అపరాధ పరిశోధన - పార్ట్ 3
- Seetharam Kumar Mallavarapu
- 4 days ago
- 7 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 3 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 02/04/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్య ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. అరెస్టయిన నిందితుల కదలికలు గమనించే ఏర్పాటు చెయ్యమంటాడు.
ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 3 చదవండి..
ఎస్ పీ దీక్షిత్ ఆదేశాలు అమలు చేయడానికి పూనుకుంటాడు సి ఐ మురళి.
ఎస్ పీ ఆఫీస్ కాంపౌండ్ వాల్ లోపల, వెయిట్ చేసేవారి కోసం టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్లే దారిలో ఒక పెద్ద చింత చెట్టు ఉంది. దాని కింద కొన్ని సిమెంట్ బల్లలు వేసి ఉన్నాయి.
"ఈ ప్రాంతం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంది" అనే బోర్డు అక్కడ తగిలించి ఉంది. అందరికీ కనిపించేలా అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది.
టెక్నీషియన్స్ ని పిలిపించి, ఆ చెట్టుకు వెనుక భాగంలో మరో సీసీ కెమెరా ఎవరికీ కనపడకుండా కొమ్మల మధ్య ఏర్పాటు చేయించాడు సి ఐ మురళి. అలాగే ఆ చెట్టు వెనుక భాగానికి, కాంపౌండ్ వాల్ కు మధ్య మరో బల్ల ఏర్పాటు చేయించాడు. ప్రలోభాలకు లొంగేవాడిలా ఒక కానిస్టేబుల్ ను, టీ అమ్మే వ్యక్తిగా మఫ్టీలో ఒక కానిస్టేబుల్ ను, డబ్బున్న ఆకతాయి కుర్రాళ్ళుగా ఇద్దరు తెలిసిన కాలేజ్ స్టూడెంట్ లను అరేంజ్ చేసాడు.
తాను ఉన్న గదిలోకి ఆరుగురు నిందితులను పిలిపించాడు. వాళ్ళను తీసుకొని వచ్చిన పోలీసులతో "ముందు వీళ్లకు టీ ఇవ్వండి. వీళ్లను ఓ గంట తరువాత విడివిడిగా విచారిస్తాను. ఈలోగా వీళ్ల టిఫిన్ వగైరా కార్యక్రమాలు పూర్తి కానివ్వమని చెప్పండి. నా తరువాత ఎస్ పీ గారి ఇంటరాగేషన్ ఉంటుంది" అని చెప్పాడు.
తరువాత నిందితుల వైపు తిరిగి ఇలా అన్నాడు..
"మీరు నేరాన్ని ఒప్పుకున్నారు కాబట్టి మిమ్మల్ని పెద్దగా అడిగేది ఉండదు. మీరు చెప్పాల్సిందల్లా ఎవరు చేయించారనే విషయాన్నే. మీ అంతట మీరే నేరం చేసారని చెబితే నమ్మి కేసు ముగించడం జరగదు. అలా జరగాలంటే మా ‘సహకారం’ ఉండాలి. కానీ మీ వాళ్ళు అలాంటి ‘ప్రయత్నం’ కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. అంటే మా నిజాయితీ మీద వాళ్లకు నమ్మకం ఉందన్న మాట. మిమ్మల్ని విడిపించే మాట అటుంచి, కనీసం కాంటాక్ట్ చెయ్యడానికి కూడా ప్రయత్నించరు. మా నిఘాకు దొరికిపోతామని వాళ్లకు భయం. మీ హిస్టరీలో ఇంతవరకు ఉన్నవి చిన్న చిన్న దొమ్మీ కేసులే.
అలాంటి వాటిలో మీ నాయకులు ఎదుటివాళ్లను భయపెట్టో డబ్బు ఆశ చూపో కేసునుండి మిమ్మల్ని విడిపించి ఉండవచ్చు. కానీ ఇలాంటి సీరియస్ కేసులో మిమ్మల్ని కాపాడటం అంత తేలిక కాదు. బాగా ఆలోచించుకోండి"
మురళి చెప్పింది విన్నాక శివరాం శర్మ హత్యను ఫోటో తీసిన వ్యక్తి, ఆయనను షూట్ చేసిన వ్యక్తి వంక చూసి ఏదో సైగ చేయబోయాడు.
