అపరాధ పరిశోధన - పార్ట్ 4
- Seetharam Kumar Mallavarapu
- Apr 8
- 8 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 4 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 08/04/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్య ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. అరెస్టయిన నిందితుల కదలికలు గమనించే ఏర్పాటు చెయ్యమంటాడు.
ఐజీ గారు కాల్ చేసి గవర్నర్ ఆబ్లిగేషన్ ఒకటుందని, నీతూ శర్మను ఇంట్లో ఉంచుకొని ప్రొటెక్షన్ ఇమ్మని చెబుతాడు. హోమ్ మినిష్టర్ బావమరిది రమేష్ తమ పార్టీ ఎమ్మెల్యే ని కూడా అనుమానించమని చెబుతాడు.
ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 4 చదవండి..
ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగబోతుందో కొద్ది క్షణాలు ఏమీ అర్థం కాలేదు దీక్షిత్ కు. కానీ తన మనసులో చెలరేగుతున్న ఆలోచనలను అదుపులోకి తెచ్చుకొని ప్రాక్టికల్ గా, ప్రొఫెషనల్ గా ఆలోచించడం మొదలు పెట్టాడు.
ఇప్పుడు తను చేయబోయే పని నిందితులను అబ్జర్వ్ చేయడం, ఆ తర్వాత విచారణ చేయడం. ఈ సమయంలోనే తనకు ఇలా ఫోన్ కాల్ రావడం.. అపరిచిత వ్యక్తి ఒక ఫోటోను పంపడం.. సహజంగా అనిపించలేదు. ఫోటోలు, వాస్తవాలను పక్కన పెడితే అది పంపిన వారి ఉద్దేశం తన ఏకాగ్రతను దెబ్బతీయటమే.
కాబట్టి తను ఎప్పటిలా తన సహజ సిద్ధమైన చలాకీ తనంతో ఉండాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. కేసును తను విచారించే పద్ధతి నీతూశర్మ వల్ల కానీ, వాళ్ళ అన్నయ్య ఫోటో పంపిన వాళ్ల వల్ల కానీ, తమ పార్టీ ఎమ్మెల్యేని అనుమానించమని చెప్పిన హోమ్ మినిస్టర్ బావమరిది మాటల వల్ల కానీ ఎంత మాత్రం ప్రభావితం కాదు.
సీఐ మురళి ఏం చెబుతాడోనని అతని వంక చూశాడు దీక్షిత్.
“సార్! ఇప్పుడు ఆ నిందితులను టిఫిన్ కోసమని మన కాంపౌండ్ వాల్ లోపల ఉన్న చెట్టు కిందకి తీసుకొని వెళుతున్నాను. మీరు మానిటర్ నుండి వాళ్ళ కదలికలను గమనించండి. నేను ఒక విండో నుండి బైనాక్యూలర్స్ తో వాళ్లను గమనిస్తూ ఉంటాను. వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేసినా వాళ్ల మీద ఏదైనా అటెంప్ట్ జరిగే అవకాశం ఉన్నా అక్కడే మఫ్టీలో తచ్చాడుతున్న మన వాళ్ళను అలర్ట్ చేస్తాను. ఇక ఈ ఫోటో విషయం మన విచారణ పూర్తయ్యాక ఆలోచిద్దాం" అని చెప్పి దీక్షిత్ దగ్గర సెలవు తీసుకుని బయటకు నడిచాడు మురళి.
***
ఇందాక తాము ఉన్న గది నుంచి సీఐ మురళి బయటకు వెళ్ళగానే ఆ 50 ఏళ్ల వ్యక్తి అందరికీ టీలు అందించడం ప్రారంభించాడు. అతనితో ఒక కాలేజీ కుర్రాడు "ఒక సిగరెట్ ప్యాకెట్ అరేంజ్ చెయ్యి" అన్నాడు.
అందుకు ఆ టీలు సర్వ్ చేసే వ్యక్తి ఒక కానిస్టేబుల్ ని చూపిస్తూ "మధు సార్ చెబితే చేస్తాను" అని చెప్పి అందరికీ టీలు ఇచ్చి వెళ్లిపోయాడు.
ఆ కుర్రాడు "మధు సార్! ఇలా రండి" అని గట్టిగా పిలిచాడు.
