top of page

అపరాధ పరిశోధన - పార్ట్ 6

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన


Aparadha Parisodhana - Part 6 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 20/04/2025

అపరాధ పరిశోధన - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. 


ఐజీ గారు కాల్ చేసి గవర్నర్ ఆబ్లిగేషన్ ఒకటుందని, నీతూ శర్మను ఇంట్లో ఉంచుకొని ప్రొటెక్షన్ ఇమ్మని చెబుతాడు. హోమ్ మినిష్టర్ బావమరిది రమేష్, తమ పార్టీ ఎమ్మెల్యే ని కూడా అనుమానించమని చెబుతాడు. 


కిషన్ అనే నిందితుడు, మురళి ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్ఫార్మర్ బషీర్ ను అడిగి మొబైల్ తీసుకొని తన భార్యతో మాట్లాడుతాడు. కాల్పులు జరిపిన వ్యక్తి, దాము అనే క్రిమినల్ అనుచరుడు మునావర్ తో మాట్లాడుతాడు. 

ఇంటరాగేషన్ లో కిషన్ తడబడతాడు. 


ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 6 చదవండి..


తనకు మెసేజ్ లో వచ్చిన వీడియో లింక్ పైన క్లిక్ చేశాడు దీక్షిత్. అది శివరాం శర్మ గతంలో ఎప్పుడో ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ నుండి కట్ చేసిన ఒక భాగం. 


'మీ తర్వాత మీ పిల్లల్లో ఎవరు రాజకీయాల్లోకి వస్తారు?' అని ఒక న్యూస్ రిపోర్టర్ ప్రశ్నించాడు. 


అందుకు సమాధానంగా శివరాంశర్మ 'వారసత్వ రాజకీయాల పైన నాకు నమ్మకం లేదు. అందుకే నా పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకొని రాలేదు. వాళ్లు భోపాల్ లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక స్థానికంగా నా మేనల్లుడు ప్రణవ్, మేనకోడలు నీతూ మంచి విద్యావంతులు. బాగా చురుకైన వాళ్ళు. వాళ్లు రాజకీయాల్లోకి వస్తే నేను అభ్యంతర పెట్టను' అని చెప్పాడు. 


 అక్కడితో ఆ క్లిప్ ఎండ్ అయింది. 


గతంలో హంతకుడితో ప్రణవ్ ఫోటో పంపిన మొబైల్ నెంబర్, ఇప్పుడు మెసేజ్ వచ్చిన మొబైల్ నెంబర్ ఒకటి కాదు. 


"బినామీ పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులు, దొంగిలించబడ్డ సెల్ ఫోన్లు వాడుతున్నారు" మురళితో చెప్పాడు దీక్షిత్. 


"అవును సార్! వీళ్ళ మీదికి అనుమానం మళ్ళించడానికి ఎవరో చేసే ప్రయత్నాలని తెలిసిపోతోంది. బహుశా మన ఇన్వెస్టిగేషన్ తప్పు దోవలో పడాలని వాళ్ళ ఉద్దేశం. ఇక ఇప్పుడు ఎవరిని పిలిపించమంటారు?" అడిగాడు మురళి. 

 

"బైక్ లో కిషన్ వెనక కూర్చొని ఉన్న ఫయాజ్ అనే వ్యక్తిని పిలిపించండి" చెప్పాడు దీక్షిత్. 


మురళి ఆదేశంతో ఇద్దరు కానిస్టేబుల్స్ ఫయాజ్ను తీసుకొని వచ్చి డోర్ దగ్గర నిల్చున్నారు. 


అతన్ని లోపలికి రమ్మని చెప్పి కానిస్టేబుల్స్ ను వెళ్లిపొమ్మని సైగ చేశాడు దీక్షిత్. 


దగ్గరకు వచ్చి నిల్చుని ఉన్న ఫయాజ్ ని చూసి "కూర్చోండి" అన్నాడు దీక్షిత్. 


అతనికంటే ముందుగా కిషన్ ని విచారణ చేసి ఉండడంతో అతను ఏం చెప్పి ఉంటాడో అనే ఆందోళన ఫయాజ్ ముఖం లో కనిపిస్తోంది. 


