top of page

అపరాధ పరిశోధన - పార్ట్ 5

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన


Aparadha Parisodhana - Part 5 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 17/04/2025

అపరాధ పరిశోధన - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్య ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు.


ఐజీ గారు కాల్ చేసి గవర్నర్ ఆబ్లిగేషన్ ఒకటుందని, నీతూ శర్మను ఇంట్లో ఉంచుకొని ప్రొటెక్షన్ ఇమ్మని చెబుతాడు. హోమ్ మినిష్టర్ బావమరిది రమేష్, తమ పార్టీ ఎమ్మెల్యే ని కూడా అనుమానించమని చెబుతాడు.


ఒక నిందితుడు, మురళి ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్ఫార్మర్ బషీర్ ను అడిగి మొబైల్ తీసుకొని భార్యతో మాట్లాడుతాడు. కాల్పులు జరిపిన వ్యక్తి, దాము అనే క్రిమినల్ అనుచరుడు మునావర్ తో మాట్లాడుతాడు.


గేట్ బయట ఆందోళన చేస్తున్న శివరాం శర్మ అనుచరుడు సునీల్ వర్మను కలవడానికి బయటకు వెళ్తాడు దీక్షిత్.  



ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 5 చదవండి..


దీక్షిత్ స్వయంగా బయటకు రావడం ఊహించని సునీల్ వర్మ, అతని అనుచరులు దిగ్భ్రాంతికి గురవుతారు. తమతో మాట్లాడటానికి గేటు తీసుకొని ఒకరిద్దరు కానిస్టేబుల్స్ వస్తారని, అదే అదనుగా తాము లోపలికి చొచ్చుకొని పోవచ్చని అనుకున్నారు. కానీ దీక్షిత్ రావడం, అతని వెనకే సీఐ మురళి, మరో పది మంది కానిస్టేబుల్స్ బయటకు వచ్చి గన్స్ పొజిషన్లో ఉంచుకోవడంతో ఖంగు తిన్నారు. 


ముందుగా దీక్షిత్ మాట్లాడుతూ, "హత్య జరిగి ఇంకా 24 గంటలు కూడా కాలేదు. మామూలుగా ఇలాంటి రాజకీయ హత్యల విషయంలో ఏళ్ల తరబడి దర్యాప్తు కొనసాగుతుంది. కానీ మా సిబ్బంది చురుగ్గా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. ఇక మా అదుపులో ఉన్న మీ పార్టీ కార్యకర్తలు మాకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినందువల్లే వాళ్లను మా అదుపులో ఉంచుకున్నాము. విచారణ పూర్తికాగానే వాళ్లను విడిచి పెడతాము. దయచేసి సహకరించండి. మీ నాయకుడి హత్యపై విచారణ సవ్యంగా జరగడానికి నిజానికి మీరే మాపై ఒత్తిడి తేవాలి" అని చెప్పాడు. 


కాస్త తేరుకున్న సునీల్ వర్మ, "మా కార్యకర్తలు హంతకుడిని ఫోటోలు తీశారు. అలాంటి వాళ్ళను మీ కస్టడీలోకి తీసుకొని వచ్చి చిత్రహింసలు పెడుతున్నారు.. " అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా "ఒక క్షణం ఆగండి" అంటూ దీక్షిత్ తన జేబులో చేయి పెట్టాడు. 


అతని బాడీ లాంగ్వేజ్ చూసిన సునీల్ వర్మ కాస్త జంకాడు. పిస్తోలు తీసి తనను లేపేస్తాడేమోనని భయపడ్డాడు. దీక్షిత్ జేబులోంచి తన మొబైల్ తీసి, పార్టీ కార్యకర్తలమని చెప్పుకున్న వారితో తను మాట్లాడిన మాటల తాలూకు రికార్డింగ్ వారికి వినిపించాడు. 