అతను ఇటువైపు తిరిగి "ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావ్?" అంటూ కోపంగా వచ్చినట్లు దగ్గరకు వచ్చాడు. తర్వాత చిన్నగా "చెప్పండి చినబాబు. ఏం అరేంజ్ చేయమంటారు?" అన్నాడు.
ఆ కుర్రాడు "ఒక సిగరెట్ ప్యాకెట్ కావాలి. అలాగే మా డాడ్ కి ఫోన్ చేయడానికి ఒక మొబైల్ కావాలి. మా ఫోన్లు వీళ్లు తీసి పెట్టుకున్నారు"అన్నాడు.
అందుకు ఆ కానిస్టేబుల్ మధు "అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయి. దొరికితే మా ఉద్యోగాలు పోతాయి" అన్నాడు.
అందుకా కుర్రాడు "ప్రతినెలా మా వైన్ షాప్ నుండి మామూలు తీసుకుంటారు కదా! ఆ మాత్రం హెల్ప్ చేయలేరా? ఏ ప్లేస్ లో సీసీ కెమెరాలు లేవో నీకు బాగా తెలుసు కదా" అన్నాడు.
అందుకా కానిస్టేబుల్ గొంతు తగ్గించి "ఇప్పుడు టిఫిన్ కోసం బయటకు వెళ్తారు కదా. అక్కడ ఒక ప్లేస్ చూపిస్తాను. సిగరెట్లు అక్కడే తాగేయాలి. ఫోన్ అప్పుడే తిరిగి ఇచ్చేయాలి. నేను ముందుగానే అక్కడికి వెళ్లి ఆ ఏర్పాట్లు చూస్తాను" అని చెప్పి బయటకు నడిచాడు.
కొంతసేపటికి పదిమంది కానిస్టేబుల్స్ వచ్చి వీళ్లను బయటకు తీసుకొని వెళ్లారు. చింత చెట్టు దగ్గర వీళ్లను వదిలి, ఇద్దరు కానిస్టేబుల్స్ మినహా అందరూ వెనక్కి వెళ్లారు.మధు అనే కానిస్టేబుల్, ఇందాక టీలు ఇచ్చిన వ్యక్తి అప్పటికే అక్కడ ఉన్నారు.
"వీళ్ళందరికీ ఏం టిఫిన్ కావాలో కనుక్కో" అన్నాడు మధు.
ఎవరెవరికి ఏ టిఫిన్ కావాలో కనుక్కొని బయటకు వెళ్లాడు ఆ వ్యక్తి.
మధు, ఆ ఇద్దరు కుర్రాళ్లకు, చెట్టు వెనక్కి వెళ్ళమన్నట్లు సైగ చేశాడు. వాళ్ళిద్దరూ అటు వెళ్లి అక్కడ ఉన్న బల్లపై కూర్చున్నారు. తర్వాత మధు అటూ ఇటూ పచార్లు చేస్తూ ఎవ్వరూ గమనించని సమయం చూసి చెట్టు వెనక్కి వెళ్ళాడు. ఈ ఆరుగురు నిందితులు ఆ విషయాన్ని గమనించినా, ఏమీ తెలియని వాళ్ళలా ఉన్నారు. మరికొంతసేపటికి సిగరెట్ వాసన వాళ్ళ ముక్కుపుటాల్ని తాకింది.
'డబ్బుంటే ఏదైనా జరుగుతుంది' తనలో తనే గొణుక్కున్నట్లు అన్నాడు శివరాంశర్మను షూట్ చేసిన వ్యక్తి. అవునన్నట్లు తలాడించాడు ఫోటోలు తీసిన వ్యక్తి. కొంతసేపటికి వాళ్ళందరికీ టిఫిన్స్ ఇచ్చారు. చెట్టు వెనక కూర్చుని ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు టిఫిన్ ముగించి, వాష్ రూమ్ వైపు వెళ్లారు. ఒక వ్యక్తి చేతిలో మొబైల్ ఉండడం వీళ్లు గమనించారు.