దీక్షిత్ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ "ఆరోజు మీరు శివరాం శర్మ గారి ఇంటి దగ్గరకు ఎందుకు వెళ్లారు?" అని అడిగాడు. 


"మున్సిపల్ ఎలక్షన్లో పార్టీ తరఫున కౌన్సిలర్ గా పోటీ చేయాలని అడగడానికి వెళ్ళాం" ముందుగానే బట్టీ పట్టిన పాఠం ఒప్ప చెప్పాడు అతను. 


"మరి ఆయన్ని కలవకుండానే ఎందుకు వెనక్కి తిరిగారు?" ప్రశ్నించాడు మురళి. 


"సెక్యూరిటీ వాళ్లు, ఆయన ఇంటి దగ్గర ఎవరినీ కలవరని చెప్పారు. అందుకని తిరిగి వెళ్ళిపోదామని బయలుదేరాము. ఇంతలో ఆ కారు మా బైక్ను గుద్దేసింది" చెప్పాడు అతను. 


"మీరు ఉండే వార్డ్ రిజర్వ్డ్ కదా.. మరి మీకు సీటు ఎలా వస్తుంది అనుకున్నారు?" హఠాత్తుగా అడిగాడు దీక్షిత్. 


ఏం చెప్పాలో తోచలేదు ఫయాజ్ అనే ఆ వ్యక్తికి. 


"జవాబు చెప్పవేం? రిజర్వ్ చేయబడ్డ వార్డులో మీకు సీటు వస్తుందని ఎలా అనుకున్నావు? ఇందాక కిషన్ కూడా నువ్వు చెప్పినట్లే చెప్పాడు. ఆ వార్డు ఎస్సీలకు రిజర్వ్ అయిందని మేం చెప్పాక మేము వచ్చింది మా కోసం కాదని, రవి చామర్ అనే తన స్నేహితుడి కోసమని చెప్పాడు. అది ఎంతవరకు నిజం?" అడిగాడు దీక్షిత్. 


"అవును సార్, నిజమే. చామర్ భయ్యా కోసమే మేము వచ్చాము" అన్నాడు ఫయాజ్. 

 

"అబద్ధాలు చెప్పాలని ప్రయత్నించవద్దు. నిజానికి ఆ వార్డ్ మహిళలకు రిజర్వ్ చేయబడింది. ఇందాక కిషన్ కొన్ని నిజాలు ఒప్పుకున్నాడు. నువ్వు కూడా ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గించే ఏర్పాటు చేస్తాము" అన్నాడు మురళి. 


"లేదు సార్! నేను చెప్పేది నిజమే. మేము శివరాం గారిని కలవడానికి వచ్చాము" అన్నాడు ఫయాజ్. 


కిషన్ ముందు ప్లే చేసిన వీడియోని, తిరిగి ప్లే చేయమన్నాడు దీక్షిత్. 


అందులో ఫయాజ్ మాటిమాటికి తన మొబైల్ చూసుకుంటూ ఉండడం స్పష్టంగా కనిపించింది. 


"శివరాం శర్మ గారి కారు, దగ్గరకు రాబోతున్న విషయం మీకు ఎవరో మెసేజ్ రూపంలో తెలియజేశారు. తర్వాత నువ్వు కిషన్ ను సెక్యూరిటీ పాయింట్ దగ్గరకు వెళ్ళమన్నావు. అక్కడ కూడా వాళ్లతో మాటలు పొడిగిస్తూ నీకు మెసేజ్ వచ్చేవరకు ఆగావు. కారు దగ్గరకు వచ్చేసిందని, రోడ్డు క్రాస్ కాబోతుందని నీకు మెసేజ్ వచ్చిన వెంటనే నువ్వు బైక్ లో వెనుక కూర్చుని, కిషన్ ను బయలుదేరమన్నావు. 