అందులో ఫోటోలు తీసినందుకు తను వారిని అభినందించడం, కేసు విషయంలో సహకరించాలని కోరడం, అందుకు వారు అన్ని విధాల సహకరిస్తామని, తమను కస్టడీలోకి లోకి తీసుకోవచ్చని చెప్పిన విషయం రికార్డు అయి ఉన్నాయి. అది వాళ్లకు వినిపించిన తరువాత ఇక మాట్లాడడానికి వాళ్లకు ఏమీ అవకాశం దొరకలేదు. 


కానీ సునీల్ వర్మ తేరుకొని, "మీ విచారణకు మేము అడ్డు చెప్పడం లేదు సార్! కానీ మా వాళ్ల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని కోరడానికి వచ్చాం. మీకు మేము కూడా అన్ని విధాలా సహకరిస్తాం. మా కార్యకర్తలను మరో గంటలో బయటకు పంపమని కోరుతున్నాం" అని చెప్పి, "శివరాంశర్మ అమర్ రహే" అని నినాదాలు చేస్తూ వెనక్కి వెళ్లారు. 


వాళ్లు వెళ్లిన వెంటనే వెనక్కి తిరిగిన దీక్షిత్ "ఇక ఇంటరాగేషన్ ప్రారంభిద్దాం. ఇప్పటికే ఆలస్యమైంది" అన్నాడు. 


సి ఐ మురళి తో సహా కానిస్టేబుల్స్ అందరూ అతని వంక ఆశ్చర్యంగా చూశారు. ఒక సమస్యను విజయవంతంగా సాల్వ్ చేసిన గర్వం తాలూకు ఛాయలు అతని ముఖంలో కనిపిస్తాయని అందరూ ఊహించారు. కానీ అలాంటిదేమీ లేకుండా తరువాత చేయాల్సిన పని గురించి ఆలోచిస్తున్న అతని నిబద్ధతకు మనస్సులోనే అందరూ అతన్ని అభినందించారు. 


సిఐ మురళి, దీక్షిత్ దగ్గరకు వెళ్లి "సర్! ఇద్దరం ఒకరి తర్వాత ఒకరు ఇంటరాగేట్ చేయడం అంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి ఒకేసారి చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారు" అని అడిగాడు. 


"ఏమిటి.. నా లంచ్ కి ఆలస్యం అవుతుందని ఫీలవుతున్నారా?" నవ్వుతూ అన్నాడు దీక్షిత్. మళ్లీ తనే "అలాగే కానిద్దాం" అన్నాడు. 


మురళి మాట్లాడుతూ "థాంక్యూ సార్!. హిడెన్ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఉన్న గదిలోకి ఒక్కొక్కరిని ప్రవేశ పెట్టమని చెబుదాం. అంతకంటే ముందుగా మన ఇన్ఫార్మర్ బషీర్ అందించిన హై ఎండ్ మైక్ అమర్చిన వాయిస్ రికార్డర్ ని కూడా పరిశీలిద్దాం" అన్నాడు. 

తరువాత వాళ్లిద్దరూ దీక్షిత్ రూమ్ లోకి వెళ్లారు. 


"మన కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్న సెల్ టవర్ నుండి వెళ్లిన కాల్స్ వివరాలు ఇంకా రాలేదు. అయితే వాళ్ళు మాట్లాడిన దాము అనుచరుడు మునావర్ కు బషీర్ తెలిసినవాడు కావడంతో, వాళ్ళు కాల్ లాగ్ డిలేట్ చెయ్యలేదు. మీరు చెప్పినట్లుగానే దాము, మునావర్ ల మీద నిఘా పెట్టించాను. ఇక ఒక నిందితుడు గర్భవతిగా ఉన్న భార్యకు కాల్ చేశానని చెప్పాడు. అతని భార్య గర్భవతి అన్నమాట నిజమే కానీ ఆమె పుట్టింట్లో ఉంది. అతనితో ఉన్నది అతని ప్రియురాలు" తనకు తెలిసిన వివరాలు చెప్పాడు మురళి. 


బషీర్ ఇచ్చిన మొబైల్ ను, వాయిస్ రికార్డర్ ను దీక్షిత్ కు అందజేశాడు మురళి. 

