళ్ళు. హంతకులు దొరికిపోవడంతో తదుపరి విచారణ జరగలేదు. కోర్ట్ వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది.
అయితే ఒక ప్రముఖ న్యూస్ పేపర్ లో ఒక లేడీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ సంచలనం రేపింది. ఆ ఆర్టికల్ లో ఆమె, 'ఆవు పులి' కథను ఉటంకిస్తూ 'ఆ కథలో ఇచ్చిన మాట ప్రకారం ఆవు, పులికి ఆహారమవడానికి తిరిగి వచ్చింది, లొంగిపోయింది. ఆవు సాధు జంతువు. కానీ వీళ్లు క్రూర హంతకులు. స్వచ్ఛందంగా లొంగి పోవడానికి వీళ్ళు అమాయకులు కారు. ప్రాణాలు తేలిగ్గా తీసే రాక్షసులు' అని పేర్కొంది.
ఇంకా ఆ ఆర్టికల్ లో ఇలా ఉంది..
‘కేసు దర్యాప్తు లోతుగా జరిగినా, లేదా సి బీ ఐ సమగ్ర దర్యాప్తు జరిపినా అసలు నేరస్థులు దొరకడం ఖాయం. నేరస్థులు దొరికిపోయి, నేరాన్ని అంగీకరిస్తే కేసు తొందరగా క్లోజ్ అవుతుంది. హత్య చేయించిన వారు బయట పడరు. అందుకోసం నేరం చేసి స్వచ్ఛందంగా లొంగి పోయిన వారికి భారీ మొత్తం ఆశ చూపడంతో బాటు కోర్టులో మంచి లాయర్ ను పెట్టి విడిపిస్తామని హామీ ఇస్తారు. జైలు లో అన్ని సౌకర్యాలు సమకూర్చడానికి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి హత్య చేసిన వాడు నన్ను పట్టుకోండని చేతులు చాచాడని సంబరపడి పోకుండా క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలి. అసలు నేరస్థులను వెలికి తీయాలి.’
ఇదీ ఆ ఆర్టికల్ సారాంశం.
దీంతో ఆ రాష్ట్రంలో దుమారం రేగింది. కేసును సి బీ ఐ కి అప్పగించారు. వాళ్ళ దర్యాప్తులో పార్కింగ్ లో గొడవ పెట్టుకున్నవారు నాలుగు నెలల ముందే ఆ అపార్ట్మెంట్ లో చేరినట్లు తెలిసింది. వాళ్ళు ఆ మధ్యనే బజారులో ఒక టీవీ రిపేర్ షాప్ తెరిచారు. దగ్గరగా ఉంటుందని అక్కడ చేరామని చెప్పారు. కానీ ధనవంతులు ఉండే ఆ పోష్ లొకాలిటీలో ఎక్కువ రెంట్ చెల్లించి వాళ్ళు చేరడం సి బీ ఐ వాళ్లకు అనుమానాన్ని రేకెత్తించింది. గొడవ పెట్టుకుని హత్య చెయ్యాలనే ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ చేరారనే కోణంలో దర్యాప్తు జరిపారు. దాంతో అసలు నేరస్థులు బయటకు వచ్చారు.
ఇక 2024 లో ఛత్తీస్ ఘడ్ లో జరిగిన హత్య..
ఇక్కడ ఒక మాజీ మినిష్టర్, కారులో ఇంటినుండి బయటకు వస్తున్న సమయంలో కొబ్బరి బోండాంలు అమ్మే అతని బండి, ఆ కారుకు గుద్దుకుంది. అతను కోపంతో కారు డ్రైవర్ తో గొడవకు దిగాడు. సర్ది చెప్పడానికి కారు దిగిన ఆ మాజీ మినిష్టర్ పైన ఆ వ్యక్తి కత్తితో దాడి చేసి, విచక్షణా రహితంగా నరికాడు. అతను పారిపోతూ ఉండగా కాలు జారి కింద పడటంతో స్థానికులు అతన్ని పట్టుకున్నారు. అతను ఆ సమయంలో అతిగా మద్యం సేవించి ఉండటంతో ఆవేశంలో మాజీ మినిష్టర్ ను హత్య చేసినట్లు నిర్దారించారు.
