అపార్ట్ మెంట్ లో పాము
- Veereswara Rao Moola
- Apr 8
- 4 min read
#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #SnakeInApartment, #అపార్ట్ మెంట్లోపాము, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Apartment Lo Pamu - New Telugu Story Written By Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 08/04/2025
అపార్ట్ మెంట్ లో పాము - తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
వైభవ్ టవర్స్ 3 ఫ్లోర్ లో ఉంటున్న నాకు ఆ రోజు ఆదివారం తొమ్మిది గంటలకి ఫోన్ వచ్చింది.
ఫోన్ వైభవ్ టవర్స్ సెక్రటరీ వామనరావు దగ్గర నుండి.
‘మళ్లీ ఏ పిచ్చి మీటింగ్ పెడుతున్నాడో’ అనుకుని
"హలో" అన్నాను.
"బాబూ వెంకట్, మన వైభవ్ టవర్స్ లోకి పాము వచ్చింది. ఎక్కడ ఉందో తెలియదు. అందరూ కిందకి వస్తే పాములు పట్టే వాణ్ణి పిలిచి సోదా చేయిస్తాను. "
"పాము వస్తే వెల్కమ్ చెప్పి హారతి పట్టాలా?”
"నీకు రాత్రి కొట్టింది దిగలేదా? వచ్చింది పాము. ఇలా
కాలక్షేపం చేస్తే కాటేసి పోతుంది. దూల తీరుతుంది. "
అన్నాడు వామనరావు విసుగ్గా. ఒక్కసారిగా స్పృహ లోకి వచ్చి, బట్టలు మార్చుకుని కిందకి వచ్చేసాను.
********
వైభవ్ టవర్స్ లో ఉండే వాళ్లందరూ ఒక చోట గుమ్మిగూడారు.
405 లో ఉన్న నంబియార్ అన్నాడు "అప్పుడెప్పుడో
భూకంపం వచ్చినప్పుడు ఇలా అందరం కలిసాం"
"మీరు టవర్స్ మీటింగ్ కి రారా!?" అడిగా ఆసక్తిగా.
"నాను వర్లే" అన్నాడు నంబియార్.
"నువ్వు తమిళం లో బాధ పడక్కర్లేదు" అన్నాను.
"పాము అని భయపడి ఛస్తుంటే మీరు భూకంపము అంటారేమిటీ" అన్నాడు 401 పరమేశం వణికిపోతూ.
అందరూ వచ్చారా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు వామనరావు.
అప్పుడే వామనరావు ఫోన్ మ్రోగింది.
"303 మాలినిని మాట్లాడుతున్న. "
"కిందకి రాకుండా ఏం చేస్తున్నావమ్మా?"
"నైటి తో ఏలా రమ్మంటారు. ?"
"పోని పట్టుచీర కట్టుకుని రా" అన్నాడు వామనరావు కోపంగా.
"అది కాదండి. ఉన్నవి రెండు నైటిలు. ఒకటి ఆరేసాను. ఒకటీ ఒంటి మిద ఉంది. చీర కనబడటం లేదు. "
"నీ నైటీల గోల ఆపు. లేకపోతే నైట్ కి నైటీ లోకి దూరుతుంది పాము. "
"సర్లెండి"
********
మాలిని కిందకి వచ్చాక ఇంకా ఎవరో రాలేదని సందేహం వచ్చింది. అదే సమయం లో స్నేక్ క్యాచర్ నుండి ఫోన్ వచ్చింది వామనరావు కి.
"చెప్పండి"
"పాముల పట్టే వాడు తమిళ్ అమ్మాయి రేవది తో లేచిపోయాడు. వేరే వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నాం. రాగానే పంపుతాం".
"మంచిది. రాగానే పంపండి"
"అంకుల్, పాము లిఫ్ట్ ఎక్కుతుందా?" 502 లో ఉన్న బబ్లూ చాక్లెట్ తింటూ అడిగాడు. బబ్లూ 6వతరగతి చదువుతున్నాడు.
"ఎక్కుతుంది. ఎక్కి తనకి కావలిసిన ఫ్లోర్ నెంబర్ తోకతో కొట్టి మార్చుకుంటుంది. " విసుగ్గా చెప్పాడు వామనరావు.
"పిల్లాడు అడిగితే సరిగ్గా చెప్పరేం? " అడిగింది బబ్లూ తల్లి భానుమతి లిప్‌స్టిక్ సర్ధుకుంటూ.
"అదా.. పాము దొరికాక అడిగి చెబుతాగా"
భానుమతి మూతి మూడు వంకర్లు తిప్పింది.
*******'
"అందరూ వచ్చేసారు. 602 షీలా రాలేదేమిటి? "
" 602 షకీలా రాలేదా సార్ " అడిగాడు కాలేజీ లో డిగ్రి వెలగబెట్టె కాళిచరణ్. వాడు 501 లో ఉంటాడు.
"నువ్వు అభిమానం తో పెట్టుకున్న పేరు కాదు. అసలు పేరు తో పిలవాలి"
షీలా కి ఫోన్ చేసాడు. ఎంగేజ్ఢ్ వచ్చింది. ఇక లాభం లేదని లిఫ్ట్ లో 602 కి వెళ్లి తలుపు కొట్టాడు.
షీలా తలుపు తియ్యలేదు. నెమ్మదిగా తోసాడు.
షీలా తెల్ల టవల్ లో నిజంగా షకీలా లా కనిపించింది.
"అర్జంటు గా కిందకి వచ్చెయ్యి. అపార్ట్ మెంట్ లోకి పాము వచ్చిందని సెర్చ్ చేస్తున్నాం"
"అమ్మో పామే, నాకు భయం" అని లావు షీలా వామనరావు ని కౌగిలించుకుంది.