తన టిఫిన్ తొందరగా ముగించి చేతిలోని పేపర్ ప్లేట్లు పడేయడానికి అన్నట్లు చెట్టు వెనక్కి వెళ్ళాడు ఫోటోలు తీసిన వ్యక్తి. దూరంగా ఉన్న మధు వంక చూసి చిన్నగా దగ్గరకు రమ్మని సైగ చేశాడు. మధు ఎప్పటిలాగే పచార్లు చేస్తున్నట్లుగా ఇతని దగ్గరకు వచ్చి "తొందరగా చెప్పు, ఏం కావాలి?" అన్నాడు.
"నా భార్య 9వ నెల ప్రెగ్నెంట్. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడతాను. ప్లీజ్! మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి" అన్నాడు.
మధు ముందుకు వంగి "ఇలాంటి వాటికి మొబైల్, సిమ్ కార్డ్ ఒక్కసారే వాడాలి. తర్వాత వాటిని పడేయాలి. కాబట్టి అందుకు ఎక్కువ ఖర్చవుతుంది. ఆ కుర్రాళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ల బ్రాందీ షాప్ కి వెళ్ళి, నా డబ్బులు వసూలు చేసుకోగలను. మీ సంగతి ఏమిటి? దీంట్లో అరువు బేరాలు లేవు. ఇది జరిగే పని కాదులే" అంటూ తన పచార్లు కొనసాగించాడు.
'పెద్ద మొత్తం డిమాండ్ చేయడానికి వేషాలు వేస్తున్నాడు'.. చిన్నగా అన్నాడు ఫోటో తీసిన వ్యక్తి.
మధు తిరిగి చెట్టు వెనక్కి వచ్చేవరకు ఆగాడు. రాగానే అతన్ని సమీపించి చిన్న స్వరంతో "మీకు ఎంత కావాలో చెప్పండి. దాము అన్న చూసుకుంటారు. ఆయన చెప్తే నమ్ముతారు కదా" అన్నాడు.
దాము పేరు వినగానే ఉలిక్కి పడ్డాడు మధు అనే ఆ కానిస్టేబుల్.
ఆ దాము అనే వ్యక్తి నరరూప రాక్షసుడు. పదేళ్ల క్రితం బీహార్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. పైకి అతను చేసే పని బీహార్ నుండి కూలీలను కాంట్రాక్ట్ మీద ఇక్కడికి పిలిపించడం. వాస్తవానికి అతనికి బీహార్ లోని క్రిమినల్ గ్యాంగులతో పరిచయం ఉంది. కిరాయికి నేరం చేసేవాళ్లను, కావలసిన వాళ్లకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అతనికి అన్ని రాజకీయ పార్టీలతో పరిచయం ఉంది. అందరికీ అతని అవసరం ఉంటుంది.
"మరి దాము అన్న తో ఆ మాట చెప్పిస్తావా" అన్నాడు మధు.
"తప్పకుండా. ముందు దాము అన్న తో మాట్లాడాకే నా భార్యకు కాల్ చేసుకుంటాను" అని చెప్పాడు.
"ఒక్క పది నిమిషాల్లో రెండు సెల్ ఫోన్లు ఏర్పాటు చేస్తాను. కానీ అటువైపు మాట్లాడేది దాము సార్ అని నాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి వీడియో కాల్ చేయడానికి వీలుండే ఫోన్ ఒకటి ఏర్పాటు చేస్తాను. డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి" నసుగుతున్నట్లు చెప్పాడు మధు.
"అరే మధు సారూ! డబ్బుల గురించి నువ్వేం ఫికర్ కావొద్దు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే గిట్టుబాటు అవుతుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో. తనను మోసం చేసిన వాళ్లను దాము అన్న క్షమించడు. అలాంటిదేమైనా ఉంటే ఇప్పుడే నా వల్ల కాదని చెప్పేయ్" అన్నాడతను.
మధు చిన్నగా నవ్వి, "నా వయస్సు చూసావు కదా! ఎంతో అనుభవం ఉన్నవాడిని. ఎవరితో ఎలా మెలగాలో నాకు బాగా తెలుసు. దాము అన్నకి నా పనితనం నచ్చితే ముందు ముందు ఒకరికొకరం ఇంకా సహాయం చేసుకుంటాం" అన్నాడు.
"అయితే ఆలస్యం చేయొద్దు. వెంటనే పని కానివ్వు" ఆన్నాడు ఫోటో తీసిన వ్యక్తి.