అది గమనించిన ఆ వ్యక్తి "ఏమిటి..? నీ ఫొటోలతో నాకేదో అయిపోతుందని అనుకుంటున్నావా.. నన్ను మోసం చేసిన వ్యక్తిని చంపేసాను. అందుకు నేనేం బాధపడటం లేదు" అని ఆవేశంగా అన్నాడు.
ఇంతలో ఒక కానిస్టేబుల్ ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ ని లోపలికి తీసుకొని వచ్చాడు.
ఒక కుర్రాడు జుట్టుకు రంగులు వేయించుకుని ఉన్నాడు. మరొకడు జుట్టును మధ్యలో మాత్రం ఒక లైన్ లాగా ఉంచుకుని, మిగతాదంతా తీయించుకుని ఉన్నాడు.
ఆ కానిస్టేబుల్ వాళ్లకు మురళిని చూపిస్తూ మా సీఐ గారు" అన్నాడు నమస్కారం పెట్టమన్నట్లు సంజ్ఞ చేస్తూ.
ఒక కుర్రాడు పలకరింపుగా తలను ఒకసారి ఊపాడు నిర్లక్ష్యంగా. ఇంకో అబ్బాయి ఎడం చేతిని సగం పైకి ఎత్తి, రెండు వేళ్ళను అటు ఇటు కదిలించాడు.
వాళ్ళ నటనకు మనసులోనే అభినందించి, పైకి కోపాన్ని నటిస్తూ "ఏ జూలోంచి పట్టుకొచ్చావు వీళ్ళను" అన్నాడు మురళి.
"మిస్టర్ సి ఐ! మైండ్ యువర్ టంగ్" అన్నాడు ఒకడు.
కానిస్టేబుల్ ఆవేశంతో అతన్ని కొట్టబోతుండగా మురళి వారిస్తూ "మెడికల్ రిపోర్ట్ వచ్చాక చెబుతా వీళ్ల సంగతి" అన్నాడు.
అదే సమయంలో ఒక యాభై ఏళ్ళ వ్యక్తి ఫ్లాస్క్ లో టీ తీసుకొని వచ్చాడు.
మురళి పైకి లేచి "టీ తాగాక ఆ ఆరుగురిని రెడీ చేయించి ఉంచండి. ఇంటరాగేషన్ ఐదారు గంటలు పట్టొచ్చు. బాగా టిఫిన్ పెట్టించండి. నేను ఓ గంట తర్వాత వస్తాను" అని కానిస్టేబుల్ తో చెప్పి బయటకు నడిచాడు.
తరువాత తిన్నగా దీక్షిత్ ఉన్న గదిలోకి వెళ్ళాడు.
"అంతా బాగా అరేంజ్ చేసారు. గుడ్. శివరాం గారిని షూట్ చేసిన వ్యక్తి, ఫోటో తీసిన వ్యక్తుల మధ్య గతంలో పరిచయం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. అదే నిజమైతే ఇద్దరు వ్యక్తులు కారు కింద పడటం కూడా వాళ్ళ ప్లాన్ లో భాగమే. నేరంలో కార్ కింద పడ్డవాళ్లకు కూడా భాగం ఉన్నట్లు అనిపిస్తోంది. వీళ్ళ టిఫిన్ సెక్షన్ చింత చెట్టు కింద అరేంజ్ చెయ్యండి. ఆ సమయంలో వాళ్ళను కాస్త ఫ్రీగా మూవ్ అయ్యేట్లు చూడండి. ఇక్కడ ఉన్నంత భయం, జాగ్రత్త అక్కడ ఉండకపోవచ్చు. మనకు ఏదో ఒక క్లూ దొరకవచ్చు. చిన్న అవకాశం దొరికినా మనం ముందుకు దూసుకు పోవడం ఖాయం" అన్నాడు దీక్షిత్.
ఇంతలో అతని సెల్ మోగింది.
బయటకు వెళ్ళబోతున్న మురళిని ఉండమన్నట్లుగా సైగ చేసాడు దీక్షిత్.
'ఐజీ గారు' అని చిన్నగా చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు.