వాటిని నిశితంగా పరిశీలించాడు దీక్షిత్. 


ఫోటోలు తీసిన వ్యక్తికి వారు ఆశ చూపిన మొత్తం పది లక్షలు ఉండవచ్చు. దాన్నే అతను పది సోపులు అంటూ మాట్లాడాడు. ఆతని ఇంటిపైకి పోలీసులు రావచ్చని వాళ్ళు ఊహిస్తున్నారు. కాబట్టి వెంటనే ఆతని ఇంటిలో సోదాలు జరిపించండి. అందరికీ తెలిసేలా ఒక రోజు ఆ ఇంటిపై నిఘా పెట్టి తరువాత అనుమానం రాకుండా గమనించాలి. ఆ ఇంటి చుట్టుపక్కల మనకు సహకరించేవారు ఎవరైనా వుంటే వాళ్ళ ఇంటినుండి నిఘా పెట్టవచ్చు" అన్నాడు దీక్షిత్. 


తరువాత వాళ్ళు విచారణ చేయాల్సిన గదిలోకి వెళ్లారు. 


ముందుగా ఫోటోలు తీసిన వ్యక్తిని విచారణకు పిలిపించారు. 

"మనకు కాల్ రికార్డ్స్ వచ్చాక మరోసారి ఇతన్ని పిలిపించి విచారిద్దాం. ఇప్పుడు ఆ విషయాలు అడిగితే బషీర్ పైన అనుమానం కలుగుతుంది. అతను బయట పడకుండా ఉండటం ఈ కేసుకు చాల ముఖ్యం. దాము, మునావర్ లతో టచ్ లో ఉండగలిగింది అతనొక్కడే" అతను వచ్చేలోగా మురళితో అన్నాడు దీక్షిత్. 


ఇద్దరు కానిస్టేబుల్స్, ఫోటోలు తీసిన వ్యక్తిని తీసుకొని వచ్చి డోర్ దగ్గర నిల్చున్నారు, అతన్ని చూడగానే దీక్షిత్ "రండి, ఇలా వచ్చి కూర్చోండి" అంటూ టేబుల్ కు అవతల ఉన్న కుర్చీని అతనికి చూపించాడు. కానిస్టేబుల్స్ ను వెళ్లిపొమ్మని సైగ చేశాడు. అతను కాస్త భయపడుతూనే వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. 


"ఆరోజు మీరు ఫోటోలు తీసినందువలన మేము నేరస్తుడిని పట్టుకోగలిగాము. మీరు ఇంకా కొన్ని వివరాలు మాకు చెప్పగలిగితే చాలా సంతోషిస్తాం" అన్నాడు దీక్షిత్. 


"చెప్పండి సార్! నాకు తెలిసినవన్నీ చెబుతాను" అన్నాడు అతను. 


"మీ పేరేమిటి?" అడిగాడు దీక్షిత్. 


"కిషన్" చెప్పాడతను. 


"మీది ఏ ఊరు?" 


"ఈ ఊరే సార్, లోకల్" అన్నాడు అతను. 


"బీహార్ నుంచి వచ్చి చేరినట్లు విన్నాను" సూటిగా అతన్నే చూస్తూ అడిగాడు దీక్షిత్. 


"అదెప్పుడో పదేళ్లకు ముందు మాట, అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాను, నా రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా ఇక్కడి అడ్రస్ తోనే ఉన్నాయి" చెప్పాడతను. 


"ఆరోజు మీరు శర్మ గారిని ఎందుకు కలవాలి అనుకున్నారు?" ప్రశ్నించాడు దీక్షిత్. 


"మునిసిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా సార్! వార్డ్ కౌన్సిలర్ పోస్ట్ కోసం నేను, నాతో ఉన్న మరో వ్యక్తి ఫయాజ్ వచ్చాము. మా ఏరియాలో బీహార్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ముస్లిమ్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మా ఇద్దరిలో ఎవరో ఒకరికి కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వమని అడగడానికి వచ్చాము" చెప్పాడు కిషన్. 