కిషన్ డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు కాబట్టి హత్యను ఫోటో తీసే డ్యూటీ నీది. కానీ కింద పడ్డ తర్వాత నువ్వు వెంటనే పైకి లేవలేక పోయావు. కిషన్ వెంటనే పైకి లేచాడు. అయితే అతని మొబైల్ దూరంగా పడిపోయింది. నువ్వు నీ మొబైల్ ని అతనికి అందించావు. అంటే ఆ సమయంలో శివరాం శర్మ గారిని షూట్ చేస్తారని, ఆ దృశ్యాన్ని ఫోటోలు తీయాలని నీకు ముందుగానే తెలుసు" చెప్పాడు దీక్షిత్. 


మురళి మాట్లాడుతూ "కిషన్ కూడా మొదట్లో నీలాగే బుకాయించాడు. కానీ ఆధారాలు చూపాక తప్పు ఒప్పుకొని అప్రూవర్ గా మారతానని చెప్పాడు" అన్నాడు. 


"నా ఫోన్ కి ఆ టైంలో కాల్స్ గాని, మెసేజ్ గాని రాలేదు. మీరు కావాలంటే కంపెనీ వాళ్ళతో చెక్ చేసుకోండి" అన్నాడు అతను లేని బింకాన్ని నటిస్తూ. 


దీక్షిత్ మాట్లాడుతూ "మీవాళ్లు బాగానే ప్లాన్ చేశారు. మీకు కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా దొరికిపోతారని మీ వాళ్లకు తెలుసు" అంటూ మరొక వీడియో ప్లే చేశాడు. 


అందులో ఒక వ్యక్తి చాట్ అమ్మే బండిని తోసుకుంటూ శివరాం శర్మ ఇంటి గేట్ దగ్గరికి రాబోయాడు. కానీ అక్కడ ఉండకూడదని సెక్యూరిటీ వాళ్లు చెప్పడంతో కాస్త దూరంగా వెళ్ళాడు. కానీ వీళ్లకు బ్లూ టూత్ రేంజ్ లోనే ఉన్నాడు. 


వీడియో ఆఫ్ చేశాడు దీక్షిత్. 


"ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ అతనికి వస్తున్నాయి. అతను బ్లూటూత్ లో నీకు పంపుతున్నాడు. అతన్ని కూడా మా అదుపులోకి తీసుకున్నాం. విడిగా విచారిస్తున్నాం. ఇప్పటికైనా మించి పోయింది లేదు. నువ్వు హత్య చేయలేదు కాబట్టి నీకు పెద్ద శిక్ష పడదు. మాకు సహకరిస్తే ఆ కొద్దిపాటి శిక్ష కూడా ఉండదు. బాగా ఆలోచించుకొని కిషన్ లాగా నువ్వు కూడా మాతో చేతులు కలుపు" అని చెప్పాడు దీక్షిత్. 

ఆలోచనలో పడ్డాడు ఫయాజ్. 


"ఇతన్ని కొంతసేపు విడిగా కూర్చోబెట్టండి. కాఫీ టీ లాంటివి ఏమైనా కావాలంటే ఇప్పించండి. కాసేపు ఆలోచిస్తే ఇతనికి మనకు సహకరించడమే మంచిదని తెలుస్తుంది. తర్వాత మళ్లీ ఇతనితో మాట్లాడుదాం" అన్నాడు దీక్షిత్. 


కానిస్టేబుల్స్ ని పిలిచి దీక్షిత్ చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పి ఫయాజ్ను వాళ్ళ వెంట పంపించాడు. 


"నెక్స్ట్ ఎవరినైనా ఒకరిని పిలుస్తాను. ఆ తర్వాత మీరు లంచ్ కి వెళ్ళండి" అన్నాడు మురళి. 


"డ్యూటీలో ఉన్నప్పుడు ఒక రోజంతా ఫుడ్ తీసుకోకపోయినా నాకు ఆకలి అనిపించదు" అన్నాడు దీక్షిత్. 


"నిజమే సార్! కానీ నీతూ మేడం మీద అటెంప్ట్ జరిగింది. మరోవైపు హంతకుడితో వాళ్ల అన్నయ్య కలిసి ఉన్న ఫోటో మీకు వచ్చింది. ఏ రకంగా చూసినా ఆమె నుండి మీరు తెలుసుకోవలసిన సమాచారం ఉంటుంది. అందుకని లంచ్ విషయం పదేపదే చెబుతున్నాను, అంతే" అన్నాడు మురళి. 