మురళి కాస్త దూరంగా జరిగి అటు తిరిగి నిల్చున్నాడు.
"నమస్తే సర్, చెప్పండి" అన్నాడు దీక్షిత్.
"గవర్నర్ గారి నుండి ఒక చిన్న ఆబ్లిగేషన్. కాదనకూడదు. " అన్నారు ఐజీ గారు.
"గవర్నర్ గారు చెబితే అది ఆబ్లిగేషన్ కాదు. ఆర్డర్. చెప్పండి ఏం చెయ్యాలో.."
"ఇది ఆబ్లిగేషనే. ఎందుకంటే ఇది నీ స్వంత నిర్ణయం పైన ఆధార పడి ఉంటుంది" అన్నారాయన.
"చెప్పండి సర్" అన్నాడు దీక్షిత్.
"ఏం లేదు. ఈ మధ్య శివరాం శర్మగారి బంధువు ఒక అమ్మాయి పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది కదా".
"అవును సర్. నిందితులు అప్పుడే దొరికారు. ఇంకాసేపట్లో ఇంటరాగేట్ చేయబోతున్నాను. వాళ్ళ వెనక ఎవరున్నారో వెలికి తీస్తాను" అన్నాడు దీక్షిత్.
"నీకు ఆ సమర్థత ఉంది. ఆ విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ కావాలట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళ పెదనాన్న గారికి గవర్నర్ గారు చాలా క్లోజ్. "
"ఆ అమ్మాయికి ఆల్రెడీ సెక్యూరిటీ ఏర్పాటు చేశాను సర్. " చెప్పాడు దీక్షిత్.
ఇద్దరు కానిస్టేబుల్స్ ని పెట్టి ఉంటావు. కాదంటే మరొకర్ని పెడతావు. అంతేగా " అన్నారు ఐజీ గారు.
"మరి ఏం చెయ్యమంటారు?" అర్థం కాక అడిగాడు దీక్షిత్.
ఆ అమ్మాయి పేరెంట్స్, కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్తారట. వాళ్ళ టార్గెట్ ఈ అమ్మాయే. కాబట్టి ఆ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోవడానికి వీలవుతుందా? ఆమె మీద ఫోకస్ తగ్గాక వెళ్లి పోతుందట. అందుకే దీన్ని ఆబ్లిగేషన్ అన్నాను" చెప్పడం ముగించారాయన.
ఒక్క క్షణం నీతూ శర్మ అందమైన ముఖం గుర్తుకు వచ్చింది అతనికి.
ఇదేమిటి.. ? ఈ అమ్మాయి అంతకంతకూ దగ్గరవుతోంది.. " అనుకున్నాడు.
తన ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి "అలాగే సర్. ఇప్పుడే ఆ అమ్మాయిని మా ఇంటికి చేర్చమని మా వాళ్లతో చెబుతాను. " అన్నాడు దీక్షిత్.
ఆ మాటలు విన్న మురళి బయటకు వెళ్లి ఎస్సైకి కాల్ చేసి ఆ విషయం చెప్పాడు.
తిరిగి లోపలి రాబోతూ ఉండగా మళ్ళీ దీక్షిత్ ఫోన్ మోగడంతో డోర్ దగ్గరే ఆగాడు.
ఈ సారి కాల్ చేసింది హోమ్ మినిష్టర్.
లిఫ్ట్ చేసి, "నమస్తే సర్, నేను ఎస్ పీ దీక్షిత్ ని మాట్లాడుతున్నాను" అన్నాడు.
"నమస్కారం. కేస్ అప్డేట్స్ తెలుసుకోవాలి. మా బావమరిది రమేష్ అనే అతన్ని పంపిస్తున్నాను" చెప్పారు ఆయన.
ఒక్క క్షణం జవాబివ్వలేదు దీక్షిత్. తరువాత తేరుకొని, "అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఐజీ గారికి అందజేస్తున్నాను. మీకేం కావాలన్నా వారిని అడిగి తెలుసుకోవచ్చు " అన్నాడు.
"మా బావమరిదికి సెక్యూరిటీ కావాలయ్యా. నీతో పర్సనల్ గా మాట్లాడాలంటున్నాడు. ఏం.. మాట్లాడవా.. నీ రూమ్ బయటే వెయిట్ చేస్తున్నాడు" అన్నాడు హోమ్ మినిష్టర్ కోపంగా.