ఈ సంఘటన మొత్తం ఆ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ట్రైనీ ఐ పీ ఎస్ ఆఫీసర్లకు సీసీ కెమెరాల ఉపయోగం గురించి చెప్పడానికి వాళ్ళ ముందు ఆ వీడియో ప్లే చేసారు.
అయితే నేరస్థుల దురదృష్టం ఏమిటంటే ఆ ట్రైనీ ఐ పీ ఎస్ ల బాచ్ లో మన ప్రస్తుత ఎస్పీ దీక్షిత్ గారు ఉండటమే."
వీడియోలో తన ప్రస్తావన రావడంతో ఉలిక్కి పడ్డాడు దీక్షిత్. అంటే ఈ నీతూ శర్మ తన గురించిన వివరాలు అప్పుడే సేకరించిందన్న మాట.
'నీతూజీ! యు ఆర్ రియల్లీ గ్రేట్' అని మనసులోనే ఆమెను అభినందించి, వీడియో చూడటం కొనసాగించాడు.
“ట్రైనింగ్ క్లాస్ లో ఆ ఫుటేజ్ చూపిస్తున్నప్పుడు, మధ్య మధ్యలో ఆపమని చెప్పి రెండు మూడుసార్లు రీప్లే చేయించుకుని చూసారు దీక్షిత్ గారు. రక్తం కారుతున్న కత్తితో పరుగెడుతున్న ఆ హంతకుడిని పట్టుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు. కాలికి ఎదో తట్టుకుని కిందికి పడేటప్పుడు అనుకోకుండా చేతిలోని కత్తి జారి పడినట్లు చూపించాలని అతని ప్రయత్నం. కానీ వీడియోను నిశితంగా గమనించిన దీక్షిత్ గారు కాలు స్లిప్ కావడానికి ఒక క్షణం ముందే కత్తి అతని చేతినుండి పడి పోయినట్లు గ్రహించారు. అంటే హంతకుడు కత్తిని కావాలనే జారవిడిచి పడిపోయాడు. అతని ఉద్దేశం తాను దొరికి పోవడమే.
ఇప్పుడు జరిగిన మా మామయ్య హత్యకూడా ఒక పథకం ప్రకారం చేసిందే. పూర్తి స్థాయి దర్యాప్తు జరగ కూడదని నిందితుల్ని దొరికేలా చేశారు.
పోలీసులు, హంతకులు దొరికారనే నిర్లిప్తతతో కేసును తొందరగా క్లోస్ చేస్తారని హత్య చేయించిన వారి ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఎస్పీ గా ఉన్న దీక్షిత్ గారు కేసును క్షుణ్ణంగా పరిశీలించి అసలు కుట్రదారులను పట్టుకోవాలి. ఆ సమర్థత వారికి ఉందనేది నా అభిప్రాయం.
త్వరలో మరో సంచలన వీడియోతో
మీ నీతూ శర్మ"
వీడియో ముగిసింది.
వీడియోలో తాను అనుకున్నది ఎంత చక్కగా ప్రెజెంట్ చేసింది ఆమె..
ఈ వీడియో చూసిన వాళ్ళెవరైనా ఆమె వాదనతో ఏకీభవిస్తారు. అంత కన్విన్స్ చేసేలా అద్భుతంగా మాట్లాడిందామె. ఆ సమయంలో ఆమె బాడీ లాంగ్వేజ్ అద్భుతం. హత్య జరిగి కొద్ది గంటలే అయినా గతంలో జరిగిన ఇలాంటి హత్యల తీరుతెన్నులు పరిశీలించింది. తన గురించి కూడా పూర్తిగా తెలుసుకుంది.