"అయితే ఇప్పుడు శివరాం శర్మ గారిని షూట్ చేసిన వ్యక్తిని పిలువు. ఆ తరువాత లంచ్ కు వెళ్తాను" అన్నాడు దీక్షిత్. 


ఆ హంతకుడు ప్రమాదకారి అనే ఉద్దేశంతో అతని చేతులకు సంకెళ్లు వేసి తీసుకొని వచ్చారు పోలీసులు. 


"ఆ సంకెళ్లు తీసివేయండి. అతని వల్ల మాకు ఏ ఇబ్బందీ ఉండదు" అన్నాడు దీక్షిత్. 

"ఇలాంటి ట్రిక్కులకు నేను లోబడి పోతాను అనుకోకండి. సంకెళ్లు ఉన్నా నాకు నష్టమేమీ లేదు. కాకపోతే నా వీపు దురద పెట్టినప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. అప్పుడు మీ కానిస్టేబుల్స్ ను హెల్ప్ చేయమని చెప్పండి చాలు" నిర్లక్ష్యంగా అన్నాడు అతను. 


"సార్! ఇతన్ని మన కానిస్టేబుల్స్ చేత ముందుగా విచారణ చేయించుదాం. ఆ తర్వాత మనం అడిగిన వాటికి సరిగా జవాబు చెబుతాడు" అన్నాడు సిఐ మురళి. 


వికటంగా నవ్వాడు ఆ వ్యక్తి. "ఓపెన్ గా ఒక ప్రముఖ నాయకుడిని హత్య చేసిన వాడిని. ఉరిశిక్షకు సిద్ధపడ్డవాడిని. ఇక మీ కానిస్టేబుల్స్ కొట్టే దెబ్బలకు ఈ రంగా భయపడతాడని అనుకుంటున్నారా?" అన్నాడు. 


"అడక్కుండానే పేరు చెప్పినందుకు థాంక్స్. నేను అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబు మీకు తెలిస్తే చెప్పండి" అన్నాడు దీక్షిత్. 


"నేను హత్య చేయలేదంటే కదా మీరు ఇవన్నీ అడగాలి? నేనే హత్య చేశాను. ఎవరో ఆ సమయంలో ఫోటోలు తీశారు. సీసీ కెమెరాలో కూడా నేను పడి ఉంటాను. ఇంకా నన్ను ఏమని విచారిస్తారు?" అన్నాడు రంగా. 


"హత్య చేయడానికి ఒక కారణం అంటూ ఉండాలి కదా. నీ పాత రికార్డులు పరిశీలిస్తే నువ్వు ఇంతవరకు ఎవరినీ చంపలేదు. ఒకసారి మాత్రం హత్యా ప్రయత్నం చేసి విఫలమయ్యావు. అది కూడా వేరే వాళ్ళ ప్రోద్బలంతో చేసినట్లు ఆధారాలు దొరికాయి.. ప్రస్తుతం నువ్వు బెయిల్ మీద బయట తిరుగుతున్నావు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు సరదా కోసం హత్య చేసే వ్యక్తివి కాదు. కాబట్టి శివరాం శర్మ గారిని చంపడానికి నీకున్న కారణం ఏమిటో చెప్పు" అన్నాడు దీక్షిత్. 


తన గురించి అప్పుడే చాలా వివరాలు సేకరించిన దీక్షిత్ సామాన్యమైన వ్యక్తి కాదని అనుకున్నాడు రంగా. తాను సిద్ధం చేసుకున్న కారణాన్ని వెంటనే చెప్పాడు. 