"అలాగే సర్. కలుస్తాను" అని ఫోన్ పెట్టేసాడు దీక్షిత్.
"మురళీ. బయట రమేష్ అని ఎవరో ఉన్నారట. లోపలి పంపు. ఈ లోగా ఆ ఆరుగురిని, ఇద్దరు కాలేజీ కుర్రాళ్లను చింత చెట్టు దగ్గరకు తీసుకొని వెళ్లి టిఫిన్ పెట్టించు. " అన్నాడు. అలాగేనంటూ బయటకు నడిచాడు మురళి.
మరి కొంత సేపటికి ఓ యాభై ఏళ్ళ వ్యక్తి లోపలకు వచ్చాడు.
అతని వంక పరిశీలనగా చూశాడు దీక్షిత్.
నుదుట బొట్టు పెట్టుకుని ప్రశాంత వదనంతో ఉన్నాడాయన.
లోపలికి రాగానే దీక్షిత్ కు నమస్కరించి, "మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. " అన్నాడు.
ప్రతి నమస్కారం చేసి, “నిజానికి జరిగిన విషయాలన్నీ మీడియాతో సహా అందరికీ తెలుసు. విచారణలో కొత్త విషయాలు తెలిస్తే చెబుతాను" అన్నాడు దీక్షిత్.
"ఇలాంటి విషయాలు ఎవరికంటే వాళ్లకు మీరు చెప్పరని నాకు తెలుసు. నేను వచ్చింది మా బావ మనసులో ఉన్నది మీకు డైరెక్ట్ గా చెప్పడానికి" అన్నాడాయన.
చెప్పమన్నట్లు చూశాడు దీక్షిత్.
"మొదటి విషయం. ఈ హత్యతో అధికార పక్షానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ విషయం స్పష్టం చెయ్యమని చెప్పారు మా బావగారు. సహజంగానే ప్రతిపక్ష నాయకుడు హత్యకు గురైతే అనుమానం అధికార పక్షం పైనే ఉంటుంది, ఈ కేసులో నిందితులు తామే నేరం చేశామని ఒప్పుకుంటున్నారు. ప్రజల్లో మాత్రం మా పైనే అనుమానం ఉంటుంది.
అసలు ఈ హత్య ఎవరు చేయించారో తెలియక పోతే వచ్చే ఎలక్షన్లలో ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా మా వోటింగ్ పైన ఉంటుంది. కాబట్టి మీరు ఈ కేసును నిర్భయంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయండి. అసలు నేరస్థులను గుర్తించి మా పైన అనుమానాన్ని తొలగించండి. మీకు మా పూర్తి సహకారం ఉంటుంది.
మరో విషయం. లోకల్ ఎమ్మెల్యే మా పార్టీ మనిషే. ఇటీవల మా బావగారి దగ్గరకు వచ్చి, నియోజక వర్గంలో శివరాం గారి బలం పెరుగుతోందని, మీరు వెనక ఉంటానంటే ఏదో ఒకటి చేస్తానని అడిగాడట. అలాంటి పనులు మనల్ని ప్రజలకు దూరం చేస్తాయని మా బావగారు అన్నారట. కాబట్టి అనుమానితుల జాబితాలో అతన్ని కూడా చేర్చామన్నారు మా బావగారు. ఇలాంటి విషయాలన్నీ ఫోన్ లో చెప్పలేము కదా. అందుకని నన్ను పంపించారు. మరోలా భావించవద్దు. ఇక నేను సెలవు తీసుకుంటాను" అన్నాడాయన. డోర్ వరకు వెళ్లి ఆయన్ని సాగనంపాడు దీక్షిత్..
అతను వెళ్ళాక మురళి మళ్ళీ లోపలకు వచ్చాడు.
అతను లోపలికి అడుగు పెట్టాడో లేదో మళ్ళీ దీక్షిత్ ఫోన్ మోగింది.
బయటకు వెళ్ళబోతున్న మురళిని ఆపి, కూర్చోమని చెప్పి, ఫోన్ అందుకున్నాడు దీక్షిత్.
నీతూశర్మ నుండి కాల్.