"ఇదిగో.. పది నిమిషాలు చాలు" అంటూ అక్కడి నుంచి కదిలాడు మధు.
10 నిమిషాలకు మధు రాలేదు కానీ టీ ఫ్లాస్క్ పట్టుకొని ఒక ముప్పై ఏళ్ల వ్యక్తి వచ్చాడు.
"ఇందాక టీ ఎవరు అడిగారు.. రండి" అంటూ చెట్టు వెనక ఉన్న బెంచిపైన కూర్చున్నాడు.
ఫోటో తీసిన వ్యక్తి, షూట్ చేసిన వ్యక్తి ఇద్దరూ చెట్టు వెనక్కి వచ్చారు.
"ఒక మనిషి అని చెప్పాడు మధు సార్. ఇంకెవరూ ఉండకూడదు" అన్నాడు అతను.
''దాము సర్ తో నాకు నేరుగా పరిచయం లేదు. ఇతను చెబితేనే డబ్బులు ఇస్తాడు. మా వాడేలే, పరవాలేదు" అన్నాడు ఫోటో తీసిన వ్యక్తి.
"అలాగైతే నువ్వు వెళ్ళిపో. అతను మాట్లాడి వచ్చేసాక నువ్వు రా. ఇద్దరూ ఒకే చోట ఉంటే చూసే వాళ్లకు అనుమానం రాదా?" మందలిస్తున్నట్లు అన్నాడు.
"అవును.నిజమే"నంటూ ఫోటో తీసిన వ్యక్తి వెళ్లిపోయాడు.
షూట్ చేసిన వ్యక్తి మొబైల్ అందుకొని కళ్ళు మూసుకుని ఒక నెంబర్ గుర్తుకు తెచ్చుకున్నాడు. తర్వాత కాల్ చేశాడు.
దాము తన మొబైల్ ని ఎప్పుడూ తన దగ్గర ఉంచుకోడు. ఎలాంటి కాల్ అయినా సరే ముందు అనుచరుడు లిఫ్ట్ చేసి మాట్లాడిన తర్వాత అతనికి ఇస్తాడు.
కాల్ లిఫ్ట్ చేసిన దాము అనుచరుడితో షూట్ చేసిన వ్యక్తి మాట్లాడుతూ "మునావర్ అన్నా! దాము సార్ కి చెప్పి ఈ అన్న అడిగిన డబ్బులు ఇప్పించు" అన్నాడు.
మునావర్ అనే అతను ఆ మొబైల్ అందించిన వ్యక్తిని చూసి, "బషీర్! నువ్వా" అన్నాడు.
ఆ బషీర్ అనే వ్యక్తి మునావర్ ని గుర్తు పట్టి, "అన్నా! నువ్వు అక్కడ ఉన్నావని నాకు తెలియదు. అయితే అన్నీ నువ్వే చూసుకో, దాము సార్ తో చెప్పి కొంచెం ఎక్కువ ఇప్పించు. వచ్చిందాంట్లో సగం ఈ పోలీసులకే ఇవ్వాలి" అన్నాడు.
"అలాగే లే, నాది పూచి. పోలీసు వాళ్ళు కిరికిరీలు ఏమీ పెట్టడం లేదు కదా" అనుమానంగా అడిగాడు.
"ఏమీ లేదన్నా. డబ్బుకు కక్కుర్తి పడేవాళ్లు ప్రతిచోటా ఉంటారు కదా. పెద్ద సార్లు స్ట్రిక్ట్ గా ఉన్నా, చిన్నవాళ్లు డబ్బుకో ఆడదానికో ఆశపడతారు కదా.. ఇక నేను ఉంటాను" అని ఫోన్ పెట్టేసాడు బషీర్.
తర్వాత "ఇక నువ్వు వెళ్ళు. అతన్ని పంపించు" అన్నాడు.
ఇతను వెళ్లాక ఫోటోలు తీసిన వ్యక్తి వచ్చాడు. బషీర్ అనే అతను ఫోన్ అందిస్తూ "భార్యతో మాట్లాడాలంటున్నావు కదా. నేను అవతలికి వెళ్తాను లే" అన్నాడు.