"శివరాం శర్మ కొడుకులకు భోపాల్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. నా తమ్ముడు అందులో వర్కర్ గా పని చేస్తున్నాడు. ఏ కారణం లేకుండానే అతన్ని పనిలోంచి తీసేశారు. కొడుకులతో చెప్పి తిరిగి పని ఇప్పించమని ఆయనను చాలా సార్లు బ్రతిమలాడాను. రోజుల తరబడి తన చుట్టూ తిప్పుకొని చివరన కుదరదని చెప్పేశాడు. చివరి ప్రయత్నం చేద్దామని ఆరోజు పార్టీ ఆఫీసుకు వెళ్లాను. నా తమ్ముడికి పని ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడానికి పిస్టల్ తీసుకొని వెళ్ళాను. ఆయన ఆఫీసులో నన్ను కలవలేదు. ఇంటి దగ్గరైనా బ్రతిమలాడుదామని ఆయన కారును ఫాలో అవుతూ వచ్చాను. కానీ కారులోంచి దిగుతున్న ఆయన్ను చూడగానే నాకు పట్టరాని ఆవేశం వచ్చింది.. ఆ ఆవేశంలో ఆయన్ని షూట్ చేశాను. మీరు విచారిస్తే నా తమ్ముడు వాళ్ళ ఫ్యాక్టరీలో పని చేయడం, వాళ్ళు అతన్ని పనిలోకి తీసేయడం, నేను శివరాం శర్మను ఆఫీసులో నాలుగైదు సార్లు కలవడం.. అన్నీ నిజమని తెలుస్తాయి. అయితే దీన్ని రాజకీయం చేద్దామని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. తమకు ఎవరి మీద కోపం ఉందో వాళ్లే చేయించినట్లు ప్రచారం చేస్తున్నారు" వివరంగా చెప్పాడు రంగా. 


నీతూ శర్మ అన్నయ్య ప్రణవ్, ఒక బార్ లో రంగాతో మాట్లాడుతున్న ఫోటో ను రంగాకు చూపించి "ఇతను ఎవరో చెప్పు" అని అడిగాడు. 


"ఈయన శివరాం శర్మకు దగ్గర బంధువు. రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతుంటాడు" చెప్పాడు రంగా. 


"నేను అడిగేది అతనితో నీకెలా పరిచయం అని?" అన్నాడు దీక్షిత్. 


"ఈయనకు శివరాంశర్మ కొడుకులతో బాగా పరిచయం ఉందని ఎవరో చెప్పారు. కాబట్టి ఈయన ద్వారా అయినా పని అవుతుందేమోనని కలిశాను. శివరాం శర్మ తనక్కూడా ఏ సహాయము చేయడం లేదని, ఏదో ఒక రోజు తను అతన్ని పక్కనపెట్టి నాయకుడిని అవుతానని నాతో అన్నాడు. తనకేమైనా సహాయం చేయగలవా అని నన్ను అడిగాడు. నాకు అప్పట్లో శివరాంశర్మను చంపే ఉద్దేశం లేదు కాబట్టి నేను అంగీకరించలేదు" చెప్పాడు రంగా. 


రంగా బాగా ఆరితేరిన నేరస్తుడని అర్థమైంది దీక్షిత్ కు. 


 తన మొబైల్ నుండి 'ప్లాన్ B ' అని మురళికి మెసేజ్ చేశాడు. 


మరో రెండు క్షణాలకు మురళి మొబైల్ మోగింది. 


'ఎక్స్క్యూజ్మీ' అంటూ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళాడు. మరో నిమిషం తర్వాత లోపలికి వచ్చి "సార్! మన ఆఫీస్ పక్కనున్న టవర్ నుంచి ఎక్కడికి కాల్స్ వెళ్లాయో తెలిసింది. అలాగే ఏ నెంబర్ నుంచి వెళ్లాయో కూడా తెలిసింది. ఒక నెంబర్ వ్యక్తిని విచారిస్తే, మన ఆఫీస్ పక్కన ఉన్న బషీర్ టీ కొట్టు దగ్గర తన మొబైల్ ఎవరో కొట్టేసారని చెప్పాడు. 


అలా దొంగిలించిన మొబైల్స్ ని బషీర్ మన కస్టడీలో ఉన్న వారికి ఇస్తున్నట్లు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఇక కాల్ రికార్డింగ్ అఫీషియల్ గా రావడానికి రెండు రోజులు పడుతుంది. కానీ అనధికారికంగా మనకు మరో అరగంటలో అందజేస్తారు" అని చెప్పాడు. 

వింటున్న రంగా ముఖం పాలిపోయింది. 


=========================================================

ఇంకా ఉంది


అపరాధ పరిశోధన - పార్ట్ 7 త్వరలో.. 

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 








Comments


bottom of page