"చెప్పండి నీతూ గారూ. మళ్ళీ ఏ ప్రాబ్లమ్ లేదు కదా.. " ఆతృతగా అడిగాడు.
అవతల లైన్ లో ఉన్నదెవరో అర్థమైన మురళి బయటకు నడిచాడు.
"ఏ ప్రాబ్లమ్ లేదు. అమ్మ, నాన్న, అన్నయ్య ఢిల్లీలో ఉన్న మా పెదనాన్న గారింటికి వెళ్లారు. నేను ప్రస్తుతం మా అత్తయ్యగారి ఇంట్లో ఉన్నాను" చెప్పింది నీతూశర్మ.
"అత్తయ్య గారి ఇంట్లోనా.. యు మీన్ శివరాం శర్మ గారి ఇంట్లోనా.. " ఆశ్చర్యంగా అడిగాడు దీక్షిత్.
"కాదు. అత్తయ్య అంటే.. మా బావ వాళ్ళ అమ్మ. ఈ రోజు నేను వాళ్ళ అబ్బాయికి కావాల్సిన వంటలు చేసి పెట్టాలట. నేను ఇక బిజీ. జస్ట్ మీకు ఇంటిమేట్ చేద్దామని కాల్ చేశాను, బై" అంటూ కాల్ కట్ చేసింది.
ఫోన్ పెట్టేలోగా మళ్ళీ కాల్..
ఈ సారి అమ్మ దగ్గరనుండి.
"బాబూ! ఈ రోజు ఎంత పని ఉన్నా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావాలి. నీకోసం నీకిష్టమైన ఐటమ్స్ చేయిస్తున్నాను. మిస్ చెయ్యొద్దు. సాకులు చెప్పొద్దు" అంటూ ఫోన్ పెట్టేసింది నందిత.
"మురళీ!" ఇంచుమించు అరచినట్లు పిలిచాడు దీక్షిత్.
అతను లోపలికి రాగానే "ఆ అమ్మాయిని మా ఇంటికి చేర్చమని ఇందాకే కదా చెప్పాను.. అప్పుడే చేర్చేశారా" అడిగాడు.
“అవును సర్. ఏమైంది?” ఆందోళనగా అడిగాడు మురళి.
"ఏముంది.. ఆ విషయం నాకు తెలీదు కదా.. అమ్మాయి నన్ను ఏప్రిల్ ఫూల్ ని చేసింది. " అన్నాడు నవ్వుతూ.
మళ్ళీ ఫోన్ మోగడంతో "నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు" అని మురళితో అంటూ కాల్ లిఫ్ట్ చేశాడు.
"నా పేరు శ్రేయోభిలాషి అని నీ కాంటాక్ట్స్ లో ఫీడ్ చేసుకో. నేను పంపే ఫోటో డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నదెవరో నీ పక్కనున్న సి ఐ ని అడుగు" అంటూ కట్ చేసాడతను.
అతను పంపిన ఫోటోను చూసాడు దీక్షిత్. ఇద్దరు యువకులు ఒక బార్ లో పక్క పక్కన కూర్చుని ఉన్నారు.
ఆ ఫోటోని మురళికి చూపించాడు.
"సర్ ఇందులో ఒకతను శివరాం గారిని షూట్ చేసిన వ్యక్తి. మరొకతను ఆ అమ్మాయి నీతూ శర్మ వాళ్ళ అన్నయ్య లాగా ఉన్నాడు. ఫైవ్ మినిట్స్ లో కన్ఫర్మ్ చేస్తాను" అంటూ బయటికి వెళ్ళాడు.
ఐదు నిముషాల్లోనే కాల్ చేసి, “అవును సర్, అతడు ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యే" అని చెప్పాడు. తల గిర్రున తిరిగినట్లైంది దీక్షిత్ కి.
హంతకుడితో నీతూ వాళ్ళ అన్నయ్యకి పరిచయముందా..
నమ్మలేక పోతున్నాడు. రెండు చేతులతో కణతల మీద రుద్దుకుని రిలాక్స్ కావడానికి ప్రయత్నించాడు.
=========================================================
ఇంకా ఉంది
అపరాధ పరిశోధన - పార్ట్ 4 త్వరలో..
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comments