ట్రైనీ గా ఉన్నప్పుడు తను ఛత్తీస్ ఘడ్ పొలిటికల్ మర్డర్ విషయంలో చూపిన చొరవ వల్లనే తనను ఈ స్టేట్ కు ప్రత్యేకంగా పిలిపించారు. రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ నేరాలు జరిగేది ఈ జిల్లాలోనే. కేసు రాను రాను జటిలమౌతున్నట్లు అర్థమైంది అతనికి.
ఆలోచనలు కట్టి పెట్టి పావు గంటలో రెడీ అయ్యాడు.
అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ "ఈరోజు ఎన్నింటికి ఇంటికి వస్తానో చెప్పలేను. నాకోసం టిఫిన్, భోజనం మానుకొని ఉండొద్దు." అని చెప్పాడు.
"అవునురా. ఈ కేస్ ను జాగ్రత్తగా పరిశీలించాలి. రాత్రి ఒక అమ్మాయి ఈ కేస్ గురించి యూట్యూబ్ లో వీడియో పెట్టింది. ఎంత చక్కగా మాట్లాడిందనీ.. అన్నట్లు నీ గురించి కూడా బాగా చెప్పింది" అన్నాడు రామ్మోహన్.
"అవును నాన్న! ఆమె ఎంత షార్ప్ అంటే నేను ట్రైనీగా ఉన్నప్పటి విషయాలు కూడా తెలుసుకుంది" అన్నాడు దీక్షిత్.
"నీకింకా పెళ్లి కాలేదనీ, మంచి అమ్మాయి కోసం వెదుకుతున్నామని కూడా తెలుసుకుందా?" నవ్వుతూ అడిగింది నందిత.
అందంగా సిగ్గు పడ్డాడు దీక్షిత్.
"అందమైన అమ్మాయిని చూసినా వీడు మామూలుగానే ఉంటాడు కానీ నువ్వేమో ఆ అమ్మాయి నీ కోడలైపోయినట్లు ఊహించేసుకుంటావు" అన్నాడు రామ్మోహన్.
"అన్నట్లు ఇంకో విషయం. ఈ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి పైన హత్యాప్రయత్నం జరిగింది. శివరాం గారి కేసుతో పాటు ఈ విషయం పైన కూడా దృష్టి పెట్టాలి. కొద్ది రోజుల పాటు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన క్వార్టర్ దగ్గర కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను.ఇక నేను బయలుదేరుతాను" అంటూ బయటకు నడిచాడు.
***
తన ఆఫీస్ కు చేరుకోగానే సి ఐ మురళితో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు ఎస్ పీ దీక్షిత్.
"ఇంటరాగేషన్ కాస్త ఆలస్యంగా స్టార్ట్ చేస్తాను. ఈ లోగా మీరు ఒక పని చేయాలి. నిందితులకు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీలు కల్పించాలి. అది సీసీ కెమెరాలో రికార్డ్ చెయ్యాలి.
వీళ్లు అంత తొందరగా లోబడే రకం కాదు. పక్కా ప్రొఫెషనల్స్. అందుకే అదనంగా కొన్ని హిడెన్ కెమెరాలు ఏర్పాటు చెయ్యండి. మోనిటర్ ను నా రూమ్ లో ఏర్పాటు చెయ్యండి. వాళ్ళను నమ్మించడం కోసం ఒక వ్యక్తిని ఏర్పాటు చెయ్యండి." అంటూ ఆదేశాలిచ్చాడు.
దీక్షిత్ వంక మెచ్చుకోలుగా చూశాడు మురళి. "వీళ్ళను వేరేవేరే ప్రదేశాల్లో ఉంచమంటారనుకున్నాను. కానీ అందర్నీ ఒకే చోటికి రప్పించడానికి కారణం ఇప్పుడర్థమైంది" అంటూ హుషారుగా బయటకు నడిచాడు.
=========================================
ఇంకా ఉంది
=========================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comentários