అందుకతను "అవసరం లేదన్నా. ఇక్కడే ఉండండి" అంటూ కాల్ చేసి "నేను బాగానే ఉన్నాను. కానీ నేను చెప్పేది విను. ఆన్లైన్లో పది సోపులు ఆర్డర్ పెట్టాను. డెలివరీ ఈరోజే అన్నారు. వచ్చాయా" అడిగాడు.
అటు నుండి అతని భార్య గొంతు తగ్గించి "మనిషి వచ్చాడు. ఈరోజు పోలీసులు మన ఇల్లు తనిఖీ చేయవచ్చని, అందుకని వాళ్లు వచ్చి వెళ్ళాక ఇస్తామని చెప్పాడు" అందామె.
"పది సోపులు తీసుకున్నాక నువ్వు ఇల్లు తాళం వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో. లేదంటే ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి కూపీలు లాగుతూ ఉంటారు" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి.
"సరే అయితే" అని ఫోన్ బషీర్ కి ఇచ్చి వెళ్లిపోయాడు.
మరికొంతసేపటికి మధు వచ్చి "ఇంకా ఇక్కడే ఉన్నారా? మీ వాష్ రూమ్ పనులు ముగించుకోండి. టైం అయింది" అన్నాడు.
మరో అరగంటలో అందరూ కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు. అందరిని ఆఫీసులో ఉన్న ఒక రూమ్ లో కూర్చోబెట్టాడు మధు.
***
దీక్షిత్ కూర్చొని ఉన్న గదిలోకి వెళ్ళాడు మురళి. తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని మురళితో చెప్పి "చాలా చక్కగా అరేంజ్ చేశారు. డోంట్ కేర్ టైపు కుర్రాళ్ళు.. లంచాలకు ఆశపడేవాడిలా నటించిన కానిస్టేబుల్ మధు.. టి సర్వ్ చేయడానికి వచ్చి మధు ని కన్సల్ట్ చేయవచ్చని చెప్పిన కానిస్టేబుల్.. అందరూ బాగా నటించి మనకు చాలా సహకరించారు. శివరాం శర్మను కలవడానికి వచ్చిన కార్యకర్తలమంటూ చెప్పుకున్న వాళ్ళకి, ఆయన్ని వెనకనుంచి షూట్ చేసిన వాళ్ళకి పరిచయం ఉన్నట్లు మనకు కచ్చితంగా తెలుస్తోంది. కాబట్టి వాళ్ల నుంచి నిజం రాబట్టే వరకు ఇంటరాగేట్ చేయాలి.
ఇక నీతూ శర్మ పైన దాడి చేసిన వాళ్ళు స్తబ్దుగా ఉన్నారు. ఎవరితో మాట్లాడలేదు. వాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు కనుక్కుంటే మనకేదైనా క్లూ దొరకవచ్చు. ఇక హంతకుడితో నీతు శర్మ వాళ్ళ అన్న బార్ లో కలిసి ఉన్న ఫోటో గురించి.. ఆ ఫోటో సరిగ్గా నిందితులను మనం అబ్జర్వ్ చేయాలనుకున్న సమయంలో రావడం ఆశ్చర్యంగా ఉంది.
పైగా ఆ వ్యక్తి 'ఫోటోలో ఉన్నది ఎవరో నీ పక్కన ఉన్న సిఐ మురళిని అడుగు' అని చెప్పాడు. అంటే ఆ సమయంలో మన ఇద్దరం పక్క పక్కనే ఉన్నట్లు కూడా అతనికి తెలుసు. మన సిబ్బందిలో ఎవరైనా అతనితో ఈ విషయం చెప్పి ఉండొచ్చు. లేదా నన్ను కలవడానికి వచ్చిన హోమ్ మినిస్టర్ బావమరిది ద్వారా కూడా తెలిసి ఉండొచ్చు.
ఈరోజు విచారణ ముగిశాక నాకు వచ్చిన కాల్ నెంబర్ గురించి ఎంక్వయిరీ చేయించండి. అలాగే ఆ సమయంలో మన ఆఫీస్ కి పక్కనే ఉన్న సెల్ టవర్ నుంచి వెళ్లిన, వచ్చిన కాల్స్ వివరాలు సేకరించండి. ఒక నిందితుడు, దాము అనుచరుడు మునావర్తో మాట్లాడాడు కదా. మనం వెంటనే వాళ్లను విచారిస్తే వాళ్లకు సెల్ ఫోన్లు ఇచ్చిన టీ అంగడి వ్యక్తి.. మన ఇన్ ఫార్మర్.. బషీర్ మీద వాళ్లకు అనుమానం వస్తుంది.