"మీరు శివరాం శర్మ గారిని ఇదివరకు కలవలేదా?" అడిగాడు మురళి. 


"నాలుగైదు సార్లు కలిసాం సార్! ఆ పరిచయంతోటే కౌన్సిలర్ అవకాశం ఇప్పించమని అడగడానికి వచ్చాము" చెప్పాడతను. 


"నాలుగైదు సార్లు కలిశామని చెబుతున్నారు.. ఆయన ఇంటి దగ్గర ఎవరినీ కలవరని మీకు తెలియదా?" సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగాడు దీక్షిత్. 


కొంతసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు అతనికి. 


"సార్ అడిగిన దానికి సమాధానం చెప్పు" గద్దించాడు సీఐ మురళి. 


కిషన్ తేరుకొని, "కలవడం అంటే ఇంటిదగ్గర కలవలేదు. పోయినసారి ఎలక్షన్ ప్రచారానికి మా వార్డుకు వచ్చినప్పుడు నేనే దగ్గరుండి ఇల్లు ఇల్లు చూపించాను. అట్లే పార్టీ ఆఫీసులో రెండుసార్లు కలిశాను. ఆ ధైర్యంతోనే ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ చేసుకుందామనుకున్నాను. కానీ సెక్యూరిటీ వాళ్లు ఆయన ఎవరినీ కలవరని చెప్పడంతో వెనక్కి తిరిగాము" చెప్పాడు.. 


 దీక్షిత్ సైగ చేయడంతో టేబుల్ పక్కనే ఉన్న ప్రొజెక్టర్ ని ఆన్ చేశాడు మురళి. కాస్త దూరంలో ఉన్న స్క్రీన్ మీద బొమ్మ పడేలా సెట్ చేసి ప్లే బటన్ నొక్కాడు. 

అందులో కిషన్, ఫయాజ్ అనే ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ పాయింట్ కు కాస్త దూరంగా బైక్ ఆపి దాని మీదే ఉన్నారు. ఫయాజ్ అనే వ్యక్తి మాటిమాటికి తన సెల్ వంక చూస్తున్నాడు. ఒకసారి అతను సెల్ వంక చూశాక, కిషన్ భుజం పైన తట్టాడు. వెంటనే కిషన్ బైక్ను సెక్యూరిటీ దగ్గరికి పోనిచ్చాడు. ఫయాజ్ కిందికి దిగి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్లు వీళ్ళని వెళ్ళిపొమ్మని చెబుతున్నా అతను మాటలు పొడిగిస్తున్నాడు. తిరిగి ఒకసారి సెల్ వంక చూసి వెనక్కి వచ్చి బైక్ పైన ఎక్కాడు. సరిగ్గా ఆ సమయంలో శివరాం శర్మ గారి కారు రోడ్డు క్రాస్ చేసి ఇటు రావడం వీళ్ళ బైక్ ఎదురుగా వెళ్లి ఆ కారుకు గుద్దుకోవడం జరిగాయి. 


బైక్ కింద పడిపోవడంతో కిషన్ జేబులో ఉన్న మొబైల్ దూరంగా పడిపోయింది. కిషన్ ముందుగా తేరుకొని పైకి లేవడంతో, ఫయాజ్ తన మొబైల్ ను అతనికి అందివ్వడానికి చేయి జాచాడు. అతన్ని పైకి లేపుతూ పనిలో పనిగా ఆ మొబైల్ అందుకున్నాడు కిషన్. అదే సమయంలో కాల్పులు జరపడం, తన చేతిలో ఉన్న సెల్ తో కిషన్ ఫోటోలు తీయడం జరిగిపోయాయి. ఈలోగా ఫయాజ్ అనే వ్యక్తి దూరంగా పడ్డ కిషన్ మొబైల్ ని అందుకున్నాడు. 


 ప్రొజెక్టర్ ఆఫ్ చేశాడు మురళి. 