"నువ్వు వదలవే షకీలా ఛీ.. కాదు షీలా ఎవరైనా చూస్తే
లేనిపోని అభాండాలు"
షీలా ని దూరం గా తోసి, తలుపు మూసి లిఫ్ట్ వైపు పరుగుతీసాడు.
******* *'
"ఎంత సేపండి ఇక్కడ? పాములు పట్టేవాడు రాకపోతే
అందరం భజన చెయ్యాలా?" అన్నాను విసుగ్గా.
"ఓపిక పట్టు నాయనా. పాముని పట్టే వాడు వస్తాడు. "
"అసలు దూరింది పామేనా? పిల్లి తోకను చూసి పాము తోకను కున్నారా?" సందేహం వెలిబుచ్చాడు 206 సన్యాసి రావు.
"మన సెక్యురిటికి పిల్లి తోకకి, పాము తోకకి తేడా తెలుసు"
అన్నాడు వామనరావు కోపాన్ని అణుచుకుంటూ.
"ఐనా మన వైభవ్ టవర్స్ కి భద్రత తగ్గిపోయింది.
లాస్ట్ టైమ్ చిరుతపులి వచ్చింది" అన్నాడు సన్యాసి రావు.
" అయ్యా గతం ఎందుకు? ప్రస్తుతం మన దృష్టి అంతా
పాము మీద పెడదాం, సరేనా" అన్నా సన్యాసి రావు
భుజం మీద చెయ్యి వేసి.
పన్నెండు గంటలికి స్నేక్ క్యాచర్ వచ్చాడు. అంతా వెదికాడు. కాని పాము కనబడలేదు. ఆరు ఫ్లోర్లు వెతికాడు. ‘ఎవరో భ్రమపడి ఉంటారు.’ అని అన్నాడు.
అందరూ వాళ్ల ఫ్లోరులకు వెళ్ళి పోయారు. అనవసరంగా కింద స్టోర్ లో చీర కొనాల్సివచ్చిందని 303 మాలిని చింతించి తన ఫ్లోర్ లోకి వెళ్లింది.
********
406 లో ఉన్న వామనరావు పాము గొడవ వదిలిందని దుప్పటి కప్పుకుని పడుకుందామనుకున్నాడు.
అప్పుడు దుప్పటి మీద కనబడింది.
పడగ విప్పిన త్రాచు!
"నా ఇంట్లో ఉన్నావా?" దుప్పటి వేగం గా తోసి బయటికి
వచ్చాడు. తలుపు లాక్ చేసాడు.
మళ్ళి స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేసాడు.
"పెళ్ళి చూపులకు వెడుతున్నా. జర వెయిట్ చెయిండ్రి"
అని జవాబిచ్చాడు.
వామనరావు బయటికి వెళ్ళి బిర్యాని ముద్ద తిని వచ్చి, సెక్యూరిటిని పిలిచి కుర్చి తెప్పించుకుని, వైభవ్ టవర్స్ లో ఉన్న ఒక రచయిత ఇచ్చిన "చివరికి మిగిలేది" పుస్తకం చదువుతూ కూర్చున్నాడు.
టవర్స్ లో ఉండే వాళ్ళకి మీటింగ్ పెడితే కాలక్షేపం అవుతుందని భావించి, అందరూ కలిసి తంతారని ఆ ఆలోచన విరమించుకున్నాడు.
పాములు పట్టేవాడు రాలేదు కాని నంబియార్ వచ్చాడు.
"వణక్కం! నల్ల ఇరుకా" అని పలకరించాడు తమిళం లో.
"నీ శ్రార్ధం, పాముని చూసి వణకక, రగులుతోంది మొగలిపొద అని డాన్స్ చెయ్యలా"
"పురిల్లే (అర్ధం కాలేదు)" అన్నాడు నంబియార్ తమిళం లో.
"పూరిల్లు కాదురా. పాతిక లక్షలు పోసి కొన్న అపార్టమెంట్ రా"
"అప్పుడియా"
"ఏదో అర్ధమయినట్టు" నీరసం గా అన్నాడు వామనరావు.
కాస్సేపయ్యాక 602 లో ఉండే షీలా వచ్చింది.
"బాగున్నారా వామన్ గారు! " అని దగ్గరగా వచ్చేసింది.
"బతికి ఉన్నాను"
"పాము ఎక్కడ ఉంది? "
"లోపల ఉంది. పలకరించు"
"అమ్మో పామే" అని వామనరావు ని మళ్ళీ కౌగలించుకుంది.
అదే సమయం లో ఆ దృశ్యం కాళీచరణ్ కంటపడింది.
"ఏం మునుగుతుందో" అనుకున్నాడు వామనరావు.
********
రాత్రి 8 గంటలికి పాములు పట్టే వాడు వచ్చాడు.
అందరికీ చూపిస్తూ, సంచిలో పెట్టాడు.
"పాము పడగ మీద ముద్దు పెడుతూ రీల్ తియ్యాలని ఉంది. వ్యూస్ పదివేలకి పైగానే" అన్నాడు కాళిచరణ్.
"తేడా వచ్చి పాము తిరగబడితే ఏ ముద్దు ముచ్చటా లేకుండా పోతావు" అన్నాడు వామనరావు పళ్ళు కొరుకుతూ.
అందరూ వీడియోలు తీసుకున్నాక పాములు పట్టే వాడు వెళ్ళి పోయాడు.
వామనరావు హాయి గా ఊపిరి పీల్చుకున్నాడు.
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
Comments