అతనికి ప్రాణాపాయం కూడా ఉంటుంది. కాబట్టి దాము, మునావర్ ల మీద నిఘా పెట్టండి. సమయం వచ్చినప్పుడు వేరే ఇన్ఫర్మేషన్ మీద అదుపులోకి తీసుకుంటున్నట్లు వాళ్లను మన కస్టడీలోకి తీసుకోవచ్చు" అన్నాడు దీక్షిత్.
"సార్! నాదొక చిన్న సజెషన్" అన్నాడు మురళి.
"చెప్పండి" అన్నాడు దీక్షిత్.
"ఏం లేదు, భోజనానికి ఇంటికి రమ్మని అమ్మగారు చెప్పారు కదా. టైం కు ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎంక్వైరీలో పడి ఆ విషయం మర్చిపోకండి. పైగా.." అంటూ ఆగాడు.
"పైగా ఏమిటి.. ఇంటికి వచ్చిన చుట్టాన్ని పలకరించ మంటావా.. వాళ్లు చేసిన వంటను మెచ్చుకోమంటావా" నవ్వుతూ అడిగాడు దీక్షిత్.
"అందుకనే కాదు సార్. ఇంటిదగ్గర సెక్యూరిటీ అరేంజ్మెంట్లు ఎలా ఉన్నాయో చూడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. పైగా గవర్నర్ గారి ఆబ్లిగేషన్.." అంటూ గుంభనంగా నవ్వాడు మురళి.
ఇంతలో అతని ఫోన్ మోగింది.
'అలాగా. ఇప్పుడే సర్ తో మాట్లాడి చెబుతాను' అని కాల్ కట్ చేసి,
"సార్! గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్లు ఫోన్ చేశారు. శివరాం శర్మ గారి ముఖ్య అనుచరుడు, ప్రతిపక్షంలో మరో పేరు ఉన్న నాయకుడు సునీల్ వర్మ తన అనుచరులతో గేట్ బయట ఉన్నాడట. కేసు విషయంగా మీతో వెంటనే మాట్లాడాలంటున్నాడట" అని చెప్పాడు.
"ఆయన ఒక్కడినే రమ్మను. క్లుప్తంగా చెప్పమను. ఏదో ఒక కారణంతో ఇంటరాగేషన్ వెనక్కి వెళ్తూనే ఉంది" అన్నాడు దీక్షిత్.
అదే విషయాన్ని సెక్యూరిటీ కి కన్వే చేశాడు మురళి.
మరో రెండు నిమిషాల తర్వాత సెక్యూరిటీ తిరిగి ఫోన్ చేసి "సార్! ఆయన స్లోగన్స్ చేస్తున్నాడు. అందరితో కలిసి లోపలికి వచ్చి మీకు ఒక వినతి పత్రం ఇచ్చి వెళ్తాడట" అని మురళితో చెప్పాడు.
విషయం తెలుసుకున్న దీక్షిత్ "నేనే వెళ్లి వాళ్లతో మాట్లాడుతాను" అంటూ ఆవేశంగా బయటకు నడిచాడు. ఆయన్ని అనుసరించాడు మురళి. గేట్ దగ్గరికి వస్తున్న దీక్షిత్ ను చూసిన వాళ్లు "ఎస్పీ డౌన్ డౌన్.. నిర్దోషులను వదిలేయాలి" అంటూ నినాదాలు చేశారు.
"సర్! గేటు బయటకు వెళ్ళకండి. మ్యాన్ హ్యాండ్లింగ్ కి ప్రయత్నిస్తారేమో.. మనం లాఠీఛార్జ్ చేస్తే ఏదైనా గొడవ క్రియేట్ చేసి.." మురళి వారిస్తున్నా గేట్ బయటకు అడుగు పెట్టాడు దీక్షిత్.
=========================================================
ఇంకా ఉంది
అపరాధ పరిశోధన - పార్ట్ 5 త్వరలో..
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comments