కిషన్ మొహమంతా చెమటలు పట్టాయి. "సార్! నాకు కడుపులో తిప్పుతోంది. ఒకసారి వాష్ రూమ్ వెళ్లి వస్తాను" అన్నాడు అతను. 


"ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూం ఉంది. అక్కడికి వెళ్ళు" చెప్పాడు మురళి. 


"అయ్యో.. వాష్ రూమ్ పాడవుతుంది సార్. నేను బయట ఉన్న వాష్ రూమ్ వైపు వెళ్తాను" అన్నాడు కిషన్. 


అతని దగ్గరకు వెళ్లి భుజం పైన చేయి వేశాడు దీక్షిత్. 


"చూడు కిషన్! నేరంలో నీకు భాగం ఉందని మాకు తెలిసిపోయింది. అందుకు తగ్గ ఆధారాలు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. నీ నేరం రుజువు చేయడం కష్టమని, ఒకవేళ రుజువైనా పెద్ద శిక్ష ఉండదని నిన్ను వాడుకున్న వాళ్ళు మీకు చెప్పి ఉంటారు. కానీ నువ్వు నేరస్తుడవని తెలిశాక అవతలి వాళ్ళు నిన్ను వదిలిపెడతారా?


శివరాంశర్మ బంధువులకు గాని, కొడుకులకు గాని నిన్ను చంపేయడం పెద్ద కష్టం కాదు కదా! ఎంతోమంది క్రిమినల్స్ యాక్సిడెంట్లలో చనిపోవడం, లేక కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరుగుతూనే ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నీకు తెలియదా? ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడిని సులభంగా చంపి వేయగలిగినప్పుడు, నీలాంటి వాడికి యాక్సిడెంట్ చేయించడం వాళ్లకు పెద్ద కష్టం కాదు కదా. 


వాళ్ల భయానికి నువ్వు ఉన్న ఊరు వదిలి భయపడి తిరుగుతూ ఉండాలి. నువ్వు అప్రూవర్ గా మారి మాకు సహకరిస్తే నీకు ఎవరి వల్ల ప్రాణభయం ఉండదు. నీకు ఏదో ఒక జీవనోపాధి మేం కల్పిస్తాం. బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పు. ఈ లోగా మేము మిగతా వాళ్ళని విచారిస్తాము" అన్నాడు దీక్షిత్. 


"నువ్వు చాలా మంచి వాడివి అని నీతో మర్యాదగా ఉన్నాము. కానీ అందరితో అలా కాదు. ఎలాగైనా నిజాన్ని కక్కిస్తాము. కాబట్టి ఎస్పీ గారు చెప్పినట్లు నీ తప్పుని ఒప్పుకో. 

 మరో విషయం. నువ్వు కాకపోయినా ఇంతమందిలో ఎవరో ఒకరు నిజాన్ని బయటపెడతారు. అప్పుడు అప్రూవర్ గా మారి శిక్ష తగ్గించుకునే అవకాశం వాళ్లకే ఉంటుంది. బాగా ఆలోచించుకొని ఎస్పీ గారితో నిజం చెప్పు. నిన్ను ఆయన కాపాడుతారు" అన్నాడు మురళి. 


తర్వాత అతను బయట ఉన్న కానిస్టేబుల్స్ పిలిచి "ఇతన్ని తీసుకొని వెళ్లి విడిగా కూర్చోబెట్టండి. ఏమైనా కావాలంటే తెచ్చి ఇవ్వండి" అని చెప్పాడు. 


కానిస్టేబుల్స్ అతన్ని తీసుకొని వెళ్లారు. ఇంతలో దీక్షిత్ మొబైల్ బీప్ అని శబ్దం చేసింది. 

ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. 


అందులో 'హత్యకు కావాల్సింది మోటివ్. అది ఎవరికి ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది' అని ఉంది. 

=========================================================

ఇంకా ఉంది


అపరాధ పరిశోధన - పార్ట్ 6 త్వరలో.. 

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 








Comments


bottom of page